May 18, 2024

ఆరాధ్య – 5

రచన: అంగులూరి అంజనీదేవిanjanidevi

 

 

 

 

            వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించి, తాళికట్టించి, తలంబ్రాలు పోయించాడు. ‘హమ్మయ్యా! ఒక పని అయిపోయింది’ అన్నట్లు తేలిగ్గా చూసి ”ఆడపడుచును పిలవండి! హారతి పట్టించాలి” అంటూ తొందరపెట్టాడు. ఆయనకు కడుపులో ఆకలి గంట చాలా గట్టిగా కొడుతోంది. అప్పటికే ఒక కమలాపండు ఒలిచి తినబోయి వీలుకాక పక్కన పెట్టేశాడు.

            వెంటనే కాశిరెడ్డి వాత్యల్యను పిలిచి ”అమ్మ చెప్పింది. హారతి నీచేత పట్టించమని” అంటూ వాత్యల్య చేత హారతి పట్టించాడు. హారతి పళ్లెంలో హేమంత్‌ వెయ్యిరూపాయల నోటును వుంచాడు. హారతి పళ్లెం పక్కన పెట్టి వెయ్యి రూపాయల నోటును పర్స్‌లో పెట్టుకుంది వాత్యల్య.

అది చూడగానే రమాదేవి అన్నయ్యభార్య సీతాలమ్మ ఏడ్చుకుంటూ కళ్యాణ వేదిక దిగింది. ఆమెను అందరూ విస్తుపోయి చూస్తున్నారు.

”ఎందుకేడుస్తున్నావ్‌ సీతాలమ్మా? నిశ్చితార్థం రోజు రమాదేవి, పెళ్లిరోజు నువ్వూ ఏడవాలని ముందే మాట్లాడుకున్నారా! పోటీలు పడి మరీ ఏడుస్తున్నారు” అంది రమాదేవి తోడికోడలు సరదాగా చూస్తూ.

సీతాలమ్మ తల నేలకేసి కూర్చుని ఏడుస్తూనే వుంది.

”ఛ… వూరుకో! ఏడ్చినకాడికి చాలు. వాళ్ల ఇంట్లో వుండి, వాళ్ల తిండి తింటూనే వాళ్ల పెళ్లి చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నట్లు ఎగిరెగిరి ఏడుస్తున్నావ్‌! ఏం పోయిందేం!” అందామె చనువుగా కోపంగా.

సీతాలమ్మ ముక్కు చీది కొద్దిగా తలవంచి కొంగుతో కళ్లు తుడుచుకుంటూ ”ఆరాధ్య పెళ్లిలో నా కూతురితో  హారతి పట్టించాలనుకున్నాను వదినా! పసిబిడ్డతల్లి అని కూడా చూడకుండా పక్కవూరిలో వుండే నా కూతుర్ని రప్పించాను. అది ఇక్కడ కూర్చుని లేచి వెళ్లేలోపలే వేరెవరితోనో హారతి పట్టించేశారు. నా కూతురుకి రావలసిన డబ్బులు ఆ పిల్లెవరో లాగేసుకుంటే ఏడవక, నవ్వాలా?” అంది.

”నవ్వక ఏడుస్తారా? హారతి ఎవరు పడితే ఏముంది? నీ కూతురే పట్టాలా? అయినా పట్టింది అమ్మాయేగా! అబ్బాయి కాదుగా! అసలు హారతి అనేది ఆత్మీయంగా ఎవరు పట్టినా మంచిదే! ఎవరో ఒకరు పట్టారు. అయిపోయింది. దానికి ఇంతగా ఏడ్చి రచ్చ చెయ్యాలా? నీ కూతురు మాత్రం సొంత చెల్లెలా? బాగానే ఏడ్చావ్‌లే! పెళ్లి చూడు” అంది.

అక్కడ నచ్చక పక్కకెళ్లి కూర్చుంది సీతాలమ్మ. అక్కడ కూడా ఏడుపే ”ఇదంతా ఆ కళ్యాణమ్మ పన్నాగం” అంటూ ఆమెను తిడుతూ కూర్చుంది. అసలే జిత్తులమారి నక్క అయిన సీతాలమ్మ తన మాటల గారడీతో అక్కడ కూర్చుని వున్న వాళ్లను తనవైపుకి తిప్పుకుంది. వాళ్లు పెళ్లి చూడకుండా ”అయ్యో! పాపం! సీతాలమ్మా!” అంటున్నారు.

ఇలాంటివాళ్ల వల్లనే ఏ కుటుంబంలోనైనా గొడవలకు పునాది పడేది. నాలుకలు చాపుకుంటూ మంచిని మింగేస్తున్న చెడును పోషిస్తున్నది కూడా ఇలాంటివాళ్లే! వీళ్లు మంచిని చూడలేరు. ఆనందంగా వున్నవాళ్లను భరించలేరు. ఎప్పుడు చూసినా దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు ఆలోచనలు.

వధూవరులను కళ్యాణ వేదిక దగ్గర నుండి బయటకు తీసికెళ్లి ‘అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తాను. పైకి చూడండి’ అన్నాడు పురోహితుడు. హేమంత్‌ని ఆరాధ్య చేయిపట్టుకొని అరుంధతీ నక్షత్రంవైపు చూపించమన్నాడు.

ఒక్కక్షణం ఆగి ”కన్పించిందా?” అని అడిగాడు.

మబ్బుల్లేని ఆకాశం వర్షంతో కడిగినట్లు తేటగా వుంది. చలితో కూడిన ఎండ చుర్రుమనిపిస్తోంది. భృకుటి ముడిచి పైకి చూసిన హేమంత్‌ ముఖంలో క్వొశ్చన్‌మార్క్‌. ఆరాధ్య కూడా కళ్లు పెద్దవిచేసి ఆకాశంలో వెదుకుతోంది.

పురోహితుడు ”కన్పించిందా!” అనగానే ఏ వధూవరులైనా కన్పించిందన్నట్లు తలలు వూపుతారు. వీళ్లేంటి ఆకాశం మొత్తం వెతుకుతున్నారు? ఇన్ని పెళ్లిళ్లు చేసినా ఇలాంటి వాళ్లను చూడలేదు… ఏం పెళ్లో ఏమో! సంవత్సరం తిరగకముందే విడిపోయేవాళ్ల పెళ్లి కూడా ఇలా జరిగి వుండదు. ఆకలి దంచుతోంది. మనసులో గొణుగుతున్నాడు పురోహితుడు.

కాశిరెడ్డి హేమంత్‌ చెవిలో గుసగుసగా ”ఇద్దరు కలిసి కన్పించిందంటూ తలలు వూపండిరా! ఎండకి మాడు మండుతోంది. నిజానికి అక్కడ ఎవరికీ ఏమీ కన్పించదు. అలా చూపించటం ఆచారం. అంతే!” అన్నాడు.

”నాకు కన్పిస్తోంది” అన్నాడు వెంటనే హేమంత్‌.

ఆరాధ్య ఒప్పుకోలేదు.

”నీకు కన్పించేవరకు ఇక్కడే వుండాలా?” అని అడిగాడు హేమంత్‌.

”ఏం అవసరం లేదు. కన్పిస్తే ఎంత? కన్పించకపోతే ఎంత? నాకేమైనా అది అవసరమా?” అంటూ అహంకారంగా ఓ చూపు చూసింది. ఏమనుకుందో ఏమో ముఖాన్ని వేరేవైపుకి తిప్పుకుంది.

”సరే! పద!” అన్నాడు హేమంత్‌. అక్కడున్న వాళ్లు వెళ్లి భోజనాల దగ్గర కూర్చున్నారు.

అంతవరకు వాళ్లనే అంటిపెట్టుకొని వున్న వీడియో గ్రాఫర్లు, కెమెరామెన్లు, పురోహితుడు అదృశ్యమయ్యారు.

హేమంత్‌కి కళ్యాణమ్మ దగ్గర నుండి ఫోనొచ్చింది.

భోంచేస్తున్న హేమంత్‌ ”ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యి!” అన్నాడు ఆరాధ్య వైపు తిరిగి. ఆమె అప్పుడే వెజ్‌ బిర్యానీలో పెరుగు చట్నీ కలుపుకుంటూ స్క్రీన్‌ మీద ‘కళ్యాణి ఆంటీ’ అన్న ఇంగ్లీష్‌ లెటర్స్‌ని చూసి ముఖం అదోలా మార్చుకుంది.

హేమంత్‌ అదేం పట్టించుకోకుండా మొబైల్‌ని ఎడమచేత్తో అందుకుని కుడిచెవి దగ్గర పెట్టుకొని ”హలో… ఆంటీ!” అన్నాడు.

”పెళ్లి ఎలా జరిగింది?”

”బాగా జరిగింది ఆంటీ!”

”కానీ ఒక్కటే కొరతగా వుంది హేమంత్‌! పుష్కర కాలంలో పెట్టాల్సిన జీలకర్ర బెల్లం రాహుకాలంలో పెట్టారు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు. అసలెక్కడా ఇలా జరగదు. ఎందుకంటే పెళ్లి చెయ్యాలనుకున్నవాళ్లు ఆ టైం కోసం ముందే ప్రిపేరై వుంటారు”

”ఇక్కడ పద్ధతులు ఇంతే కావొచ్చాంటీ!” అన్నాడు. అది పెద్ద లోపంలా అన్పించలేదు అతనికి.

”ఆవిడ ఎవరండీ మా పద్ధతుల్ని వేలెత్తి చూపటానికి?” అని అడగాలని వున్నా అణచుకుంది ఆరాధ్య.

అప్పుడే అక్కడకొచ్చి కూర్చున్న సీతాలమ్మ ”ఏంటి బాబూ పద్ధతులంటున్నావ్‌! ఎవరూ మాట్లాడేది. కళ్యాణమ్మగారేనా? ఆవిడ ఎందుకు రాలేదట పెళ్లికి? మా రమాదేవి మీరు పంపిన ప్రధానంతో వచ్చినావిడకి జాకెట్‌ముక్క పెట్టలేదనేగా! పెళ్లి అంటేనే చిన్నచిన్న పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి. వాటిని అంతలా పట్టించుకోవాలా? ఆ విషయమేనా ఇప్పుడు నీతో మాట్లాడేది” అంది సీతాలమ్మ. కోపంలో ఏం మాట్లాడేది తెలియక మాట్లాడిందే కాని ప్రధానం పట్టుకొచ్చిన వాళ్లకి రమాదేవి మర్యాదలు చెయ్యలేదన్న విషయం హేమంత్‌కి తెలియాలని కాదు. తెలిస్తే పర్యవసానం బాగుండదని తెలియని అమాయకురాలు కూడా కాదు. కానీ పెళ్లిలో తన కూతురు కాకుండా వాత్సల్య హారతి పట్టిందన్న కసితో ఏదో మాట్లాడబోయి ఇది మాట్లాడింది.

తలకొట్టుకుంది ఆరాధ్య.

హేమంత్‌ కూల్‌గానే ”కళ్యాణి ఆంటీ అదేం మాట్లాడలేదాంటి! పెళ్లి ఆలస్యంగా ఎందుకు జరిగింది అని అడుగుతోంది” అన్నాడు. ”ఒక్క నిముషం ఆంటీ!” అంటూ కళ్యాణమ్మను లైన్లో వుంచాడు.

సీతాలమ్మ ఇదే అవకాశం అన్నట్లు ”ఎందుకు జరిగిందీ అంటే ఏం చెప్పాలి? ఈ మధ్యన పెళ్లిపనుల్లో పడి మేమందరం బాగా అలసిపోయాం. రాత్రంతా సాంగ్యాలు చేసుకున్నాం. ఉదయాన్నే నిద్రలేవలేకపోయాం.  అప్పటికీ అందరం కిందా మీదా పడి చేస్తూనే వున్నాం. పది గంటల వరకు జనాలు వస్తూనే వున్నారు. టిఫిన్లు తింటూనే వున్నారు. పనివాళ్లు లేరు. అన్ని పనులు మేమే చేసుకున్నాం. అందుకే పదిగంటల ముహూర్తానికి అందుకోలేకపోయాం” అంది.

”ఇదంతా వింటుంటే హోటల్‌ నడిపినట్లుంది,  పెళ్లిచేసినట్లు లేదు. ఎన్ని పనులు వున్నా, ఎంతమంది వచ్చి టిఫిన్లు తిన్నా అబ్బాయిని, అమ్మాయిని ముందుగా కళ్యాణమండపానికి పంపి వుంటే బాగుండేది. మీరలా చెయ్యలేదు” అన్నాడు కాశిరెడ్డి.

”ఏదో చేసినకాడికి చేశార్లే కాశిరెడ్డి! జరిగిపోయిన పెళ్లికి బాజాలెందుకు? నువ్వు తిను. వాధించకు” అంది సీతాలమ్మ.

”నాది వాదన కాదాంటీ! జరిగిన విషయం చెబుతున్నా. ఇలా జరిగి వుండాల్సింది కాదూ అని బాధపడుతున్నా. ఎందుకంటే మీ ఊరిలోనే మీరంతా కలిసి ముహూర్తం పెట్టించారు. దాని ప్రకారమే మమ్ముల్ని రమ్మన్నారు. వచ్చాం. ఎన్నో పనులు పోగొట్టుకొని ఎందరెందరో వచ్చారు. టైంకు పెళ్లి చెయ్యలేనప్పుడు ముహూర్తం ఎందుకు పెట్టించారు? ఫలానా టైంకు రమ్మని అందరికి శుభలేఖలు ఎందుకు పంచారు? గురువారం పెళ్లి వుందని పిలుపులు పంపి శుక్రవారం చేస్తారా ఎవరైనా?” అడిగాడు.

”చూడు కాశిరెడ్డి! జరిగిందేదో జరిగిపోయింది. నాకు తెలిసి ఎవరూ కూడా అనుకున్న టైంకు పెళ్లిళ్లు చెయ్యలేరు. అదీకాక, ఈ పెళ్లికి వచ్చిన వాళ్లలో సగంమందే బంధువులున్నారు. మిగతా సగం మంది మా శాంతారాం కష్టమర్లు, వాళ్ల తమ్ముళ్ల బంగారు షాపులకి వచ్చి కొనేవాళ్లు. వాళ్లను కొంచెం కనిపెట్టుకొని వుండాలి కదా అన్నట్లు  దగ్గరుండి మర్యాదలు చెయ్యడంలో పడి కాస్త జాప్యం జరిగింది” అంది సీతాలమ్మ.

కాశిరెడ్డి నవ్వి ”ఇది పెళ్లిలా లేదు. బిజినెస్‌ వ్యవహారంలా వుంది” అన్నాడు. అతను వాళ్ల అన్నయ్య పెళ్లిళ్లను దగ్గరుండి చూశాడు కాబట్టి ఈ పెళ్లిలో జరిగిన లోపాలను వెంటనే గ్రహించగలుగుతున్నాడు.

హేమంత్‌కి అవేం తెలియటం లేదు. పెళ్లికొచ్చిన జనం, బ్యాండ్‌మేళాలు, ఫంక్షన్‌హాలు, పురోహితుడు బిగ్గరగా చదివిన మంత్రాలు ఇవే కన్పిస్తున్నాయి. ఇవి తను చూసిన పెళ్లిళ్లకన్నా తన పెళ్లిలోనే ఎక్కువగా వున్నట్లు అన్పించి చాలా హ్యాపీగా వున్నాడు. కానీ వాళ్ల మాటలు విని కలవరపడుతున్నాడు.

ఆరాధ్య హేమంత్‌ మూమెంట్స్‌ని అబ్జర్వ్‌ చేస్తోంది. కాశిరెడ్డి కొద్దిసేపు మాట్లాడకుండా వుంటే బాగుండు అనుకుంటోంది. కానీ కాశిరెడ్డి మాట్లాడుతూనే వున్నాడు.

ఆరాధ్య వాళ్ల ఇంటి పక్కావిడ కాశిరెడ్డి మాటలకి స్పందించి ”అదేం కాదులే బాబు! నువ్వలా ఏం అనుకోకు. ఇందులో బ్యూటీషియన్‌ హస్తం కూడా వుంది” అంది.

”బ్యూటీషియనా?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు కాశిరెడ్డి.

”అవును. ఆరాధ్యను డెకరేట్‌ చేసిన బ్యూటీషియన్‌ రావడమే ఆలస్యంగా వచ్చింది. అలంకరణ చెయ్యటం కూడా ఆలస్యంగానే చేసింది. తన వెంట తెచ్చుకున్న పార్లర్‌ సెట్‌ను ఆరాధ్య నచ్చలేదని మళ్లీ వేరే సెట్‌ని తెప్పించాల్సి వచ్చింది. అందుకే ఆలస్యం అయ్యింది” అంది.

వెంటనే ఆమె వైపు ఇప్పుడు అవన్నీ నువ్వు చెప్పటం అవసరమా అన్నట్లు చూసింది ఆరాధ్య.

సీతాలమ్మ కల్పించుకొని ”మా రమాదేవికి నేను ముందే చెప్పాను వదినా! పార్లరోళ్లను పిలిపించి డబ్బులెందుకు తగలేస్తావ్‌! ఇదేమైనా అందాల పోటీయా? మనలో ఎప్పుడైనా పెళ్లికూతుర్ని ముత్తయిదువులే అలంకరిస్తారు. మనం కూడా అలాగే చేద్దాం అని… కానీ ఆమె ఒప్పుకోలేదు. పైగా ”నా కూతురు నీకంత చీప్‌గా కన్పిస్తుందా? ముత్తయిదువుల చేత అలంకరిద్దాం అంటున్నావ్‌! అది సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది. ఒక సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిని ఎలా అలంకరించాలో ముత్తయిదువులకి ఏం తెలుస్తుంది? ఇంకెప్పుడూ అలా అనకు” అంటూ కసిరింది. అందుకే నేను నోరెత్తలేదు” అంది.

”మా మమ్మీ నిన్ను కసురుకోవటమే మంచిదయింది సీతాలత్తా! లేకుంటే మీరంతా కలిసి నన్ను చెత్తచెత్త చేసేవాళ్లు. వీడియోలో, ఫోటోస్‌లో నన్ను నేను చూసుకోలేక చచ్చిపోయేదాన్ని…” అంది.

”అలా వుండదులే ఆరాధ్యా! ముత్తయిదువుల అలంకరణలో జీవకళ వుంటుంది. ఇప్పుడు నీకు చేసింది ఆర్టిఫీషియల్‌గా వుంది. నేను మీ మమ్మీతో అప్పుడే చెప్పాను. ఎంత సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి అయితే మాత్రం మొత్తం పార్లర్‌ సెట్స్‌ పెట్టొద్దు. బంగారు నగలు కూడా వెయ్యండి! కనీసం అబ్బాయి వాళ్లు ప్రధానంలోకి పంపిన నగలైనా పెట్టండి అని… కానీ ఈ రోజుల్లో బంగారు నగలు ఎవరు పెడుతున్నారు. షో తగ్గుతుంది. ఒకదానికి ఒకటి మ్యాచ్‌ కావు అంటూ అన్నీ గిల్ట్‌ నగలే పెట్టించింది. వాటిమీదనే తలంబ్రాలు పోయించింది. తలంబ్రాలు అనేవి వున్నంతలోనే బంగారు నగల మీద పోస్తేనే మంచిది” అంది.

ఆరాధ్య వెంటనే ఆమె వైపు సూటిగా చూస్తూ ”ఇలా పోసుకుంటే మంచిది కాదా? నాకు తెలుసాంటీ మీరెందుకిలా అంటున్నారో! నేనీ డెకరేషన్లో బాగున్నాను. ఈ సెట్‌ కాని, ఈ చీరకాని, ఈ మేకప్‌ కాని నాకు చాలా బాగుందని అందరూ అంటున్నారు. మా మమ్మీకి నేను బాగుంటే చాలు. అందుకే మీరెన్ని చెప్పినా మా మమ్మీ వినలేదు. మా మమ్మీనే కాదు, నేను కూడా నాకు నచ్చని మాటలు ఎవరు చెప్పినా వినను. ఎందుకు వినాలి? ఎందుకు బాధపడాలి? అర్థమయిందిగా! అన్నం కొంచెం పెట్టుకోండి! సాంబారు చాలా బాగుంది” అంది.

సీతాలమ్మను సాంబారు గిన్నె అందుకోమని చెప్పి ”మనం కూడా అందరిలా మౌనంగా పెళ్లి చూసి వెళ్లిపోవాలి కాని ఇలా కల్పించుకొని మాట్లాడకూడదు. ఎంతయినా మనకేం తెలుసని? సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిల తెలివి ముందు మనమెంతని? వాళ్లు కూర్చున్న చోటు నుండి కదలకుండా వేళ్లతో నొక్కితే ప్రపంచం మొత్తం వచ్చి వాళ్ల కళ్లముందు వుంటుంది. మనం కాళ్లు అరిగేలా తిరిగినా మన ఊరిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేం!” అంటూ ఆరాధ్య వైపు చూడకుండా పక్కకి చూసింది.

”ఎంత తెలుసుకోలేకపోయినా అందరిలా మౌనంగా వుండటానికి మనమేమైనా పరాయివాళ్లమా! నువ్వేమో పక్కింటిదానివి, నేను మేనమామ భార్యను. వున్నదే మాట్లాడుకుంటున్నాం. కాశిరెడ్డి కూడా సబబుగానే మాట్లాడుతున్నాడు” అంది సీతాలమ్మ గొంతు బాగా తగ్గించి.

”ఏం సబబులే వదినా! అవతలవాళ్లకు చెడ్డకావటం తప్ప ఇంకేమైనా వుందా? ఇంతమంది జనంలో ఒక్కరన్నా శాంతారాం దగ్గరికెళ్లి ‘నీకుండేదే ఒక్క కూతురు. జీవితంలో పెళ్లికూడా ఒక్కసారే చేస్తావ్‌! అదేదో టైంకు చెయ్యకుండా ఇలా ఎందుకు చేశావ్‌?’ అని అడిగారా? అడగరు” అంది సీతాలమ్మకు మాత్రమే విన్పించేలా.

”వాళ్లదేం పోయింది. వాళ్లెందుకు అడుగుతారు? కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! పెళ్లికొడుకు, పెళ్లికూతురు సాఫ్ట్‌వేర్లు అయితే అవ్వొచ్చు. ఈ పెళ్లికొచ్చినవాళ్లలో కూడా సాఫ్ట్‌వేర్లు కొందరు వుంటే వుండొచ్చు. కానీ అందరూ సాఫ్ట్‌వేర్లు కాదు. అమ్మాయిని ఏ బ్యూటీషియన్‌ మేకప్‌ చేసింది? అద్భుతంగా, మోడరన్‌గా వుందే అని అనుకోటానికి. ప్రతి ఒక్కరూ మనలాగా ఆలోచించేవాళ్లే! పెదవి విరిచి వెళ్లిపోయేవాళ్లే! కానీ పెళ్లికి ఇంతమందిని పిలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి?” అంది పక్కింటావిడ.

”ష్‌! మెల్లగా మాట్లాడు. ఆరాధ్య వింటుంది. విన్నదంటే వాళ్ల మమ్మీకి చెప్పి నిన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టిస్తుంది. ఆరాధ్య కోపం మనకు తెలియంది కాదు” అంది పక్కింటావిడ.

వాళ్లేం మాట్లాడుకుంటున్నారో ఆరాధ్యకు విన్పించటం లేదు. ఆమె వాత్సల్యతో మాట్లాడుతోంది.

”చూడు వదినా! ఇక్కడ వున్నవాళ్లందరూ పెళ్లికొడుకు తరుపువాళ్లే! భోజనాలు చేస్తున్నారు. కనీసం ఒక్కసారన్నా మా శాంతారాం గాని, రమాదేవి గాని వచ్చి కన్పించారా? ఎంత నిర్లక్ష్యం కాకుంటే ఇలా ఎవరైనా వుంటారా?”

”ఇది కాశిరెడ్డి గమనించాడో లేదో? అయినా ఇలాంటి విషయాలను ఈ కాలం సాఫ్ట్‌వేర్‌ పిల్లలు గమనించలేదనుకుంటాం!” అంది సీతాలమ్మ.

”ఎందుకు గమనించడు. ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావ్‌! కళ్యాణమ్మ కొడుకు” అంది పక్కింటావిడ.

”ఎవరైనా రమాదేవి చేతిలో ఫట్‌!” అంటూ ఫక్కున నవ్వింది.

”ష్‌! వింటారు” అంది పక్కింటావిడ.

హేమంత్‌ మనసు కలుక్కుమంది.

వాళ్ల మాటలు ఆరాధ్యకు ఏమాత్రం విన్పించలేదు. ఎందుకంటే ఆమె, వాత్సల్య జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. మిగతావాళ్లకి విన్పిస్తున్నాయి. హేమంత్‌ ఆన్‌ చేసి పెట్టిన మొబైల్లోంచి కళ్యాణమ్మకు కూడా విన్పిస్తున్నాయి.

వాత్సల్య ఏదో గుర్తొచ్చిన దానిలా కాశిరెడ్డి పక్కకెళ్లింది. అతనికేదో చెప్పి అక్కడే కూర్చుంది.

అప్పుడు చూసింది ఆరాధ్య హేమంత్‌ మొబైల్‌ వైపు. దాన్ని వెంటనే ఆఫ్‌ చేసి ”విన్పించింది చాలు” అంది కోపంగా.

”ఏయ్‌! ఏమంటున్నావు నువ్వు? ఎందుకంత కోపం? నేను మీ మాటల్లో పడి కళ్యాణి ఆంటీతో మాట్లాడటం మరచిపోయాను”

”కొంపలేం మునిగిపోవు. మొబైల్‌ ఆఫ్‌ చెయ్యాల్సింది హేమంత్‌!” అంది ఆరాధ్య.

”మరచిపోయానని చెప్పానుగా!”

”మరచిపోయారా? మరచిపోయినట్లు నటిస్తున్నారా?” అంది. ఆమె పెదవులు అతి కోపంగా కదులుతున్నాయి. మాటలు హేమంత్‌కి తప్ప… పెద్దగా ఎవరికీ విన్పించటం లేదు.

”నువ్వీ మధ్యన ఎందుకంత డిస్టర్బ్‌డ్‌గా వుంటున్నావ్‌?”

”ఇది చెప్పండి ముందు. మీరు కావాలనే మీ కళ్యాణి ఆంటీకి ఇక్కడి విషయాలను మొబైల్లోంచి విన్పిస్తున్నారు కదూ?”

”అదేం కాదు ఆరాధ్యా! నువ్వలా వూహించకు…” చాలా నెమ్మదిగా అన్నాడు హేమంత్‌.

”నేను నమ్మను” అంది మొండిగా.

”నువ్వు చాలా మారావు” అన్నాడు కూల్‌గా.

”నేను మారలేదు. నా ఎక్స్‌పెక్టేషన్స్‌ మారాయి. నావాళ్లెవరో బయటవాళ్లెవరో తెలుసుకోలేకపోతున్నాను” అంది ఆరాధ్య.

హేమంత్‌ సైలెంటయిపోయాడు.

హేమంత్‌ దేన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు. ఒక్కోసారి అతను దేన్ని కేర్‌ చేస్తాడో, దేన్ని తీసేస్తాడో అర్థం కాదు. కన్పించని ఫిలాసఫి అతన్ని నిత్యం అంటిపెట్టుకునే వుంటుంది. చూసేవాళ్లకి చాలా డిఫరెంట్‌గా, టిపికల్‌గా అన్పిస్తాడు. అంత త్వరగా దేన్నీ బయటపడనీయడు. డ్రస్‌ విషయంలో కూడా అంతే! ఫ్రెండ్‌ చెప్పినా వినడు. ”నేను మోడల్‌ని కాను. జస్ట్‌ ఎంప్లాయ్‌ని. నాకు కంఫర్ట్‌ ముఖ్యం. నా పర్సనల్‌ లైఫ్‌ను కూడా నా డ్రస్‌లాగే వుంచుకుంటాను” అంటాడు.

అది గుర్తొచ్చి గోల్డ్‌షాపులో మోడల్‌ బొమ్మలా వున్న ఆరాధ్యను చూసి చిన్నగా నవ్వాడు హేమంత్‌.

అతనెందుకు నవ్వాడో అర్థంకాక తినటం మధ్యలో ఆపి లేచి నిలబడింది ఆరాధ్య. రెండు అడుగులు వెయ్యగానే కొంగుముడి అడ్డొచ్చి ఆగిపోయింది.

అది చూసి సీతాలమ్మ ”పురోహితుడు వీళ్ల కొంగుముడి విప్పకుండానే వెళ్లిపోయాడు వదినా! ఆయనేదో కంగారులో వున్నట్టున్నాడు. ఇంటికెళ్లాక దేవుని దగ్గర ఇద్దర్నీ నిలబెట్టి మనం విప్పుదాం! నువ్వు కూర్చో ఆరాధ్యా! హేమంత్‌ లేచాక ఇద్దరు కలిసి వెళ్లి చేతులు కడిగేసుకుందురు గానీ” అంది.

ఆ ముడివైపు చిరాగ్గా చూసింది ఆరాధ్య. ఆమె ముఖంలో తొలిసారిగా అంత విసుగును చూసి ఆశ్చర్యపోయాడు హేమంత్‌.

*****

భోజనాల అనంతరం పెళ్లికొడుకును, పెళ్లికూతుర్ని ఇంటికి తీసికెళ్లారు. రమాదేవి శాంతారాం వాళ్లు రోజూ పడుకునే మంచంమ్మీదనే ఓ కొత్త దుప్పటి వేసి వాళ్లిద్దర్ని కూర్చోబెట్టి బంతాట ఆడించారు.

మంచి సమయం దాటిపోకముందే అమ్మాయి అత్తగారింట్లో అడుగుపెట్టాలని సీతాలమ్మను తోడిచ్చి హేమంత్‌ వాళ్లొచ్చిన కార్లోనే హేమంత్‌ పక్కన కూర్చోబెట్టారు ఆరాధ్యను.

”అమ్మాయి వెంట తల్లిదండ్రీ మీరు వెళ్తే బావుంటుంది కాని నేనెందుకు? నేను వెళ్తాను. మీ మాట కాదనను. కానీ…” అంటూ ఆలోచించింది సీతాలమ్మ.

”నువ్వేం ఆలోచించకు వదినా! వెళ్లు. ఎక్కడివాళ్లం అక్కడ వెళ్లిపోతే ఇక్కడ ఇవన్నీ ఎవరు చూస్తారు. ఎవరివి వాళ్లకు అప్పజెప్పాలి కదా! ఫంక్షన్‌హాల్లో ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. వాటి లెక్కలు చూడాలి. మేమంతా రేపొస్తాం. రిసెప్షన్‌కి అందుకుంటాం” అన్నారు.

సీతాలమ్మను కార్లోకి నెట్టేశారు.

కారు కదిలింది.

*****

తెల్లవారకముందే వాళ్లంతా హైదరాబాదు చేరుకున్నారు.

కొత్త పెళ్లికూతురైన ఆరాధ్య హేమంత్‌ భార్యగా హేమంత్‌ ఇంట్లోకి అడుగుపెట్టింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి, వాళ్ల కోడళ్లు వాళ్లకి స్వాగతం పలికారు. ఇళ్లంతా కళకళలాడుతోంది.

స్నానాలు చేసి, టిఫిన్లు తిన్నారు.

కాశిరెడ్డి రాత్రికి రిసెప్షన్‌ ఏర్పాట్లు చూస్తున్నాడు.

శాంతారాం బంధువులు 40 మందికి పైనే దిగారు.

హైదరాబాద్‌ నగరంలో అంతమందికి వసతులు కల్పించటమంటే మాటలు కాదు. మూటలు కావాలి.

కాశిరెడ్డి ఓ ప్లాన్‌ వేసి లేడీస్‌ని లేడీస్‌ హాస్టల్లో, మగవాళ్లను అబ్బాయిల  హాస్టల్లో వుంచాడు. అదృష్టం ఏమిటంటే బి.టెక్‌ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్‌ అయిపోయి సెలవులు రావడంతో ఒక ఇరవై రోజులు హాస్టల్స్‌లో వుండకుండా ఇళ్లకెళ్లిపోయారు. ఆ ప్లేస్‌లో వీళ్లందర్నీ వుంచారు.

ఆరాధ్య తల్లిదండ్రులు బంధువులతో కలిసి హాస్టల్లో వున్నారే కాని ఆరాధ్య దగ్గరకి రాలేదు.

అది చాలా ఆశ్చర్యమనిపించి ఆలోచించసాగింది కళ్యాణమ్మ.

సీతాలమ్మ ఎంత చెప్పినా వినకుండా స్నానం చేశాక నైటీ వేసుకుంది ఆరాధ్య. చీర కట్టుకోలేదు. గాజులు మొత్తం తీసి పక్కన పెట్టింది. అదేం అంటే ”ఎప్పుడూ వేసుకుంటే కలర్‌ తగ్గుతాయి సీతాలత్తా! మళ్లీ వేసుకోవాలనిపించవు” అన్నదే కాని వాటిని చేతులకి వేసుకోలేదు. ఒక పెళ్లికాని అమ్మాయి ఎలా వుంటుందో అలా నైటీలో వున్న ఆరాధ్యను చూడగానే కళ్యాణమ్మ, ఆమె కోడళ్లు విస్తుపోయారు.

కళ్యాణమ్మ సీతాలమ్మను పిలిచి ”కొత్త పెళ్లికూతురు ఇలాగేనా వుండేది…? చీర కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. చేతులనిండా గాజులు వేసుకోవాలి. కనీసం ఓ నెలరోజులైనా పెళ్లికళతో వుట్టిపడాలి. అన్నిరోజులు కాకపోయినా కనీసం రిసెప్షన్‌ అయ్యేంత వరకైనా పెళ్లికళతో వుండాలి. చూసేవాళ్లు ఏమనుకుంటారు. మన సంప్రదాయం మీకు తెలియదా? కొత్తగా పెళ్లయిన అమ్మాయి ఎలా వుండాలో, ఎలా అలంకరించుకోవాలో చెప్పుకోరా?” అంది.

సీతాలమ్మ తల నేలకేసి నిలబడింది. ఆతర్వాత తలపైకెత్తి ”ఇలాంటివి తల్లి దగ్గర వుండి కూతురికి చెప్పుకోవాలి. నేర్పుకోవాలి. మనం చెబితే కావాలని చెబుతున్నట్లు, ఏదో చెడు చెబుతున్నట్లుగా అనుకుంటారు. అందుకే ఒకసారి చెప్పి నేను వదిలేశాను” అంది భయపడుతూ.

”మంచిమాటలు చెప్పటానికి అంతగా భయపడతారేమండీ!”

”ఇవి మీకు మంచిమాటలు కావచ్చు. మా రమాదేవి విన్నదంటే వూరుకోదు. అసలు మా అమ్మాయితో మీకేం పని అంటుంది. అది బి.టెక్‌ నాలుగేళ్లు చదివింది. మీరు చెప్పినట్లు విని చేతులనిండా గాజులేసుకొని, ఒంటినిండా చీర కట్టుకోటానికా? అంటుంది. అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో మనం వెతుక్కోవాలి” అంది.

అవాక్కయింది కళ్యాణమ్మ.

సాయంత్రం నాలుగు గంటలు కావస్తుండగా రమాదేవి తోడికోడళ్లు, వాళ్ల కూతుళ్లు కాశిరెడ్డితో ”రిసెప్షన్‌కి ఆరాధ్యను మేకప్‌ చెయ్యటానికి ఎవరినైనా పిలుస్తున్నారా?” అని అడిగారు.

”లేదు. మా వదినలు చేస్తారు” అన్నాడు కాశిరెడ్డి. అతని వదినలిద్దరు బి.టెక్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్స్‌ చేస్తున్నారు.

వాళ్లు ఎగతాళిగా నవ్వి ”మీరేదో గ్రాండ్‌గా చేస్తారనుకున్నాం. ఇదేనా చెయ్యటం?” అన్నారు. వాళ్లు అడుగుతున్న విధానం అతనికి నచ్చలేదు. వాళ్ల నవ్వును కూడా భరించలేకపోయాడు.

వెంటనే హేమంత్‌తో మాట్లాడి బ్యూటీషియన్ని పిలిపించాడు కాశిరెడ్డి.

బ్యూటీషియన్‌ వచ్చి ఆరాధ్యను అలంకరిస్తున్న సమయంలో కళ్యాణమ్మ రిసెప్షన్‌కి వచ్చిన ఆడవాళ్లందరికి పసుపు రాసి, బొట్టు పెట్టి చీరలు, జాకెట్లు పెట్టింది. రిసెప్షన్‌ అయిన వెంటనే ఎక్కడివివాళ్లు అక్కడ వెళ్లిపోతారు. కాబట్టి అందరికీ అందొచ్చు అందకపోవచ్చని ఆమె ముందుగానే పెట్టేసింది.

ఆరాధ్యను రెడీ చేశారు. ఆమెకు కట్టిన శారీ నిండా హెవీ వర్క్‌ వుండి చాలా గ్రాండ్‌ లుక్‌ వచ్చింది. ఆ చీరలో ఆరాధ్య ప్రాణమున్న శిల్పంలా అద్భుతంగా, అపూర్వంగా వుంది. హేమంత్‌ కూడా స్పెషల్‌గా డిజైన్‌ చేయించిన డిజైనర్‌ వేర్‌లో ఆమెతో పోటీపడుతున్నట్లు చూడటానికి చాలా బాగున్నాడు.

రిసెప్షన్‌ హాల్‌ పూర్తిగా ఎ.సి. కావటంతో వచ్చిన వాళ్లంతా హాయిగా కూర్చున్నారు. చక్కటి మ్యూజిక్‌తో కూడిన పాటల్ని వింటున్నారు. డాన్స్‌ చూస్తున్నారు.

జంటలు, జంటలుగా వెళ్లి వేదికపై వున్న ఆరాధ్య, హేమంత్‌లను ఆశీర్వదించి ఫోటోలు దిగి డిన్నర్‌ హాల్లోకి వెళ్తున్నారు.

…వున్నట్లుండి డిన్నర్‌ హాల్లో కలకలం మొదలైంది. అదెందుకో ఎవరికీ అర్థం కాలేదు.

రిసెప్షన్‌ హాల్లో కూర్చుని వున్న శాంతారాంకి భార్య కన్పించక పోవటంతో భార్యను వెదుక్కుంటూ లేచి వెళ్లాడు. ఆమె అప్పుడే డిన్నర్‌ హాల్లోంచి బయటకొచ్చి లిఫ్ట్‌ దగ్గర నిలబడి కళ్లు తుడుచుకుంటోంది.

ఆమె కన్పించగానే ”ఏం జరిగిందే! ఇక్కడెందుకున్నావ్‌?” అని శాంతారాం కంగారు పడుతూ అడిగాడు.

ఆమె ఇంత నోరును అంత చేసి ”ఎందుకున్నానా? తీసుకొచ్చావుగా మనవాళ్లనందర్ని చార్జీలు పెట్టుకొని. వాళ్లు నన్ను అంటున్న మాటలు వినలేక ఇక్కడకొచ్చి నిలబడి ఏడుస్తున్నా…” అంది. ఏడ్చేది తన భర్త క్లియర్‌గా చూశాడో లేదోనని…

”ఛ.. వూరుకో! వాళ్లు నిన్నేమంటారు. వాళ్లు మనవాళ్లేగా!” అన్నాడు.

”మనవాళ్లే! కళ్యాణమ్మ పెట్టిందిగా అందరికి రంగురంగుల చీరలు. నేను వాళ్లకి ఒక్క జాకెట్‌ ముక్కన్నా పెట్టలేదట. మర్యాదలు చెయ్యలేదట. దెప్పుతున్నారు. కళ్యాణమ్మను పొగుడుతున్నారు. ఇదేం కర్మనో ఏమో! అందుకే నేను మీకు ముందే చెప్పాను. ఇంతమందిమి వద్దు. మనం మాత్రమే రిసెప్షన్‌కి వెళ్దామని. విన్నారా? మన బంధువులందరికి హైదరాబాదు చూపించాలన్నారు. నన్ను తిట్టిస్తున్నారు” మళ్లీ ముక్కు చీదింది.

శాంతారాం మెత్తబడి ఆమె భుజం నిమురుతూ ”ఇవన్నీ మనసులో పెట్టుకుంటే నీకు మళ్లీ బి.పి. డౌనై ఇబ్బందవుతుంది. వచ్చి లోపల కూర్చో!” అంటూ నచ్చచెప్పాడు. బ్రతిమాలాడు.

”వస్తాన్లే! నువ్వెళ్లి కూర్చో!” అని మొండిగా ఆయన చేతిని దులిపేసింది.

ఆమె తత్వం తెలుసు కాబట్టి ఆయన వెళ్లి లోపల కూర్చున్నాడు.

ఆమె అక్కడ నుండి కదల్లేదు. డోర్‌ దగ్గర వున్న గ్లాసులోంచి డిన్నర్‌ హాల్లోకి చూస్తోంది. అక్కడ తింటున్న వాళ్లంతా ఇంకా తన గురించి ఏమేమి అనుకుంటున్నారో అని వాళ్లందరి ముఖాల్లోకి, నిక్కినిక్కి చూస్తోంది.

ముఖ్యమైన గెస్ట్‌లను డిన్నర్‌హాల్లోకి తీసికెళ్లిన కళ్యాణమ్మ బయటకొస్తూ రమాదేవి కన్పించగానే ”ఏమ్మా! ఇక్కడున్నావ్‌? ఎవరికోసం చూస్తున్నావ్‌?” అని చాలా ఆత్మీయంగా నవ్వుతూ అడిగింది.

రమాదేవి ముఖం మాడ్చుకొని ”ఎవరికోసమో ఎందుకు చూస్తాను. నీకోసమే చూస్తున్నాను. ఇదంతా నీవల్లనే జరిగింది. మావాళ్లంతా నాకు చెడ్డయిపోయారు” అంది.

కళ్యాణమ్మ కంగుతిన్నది ”ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల చెడ్డయిపోవటం ఏమిటి?” ఆమెకు అర్థంకాక అయోమయంగా చూసింది.

”ఏమిటా? మావాళ్ల నెవరినీ నువ్వు ఫోటోలు దిగమని పిలవలేదట. ఇదిగో ఈ డోర్‌ దగ్గర నిలబడి రిసీవ్‌ చేసుకోలేదట”

కళ్యాణమ్మ ఆమెను మధ్యలో ఆపి ”నేను ఫోటోలకి మీవాళ్లనే కాదు ఎవరినీ పిలవలేదు. ఎవరిపాటికి వాళ్లు వేదికపైకి వెళ్లి దంపతుల మీద అక్షింతలు వేసి ఫోటోలు దిగి వెళ్తున్నారు. రిసీవింగ్‌ అనేది మా కాశిరెడ్డి, హేమంత్‌ ఫ్రెండ్స్‌ చేసుకుంటున్నారు. నాతో నువ్వింత కోపంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నావో ఏమో!” అంది.

”ఎందుకా? పెట్టావుగా అందరికి చీరలు. అవి మావాళ్లకెవరికి నచ్చలేదు. నిన్ను తిడుతున్నారు. వచ్చిన వాళ్లని ప్రేమగా పలకరించాలి. మర్యాదగా చూసుకోవాలి కాని ఈ బోడి చీరలు కోసం, తిండికోసం వస్తామా అన్నారు. తినకుండానే అలిగి కిందకెళ్లిపోయారు” అంటూ పాములా బుసకొట్టింది.

”అవునా? ఆపలేకపోయావా? నన్ను పిలవలేకపోయావా?”

”ఏం పోవాలో ఏమో నాలాంటివాళ్లకు ఇలాంటి మాయలు ఎలా తెలుస్తాయి. అందరూ నాలాంటి వాళ్లే అని నేను అనుకున్నాను. కాని మీరిలా కూడా చెయ్యగలరని నాకు తెలుసా? మాలో మాకు గొడవలు పెట్టి కూర్చున్నావు”

”గొడవలా?”

”అవును. గొడవలే! వాళ్ల పెళ్లిళ్లకు మేం వెళ్లొద్దట. మా పెళ్లిళ్లకు వాళ్లు రారట. వాళ్లు నన్ను ఎలా దులిపి వెళ్లారో నీకేం తెలుసు? ఏం రిసెప్షనో ఏమో! దీనివల్ల మా వాళ్లంతా మాకు దూరమయ్యేలా వున్నారు. మా తోడికోడళ్లు ఒక్కరు కూడా డిన్నర్‌ చెయ్యలేదు. ఏడ్చుకుంటూ వెళ్లారు” అంటూ అబద్దం చెప్పింది.

”అయ్యో! అలాగా!” అంటూ లిఫ్ట్‌ పనిచెయ్యకపోయినా నాలుగు అంతస్థులు మెట్లు దిగి కిందకెళ్లింది కళ్యాణమ్మ.

వాళ్లు ఎక్కడున్నారో వెదికింది. విజిటింగ్‌ రూంలో కొంతమంది కూర్చుని వున్నారు.

వెంటనే వాళ్ల దగ్గరకి వెళ్లి వాళ్ల చేతులు పట్టుకొని ”క్షమించండమ్మా! మేము చేసిన మర్యాదల్లో ఏదైనా లోపాలు వుంటే ఇంకోసారి వాటిని రాకుండా చూసుకుంటాం! ఇప్పుడైతే పైకి రండి! తినకుండా వెళ్లకూడదు” అంది.

వాళ్లు బిత్తరపోయి చూశారు.

”మేము చేసిన పొరపాట్లకి మీరు రమాదేవిని మాటలు అనొద్దు. పాపం ఆవిడేం చేస్తారు? ఏదైనా వుంటే మమ్మల్ని అనండి! అన్నం మాత్రం తినండి!” అంది చేతులు వదిలి గడ్డం పట్టుకుంటూ.

”మీరు పెద్దవారు. మర్యాదస్తులు. మా చేతులు, గడ్డాలు పట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి! కాశిరెడ్డి ఉదయం నుండి మాకు మర్యాదలు చేస్తూనే వున్నాడు. ఎంత బాగా చేశాడు అంటే అడుగడుగున ఫ్లేట్లో సప్లై చేసినట్లు చేశాడు. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంది. అది తిన్నాకనే అక్కడ పెళ్లికన్నా ఇక్కడ రిసెప్షన్‌ బాగుందని రమాదేవితో అన్నాం. అది తప్పు అయిందావిడకి. తెగ రోషపడిపోయింది. డిన్నర్‌ చేస్తున్న మాతో గొడవ పెట్టుకొంది. దానితో ఎప్పుడూ ఇంతే! ‘ఊ’ అన్నా గొడవే! ‘ఆ’ అన్నా గొడవే! మాకు ముందే తెలుసు అది పెద్ద కంపునోరు అని… అందుకే ఇటొచ్చి కూర్చున్నాం. అది హైదరాబాదు వెళ్లినా మారదు. అమెరికా వెళ్లినా మారదు. దాని స్పీడూ తగ్గదు. దాని నోరూ తగ్గదు” అంటూ వాళ్లలో కాస్త లావుగా వున్నామె ఆగకుండా మాట్లాడింది.

ఉలుకూ, పలుకూ లేకుండా అలాగే చూస్తోంది కళ్యాణమ్మ.

వెంటనే రమాదేవి చిన్న తోడికోడలు ఆవేశంగా రొప్పుతూ లేచి చేతులు తిప్పుతూ ”వాళ్లు చేసిన పెళ్లి చూసి మేం ఓర్వలేకపోతున్నామట… కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నామట. ఆ మాటలు ఎంత ఘోరంగా వున్నాయ్‌! ఆ మాత్రం ఆడపిల్ల మాకు లేదా? ఈ మాత్రం పెళ్లి మా ఆడపిల్లలకి మేం చెయ్యలేమా? నిప్పులు పోసుకుంటున్నామట. అసలు మేం మా అమ్మాయిల కోసం చేసే షాపింగ్‌లో ఒక్క శాతం షాపింగ్‌ కూడా ఆరాధ్య కోసం చెయ్యదు. మేం మా అమ్మాయిలకి పెట్టుకునే తిండిలో హాఫ్‌ శాతం తిండి కూడా ఆరాధ్యకు పెట్టదు. ఎప్పుడు చూసినా షాపులో అమ్ముకుంటూ కూర్చుంటుంది. పైకేమో ”నిన్ను మేం ఎంత బాగా పెంచుకుంటున్నాం ఆరాధ్యా! ఎంత బాగా చూసుకుంటున్నాం. మాలాగా ఎవరూ చూసుకోరు” అంటూ కన్న కూతురు దగ్గరే బుసలు కొడుతుంది. బయటవాళ్లతో కూడా అలాగే చెబుతుంది. ఆవిడ నాటకాలు మాకు అలవాటే! మీకు కొత్త” అంది.

కళ్యాణమ్మ అప్రతిభురాలై అలాగే చూస్తోంది.

ఆమె అంతటితో ఆగకుండా మళ్లీ అందుకొంది.

”రిసెప్షన్‌ వుందని మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందా? ఉదయం నుండి మా కంటికి కన్పించకుండా ఎక్కడో పడుకొని నిద్రపోయింది. ఇప్పుడేమో వెళ్లి ముందు వరసలో కూర్చుంది. మమ్మల్నేం పట్టించుకుంది? ఈ పెళ్లికోసం వేలరూపాయలు ఖర్చుపెట్టుకొని షాపింగ్‌లు చేసుకున్నాం. కనీసం ఫోటోలకైనా పిలిచిందా? బంధువులం కదా! అలాగేనా ఆవిడ మాతో వుండాల్సింది. మీరు నిశ్చితార్థం వచ్చి వెళ్లాక మమ్మల్ని కూడా చాలా మాటలు అన్నది తెలుసా! మీరు హేమంత్‌ అమ్మలాగా ఫోజు కొడుతున్నారట. అసలు మీరు నిజంగానే హేమంత్‌ అమ్మ అయితే ఇంకెలా వుండేదోనట” అని ఆమె ఇంకా ఏదో అనే లోపలే భార్యను వెతుక్కుంటూ శ్రీనివాసరెడ్డి వచ్చాడు.

భర్తను చూడగానే కళ్యాణమ్మ ఒక్కక్షణం కూడా అక్కడ నిలబడకుండా ”కారు తీసుకురండి! వెళ్లిపోదాం!” అంది.

”మధ్యలో వెళ్తే బావుండదు. ఇంకొద్దిసేపు వుండి వెళ్దాం కళ్యాణీ!” అన్నాడు శ్రీనివాసరెడ్డి.

”ఉన్నది చాలు. కాశిరెడ్డి వున్నాడుగా. బయలుదేరండి!” అంటూ త్వరగా నడిచి రోడ్డుమీదకెళ్లి నిలబడింది.

కారు తీసుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి. కళ్యాణమ్మ కార్లో కూర్చుని ఇంటికెళ్లిపోయింది.

*****

రిసెప్షన్‌లో కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి కన్పించకపోవటం ఆశ్చర్యం వేసింది హేమంత్‌కి… కాశిరెడ్డిని అడిగితే హెల్త్‌ బాగుండక వెళ్లిపోయిందని చెప్పాడు. వెంటనే ఫోన్‌ చేస్తే ఆమె కాని, శ్రీనివాసరెడ్డి కాని లిఫ్ట్‌ చెయ్యలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా అలాగే జరిగింది. వాళ్లలా మాట్లాడకుండా మౌనంగా వుండిపోవడంతో విషయం తెలియక బాధపడ్డాడు హేమంత్‌.

రిసెప్షన్‌ జరిగిన మరుసటి రోజే ఆరాధ్య తను లోగడ వున్న హాస్టల్లోంచి షిఫ్టయి హేమంత్‌ దగ్గరకి వచ్చింది. హాస్టల్‌ పూర్తిగా వెకేట్‌ చేసింది.

ఎప్పటిలాగే ఆఫీసుకి వెళ్తోంది. ఆరాధ్య పని చేసేది హేమంత్‌ వాళ్ల కంపెనీలోనే అయినా వర్కింగ్‌ అవర్స్‌లో ఇద్దరికి ఏమాత్రం టచెస్‌ వుండవు. టైమింగ్స్‌ కూడా ఒకేలా వుండవు. ఈవినింగ్‌ టైంలో ఇంటికి ఒకరు ముందొస్తే ఒకరు వెనక వస్తారు. దానికి కారణాలు చాలా వుంటాయి. అవి పైకి చెప్పుకునేంత పెద్దవి కావు. అలా అని వదిలేసేంత చిన్నవి కావు.

హేమంత్‌ ఇంటికొచ్చిన గంట తర్వాత వాత్సల్య స్కూటీ మీద ఇంటికొచ్చింది ఆరాధ్య.

రాగానే హేమంత్‌ మీద విసుక్కుంటూ ”ఎన్నిసార్లు అడగాలి స్కూటీ కొనిమ్మని. వినీ విననట్లు ఎందుకింత పోస్ట్‌పోన్‌ చేస్తున్నారు?” అంది.

”నా దగ్గరేమైనా డబ్బులుండి కొనివ్వటం లేదా? అర్థం చేసుకోవేం?” అన్నాడు హేమంత్‌.

”మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు. సిటీబస్‌లో రోజూ నిలబడి ఆఫీసుకెళ్తున్నాను. ఎవడెక్కడ తాకుతాడో తెలియదు. రోజూ గొడవ పెట్టుకుంటూ వెళ్లాలా? ఒక్కరోజు కూడా నాకు సీటు దొరకటం లేదు. ఆఫీసు అవర్స్‌లో బస్‌ జర్నీ ఎలా వుంటుందో మీకు తెలుసు. మీకేం జంట్స్‌. ఎలాగైనా వెళ్లగలరు. నా పరిస్థితి అలా కాదుగా?” అంది. మొన్నటి వరకు ఆమె వెళ్లింది బస్‌లోనే… కానీ పెళ్లయ్యాక కూడా అలాగే వెళ్లటం షేమ్‌గా వుంది. ఫ్రెండ్స్‌ కూడా అడుగుతున్నారు ”మీ ఇద్దరు ఏంటే కారులో వెళ్లాల్సిన వాళ్లు బస్‌లో వెళ్తున్నారు. మరీ ఘోరంగా…” అంటున్నారు ముఖంమ్మీదే!

”మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకయితే స్కూటీ కావాలి. వాత్సల్యను రోజూ డ్రాప్‌ చెయ్యమని అడగలేకపోతున్నా…” అంది.

”అప్పు ఐతే చెయ్యలేను. రెండు సంవత్సరాలుగా నేను సంపాయించి అకౌంట్లో దాచుకున్న ఐదు లక్షల్లో మూడు లక్షలు నీ నగలకి, రెండు లక్షలు రిసెప్షన్‌కి అయిపోయాయి. రిసెప్షన్‌కి రెండు లక్షలు సరిపోక ఇంకో రెండు లక్షలు బయట తేవలసి వచ్చింది. వాటికోసం ప్రతినెలా నా శాలరీలో సగం శాలరీ కట్‌ అయిపోతోంది. ఇంతకన్నా కటింగ్స్‌ పెడితే నెల మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నువ్వెంత అడిగినా నేను మాత్రం స్కూటీ కొనివ్వలేను. రెండు లక్షలు అప్పు తీరేంత వరకు నన్ను అడక్కు… అవునూ! నేనంటే నా టూ ఇయర్స్‌ సంపాదన రిసెప్షన్‌ కోసం, గోల్డ్‌ కోసం పెట్టాను. నువ్వు ఆరునెలలుగా జాబ్‌ చేస్తున్నావుగా! ఆ డబ్బుతో కొనుక్కోవచ్చుగా!” అన్నాడు.

ఆమె వెంటనే మాట్లాడకుండా ఒక్కక్షణం ఆగి ”ఆ డబ్బుల్లేవు. పెళ్లి ఖర్చులకి మా పేరెంట్స్‌ వాడేశారు” అంది.

”అదేంటీ! నాకంటే ఖర్చుపెట్టేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి నా అకౌంట్లో మనీని వాడేశాను. నీకేం! మీవాళ్లున్నారుగా! పెళ్లి వాళ్ల ఖర్చులతో చెయ్యలేదా? నీ మనీని ఎందుకు వాడారు?”

”నా మనీనే వాడారు”

”అదేం?”

”అదేం అంటే ఏం చెప్పాలి? కొద్దిసేపు మీ ప్రశ్నలతో విసిగించకుండా వుంటే బావుంటుందేమో!”

”అలాగే! కానీ నీకిప్పుడు స్కూటీ కావాలిగా! నీ శాలరీతో కొనుక్కో! ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చు”

”అది వీలుకాదు. నా శాలరీని మా మమ్మీకి పంపిస్తున్నాను. చిట్టీ కట్టమని… సేవింగ్స్‌ కావాలిగా!”

”సరే! పెళ్లిలో నేను నీకోసం కొన్న ఆర్నమెంట్స్‌ పట్టుకెళ్లి బ్యాంక్‌లో లోన్‌ తీసుకుందాం! అవి వున్నా నువ్వేం పెట్టుకోవటం లేదుగా! బీరువాలో వుండేదేగా! ఇలా వాడుకుంటే నీ అవసరం కూడా తీరినట్లవుతుంది” అన్నాడు.

ముందు వద్దన్నది ఆరాధ్య.

ఆ తర్వాత అతను పట్టుబట్టడంతో ఒప్పుకుంది.

మరుసటి రోజు బీరువాలో వున్న బంగారు ఆభరణాలను పట్టుకొని ఇద్దరూ బ్యాంక్‌కి వెళ్లారు.

మేనేజర్ని కలిశారు. ఆయన వాళ్లు చెప్పింది విని ”మీరెళ్లి హెడ్‌ క్యాషియర్ని కలవండి! మీ దగ్గరవున్న ఆర్నమెంట్స్‌కి ఎంత లోన్‌ వస్తుందో చెబుతారు. అంతా ఆయనే చూస్తారు” అని వాళ్లను హెడ్‌ క్యాషియర్‌ క్యాబిన్‌ దగ్గరకి పంపాడు. వాళ్లు వెళ్లి హెడ్‌ క్యాషియర్‌ని కలిశారు.

వాళ్ల దగ్గర వున్న ఆర్నమెంట్స్‌ని చేతిలోకి తీసుకొని వాటివైపు చూస్తూ ”మీకు లోన్‌ ఎంత కావాలి?” అని అడిగాడు హెడ్‌ క్యాషియర్‌.

”ఎంత వచ్చినా ఇవ్వండి!” అన్నాడు హేమంత్‌. స్కూటీకి కొంత పోయినా మిగిలింది అప్పుకి కట్టొచ్చన్న ఐడియాతో.

ఆయన వెంటనే ఆర్నమెంట్స్‌ను చెక్‌చేసే వాళ్ల బ్యాంక్‌ అప్రయిజెర్‌కి ఫోన్‌ చేసి పిలిపించాడు.

అప్రయిజర్‌ రాగానే ఆ ఆర్నమెంట్స్‌ని తీసుకొని చెక్‌ చేసి ఎంత ఫ్యూరిటీ వుందో చెప్పాడు. దానికి ఎంత అమౌంట్‌ వస్తుందో చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయాడు హేమంత్‌.

ఆ బ్యాంక్‌లో ఒక్క క్షణం కూడా కూర్చోకుండా ఆర్నమెంట్స్‌ని తీసుకొని ఆరాధ్యతో బయటకి నడిచాడు.

”విన్నావుగా! నా డబ్బుతో మీవాళ్లు కొన్న నగలు 22 క్యారెట్లు కావు. 17 క్యారెట్లు. అంటే 3 లక్షలు తీసుకొని 2 లక్షలకు మాత్రమే కొన్నారు. మిగతా డబ్బులు నొక్కేశారు. దీన్ని మోసమంటారా? నిలువు దోపిడి అంటారా? ఏమంటారో చెప్పు” అన్నాడు కోపంగా.

ఆమె నుండి సమాధానం లేదు.

”ఇది నీకు తెలిసి జరిగిందా? తెలియకుండానే జరిగిందా?”

ఆమె ఏం మాట్లాడలేదు.

”పెళ్లి అనుకున్నప్పటి నుండి మీవాళ్లు ఎలాంటి వాళ్లో అంతో, ఇంతో తెలుస్తున్నా మరీ ఇంత దగా కోరులనుకోలేదు. ఎవరైనా సొంత కూతురికి చేయించే నగల్లో మోసం చేస్తారా? ఎంత నీచులే మీవాళ్లు! తు… ఛీ… అసలు నిన్ను వాళ్లు ప్రేమతో పెంచారా? మోసంతో పెంచారా?”

ఏదో మాట్లాడబోయింది ఆరాధ్య.

”మాట్లాడే అర్హతను పోగొట్టుకున్నావు నువ్వు. నోరెత్తకు. ఎత్తావంటే చంపేస్తాను. అసలు వాళ్లు నిన్నెంత అవమానించారో తెలుసా? తెలిస్తే వాళ్లను నువ్వు జీవితంలో క్షమించవు. కానీ నీకేం తెలియదు. నీది పిచ్చి ప్రపంచం. వాళ్లది మాయా ప్రపంచం. అన్ని మాయలు వాళ్లకి తెలుసు. ఎవర్ని ఎలా మోసం చెయ్యాలో తెలుసు. ఎలాంటి మోసం చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసు. నిజంగా మీవాళ్లు మనుషులు కారే! దొంగలు. దొంగల్ని మించిన దొంగలు” అన్నాడు ఆవేశంగా.

”మావాళ్లని దొంగలంటారా?” కళ్లు పెద్దవి చేసి చూసింది.

”దొంగలు కూడా తన ఒడిలో పెంచుకున్న ఆడపిల్లకి మంచినగలే చేయిస్తారు. మీవాళ్లు అదికూడా చెయ్యలేదు. అసలు మీవాళ్లకి ఏం తెలుసే! మాయలు, మోసాలు తప్ప… ఎప్పుడు చూసినా గొడవలు. ఎక్కడికెళ్లినా గొడవలు. మన రిసెప్షన్‌ రోజు విడిది కోసం ఏర్పాటు చేసిన హాస్టల్లో ఆ రాత్రంతా నిద్రపోకుండా మీవాళ్లేం చేశారో తెలుసా? కిటికీలు, తలుపులు మూసుకొని గోలగోలగా అరుచుకున్నారట. కొట్టుకోవటం ఒక్కటే విన్పించలేదు కాని పెద్ద గొడవే జరిగిందని వార్డెన్‌ చెప్పింది. అప్పుడే అర్థమైంది నాకు మీవాళ్ల బుద్ధులు మారవని… కుళ్లు బుద్ధులు, కుట్ర బుద్ధులు”

”ఎన్ని మాటలు అంటున్నారండీ మావాళ్లని…”

”ఉత్తపుణ్యానికేం అనటం లేదు. కడుపు మండి అంటున్నాను. అప్పుడేమో రిసెప్షన్‌కి వచ్చి బ్లేమ్‌ చేసి వెళ్లారు. ఇప్పుడేమో బంగారం ఇలా చేసి డబ్బులు మిగిలించుకున్నారు. అసలు నిన్ను చేసుకున్నప్పటి నుండీ నాకేదో పట్టుకుంది. నెత్తిన కూర్చుంది. విపరీతమైన మోసాలు జరిగిపోతున్నాయి. నేనేమైనా మీవాళ్లను అది కావాలి, ఇది కావాలి అని అడిగానా? కట్నం కావాలన్నానా? కారు కొనిమ్మన్నానా? నువ్వే అన్నావ్‌ మావాళ్లు డబ్బులిస్తారు, బంగారం ఇస్తారు. లాండ్‌ కొనిస్తారు అని… అవన్నీ ఏమో తెలియదు  కాని నా అకౌంట్లో మనీ మొత్తం ఖాళీ అయింది” అన్నాడు.

ఆమె డల్‌గా చూస్తూ, నెమ్మదిగా నోరు విప్పి ”నేను మావాళ్లతో మాట్లాడతాను. మీరింకేం మాట్లాడకండి!” అంది.

”ఏం మాట్లాడతావే నువ్వు? ఏ రంగంలో వాళ్లు ఆ రంగంలో ఈజీగా మోసాలు చేస్తారని విన్నాను కానీ మరీ ఇంటి అల్లుడినే చేస్తారను కోలేదు. వీడికెవరూ లేరు. అడిగేవాళ్లు అంతకన్నా లేరనేగా మీవాళ్ల ధీమా! కానీ నేను మీవాళ్లను వదలను. మీ బంధువుల్లో టివి 9లు, టివి 5లు ఎవరో తెలుసుకొని వాళ్ల దగ్గరకి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి మీవాళ్ల పరువు తీస్తాను” అన్నాడు.

ముఖం ఎర్రబడేలా చూస్తూ ”అలా తీస్తే ఏమొస్తుంది మీకు?” అంటూ అరిచింది ఆరాధ్య.

”ఇంకెవరూ ఆడపిల్లకి చేయించే బంగారు నగల్లో ఇలాంటి కక్కుర్తి చెయ్యకుండా వుంటారు. అల్లుడిని నష్టపెట్టకుండా వుంటారు” అన్నాడు.

”అయితే సరే! తిట్టినకాడికి చాలు. ఇక మావాళ్లను తిట్టకండి!” అంది రోషంగా తల ఎగరేసి, అప్పటికే ఆమె కళ్లు కదిలిస్తే వర్షించేలా వున్నాయి.

హేమంత్‌ మౌనంగా చూసి, ఏమనుకున్నాడో ఏమో మళ్లీ మాట్లాడలేదు. ఎవరిపాటికి వాళ్లు ఆఫీసుకెళ్లిపోయారు.

*****

 

ఆరాధ్య తల్లికి ఫోన్‌ చేసి గోల్డ్‌ విషయం చెప్పింది.

వెంటనే ఆ ఫోన్‌ని శాంతారాం అందుకొని ఆరాధ్యతో మాట్లాడాడు. ఆరాధ్య చెప్పింది విని, వెళ్లి వాళ్ల తమ్ముళ్లతో చెప్పుకున్నాడు. వాళ్లు ‘నువ్వేం భయపడకు అన్నయ్యా!’ అని ఆయనకు ధైర్యం చెప్పి హేమంత్‌కి కాల్‌ చేశారు.

”ఏమయ్యా హేమంత్‌! నీకు మా అమ్మాయిని ఇచ్చాం! ఆమాత్రం మామీద నీకు నమ్మకం లేదా? మేం పెట్టింది 22 కేరెట్లే! 17 క్యారెట్లు అన్నావట”

మండింది హేమంత్‌కి ”కావాలంటే మీరు టెస్ట్‌ చేయించుకోండి!” అన్నాడు.

శాంతారాం తమ్ముడు గలగల నవ్వి ”ఏమిటీ! మేం టెస్ట్‌ చేయించాలా? మాకు గోల్డ్‌ ఫీల్డ్‌లో 22 సంవత్సరాల అనుభవం వుంది. మమ్మల్నే టెస్ట్‌ చేయించుకోమంటావా? చూస్తుంటే మాకే పర్సెంటేజ్‌లు నేర్పేలా వున్నావే? ఏదో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసుకునేవాడివి, నీకెందుకీ నగల వ్యవహారాలు? పెట్టుకునేది అమ్మాయి కదా! సైలెంట్‌గా వుండిపో!” అన్నాడు.

”ఎలా వుండిపోతానండి! ఆ డబ్బులు నావి. ఆ నగలు మీ అమ్మాయికి పెళ్లిలో మీరు పెట్టినవి కావు. ఫ్యూర్‌ గోల్డ్‌ రేటు తీసుకొని 17 క్యారెట్లు ఎలా ఇచ్చారు? అది అడక్కుండా ఎలా వుంటాను” అన్నాడు.

”అడిగి లాభం లేదు. అది 17 క్యారెట్లు వున్నట్లు ఏదైనా గోల్డ్‌ షాపుకెళ్లి అక్కడ దాన్ని టెస్ట్‌ చేసినట్లు ఫ్రూఫ్‌లు తీసుకురా! అప్పుడే మేము దాన్ని రిటన్‌ తీసుకుంటాం! అంతవరకు వేరే ఆర్నమెంట్స్‌ నీకు ఇవ్వం” అన్నాడు.

శాంతారాంకి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫ్యూచర్లో కూతురికి అల్లుడి చేతిలో ఏం జరుగుతుందోనని భయంగా వుంది.

ఏదో డబ్బుకి గడ్డితిని తప్పుచేయడం వేరు. దాని పర్యవసానాన్ని వూహించుకుంటూ బ్రతకడం వేరు. రేపు తనకూతుర్ని హేమంత్‌ ఎలా చూస్తాడోనన్న కంగారు ఎక్కువై ”ఒరే! తమ్ముడూ! నా అల్లుడితో నువ్వింకేం మాట్లాడకు. ఫోన్‌ పెట్టేసేయ్‌!” అన్నాడు.

శాంతారాం తమ్ముడు వెంటనే ఫోన్‌ కట్‌చేసి ”నువ్వసలే పిరికోడివి. నీ ఏడుపేదో నువ్వు ఏడువుపో!” అన్నాడు.

శాంతారాం ఇంటికెళ్లి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

 

*****

 

ఆరాధ్య ఊరెళ్లాలని, ఆఫీస్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడే కంప్యూటర్‌ ఆన్‌ చేసి, తత్కాల్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంది.

ఫోర్త్‌ ఫ్లోర్‌లో వున్న హేమంత్‌కి కాల్‌ చేసి ”ఇవాళ నాకు క్లయింట్‌ మీటింగ్‌ వుంది హేమంత్‌! అదయ్యేటప్పటికి రాత్రి 9 అయ్యేలా వుంది. ఇంటికి రాను. ఇటునుండి ఇటే మావూరు వెళ్తాను” అంది. ఆమెకు భర్తను పేరుతో పిలవటం అలవాటు.

హేమంత్‌ ఉలిక్కిపడి ”ఏయ్‌! ఎందుకింత అర్జంట్‌! మీవాళ్లేమైనా కాల్‌ చేశారా? ఎందుకెళ్తున్నావ్‌!”

”అలాంటిదేం లేదు. నేనే గోల్డ్‌ విషయం మాట్లాడదామని వెళ్తున్నాను. ఒక్కరోజు లీవ్‌ పెట్టాను. రేపు రాత్రికి రిటనవుతాను. ఎల్లుండి డ్యూటీలో వుంటాను” అంది.

”మాట్లాడేది ఏమైనా వుంటే ఫోన్లో మాట్లాడు” అన్నాడు.

”ఫోన్లో మాట్లాడితే మన దగ్గర వున్న గోల్డ్‌ ఎవరు తీసుకెళ్తారు?”

”మీ తమ్ముడికి కాల్‌ చేసి రమ్మంటే వస్తాడు. లేదంటే మీ నాన్నను రమ్మను. వస్తాడు. నువ్వెందుకెళ్లటం?”

”మా తమ్ముడు మద్రాసులో వున్నాడు. వాడికి క్లాసులు పోతాయి. మా నాన్న ఇంత దూరం జర్నీ చెయ్యలేడు. నేనే వెళ్లి వస్తాను”

”నువ్వెళ్లటం నాకు ఇష్టం లేదు”

”ఇష్టం లేకపోతే నాకు మీ ముఖంలోకి చూడాలంటేనే కష్టంగా వుంది. మావాళ్లను మీరు తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి”

”నాకసలు తిట్లే రావు. బ్యాంక్‌ అప్రయిజెర్‌ అలా అనగానే షాకయి, ఎమోషనయ్యాను. అంతే! మీవాళ్లంటే నాకేం కోపం లేదు. నేను మీ నాన్నగారితో ఫోన్లో మాట్లాడాను. ఆయన మళ్లీ నాకు కాల్‌ చేస్తానన్నారు. నువ్వెళ్లొద్దు”

”ఆయన అలాగే అంటారు. మళ్లీ మరచిపోతారు”

హేమంత్‌ మాట్లాడలేదు.

కాల్‌ కట్‌ చేసింది ఆరాధ్య. ఆ రాత్రి ట్రైన్‌కే వెళ్లింది.

ఆరాధ్య ఇంటికెందుకొచ్చిందో కొద్దికొద్దిగా అర్థమవుతున్నా ఇంత త్వరగా వస్తుందనుకోలేదు శాంతారాం, రమాదేవి.

”అసలు గోల్డ్‌ ఎందుకు చెక్‌ చేయించారు?” అడిగాడు శాంతారాం. ఆయన పక్కనే కూర్చుని వున్న రమాదేవి కళ్లలో కూడా అదే ప్రశ్న.

విషయం చెప్పింది ఆరాధ్య. అది విని తేలికపడ్డారు. లేకుంటే వాళ్లమీద నమ్మకం లేక హేమంతే కళ్యాణ్‌ జ్యూయిలరీకి వెళ్లి టెస్ట్‌ చేయించాడని హేమంత్‌ మీద నురగలు కక్కుతున్నారు. మనకి దొరకాల్సిన అల్లుడు కాదని తలలు పట్టుకున్నారు. ఇంటి గుట్టు రచ్చకీడ్చేలా వున్నాడని తలలు బాదుకున్నారు.

”ఇది తెలిసినప్పటి నుండి ఆయన చాలా కోపంగా వున్నారు డాడీ! మిమ్మల్ని బాగా తిడుతున్నారు. మీరు చేసింది మాయ, మోసం, దగా అంటున్నారు. నేనేమైనా ఎదురు మాట్లాడితే కొడతాడేమోనని భయంగా వుంది. అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను” అంది.

శాంతారాం మాట్లాడలేదు.

రమాదేవి మాత్రం ”మాట్లాడు. నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడు. కొడితే వూరుకుంటామా! గృహ హింస కేసుకింద వాడిని బుక్‌చేసి బొక్కలో తోయించమా! నువ్వు మాట్లాడేదేదో ధైర్యంగా మాట్లాడు. మూగమొద్దులా వుంటే వాడు మగవాడు, ఆడిస్తాడు. ఆడటానికి నువ్వు మామూలు ఆడపిల్లవి కావు. నిన్ను మేము మామూలుగా పెంచలేదు. బి.టెక్‌ చదివించాం. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నావ్‌! మెత్తమెత్తగా వుండి మా పరువు తియ్యకు…” అంది.

”అబ్బా! నువ్వుండవే రమా!” అన్నాడు శాంతారాం.

”నేనుండక ఎక్కడికి పోతానండీ! ఇక్కడే వుంటా! కూతురుకి నాలుగు మంచిమాటలు చెప్పుకోకుండా మీరు నా దగ్గర వణికినట్లే దాన్ని వాడి దగ్గర వణికించకండి! అది బ్రతకలేదు. అసలే దానికి ప్రపంచం తెలియదు. పేరుకేమో బి.టెక్‌ చదివింది. సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి. ఏం లాభం? చూస్తున్నారుగా! అక్కడే వాడ్ని నాలుగు జాడించక రైలెక్కి వచ్చింది” అంది.

”మీ మమ్మీ మాటలు నువ్వేం పట్టించుకోకురా! నామాట విని ఆ నగలు మన ఇంట్లో పెట్టి నువ్వు హైదరాబాదు వెళ్లు” అన్నాడు.

”ఆయన వూరుకోరు నాన్నా! నగలు కూడా పట్టుకెళ్లి ఇచ్చివచ్చావా? వాటిని కూడా వాళ్లు దొబ్బేస్తార్లే! అంటాడు. అలాంటి మాటలు వినాలంటే నాకు బాధగా వుంటుంది” అంది.

”వాడెవడే నిన్ను బాధపెట్టటానికి?” కయ్యిమంది రమాదేవి.

”అల్లుడు. నువ్వు కాస్త నోరు మూస్తావా?” ఉరిమి చూశాడు శాంతారాం.

”అల్లుడైతే బాధపెట్టాలా? ఒక్కొక్కళ్లు భార్యల్ని ఎలా చూసుకుంటున్నారో చూడు. వీడేమో పెళ్లయిన రెండు నెలలకే మనల్ని తిట్టి మనమ్మాయిని ఇంటికి పంపించాడు. వాడేం అల్లుడండీ! పెళ్లికి ముందు ఎంత తియ్యగా మాట్లాడాడు. ఎన్ని మాయ మాటలు చెప్పాడు. అది విని చాలా మంచోడనుకున్నాం. వాడా కంపెనీ వదిలేసి సినిమాల్లోకి పోతే బావుండేలా వుంది. అమ్మో! అమ్మో! ఏం నటన. ఏం నటన… మన కూతుర్ని పెళ్లి చేసుకొని, మనల్నే తిడతాడా? కష్టపడి కని, పెంచి మన పిల్లను వాడికిచ్చింది ఇందుకేనా? మంచీ మర్యాద వుందా వాడికి…?”

”అల్లుడిని పట్టుకొని వాడూ, వీడూ అనకే! వినేవాళ్లు నీ నోట్లో గడ్డిపెడతారు” అన్నాడు శాంతారాం.

”ఎవరున్నారండీ ఇక్కడ వినడానికి? మనలో మనం కూడా మాట్లాడుకోవద్దా! మాట్లాడకపోతే వాడి గురించి అమ్మాయికి ఎలా తెలియాలి… వాడినింకా మంచివాడనే అనుకుంటోంది. దీని బొంద. దీనికేం తెలుసు…? రాత్రి పన్నెండు దాటేదాకా కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, తెల్లవారి నిద్ర లేవలేకపోవడం… నిద్ర సరిపోకపోతే దాని ఆరోగ్యం పాడవుతుందని మనం కూడా దాన్ని నిద్ర లేపకుండా ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం. మనల్నే తిడతాడా?”

”తిడితే తిట్టాడులేవే! మనం కూడా సర్దుకుపోవాలి. ఆడపిల్లను ఇచ్చాం!” అన్నాడు.

”ఇస్తే ఏం. భయమా! వాడు కూసే కూతలన్నీ పడాలా?” అంది రమాదేవి.

”పడితే ఏం? వాళ్లిద్దరు బాగుండాలి. వాళ్లు బాగుండాలనేగా మనం ఇంత కష్టపడి పెళ్లి చేసింది”

”వాడెక్కడ బాగుండనిస్తాడండీ! అలాంటి ఆశలేం పెట్టుకోకండి!”

”అంటే! ఏంటే నువ్వు మాట్లాడేది? నీ మూర్ఖత్వంతో వాళ్లిద్దర్ని విడదీస్తావా ఏం?”

”నేనేది మాట్లాడినా ఇంతే! పూర్తిగా మాట్లాడనివ్వరు”

”నువ్వు పూర్తిగా మాట్లాడితే జరిగే అనర్థాలు చూస్తున్నాంగా!”

”ఏం జరిగాయి?”

”అసలీ వెదవ పనికి పునాది నీవల్లనేగా జరిగింది. వద్దని చెప్పాను. నువ్వూ, నీ కొడుకు విన్నారా? బయటపడితే ప్రమాదమని మొత్తుకున్నాను. ఏం కాదులే అన్నావ్‌! ఇప్పుడు చూడు” అన్నాడు శాంతారాం.

”ఇప్పుడు కూడా ఏం కాదు. అతన్ని మన అమ్మాయి హైదరాబాదు వెళ్లే లోపలే ఇక్కడికి రమ్మని పిలవండి! వస్తాడు”

”వచ్చి ఏం చేయాలి? డబ్బులు అడిగితే ఎక్కడ నుండి తేవాలి. ఎంత చెప్పినా వినవు. షాపులో వచ్చిన డబ్బులు వచ్చినట్లే వడ్డీలకి తిప్పుతావు. వాళ్లేమైనా ఇస్తారా? చస్తారా? మధ్యలో నేను చచ్చేలా వున్నాను”

ఆరాధ్య భయపడింది. తల్లికీ, తండ్రికీ మధ్యన ఇలాంటి గొడవలు రోజూ వుండేవే! ఇంతకన్నా ఎక్కువ గొడవలే వుంటాయి. ఏ గొడవా లేకుండా కొట్టుకున్న రోజులు కూడా వున్నాయి. కానీ తన వల్ల తన తండ్రికి చచ్చేంత పరిస్థితి రావటం మనసు తట్టుకోలేకపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *