May 10, 2024

వంతెన

రచన:  ఉదయకళ

 rising sun

నిజమనేది

నిప్పులా మండే సూర్యుడు

ఆ సూర్యుడిని కప్పిబుచ్చడానికి

ప్రతి రోజు ప్రతి గంట ప్రతి క్షణము

ఎన్ని రాహువులను సృష్టించాలో

ఎన్ని కేతువులను కల్పించాలో

ఎన్ని సేతువులను నిర్మించాలో

సజీవ

వర్ణ చిత్రాలను

అబద్ధాల కుంచెలతో గీయాలి

లేని పుస్తకాలను రాయించాలి

ఉండని  స్నేహితులను ఊహించాలి

చూడని ప్రదేశాలను చూచినట్లు వర్ణించాలి

జరగని సంఘటలను జరిపించాలి

అబద్ధాల ముడులతో ఒక వలనే అల్లాలి

వీలైతే దానితో నిజమనే చేపను పట్టాలి

అదృశ్య పుష్పబాణాలను

అనంగుడు రువ్వుతాడట

మరి నేనో

సవ్యసాచిలా

ఈ అబద్ధాల బాణాలను

అందరిపైనా రువ్వుతాను

అద్దాల గొట్టంలో

రంగురంగుల మాయాలోకం చూపిస్తాను

నిజంగా ఒక రోజు తప్పకుండ దొరికిపోతాను

కానీ

అంతవరకు

ఆ దిగంతములో నుండే నిన్ను

ఈ దిగంతములో నుండే నేను

అబద్ధాల ఇంద్రధనుస్సుపై నడిచి చేరాలి

చేరి చేతులు గ్రహించాలి

కళ్లల్లో చూడాలి

చూస్తూ ఉండాలి

నీలో మరిగిపోవాలి

ఈ నేను కరిగిపోవాలి

ఈ ఒక్క నిజంకోసం

ఎన్ని అబద్ధాలాడితే యేం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *