May 17, 2024

చేరేదెటకో తెలిసి – 3

రచన: స్వాతీ శ్రీపాద

రీతూ నీతూ కవలలు.
ఇద్దరిని పెంచే సరికే చుక్కలు కనిపించాయి. అందుకే ఇహ చాలానుకుంది. ఇద్దరూ శ్రీ చైతన్యలో చదువుతున్నారు. ఏడో క్లాస్
ఓ పక్కన ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్లో బియ్యం కడిగిపెట్టి మరో వంక వంకాయలు మూకుట్లో వేసి, ఫోనందుకుంది సౌమ్య .
ఎన్ని సార్లు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఇది వరలో అయితే బిజీగా ఉన్నాడేమోనని సరిపెట్తుకునేది గాని ఇప్పుడు మనసలా ఒప్పుకోడం లేదు.
మరో సారి మరోసారి అంటూ కనీసం ఓ పది సార్లు ప్రయత్నించిఉంటుంది.
కావాలనే ఇలా స్విచ్ ఆఫ్ లో పెడుతున్నాడా అనికూడా ఆమెకు అనిపించింది.
అలా అని ఇలా స్విచ్ ఆఫ్ లో ఫొన్ ఉండటం ఇది మొదటి సారి కాదు.
మరిహ లాభం లేదు. వచ్చినప్పుడే అడగాలి అనుకుంది.
పిల్లలతో కూర్చుని వాళ్ళ చదువులు అవీ అయ్యాక రాత్రి భోఓజనాలు ముగించి ఇహ నిద్ర పోదామనుకునే సమయంలో వచ్చింది శివ నుండి ఫోన్.
ఎప్పుడు ఫోన్ వచ్చినా ఉత్సాహంగా కనీసం గంటసేపైనా మాట్లాడే సౌమ్య కు మొదటి సారి మాట్లాడాలనిపించలేదు. ఫోన్ ఎత్తలేదు.
మరి కాస్సేపటికి మరోసారి ఫోన్ మోగింది.
ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేస్తే అడక్కుండా ఉండలేదు. అడిగినా నిజం చెప్తాడన్న నమ్మకం లేదు.
అలా అనుకుందుకు కారణం ఇందాక చూసినది శివనే.
హాడావిడిలో గుర్తు రలేదు కాని రోడ్ డివైడర్ పక్కనే ఆగివుంది తనకారు. సరిగ్గా అటుపక్కనుండి వెళ్ళినకారులో డ్రైవ్ చేస్తూ శివ … స్టీరింగ్ వీల్ పై కుడి చేతి బొటన వేలికి ఉన్న కనక పుష్యారాగ ఉంగరం … సరిగ్గా హార్ట్ షేప్ లో వున్న రాయి వెదికి వెదికి అతని కోసం తనే చేయించింది. ఆ ఉంగరం పక్కన స్పష్టంగా కనిపించే పెసరబద్దంత పుట్టుమచ్చ.. ఇవి స్పష్టంగా కనబడ్డాయి. అతను శివానే … ఇక్కడే వుండి ఎక్కడో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం………
అసలు పెళ్ళి చేసుకున్నప్పటి నుండి ఎంత అవసరమైనా వారానికి రెండు రోజులు మహా అంటే మూడు రోజులకు మించి ఉన్నది ఎప్పుడూ లేదు.
పిల్లల అనారోగ్యాలు , దగ్గులు, జ్వరాలు ఎన్ని అవసరాలైనా రానీ గాక ….
అంటే ఎన్నేళ్ళుగా ఇలా ఇక్కడే వుంటున్నాడో …
ఇక్కడే వుంటే ఎక్కడ ఎవరితో …
తనకు తెలియని అతని కోణం మరేదో ఉందనిపించింది.
మరో సారి ఫోన్ రింగైంది.
విసుగ్గా ఫోన్ అందుకుని స్విచాఫ్ చేసేసింది.
ఎంతతన్నుకున్నా నిద్ర రాలేదు.
అర్ధరాత్రి దాటినా నిస్సత్తువుగా పడుకుని ఉండిపోయిందే కాని తిండి తినాలన్న ధ్యాస లేకపోయింది. ఎప్పుడో తెల్ల వారు జామున మాగన్నుగా కునుకు పట్టిందామెకు. అయినా జరిగిపోయిన జీవితం మళ్ళీ మళ్ళీ పునరావృత్తమయినట్టుగనే అనిపించింది.

*******************

చదువు పూర్తయి ఇంకా ఉద్యోగం వేట లో ఉన్న రోజులు.
అప్పుడే శివ పరిచయం చాలా కాజువల్ గా జరిగింది.
ఏదో ఇంటర్వ్యూ కోసం వెళ్తూ బస్ ఎక్కాక కాని పర్స్ లో ఒక వంద రూపాయల నోటు ఓ రూపాయి బిళ్ళ రెండర్ధ రూపాయలే ఉన్న సంగతి చూసుకోలేదు.
చిల్లర కోసం కండక్టర్ ఎంతగా సతాయిస్తాడో ఎంత గొణుగుతాడో తెలిసిన విషయమే. పది రూపాయల నోటిచ్చినా సరిపడా డబ్బే ఇమ్మని ఎన్ని సార్లు ఎంత మీద అరిచాడో , వంద రూపాయల నోటు ఇవ్వడానికి భయంగా వుంది.
” నా ఖర్మ … వచ్చేముందే చూసుకుని ఉండాల్సింది… ” వెయ్యి సార్లు తనను తనే తిట్టుకుంది.
ఎక్కడో వెనకాల నుండి టికెట్స్ ఇస్తూ వస్తున్నాడు కండక్టర్.
ఈ లోపునే ఎందుకైనా మంచిదని పక్కన కూచున్న వాళ్ళను , ముందూ వెనకా ఉన్న వాళ్ళనూ అడిగింది కూడా చిల్లరేమైనా దొరుఉతుందేమోనని… ఉహు, లాభం లేకపోయింది.
కండక్టర్ రానే వచ్చాడు.
బెరుకు బెరుగ్గా వంద రూపాయాల నోట్ తీసి అతనికిచ్చింది.
అంతే ! ఎక్కడికనయినా అడక్కుండా ఒక ధోరణిలో సాగి పోయింది అతని వాచాలత.
” మాట్లాడితే మేం కదా డబ్బున్న వాళ్ళం అని చూపించుకుందుకు వంద రూపాయల నోట్ ఇలా విసిరేస్తారు ఆర్రూపాయల కోసం… పొద్దున్న పొద్దున్నే నేనే మయినా చిల్లర కొట్టుపెట్టుక్కూచ్చున్నానా ఇక్కడ…. చిల్లర ఇవ్వమ్మా …”అంటూ నోట్ తిరిగి ఇచ్చేశాడు.
“చిల్లర లేదండి … చూసుకోలేదు ..”
“అయితే దిగిపొండి… నాదగ్గరా చిల్లర లేదు, డ్రైవర్ బస్ ఆపు”అంటూ బెల్ కొట్టాడు
ఏంచెయ్యలో తోచని స్థితిలో లేచి నిల్చుంది.
ఇప్పుడు బస్ దిగి మరో బస్ కోసం వెయిట్ చేసి వేళ్ళేంత సమయం లేదు.
ఇంటర్వ్యూ కే సమయానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఎవరిస్తారు?
అలాగని ఇవన్నీ చెప్పుకుని బతిమాలాలనీ అనిపించలేదు.
గత్యంతరం లేనట్టు డోర్ వైపు వెళ్తున్న సమయంలో వినబడింది.
“మీరాగండి, ఇలా చిల్లర పేరిట ప్రయాణీకులను వేదించే అధికారం మీకేవరిచ్చారు?ఎప్పుడో ఒకసారి ఇబ్బందనేది ఎవరికైనా వస్తుంది, ఏదీ నీ బాగ్ లో చిల్లర లేదా చూపించు లేదంటే నేనిస్తాను. ఉందో ఇప్పుడో నీ ముందే నీకు ఉద్యోగమిచ్చిన వాడికి ఫోన్ చేస్తాను. మీకు జీతాలిచ్చేది ఇందుకేనా?” కండక్టర్ ని ఉద్దేశ్యించి గట్టిగా అడిగాడు శివ.
అప్పటికే గొణుగుతూ టికెట్ చి౦పాడు కండక్టర్ .
బస్ లో వాళ్ళంతా తలోమాటా మాట్లాడటం మొదలెట్టారు.
“ప్రభుత్వ వాహనాలు వీళ్ళబ్బసొత్తనుకు౦టారు” అని కొందరు,
“లాభం లేదు గట్టిగా మాట్లాడకపోతే నన్నూ ఇలాగే దింపేసాడోసారి “ అని ఒకళ్ళూ.
ఈలోగా తనను ఆగమన్నా అతని వైపు నడిచి థాంక్స్ చెప్తూ “ ఈ బస్ మిస్ అయితే ఈ రోజు ఇంటర్వ్యూ కి వెళ్ళ లేకపోయేదాన్ని “ అంది.
“చూశారా ,ఎవరెవరికి ఏమేం పనులు ఉంటాయో ,ఇలా వేదించే ముందు కాస్తైనా ఆలోచన ఉండాలిగా.. నాపేరు శివరావ్ ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగం ..”
“ఐయాం సౌమ్య . “
అలా మొదలైంది పరిచయం.
అదృష్ట వశాత్తూ ఆ రోజు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కావడం నెలరోజుల్లో ఉద్యోగంలో చేరడం జరిగింది. ఆ రోజు బస్ లో అతను గట్టిగా అడిగిఉండకపొతే ఉద్యోగమే దొరికేది కాదేమోఅన్న ఆలోచన మనసును అతని వైపు మొగ్గేలా చేసింది.
ఏదో ఒక వంకన కలుసుకోడం కలిసి కాఫీలు తాగడం కలిసి సినిమాలు చూడటం వరకు వచ్చింది. ఒకరి కుటుంబాల గురించి మరొకరు యధాలాపంగా తెలుసుకున్నప్పుడు తనకు తల్లీ తండ్రీ ఎవరూ లేరనీ మేనమామ పంచన పెరిగి స్వశక్తితో పైకి వచ్చాననీ చెప్పాడు శివ.
అతని పట్ల సాను భూతి అనురాగం మరింత పెరిగాయి. ఇంటికి తీసుకు వెళ్లి తల్లిని పరిచయం చేసింది. ఆవిడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం.
తరువాత నెమ్మదిగా ఎప్పుడో చెప్పింది. భర్త , అత్తమామల ఆరళ్ళు భరించలేక తల్లి పసిపిల్ల అయిన తనతో పారిపోయి వచ్చి అందరినీ వదులుకుని ఉద్యోగం సంపాదించుకున్న సంగతి.
ఏడాది దాటకుండా ఇద్దరి అంగీకారం మేరకు చాలా సింపుల్ గా గుళ్ళో జరిగిపోయింది పెళ్లి.
ఎప్పుడూ రానిది ఇలా అనుమానం రావడం …ఏమో..
తెల్లారి ఎనిమిదయ్యేసరికి బాగ్ పట్టుకుని దిగాడు శివ.
ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఉంది సౌమ్య ,పిల్లలిద్దరూ తండ్రికి హలో చెప్పి స్కూల్ కి వెళ్ళడానికి సిద్ధమయారు.
“ అబ్బ , రాత్రంతా ప్రయాణం .ఒకటే తలనొప్పి ఒక కప్పు కాఫీ తీసుకురా సౌమ్యా “అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు .
ఒక్క క్షణం ఆలోచించిన సౌమ్య ఆఫీస్ కి సెలవని చెప్పి, కాఫీ తీసుకుని గదిలోకి వెళ్ళింది.
శివ ఎక్కడా ప్రయాణం చేసి వచ్చిన వాడిలా లేడు. కాఫీ కప్పు అతని చేతికిచ్చి ఎదురుగా కుర్చీలో కూచుంది.
‘ బాగా అలసిపోయారా?”
“అవును సౌమ్యా”
“పోనీ ఈ రోజుకి సెలవుపెట్టి ఇంట్లో ఉంటాలెండి. ఎన్నాళ్ళై౦దో మనం ఇలా ఏకాంతం గా గడిపి శానాది వారాలు ఇ౦టి పనులకీ ,పిల్లల అవసరాలకే సరిపోతున్నాయి.”
గతుక్కుమన్నాడు శివ .
కాఫీ గొంతులోకి వెళ్లి పొలమారింది.
“అబ్బే ఇదేం కొత్తా ? నువ్వు ఆఫీస్ కి వెళ్లి వచ్చేలోగా నేను కాస్సేపు నిద్రపోయి లేచి సాయంత్రం పిల్లలను తీసుకు వస్తాను .ఫస్ట్ షో సినీమాకు వెళ్దాం.”
“ ఉహు , ఫోన్ చేసి చెప్పేశాను సిక్ అనీ రావడం లేదనీ. నా కిలా వారానికి ఒకటి రెండు రోజులు మాత్రం కలిసి ఉండటం విసుగ్గా ఉంది. చూస్తూ చూస్తూ పన్నెండేళ్ళు దాటి పోయాయి ,ఒక రోజా రెండు రోజులా? పోనీ ఇద్దరిలో ఒకరం ఉద్యోగం మానేసి వచ్చిన దానితోనే సరిపెట్టుకు౦దా౦.”
శివ పని ఇరకాటాన పడ్డట్టై౦ది.
“చూద్దాం లే “అంటూ మాట తప్పించాడు.
అరగంటాగి వంటింట్లో శివ కోసం ప్రత్యేకంగా అతనికి చాలా ఇష్టమని కట్టే పొంగలి చేస్తూ , “ఏమీ అనుకోనంటే ఒక మాట అడగనా ?”
తటపటా ఇస్తూనే అడిగింది.
“ అడుగు మన మధ్య అనుకునే విషయం ఏముంది?” పేపర్ తిరగేస్తూ యధాలాపంగా అన్నాడు శివ.
“ మీరు నిన్న సాయంత్రం అమీర్ పేట్ జంక్షన్ వద్ద కారులో ఎక్కడికి వెళ్తున్నారు?”
అదిరిపడ్డాడు శివ.
“నేనా ? లేదే? నేను రాత్రి పదింటికి విజయవాడలో బస్సెక్కి ఇక్కడికి వచ్చాను. నువ్విలా అనుమానిస్తావను కుంటే టికెట్ కూడా తీసుకు వచ్చ్చి చూపిం’చేవాడిని . “ కొ౦చం తత్తరపడ్డా నిష్టూరంగా అన్నాడు.
“ లేదు , నేను చూశాను . మన పెళ్లి రోజుకు కొన్న బ్లూ చెక్స్ షర్ట్ వేసుకున్నారు ..”
“లేదు సౌమ్యా ,మొన్నటి నుండి ఉదయం వేసుకొచ్చిన ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుని తిరుగుతున్నాను..”
“అవునా ఎవరినో చూసి మీరనుకుని ఉంటాను లెండి “అడిగి లాభం లేదనిపించింది.
“ కావచ్చు , ఎంతమంది కుండవు చెక్స్ చొక్కాలు ? “ కాస్త ఉత్సాహంగా అన్నాడు.
“ఫోన్ స్విచాఫ్ లో పెట్టుకున్నారెందుకు ?” అడుగుదామని నాలుక చివరివరకూ వచ్చిన ప్రశ్న అక్కడే ఆపేసింది.
చెప్పాలని లేకపోతె ఎన్ని అబద్ధాలు దొరకవు గనక.
“ నువ్వు సెలవువేస్ట్ చేసుకోకు సౌమ్యా , అర్జంట్ గా చెయ్య వలసిన ఆఫీస్ పనుల విషయంగా నేను బయటకు వెళ్లి రావాలి మళ్ళీఇంట్లో ఒక్కదానవే ఉండిపోతావు.మరో రోజెప్పుడైనా వీలు చూసుకుని సెలవు తీసుకు౦దువు గాని … మా బుజ్జి కదూ , మా బంగారు కదూ …”
అతని బ్రతిమాలటం ఇదివరలో మధురంగానే ఉండేది.ఇప్పుడెందుకో అది కృత్రిమంగా తోచింది.
నిశ్శబ్దంగా లేచి మరో మాట లేకుండా వంటి౦ట్లోకి నడిచింది.
మామూలుగా ఇంట్లో ఉన్న రోజుల్లో అతనే దింపుతాడు కాని ఈరోజు అతను ది౦పుతాననీ అనలేదు ఆమె ది౦పమనీ అడగలేదు.

*******************

చూస్తూ చూస్తూ ఆరునెలలు గడిచిపోయాయి.
పెదవుల కదలిక తప్ప మరో మార్పు రాలేదు శృతిలో. కాని ఏదో చెప్పాలన్న తపన , పెదవుల కదలిక మాత్రం తెలుస్తూనే ఉంది.
నిస్సహాయంగా గంటలు గంటలు పక్కన కూచుని చూడటం మినహా ఏం చెయ్యాలో అర్ధం కాలేదు శ్రీకాంత్ శర్మకు. సాధారణం గా అందరూ అతన్ని డా. శర్మ అనే పిలుస్తారు. చాలా దగ్గర వాళ్లకు తప్ప అతని పేరు శ్రీకాంత్ అని తెలియదు.
ఆ రోజు ఆదివారం పెద్ద పనేమీ లేక శృతి గదిలోనే కూర్చుని ఉన్నాడు శ్రీకాంత్. రోజూ చూసుకునే నర్స్ ఓ గంట బయటకు వెళ్లి వస్తానని వెళ్ళింది. గదిలో వాల్ పైన ఫిక్స్ చేసిన టీవీ లో చానెల్స్ తిప్పుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక చానెల్ కు వెళ్ళాడు.
మూగ చెవిటి వారికోసం వార్తలు లా ఉంది. మామూలుగా చదువుతుంటే చేతులతో పెదవుల కదలికతో చెప్తోంది దాన్నే.
చటుక్కున ఒక ఆలోచన మెరుపులా మనసులో మెదిలింది. శృతి వైపు తలతిప్పాడు అప్పటికే విప్పరిత నేత్రాలతో దాన్నే చూస్తున్న శృతి ఎదో చెప్పాలని ప్రయత్నిస్తోంది.
ఏదో శబ్దం వస్తోంది కాని మాట స్పష్టంగా లేదు.
చటుక్కున లేచి వెళ్లి తన లాప్ టాప తెచ్చుకున్నాడు.
లిప్ రీడింగ్ గురించి వెతకడం మొదలెట్టాడు.
ఈ లోగా నర్స్ రావడం తో శృతి బాధ్యతా ఆమెకు అప్పగించి తన పనిలో పూర్తిగా లీనమై పోయాడు .
లిప్ రీడింగ్ నిర్వచనమే గొప్ప ఆసక్తిని కలిగి౦చి౦దతనికి.
పెదవులు, నాలుక ,మొహ కవళికలను బట్టి మాట్లాడే మాటలు అంచనా వెయ్యడం. ఎ కాస్తో వినిపిస్తున్న శబ్దాలను అర్ధవంతంగా అన్వయించుకోడం . మామూలుగా వింటున్నా సాధారణంగా మనిషిని మనిషి మాట్లాడేప్పుడు చూసుకుంటే ఎక్కువ అవగాహన ఉండటానికి కారణం మాట శబ్దతరంగమై మెదడుని చేరి మనసులో ఇంకే దానికన్నా ముందే దృశ్యం మాటను అనువది౦చెయ్యడమే.
ఇప్పుడిక శృతి కోలుకునే లోగా ఏం చెప్పాలనుకుంటో౦దో తెలుసుకుందుకు ఉన్నదారి అది ఒక్కటే.
లిప్ రీడింగ్ ! ఈ విషయమే కొత్త . దీన్ని నేర్పే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు?
లాప్ టాప్ మీద దృష్టి కేంద్రీకరి౦చేసరికి కళ్ళు మంట పుడుతున్నాయి. ఇహ లాభం లేదని లేచి వెళ్లి కావలసిన విషయం ప్రింట్ అవుట్ తీసుకున్నాడు.
కిచెన్ లోకి వెళ్లి వేడిగా కాఫీ తెచ్చుకు చదవడం మొదలు పెట్టాడు.
ఆసక్తిగా చదవడం మొదలుపెట్టిన అతనికి అర్ధమైంది ఆ విషయం అనుకున్నంత సాధారణమైనది కాదని.
దానికో సిస్టమాటిక్ సీక్వెన్సు ఏర్పాటు చేసుకుని స్టడీ చెయ్య వలసినది ఎంతో ఉందనీ.
వెంటనే నిరుత్సాహం అనిపించింది. ఎప్పటికవాలి ఈ పెదవుల కదలిక అధ్యయనం ? ఎప్పటికి శృతి ఏం చెప్పదలుచుకుంటో౦దో తెలవాలి?
లాప్ టాప్ మూసి కణతలు నొక్కుకున్నాడు. అది ఒక క్షణం పాటే.
మళ్ళీ వెంటనే లేని ఉత్సాహం తెచ్చుకుని “ఎన్నాళ్ళైనా అవనీ గాక “ అనుకున్నాడు.
రైటింగ్ పాడ్ తెచ్చుకుని
ముందు భాష నేర్చుకోడం ఎలా మొదలవుతుంది? అని ఒక ప్రశ్న రాసుకున్నాడు.
జవాబు ఆలోచి౦చు కు౦టూ పొతే , స్కూల్లో చేరడం నించి వెనక్కు వెనక్కు వచ్చి పసిపాపల దగ్గర ఆగిపోయింది మనసు. అవును … తొలి అక్షరాలూ అత్తా , తాత, అనడం ఆరో నెల దాటాకా , ఏడాదిలోగా ఎప్పుడైనా మొదలవవచ్చు.
ఎక్కడ అత్తా ,తాతా ఇప్పుడు పాపలు అమ్మా అంటున్నారు. నవ్వొచ్చింది.
అవును ఈ మార్పుకి కారణం……ఇది వరలో మూడో నెలో ,ఐదో నెలో రాగానే బిడ్డ నెత్తుకుని పుట్టింటినుండి తమతమ ఇళ్ళకు వెళ్ళేవారు తల్లులు.
కాని ఇప్పుడో … ఉద్యోగస్తులు , అమెరికావాసులు పెరగడంతో అమ్మను ఆర్నెల్లో ఏడాదో అట్టె పెట్టుకుని అమ్మ ఎప్పుడూ అమ్మా అనో మీ అమ్మ అనో మాట్లాడటం వినే బిడ్డ అమ్మ పెదవుల కదలిక చూసి చూసి అలాగే అనుకరించి అమ్మ అనే నేర్చుకుంటుంది ముందు.
ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఆ వెన్నంటే ఒక మెరుపు మెరిసినట్టు అనిపించింది.
అర్ధం తెలియక పోయినా అమ్మ పెదవుల కదలిక ననుసరించి మాటలు నేర్చునే పాపాయి అతనికి ఒక గొప్ప ఉత్ప్రేరకంలా తోచింది.
అప్రయత్నంగా లేచి వాష్ బేసిన్ పైన్నున్న అద్దం ముందు నిల్చుని శబ్దం చేస్తూ “అమ్మ” అని ఉచ్చరించాడు .ఆ తరువాత శబ్దం రాకుండా లోలోపల “అమ్మ, అమ్మ “ అనుకున్నాడు .
చిత్రం గా రెండు సందర్భాలలోనూ నోరు తెరిచి “ అ” అనడం పెదవులను ఒత్తి “మ్మ” అనిపలకడం ఒకేలా ఉంది.
చెట్టుకింద కూచుని న్యూటన్ సిద్దాంతాన్ని కనుక్కున్నంత సంతోషం కలిగింది.
అవును ముందు పెదవుల కదలిక ముఖ భాగాల కదలిక వాటికి సంబంధించిన పదాలు ఇవి తను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
“ఇదో పెద్ద అధ్యయనమే”
తలగోక్కున్నాడు.

****************

శివరావ్ కి చెడ్డ చిరాగ్గా వుంది.
ముగ్గురు పిల్లలను చూసుకోడం వాళ్ళ స్కూల్ వ్యవహారాలూ , ఎంత పనిమనిషి ఉన్నా తల్లి వచ్చి సాయపడుతున్నాఅలవాటు లేని పనులు , మధ్య మధ్యన శృతి గురించి పరామర్శ.
అసలు శృతి తో పెళ్లి అనే విషయం ఎంత అకస్మాత్తుగా జరిగిందో గుర్తుకు వచ్చింది.
అప్పట్లో రాజమండ్రిలో తండ్రికి వ్యాపారం. చదువులో పెద్ద ఎక్కిరాక పోయినా పదో క్లాస్ రెండేళ్ళు ఇంటర్ నాలుగేళ్ళు చదివినా తండ్రి ఓపిగ్గా డిగ్రీ చదవమనే ప్రోత్సహించాడు .అతని వెనక ఇద్దరమ్మాయిలూ కుదురుగా చదువుకుని డిగ్రీ చివరి సంవత్సరం లోకి వచ్చారు. పెద్దక్కకు పెళ్లి చేసారుగాని ముగ్గురు పిల్లలనూ ఆమెనూ వీలైనంత వేది౦చుకు తిని పత్తా లేకుండా పారిపోయాడు చేసుకున్నవాడు. తెలిసిన వాళ్ళ ఇళ్ళలో చిన్నా చితకా పనులు చేస్తూ, బట్టలు కుట్టుకుంటూ కాలం గడుపుతోంది అక్క.
ఆ సమయంలోనే తండ్రి నడిపే ఫాన్సీ స్టోర్ లో రాత్రికి రాత్రి దొంగలు పడి పదిలక్షల సరుకంతా ఊడ్చేయ్యడంతో కుప్పకూలిన తండ్రికి పక్షవాతం వచ్చి మంచం పట్టాడు.
తండ్రి చిననాటి మిత్రుడు రాఘవ పరామర్శ కానీ వచ్చిన వాడు రోజంతా త౦డ్రితోనే ఉన్నాడు తల్లి కష్టం సుఖం చెప్పుకుంది.
“ తొందరపడి చిన్నప్పుడే పెళ్లి చేసిన పెద్దదాని జీవితం అలాగై౦ది. దానికీ మనిషి అండ కావాలి.ఇహ వీడు చూస్తే చదివిందే చదువుతాడు. పాతికేళ్ళు దాటుతున్నాయి. పిల్లలిద్దరూ పెళ్ళి కున్నారు. ఇప్పుడీయన ఇలా? నాకేమీ పాలుపోడం లేదు.” కన్నీళ్లు పెట్టుకుంది
“ బాధ పడకమ్మా , ఆ దేవుడే ఎదో ఒక దారి చూపకపోడు “ అని ఓదార్చాడు.
అందరూ ఇంతే , ఓ నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారు. అని అనుకున్నాడు కాని వారం తిరక్కుండా ఆయన వచ్చి వెళ్ళాక అమ్మ ప్రాధేయపూర్వకంగా అడిగినప్పుడు కాని ఆయన అందరిలా కాదని అర్ధం కాలేదు.
“ రాఘవన్న తల్లి అటో ఇటో అనేట్టున్నదట, ఆమె కళ్ళముందే కూతురి పెళ్లి జరగాలని అన్న కోరిక . పిల్ల చక్కని చుక్క . చదువుకుంది. ఉద్యోగమూ ఉంది. చేసుకున్నావంటే నీ తరువాత ఇద్దరిపెళ్ళీఅతనే చూస్తానంటున్నాడు. మనకుటుంబానికి పెద్ద అండగా ఉంటాడు “
తల్లిని మధ్యలోనే ఆపేస్తూ ,
“ ఇంకా చదువే పూర్తవలేదు …” నసిగాడు. నిజానికి అప్పటికే ప్రైవేట్ గా చదువుతూ ఉద్యోగం చేస్తున్నాడు.కుటుంబానికి అంతో ఇంతో తనవంతు ఆధారం అందిస్తున్నాడు. అంతేనా…
ఈ లోగా తల్లి అందుకుంది.
“ ఇది మన ఇంటి వరకూ వచ్చి తలుపు తట్టిన అదృష్టం నాన్నా. చాలా సమస్యలు తీరిపోతాయి. ఒక్కతే కూతురు గనక ఎల్లకాలం నీకు అండగా ఉంటారు. చెల్లాయిల పెళ్ళిళ్ళ సమస్యా ఉండదు. మీ నాన్న మిత్రుడు గనక నాన్నకూ సంతోషం. ఆలోచించు బాబూ”
అవును అన్నింటికీ ఒకటే పరిష్కారం కాదనలేదు.
కాని … కాని…
ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి.
ఎన్నేళ్ళుగా ఈ అనలం గుండెలో ప్రజ్వరిల్లుతూ ఉంది?
ఈ అసహనం ఎన్నేళ్ళుగా గుండెలో ముడుచుకుని పడుకుని ఉంది.
తలుచుకుంటే గుండె మండిపోతుంది. కాని ఎలా బయట పడటం? ఎక్కడా చిక్కని తనను ఎలా ..ఎలా…

*********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *