May 19, 2024

ఆరాధ్య – 4

రచన: అంగులూరి అంజనీదేవి anjanidevi

పంతులుగారు లగ్నపత్రికలు రాస్తున్నారు. ఆయన శ్రీనివాసరెడ్డి వైపు చూసి హేమంత్‌ ఇంటిపేరు, గోత్రం అడిగారు. వచ్చేముందు హేమంత్‌ ఏం చెప్పాడో అదే చెప్పారు శ్రీనివాసరెడ్డిగారు.

పంతులు గారు లగ్నపత్రిక రాయడం పూర్తిచేసి ”అందరూ వినండి!” అంటూ పైకి చదవటం మొదలుపెట్టాడు.

శాంతారాం పంతులు గారి వైపు చూస్తున్నాడు. రమాదేవి ఎవరివైపు చూడకుండా తలవంచుకొని కళ్లనీళ్లు పెట్టుకుంటోంది. ఆమె ఎందుకలా కళ్లనీళ్లు పెట్టుకుంటుందో అర్థంకాక బిత్తరపోయింది కళ్యాణమ్మ.

రమాదేవికి ఎదురుగా కూర్చుని వున్న ఆమె తోడికోడళ్లలో ఒకామె గట్టిగా ”ఏంటి రమాదేవీ! ఇలాంటప్పుడా కన్నీళ్లు? ఆపుకో!” అంటూ మందలించింది.

ఆపుకోలేక ఆపుకుంటూ అందరివైపు ఒకసారి చూసింది. వాళ్లందరు ఆమెను పట్టించుకోలేదు. ఆమెకు వాళ్ల నుండి ఆశించిన సానుభూతి అందలేదు. అందుకే ఆమె దుఃఖం కొంత ఆగింది. కళ్లు మాత్రం ఎర్రబారే వున్నాయి. కొద్ది నిముషాల్లోనే తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం ముగిసింది.

శ్రీనివాసరెడ్డి మొబైల్‌కి నాన్‌స్టాప్‌ కాల్స్‌ వస్తూనే వున్నాయి. ఆయన అంతటి బిజీ పర్సన్‌ అయివుండి కూడా ఏమాత్రం తొందరపడకుండా చాలా ఓర్పుగా కూర్చుని వున్నాడు. ఆయన ఏ టైంలో చేసేవి ఆ టైంలో చెయ్యాలని బలంగా నమ్మేవ్యక్తి. ఇతరులకి ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో వుండే శక్తిని ఇంకా రెట్టింపు చేస్తుందని భావించే వ్యక్తి. నిజానికి ఆయన ఆ టైంలో తప్పనిసరిగా హైదరాబాదులో వుండి తీరాలి. అర్జంట్‌గా అటెండ్‌ అయ్యే పార్టీ మీటింగ్‌ ఒకటి వుంది. మరి వాళ్లనెలా మేనేజ్‌ చేశాడో తెలియదు కాని వాళ్లనుండి మళ్లీ కాల్‌ రాలేదు.

కళ్యాణమ్మ అంతవరకు మౌనంగా వున్నా ఆ క్షణం నుండి తన చురుకైన కళ్లతో ప్రతిదీ పరిశీలనగా చూస్తోంది. వాళ్ల బంధువుల్ని గమనిస్తోంది.

భోజనాలయ్యాక ఎక్కడివాళ్లక్కడ వెళ్లిపోయారు. పసుపు కొమ్ములు కొట్టాలని తొమ్మిది మంది ముత్తయిదువులు మాత్రం వున్నారు.

వాళ్లలో ఒకావిడతో కళ్యాణమ్మ ”పిల్ల తల్లి ఎందుకేడ్చిందండీ? ఈ సంబంధం ఇష్టం లేకనా?” అనుమానం వచ్చి అడిగింది.

”ఇష్టం ఎందుకుండదు? అబ్బాయి ఉద్యోగస్తుడేగా! పైగా అమ్మాయికి ఉద్యోగం కూడా ఇప్పించాడట”

”మరింకెందుకు? అబ్బాయికి ఎవరూ లేరనా?” ఆ అనుమానం కూడా వచ్చిందామెకు.

”ఛ ఛ వాళ్లు వుండి మాత్రం ఏం చేస్తారు? ఎవరూ లేకపోవటమే మంచిది అని రమాదేవి ఒకసారి నాతో చెప్పింది”

”అదేంటండీ ఎవరూ లేకపోవటం ఏం మంచిది? ఉదయం నుండి నేను గమనిస్తూనే వున్నాను. అబ్బాయి తరఫున మేం వచ్చాం కదా కనీసం మాతో కూడా నాలుగు మాటలు మాట్లాడలేదు. ప్రత్యేకించి మర్యాదలు చెయ్యలేదు. పెళ్లిగురించి కట్న కానుకల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీ వైపున ఇలాగే వుంటారా? ఇవేనా మీ పద్ధతులు” అని అడిగింది కోపంగా. ఆమె అంత కోపంగా అడుగుతుంటే ఇన్నిరోజులకి  రమాదేవిని ప్రశ్నించే వ్యక్తి వచ్చిందన్న ఆనందం ఎక్కువై ”మీరు అబ్బాయి తల్లిదండ్రులు కారుకదా! ఎందుకింత లోతుగా ఆలోచిస్తున్నారు? ఏదో వచ్చారు, కామ్‌గా వెళ్తే సరిపోతుంది కదా!” అంటూ ఇంకాస్త రెచ్చగొట్టింది. ఆమె ఎవరో కాదు… రమాదేవి తోడికోడలు. ఒకసారి అబ్బాయి చదువుకోసం ఊటీ వెళ్తున్నాడు ఓ రెండు కిలోలు స్వీటు పంపమని అడిగితే ”ఊళ్లో స్వీట్‌హౌజ్‌లు లేవా? నేనో గ్రాము బంగారం అడిగితే వాళ్లిస్తారా? మనం కూడా స్వీటు ఇవ్వొద్దు. బయట కొనుక్కుంటార్లే అని భర్తతో అన్నదట. అది ఎవరో విని ఆమెతో చెప్పారు. అప్పటి నుండి రమాదేవి అంటే ఆ తోడికోడలికి కోపం. ఆ కోపం సమయాన్ని బట్టి ఎప్పుడెప్పుడు బయటకి వద్దామా అని పాముపిల్లలా తొంగిచూస్తోంది.

కళ్యాణమ్మ వాదిస్తున్నట్లు కాకుండా చాలా సౌమ్యంగా ”తల్లిదండ్రులకన్నా ఎక్కువగానే వుంటాం హేమంత్‌తో. అందుకే వచ్చాం. మాకు పనులు లేక కాదు పద్ధతులు తెలియక కాదు. అసలు మర్యాద ఇవ్వటం రానివాళ్ల దగ్గర ఒక్క క్షణం ఆగాలన్నా మాకు ఇబ్బందిగానే వుంటుంది” అంది.

”మర్యాద ఇవ్వటం రాక కాదు. దానికి బలుపెక్కువ. మొన్నటివరకు కాస్త చచ్చినట్లే వున్నది. కూతురికి ఉద్యోగం వచ్చాకనే కళ్లు పైకెక్కాయి. ఇక ఈ పెళ్లి కాస్త అయిందనుకో ఇక ఆపేవాళ్లే వుండరు. అదేం అంటే మాకు అబ్బాయ్‌ ముఖ్యం కాని అబ్బాయి తరఫు వాళ్లతో మాకేం పని, అంటుంది. దానికసలు తలకాయ వుంటేగా, ఎవరిని ఎలా చూడాలో తెలిస్తేగా!” అంటూ విసుక్కుంది ఇంకో ఆవిడ.

కళ్యాణమ్మకి ఆవిడను చూస్తుంటే నిజాలు మాట్లాడే వ్యక్తిలా అన్పించి ”ఇంతకీ ఆవిడ ఎందుకు ఏడ్చినట్టు…?” అంది. ఆమెకి ఆ రహస్యమేంటో తెలుసుకోవాలని వుంది.

”ఆవిడ బాధలు మనకేం తెలుస్తాయి కళ్యాణమ్మగారు! చనిపోయిన వాళ్ల అన్నయ్య గుర్తొచ్చాడేమో!”

”అయ్యో! వాళ్ల అన్నయ్య చనిపోయాడా? ఎప్పుడు?” సానుభూతిగా అడిగింది కళ్యాణమ్మ.

”ఏడు నెలలు దాటింది” అన్నారెవరో.

అవాక్కయింది కళ్యాణమ్మ.

అక్కడ కూర్చున్న ముత్తయిదువులు కళ్యాణమ్మను చూసి ఆశ్చర్యపోలేదు. ఆమె కట్టూ, బొట్టూ, మాటతీరు ఆసక్తిగా గమనిస్తున్నారు.

సీతాలమ్మ పనులు చేసుకుంటూ, అటు, ఇటు తిరుగుతూ తన కళ్లను, చెవులను ఇటే వుంచింది. కళ్యాణమ్మలో దేన్నో పరిశోదన చేస్తున్నట్లు చాలా లోతుగా చూస్తోంది. అక్కడ ఏం జరిగినా, జరిగింది జరిగినట్లు రమాదేవికి చేరవెయ్యడమే సీతాలమ్మ ప్రధాన విధి.

కళ్యాణమ్మ మాత్రం తనవైపు ఎవరెలా చూసినా తనకు సంబంధం లేనట్లు ”అలా ఏడవటం నాకు నచ్చలేదు. బ్రతికివున్న కూతురెక్కువా? చనిపోయిన అన్నయ్య ఎక్కువా? శుభమా అని నిశ్చితార్థం జరుగుతుంటే కళ్లనీళ్లు పెట్టుకోవటం ఏమిటి? అంతగా కావాలంటే ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడవాలి” అంది.

”ఒంటరిగా కూర్చుని ఏడిస్తే ఎవరు చూస్తారు. జాలిపడేవాళ్లు కావాలిగా! లాభం లేకుండా మా రమాదేవి ఏ పనీ చెయ్యదు!” అని పక్కనే కూర్చుని వున్నావిడ అంది.

”జాలికోసమా! అన్నయ్య అంటే ప్రేమ లేదా?” అంది ఆశ్చర్యంగా కళ్యాణమ్మ.

”ప్రేమా! పాడా! అంతా నటన. అసలా ఏడుపు అందుకు కాదులే!”

”ఇంకెందుకు?”

”ఆరాధ్య శుక్రవారం పుట్టిందట. పెళ్లిచేసి అత్తగారింటికి పంపితే వున్న సంపద మొత్తం ఊడ్చుకు పోతుందట. అందుకే ఆ ఏడుపు. ఆడపిల్లకి పెళ్లిచెయ్యకపోతే బాగుండదని లోకం కోసం చేస్తోంది కాని ఇష్టంతో చెయ్యటం లేదు”

”దానికంత ఏడుపెందుకు? శుక్రవారం పుట్టిన అమ్మాయి అత్తగారింటికి పంపేటప్పుడు ఆ అమ్మాయి చేత లక్ష్మీరూపును తల్లి మెడలో కట్టించుకునే పంపుతారుగా!” అంది కళ్యాణమ్మ.

”అయినా నమ్మదు మా రమాదేవి. ఈ పెళ్లి అనుకునప్పటి నుండి షాపులో గిరాకీ తగ్గిందని ఒకటే ఏడుపు”

”ఛ… ఛ… అసలు ఏడుస్తూ పెళ్లి ముహూర్తం పెట్టిస్తారా ఎవరైనా! షాపులో గిరాకీ తగ్గటానికి ఆరాధ్య పెళ్లికి అసలు సంబంధమే లేదు. అదే నిజమైతే శుక్రవారం పుట్టిన ఆడపిల్లలకి పెళ్లిళ్లే చెయ్యరు. ఏం నమ్మకాలో ఏమో!” అంది కళ్యాణమ్మ.

వాళ్లు అలా మాట్లాడుకుంటుండగానే కొందరు ముత్తయిదువులు లేచి పసుపు దంచటానికి ఏమేం అవసరమవుతాయో అవన్నీ రోలు దగ్గరకి పట్టుకొచ్చారు. ఆ పనులన్నీ రమాదేవికన్నా సీతాలమ్మనే ఎక్కువగా చేస్తోంది.

పసుపు కొమ్ములు, తాంబూలాలు, అరటిపళ్లు తెచ్చి రోలు దగ్గర పెట్టారు. రోలుకి రోకలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు. ఐదు పోగుల దారమునకు పసుపు రాసి తమలపాకు ముడివేసి రెంటింటికి కట్టారు. రోలులో ఐదు పసుపు కొమ్ములు వేసి ఐదుగురు ముత్తయిదువులు దంచారు. ఆ తర్వాత మరికొన్ని వేసి దంచారు. మెత్తగా నూరిన ఆ పసుపును తలంబ్రాల బియ్యంలో కలుపుతారు.

కాస్త దూరంగా కూర్చుని చూస్తున్న కళ్యాణమ్మను పిలిచారు. ఆమెకెందుకో రోలు దగ్గరకి వెళ్లాలనిపించ లేదు. ఆమెకు తెలిసినంతలో శుక్రవారం నిశ్చితార్థం జరపరు. పసుపుకొమ్ములు కూడా దంచరు. వీళ్లేదో టైం తక్కువగా ఉందని మగపిల్లవాడు గలవాళ్లు పసుపు దంచకముందే దంచేసుకుంటున్నారు. ఒక వారం లేదు, వర్జ్యం లేదు. రాహుకాలాలు లేవు. చూస్తుంటే అసలు ఏ నమ్మకాలు లేనట్లుంది. అందుకే ఆమె చాలా సున్నితంగా  ”మీరు కానీయండి!” అంటూ కూర్చున్న చోటు నుండి కదలలేదు.

ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే తప్ప కళ్యాణమ్మను మళ్లీ పిలిచే ధైర్యం చెయ్యలేదు. పసుపు దంచే కార్యక్రమం పూర్తయింది.

వచ్చిన ముత్తయిదువులంతా, పండు, తాంబూలాలు తీసుకొని ఇళ్లకెళ్లిపోయారు. అంతవరకు వున్న సందడంతా వాళ్లతోనే వెళ్లిపోయింది. ఇక మిగిలింది రోడ్డుమీద వెళ్లే వాహనాల శబ్దాలు, పొగ, దుమ్ము. అంతే!

రమాదేవి తోడికోడళ్లలో ఒకావిడ పండు, తాంబూలం తీసుకొని ఇంటికెళ్తూ గుమ్మం దాటాక ఏదో గుర్తొచ్చినట్లు ఆగి అక్కడే నిలబడి ”రమా! పెళ్లికొడుకు తరుపున వచ్చినవాళ్లు రాత్రి ట్రైన్‌కి వెళ్తారేమో వాళ్లకంత అన్నం ఉడకేసిపెట్టి పంపు. పనుల్లోపడి నిర్లక్ష్యం చెయ్యకు” అంటూ వెళ్లిపోయింది.

ఆ మాట కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి విన్నారు.

సీతాలమ్మ వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంటే రమాదేవి వెళ్లి షాపులో కూర్చుంది. శాంతారాం బయటకెళ్లాడు. సునీల్‌ ఎక్కడ వున్నాడో కన్పించలేదు.

సీతాలమ్మ హడావిడిగా తిరుగుతూ ”మీరు చేతులు కడుక్కోండి! అన్నం వడ్డిస్తాను. ట్రైన్‌ టైం కావస్తోంది” అంటూ వాళ్లు చూస్తుండగానే అన్నం వడ్డించింది.

రమాదేవి, శాంతారాం, సునీల్‌ ముగ్గురు ఒకేసారి లోపలికి వచ్చి వాళ్ల పనులేవో వాళ్లు చూసుకుంటున్నారు.

ఆకలిగా వున్నా అన్నం తినాలనిపించలేదు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డిలకు… ఏదో పెట్టారు కాబట్టి తిన్నామన్నట్లు భోజనం ముందు కూర్చుని లేచారు.

అప్పటికే శాంతారాం తన చేతికున్న వాచ్‌వైపు చూస్తున్నాడు. రమాదేవి, సీతాలమ్మ గోడకున్న గడియారం వైపు చూస్తున్నారు. ట్రైన్‌ టైం అయింది బయలుదేరమని నోటితో చెప్పలేక వాళ్లు పడుతున్న అవస్థను అర్థం చేసుకొని వెంటనే బయటకు నడిచారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి.

రాత్రి తొమ్మిది దాటింది.

ఇంటి ముందున్న రోడ్డు మీదనే ఆటోని ఆపి వాళ్లను ఆటో ఎక్కించారు. ఆటో దగ్గరకి శాంతారాం, రమాదేవి, సీతాలమ్మ, సునీల్‌ వచ్చారు. స్టేషన్‌ వరకు ఎవరూ వెళ్లలేదు.

వాళ్లు స్టేషన్‌ రాగానే ఆటో దిగి, ప్లాట్‌ఫాం మీదకెళ్లారు. అప్పటికే వాళ్లు ఎక్కవలసిన రైలు వచ్చి ప్లాట్‌ఫాం మీద ఆగి వుంది. దాన్ని చూడగానే ”అది మనం ఎక్కాల్సిన ట్రైనే” అంటూ వేగంగా వెళ్లి ట్రైన్లో కూర్చున్నారు.

ట్రైన్లో కూర్చున్నాక ”హేమంత్‌ చాలా తెలివిగలవాడు. అతని ఆలోచనలతో వందమందికి బ్రతుకుతెరువు కల్పించగలిగే శక్తి వున్నవాడు. అందరి మంచీ కోరేవాడు. ఇలాంటి సంబంధానికి ఎలా ఒప్పుకున్నాడు? పెళ్లంటే ఒక్కరోజు ముచ్చట కాదు. భార్య అంటే ఒక్క రాత్రి ఆనందం కాదు. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు కలిసి గడపాలి. కలిసి జీవించాలి. ఈ కుటుంబ సభ్యులు మనతోనే ఇలా వుంటే ఇక హేమంత్‌తో ఎలా వుంటారో. హేమంత్‌ని ఎలా చూస్తారో? అల్లుడి మర్యాదలు ఎలా చేస్తారో!” అంది కళ్యాణమ్మ.

ఆమె అసంతృప్తిని అర్థం చేసుకొన్నాడు శ్రీనివాసరెడ్డి.

”అంతా ఫేట్‌! ఎక్కువగా ఆలోచించకు” అన్నాడు.

”ఆలోచించకుండా ఎలా వుంటామండీ! హేమంత్‌కి ఎవరూ లేరు. అన్నీ మనమే! అతని తరుఫునే కదా మనం వచ్చాం! అన్నీ మనతోనే కదా వాళ్లు మాట్లాడవలసింది. పెళ్లి అన్నాక ఎన్ని మాటలు వుంటాయి. నలుగురు పెద్దవాళ్ల మధ్యలో మనల్ని కూర్చోబెట్టి ఒక్కమాటన్నా మాట్లాడారా? అలాంటి సిట్యువేషన్‌ కూడా మనకు అక్కడ కన్పించలేదు. అసలేమనుకుంటున్నారు వాళ్లు?” అంది.

ఆయన నవ్వి ”ఏం మాట్లాడాలి మనతో?” అన్నాడు.

”ఏం మాట్లాడాలి అంటారేంటండీ! అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఎంత డబ్బు ఇస్తారు? పట్టుచీరలు, మిగతా వస్త్రములు ఎన్ని పెడతారు? అబ్బాయికి సూటు, మిగతా వస్త్రములు ఎన్ని? బంగారు, వెండి, మంచం, బీరువా, మిగతా వస్తువులు ఎన్ని? పెళ్లికి ఎంతమంది వస్తారు? కార్యానికి ఎంతమంది వుంటారు? ఫోటోలు, వీడియో, వినోద కార్యక్రమాలు, ప్రధానమునకు వచ్చేవారు ఎంతమంది? వారికి ఏ విధమైన సత్కారము జరపాలి? ఇవన్నీ మాట్లాడుకోరా?” అంది.

”అవన్నీ హేమంత్‌తో ముందుగానే మాట్లాడుకుని వుంటారు”

”మాట్లాడినా మళ్లీ మనతోకూడా మాట్లాడాలిగా! మరి అలాంటప్పుడు మనం అంతదూరం నుండి ఎందుకొచ్చినట్లు?”

”భోంచేసి వెళ్లటానికి…” అన్నాడు శ్రీనివాసరెడ్డి.

ఆ మాట వినగానే ”నాక్కూడా అలాగే అన్పిస్తోందండీ!” అంది అమాయకంగా ముఖం పెట్టి.

”నీకు చాలా అన్పిస్తున్నాయని నాకు తెలుసు”

”చాలా అంటే వాళ్లను పీడించి పిప్పి చేసి హేమంత్‌కి కట్నం తీసుకోవాలని మాత్రం నాకు అన్పించడం లేదు. నేనే కట్నానికి వ్యతిరేకిని… కాకుంటే పెళ్లన్నాక కొన్ని అచ్చట్లు, ముచ్చట్లు తీరితేనే అందంగా వుంటుంది. అమ్మాయి విలువ కూడా పెరుగుతుంది. పెరిగిన విలువ పదిమందికి తెలియాలి అంటే అటువైపు పెద్దవాళ్లం ఇటువైపు పెద్దవాళ్లం ఓ చోట కూర్చుని ఆత్మీయంగా, గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇలాంటివి ఒక్క హేమంత్‌తో ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా కావు. మనం వుండేది అడవిలో కాదు! సమాజంలో…” అంది.

శ్రీనివాసరెడ్డి మౌనంగా వున్నాడు.

”నాకెందుకో వీళ్ల కుటుంబ పద్ధతులు ఆదిలోనే నచ్చలేదు. రమాదేవి తోడికోడళ్లు కూడా పైకి పాజిటివ్‌గా అన్పించినా లోపల చాలా నెగటివ్‌గా వున్నట్లు వాళ్ల ముఖాలు చూస్తేనే అర్థమవుతోంది. శాంతారాంగారి అన్నదమ్ముల్ని మీరు గమనించారో లేదో వైట్‌ & వైట్‌ డ్రస్సుల్లో అచ్చు ఆంబోతుల్లా, సింబోతుల్లా వున్నారు. వాళ్ల మధ్యలో హేమంత్‌ని ఊహించటానికే భయంగా వుంది.

”నువ్వేం ఊహించకు. భయపడకు. శాంతారాం ఫ్యామిలీకి మనం మాత్రమే కొత్త. ఆరాధ్య ద్వారా హేమంత్‌ ఎప్పుడో పాతవాడైపోయి వుంటాడు. వాళ్ల పద్ధతులు అన్నీ నచ్చే ప్రొసీడై వుంటాడు. అతనేం చిన్న పిల్లాడు కాదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. కొత్తగా ఏవేవో చెప్పి మన అభిప్రాయాలను అతని మీద రుద్ది అతన్ని డిస్టర్బ్‌ చెయ్యకపోవటం మంచిది. పడుకో. నిద్ర పడుతుంది” అన్నాడు శ్రీనివాసరెడ్డి.

ఆమె పడుకొంది. భర్త మాట విని పడుకున్నా ఆమె ఆరాధ్య ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూనే వుంది.

సరిగ్గా ఉదయం ఏడు గంటలకి వాళ్లు హైదరాబాదు స్టేషన్లో దిగారు.

స్టేషన్‌ దగ్గరికి హేమంత్‌, కాశిరెడ్డి వచ్చారు.

అందరూ కలిసి హేమంత్‌ ఇంటికి వెళ్లారు.

అక్కడ జరిగిన సంఘటనల్లో వాళ్లకి నచ్చని అంశాలేవీ హేమంత్‌తో, కాశిరెడ్డితో చెప్పకుండా జాగ్రత్త పడ్డారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. చాలా ప్రశాంతంగా స్నానాలు చేశారు. హేమంత్‌ కొత్తగా కొన్న ఎల్‌సిడి టీవీలో భక్తి ఛానల్‌ చూస్తూ కూర్చున్నారు.

ఈ లోపల హేమంత్‌ బయటకెళ్లి అందరికి టిఫిన్‌ తీసుకొచ్చాడు.

అందరూ కలిసి టిఫిన్‌ తింటూ హైదరాబాదు ఎంత డెవలప్‌ అయిందో మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో హేమంత్‌ కల్పించుకొని

”మీ ప్రయాణ కబుర్లు చెప్పండి ఆంటీ!” అన్నాడు. అతనికి అక్కడ జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలని వుంది.

”ఏమున్నాయి హేమంత్‌! ట్రైన్లో వెళ్తూ నిద్రపోయాం. వస్తూ నిద్రపోయాం. అంతా హ్యాపీనే! జర్నీ కూడా మేము అనుకున్నంత హార్డ్‌గా ఏం లేదు” అన్నారు.

టిఫిన్‌ తినటం పూర్తయ్యాక

శ్రీనివాసరెడ్డి ఇంటికి ఫోన్‌ చెయ్యటంతో కారొచ్చింది. డ్రైవర్‌ ఒకసారి లోపలికి వచ్చి శ్రీనివాసరెడ్డికి కన్పించి వెళ్లాడు.

”నాకు సిటీలో పని వుంది. కాల్స్‌ వస్తున్నాయి. మీరు మాట్లాడుతూ వుండండి! నేను మళ్లీ వచ్చి జాయిన్‌ అవుతాను” అన్నాడు శ్రీనివాసరెడ్డి.

కళ్యాణమ్మ ”అలాగే!” అంది.

హేమంత్‌, కాశిరెడ్డి ఆయనతోపాటు కారు వరకు వెళ్లారు. ఆయన కారులో కూర్చుని వెళ్లిపోగానే తిరిగి లోపలికి వచ్చారు.

వాళ్లు లోపలకి రాగానే ”హేమంత్‌ నీ పెళ్లి డిసెంబర్‌ 5 బుధవారం ఉదయం పదిగంటలకి. ఆ ప్రకారం లగ్నపత్రిక రాసిచ్చారు ఇదిగో! దీన్ని నీ దగ్గర వుంచు” అంటూ లగ్న పత్రికను హేమంత్‌ చేతికి ఇచ్చింది కళ్యాణమ్మ.

అతను దాన్ని పట్టుకొని చూస్తూ కూర్చున్నాడు.

”నిన్న అనగా నవంబర్‌ 16 శుక్రవారం నిశ్చితార్థం జరిగింది కాబట్టి 18వ తేదీన మనం పసుపు దంచుకొని పెళ్లిపనులు ప్రారంభిద్దాం” అంది.

బేలగా చూస్తూన్నాడే కాని మాట్లాడలేదు హేమంత్‌.

”నువ్వలా చూడకురా! అన్నీ వాటంతటవే జరిగిపోతాయ్‌!” భుజం తట్టాడు కాశిరెడ్డి.

”నాకెందుకో జీవితం జీవితంలా లేదురా! ప్రతీదీ ఓ ప్రయోగంలా అన్పిస్తుంది”

”జీవితం అంటేనే ప్రయోగాలమయం హేమంత్‌! ఎన్ని ప్రయోగాలు చేస్తే జీవితం అంత మెరుగ్గా వుంటుంది. అందులో ఈ పెళ్లి అనేది అతిముఖ్యమైనది. జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునేది. అందుకే మన తెలుగువారు దీన్ని చాలా సాంప్రదాయబద్దంగా, శాస్త్రోక్తంగా చేసుకుంటారు” అంది.

”నాకెవరు చేస్తారు ఆంటీ!” అని అనకుండా ”ఆంటీ! మీరు ఆరాధ్య వాళ్ల ఇంటికి వెళ్లారు కదా! మిమ్మల్ని బాగా చూసుకున్నారా? గౌరవంగా సాగనంపారా?” అడిగాడు హేమంత్‌.

”ఓ… చాలా! ప్రతిదీ చక్కగా జరిపారు. 18వ తేదీ దాటాక వెంటనే పెళ్లి కార్డ్స్‌ నువ్వూ, కాశిరెడ్డి వెళ్లి కొట్టించండి! మొదటి కార్డు దేవునిగుడిలో పెట్టి, ఆ తర్వాత ఆరాధ్య వాళ్ల ఇంట్లో ఇచ్చి రావాలి. వాళ్లు కూడా అలాగే చేస్తారు. మిగిలినవి మీ ఫ్రెండ్స్‌కి పంచుకోండి! 29న ఇక్కడ నీ ఇంట్లోంచి ప్రధానం, సమర్త సారె ఆడపిల్ల ఇంటికి చేరాలి. అన్నట్లు ప్రధానంలోకి ఏదైనా బంగారు నగ పంపాలి” అంది.

”అదెంతసేపు మమ్మీ! ఆరాధ్యను తీసికెళ్లి గంటలో తెస్తాడు హేమంత్‌?” అన్నాడు కాశిరెడ్డి.

”అసలు ఈ పెళ్లికి సంబంధించిన బట్టలు కాని, నగలు కాని వాళ్లూ, నువ్వు కలిసి షాపింగ్‌ చెయ్యాల్సి వుంటుంది. ఒకసారి వాళ్లకి కాల్‌చేసి కనుక్కో. ఎప్పుడొస్తారో?” అంది.

”వాళ్లు రామన్నారు ఆంటీ!”

”అదేంటీ?” అని ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ.

”వాళ్ల షాపింగ్‌ వాళ్లే! మన షాపింగ్‌ మనమే చేసుకోవాలట. కాకుంటే మీరు చెప్పిన బంగారు నగ ఇక్కడ ఆరాధ్యను తీసికెళ్లి సెలక్ట్‌ చేసుకోమని చెబుదాం!” అన్నాడు.

లోలోన ఆశ్చర్యపోతోంది కళ్యాణమ్మ. ఈ పెళ్లి విషయంలో హేమంత్‌ మాట కన్నా వాళ్లమాటకే ప్రాధాన్యత వుండేలా అన్పిస్తోంది. దాన్ని ఆమె బయటకి ప్రకటించకుండా లోపలే దాచుకుంది.

”ఆంటీ! ప్రధానం ఎవరితో పంపుదాం! మీరూ, అంకులేగా తీసికెళ్లాల్సింది. మీరైతేనే బావుంటుంది. మీకైతేనే వాళ్లు మర్యాదలు ఘనంగా చేస్తారు.” అన్నాడు సంతోషంగా.

”ఎవరైతే ఏముంది హేమంత్‌! అప్పటికి ఎవరో ఒకర్ని మా బంధువుల్లోనే చూద్దాంలే! పంపేదేదో ఘనంగా పంపుదాం! సరేనా!” అంటూ నవ్వింది. ఆమెకు మళ్లీ ఆ ఊరు వెళ్లటం ఇష్టంలేదు.

”సరే! ఆంటీ!” అన్నాడు హేమంత్‌. అతనికి కళ్యాణమ్మ మనసులో ఏముందో తెలియదు.

ప్రదానంలోకి ఏమేమి తీసికెళ్లాలో మాట్లాడుకున్నారు.

పెళ్లి జరిగాక రిసెప్షన్‌ ఏ ఫంక్షన్‌హాల్లో పెట్టుకోవాలో మాట్లాడుకున్నారు.

అంతలో శ్రీనివాసరెడ్డి వచ్చాడు. కళ్యాణమ్మను తీసికెళ్లాడు.

హేమంత్‌, కాశిరెడ్డి ఆఫీసుకెళ్లారు.

*****

హేమంత్‌ వుండే ఇంట్లోనే పసుపు దంచి పెళ్లిపనులు మొదలుపెట్టారు. అందరికీ శుభలేఖలు పంచారు.

నవంబర్‌ 29న ప్రధానం పంపాలని ఆరాధ్యను తీసుకొని కళ్యాణ్‌ జ్యుయలరీకి వెళ్లారు కళ్యాణమ్మ, హేమంత్‌, కాశిరెడ్డి.

కళ్యాణమ్మ ఆరాధ్యను చూసి ”అమ్మాయి నెమలికంఠంతో, సింహం నడుముతో, చక్కటి భుజాలతో అద్భుతంగా, సౌందర్యవంతంగా వుంది కదా!” అని మనసులో అనుకుంటూ హేమంత్‌ భుజం తట్టింది. ”నీ ఎంపిక బాగుంది హేమంత్‌!” అంది.

”గట్టిగా అనకండి ఆంటీ! వాళ్లిచ్చే డబ్బుల్లో సగానికి సగం తగ్గించేస్తుంది”

”ఎంతిస్తున్నారేం?”

”ఇంకా చెప్పలేదాంటి! ఎంతో ఇస్తారట. రోజూ ఫోన్లో మా అమ్మ నాకోసం పది సంవత్సరాల నుండి కష్టపడి పోస్టాఫీస్‌లో దాచిపెట్టిన డబ్బులన్నీ నాకే ఇస్తుంది అని చెబుతుంటుంది” అన్నాడు.

”ఇస్తే ఇస్తార్లే! అమ్మాయి బాపుబొమ్మకి జిరాక్స్‌లా వుంది. అది చాలు నీకు. అవునూ! నీకు కట్నం తీసుకోవాలని వుందా?

”ఛఛ. నాకు అలాంటి ఆలోచనేలేదు. వాళ్లే ఇస్తామంటున్నారు. వద్దంటే నాకు మావాళ్లు ఇస్తుంటే మీరే చెడగొట్టారని ఆరాధ్య నాతో గొడవ పెట్టుకోగలదు. అసలే రాక్షసి. అందుకే నేను సైలెంటయిపోయాను” అన్నాడు నవ్వుతూ. హేమంత్‌ చెప్పేది విని కళ్యాణమ్మ కూడా నవ్వింది. వాళ్లు చాలా హ్యాపీగా వున్నారు.

ఆరాధ్య కాస్త దూరంగా కూర్చుని నగల డిజైన్లు చూస్తోంది.

ఆ షాపులో రకరకాల డిజైన్లు వున్నాయి. వాటిని మెడలో అలంకరించుకొని అద్దంలో చూసుకుంది ఆరాధ్య. ఆరాధనగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు హేమంత్‌. పక్కనే కాశిరెడ్డి కూడా చూస్తున్నాడు. కళ్యాణమ్మలో ఆరాధ్యను చూస్తున్నకొద్దీ ముచ్చట పెరిగిపోతోంది. ఇలాంటి అమ్మాయి కాశిరెడ్డికి కూడా దొరికితే బావుండని మనసులో అనుకుంటోంది. పెళ్లికి రెడీగా వున్న కొడుకులు వుంటే ఏ తల్లి అయినా అలాగే అనుకుంటుంది. అది సహజం.

ఆరోజు సాయంత్రం వరకు నగలషాపులోనే గడిపారు. ఆరాధ్యకి ఒక్క డిజైన్‌ కూడా నచ్చలేదు. పైనకెళ్లి డైమండ్‌ సెట్స్‌ కూడా చూశారు. అవికూడా నచ్చలేదు.

చివరకు ”ఆంటీ! ఈ షాపులో నాకు నచ్చిన డిజైన్‌ దొరకడం లేదు. మా బాబాయ్‌లకు గోల్డ్‌ షాపులున్నాయి. అందులో తీసుకుంటాను. పెళ్లి నగలన్నీ అక్కడే తీసుకోవాలనుకుంటున్నాం”

”ఈ విషయం ముందే చెబితే ఇంతదూరం వచ్చేవాళ్లం కాదుగా!” అన్నాడు హేమంత్‌.

”ఇక్కడ చూడకుండా తీసుకుంటే తర్వాత నేను తప్పకుండా ఫీలవుతాను. ఇక్కడయితే మంచి డిజైన్లు వుండేవేమో అని… ఇప్పుడు అలా ఫీల్‌ కాను. ఎందుకంటే చూశాను కాబట్టి…” అంది ఆరాధ్య.

”ఆరాధ్య మాటలు కూడా కరక్టే హేమంత్‌! నువ్వు సైలెంటయిపో!” అంది కళ్యాణమ్మ.

హేమంత్‌ మాట్లాడలేదు.

చిత్రంగా చూసింది ఆరాధ్య. ”ఆమె సైలెంటయిపొమ్మనగానే సైలెంటయిపోవటమేనా!” అన్నట్లు. అదేం గమనించలేదు ఎవరు…

”ఇంకేంటి నెక్ట్స్‌ ప్రోగ్రాం?” అడిగాడు హేమంత్‌.

”ప్రధానం చీర కొందాం హేమంత్‌! పద సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌కి వెళ్దాం!” అంది చాలా ఉత్సాహంగా కళ్యాణమ్మ.

అక్కడ నుండి కారులో బయలుదేరి సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌కి వెళ్లారు.

ఆ షాపులో ఎన్ని చీరలు చూసిన ఆరాధ్యకి నచ్చలేదు.

ఇంకా కొన్ని షాపులు తిరిగి చూశారు. కళ్యాణమ్మ కూడా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ల వెంట చాలా ఓపిగ్గా తిరిగింది. మధ్యమధ్యలో కాశిరెడ్డి వెళ్లి అందరికీ జ్యూస్‌లు తెచ్చి ఇచ్చాడు.

హేమంత్‌ చేతిమీద సున్నితంగా తట్టి ”ఇప్పటికే రాత్రి తొమ్మిది దాటింది. రేపొస్తే తీరిగ్గా చూడొచ్చేమో!” అంది కళ్యాణమ్మ.

నుదుటిమీద కొట్టుకొని ”ఏదీ నచ్చదేంటి ఆంటీ?” అన్నాడు.

ఆరాధ్యకు కాస్త దూరంలో వేరే చీరకట్టి ట్రయల్‌ చూస్తున్నారు సేల్స్‌ గర్ల్స్‌.

”పెళ్లినగలు, చీరలు జీవితంలో ఒక్కసారే కొంటారు. నచ్చకుండా ఎలా తీసుకుంటారు? నువ్వు టెన్షన్‌ పడకు హేమంత్‌” అని అంది కళ్యాణమ్మ.

”ఇంతవరకు ఒక్కటికూడా సెలెక్ట్‌ కాలేదు. ఇలాగైతే తిండీ, నిద్ర, స్నానం ఇక్కడే చేసుకుంటూ రోజుల తరబడి ఈ షాపుల్లోనే పడివుండేలా వున్నాం. బాబోయి ఇదేం షాపింగో ఏమో… భయంగా వుందాంటి!” అన్నాడు.

”భయపడకు. పెళ్లయితే అన్ని భయాలు పోతాయి”

”ఏం పోతాయో ఏమో గాడ్‌!” అన్నాడు పైకి చూసి.

ఆమె నవ్వి ”ఆరాధ్య చిన్నపిల్ల. ఏం తెలుస్తుంది. ఎన్ని తెచ్చి ముందేసినా నచ్చలేదంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ల పెద్దవాళ్లు తప్పనిసరిగా వెంట వుండి షాపింగ్‌ చెయ్యాలి. మా ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగితే అలాగే చేశాం. అటువైపు పెద్దవాళ్లం ఇటువైపు పెద్దవాళ్లం కూర్చుని పెళ్లి షాపింగ్‌ మొత్తం లంచ్‌ బ్రేక్‌తో కలిపి ఐదుగంటలు మాత్రమే పట్టింది. మేమే కాదు ఎవరైనా చాలా వరకు అలాగే చేస్తారు. రిస్క్‌ వుండదు” అంది. పైకి కన్పించడం లేదుకాని ఆమె అప్పటికే విసిగిపోయింది.

దూరం నుండే హేమంత్‌ని కళ్యాణమ్మను గమనిస్తోంది ఆరాధ్య. వాళ్లిద్దరు ఎప్పుడు చూసినా తల్లీ కొడుకుల్లా ఓచోట చేరి మాట్లాడుకోవటం ఆమెకు నచ్చటం లేదు” ఇన్నిరోజులు ‘నాకెవరూ లేరు’ అన్నాడే కాని ఇదిగో! వీళ్లున్నారు నాకు’ అని ఎప్పుడూ చెప్పలేదు హేమంత్‌. అసలే నిశ్చితార్థం రోజు తల్లి ఫోన్‌ చేసి ‘నీకు అత్త లేదనేగాని ఈ కళ్యాణమ్మనే పెద్ద అత్తకు మించిన అత్తలా వుంది ఆరాధ్యా! నువ్వు ఆవిడను కొంచెం కంట్రోల్‌లో వుంచుకో! లేకుంటే ఆవిడ పర్మిషన్‌ ఇస్తేనే నువ్వు హేమంత్‌ని తాకాల్సిన రోజులు వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇక్కడ ఆవిడను చూసిన మనవాళ్లంతా అదే అంటున్నారు. నువ్వు జాగ్రత్త!” అంది.

అప్పటి నుండి ఆరాధ్యకు ఆందోళన మొదలైంది. ఆ క్షణం నుండి కళ్యాణమ్మని ఎలా వుంటుందో చూడాలన్న క్యూరియాసిటీతో వుంది. ఇవాళ చూసింది. చూడగానే హేమంత్‌ చాలా ఉత్సాహంగా ”ఈవిడే మా ఆంటీ ఆరాధ్యా! నా ఫ్రెండ్‌ కాశిరెడ్డివాళ్ల మదర్‌. మన పెళ్లి మొత్తం ఆంటీ చేతుల మీదుగానే జరగాలి” అన్నాడు.

ఆరాధ్య మౌనంగా చూసింది.

తల్లి అలా ఫోన్‌ చేసి మాట్లాడడం వల్లనో ఏమో కళ్యాణమ్మను చూస్తుంటే ఈవిడ మన మనిషి అన్న భావన కలగటం లేదు. ఎంత పాజిటివ్‌గా ఆలోచించాలన్నా ఆలోచించలేకపోతోంది. తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. అవే నిజమనిపిస్తున్నాయి. కళ్యాణమ్మ నవ్వితే ఏదో జంతువు సకిలించినట్లు ఏవగింపు కల్గుతోంది. మాట్లాడితే రాక్షసి మాట్లాడినట్లు అసహ్యం వేస్తోంది. ఆవిడ సమక్షంలో ఒక్కక్షణం వుండాలన్నా వుండలేనట్లు ఇబ్బంది పడుతోంది.

ఇక ఆ షాపులో చీరలు చూడదలచుకోలేదు ఆరాధ్య. వెంటనే కళ్యాణమ్మ దగ్గరకి వచ్చి నార్మల్‌గా చూసి ”ఆంటీ నాకు గ్రీన్‌ శారీ నచ్చింది. వర్క్‌ హెవీగా వుండటం వల్ల మంచి లుక్‌ వచ్చింది. కానీ కొంగు నచ్చలేదు. దాని రేటు 25 వేలు. ఆ డబ్బులు హేమంత్‌తో ఇప్పించండి! ఇవాళ నైట్‌కి నేను మా ఊరు వెళ్తున్నాను. అక్కడ తీసుకుంటాను”

”ఇక్కడ ఇంతమందిమి చూస్తున్నాం. పైగా ఇది సిటీ. ఎక్కువ షాప్స్‌ వున్నాయి. ఇక్కడకన్నా మీ ఊరిలో అంత మంచివి దొరుకుతాయా?” అన్నాడు హేమంత్‌.

”దొరుకుతాయి. అక్కడ కూడా మంచి మంచి వెరైటీస్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారట. ఇప్పుడే మా అమ్మ కాల్‌ చేసి చెప్పింది” అంది.

”ఓ.కె. మరి గోల్డ్‌?” అడిగాడు.

”గోల్డ్‌కూడా అక్కడే తీసుకుంటాను. మీరు ప్రధానంలోకి పెట్టాలనుకున్న షార్ట్‌ నెక్లెస్‌ నేనిక్కడ సెలెక్ట్‌ చేసుకున్నది లక్ష రూపాయలవుతోంది. ఇక్కడ ఐటమ్స్‌ హెవీగా వున్నాయి. మావూరిలో అయితే మాకు మేకింగ్‌ చార్జెస్‌, తరుగు వుండవు. మా బాబాయిలు ఇప్పుడే ఫోన్లో చెప్పారు. ఆ లక్ష రూపాయలు కూడా ఇస్తే అక్కడే తీసుకుంటాను”

”లక్షా ఇరవై ఐదు వేలకి చెక్కు రాసిస్తే అక్కడే తీసుకుంటుంది. ఇవ్వు హేమంత్‌!” కళ్యాణమ్మ చెప్పింది.

”ఇవ్వరా! మళ్లీ ట్రైన్‌కి టైం అవుతోంది” అన్నాడు కాశిరెడ్డి.

”నేనివ్వనురా! నా సెలెక్షన్‌ ఏం అవసరం లేదా? అంతా వాళ్ల ఇష్టమేనా?” అంటూ బాగా ఫీలయ్యాడు హేమంత్‌.

”మా అమ్మనేగా నాకు ఇన్నిరోజులు ఏదైనా సెలెక్ట్‌చేసి కొని ఇచ్చింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. మీరెందుకు? ఎందుకో ఈమధ్య మీరు చిన్నవి కూడా పెద్దగా చేసి చూస్తున్నారు” అంటూ కళ్యాణమ్మ వైపు ఒకరకంగా చూసింది ఆరాధ్య.

ఉలిక్కిపడింది కళ్యాణమ్మ.ఆరాధ్య తనవైపు ఎందుకలా చూసిందో ఆమెకు అర్థం కాలేదు.

”అటెందుకు చూస్తావ్‌! ఇటుచూడు. ఆంటీకేం తెలుసు. ఇమ్మనే చెబుతుంది” అన్నాడు హేమంత్‌.

”చెప్పమనే నేను కూడా అటు చూసేది. ఆంటీ ఎలా చెబితే అలా మీరు చేస్తారని నాకు తెలిసే నేను ఆంటీని అడుగుతున్నాను. ఆంటీ! నల్లపూసల గొలుసు, పుస్తెలతాడు మీరేగా చేయించాల్సింది. వాటి డబ్బులు కూడా ఇప్పించండి! అవికూడా అక్కడే తీసుకుంటాను” అంది ఆరాధ్య.

అది విని కాశిరెడ్డిని పక్కకి లాక్కెళ్లాడు హేమంత్‌!

”ఇదేంటిరా! మొత్తం బంగారం నాతోనే కొనిపిస్తోంది. వాళ్ల వాళ్లేంపెట్టరా?” భయపడుతూ అన్నాడు హేమంత్‌.

”పెడతార్లేరా! తొందరపడకు. వాళ్ల అమ్మాయికి వాళ్లు ఏమైనా పెట్టుకుంటారు. ఎంతయినా పెట్టుకుంటారు. అవన్నీ పైకి చెప్పరు. కొంతమంది చెబుతారు. కొంతమంది చెప్పరు. వీళ్లు రెండోటైపు. అయినా నాది నీది అన్నది మీ ఇద్దరి మధ్యన వుండకూడదురా హేం! అయినా నువ్వు కొనేది నీ భార్యకేగా! బయటవాళ్లకేం కాదుగా అదేదో వెళ్లి వాళ్ల బంధువుల సమక్షంలోనే తీసుకుంటుంది. ఇంకా మంచిదేగా!” నచ్చచెప్పాడు కాశిరెడ్డి.

”నా దగ్గర వుండే డబ్బులెంతో తెలుసు. చచ్చీ, చెడీ రెండు సంవత్సరాలుగా సంపాయిస్తే నా అకౌంట్లో 5 లక్షలు మాత్రమే వుంది. అదలా వుందీ అంటే నేను ఇన్నిరోజులు మందు తాగలేదు, స్మోక్‌ చెయ్యలేదు, ఖరీదైన ఫుడ్‌ తినలేదు. అందరు వెళ్లి సినిమాలు చూస్తున్నా నేను ఒంటరిగా రూంలో  పడుకొని నిద్రపోయేవాడ్ని…”

”అవన్నీ ఇప్పుడు ఎందుకు హేం! పెళ్లంటేనే నగలు, చీరలు. ఇవిలేకుండా జరిగే పెళ్లి పెళ్లే కాదు. నువ్వలా చెయ్యాలన్నా ఆరాధ్య ఒప్పుకోదు. నువ్వేది చేసినా ఆరాధ్య కోసమేగా! అలాంటప్పుడు అకౌంట్లో వుండే మనీ గురించి ఆలోచించవచ్చా?”

”గోల్డ్‌కి, చీరలకి మూడు లక్షల వరకు అయ్యేట్లుంది. ఇక మిగిలింది 2 లక్షలు. దానితో రిసెప్షన్‌ అవుతుందంటావా?”

”అవుతుంది. కాదంటే మాడాడీ దగ్గర అడిగి తీసుకుందాం! నువ్వేం వర్రీ కాకు. ఆరాధ్యను నొప్పించకు” అన్నాడు కాశిరెడ్డి.

”నేను నొప్పిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావురా! అసలు లగ్న పత్రిక రాసినప్పటి నుండి ఆరాధ్యలో చాలా మార్పు వచ్చింది. ఫోన్లో ఎలాపడితే అలా మాట్లాడుతోంది. సరేలే! ఇప్పుడు అవన్నీ ఎందుకు! రా! వెళ్దాం!” అంటూ కళ్యాణమ్మ, ఆరాధ్యలు వుండే దగ్గరకి నడిచాడు హేమంత్‌. కాశిరెడ్డి కూడా అతనితో వెళ్లాడు.

…ఆరాధ్య తనవైపు ఎందుకలా చూసిందో అర్థంకాక అప్పటి నుండి అదే ఆలోచిస్తూ షాపులోకి వచ్చీ పోయేవాళ్ల వైపు చూస్తోంది కళ్యాణమ్మ. ఆమె మనస్థిమితాన్ని కోల్పోయింది. ఆరాధ్య అదేం గమనించకుండా తన మొబైల్లోంచి కాల్‌ చేసి తల్లితో మాట్లాడుకుంటోంది.

మూడు లక్షలకి చెక్కు రాసి ఇచ్చాడు హేమంత్‌. అది తీసుకొని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది ఆరాధ్య.

ఆరాధ్యతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

ఆ షాపులోంచి బయటికి కదిలి కారెక్కారు కళ్యాణమ్మ, కాశిరెడ్డి.

వాళ్ల వెంటే నెమ్మదిగా నడిచారు హేమంత్‌, ఆరాధ్య. వాళ్లు కారెక్కే ముందు పక్కకి నిలబడి కొద్ది నిముషాలు ఏదో మాట్లాడుకున్నారు. ఆరాధ్య కోపంగా మాట్లాడుతుంటే హేమంత్‌ చాలా కూల్‌గా మాట్లాడటానికి ప్రయత్నించాడు.

******

కాలం ఎందుకో ఏమో ఒక్కక్షణం కూడా ఆగకుండా పరిగెడుతోంది. ఎంతటివారైనా ఎలాంటి వారైనా నన్ను ఆపలేరు. వెనక్కు తీసుకు రాలేరు అన్నట్లు అతివేగంగా పరిగెడుతోంది. ఎటువంటి మూర్ఛప్రాణికైనా ఆకలి, నిద్ర, దేహంలో వచ్చే మార్పులు కాలగమనాన్ని తెలియజేస్తూ వుంటాయట. అందుకే ఎవరి పనులు వాళ్లు ఛకఛక చేసుకుపోతుంటారు.

హేమంత్‌ పెళ్లిపనులు అతని ప్రమేయం లేకుండానే కాశిరెడ్డి పర్యవేక్షణలో ఛకఛక జరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు చెక్కులు రాసియ్యడమే హేమంత్‌ పని…

పెళ్లికి రెండు రోజుల ముందే కాశిరెడ్డి అమ్మా, నాన్న, ఇద్దరు అన్నయ్యలు, వదినలు, పిల్లలు, హేమంత్‌ ఫ్రెండ్స్‌ హేమంత్‌ ఇంటికి వచ్చారు. వాళ్లందరు ఆఫీసులకి సెలవులు పెట్టి చాలా హ్యాపీగా వున్నారు.

3 లక్షలు తీసుకున్న రోజే ఊరెళ్లిన ఆరాధ్య అటే వుండిపోయింది. పెళ్లి అని చెప్పి ఆఫీసులో లీవ్‌ పెట్టింది.

పెళ్లికి ముందురోజే హేమంత్‌ని పెళ్లి కుమారున్ని చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం కళ్యాణమ్మ తనకు బాగా తెలిసిన పురోహితుడు రామశాస్త్రిగారితో మాట్లాడింది. ”నా కొడుకు పెళ్లే అనుకోండి! అపశృతులేమీ లేకుండా పెళ్లికొడుకును చేసి వెళ్లాలి” అంది.

”చూశారుగా అమ్మా! తమ ఇంట్లో రెండు పెళ్లిళ్లు నా చేతుల మీదుగానే జరిగాయి. మనవళ్లని కూడా  ఎత్తుకున్నారు. ఇదికూడా అలాగే జరిపిస్తాను. నేను చెప్పినవన్నీ తెప్పించి రెడీగా వుంచండి! నాకో ఫోన్‌ చేస్తే వచ్చి పెళ్లికొడుకును చేసి వెళ్తాను” అన్నాడు రామశాస్త్రిగారు.

శాస్త్రిగారు చెప్పిన లిస్టు అంతా డ్రైవర్ని పంపి తెప్పించింది.

హేమంత్‌ ఇంటిముందు తెలుగు సంప్రదాయం ప్రకారం తాటాకు పందిరి వెయ్యలేకపోయినా మేదరోళ్లను పిలిపించి తడికెలతో అల్లిన చలువ పందిరి వేయించారు. మేళతాళాలు బాజా భజంత్రీలు మ్రోగిస్తూ మామిడి తోరణము గుమ్మానికి కట్టారు. ఇంటిముందు వేసిన పందిరికి నాలుగువైపుల మామిడి తోరణాలు కట్టారు.

హేమంత్‌ను పెళ్లికొడుకును చేయుటకు ముందు తూర్పు ముఖము చూచునట్లుగా ముగ్గు వేశారు. ముగ్గు మీద రెండు పీటలు వేసి ఆ పీటల మీద తెల్లని వస్త్రము వేశారు. దానిమీద అక్షింతలు చల్లారు. హేమంత్‌ కాళ్లకు పారాణి, బుగ్గన చుక్క పెట్టి మెడలో తెల్లని తుండు వుంచారు.

హేమంత్‌కి బావ వరసవాళ్లు ఎవరూ లేనందున కాశిరెడ్డిని బావ స్థానంలోకి రప్పించి తోడిపెళ్లికొడుకుగా అలంకరించారు. అతని చేతులలో తాంబూలం వుంచి హేమంత్‌కి ఎడమవైపు తోడిపెళ్లికొడుకు పీటల మీద కూర్చోబెట్టారు.

దీపారాధన వెలిగించి హారతి పట్టి అక్షింతలు వేసి ఇద్దరికి వస్త్రాలు పెట్టారు. తర్వాత హేమంత్‌ని ఒక స్టూల్‌పై కూర్చోబెట్టారు. మాడుకు, చేతులకు నెయ్యి రాశారు. శెనగపిండిలో కొంచెం నీళ్లు కలిపి దాన్ని పేస్టులాగా చేసి హేమంత్‌ చేతులకు, ముఖము మీద రాశారు…

అదంతా అయ్యాక హేమంత్‌ బావలూ, బావమరుదుల స్థానంలోకి అతని ఫ్రెండ్స్‌. వదినలు,మరదళ్లు స్థానంలోకి కాశిరెడ్డి వదినలు వాళ్ల చెల్లెళ్లు వచ్చి సరదా సరదాగా హేమంత్‌ని, కాశిరెడ్డిని ఆటపట్టిస్తూ ఆ వేడుక పూర్తిచేశారు.

తర్వాత హేమంత్‌వాళ్లకి గోరువెచ్చని నీటితో మంగళస్నానాలు చేయించారు. రోలుకు, రోకలికి ఐదు పోగుల దారమునకు పసుపు రాసి పసుపుకొమ్ము ముడివేసి రెండు తోరణములు కట్టారు. రోటిలో ఐదు పసుపు కొమ్ములు వేసి ఐదుగురు ముత్తైదువులు ఆ పసుపు దంచారు. ఆ పసుపును మరింత మెత్తగా కొట్టి తలంబ్రాలబియ్యములో కలిపారు.

కళ్యాణమ్మ దగ్గరుండి ఏ లోటుపాట్లు లేకుండా హేమంత్‌ని పెళ్లికొడుకును చేయించింది.

”ఈ క్షణం నుండి నువ్వు పెళ్లి అయ్యేంత వరకు బయటకి కదలటానికి లేదు. బయట పనులు ఏమైనా  వుంటే కాశిరెడ్డి కాని, నీ ఫ్రెండ్స్‌ కాని చేస్తారు. వాళ్లెవరూ అందుబాటులో లేనప్పుడు మన డ్రైవర్ని పంపిద్దాం!” అంది కళ్యాణమ్మ. ఆమె చాలా సంతోషంగా, బాధ్యతగా తన ఇంట్లో తిరుగుతుంటే నిజంగా తనకు తల్లిలాగే అన్పిస్తోంది. హేమంత్‌ కళ్లు అప్రయత్నంగా చెమర్చాయి.

అది గమనించలేదు కళ్యాణమ్మ ”చూడు హేమంత్‌! నువ్వు వెంటనే మీ మామగారికి ఫోన్‌ చేసి ‘ఇక్కడ నన్ను పెళ్లికొడుకును చేశారు. అక్కడ మీరు మీ అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసుకోండి’ అని చెప్పు. అలా ఫోన్‌ చేసి చెప్పటం మన ధర్మం. ఎందుకంటే మనం ఫోన్‌ చేసి చెప్పేంత వరకు వాళ్లు అమ్మాయిని పెళ్లికూతుర్ని చెయ్యరు.అది మన సంప్రదాయం” అంది.

”అవునా! అయితే ఇప్పుడే చెబుతాను” అంటూ మొబైల్‌ చేత్తో అందుకొని కాల్‌ చేశాడు. అతనికి ప్రతిదీ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని వుంది. ఒకప్పుడు లేదు కాని ఇప్పుడు వుంది. బహుశా తల్లీ, దండ్రీ లేని లోటును కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి తీర్చటం వల్లనో ఏమో!!!

హేమంత్‌ చేసిన కాల్‌కి వెంటనే సమాధానం ఇచ్చాడు శాంతారాం ”మా అమ్మాయిని ఉదయాన్నే పెళ్లికూతుర్ని చేశాం” అని…

అది విని కళ్యాణమ్మ తేలకళ్లు వేసింది. ”ఉదయం నుండి వాళ్లు నీకు ఫోనేమైనా చేశారా?” అంది.

”లేదాంటీ! చెయ్యలేదు” అన్నాడు హేమంత్‌.

ఆమె ఆశ్చర్యపోతూ ”అదేంటి హేమంత్‌! వాళ్ల పద్ధతులేంటి ఇలా వున్నాయి. అమ్మాయిచేత గౌరీపూజ చేయించాలి కాబట్టి ముందుగా అబ్బాయిని పెళ్లికుమారునిగా చేసిన తర్వాతనే అమ్మాయిని పెళ్లికుమార్తెను చెయ్యాలి. ఈ విషయంలో పది నిముషాలు తేడా అయినా తప్పక పాటించాలి. ఇదేంటి ఇలా చేస్తున్నారు వాళ్లు…” అంటూ అక్కడ నుండి ఆమె పక్కకెళ్లి కోడళ్లు వున్న గదిలోకి వెళ్లింది.

అంతవరకు సంతోషంగా వున్న హేమంత్‌ మూడ్‌ అవుట్‌ అయ్యాడు. వెంటనే వాత్యల్యకు ఫోన్‌ చేశాడు. వాత్యల్య ముందు నుండీ తన ఫ్రెండే అయినా ఈమధ్యన ఆరాధ్యతో ఎక్కువ క్లోజ్‌ అయ్యింది. పెళ్లిలో రెండు రోజులు తనతోనే వుండమని ఆరాధ్య తన ఊరికి రప్పించుకుందట… వాత్యల్య నిన్ననే ఆరాధ్య దగ్గరకి వెళ్తున్నట్టు హేమంత్‌కి కాల్‌ చేసి చెప్పింది.

వాత్యల్య చాలా ఉత్సాహంగా ”హలో… హేం! నిన్ను పెళ్లికొడుకును చేశారటగా! హౌ ఆర్‌యు?” అంది.

”ఫైన్‌! నువ్వుకూడా ఫైనే అని నీ గొంతు వింటుంటే తెలుస్తోంది. అవునూ! ఆరాధ్యను పెళ్లికూతుర్నిచేశారా? గౌరీపూజ చేశారు కదా?” అడిగాడు ఆత్రుతగా హేమంత్‌.

”అలాంటి పూజలేమీ లేవిక్కడ…”

”అదేంటి!”

”అదేంటీ అంటే ఏం చెప్పను హేమంత్‌! లేనిది వుందని చెప్పాలా?”

”ఐ మీన్‌ అదికాదు వాత్యల్యా! గౌరీపూజ చేశాకనే ఆరాధ్యను పెళ్లికూతుర్ని చేశారు కదూ?” మళ్లీ అదే ప్రశ్న వేశాడు హేమంత్‌.

”చూడు హేమంత్‌! నువ్వొక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌వి. నీకు ఈ పూజలతో పనేంటి? అసలు నీకు ఇవన్నీ ఎవరు చెబుతున్నారు?” అడిగింది వాత్యల్య. పక్కనే ఆరాధ్య కూడా వుంది. ఆమెకు కూడా హేమంత్‌ మాటలు విన్పిస్తున్నాయి.

”కళ్యాణి ఆంటీ చెప్పింది”

”అదీ! ఎవరో ఒకరు చెబితేనే గాని తెలియని విషయాలు ఇవి… తెలుసుకోక పోయినా వచ్చే నష్టమేమీ లేదు. వీటి గురించి నువ్వేం ఆలోచించకు. నువ్వొక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌వి. అలాగే వుండు. డీసెంట్‌గా వుంటుంది. వేరే మేటర్లలోకి వెళ్లకు” అంది.

”నువ్విలా అంటున్నావూ అంటే అక్కడ గౌరీపూజ జరగనట్లే! నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్నే! కాదని అనటం లేదు. మా మామ శాంతారాం, అత్త రమాదేవి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కాదు. నాకు వాళ్లే చెప్పారు పెళ్లిని శాస్త్రోక్తంగా జరిపిస్తామని. అలా జరిపించకుండా మగపిల్లవాడికన్నా ముందు అన్నీ వాళ్లే చేసేసుకుంటుంటే ఇక శాస్త్రమెందుకు? సంప్రదాయమెందుకు?”

”హేం! నువ్విలా అడగకూడదు. ఇక్కడ వీళ్లు పెళ్లిపనులన్నీ ఘనంగానే చేస్తున్నారు. ఇవాళ ఉదయమే ఒక బ్యూటీషియన్‌ వచ్చి ఆరాధ్యను పెళ్లికూతుర్ని చేసివెళ్లింది. రేపుకూడా ఆవిడే వచ్చి చేస్తుంది. ఆవిడకి డబ్బులు కూడా చాలా ఇస్తున్నారు. సరే! మీరంతా ఎప్పుడు వస్తున్నారు? మీరు వచ్చేదాన్ని బట్టే పెళ్లి టైంకు జరుగుతుంది. లాంగ్‌ జర్నీ కాబట్టి త్వరగా బయలుదేరండి!”

”ఎంత ముందుగా రావాలి?”

”కనీసం రెండు గంటల ముందు వచ్చినా స్నానాలు చేసి కళ్యాణమంటపానికి వెళ్లొచ్చు”

”రెండు కాదు, మూడు గంటలు ముందుగా వస్తాం. ఎందుకంటే ముహూర్తానికి పెళ్లి జరిగితే ఆనందంగా వుంటామనే నమ్మకం ఒకటి మనలో ఉంది కదా. అందుకే పెళ్లి పేరుతో ఇంతింత ఖర్చు పెట్టుకుంటున్నాం. సెలవులు పెట్టుకుంటున్నాం. ముహూర్తం వేళకి రమ్మని ఇంతింత మందిని రప్పించుకుంటున్నాం. కార్డ్సు పంచి మరీ రప్పించుకుంటున్నాం. వచ్చేవాళ్లు కూడా ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారు” అని ఆగాడు.

నవ్వి ”హేం! నీకీ మధ్యన మాటలు చాలా ఎక్కువయ్యాయి. అది పెళ్లి ఆనందమో లేక మరేదో తెలియదు. సరే! ఇక్కడ మా ఆడవాళ్ల సందడి ఎక్కువైంది. నేను తర్వాత మాట్లాడతాను” అంటూ ఫోన్‌ కట్‌ చేసింది వాత్యల్య.

గదిలోంచి బయటకొచ్చిన కళ్యాణమ్మ హేమంత్‌ పక్కన కూర్చుని ”హేమంత్‌! నిన్ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమం పూర్తయింది. ఇక మేమంతా ఇంటికెళ్లిపోతాం!” అంది.

షాక్‌ తిని ”అదేంటి ఆంటీ! పెళ్లికి రారా! మీరే లేకుంటే అక్కడ పెళ్లేముంది?”

”ఛ.. ఛ… అలా ఎందుకనుకుంటావ్‌ హేమంత్‌! దగ్గరయితే అందరం వచ్చేవాళ్లం. పిల్లలతో అంత దూరం జర్నీ చెయ్యటం మాటలు కాదు. ఎవరూ రామంటున్నారు. బలవంతం చెయ్యొద్దు. బావుండదు. నీతో కాశీ వస్తాడు. నీ ఫ్రెండ్స్‌ని కూడా తీసికెళ్లు” అంది.

అంతలో కాశిరెడ్డి హడావుడిగా లోపలికి వచ్చి ”అందరూ రెడీనా? కారు మాట్లాడుకొచ్చాను” అన్నాడు.

కాశిరెడ్డికి అసలు సంగతి చెప్పాడు హేమంత్‌. తల్లి అలా ఎందుకు మారిందో ముందు అర్థం కాలేదు. పెళ్లికి అందరం వెళ్లాలనే హైదరాబాదు వచ్చారు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో ఏమో! ఏమైందని తల్లిని అడగలేదు. ఆమె ఏదైనా సరైన నిర్ణయమే తీసుకుంటుంది.

అందుకే ”దూరం కదరా! వాళ్లను వదిలెయ్‌! మనం వెళ్దాం!” అంటూ అక్కడున్న అందరివైపు ఒకసారి ప్రశాంతంగా చూసి ”ఎవరెవరు పెళ్లికి రాదలచుకున్నారో అంతా వెళ్లి కార్లో కూర్చోండి!” అన్నాడు కాశిరెడ్డి.

ఒక్కొక్కరే కారువైపు నడిచారు.

మొత్తం హేమంత్‌తో కలిపి పదకొండు మంది వెళ్లి కార్లో కూర్చున్నారు. అందరూ హేమంత్‌ స్నేహితులే… ఆడవాళ్లెవరూ లేరు.

కారు కదిలింది. కారులో నవ్వులు… జోకులు…

*******

తెల్లవారుజాము 5 గంటలకే పెళ్లికారు వెళ్లి శాంతారాం ఇంటికి కొద్దిదూరంలో ఆగింది. ఆ ఇంటి ముందున్న షామియానా, దాని చుట్టూ వేలాడుతూ వెలుగుతున్న సీరియల్‌ బల్బులు కారు ఆగిన చోటుకి కన్పిస్తున్నాయి.

కారు దగ్గరకి ఆరాధ్య తమ్ముడు సునీల్‌ వచ్చి వాళ్లకు విడిది ఇల్లు చూపించి వెళ్లాడు.

ఆ ఇంట్లోకి వెళ్లగానే కాశిరెడ్డి ”మనం త్వరత్వరగా స్నానాలు చెయ్యకపోతే కళ్యాణ మంటపానికి కరెక్ట్‌ టైంకు చేరుకోలేం” అని తొందర చేశాడు.

ఆ ఇంట్లోని బాత్‌రూంలో లైటు వెలగకపోయినా చీకట్లోనే స్నానాలు చేసి కూర్చున్నారు హేమంత్‌ స్నేహితులు.

ఏడు గంటలకి శాంతారాం, రమాదేవి వచ్చి పెళ్లికొడుకును, వాళ్ల ఫ్రెండ్స్‌ని పలకరించి వెళ్లారు. వాళ్లను చూస్తుంటే అప్పుడే నిద్రలేచి వచ్చిన వాళ్లలా అన్పించారు.

తొమ్మిది గంటలకి సునీల్‌ వచ్చి ”మీ అందరికి ఇక్కడే టిఫిన్లు ఏర్పాటు చేశాం. వచ్చి తినండి!” అని చెప్పి వెళ్లిపోయాడు.

కాశిరెడ్డి తన మొబైల్లో టైం చూసి కళ్లు పెద్దవి చేసి ”మైగాడ్‌! ఇప్పుడు మనం టిఫిన్లు తింటూ కూర్చుంటే కళ్యాణ మండపానికి ఎప్పుడు వెళ్లాలి?” అన్నాడు.

ఫ్రెండ్స్‌ అదిరిపడి ”వీడి గోల పాడుగాను. మనల్ని టిఫిన్‌కూడా తిననిచ్చేలా లేడు” అన్నారు. వాళ్లకి ఏడుగంటల నుండే ఆకలవుతోంది.

ఎవరో వచ్చి ”హేమంత్‌ పెళ్లికొడుకు కాబట్టి పెళ్లి అయ్యేంత వరకు ఏమీ తినకూడదు. పాలు మాత్రం త్రాగొచ్చు” అని చెప్పి వెళ్లారే కాని ఒక్కరు కూడా అతనికి పాలు తెచ్చి ఇవ్వలేదు.

హేమంత్‌నే కాదు అతని ఫ్రెండ్స్‌ని కూడా అక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదు.

హైదరాబాదు నుండి కారులో వచ్చేటప్పుడు వాళ్లంతా చాలా కోరికలతో వచ్చారు. వాటిని లోపల దాచుకోకుండా ”మనం మగపెళ్లివారం కాబట్టి ఆడపెళ్లివారు మనకి అడుగడుగున బ్రహ్మరథం పడతారు. బ్రహ్మాండంగా చూసుకుంటారు. అయినా మనం మెత్తబడకూడదు. చాలా బెట్టు చెయ్యాలి. తప్పులు వెతకాలి. వాళ్లు నోళ్లు తెరిచి తల్లడిల్లిపోయేలా చెయ్యాలి. ‘హైదరాబాదు అబ్బాయిలంటే మాటలు కాదు, ఓ ఆట ఆడించి వెళ్లారు హేమంత్‌ పెళ్లిలో…’ అని ఇంకో తరం వరకు తెలిసేలా చెప్పుకోవాలి అని సరదాపడుతూ చెప్పుకున్నారు. ఒకరికి ఒకరు ఎలా కో-ఆపరేట్‌ చేసుకోవాలో ముందే మాట్లాడుకున్నారు.

కానీ తీరా చూస్తే అలాంటి వాతావరణమేం లేదక్కడ. ఎవరెవరో వస్తున్నారు. హేమంత్‌ని చూసి అమ్మాయికి తాము ఏమవుతారో చెప్పుకొని వెళ్తున్నారు. ఒక్కరు కూడా కాశిరెడ్డి బృందాన్ని పలకరించడం లేదు. వీళ్లు తిరిగి చూసే లోపలే వెళ్లిపోతున్నారు. హేమంత్‌ అదేం గమనించటం లేదు. చాలా హ్యాపీగా వున్నాడు.

వాళ్లు చూస్తుండగానే పూలతో, ఫ్లెక్సీలతో అలంకరించిన కారొకటి వచ్చి, మేళతాళాల మధ్యలో హేమంత్‌ని అతని స్నేహితుల్ని ఎక్కించుకొని కళ్యాణమంటపం వైపు దారితీసింది. ఆరాధ్య కూర్చుని వున్న కారు హేమంత్‌ కూర్చుని వున్న కారు ముందే చాలా స్లోగా వెళ్తోంది. పెళ్లికొచ్చిన ఆత్మీయులు, బంధువులు, పురజనులు, స్నేహితులు ఆరాధ్యవైపు చూస్తూ ఆరాధ్య కూర్చుని వున్న కారు చుట్టూ చాలా నెమ్మదిగా నడుస్తున్నారు.

”రేయ్‌! కాశీ! నాకో డౌట్‌! మన కారుకన్నా పెళ్లికూతురు కారు ముందు వెళ్తుందేం! దాన్ని ఓవర్‌టేక్‌ చేసి మనమే ముందు వెళ్తే గొప్పగా, ఘనంగా వుంటుందేమో! ఎంతయినా మనం మగపెళ్లివారం కదా!” అన్నాడు ఒక ఫ్రెండ్‌.

”ఇప్పుడు టైమెంతయిందో చూడు” అంటూ మొబైల్‌ చూపించాడు కాశిరెడ్డి.

”టైంతో ఏంపని? అయిందిలే పదకొండు” అన్నాడు ఫ్రెండ్‌.

”ఇప్పుడు మనం ఎక్కడున్నాం?”

”రోడ్డుమీద. కన్పించట్లేదా? మన కార్లముందు ఆ డాన్స్‌లు చూడు. పేలుతున్న టపాసులు చూడు. మోగుతున్న బ్యాండ్‌ చూడు. మొత్తానికి హేమంత్‌ పెళ్లి అదురుతోందిరోయ్‌! వాళ్ల చిన్నమామలు,పెద్దమామలు, బావమరుదులు కార్లను కదలనివ్వకుండా, ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడు. ఇంతకీ కళ్యాణ మంటపం ఇంకెంతదూరం వుంది?” అడిగాడు ఇంకో ఫ్రెండ్‌.

”నాకు మాత్రం తెలుసా? నేనేదో ఇక్కడ నా చిన్నప్పటినుండి తిరిగి ఏడ్చినట్లు నన్ను అడుగుతావ్‌?”

”ఎందుకురా అంత కోపం. పైగా టెన్షన్‌గా వున్నావ్‌? హాయిగా అందరిలా రోడ్డుమీద జరిగే తంతుని చూస్తూ ఎంజాయ్‌ చెయ్యక”

”ఏం సాధించామని ఎంజాయ్‌ చెయ్యాలిరా? లెక్కప్రకారం ఈపాటికి పెళ్లయిపోవాలి. అసలు వీళ్లు పెళ్లికి ముందు బరాత్‌ పెట్టుకొని రోడ్డుమీద కార్లను నిలేసి డాన్స్‌లు చేస్తున్నారెందుకు? ఇలాంటి డాన్స్‌ ప్రోగ్రాం ఎవరైనా పెళ్లయిన తర్వాతనే పెట్టుకుంటారు. ఆ ఆనందంతో ఎలా పడితే అలా ఎగురుతారు రోడ్డుమీద. ఇలాగైతే పెళ్లెప్పుడు చెయ్యాలి? ఇదేదో వింత ఆచారంలా వుందే!” అంటూ అటు ఇటు చూస్తున్నాడు కాశిరెడ్డి.

హేమంత్‌ మొబైల్‌ రింగవుతుంటే లిఫ్ట్‌చేసి

”ఆంటీ! ఇప్పుడే కళ్యాణమంటపంలోకి ప్రవేశిస్తున్నాం” అన్నాడు హేమంత్‌.

”అదేంటి! ఇంకా పెళ్లి జరగలేదా?” ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ.

”లేదాంటీ! ఇప్పుడే వెళ్తున్నాం” అన్నాడు.

”అదేంటయ్యా! పదకొండు నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు రాహుకాలం వుంది. ఇప్పుడు పెళ్లెలా చేస్తారు?” ఆమె బాధగా అడుగుతుంటే బ్యాండ్‌ చప్పుడుకి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక హేమంత్‌ మొబైల్‌ ఆపేశాడు.

పెళ్లికూతురుని పెళ్లి కొడుకును తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.

జనం అప్పటికే విపరీతంగా వచ్చి కూర్చీల్లో కూర్చుని వున్నారు. కుర్చీలు సరిపోక నిలబడి కూడా చూస్తున్నారు. వాళ్లు తొమ్మిదిగంటల నుండే ఎదురుచూస్తున్నారు.

పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.

బ్యాండ్‌వాళ్లు చెవులు చిల్లులు పడేలా వాయిస్తున్నారు.

కెమెరా మెన్లు, వీడియోగ్రాఫర్లు ‘నువ్వా, నేనా!’ అన్నట్లు పోటీలు పడుతున్నారు. మంత్రాలు చదువుతున్న పురోహితుడ్ని మధ్యమధ్యలో ఆపుతున్నారు పెళ్లికొడుకును, పెళ్లికూతుర్ని ఫోటోలు తియ్యాలని… ఆయన విసుక్కుంటున్నాడు. కోప్పడుతున్నాడు. ఆయన నోటి నుండి మంత్రాలకన్నా మాటలే ఎక్కువగా వస్తున్నాయి.

ఏదో ఖాళీగా వున్నాడు తక్కువ డబ్బులు ఇచ్చినా వస్తాడని ఆయనను పిలిచారు కాని ఆయన వయసు 92 అని, సుగర్‌ పేషంటు అని శాంతారాంకి తెలియక కాదు. కక్కుర్తి అంతే! ఆయన మంత్రాలు పూర్తిగా చదువుతున్నాడా లేక సగం చదువుతున్నాడా అన్నది అక్కడ ఎవరిక్కావాలి. త్వరగా పెళ్లయితే భోజనాలు చేసి వెళ్లిపోవచ్చని ఎదురుచూస్తున్నారు. ముసలివాళ్లు, పసిపిల్లలు వున్నవాళ్లు, సుగరు, బి.పి. వున్నవాళ్లు ఆకలికి ఆగలేక భోజనాలు ఎక్కడ పెడుతున్నారో తెలుసుకొని ఒక్కొక్కరే లేచి అటువైపు వెళ్తున్నారు.

పెళ్లి జరిగే టైంకు కుర్చీలలో బంధువులు, స్నేహితులు, పురజనులు పలుచబడిపోయారు. దగ్గర బంధువులు మిగిలారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *