May 18, 2024

వెటకారియా రొంబ కామెడియా 6 – సేల్ బాబోయి సేల్!!

రచన: మధు అద్దంకి

saree-shopping-1

“ఏమండీ” అని పిలిచింది సుందరి

“ఊ” కొట్టాడు ఏదో పని చేసుకుంటున్న సుబ్బారావు.

“ఏమండీ” ఈసారి కొద్దిగా గట్టిగా పిలిచింది సుందరి

“ఊ” అంటూ కొద్దిగా గట్టిగానే ఊ కొట్టాడు సుబ్బారావు

ఇంక లాభం లేదనుకుని భర్త దగ్గరికి వెళ్లి..

” ఏమండోయ్” అని గావుకేక పెట్టి చళ్ళున వీపున చరిచింది సుందరి

“అయ్యబాబోయ్” అంటూ ఒక గావుకేక పెట్టాడు సుబ్బారావు.

మంటెక్కిన వీపు రుద్దుకోవడానికి నానా అవస్థ పడుతూ ” ఇప్పుడింత జీవహింస చెయ్యల్సిన అవసరం ఏమొచ్చింది నీకు” అని అరిచాడు సుబ్బారావు

“ఛ ఊరుకోండి చిలిపి మాటలు..జీవహింసేంటి చిలిపిగా? నేను మీతో ఒక విషయం చెబుదామని అనుకున్నా..మీరెంతకీ పలక్కపోయేటప్పటికి ఒక్కటి చరిచా ” అన్నది సుందరి

“సరేగాని ఇంకెప్పుడూ అలా చెయ్యి చేసుకోకు .. నేనేదో పనిలో ఉన్నాను. త్వరగా విషయం చెప్పి తగలడు” అన్నాడు సుబ్బారావు

“మరి మరి” అని సుందరి సందేహిస్తుంటే

“అలా నీళ్ళు నమలకుండా చెప్పి తగలడు “అని అన్నాడు సుబ్బారావు

” ఛా ఊరుకోండి నీళ్ళని ఎలా నములుతారు చోద్యం కాకపోతే” అన్నది సుందరి

“ఇప్పుడు ఈ వాదన అవసరమా? నీకేమి కావాలో చెప్పకుండా ఏమిటీ సోది ” అని హుంకరించాడు సుబ్బారావు.

“సర్లేండి” అని “మరీ ఇది పండగల సీజన్ కదా బోల్డు, బోల్డు సేల్స్ ఉన్నాయి షాపుల్లో అందుకని ఒక చీర కొనుక్కోవాలనుకుంటున్నా” అన్నది సుందరి

” ఈ ముక్క చెప్పడానికి ఇంత సోది, జీవహింస అవసరమా సుందరీ” అని చేతిలో డబ్బు పెట్టి  పోయి కొనుక్కో అన్నాడు సుబ్బారావు.

అహెయ్య… హెయ్య్ అంటూ గంతులేసింది సుందరి…భూమి దద్దరిల్లగానే ” భూకంపం భూకంపం” అని బయటకి పరిగెత్తబోయాడు సుబ్బారావు..

వెళుతున్న సుబ్బారావు రెక్కుచ్చుకుని  ఒక్కా లాగు లాగింది వెనక్కి..

” అబ్బా” అంటూ కెవ్వున అరిచి”నిన్నిలా జీవహింస చెయ్యొద్దు అని చెప్పాను. ఇలా అయితే ఆ డబ్బు తీసేసుకుంటా” అని ముందుకి రాబోయాడు సుబ్బారావు.

“ఆశ, దోశ,అప్పడం వడ అంటూ” పరిగెత్తి చెప్పులేసుకుని బయటకి పోయింది సుందరి.

“ఇదెక్కడి సేల్స్ పిచ్చో? మొగుడికి అన్నం పెట్టాలన్న సంగతి కూడ గుర్తులేదు” అనుకుంటూ తన జబ్బని రాచుకుంటూ తిరిగి పనిలో పడ్డాడు సుబ్బారావు.

బయటకి తుర్రుమంటూ పరిగెత్తిన సుందరి ఒక ఆటోని ఆపి యన్.చెంగన్న ( నెత్తిన చెంగన్న) బ్రదర్స్ ముందు ఆటో ఆపింది.

70 % డిస్కవుంట్ అన్న బోర్డ్ చూసి ఆనందంతో తబ్బి ఉబ్బిబ్బయ్యి ఒక్క గెంతు గెంతింది.. ఆ గెంతుకి తను దిగిన ఆటో పల్టీ కొట్టింది.. అయినా సరే అదేమి పట్టించుకోకుండా షాప్ లోకి పరిగెత్తింది.

షాప్ లోపలికి వెళ్ళగానే కుప్పలు కుప్పలుగా చీరలు రాసులుగా పోసున్నాయి అక్కడ అయిదారు చోట్ల. కాని బెల్లం చుట్టూ మూగిన ఈగల్లాగ ఆ రాసుల చుట్టూ ఆడవాళ్ళు నిలబడి ఆ కుప్పలోనుండి తమకు కావాల్సిన చీరలు తము లాక్కుంటున్నారు..అక్కడ జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు కూడ.. ముందు నేను తీసుకున్నా ఈ చీర నాది అంటూ.

తను కూడా ఆ గుంపులోకి వెళ్ళి అలా లాక్కోకపోతే తనకి ఒక్క చీర కూడ మిగలదని తనూ గుంపులోకి గెంతి ఒక రంకె పెట్టింది.. ఆ రంకెకి అందరు ఝడుసుకుని చెల్లాచెదురయ్యారు..అప్పుడు తను తీరిగ్గా ఒక్కొక్క పీలిక ఏరుకుంది..తనకి నచ్చిన చీర 2 మీటర్లే  ఉంది..

సేల్స్ మాన్ ని పిలిచి “ఏమిటీ ఇది 2 మీటర్స్ ఉంది” అనడిగింది సుందరి  .

 

“మిక్స్ అండ్ మాచ్ చీరలు మాడం ఇవి.. ఒక ముక్క ఇక్కడ, ఇంకో ముక్క మిగితా వాటిల్లోనుండి ఏరుకోవాలి” అన్నాడు. ఈ చీరలు 50 % డిస్కవుంట్ మిగితా చోట్ల 75 % డిస్కవుంట్ అన్నాడు.

తనకు నచ్చిన ఒక రెండు ముక్కలని తీసుకుని మిగిలిన కుప్పల దగ్గరికి వెళ్ళింది..అక్కడ మూగిన ఆడవాళ్ళని తరిమికొట్టడానికి రంకె వెయ్యబోయేంతలో సుందరి నోరు మూసారు అక్కడున్న కొంతమంది..

“విడవండి” అంటూ గింజుకుంది సుందరి.. “మేము విడవం” ఇక్కడున్న అందరం మా ముక్కలు మేమేరుకుంటే గాని నిన్ను వదలం” అని చెప్పారు..

మిగిలిన ఆడాళ్ళు వారి ముక్కలు తీసుకున్నాక సుందరిని విడిచిపెట్టారు..అప్పుడు పెద్దగా ఊపిరి పీల్చుకుని ఆ కుప్పలోకి జొరబడ్దది సుందరి..

అక్కడ ఒక రెండు ముక్కలు ఏరుకుని మొత్తం నాలుగు ముక్కలతో కౌంటర్ దగ్గరికి నడిచి డబ్బు చెల్లించి బయటపడ్డది సుందరి. తిరిగి ఆనందంగా ఇంటికి చేరుకుంది..

“ఇవిగోనండీ నేను కొన్న చీరలు” అని సుబ్బారావుకి చూపించింది సుందరి

“ఈ పీలికలు చీరలా? కొంపదీసి నువ్వు చీరలు మానేసి తెలుగు సినిమా హీరొయిన్లలా పీలికలు కట్టుకుంటావా?” ఎందుకే కొత్తకొత్త హింస పద్ధతులు కనిపెట్టి మరీ ఇలా జీవహింస చేస్తావ్?” అన్నాడు సుబ్బారావు

“అబ్బా చిలిపి పోద్దురూ.. ఇవి పీలికలు కావు మిక్స్ అండ్  మాచ్ చీరలు..ఈ పీలికలు అతికిచ్చుకుంటే డిజయినర్ చీరలవుతాయి తెల్సా”అని సుబ్బారావు బుగ్గ మీద ఒక్క పోటు పొడిచింది

“ఇదిగో ఇలాంటి జీవహింసే చెయ్యొద్దన్నాను” అని విసుక్కున్నాడు సుబ్బారావు బుగ్గ తడుముకుంటూ..

తను తెచ్చిన చీరముక్కలని టెయిలర్ దగ్గరికి తీసుకెళ్ళి అతికించి కుట్టించి కట్టుకుని మురిసి ముక్కలయ్యి ఆనందంతో చిందులు వేస్తూ జీవహింస చేస్తూ అనందం పొందింది సుందరి.

ఒకరోజు ఉతికిన బట్టలు తెచ్చుకుందామని పెరట్లోకి వెళ్ళి ” అయ్యబాబోయ్” అంటూ ఒక పొలికేక పెట్టి విరుచుకుపడిపోయింది సుందరి.. ఇంట్లో ఏమన్నా పాము దూరిందేమో అని కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ పెరట్లోకి వచ్చిన సుబ్బారావుకి స్పృహ తప్పి ఉన్న సుందరి కనబడింది..ముఖం మీద నీళ్ళు జల్లి సుందరికి స్పృహ తెప్పించాడు..

సుబ్బారావుని చూడంగానే ఘొల్లుమంది సుందరి.”ఏమండీ అంతా అయిపోయిందండీ ఏమీ మిగల్లేదండీ ”

“అబ్బా నీ మెలోడ్రామా తో చంపక ఏమయిందో చెప్పి ఏడూవు అని విసుక్కున్నాడు సుబ్బరావు

“మరండీ నేను మోసపోయానండీ ఇంత ఘోరం జరుగుతుందని కల్లో కూడ అనుకోలేదు “అంటూ మళ్ళీ ఘొల్లుమంది

“అబ్బబ్బా ఏడుపు ఆపి అసలేమి జరిగిందో చెప్పి తగలడు” అన్నాడు సుబ్బారావు

“మరి సేల్స్ లో నేను చీరలు కొన్నాను కద అవి చూడండి ఎలా అయ్యాయో ఒక్క ఉతుక్కే” అని చూపించింది సుందరి..

“నువ్వు చీరలు కదా కొన్నది మరి కర్చీఫ్ చూపెడతావేంటి” అన్నాడు సుబ్బారావు

“అందుకే నేనేడిచేది ..కొన్నవి చీరలే కాని ఉతికితే అవి కర్చీఫ్లయ్యాయి”..అన్నది

“అందుకే సేల్స్ లో కొనొద్దు అని నే చెబుతాను కాని నువ్వు వినవు కద..ఇంతకీ ఈ రుమాళ్ళు ఎక్కడ కొన్నావు” అనడిగాడు సుబ్బారావు?

“యన్.చెంగన్న బ్రదర్స్ లో కొన్నాను” అన్నది  సుందరి

వెంటనే నెత్తిన చెంగేసుకున్నాడు సుబ్బారావు..

 

కాబట్టి మిత్రులారా 75% డిస్కవుంట్ దొరుకుతుందని వెళ్ళి మోసపోకండి..సేల్స్ లో జాగ్రత్తగా చూసి కొనుక్కోండి.

1 thought on “వెటకారియా రొంబ కామెడియా 6 – సేల్ బాబోయి సేల్!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *