May 21, 2024

మా నేపాల్ దర్శనం – ముక్తినాధ్

రచన: మంథా భానుమతి mantha bhanumathi

పోఖరా వచ్చిన మరునాడే ముక్తినాధ్ ప్రయాణం. అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరట. అందుకని, పోఖరాలో చూడవలసినవి వాయిదా వేసి, ముందే ముక్తినాధ్ దర్శనం ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఫలహారాలు.. ఒక్కో సాండ్విచ్, ఫ్రూటీ, యాపిల్, కేక్ పొట్లాలు కట్టి ఇచ్చారు  మీరా హోటల్ వాళ్ళు. చాలా చిన్న విమానం. పద్ధెనిమిది మంది మాత్రమే పడతారు. అరగంట ప్రయాణం. హిమాలయాల్లో, మంచు కొండల మధ్య సూర్యోదయం చూస్తూ, నాలుగైదు ఫొటోలు తీసేసరికి జామ్సమ్ వచ్చేసింది. మస్తంగ జిల్లా ముఖ్యపట్టణం జామ్సమ్. విమానం దిగుతూనే వేళ్ళు కొంకర్లు పోవడం మొదలుపెటాయి. అంత పెద్ద చలేం ఉండదని, స్వెటర్లు మాత్రం తీసుకెళ్ళాం.

మాతో ప్రయాణం చేసిన ఇతర ప్రయాణీకులు కూడా తెలుగువారే. విశాఖపట్నం నుంచి వచ్చారుట.. ట్రెకింగ్ కి. చేతులకి గ్లౌజ్ దగ్గర్నుంచీ తెచ్చుకున్నారు. మేము వణుక్కుంటూ, షాల్స్ చెవుల మీంచి కప్పుకుని, సూట్ కేసులు దొర్లించుకుంటూ, ఏడెనిమిది నిముషాల్లో మేముండబోయే హోటల్, ‘మెజెస్టిక్’ కి చేరాం. రోడ్డు చాలా సన్నగా, రాళ్ళు పరచి ఉంది.. ఒక్క జీపు మాత్రం వెళ్తుంది. హోటలంతా చెక్కలతో.. పాత హాలీవుడ్ వెస్టెర్న్ సినిమాలో సెట్టింగ్ లా ఉంది లోపల. బల్లలు కుర్చీలు ఆధునికంగానే ఉన్నాయి.

1

జామ్సమ్ లో మెజెస్టిక్ హోటల్.

కాఫీలు తాగేసి ముక్తినాధ్ బయలుదేరాం. హోటల్ వాళ్ళే అందరికీ చలి తట్టుకోవడానికి కోట్లు అద్దెకిచ్చారు. ఒక కి.మీ నడిచి వెళ్లాలి.

మాకు నడవడం కష్టం.. మళ్ళీ ఎదర ట్రెకింగ్ అంటున్నారు.. అని గొడవ పెడ్తే హోటల్ దగ్గరికి జీపు తెప్పించాడు హరి సింగ్. నలభై కి.మీ జీపులో.. కంకఱాళ్ళమీద ప్రయాణం. సామాన్లు లాబీలో పడేసి పరుగెత్తాం.. చీకటి పడకుండా తిరిగి వచ్చెయ్యాలంటే.

2

ఏరుమీది సన్నని బ్రిడ్జ్.. దానికి ఇవతలగా జీపు ఆగింది. బ్రిడ్జ్ దాటి నడుచుకుంటూ వెళ్తే అక్కడ జీపులు తయారుగా ఉన్నాయి. మేము ఆరుగురం ఒక జీపు మాట్లాడుకుని ఉండవలసింది.. పన్నెండు మంది సునాయాసంగా వెళ్ళిపోవచ్చు అంటే కాబోసనుకుని, (చవక కూడా.. సగానికి సగం) ఎక్కాం. హైద్రాబాద్ లోని షేర్ ఆటోలు నయం. అంతకంటే ఎక్కువ కూరేసినట్లుంది. మూడు గంటలు పైగా కంకఱాళ్ళమీద, సన్నని రోడ్డు మీద ప్రయాణం.. చేతులు చాచుకోడానికి కానీ, కాళ్ళు కదపడానికి కానీ లేదు. అందులో మాతో ఎక్కిన నేపాలీ ఫామిలీ, వాళ్ళ పన్నెండేళ్ళ కుర్రవాడు.. పోకిరీ సినిమాలో ఇలియానా తమ్ముడిలా ఉన్నాడు.. మిగిలిన వాళ్ళంతా కూడా.. వాడి ఫామిలీయేగా మరీ.. ఇంక మా పాట్లు ‘ముక్తి’నాధుడికే ఎరుక.

అవస్థలన్నీ కలిసికట్టుగా వస్తాయంటారు. అది నిజం చేస్తున్నట్లు మా జీపు మధ్యలో చెడిపోయింది.  అదీ మా మంచికే.. కొండల్నీ,లోయల్నీ చూస్తూ కాళ్ళు సాగదీసుకున్నాం. అరగంట అయ్యాక ఇంకో జీపు వచ్చింది. (సెల్ ఫోన్లు కనిపెట్టినవాళ్ళు, ఇటువంటి సమయాల్లోనే దేవుళ్ళనిపిస్తారు.

3

జీపు ఆగిపోయిన ప్రదేశంలో మా బృందం.

కాగ్బెనీ అనే ఊరు చేరడానికి రెండు గంటలు పైగా పట్టింది. అక్కడ్నుంచి మరో గంట ఝార్గోట్. కంకఱాళ్ల రోడ్డు.. జీపులో ఏ క్షణం ఏ స్థానం తీసుకున్నా నాలుగు చక్రాలూ ఒక లెవెల్లో ఉండవు. మధ్యలో కాళీ గండకీ నది లోనుంచి ప్రయాణం. మా అదృష్టం.. అప్పుడు నదిలో నీళ్ళు ఒక పొరలా మాత్రమే పారుతున్నాయి. లేకపోతే వరద వచ్చేస్తుందిట ఒక్కోసారి.  మధ్య మధ్య ఒకటే దుమ్ము. అయినా.. ఎంతో ఉత్సాహంగా ఉంది. అందుకనే హిమగిరి సొగసులన్నారు మరి.

ఎలాగయితేనేం పోఖరా హోటల్ వాళ్ళు కట్టిచ్చిన ఫలహారాలతో శక్తి పుంజుకుని ముక్తి నాధుని పాదాల దగ్గరికి, ఝార్కోడ్ చేరాం. కొంచెం ముందునించే కడుపులో తిప్పుతోందని మా వారు గొడవ పెడుతున్నారు. తిన్న సాండ్ విచ్ పడలేదేమో అనుకుని, చిన్న బడ్డ్డీ కొట్టు ఉంటే అక్కడ కూర్చోపెట్టి సపర్యలు చెయ్యబోయా.

ఊహూ.. అంతకంతకూ గాభరా ఎక్కువవుతోంది. తల తిరగడం, కడుపులో పేగులన్నీ కథాకళీ చెయ్యడం.. ఆ బాధ చూస్తుంటే ఏం చెయ్యాలొ అర్ధం అవలేదు. వెంటనే జామ్సం వెళ్ళి హాస్పిటల్ లో చేర్పించాలేమో అనుకున్నాం.

“క్యాహువా?” కాషాయ బట్టలతో ఒక సాధువు, భుజాల వరకూ జుట్టు.. వక్షస్థలం అంతా పరుచుకుని గడ్డం.. నుదుట విభూది.. దగ్గరగా వచ్చి అడిగాడు.

కష్టపడి వివరించాము.. అందరం హావభావాలతో సహా.

“ఆక్సిజన్ నయీ లాయా?” మూడడుగుల దూరంలో నిల్చుని అడిగారు.

తెల్లమొహం వేశాం. ఆక్సిజన్ కీ కడుపులో తిప్పడానికీ సంబంధం ఏమిటో నా కెమిస్ట్రీ బుఱకి తట్టలేదు. అలా మిఠాయి తెచ్చుకున్నట్లు ఆక్సిజన్ తెచ్చుకోవాలా? అదేలా?… ఏం చెయ్యాలీ.. తన బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగటం లేదు నాకు.

ఆ సాధువు పెద్దపెద్ద అంగలేసుకుంటూ మాయమయ్యారు.

సరిగ్గా రెండు నిముషాల్లో, ఆస్థ్మా అటాక్ వచ్చినప్పుడు పీల్చే ఇన్హేలెర్ లాంటిది తెచ్చి నోటి దగ్గర పెట్టి, గట్టిగా పీల్చి నోరు మూసుకుని, ముక్కులోంచి వదలమన్నారు. అలా నాలుగు సార్లు పీల్చాక నొప్పి చేత్తో తీసేసినట్లు మాయం.. అప్పటికి అందరికీ పరిసరాలు గుర్తుకొచ్చి అవసరాలు తీర్చుకోవడానికి బాత్రూంలు ఎక్కడున్నాయో చూడ్డం మొదలు పెట్టాం. బడ్డీ హొటల్లోనే ఉన్నాయి. రెండు రూపాయలిస్తే వాడుకోనిచ్చింది నేపాలీ మగువ. పనులయ్యాక సాధువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుందామని వెతికాం.

వారు ఎప్పుడో మాయమయ్యారు. దేవుడు ఆపదలో ఆదుకుంటాడు కానీ.. మనం కృతజ్ఞతలు చెప్పుకునే వరకూ తీరుబడిగా కూర్చుని ఎదురు చూస్తాడా? ఆయనకెన్ని పనులు? ఎంత మందిని ఆదుకోవాలి. ముక్తినాధుని గుడి ఉన్న దిక్కుకి తిరిగి మనస్ఫూర్తిగా ధన్యవాదాలర్పించాను.

“హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళినప్పుడు ఆక్సిజెన్ సిలిండర్ తీసుకెళ్ళాలిసిందే..” ఒక పాఠం నేర్చుకుని (ముక్తినాధ్ 3720 అడుగుల ఎత్తులో ఉంది), గుడి ఎక్కడుందా అని వెతికాము.

దూరంగా కొండ మీద గుడి కనిపిస్తోంది. నడిచి కానీ, మోటర్ సైకిల్ మీద కానీ వెళ్ళాలి. మా సుబ్బు నడుస్తానన్నాడు. మిగిలిన వాళ్ళం చేతులెత్తేశాం.. మోటర్ సైకిల్ నడిపేవాళ్ళు, పాతికేళ్ళలోపు కుర్రాళ్ళు.. ఝామ్మని మా ముందుకు తీసుకొచ్చి ఎక్కమన్నారు. కాళ్ళు అటూ ఇటూ వేసి కూర్చోవాలి. అంతే కాదు.. గట్టిగా ముందున్నవాడిని పట్టుకోవాలి. సర్లే.. మా పిల్లలకంటే చిన్నవాళ్ళు.. మునిగిందేముంది.. గట్టిగా వాడి నడుం పట్టుకుని కూర్చున్నాం. ఒక పక్క కొండ, ఇంకో పక్క లోయ. కొండ మరీ ఎత్తుగా.. లోయ మరీ లోతుగా లేకపోయినా, పడితే నాలుగో ఐదో ఎముకలు విరగడం ఖాయం.

భయం భయంగా.. బెదురుగా ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తూ గుడి మెట్ల దగ్గరికి వచ్చి పడ్డాం. సుబ్బు నయం.. హాయిగా నడుచుకుంటూ వచ్చేశాడు. ఏ టెన్షన్ లేకుండా. మరీ ఎక్కువగా లేకపోయినా, చెప్పుకోదగినంతమంది భక్తులు.. పూసలు, కొబ్బరికాయలు, పూలు వగైరాలు అమ్మేవాళ్ళు.. హడావుడిగా ఉంది. మళ్ళీ కొంత నడక.. కొండలు. మెట్లెక్కి గుడి ప్రాంగణం చేరగానే మనసంతా హాయిగా అనిపించింది. పడిన శ్రమ అంతా పారిపోయింది. ఒక వైపు వణికించే చలి.. మరో వైపు నెత్తికి వేడిగా తగులుతూ ఎండా.. కనిపించినంత మేర ఎత్తైన కొండలు, నిటారుగా పెరిగిన చెట్లు. ఈ ప్రకృతిని కన్నుల విందుగా ప్రసాదించిన ఆ అంతర్యామికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలం?

4

ముక్తినాధ్ ప్రవేశద్వారం-

నేపాల్ లోని అన్ని ఆలయాలలా పగోడా ఆకారంలో ఉంటుంది ముక్తినాధుని మందిరం. గుడి ముందు రెండు కొలనులు. గుడి వెనుక నూరు జలధారలు అర్ధ చంద్రాకారంలో వరాహం నోట్లోనుంచి వస్తున్నట్లు పడుతుంటాయి. వీటినే “చుమిగ్ గ్యాట్సా” అని బౌద్ధమతస్థులు అంటారు (నూరుధారలు). ముక్తినాధ్ దేవాలయానికి ఇంకొక పేరు చుమిగ్ గ్యాట్సా. ఈ వంద ధారలూ తల మీదినుంచి పడేలా ధారల కిందినుంచి నడుస్తూ స్నానం చేస్తారు. కొందరు మూడు సార్లు కూడా చేస్తారు. వీటిని పవిత్ర జలాలుగా భాఅవిస్తారు. ఉట్టినే మీద చల్లుకుంటేనే మంచు నీటిలా ఉంది. అందులో ఇంక స్నానం చెయ్యాలంటే సాహసమే. పైగా మేము వేరే బట్టలు కూడా తెచ్చుకోలేదు.

సుబ్బు మాత్రం తువ్వాలు చెచ్చుకున్నాడు. అది కట్టుకుని, పళ్ళు కటకటలాడుతుండగా మూడుసార్లు ధారల కింద పరుగెత్తాడు.

5

చ్యుమిగ్ గ్యాట్సాలు.

మిగిలిన భక్తులందరూ స్నానం చెయ్యడానికి తయారయి వచ్చారు. ధారల దగ్గరే కాకుండా, గుడి ముందున్న కోనేరుల్లో కూడా మునుగుతున్నారు. మేము మాత్రం ధారలకింద నీటితో సంప్రోక్షం చేసుకుని దర్శనం చేసుకున్నాం.

6

ముక్తినాధ్ మందిరం.

ముక్తినాధ్ ఆలయం-

ముక్తినాధ్ హిందువులకీ బౌద్ధులకీ సమానంగా నమ్మకం ఉన్న ఏకైక ఆలయం. ఈ క్షేత్రం పంచ భూతాలకీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్తారు. అందుకేనేమో.. రెండు మతాలకీ చెందిన యోగులు ఇక్కడ తపస్సు చేసుకుంటుంటారు. డాకినీలు (దేవతలు) ఇక్కడ తిరుగాడుతూ ఉంటారని బౌద్ధుల నమ్మకం.

ఈ ప్రదేశాన్ని “పద్మ సంభవ బోధిసత్వుడు” దర్శించడమే కాక, కొంతకాలం నివసించారని శాసనాల మీద ఉందిట. ఈ క్షేత్రాన్ని టిబెట్ బుద్ధ సాధువులైన లామాల ఆధీనంలో ఉంచారు. వారే ఈ ఆలయం అభివృద్ధి కానీ బాగోగులు కానీ చూస్తారు. ప్రస్థుతం వన్గ్యాల్ అధీనంలో ఉంది. వన్గ్యాల్ లామా శాకాహారి. ఆలయం నుంచి పైసా ఆశించకుండా పని చేస్తున్నారు. ఆయన జీవనానికి ఖట్మండూలో ఉన్న భార్య తన వ్యాపారంలోని ఆదాయంలో కొంత పంపుతుంది.

ఆలయంలో శుచీ శుభ్రతలు కూడా బౌద్ధ సన్యాసినిలు చూస్తుంటారు. విగ్రహాలకిరుపక్కలా ఉండి ఎప్పటికప్పుడు, పువ్వులు, అక్షింతలు తీసేస్తుంటారు.

పద్మసంభవునితో వచ్చిన ఎనభైనాలుగుమంది సాధువులు కర్రలతో కొండలనికొడితే జలధారలు ఏర్పడ్డాయని అంటారు. అవే చ్యుమిగ గ్యాట్సాలు. బౌద్ధ సిద్ధాంతం ప్రకారం, ఆలయ అంతర్భాగం లోని విగ్రహాలు, అవలోకితేశ్వర్, ఇద్దరు డాకినీలుగా చెప్తారు. ద్వారం ముందు రెండు మతాలూ గౌరవించే గరుడుని విగ్రహం ఉంటుంది.

7

ముక్తినాధ్ ఆలయంలోని మూలవిగ్రహాలు, శ్రీమహావిష్ణువు, శ్రీదేవి, భూదేవి.

హిందూ మతం ప్రకారం మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ముక్తినాధ్ వద్ద, గండకీ తీరంలో నివసిస్తుంటారని అంటారు.

అందుకే ఈ క్షేత్రాన్ని సాలగ్రామం అని కూడా వ్యవహరిస్తారు. ఈ తీరంలో దొరికే సాలగ్రామ శిలల్లో అంతర్భాగంలో శంఖు చక్రాలు, శివలింగం, త్రిశూలం.. మొదలైన హిందూ దేవతల చిహ్నాలు కనిపిస్తాయి

ఇవన్నీ వేల సంవత్సరాల కిందటి ఫాసిల్స్ అని శాస్త్రజ్ఞులు చెప్తారు. పురాణాల ప్రకారం సతీ తులసి శాపం వలన శ్రీమహావిష్ణువు శిలాకృతి దాల్చాడని, శిల అంతర్భాగం పురుగులు దొలిచే శాపం ఉందనీ ఒక నమ్మకం. ఈ సాలగ్రామాల మహత్యం, విష్ణుపురాణంలో బాగా వివరిస్తారు.. ప్రతీ రోజూ, అభిషేకం, పూజ చేస్తే ఇహపరాలు రెండూ లభ్యమవుతాయని ఒక నమ్మకం.

8

సాలగ్రామాలు అమ్ముతున్న నేపాలీ యువకుడు.

రెండు మతాలకి పవిత్ర స్థలమైన ముక్తినాధ్ దేవాలయం దర్శించడం పూర్వజన్మ సుకృతం. పడిన శ్రమంతా మర్చిపోయి.. ఆలయంలొ ఉన్నంత సేపూ ఒక రకమైన ప్రశాంతత ఆవరించింది అందర్నీ. గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహానికి తల ఆనించి మొక్కుకోగలిగాము. వదల్లేక వదల్లేక, వెనక్కి తిరిగి చూసుకుంటూ కొండ దిగి, శివపార్వతి ఆలయం, యజ్ఞశాల, చూసుకుని మోటర్ సైకిల్ ఎక్కి ఒక్కొక్కళ్ళం ఝార్కోడ్ చేరాం. ఈ ముక్తినాధ్ యాత్రే నేను చెప్పిన మొదటి అద్భుతమైన అనుభవం

తిరిగి వచ్చేటప్పుడు కిలోమీటర్ పైగా దూరంలో దించేశాడు మోటర్ సైకిల్ బేటా. అక్కడి వరకే అనుమతి ఉందిట. అదంతా నడుచుకుని, జీపులు బయలుదేరి దగ్గరికి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. ఈ సారి జీపులో వెనుక కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి ఏమీ ఆసరా లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ.. అందులో ఒక టీనేజి కుఱ్ఱాడు, పాడయిపోయిన జీపు బాగు చెయ్యడానికి మధ్యలో ఆగుతూ, నిర్లక్ష్యంగా వేగంగా నడిపాడు. సుబ్బు తల నాలుగు సార్లు టాపుకి కొట్టుకుని కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. అందరం గట్టిగా అరిచి, వాడి స్పీడు తగ్గించేసరికి తల ప్రాణం కాళ్ళ దగ్గర కొచ్చింది.

ఎలాగైతేనేం జామ్సమ్ వచ్చి పడ్డాం. అప్పుడు మమ్మల్ని కూర్చోపెట్టి పప్పు, అన్నం, ఆలు/ఉల్లిపాయ/టొమాటో కూర, రొట్టెలు చేసి పెట్టాడు హోటల్ వాడు. మా కాంట్రాక్ట్ ప్రకారం తిండి వాళ్ళు పెట్టాలి. ఎలాగా డబ్బు ముందే అందింది కదా.. అప్పుడు వండినవే రాత్రి భోజనంలో కూడా పెట్టాడు. పెరుగు కానీ లస్సీ కానీ ఏవీ లేదు. విడిగా కొనుక్కుంటే నయం. ఎవరు వెళ్ళినా ఫుడ్ మాట్లాడుకోకుండా ఉంటే బాఉంటుంది. అక్కడ నాలుగైదు హోటల్సున్నాయి.

పేరు మెజెస్టిక్ అనే కానీ స్నానానికి వేడి నీళ్ళు ఇవ్వలేదు సరి కదా.. లిఫ్ట్ లేని మూడో అంతస్థులోని గదుల్లోకి మంచినీళ్ళు కూడా మేమే మోసుకెళ్ళవలసి వచ్చింది. చేతులు జివ్వుమనే నీళ్ళతో మొహాలు కడుక్కుని విమానంలో వచ్చి పడ్డాం. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వలేదు. తరువాత కిషోర్ కి చెప్పి ఆ వార డబ్బు వాపస్ తీసుకున్నాం.. కానీ అప్పుడు పడిన అవస్థలు.. ఆకళ్ళు ఎలా మర్చిపోగలం? ఇవన్నీ జాగ్రత్తగా ముందే మాట్లాడుకోవాలి.

జామ్సమ్ లోని ఇబ్బందులన్నీ పోఖరాలోని సదుపాయాలతో తుడిచి పెట్టినట్లు పోయాయి. ఆ రోజంతా పోఖరాలో చూడవలసినవి చూసేసి మరునాడు పొద్దున్నే ఖట్మండూ చేరుకున్నాం.

వీడ్కోలు-

ఖట్మండూలో రెండు రోజులు విశ్రాంతి. అనుకోకుండా వచ్చే వాతావరణంలోని మార్పులకి ఆ మాత్రం ఖాళీ సమయం ఉంచుకోవాలిట. ఎయిర్పోర్ట్ లో దించడం తప్ప ట్రావెల్స్ వాళ్ళు ఇంకేమీ చూపించమన్నారు. ముందుగా వివరించినట్లుగా మొదటి రోజు సాయంత్రం టాక్సీలు మాట్లాడుకుని పశుపతినాధ్ దర్శనం చేసుకున్నాం.

ఆలయ పరిసరాలన్నీ తిరిగి, హోటల్ కొచ్చేశాం.

నేపాల్ లో చివరి రోజు.. రాయల్ పాలస్ చూద్దామని పదింటికి బయలుదేరాం. హోటల్ నుంచి కిలోమీటర్ లోపే ఉంది దూరం. కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోయాం. అక్కడ టికెట్లు, క్యూ. పదకొండుకి కానీ తెరవరు. కూర్చోడానికేమీ లేదు. పై నుంచి ఎండ పేలిపోతోంది. కొద్ది నీడ వెతుక్కుని కష్టం మీద కాలం గడిపాం.

9

నారాయణ హితి పాలస్-

నారాయణ హితి పాలస్ లో రాజా బీరేంద్ర కుటుంబం హత్యల తరువాత, రాజా జ్ఞానేంద్ర నివసించే వారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక, జ్ఞానేంద్రని మే 2008లో ఖాళీ చేయించి మ్యూజియమ్ కింద మార్చారు. లోపలికి అన్ని చోట్ల లాగే కామెరాలు, సెల్ ఫోన్లు తీసుకెళ్ళకూడదు. బైట ఫొటోలు తరువాత మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం.

పాలస్ లో చెప్పుకోతగ్గది.. విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథులని ఆహ్వానించే హాలు, వారికి ఏర్పరచిన గద్లు. పాల్స్ లో రాజావారిదీ, రాణిగారిదీ గదులూ, పిల్లలవీ.. పెద్ద అట్టహాసాలేవీ లేకుండా సాధారణంగానే ఉన్నాయి.

రెండు వేల సంవత్సరంలో హత్యలు జరిగిన ఇల్లు, హాలు అంతా పడగొట్టేశారు. మద్య సేవనంతో ఉన్మాది అయిన రాజకుమారుడు దీపేంద్ర ఎవరెవర్ని ఎక్కడ చంపాడో రాసి ఉంచారు. రాణీ ఐశ్వర్య, రాకుమారుడు నిరజన్ తోటలోకి పారిపోయి, తల దాచుకునే చోటు వెతుక్కునే లోగానే తరుముకుంటూ వచ్చి కాల్చి చంపేశాడు. నిరజన్ వయస్సు ఇరవై మూడు. రాకుమారి శృతి వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు. మొత్తం పదిమంది రాజ కుటుంబీకులు.. ఆ ప్రదేశం చూస్తుంటే మనసంతా కలచి వేసింది.

ఆ తరువాత ఆంతా విషాద హృదయాలతోనే చూసి, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి హోటల్ చేరాం.

సాయంకాలం అలా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న బజారంతా తిరిగి, నేపాల్ లో చూసిన ప్రదేశాలన్నీ ఒక సారి జ్ఞప్తికి తెచ్చుకుని, సామాన్లు సర్దుకుని తిరుగు ప్రయాణానికి తయారయిపోయాం.

వారం రోజుల నేపాల్ పర్యటన ముగిసి, ఎయిర్ పోర్ట్ కొచ్చిన కిషోర్ కి టాటా చెప్పి త్రిభువన్ విమానాశ్రయంలో ప్రవేశించాం. స్పైస్ జెట్ విమానం గంటన్నర లేటు. ఢిల్లీ వచ్చేసరికి రెండు దాటింది. అక్కడ్నుంచి మధుర, బృందావనం చూసుకుని, మధురలో ఏ.పి ఎక్స్ ప్రెస్  పట్టుకుని హైద్రాబాద్ వచ్చాం. మళ్ళీ ఆరుగురం కలిసి ఎక్కడికెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం.

 

10

విమానం లోనుంచి నేపాల్ కి వీడ్కోలు.

 

 

*—————————————————-*

 

1 thought on “మా నేపాల్ దర్శనం – ముక్తినాధ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *