May 18, 2024

“ సత్తాకి సత్కారాలు “

రచన:  శర్మ జి ఎస్  IMG_3815

నరలోకంలో జీవితం గడపినన నరులు వారి దేహం చాలించిన పిమ్మట , మొదట నరకలోకానికి తరలించబడ్తారు . అచ్చట  వారా నరలోకంలో ఎలా , ఏ రకంగా జీవనం సాగించారో తనిఖీ చేసిన చిత్రగుప్తుడు , వారి ప్రభువులైన యమధర్మరాజుల వారికి విన్నవించి వారి ఆదేశానుసారము , తదనుగుణంగా వారిని ఏ రకంగా గౌరవించాలో ఆ నరకలోకంలో నిర్ణయం చేసేస్తుంటారు .

ఆ యమలోకం నుంచి నరలోకంలో ధర్మబధ్ధతతో గడిపిన వారిని , దేవలోకానికి తరలించి , ఆ జీవులను ఆ దేవ సభలోని ఆనాటి తారల చేత నృత్య ప్రదర్శనలతో రంజింప చేస్తుంటారు .

నరలోకంలో ధర్మబధ్ధత లేకుండా గడిపిన జీవులను , వారి నరకలోకంలోనే వుంచి , వారికి తగిన శిక్షలు వేసి అమలు జరుపుతుంటారు . ఆ జీవులు బుధ్ధి వచ్చినది అని పదే పదే వేడుకొనగా , మఱల  నరలోకానికి కొత్త కొత్త ఆకారాలతో జన్మనిచ్చి అనుభవించుడు అని పంపెదరు , అదీ యమధర్మరాజుల వారి ఆదేశాల మేరకు .

ఈ యమలోకాన్ని సృష్టించినది , ఇటువంటి నరుల కొఱకేనన్నది దీన్ని బట్టి స్పష్టంగా తెలియ వస్తోంది .

ఇదే ఈ యమలోక నియమావళి .

*      *    *

అది దేవలోకం . ఆ దేవలోకాన్ని ఇంద్రుడు పరిపాలించటం చేత ఈయనను దేవేంద్రుడు అని పిలవ బడ్తుంటాడు.

ఈ దేవలోకంలో కూడా మానవలోకంలో లాగే అచటి వాళ్ళెవరూ శాశ్వతం కాదు . ఆ ఆస్థానాలు శాశ్వతం కాదు . ఆ స్థానాలు మాత్రమే శాశ్వతం .

ఇచట నిర్వహించే సభను దేవేంద్ర సభ అని పిలుస్తారు . ఈ సభను దేవ ఋషులు , యింకా మరెందరో మానవలోకంలో ధర్మబద్ధతతో జీవించిన జీవులు అలంకరించి వుంటారు .

ఈ దేవలోకం ఆరంభమైన నాటి నుంచి పేరు పొందిన రంభ , ఊర్వశి , మేనక , తిలోత్తమలు  ఆ ఆస్థానీసుడైన దేవేంద్రుడి ఆదేశాల మేరకు సభలోని అందరినీ తమ తమ నృత్య రీతులతో , ఆట , పాటలతో రంజింప చేస్తున్తుంటారు .

ఆ సమయానికి దేవేంద్రుని ఆసనం అలంకరించినది మరెవ్వరో కాదు . మానవలోకంలో చలనచిత్ర పరిశ్రమను స్థాపించి , ఎందఱో నట , నటీమణులను పరిచయం చేసి కళామతల్లి నీడలో వాళ్ల జీవితాలను సద్వినియోగ పడేలా చేసిన బి . నాగిరెడ్డి గారు .

ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. ఎందుకంటే నరలోకంలో తనువు చాలించిన ప్రతి ప్రాణి ముందుగా నరకలోకానికి యమభటుల చేత కొని రాబడతారు .

తదుపరి వారి వారి నరలోక జీవన శైలిని చిత్రగుప్తుడు పరిశీలించిన పిమ్మట, తదనుగుణముగా (ధర్మ బద్దతతో జీవించిన ) వారికి తగిన మర్యాదలు చేయబడ్తాయి. ఆ మర్యాదలు పలు పలు రకాలు. కొంతమందిని ఆ సభకు సభ్యులుగా ,ఇంకొంత మందిని సలహాదారులుగా , మరికొంత మందిని దిక్పాలకులుగా నియమిస్తుంటారు.

ఇంకా కొంతమందికి ఆ దేవేంద్రుడి స్థానం యివ్వటం కూడా జరుగుతుంటుంది. దానికి కూడా కాలపరిమితి నిర్ణయించబడి వుంటుంది.

ఆ నాటి దేవేంద్రుని సభనలంకరించిన వారికి అలనాటి రంభ, మేనక , ఊర్వశి, తిలోత్తమల నృత్యాభినయం రంజింప చేయలేకపోవటంతో, నాడు ఆ సభలో ఆశీనులైన ఉన్న యమధర్మరాజుకి తెలుగు చలన చిత్ర సీమలోని ప్రముఖ నట నటీ మణులను పంపించ వలసిందిగా ఆదే శాలివ్వటమైనది.

ఆ నటులను యిటకు రప్పించినచో  ఎలా ఉపయోగ పడెదరు అన్న సందేహాన్ని వెలిబుచ్చారు యమపురి యమధర్మరాజు.

అనేక యుగాలుగా ఈ రంభ, మేనక , ఊర్వశి తిలోత్తమల నృత్యం బోరు కొడుతుందట, ఇచ్చటకు వేంచేసిన ఈ సభనలం కరించిన వారికి. వీళ్ళు ఎన్ని మారులు వచ్చినను వీరి నృత్యంలో నూతనత్వం లేకుండెనట . అందులకు తమరు అచ్చటి ప్రముఖులను (నిర్మాతలను, కదా నాయకులను, కదా నాయకిలను, హాస్య నటులను, విలన్ పాత్రధారులను, సంగీత చక్రవర్తులను , దర్శక చంద్రులను , ఇలా ముఖ్యమైన పలువురను ఇచ్చటకు పంపించవలసినదిగా వారి వారి అర్హత (ధర్మ బద్దత జీవన శైలి) కనుగుణముగానని మా మనవి ” అని దేవేంద్రుడైన ఆ నాటి బి నాగిరెడ్డి గారు సెలవిచ్చారు.

లెస్స బలికితిరి దేవేంద్రా. మా అభిప్రాయమును అదియే ” అని అచ్చటనే ఆశీనుడై ఉన్న నందమూరి తారక రామారావు , మిక్కిలినేని, నాగ భూషణం, రావు గోపాల రావు, రాజనాల, రమణారెడ్డి, చలం, పద్మనాభం, గుమ్మడి వెంకటేశ్వర రావు, ముళ్ళపూడి వెంకట రమణ, సూర్యకాంతం, కన్నాంబ సావిత్రి వగైరా సబ్యులందరూ వంత పలికారు.

” ఈ వంత పలికే వారందరూ ఆ కోవలోని వారే కదా ! వీరి చేత చేయించవచ్చు కదా ! ” తన ఆలోచనని వెలిబుచ్చాడు యమధర్మరాజు.

నాకూ ఆ ఆలోచనే వచ్చినది. కాకుంటే వీళ్ళు ఈ దేవసభకేతించిన తరుణంలోని దేవేంద్రులు వారిని అలాగే కొనసాగించటంతో , వాళ్ళు మేం నటించి చాల ఏళ్ళు అయినది. మా సహచరులు మా భూలోకంలో వున్నారు. వారిని పిలవండి ” అని ఓ చిన్న సలహా యిచ్చారు.

“ఇచ్చటకు రావటానికి వారికింకా చాల టైముండి వుంటుంది, అలా వీలుపడదు ” అని చెప్పాడు యమధర్మ రాజు.

ఆ సభలోని పై సభ్యులందరూ మూకుమ్మడిగా లేచి, ” అటులైన అచ్చట ఉన్న వారి జీవన ఆయు: పరిమాణాన్ని యిచ్చట ఉపయోగించండి ” సలహా ఇచ్చారు .

దేవేంద్రుడికి ఆ సలహా నచ్చి ” యమధర్మ రాజా అటులనే కానీయండి ” .

” అటులనే దేవేంద్రా ” .

” ఈ కోవకు చెందిన మానవలోకంలోని వారికి, యింకనూ ఒక సంవత్సర కాలము సమయమున్నది. దేవేంద్రా ఆనతి కాలంలోనే తమరి సభకు పంపెదను. వారితో నాట్యము చేయింతురా ఏమి ? ”

” నాట్య మొక్కటియే కాదు, యిచ్చట మా ఆస్థాన సభ్యులు నూతనత్వమును కోరుచున్నారు , కనుక అచ్చటి ఆ ప్రముఖుల చేత కొన్ని దృశ్య కావ్యములు, క్రొంగొత్త  నృత్యరీతుల భంగిమలు, చలన చిత్రములు నిర్మించి మా ఈ సభికులందరు రంజింప చేదలచితిమి. అప్పుడు కదా మాలాంటి వారి రాకకు యిచ్చట ప్రాధాన్యత కలుగును ” అని తన ఆలోచనను వెల్లడి చేశాడు ఆ దేవేంద్ర పదవిని అలంకరించిన బి నాగిరెడ్డి.

“భళా భళి. లెస్స పలికితిరి. అటులనే పంపించెద . ”

 

******

 

చిత్రగుప్తా, ఆ నరలోకవాసుల యమచిట్టా కొని రమ్ము ” ఆదేశించాడు యమధర్మరాజు.

” ఇదిగో ప్రభూ ” అందించాడు చిత్రగుప్తుడు.

” భూలోకవాసుల కాలమానం ప్రకారం ఒక సంవత్సర కాలంలో యిచ్చటకు వచ్చు వారి జాబితా చూపించుము “.

” అటులడిగిన చూపుట కష్టతరమే ఆగును ప్రభూ ! ఏలన మానవలోకము నానాటికి ఉత్పత్తి మీదనే ( అన్ని రకములగా ) వారి దృష్టిని కేంద్రీకరించింది. కనుక ఆ చిట్టాలో తమరు కనుగొనుట కష్టమే. ” సెలవిచ్చాడు.

” ప్రభూ యిటు పరికించుడు. భూలోక వాసులందరూ రాబోయే 2014 సంవత్సరానికి ఆహ్వానం పలుకుచున్నారు అత్యంతోత్సాహలతో.”

” మరుక్షణమా ఆనందం వుంటుందో లేదో తెలియకనే ఈ క్షణానికి అలా చిందులు వేస్తుంటారు ఆ ప్రాణికోటి . ”

” ఆ ఆ పరికించితిని . అటులైన నటులైన , సహాయ నటులైన , సాంకేతిక నిపుణూలైన , తెలుగు చలన చిత్ర సీమలోని ప్రముఖుల జాబితా చూపుము “.

అటులనే ప్రభూ అంటు ,తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోని వారి జాబితాని తీసి చూపించుతూ ,” ప్రభూ వీరికింకను ఆయుర్దాయమున్నది. కానీ దేవేంద్రుల వారి ఆదేశాల మేరకు వీరిని రాబోయే సంవత్సరంలో ఈ క్రింద పేర్కొన్న సమయములో రప్పించి, యిచ్చట దేవేంద్రుల వారి కొలువులో పదవులను యిప్పించెదము. ”

” సరే అటులనే వారిని సగౌరవంగా తీసుకొని రండు ” .

” ఉదయ కిరణ్ 05.01.2014 యువ హీరో ”

” అంజలి, బహు భాషా హీరోయిన్, 13.01.2014 ”

అక్కినేని నాగేశ్వరరావు , బహు బిరుదాంకితుడు, హీరో , 22.01.2014″.

” తెలంగాణ శకుంతల 14.06.2014 క్యారెక్టర్ యాక్టర్, లేడీ విలన్ గా పేరు గాంచినది. ”

” బాపు (సత్తిరాజు లక్ష్మి నారాయణ ) చిత్రకారుడు, చరిత్రకారుడు, దర్శకుడు, తెలుగు వ్రాత రాతనే మార్చేసిన వాడు, తెలుగు లోగిళ్ళను సృష్టికర్త కంటే అందంగా చిత్రించి అహ సృష్టించిన వాడు 31.08.2014 ”

” పి జె శర్మ క్యారెక్టర్ యాక్టర్ 14.12.2014 ”

” చక్రి సంగీత దర్శకుడు 15.12.2014 ”

” కైలాసం బాలచందర్ దర్శక చంద్రుడు పలు భాషలలో, ఎందరినో చలన చిత్రసీమకి పరిచయం చేసి ఏలికలుగా మార్చినవాడు 23.12.2014 ”

” వీరందరూ దేవలోకానికి అర్హులే. ఈ నరకలోకంలో ప్రవేశించగనే, దేవలోకానికి పంపుడు. దేవేంద్రుల వారు వారికెలాంటి సత్కార్యాలు చేయాలో చేసి, ఎలా వారిని చూడాలో అలా చూస్తారు”.

” అటులనే ప్రభూ ” .

 

***** సమాప్తం *****

 

(పలు లోకాల నుంచి అనుదినం కాదు అనుక్షణం జీవరాసులు పుడుతూ గిడుతూనే వుంటాయి. ఇది ఆ అనంత శక్తి శాసనంగా శాసించబడి అన్ని లోకాలలో నడుస్తూనే వున్నది. దీన్నెవ్వరూ (ఏ జీవరాసి ) తప్పించనూ లేరు, తప్పించుకోనూ లేరు.

అలాంటిటి ఒకటైన ఈ నరలోకంలో ఈ నడుమ తెలుగు చలన చిత్రసీమలో బహు పేరు ప్రఖ్యాతులు గాంచిన పలువురు ప్రముఖులు పరలోకానికి వెళ్లి పోతున్నారు వెంట వెంటనే . ఈ సంఘటనలే ఈ కధకు మూల కారణాలు .)

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *