May 19, 2024

తిరుమలేశుని సన్నిధిలో…

రచన: డా. రేవూరు అనంతపద్మనాభరావుpadmana

 

శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో దిగి తెలతెలవారేవేళ 6 గంటలపైన సువర్ణముఖీ నదీతీరంలో నించున్నాం. మా కుటుంబం యావత్తూ ముప్పయిమందిమి నదీ స్నానాలకు అక్కడ చేరాము. అది 1960 జూన్ నెల. అప్పట్లో గూడూరు వరకే బ్రాడ్ గేజీ రైలు నడిచేది. అక్కడనుండి మీటరుగేజు రైల్లో రేణిగుంటవరకు వెళ్ళి ఆ పైన తిరుపతి చేరుకోవాలి.

మా నాయనమ్మకు పదిమంది సంతానం. వారి పిల్లలందరం కలిసి మొక్కుబడి చెల్లించుకోవడానికి సకుటుంబ సపరివార సమేతంగా ఆడబడుచులతో సహా బయలుదేరాము. సువర్ణముఖి నదిలో అప్పటికి ఎండాకాలమైనా స్నానానికి తగినట్లు నీరు ప్రవహిస్తోంది. ఎదురుగా ఆలయ మహాద్వారం. కొండపైన భక్తకన్నప్ప ఆలయం.

స్నానాలు ముగించి బయటపడే సమయంలో బ్రిడ్జిపైన   ఆంధ్రపత్రిక న్యూస్ పేపర్ అమ్మే కుర్రాడు యస్. యస్. యల్. సి. రిజల్ట్సు అంటూ అరుస్తూ వెళుతున్నాడు. అప్పట్లో 11 క్లాస్ ని యస్. యస్. యల్. సి అనేవారు.  పేపరు కొని చూశాను. మేము ముగ్గురు  పెదనాన్న, చిన్నాన్న పిల్లలం పాసయ్యాము.

కాళహస్తీశుని దర్శనం చేసుకుని- అప్పుడు ఈ రాహుపు హడావిడి గానీ, క్యూలైన్ల సందడి గానీ లేదు. మేము లింగాన్ని, ఆలయంలో ఇతర మూర్తులను సందర్శించాము. భక్తకన్నప్ప కొండమీదకి నడక సాగించాము. కుటుంబ సమిష్టిగా ప్రయాణించడం, చిన్నా పెద్దల పట్ల ఆదరభావం గుర్తుకువచ్చి వళ్ళు గగుర్పొడుస్తుంది. సింగిల్ కాపురాలు వెలసిన అపార్ట్మెంటు మనస్తత్వాలు అలవాటుపడిన మనకు ఆ మాటలు కధలుగా వినిపిస్తాయి.

బస్సులో తిరుపతి చేరుకున్నాం. అది తిరుపతికి ప్రధమ బస్సు. యాభై సంవత్సరాల చరిత్ర కళ్ళముందు కనిపిస్తోంది. కాంక్రీటు భవన సముదాయం, నాగరిక లక్షణాలైన నక్షత్ర హోటళ్లు, మూడు నిముషాలకొక రైలు రావడమో, పోవడమో, ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులు, టాక్సీలు, సొంతకార్లు, ఒకటే  రొద. ప్రయాణీకుల సంఖ్య పెరగడం, కొండమీదకు చేరుస్తాం,  దర్శనం చేయిస్తామనే దళారీలు పెరగడం, స్వామిని ఎంత తొందరగా చూసి సాయంత్రం రైలుకు తిరుగు టపా కడదామనే భక్తుల సంఖ్య పెరగడం  ఆశ్చర్యకరం. ఇప్పుడు రైల్వే స్టేషన్ కు ఎడమవైపున తిరుపతిదేవస్థానం వారి  ఒకటో  నెంబరు సత్రంలో బస చేశాము.

సత్రమంటే నిజంగా సత్రం. అన్నదానాలు లేవు. ఒకటే గదిలో ఎవరికివారు వంట చేసుకునే సదుపాయాలు వున్నాయి. వంట ఎలా చేశారో గుర్తులేదు గాని, అందరం బంతిలో కూర్చుని నాయనమ్మ పర్యవేక్షణలో భోంచేశాం. మా తాతయ్య భోళా శంకరుడు ఎక్కువ మాట్లాడేవారు కాదు.

ముందుగా గోవిందరాజస్వామి దర్శనం. మహోన్నత ద్వారం ఎదురుగా ఆంజేయనేయస్వామి. తలకింద కుంచం పెట్టుకున్న శయన గోవిందరాజులు. దర్శనం కాగానే, బయటకు రాగానే దోసెలు, పులిహార, పొంగలి ఒక్కొక్కటి పావలా పెట్టికొంటే అందరం స్వీకరించగలిగాం. గుడి చుట్టూ పరివార దేవతలు. ఆండాళ్ళు, పుండరీకవల్లి. ఇలా ఒక్కొక్కరినీ దర్శించుకుని అందరం సత్రానికి చేరుకున్నాం.

గోవిందరాజస్వామి గుడి వెనకనే కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఉంది. దానిని పేష్కార్ ఆఫీసు అనేవారు. అప్పటికి ఇంకా నూతన కార్యాలయ భవనాల్లేవు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, 1953 లో ఆంధ్రా ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం హయాంలో స్థాపించారు.  బి.ఏ. కోర్సు కూడా యూనివర్సిటీలో బోధించేవారు. యం.ఏ, యం.ఎస్.సి తరగతులు నడిచేవి.  తొలి వైస్ చాన్సలర్ గా కార్యాధ్యక్షుడైన యస్. గోవిందరాజు నియమించబడ్డారు. ఆయనకు సహకారంగా రామానుజాచారి రిజిస్ట్రారు. ఇప్పుడున్న మెయిన్ బిల్డింగ్సులో క్లాసులు.  ఇప్పటి భవానీ నగర్ గానీ, మహతి ఆడిటోరియంగానీ లేవు. జనసంచారం లేని దారి. యూనివర్సిటీలో  సాయంకాలం వంటరిగా వెళ్ళేవారు కాదు, 1970 వరకూ కూడా…బస్సుల్లో షాపింగు కోసమని ఏదో ఒక సాయంకాలం తీసుకువెళ్లి మళ్ళీ చీకటి పడకముందే హాస్టల్లో  చేర్చేవారు.

వాళ్ళు బస్సు దిగడం, షాపింగుకెళ్ళడం గమనించిన షోకిలా విద్యార్ధులు వారికి షాపుల్లో తారసపడి వారికి ‘హలో అని పలకరిస్తూ ఆయా జిల్లాలనుండి వచ్చిన విద్యార్ధినులతో  తెలిసిన విద్యార్ధులు మాట్లాడడానికి ప్రయత్నించేవారు.  వార్డను పర్యవేక్షణలో వారు క్షేమంగా తిరిగి వచ్చేవారు… ఆ పద్ధతి మంచిదనడం కాదు గానీ, అప్పట్లో హాస్టల్ వ్యవస్థ అలా వుండేది. స్వేచ్చా ప్రవృత్తికి అవకాశం లేదు.

మేం కుటుంబసమేతంగా యాత్రకు బయలుదేరడానికి వెనుక ఒక కధ వుంది. ఒక పల్లెటూర్లో ఒక సాంప్రదాయక కుటుంబం మాది. వేంకటేశ్వరుడు మా ఇంటి ఇలవేలుపు.  ఏళ్ళతరబడి తిరుపతి యాత్ర చెయ్యలేదు. ఏదో క్లిష్ట సమయంలో మా నాయనమ్మ మా ఆవుకు పుట్టిన లేగదూడను స్వామికి మొక్కుబడిగా సమర్పిస్తాననుకుంది  అలానే మంచి బాపన పసి (ఎర్ర రంగు) కోడెదూడ పుట్టింది. దానికి రెండు, మూడేళ్లు వచ్చినతర్వాత దానిని అప్పట్లో రూ. 240 లకు, మంచి ధరకు 1960లో అమ్మారు. ఆ వచ్చిన డబ్బును ముడుపు కట్టారు.

ముడుపు కట్టిన డబ్బు ఖర్చు అణాపైసలతో, వడ్డీతో స్వామికి చేర్చాలి. పిల్లలకు స్కూళ్ళ శెలవులు ఇచ్చినపుడు అందరం బయలుదేరాం. ఇంటినుండి బయలుదేరి కొండమీద చేరి స్వామి దర్శనం చేసుకునేవరకు. ప్రయాణ ఖర్చులు, భోజనాలు,ఆడపడుచులతో సహా లెక్కగట్టి మిగతా 64 రూపాయలు గాబోలు తాతయ్య హుండీ లో వేశారు. తిరుగు ప్రయాణం ఖర్చులు దేవునికి సంబంధం లేదు, మనమే పెట్టుకోవాలి.

కోడెదూడను మొక్కుకోవడం ఆశ్చర్యంగా వుండవచ్చు.  ఈ సంఘటన గురించి తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది.

ఓ తెల్లవారు ఝామున తిరుమల మహాద్వారం ముందు ముందు ఓ పసిబిడ్డ ఏడుస్తున్నది. వంటరిగా ఎవరో వదిలేసి వెళ్ళారు. అతికష్టం మీద నాలుగు గంటల్లో ఆ బిడ్డ తల్లిని గుర్తించారు. ఆమె చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలుగుతుంది. “నాకు పుట్టిన తొలిబిడ్డను భగవంతునికి అర్పిస్తానని మొక్కుకున్నాను. ఈ బిడ్డను హుండీ లో వేశే అవకాశం లేదు కాబట్టి మహాద్వారం ముందు వదిలేశాను. ఈ బిడ్డ దేవస్థానానికి చెందుతుంది, మీ ఇష్టం” అని ఎంత చెప్పినా వినలేదు .  “బిడ్డను తీసుకుంటే అపరాధం అవుతుందని” ఆమె బాధ.

మొత్తానికి ఆ మగబిడ్డను హథీరామ్ మఠానికి అప్పగిస్తే పెరిగి పెద్దవాడైనట్టు కధనం.

ఇదంతా స్వామి మీద భక్తి ప్రపత్తులకు, రకరకాల నిదర్శనం.   మరే క్షేత్రానికి ఒక వ్యక్తి జీవితకాలంలో  అనేకమార్లు సందర్శించి ఉండడు..  పరీక్షపాస్ అయినా, ఉద్యోగం వచ్చినా, పెళ్ళి అయినా, పిల్లలు పుట్టినా తిరుమల సందర్శనం ఆనవాయితీ. జనవరి ఫస్టుకు, వైకుంఠ ఏకాదశికి, రధసప్తమి ఉత్సవాలకు సరేసరి. అందుకే అది కలియుగ వైకుంఠం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *