May 4, 2024

కంప్యూటర్ దండకం

రచన: తటవర్తి జ్ఞానప్రసూన ప్రసూన

ఓమ్!  కంప్యూటరాయనమః

కలికాల జీవన విధాన తారణోపాయనమః

ఉచ్చ.. నీచ, బీద గొప్ప తారతమ్య రహిత తారకమంత్రాయనమః

యువ మానస రజ హంసాయనమః

ఇంటింటి దేవతాయనమః

చదువుకున్, పాటకున్, మాటకున్, ఆటకున్, తపాలా పనులకున్,

పద్దులకున్, హద్దులు దాటించే విహారాలకున్,

ప్రచురణలకు, ప్రణయాలకు, పరిణయాలకు, విపణికిని, కవితా నిపుణులకు,

అర్ధాలకు, ఆరోగ్యానికి, విమర్శలకు, పంచాంగానికి, ప్రయాణాలకి,

టిక్కట్లకి, దారి చూపడానికి, టైము తెలపడానికి, ఎండావాన రాకపోకలకి,

వార్తలకి, వినోదాలకి, ఇంకా వేవేల సలహాలకి, సహాయానికి,

నీకన్న మాకెవ్వరే దిక్కు?

అన్నదాతా, ఉద్యోగదాతా!!

అనర్గల పాండితీ పటిమ పొట్టలో దాచిన నేత

బడెందుకు, కాలేజీ ఎందుకు? సినిమా హాలెందుకు

చింత లేక నీ చెంత కూచుని పొందరే మానవత

హాయినీ, శాంతినీ, ఆనందాన్నీ, అద్భుతాన్ని.

నువ్వు లేందే నేనుండలేనంటావు గాని,

నేను లేందే నీ అంతట నువ్వు ముందుకెళ్లగలవా?

నిలబడిపోతావు.. లేకపోతే తుర్రుమని ఇంటికి పోతావు. ఆవలించి నిద్రపోతావు..

ఒక్క అక్షరం… ఒక్క చుక్క అటూ ఇటూ అయితే

దిద్దుకోలేని దద్దమ్మవు కదా…నేనే దిద్దాలి.. ‘చిన్న తప్పునే భరించవు

మొదటినుంచి మంగళం  పాడి మొత్తం చెరిపేస్తావు

జాలి లేదు , కరుణ లేదు. కొత్తవారని లేదు, పెద్దవారని లేదు

కరకు గుండె నీది ఓ కంప్యూటరూ!!

అయినా ఎన్ని గుండెల్లో తిష్ట వేశావే!

ఇంటికి నువ్వొక అలంకారం, అవసరం అయిపోయావే!

ఇంటర్నెట్ వెంటేసుకుని ఎన్ని హొయలు పోతున్నావే!

మధ్య మధ్య యాడ్‌లని డెస్క్‌టాప్ మీదకి గెంతించి

మమ్మల్ని విసిగిస్తావు…. నువ్వు సంపాదిస్తావు టక్కరి!…

ఏది ఏమయినా నీ రూపు చక్కనిది, నీ సేవ గొప్పది.

బల్లల మీంచి ఒళ్లోకి చేరావే లాప్‌టాప్ పేరుతో

పిల్లల్నెత్తుకోలేని పడతులు కూడా

లాప్‌టాప్ పాపాయిల్ని ఒడిలో లాలిస్తున్నారే!

జోహారు కంప్యూటరూ, జోహారు లాప్‌టాపూ, డెస్క్‌టాపూ

వర్ధిల్లు, వర్ధిల్లు, చిరకాలం వర్ధిల్లు…

 

 

3 thoughts on “కంప్యూటర్ దండకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *