May 2, 2024

అంతిమం 3

రచన: రామా చంద్రమౌళి

anthimam 3 color copy

సుమ రమణవైపు సాలోచనగా చూచి. . ఇతనేం అమాయకుడు కాదు అనుకుంది.
“స్పష్టమైన ఆలోచనలే ఉన్నాయికదా రమణా నీకు. ఇంకేం ముందుకు పోవడమే. . చెప్పు నువ్విప్పుడేమి చేయాలనుకుంటున్నావో”
“ఎప్పుడు కూడా భార్య భర్త మధ్య ప్రొఫెషనల్ కాంగ్రుఎన్సీ ఉండడం అవసరం అని నేను భావిస్తా సుమా. ఒక డాక్టర్ భర్త. . డాక్టర్ భార్య. . ఏకత ఉంటుంది కదా. పరస్పరం అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కూడా. అందుకే బాగా గమనించావా సివిల్ సర్వీసుల్లో కూడా ఈ మధ్య ఐ ఎ ఎస్ లు ఐ ఎ ఎస్ లనో, ఐ పి ఎస్ లనో పెళ్ళి చేసుకుంటున్నారు. అవగాహన బాగుంటుంది. ఏమంటావ్”
“గో ఎహెడ్”అని సుమ ఒక నిర్ణయం పూర్తయిన తృప్తతను ప్రకటించింది ముఖంలో.
రమణ లేచాడు ఇసుకలోనుండి.
సుమ కూడా లేచి నిలబడి “చాలా రెలీఫ్ గా అనిపిస్తోందిగదా. స్పష్టత ఏర్పడింది”అంది.
“ఔను సుమా. . ఇక వెల్దాం. నువ్వు సింగపూర్ రావడం మొట్టమొదటిసారికదా. ఈ సెంటొసా అనే చిరు ద్వీపం కేవలం పర్యాటకులను అలరింపజేసేందుకే రూపొందించబడి నడుపబడుతోంది. సింగపూర్ దేశం యొక్క ప్రధాన ఆదాయం కేవలం పర్యాటక ఆతిధ్య రంగం ద్వారానే చేకూరుతోంది. అందుకే ఎటు చూచినా అన్నీ హోటళ్ళు, రెస్టారెంట్స్, షాపింగ్ సింటర్స్. . ఇలా. చిత్రమైన విషయమేమిటంటే ఇక్కడ ప్రసిద్ధ పరిశ్రమలేవీ లేవు కాని ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులన్నింటినీ విక్రయించుకునేందుకు సకల ఆధునిక వసతులతో కూడిన మార్కెటింగ్ ప్లాట్ ఫాం మాత్రముంది. ఎవరైనా ఇక్కడ తమ ఉత్పత్తులను ‘ధరల పొటీ’ పద్ధతిపై విక్రయించుకోవచ్చు. ‘వరల్డ్ మార్కెట్’ సృష్టి అనేది సింగపూర్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో తమ ప్రజలకోసం చేసిన ఒక వరం. టూరిజం. . మార్కెటింగ్. . ఈ రెండే ఈ జాతిని నిలబెట్టి పోషించే ప్రధాన ఆదాయ మార్గాలు. ప్రభుత్వమెప్పుడూ కేవలం ప్రజల గురించే యోచిస్తూంటుంది. మన దేశంలోవలే నిరంతర రాజకీయ అనుత్పాదక వ్యూహాలతో, కలహాలతో, దాడి ప్రతిదాడులతో వృధా కాలక్షేపం చేయదు. ఇప్పుడు మనం ఒక ఎం ఆర్ టి రైల్ లో వెళ్దాం. రైల్వే స్టేషన్ లన్నీ అన్ మ్యాన్ డ్. అంటే మనుషులెవరూ ఉండరు. అదేవిధంగా రైళ్ళుకూడా అన్ మ్యాన్ డ్. రైళ్ళలో డ్రైవర్, టికెట్ కలెక్టర్ వంటి స్టాఫ్ ఎవరూ ఉందరు. ఇదో విజయం. ఈ అచీవ్ మెంట్ కు కారణం తెలుసా. కేవలం క్రమ శిక్షణ. ప్రజలకూ, ప్రభుత్వానికీ ఉన్న దేశ భక్తి. అంకిత భావం. “చెబుతూనే ఉన్నాడు రమణ. ఈలోగా అతను ఒక టికెట్ వెండింగ్ మషీన్ నుండి రెండు టికెట్లు తీసుకున్నాడు. . స్టేషన్ నిశ్శబ్దంగా. . కొద్దిమంది ప్రయాణీకులతో. . ఎవరికివారే. . నియమిత స్థానాల్లో నిలబడి. . అన్నీ డిస్ప్లే బోర్ద్ లు. ఏ విషయనికైనా ఎవరినీ ముఖతః అడుగకుండా సురక్షితంగా వెళ్ళిపోగల సౌకర్యం.
చూస్తూండగానే కొద్దిపాటి మెత్తని చప్పుడుతో వచ్చింది రైలు.
ఆటొమేటిక్ గా తలుపులు తెరుచుకుని. . క్షణ కాలంలో ఎక్కి. . లోపల అంతా ఏర్ కండిషన్ డ్ వాతావరణం. ఒక నిముషంలో స్టార్ట్. సిల్క్ గుడ్డపై నున్నని పాము జారిపోతున్నట్టు ప్రయాణం. స్వర్గంలో ఉన్న అనుభూతి.
“థాంక్యూ రమణా. . ఈ అనుభవం గొప్పగా ఉంది”అంది సుమ ఆనందంతో పొంగిపోతూ.
రమణ అలా కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు.
* * *

టాక్సీ కార్లో వెళ్తూంటే సింగపూర్ రోడ్లన్నీ దేదీప్యమానమైన లైట్లతో వెలిగిపోతున్నాయి.
దూరంగా ఎంతో ఎత్తుగా సింగపూర్ జాతీయ చిహ్నం. . సింహం తల. భీకరంగా. పలుచని ఎరుపు, పసుపు, నీలి రంగుల్లో మెరిసిపోతూ,
నోట్లోనుండి విరజిమ్ముతూ జలధార ధారాపాతంగా.
ఎంతదూరం కనబడుతుందో ఇది. కొన్ని కిలోమీటర్ల దూరమా,
అంతా ఇంత ప్రశాంతంగా ఉండడం. . ఇంత రద్దీ ఉన్న సమయంలోకూడా ఎవరికి వారు ఏదో ఒక అదృశ్య శక్తి నియంత్రిస్తున్నట్టు క్రమశిక్షణతో వెళ్తూండడం. . సుమను చకితురాల్ని చేస్తోంది. స్వర్గమంటే ఇదేనా. . అనుకుంది.
టైం చూసుకుంది. రాత్రి పదకొండూ పది. పన్నెండున్నరకు ఫ్లైట్.
ప్రక్కన రమణ. రమణ ఇంకో రెండురోజులుంటానన్నాడు సింగపూర్ లోనే ఏదో పనిమీద. తనొక్కతే వెళ్ళిపోతోందిప్పుడు. ఇండిగో విమానం.
“రమణా అయాం రియల్లీ త్రిల్డ్. సింగపూర్ నిజంగానే భూతల స్వర్గమనిపిస్తోంది. ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. వచ్చేటప్పుడు పగలు కాబట్టి ఈ నగర శోభ కనిపించలేదు. ఇప్పుడు నిజంగా నేను ఒక దివ్యానుభూతిలో పరవశించిపోతున్నాను. ఈ అవకాశం నీవల్లనే సంభవించడంవల్ల నీకు ధన్యవాదాలు. “చిన్న పిల్లలా గడగడా మాట్లాడ్తున్న సుమను చూచి ముసిముసిగా నవ్వుకున్నాడు రమణ.
“ఒక కథ చెప్పనా. . దారి తెలియకుండా”అంది తన సహజ ధోరణిలో సుమ.
“ఊ. . ”
“నిన్న చెప్పానుగదా. . భారతదేశ సంస్థానాలన్నీ. . దాదాపు ఐదువందల చిల్లర. . భారత ప్రభుత్వంలో విలీనమైపోయిన తర్వాత. . దివాన్ జర్మనీదాస్ సాధికారికంగా రాసిన ‘మహారాజా’. . ‘మహారాణి ‘అనే రెండు పుస్తకాలు రాజుల అంతఃపురాల్లో జరిగిన వికృత శృంగార క్రీడలు, రాక్షస అక్రమ సంబంధాలు. . చదువుతున్నపుడు. . ఒకటి విను. మన నైజాం ప్రభువున్నాడుగదా. . ఆయన పరమ లోభి. ఎక్కడైనా ఆ లోభి లక్షణాలను ప్రదర్శించేవాడు. ఎంత నీచమంటే. . ఒకసారి కపుర్తలా సంస్థాన రాజు జగత్ జిత్ సింగ్ యొక్క విదేశీ భార్య ప్రేం కౌర్ , ఎంతో అందగత్తె. మనోడు గొప్ప శృంగార పురుషుడులే. ఆమె మీద ఈయనకు కన్నుబడ్డడి. ఎట్లైనా ఆమెను పొందాలని వాళ్ళిద్దరినీ తన హైదరాబాద్ కు అథిదులుగా ఆహ్వానించిండు. ఉన్న ఆ కొద్దిరోజులల్ల మనోడు రోజూ ఆమెను ఏదో రకంగా ఒంటరిగా లంచ్ కో, డిన్నర్ కో పిలిచి ఏదో ఒక ఆభరణాన్ని కానుకగా ఇచ్చి మనసులోని మాటను బయటపెట్టిండు. అనుకున్నట్టు తన కోరిక తీరిస్తే ఒక ‘డైమండ్’ను ఇస్తనని వాదాకూడా చేసిండు. ఆమె ఒరిజినల్ గా లండన్ కు చెందిన వ్యక్తి. కోహినూర్ వజ్రం, జాకబ్ డైమండ్ గురించి తెలుసామెకు. అందుకే ఈయన ఏ డైమండ్ ఇస్తడోనని ఒప్పుకుంది. నైజాం ఒక రాత్రి అనుకున్నట్టే ఆమెకు డైమండ్ ను ఇచ్చి అనుభవించిండు. ఐపోయింది. తర్వాత ఆమె తన కపుర్తలా సంస్థానానికి వెళ్ళిపోయింది భర్త జగత్ జిత్ సింగ్ తో కలిసి.
తర్వాత రాజభరణాల రద్దు. . ప్రీవి-పర్స్ బిల్లు. . రాజు చనిపోవడం. . తర్వాత నైజాం కూడా పరమపదించడం జరిగి ప్రేం కౌర్ తిరిగి తన స్వస్థలం లండన్ వెళ్ళిపోవడం. . కాలక్రమంలో ఆమె రాణీ స్టైల్ జీవితంతో ఆస్తి అంతా కరిగిపోవడం. . ఒకానొక దశలో వెనుకట నైజాం తనకు తనను పొంది తమ కలయికకు గుర్తుగా ఇచ్చిన డైమండ్ ను అమ్ముకుందామని జ్యువలరీ ఎక్స్ పర్ట్ ను సంప్రదిస్తే. . బాగా పరిశీలించి అది ఒట్టి గాజు ముద్ద అని తేల్చి చెప్పడం. . పాపం ప్రేం కౌర్ ఎవరికి ఏమి ఇచ్చి ఏది కానుకగా పొంది. . ఎలా మోసపోయి. . వ్చ్.
నీచం కదా. . పాపం.
మోసం చేయడానికీ. . మోసపోవడానికీ అంతస్తులతో, స్థాయితో అస్సలే పని లేదుకదా రమణా”అంది సుమ గంభీరంగా.
రమణ ఏమీ అనలేదు. మౌనంగా చూశాడామెవంక అభావంగా.
ఇప్పుదీ కథను ఈమె తనకు ఎందుకు వినిపించినట్టు. . అనుకున్నాడు.
సింగపూర్ ఏర్ పోర్ట్ వచ్చేసింది. బిలబిలమని ఇద్దరూ దిగి. . డిస్ప్లే బోర్డ్ దిక్కు నడిచారు.
ఆ ఏర్ పోర్ట్ లో సెల్ఫ్ బోర్డింగ్ సదుపాయముంది. టెరిమినల్-3కి వెళ్ళాలి.
గ్రౌండ్ ఎస్కలేటర్ పై నిలబడి. . ముందుకు వెళ్తున్నారు నిలబడే.
టెరిమినల్-3 కి పది నిముషాల్లో చేరి. . చెక్ ఇన్. . ఇండిగో కౌంటర్.
లగేజ్ ఏమీలేదు సుమకు. ఒట్టి హ్యాండ్ బ్యాగే. సెక్యూరిటీ చెక్ ఐపోయి ఇక గేట్ నంబర్ 22 కి వెళ్ళబోతూండగా,
“ఎందుకో దుఃఖంగా ఉంది రమణా. కారణం తెలియదు. మనసంతా మబ్బుపట్టిన ఆకాశంలా ఉంది. “అంది సుమ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
“నాక్కూడా. భారంగా ఉంది. ”
“దొంగ నవ్వులొస్తాయి రమణా. . కాని దొంగ దుఃఖాలూ, కన్నీళ్ళూ రావు”అంటూండగా సుమ కళ్ళళోనుండి నీళ్ళు జలజలా రాలి పడ్డాయి.
రమణ ఒక్క క్షణం ఆమె నీళ్ళు నిండిన కళ్ళలోకి చూచి. . నిజంగానే చలించి. ,
“మనుషుల మధ్య భౌతిక సంబంధాలెలా ఉన్నా కొద్దిదూరం కలిసి నడవడంవల్ల ఏర్పడే సాన్నిహిత్యం మాటలకందని ఓ అదృశ్య బంధాన్ని ఏర్పరచి. . ” ఇక మాట్లాడలేకపోయింది సుమ.
అవతల ఇండిగో విమానపు ప్రకటన స్క్రోల్ ఔతోంది తెరపై.
రమణ జేబులోనుండి తీసిన సుమ ఫ్లైట్ టికెట్ ను ఆమె చేతికిస్తూ దాంతోపాటు ఒక లావుగా ఉన్న కవర్ ను అందించాడు.
“ఇక వెళ్ళు సుమా. జాగ్రత్తా. టేక్ కేర్”అన్నాడు రమణ.
వాటిని తీసుకుని భారంగా, మెల్లగా 22వ గేట్ దిక్కు నడిచింది.
బోర్డింగ్ లాంజ్ లోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూచింది సుమ రమణ కోసం. అతను కనబడలేదు. వెళ్ళిపోయినట్టున్నాడు.
ఇంకా బోర్డింగ్ టైం ఉంది.
కూర్చుంది ఫైబర్ కుర్చీపై.
తలలో రమణ. . జానకి. . రవళి. . సెక్రెటేరియట్ లో చెప్పుతో కొట్టిన దృశ్యం. . అన్నీ జ్ఞాపకమొస్తూ వీడియో బొమ్మల్లా.
లోపల ఏదో అర్థంకాని శూన్యం.
పిలుపు. . క్యూ. . కదలిక. . ఏరోబ్రిడ్జ్ లోకి ప్రవేశం. . సీట్ నంబర్ 22 సి-6.
కూర్చుంది సుమ.
మనిషిపై. . నమ్మకం. . అపనమ్మకం. మధ్య సన్నని గీత. . వెంట్రుకవాసి. వెలుగుకూ చీకటికీ మధ్య సన్నని రేఖ. . సంధ్య.
హోస్టెస్ ప్రికాషన్స్ చెబుతోంది. . సీట్ బెల్ట్. . ఏర్ జాకెట్. . వగైరా.
అకస్మాత్తుగా సుమకు నైజాం నవాబు, ప్రేం కౌర్ జ్ఞాపకమొచ్చారు.
చటుక్కున లేచి హ్యాండ్ బ్యాగ్ ను తీసుకుని రెస్ట్ రూం లోకి వెళ్ళింది.
వెళ్ళి ఆతురతగా బ్యాగ్ ను తెరిచి రమణ ఇచ్చిన కవర్ ను విప్పి చూచింది. ఐదు వేయి రుపాయల కట్టలున్నాయి. ఐదు లక్షలు.
ఆమె మనసు ఆ క్షణం ఆకాశంలోనుండి రాలి పడ్తున్న నీటి బిందువులా ఉంది. చినుకు ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు.
స్త్రీ. . పురుషుడు. . దేహాలు. . దేహాంతర లోకాలు. . ఆత్మ. . అర్థంకానిది ఏదో.
ఫ్లైట్ టేకాఫ్ ఔతున్నట్టున్నది. రన్ వే పై భీకరమైన కీచుమని చప్పుడు.
సరిగ్గా. . ఆ క్షణం రమణ అదే ఏర్ పోర్ట్ లోని టరిమినల్ 4 డిపార్చర్స్ గేట్ దగ్గర అనురాధా బన్సల్ ను రిసీవ్ చేసుకునేందుకు నిరీక్షిస్తున్నాడు.
అనురాధా బన్సల్ ఐ ఎ ఎస్ తమిళ్ నాడులో ఉన్నత విద్యా శాఖ కమీషనర్. ముప్పై ఆరేళ్ళ వయసు. ఆన్ లైన్ చాటింగ్ ద్వారా పరిచయం.
‘అనురాధా బన్సల్. . పెళ్ళి చేసుకోడానికి తనకు పనికొస్తుందా’ అని పరిశీలన చేసుకోవడం ప్రస్తుతం రమణ పని.
చూస్తున్నాడు గేట్ దిక్కు.
ఫ్లైట్ దిగిన ప్రయాణీకులు గుంపులు గుంపులుగా వస్తున్నారు బైటికి.
రమణ కేవలం ఫోటోలో మాత్రమే చూచిన అనురాధా బన్సల్ ను గుర్తుపట్టేందుకు ఉద్వేగంగా ఎదురు చూస్తున్నాడు.

******

ఆర్ పి ఎఫ్ పోలీస్ స్టేషన్ తెరుచుకున్న సింహం నోటిలా భయంకరంగా. . చెమ్మ చెమ్మగా ఉంది.
అప్పటికే వకుళ ఎస్సైతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ గదిలోపల ఓ మూలన భయం భయంగా ఒదిగి కూర్చుని ఉంది.
జరుగబోయేది ఏమిటో ఆమెకు స్పష్టంగా తెలుసు.
ఒకటే ప్రశ్న వేసుకుంది వకుళ. తనిప్పుడు ఈ సింహం పంజానుండి తప్పించుకోగలదా, ? అని.
‘అస్సలే తప్పించుకోలేను ‘అని జవాబొచ్చింది.
ఓటమి అనివార్యమైనపుడు లొంగిపోవడమే తెలివైన నిర్ణయమని తను ఎక్కడో చదువుకున్నట్టు జ్ఞాపకం. కాబట్టి లొంగిపోదామని స్వచ్ఛందంగా వకుళ నిర్ణయించుకుంది.
మనిషి ఎప్పుడైనా లొంగిపోయేప్పుడు కొన్ని షరతులు పెడతాడు. వాటిని తు. చ తప్పకుండా పాటించే విశ్వాసాన్ని కోరతాడు.
వకుళ కూడా అలానే అడిగింది ఎస్సైగారిని.
ఒకటి. . తనకు సంబంధం లేకున్నా ఆ బరిబాత ప్లాట్ ఫాం పై దొరికిన యువకుణ్ణి తనకివ్వాలె. రెండు. . తనకు సత్వర ఖర్చులకుగాను ఓ ఐదువందల రూపాయలివ్వాలి.
ప్రతిగా వకుళ అను ఇరవై రెండేళ్ళ మిలమిలలాడే వయసున్న తను ఎస్సై కి లొంగి పడుకోవాలి ఒక్కసారి.
ఒప్పందం ఓకే ఐన తర్వాత ‘మనిషి దొంగ ‘అనే సిద్ధాంతంప్రకారం ఎస్సైని ముందే ఐదువందల రూపాయలను అడిగి తీసుకుంది.
ఏ మనిషైనా వానికుండే దుర్మార్గ లక్షణమేమిటంటే. . పని కాకముందొక మాట. జస్ట్ పని ఐపోగానే ఇంకొక మాట.
ఈ షరతులపై. . వకుళ పోలీస్ స్టేషన్ గదిలోపల వేచి చూస్తూండగా,
గదిలోకి రాగానే ఎస్సై తలుపులకు లోపలనుండి గొళ్ళెం పెట్టి. ,
పైన ఒక ఎలుగుబంటు దూకినట్టే.
వకుళ తుఫాన్ లో గడ్డిపరకలా వణికిపోయింది.
భీకరమైన తుఫాన్ వస్తున్నపుడు చెట్లు విరిగి నేలకొరిగిపోతాయి. భవనాలు కూలిపోతాయి. ఇతరేతర నిర్మాణాలు కొట్టుకుపోతాయి. కాని గడ్డిపరక మాత్రం ఊర్కే అటుఇటూ ఊగిసలాడి తుఫాన్ ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ నిక్కి నిలబడి తలెత్తుకుని మనిషికి పడిలేవడంలోని కీలక రహస్యాన్ని ఒక పాఠంలా విప్పి చెబుతుంది.
ఐతే విషాదమేమిటంటే ప్రకృతి నిరంతరం మనిషికి పాఠాలను చెబుతూనే ఉంటుంది . కాని దుర్మార్గుడైన మనిషి ఆ పాఠాలను ఎన్నడూ వినడు.
అమెరికన్ ప్రముఖ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ ఏం చెప్పాడంటే. . ‘బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్థావర విద్యుత్తు. . విద్యుదావేశం గురించి తెలుసుకోవాలని అతనికోసం ఆకాశం ఎన్నిసార్లు ఉరిమిందో. ఐజాక్ న్యూటన్ భూమి గురుత్వాకర్షణ శక్తి గురించి తెలుసుకోడానికి ఎన్నిసార్లు ఆపిల్ పండ్లను రాల్చిందో యుగయుగాలనుండి. మనిషికి ప్రకృతి రహస్యాలను విప్పి చెప్పాలని సృష్టి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. కాని మనుషులు అంత తొందరగా ప్రకృతిని అర్థం చేసుకోరు. ఐనా తల్లివలె ప్రకృతి అలసిపోకుండా సంకేతాలను మనిషికోసం పంపుతూనే ఉంది. ‘అని.
వకుళ భరిస్తూనే ఉంది ఎస్సై రాక్షస రతిని. . పళ్ళు బిగపట్టుకుని. దుఃఖాన్ని మూసుకున్న కనురెప్పల వెనుక దాచుకుని.
రతికార్యమెప్పుడూ ఆనందకరమైందే. . ఎవరికైనా. ఐతే అది హృదయాన్ని స్పర్శించేదా. . హృదయాన్ని ఛిద్రం చేసేదా అన్నదాన్నిబట్టి అది ఆనందదాయకమా. . దుఃఖదాయకమా అన్నది నిర్ధారితమౌతుంది. అయిష్టత అనేది నరకం.
అక్కడ ఆ క్షణం ఒక పూవు నలిపేయబడింది.
ఒక అరగంట తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆత్మరక్షణ తొందర మొదలైంది.
“ఏయ్. . తొందరగా ఆ బరిబాతగాన్ని తీసుకుని ఇక్కడ్నుండి చెకాఫ్ ఐపో. జల్ది. జల్ది ఐదు నిముషాలల్ల వెళ్ళిపోవాలె ఇక్కడినుండి. కమాన్. . తెల్లవారుతాంది. ”
భయం. . తప్పు చేసినోనికి తప్పు జరిగిన మరుక్షణం నుండే చచ్చేంత భయం.
“అరే రహీం. . ఇస్కో జల్దీ లేచలోరె. జల్దీ జల్దీ”
పది నిముషాల్లో రహీం వచ్చి”ఆటో ఆయా సాబ్. . బేజ్దూం ఓ బచ్చీకు”అని ఎస్సై ముందు నిలబడ్డం కనబడుతోంది.
వకుళ మనసు అప్పుడే నిప్పు అంటుకున్న దూదిగుట్టలా ఉంది. దహించుకుపోతోంది ఏదో లోపల.
ఎక్కడికి వెళ్ళాలి తనిప్పుడు. . వరంగల్లు నగరమే కొత్త. ఎప్పుడూ రాలేదు తనిక్కడికి. . కాని వెళ్ళాలి. . తప్పదు.
ఎస్సైకి ఎందుకో వకుళపై జాలి కలిగింది. అనుభవించడం వల్లనా. వ్చ్. . ఎక్కడికెలుతుందీమె. . నగరం కొత్తంటోంది కదా.
ఎదుట నిలబడ్డ ఆటోవాడు అడుగుతున్నాడు రహీం ను “కహా జానా సాబ్”అని.
ఔను. . కహా జానా. రహీం ఎస్సైగారి దిక్కు చూశాడు ప్రశ్నార్థకంగా.
“ఎంజీఎం కే పాస్”అన్నాడు ఎస్సై స్వయంగా. “దో లోగ్” అనికూడా.
“యాభై రూపాల్”
“సరే. . ఏ లో. . జల్దీ కరో. . లేచల్. అరే రహీం పక్డో. . ఓ మరద్ ఆద్మీకో. ఆటోమే లగావ్. “.
ఏమనుకున్నాడో ఏమోగాని ఎస్సైగారే ఆటోవాడికి డబ్బిచ్చి. . “ఏయ్ పోరీ. . వీణ్ణి గవర్నమెంట్ దవాఖాన ఎంజిఎం ల జాయిన్ చేయించు. నువ్వు అక్కడే లలితాదేవి గుడి వెనుకాల ఉన్న కస్తూర్బా గాంధి సత్రంల చేరు. బెస్టాఫ్ లక్. . పో. అరే పట్టండిరా వీణ్ణి”
అర్థమైంది వకుళకు.
ప్రక్కనున్న బట్ట సంచీని తీసుకుని నేలపై పడున్న యువకుని దగ్గరకొచ్చింది ఆతురతగా. ఆమెకు ఒక విషయం అర్థంకాలేదు. తనతో ఎస్సై’తన దగ్గర పడుకునే ‘ప్రతిపాదన తెచ్చినపుడు తను ఈ మనిషి తనకు కావాలనే కండిషన్ ను ఎందుకు పెట్టినట్టు. అసలు వీడెవడు. తనకు వాడు కావాలనే బుద్ధి ఎందుకు పుట్టినట్టు. అసలు తనకే ఒక ఠికాణా లేనప్పుడు. . వీని గురించిన బాధ తనకెందుకు.
ఏమో. . ఎందుకు పుట్టిందో ఆ బుద్ధి. చూద్దాం.
“పట్టు పట్టు”అని అందరూ ఆ యువకుణ్ణి లేబట్టి ఆటోలో వేద్దామని అనుకుంటూండగా. . అందరూ గమనించిన విషయ మేమిటంటే. . వాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కదులుతున్నాడు.
కళ్ళనిండా శూన్యం. పిచ్చిగా ఉందా చూపు. ఒంటిమీద అప్పుడు టకటకా హడావిడిగా చుట్టిన చిన్న తువాలు. . అంతే. అది తప్ప ఏ ఆచ్చాదనా లేదు మీద.
“అరే లేరా. . “అని గదమాయింపు.
ఉహు. ,
ఏ ప్రతిస్పందనా లేదు. తలతిప్పి చూశాడు ఊర్కే. . అభావంగా. ఈలోగా రహీం అతని చేయి పట్టుకుని లేపాడు యధాలాపంగా.
చిత్రం. . లేచి నిలబడ్డాడు. . కూలిన భారీ చెట్టు మళ్ళీ లేచి భూమిపై నిలబడ్డట్టు.
కండలు తిరిగిన భారీ విగ్రహం. దాదాపు ఆరు ఫీట్ల ఎత్తు. మనిషిలో అర్థంకాని ఏదో అద్భుతమైన ఆకర్షణ. ‘ఎవడో వీడు. . కాని ఏదో ఓ కథ ఉంది వీని వెనకాల. ‘అనుకున్నాడు ఎస్సై ఎందుకో.
అతనికి ఆ యువకుని విషయాన్నిగానీ, ఇంతకుముందు తను అనుభవించిన వకుళ విషయంగానీ ఆలోచించి అనవసరంగా తన విలువైన సమయాన్ని వృధాచేసుకునే ఓపిక లేదు. అందువల్ల అతనికి ఏ లాభంకూడా లేదు. తనకు వ్యక్తిగతమైన ఏదోఒక లాభం లేనిది ఏ పనినైనా అతను చేయడుగాక చేయడు.
అదీగాక ఇదొక గాలికి పోయే కంప. ,
మెల్లగా నడిపిస్తూంటే. . ఆ యువకుడు తానే స్వయంగా నడుస్తూ,
ఆశ్చర్యపోతూ, “అరే నీ పేరేందిరా”అన్నాడు ఎస్సై.
అతను మాట్లాడలేదు. తలెత్తి పిచ్చి పిచ్చిగా చూశాడంతే.
“మాటలు రావా”
“. . . . “ఉహు. . సమాధానం లేదు. ఒట్టి చూపే.
“ఏ ఊరు నీది. ?” పోలీస్ బుద్ధి.
“. . . . ”
“నీకెవ్వరూ లేరార. . ”
“. . . . ”
“ఏయ్ పోరీ. . వీడు ఇంతకు ముందే తెలుసా నీకు. ఎందుకు వీణ్ణి నీకు కావాలని పట్టుబడ్తున్నావ్”
“అమ్మతోడు సార్. తెల్వది వీడెవ్వడో. . కాని అయ్యో పాపమనిపించి. . ”
“ఉహూ. . పాపమనిపించా. . వాటంగున్నడు బాగ పనికస్తడనా. . ఊ. . ”
“సరే. . నడవండిక. . చలో”
వకుళ ఒక చేతితో బట్ట సంచీని తీసి చంకలో పెట్టుకుని మరో చేత్తో అతని చేయిని పట్టుకుని బయటికి నడిచింది. పోలీస్ స్టేషన్ వెనుకనుండి డైరెక్ట్ గా వెనుక గల్లీలోకి దారుంది ఇటునుండి చుట్టూ ప్లాట్ ఫాం మీదినుండి తిరిగి పోకుండా. ఆటో అక్కడికే వచ్చి ఆగి ఉంది.
బయటికొచ్చి అతన్ని ఆటోలోకి ఎక్కించి. . వకుళకూడా లోపలికి ఎక్కుతూండగా ఎస్సై వచ్చి “అరే రహీం ఈ వంద రూపాల్ కూడా ఇయ్యిర దానికి. . పాపమనిపిస్తాంది. “అని జేబులోనుండి ఒక వంద నోట్ ను ఇచ్చాడు రహీంకు. రహీం క్షణంలో ఉరికొచ్చి ఆమె చేతిలో నోట్ నుంచాడు.
కాని ఆమె వాటి దిక్కు చూచుకుంటే అవి రెండు వందరూపాయల నోట్లున్నాయి.
ఎందుకో రహీం దిక్కు దీనంగా, కృతజ్ఞతగా చూచింది వకుళ.
ఆమె తలంతా ఎవరో సుత్తె తో కొట్టినట్టుగా దిమ్ముగా మత్తుగా ఉంది.
“ఎక్కడికి వెళ్ళాలో అర్థమైందిగదా బాబూ”అంది అటోవాలాతో.
“తెలుసు మేడం. . ఎంజిఎం. . ”
ఆటో కదిలింది. మలుపు తరిగి రైల్వే స్టేషన్ ఆవరణలోకి రాగానే ఓరుగల్లు కాకతీయుల విజయతోరణం నిలువెత్తుగా. . ఒక యుద్ధ యోధుడు తలెత్తుకుని నింగిలోకి పొంగి నిలబడ్డట్టుగా కనిపించి. . ఒక పులకింత. . ఒళ్ళు గగుర్పాటు. లిప్తకాలం కన్నార్పకుండా చూచి,
ఆటో ఎడమదిక్కు తిరిగి. . ఇన్ కంటాక్స్ ఆఫీస్. సూర్య హోటెల్. . సునిల్ టాకీస్. . క్రిష్ణా కాలనీ. . ఆకారపొల్ల తోట. . చౌరాస్తా.
“ఎంతదూరం ఇక్కడినుండి ఎం జి ఎం ”
“ఎంత మేడం. . ఇంకో పది నిముషాలు. . ఏ ఊరు మీది”
“ఈ రాష్ట్రం కాదు. . చత్తీస్ గడ్”
“తెలుగెట్లచ్చింది”
“నేర్చుకున్నా. అవసరం దేన్నైనా నేర్పిస్తదిగదా”
“సార్ ఎంజిఎం కాడ కస్తూర్బా సత్రం ల దించుమన్నడెందుకు. ఎవలు లేరా మీకిక్కడ. ”
సంభాషణ. . అదొక్కటే మనిషిని మనిషితో సంధానించేది.
మాట. ఒక శక్తివంతమైన ప్రస్తారం.
మాట ఒక ఆయుధం. సన్యాల్ సార్ చెప్పేది నిరంతరం. ఆయుధాన్నీ, మాటనూ ఎప్పుడైనా చాల జాగ్రత్తగా, పదిలంగా, అనివార్యమైనప్పుడే ఉపయోగించాలని.
నిజమే.
తెలివిగల ఎగ్జిక్యూటివ్స్ చాలా తక్కువగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని ఎక్కువగా వింటూ వ్యూహాలు రచిస్తారనీ, తంత్రాలు తయారు చేసుకుంటారనీ చదివింది తను శివ్ ఖేరా రాసిన ‘మీరు విజయాన్ని సాధించగలరు ‘పుస్తకంలో.
అప్పటిదాకా ఆమె ప్రక్కన కూర్చున్న అతన్ని గమనించనే లేదు. జ్ఞాపకమొచ్చి అతనివంక చూచింది. ఊర్కే అలా అటువేపు చూస్తున్నాడు.
నిజానికి ఎవరితను. ఎందుకు అలా రైల్ లోనుండి బయటికి తోసేయబడ్డాడు. చూడ్డానికి అంతా మామూలుగా ఆరోగ్యంగానే కనిపిస్తున్న ఇతని నేపథ్యమేమిటో. ఏమైనా ఇతను ఎందుకు మాట్లాడ్డంలేదు. అసలు మాటలు రావా. చెవులు వినబడుతున్నాయా. చెప్పినదాన్ని విని అర్థం చేసుకుంటున్నాడా. మొదట ప్లాట్ ఫాం పై దొరికినప్పుడు అపస్మారకంగా ఎందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ నుండి తోసేయబడ్డాడని పోలీస్ లు చెబుతున్నారుగదా. . అంటే ఇతని నేపథ్యం ధనవంతమైందా. ప్రయాణిస్తున్న క్రమంలో వెంట ఉన్న సహ ప్రయాణీకులే ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఇతన్ని వదిలించుకున్నారా. వదిలించుకోవాలనుకుంటే చంపేయాలిగదా. తోసేయడమెందుకు. అదీ సేఫ్ గా. . ప్లాట్ ఫాం పై. ఏ దెబ్బా తగులకుండా. ఐనా అతని కణత దగ్గర ఎస్సై చెప్పినట్టు ఆ చిన్న రంధ్రం. . పచ్చగా చుట్టూ ఆ మరక ఏమిటి. ఇతని పేరేమిటో.

మెల్లగా అతని తొడపై చేయి వేసి చూచింది.
దిగ్గుమని ఉలిక్కిపడి తనవైపు చూశాడు.
సైగ చేసింది ‘ఏమిటి ‘అన్నట్టు.
చూస్తున్నాడుగాని స్పందన లేదు. ఒట్టి బేలగా.
ఆమెకో చిత్రమైన సమస్య తోచింది. అతని ఒంటిపై బట్టలు లేవు. రాత్రి పోలీసోల్లు సమకూర్చి చుట్టిన ఒక్క తుండుగుడ్డే మొల చుట్టూ. ఇలా వెంట తీసుకుపోయి ఎక్కడైనా తను ఎలా గెటాన్ కాగలదు. బట్టలు కావాలి పాతవో. . కొత్తవో. . ఏవో. కాని డబ్బు. ?
తెల్లవారుతున్న ప్రాతః వేళ.
ఆటో వెళ్తూనే ఉంది. మెల్లగా. జెపిఎన్ రోడ్. పెట్రోల్ పుంప్. . స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. . ఐసి ఐసి ఐ బ్యాంక్. . నిర్మల మాల్. . కరూర్ వైశ్యా బ్యాంక్. ,
“అన్నా ఒక హెల్ప్ చేస్తావా. ఇతన్ని చూస్తున్నవ్ గదా. ఒంటిపై బట్టలే లేవు. మనిషి పరిస్థితి బాగలేదు. అగ్గువలో ఎక్కడన్న పాత బట్టలు దొరుకుతయా”
ఆటో నడుపుతున్నవాడల్లా ఒక్క క్షణం చటుక్కున వెనుకకు తిరిగి అతనివంక చూచి. . “పాత బట్టలా” అని గొణుక్కున్నాడు సాలోచనగా.
ఎందుకో అతనికి పాపమనిపించింది. పైగా ఆమె అన్నా అని పిలిచిన పిలుపు అతన్ని కదిలించింది. మనుషుల్లో కొన్ని హృదయానుగతమైన పొరలుంటాయి. ఒక్కో పొర కింద ఆనంద విషాదానుభూతులూ, స్మృతులూ మరుగునపడి దాగి. ,
పోచమ్మ మైదాన్.
చౌరాస్తాలో గంభీర వదనంతో అశ్వారూఢయైన ఓ వీర వనిత. చూస్తేనే ఒక ఉద్వేగభరితమైన మహోద్రేకం పొంగుతూ. ,
“అన్నా. . ఎవరీమె”అనదిగింది అటో వ్యక్తిని వకుళ.
“ఆమె రాణీ రుద్రమదేవి. కాకతీయుల వీరవనిత”
మళ్ళీ ‘అన్నా’ అన్న ఆమె పిలుపు. . సంబోధన. కరిగిపోయాడతను.
ప్రక్కన ఆటోనాపుకున్నాడు.
తలెత్తి చూచింది వకుళ. పోతన టెలిఫోన్ భవన్. ప్రక్కనే గల్లీ.
ఆటో దిగి అతను వకుళ ప్రక్కన కూర్చున్న వ్యక్తిని క్షణకాలంలో పరిశీలనగా చూచి “నేనిప్పుడే వస్తానమ్మా. మా ఇల్లు ప్రక్క గల్లీలనే. ఇతనికొక ప్యాంట్ షర్ట్ తెస్త. ” అనుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు పెద్దపెద్ద అంగలతో.
ఆశ్చర్యపోయింది.
నిజానికి ప్రక్కనున్న మనిషియొక్క ‘నగ్నత ‘ పెద్ద సమస్యే. ఎలా అని అప్పటినుండీ ఆలోచిస్తోంది.
‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందమ్మా’ అని సన్యాల్ సారే చెప్పిన మాట జ్ఞాపకమొచ్చింది.
మౌనంగా సాలోచనగా చూస్తోంది వకుళ చుట్టూ.
సమస్య తీవ్రమై ఉద్వేగభరితంగా ఉండి వేదిస్తున్నపుడు తెలివైనవాడు అదనపు ప్రశాంతతతో సంయమనం పాటిస్తూ వివేకంతో ఆలోచిస్తాడు. అదే చేస్తోందామె ఆ క్షణం.
ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. . ఇటు దిక్కు రత్న హోటల్. కొద్దిగా చిక్కబడుతున్న రవాణా.
ఉన్నట్టుండి వకుళకు దుఃఖం ముంచుకొచ్చింది. . ఒక్క లిప్త కాలంలో రాత్రి జరిగిన నరక సదృశ అనుభవం మనసులో మెదిలి.
రేప్ అంటారా దాన్ని.
ఒక స్త్రీతో ఆమె ఇష్టానికి భిన్నంగా జరిపే రతికార్యాలన్నీ ‘రేప్ ‘లే ఔతాయా.
ఐతే తను జీవితంలో ఎన్నిసార్లు రేప్ చేయబడ్డట్టు.
ఒక్క క్షణం లో గతంలోని అడవులు. . గుట్టలు. . నదులు. . అజ్ఞాత జీవితాలు. . తండాలు. . గూడేలు. పశువుల్లో మనుషులు. . మనుషుల్లో పశువులు. . రక్తసిక్త బోసి పాదాలు. నెత్తురులోడుతున్నా పరుగు. . పరుగు. . కొయ్యలపై. . కొచ్చటి రాతి మొనలపై. . ఎందలు. . వానలు. . గజగజ వణికే చలిలో పశువుల కొట్టాల్లో దాక్కోవడాలు. . నమ్మిన తోటి మనిషే చాలా అనూహ్యంగా తోడేలులా పైబడి కుమ్మి కుమ్మి అత్యాచారం జరుపడాలు. ప్రశ్నించ వలసినవాళ్ళే ప్రశ్నింపబడే నేరాలు చేసి. . కంచే చేను మేస్తూ. . ఇక చెప్పుకోడానికెవరు. ఒకటి. . రెండు. . అనేకం. ఒకసారి చిగిపోయిన గాలిపటం ఇక ఎన్నిసార్లు చిరిగిపోయినా. . ఒక్కటే. ఎగరదది.
అసలు ఈ శీలమనేదేమిటి. ?
స్త్రీ శిలాన్ని కోల్పోవడమేమిటి. ?
ఒక్క భర్తతో తప్ప ఎంకెవరితోనైనా స్త్రీ సంభోగిస్తే శీలాన్ని కోల్పోయినట్టేనా. భర్త మాత్రం భార్య గాక ఎందరితో పడుకున్నా శీలం కలిగి ఉన్నట్టా. ఇష్టాయిష్టాలతో. . వ్యక్తుల తత్వ ప్రవర్తనలతో అభిరుచీ స్వభావాలతో సంబంధం లేకుండా ఇద్దరు. . స్త్రీ పురుషులు బలవంతంగా నైనాసరే పర శృంగార చేష్టలకు పాల్పడకుంటే వాళ్ళు సచ్చరిత్రులా.
రతికార్య పరంగా ఒక స్త్రీ భంగపడగానే. . ఒక గంభీర ఘంటసాల గొంతుతో ‘చెల్లీ. . నీ శీలమే చెల్లెను తల్లీ’ అని దిక్కుమాలిన పాటలను పాడించి. . స్త్రీని ఒక శాశ్వత విషవలయంలోకి నెట్టి. ,
ఛీ ఛీ.
వకుళకు ఎందుకో ప్రముఖ తమిళ కథకుడు. . జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జయకాంతన్ రాసిన ‘అగ్నిప్రవేశం’కథ గుర్తొచ్చింది.
అందులో ఒక కాలేజ్ అమ్మాయి ఒక వర్షాకాల బీభత్స సాయంకాలం ఇంటికొస్తూ. . బస్ స్టాప్ లో ఎదురుచూస్తూ. . విధిలేక ఒకడి కార్లో లిఫ్ట్ ఇస్తే వెళ్తుంది. వాడు ఆ ఆమ్మాయిని రేప్ చేసి ఇంటిదగ్గర దింపేసి వెళ్ళిపోతాడు.
ఆ అమ్మాయి చింతాక్రాంతయై. ,
తల్లి. . స్త్రీ. . దయామయికదా. . గ్రహించి అడుగుతుంది. బ్రతిమాలుతుంది. స్నేహితురాలిగా భావించి అంతా చెప్పమంటుంది.
ద్రవించే సహజ గుణమున్న ఆడది గడ్డకట్టినట్టూ ఉండలేదు. చెబుతుంది తల్లికి అంతా.
విన్న తల్లి. . ముందు నువ్వు స్నానం చేసిరమ్మని కూతురుకు చెప్పి. . వచ్చాక వేడి అన్నం వడ్డించి. . చెబుతుంది. . “అంతా మరిచిపో. ఇప్పుడేమీ జరుగలేదు. మీద బల్లిపడితే ఏం చేస్తాం . స్నానం చేసి మరిచిపోతాం. ఇదికూడా అంటే. జస్ట్ లైక్ దట్. ఫర్గెట్. సీత అగ్ని పునీత ఐనట్టు నువ్వు స్నానానంతరం జలపునీతవు. “అని సాంబ్రాణి పొగ వేసి తలనిమురుతుంది.
అంతే.
ఇష్టంలేని బలవంత స్త్రీ సమాగమాలన్నీ ఇటువంటి విస్మరణీయ ఘటనలే.
తను జలపునీత. . అనుకుంది వకుళ.
మనసుకు అంటని మలినం. . కడుక్కుంటే పోయేదే.
“సిస్టర్. . “అని పిలుపు.
ఆటో డ్రైవర్ ప్రసన్నంగా ఎదుట.
చేతిలో ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ ను వకుళకిస్తూ,
“ఎక్కడ వేయిస్తావ్ వీటిని. . ఓ పని చేద్దాం. కస్తూర్బా సత్రం లోకి వెళ్ళిన తర్వాత లోపలే ఉన్న ఒక చెట్టుకింద. . పద”అని ఆటోను స్టార్ట్ చేశాడు మల్లీ.
గోపాలస్వామి గుడి బస్టాండ్. . ఎంజిఎం రెండవ గేట్. ఎస్బీఇ ఎటిఎం. ఇస్లామియా కాలేజ్ . చౌరాస్తా రాగానే ఆటోను సూటిగా ఒక గుడి ప్రక్కనుండి లోపలికి పోనిచ్చి ఆటోను ఆపి. “ఇదే. . ” అన్నాడు.
వకుళ దిగి. . యువకుణ్ణి చేయిపట్టుకుని దింపి. ,
వకుళ తన చిన్న సంచిలోనుండి పర్స్ ను తీసి. . యాభై రూపాయల నోటును ఇచ్చిందతనికి.
తీసుకుని. . అప్పుడిచ్చిన బట్టల సంచినీ, యువకుణ్ణీ తీసుకుని. . అటుప్రక్క నున్న బాదాం చెట్టు దగ్గరికి నడిపించుకు పోయాడు.
అతనిక్కూడా ఆశ్చర్యమేసింది.
ఇతను బెగ్గర్ మాత్రం కాదు. చూస్తూంటే ఏ ఉన్నత తరగతికో చెందిన బాగా చదువుకున్న వ్యక్తిలాగానే ఉన్నాడు. కాని సమస్య తెలియదు. ఎందుకు మాట్లాడట్లేదు. ఎందుకలా పరాకుగా మనలోకంలో లేని మనిషిలా ఉన్నాడు.
ఈమె ఇతనికేమౌతుంది. వీళ్ళెక్కడినుండొస్తున్నారు. ఏ దిక్కూ లేని వీళ్ళు ఈ మహానగరంలో ఎలా నిలదొక్కుకుంటారు.
పాపం. . అనిపించిందతనికి.
సుళువుగానే బట్టలేశాడు. సహకరించాడతడు.
బట్టలేసుకోగానే ఆ యువకునిలో ఒకరకమైన జీవకళ ఉట్టిపడింది. జుట్టు దువ్వుకొమ్మని తన జేబులోని దువ్వెన నిచ్చాడు. ఉహు. రెస్పాన్స్ లేదు. ఆటో అబ్బాయే దువ్వాడు నెత్తిని. చేయి పట్టుకుని వెంట నడిపించుకొచ్చి వకుళ ముందు నిలబెట్టి అప్పగిస్తూ,
“ఇతను తన పేరును మరిచిపోయినట్టున్నాడు. మనమే ఒక పేరు పెడదాం సిస్టర్. . ఊ. . గాంధి. . ఓకేనా. నాకైతే బాగుంది. . నీకు” అన్నాడు.
వకుళ తలూపింది.
“నాపేరు గోపాల్ సిస్టర్. ఇంతకు ముందు ఆటోను ఆపిన చూడు. . పోచమ్మ మైదాన్. . అక్కడే మా ఇల్లు. నేను ఈ సత్రం మనిషితో మాట్లాడి మీకు టెంపరరీ వసతి ఏర్పాటు చేస్త. తర్వాత మీరు మీ ఆలోచన చేయండి. నాతో ఏమైనా పనిబడితే నాకు ఫోన్ చేయండి. ఇదిగో ఇది నా మొబైల్ నంబర్. “అని ఒక కాగితాన్ని అందించాడు గోపాల్.
పది నిముషాల్లో వకుళ ఇంతకుముందు గోపాల్ పేరు పెట్టిన గాంధి తో కలిసి ఒక గదిలో చేరి,
కింద నేలపై గోడకొరిగి కూలబడింది.
గాంధి నిశ్శబ్దంగా ఆమె వెనుక వచ్చి చుట్టూ చూచి ఆమెకెదురుగా గోడకొరిగి కూర్చుని. . కాళ్ళు చాపుకుని,
అతన్ని ఆమె ఇక మొట్టమొదటిసారి చూడాలనే పరిశీలనాత్మకంగా, స్పష్టంగా, దగ్గరగా చూచింది.
గోపాల్ తొడిగిన బట్టలను వేసుకున్న తర్వాత గాంధి రూపురేఖలే మారిపోయాయి. ఎంతో హుందాగా, నిండుగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు.
‘గాంధీ అందగాడే’అనుకుంది వకుళ చిన్నగా తనలోతానే నవ్వుకుంటూ.
సాధారణ పరిస్థితుల్లో ఐతే తాము ఇద్దరూ. . ఒక ఇరవైఎనిమిది, ముప్పై ఏళ్ళ యువకుడు, ఒక ఇరవై నాలుగేళ్ళ యువతి ఒకే గదిలో ఇలా ఒంటరిగా ఉంటే లోకానికిగానీ, వ్యక్తిగతంగా తమకుగానీ ఎలా ఉంటుంది. . అని పరిస్థితిని పరులకోణంలో ఆలోచించింది వకుళ.
భయమేసిందామెకు.
సందర్భాన్ని ఎప్పుడూ మనకోణంలో కాకుండా ఎదుటివాళ్ళ కోణంలో చూడ్డం వివేకవంతులు చేసే పని.
ఈ స్థితి మళ్ళీ రసాభాస కాకముందే గాంధీ విషయం. . ఇటు తన విషయం స్పష్టంగా తేల్చుకుని ఒక నికరమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంది.
అసలీ గాంధీ ఏమిటి.
వీడికి చదువు వచ్చా. వస్తే ఏ ఏ భాషలు వచ్చు. అసలు వీడి మెదడు సరిగా చుట్టూ ఉన్న సందర్భానికి ప్రతిస్పందిస్తోందా.
రాత్రి ప్లాట్ ఫాం పై మొదటిసారి చూచినపుడు అసలు స్పృహే లేని మనిషి తెల్లారేసరికి స్పృహలోకొచ్చి ఎలా శారీరకంగా మామూలు స్థితికి చేరుకున్నాడు. అంటే టైం గడుస్తున్నకొద్దీ ఇతనిలో ఏదైనా మెరుగుపడే అవకాశం పెరుగుతోందా.
“గాంధీ. . “అని పిలిచింది ప్రేమ, ఆప్యాయత కలగలిసిన స్వరంతో.
తల వంచుకుని నేలను చూస్తున్నవాడు తలెత్తాడు వెంటనే.
సైగ చేసింది ఇటురా అన్నట్టు.
రాలేదు.
చూస్తున్నాడు అలా శూన్యంగా.
తన సంచిలోనుండి ఒక పుస్తకాన్ని బయటకు తీసింది. కరేన్ బ్లుమెంతల్ రాసి ఒక నెల రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ కాపీలమ్మిన. . ఈ మధ్యనే మరణించిన ‘ఆపిల్ ‘అధినేత స్టీవ్ జాబ్స్ ఆత్మ కథ అది. పుస్తకాన్ని గాంధీ ముందుకు విసిరింది దగ్గరగా. సరిగ్గా బుక్ అతని ముందు. . తనే చదువుదామని పెట్టుకున్నట్టు,
పుస్తకాన్ని చూశాడు. కళ్ళలో మెరుపు. . ఏదో.
ఆ వస్తువును పుస్తకమని గాంధీ గ్రహిస్తున్నాడా.
చేతితో తాకాడు దాన్ని. అట్టపైనున్న స్టీవ్ జాబ్స్ సజీవమైన ముఖం తన విలక్షణమైన రింలెస్ కళ్ళద్దాలగుండా గాంధీనే చూస్తున్నట్టు. ,
వకుళ చాలా మైక్రోస్కోపిక్ గా గాంధీ ఫీలింగ్స్ ను పసిగడుతోంది.
‘చాలా అరాచక తత్వంగలిగిన అసాధారణ ప్రతిభాశాలి స్టీవ్ జాబ్స్. ఆపిల్ కంప్యూటర్స్ ను తన ఐఫోన్ తో ఎవరూ ఊహించని ఆర్థిక విజయాల దిక్కు నడిపించి యాభై ఆరేళ్ళ వయసులోనే మృత్యువు ఒడిలోకి చేరినవాడు. రెండు విషయాలను చెప్పాడు జాబ్స్. ఒకటి. . మనిషిని అద్భుతమైన మానవీయ లక్షణాలతో ఆత్మప్రేరక చింతనతో మహోన్నత శిఖరాలవైపు నడిపించగల తాత్విక వారసత్వమంతా భారతీయ సంస్కృతిలో ఉంది అని. రెండు. . కార్యశూరుడు ఏరోజు పనిని ఆరోజే ముగించి. . నేను ఈరోజే చచ్చిపోతే ఏమిటి అని ప్రశ్నించుకుని. . తన మరణం వల్ల ఎవరూ ఏ రకంగానైనా నష్టపోకూడదన్న దృష్టితో పనిచేయాల’. . అని.
గాంధి పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.
చూస్తున్నాడు. సరిగానే. . కవర్ పేజ్ పైకి. . రీడబుల్ పద్దతిలోనే పట్టుకుని.
పేజీలను తిప్పుతున్నాడు. మామూలుగానే. అందరివలెనే.
చదువుతాడా.
“ఏం పుస్తకం గాంధీ అది” అంది వకుళ.
తలెత్తాడు. జవాబు లేదు. తెలుగు రాదన్నమాట.
“వాట్ బుక్ ఈజ్ థట్ మిస్టర్ గాంధీ”
కొన్ని నిముషాలు గడిచేయి.
“స్టీవ్ జాబ్స్” అన్నాడు చటుక్కున.
వకుళ షాక్ తో ఉక్కిరిబిక్కిరైపోయింది.
‘గాంధీ మాట్లాడుతున్నాడు. . గాంధీ మాట్లాడుతున్నాడు ‘. . అని బయటికి పోయి బిగ్గరగా అరవాలనిపించిందామెకు.
సరిగ్గా అప్పుడే బయట వర్షం ప్రారంభమైంది. ఆ విషయం వకుళకు తెలియదు.
“ఈజిట్ రెయిన్ మిస్టర్ గాంధీ ఔట్ సైడ్”అంది వకుళ ఇంగ్లీష్ లో.
వెంటనే అటు ఇటూ చూశాడు దేన్నో వెదుక్కుంటున్నట్టు. కళ్ళను స్తబ్ధింపజేసి ఏదో ఆలోచిస్తున్నట్టు సాలోచనగా దృక్కులు. . ‘గ్యాథరింగ్ హింసెల్ఫ్’ అన్నట్టు.
ఒకటి నుండి ఒక వేయి టెరాబైట్స్ మెమోరీ గల మనిషి ఒక సెకనుకు పదీ ఘాతం తొమ్మిది పేజీల వేగంతో జ్ఞాపకాలను స్కాన్ చేసుకుంటూ తనను తాను తవ్వుకునే సామర్థ్యంతో. ,
ఏమి చేస్తున్నాడతను. జ్ఞాపకం చేసుకుంటున్నాడా?
వర్షం పడి భూమి తడిచిన మట్టి వాసన వస్తోంది.
సకల ప్రత్యామ్నాయాలనూ సృష్టించగల మనిషి ఈ సహజ వర్షంలో తడుస్తున్న జీవవంతమైన మట్టి వాసనను మాత్రం సృష్టించలేడు.
వాసనను గ్రహించి “ఎస్. ఇటీజ్ రెయిన్”అన్నాడు చటుక్కున.
అని తను కూర్చున్న చోటినుండి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తున్నాడు వర్షంలోకి.
నిర్ధారించుకుంది వకుళ. గాంధీ మెల్లమెల్లగా తన జ్ఞాపకాలను స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాడని.
సంతోషమేసింది ఆమెకు.
“డు యు నొ తెలుగు ”
తలను ఇటు తిప్పి “నొ”అన్నాడు.
“ఫ్రం వేర్ డిడ్ యు కం”
“ఐ డు నాట్ నొ”
“డు యు నొ వేర్ యు ఆర్ నౌ”
“ఐ డు నాట్ నొ”
“వాట్స్ యువర్ నేం”
“నేం. . మై నేం. . ఐ డు నాట్ నొ”
ఆగిపోయింది వకుళ. ఇక ఏమీ ప్రశ్నించలేదు. అలా ఊర్కే అతన్ని పరిశీలనగా చూస్తూ,
ఏదో ఉంది ఇతని వెనుకాల. . అనుకుంది ఒక నిర్ణయానికొస్తూ.
ఇతనికి ఇతర భౌతిక అవసరాల గురించిన స్పృహ ఉందా అనే సందేహమొచ్చిందామెకు. ఆకలి. . దప్పి. . నొప్పి. . దుఃఖం. . ఇవి.
“ఆర్ యు ఫీలింగ్ టు ఈట్ సంథింగ్”
“ఈటింగ్”. . ఆశ్చర్యం ముఖం నిండా.
సైగ చేసింది తినడం గురించి అభినయిస్తూ,
ప్రతిస్పందనే లేదు.
టైం ఎంతైందో. ?
సంచిలో నిన్నటినుండి సైలెంట్ మోడ్ లో ఉన్న మొబైల్ ఫోన్ ను బయటకు తీసింది.
ఆన్ చేసింది. . తెరపై. . అక్షరాలు. . ఎనిమిది పదిహేను నిముషాలు.
ఆలోచిస్తోంది వకుళ ఇక తను చేయవలసిందేమిటా అని.
ఒకసారి దవాఖానలో చూపించడం మంచిదా. లేక కాలం గడుస్తున్నకొద్దీ మెల్లమెల్లగా కోలుకుంటున్నవాణ్ణి ఇంకా ఒకటి రెండు రోజులు వేచిచూచి ఒక నిర్ణయం తీసుకోవడం సరియైందా. అనూహ్యంగా తటస్థపడ్డ ఈ గాంధీతో అసలు తనగురించిన విషయమే తను పూర్తిగా మరిచిపోయింది.
నిజానికి తనది ఒక ‘గ్రేట్ ఎస్కేప్’.
వెనుక సింహం వెంటపడి తరుముతూంటే ప్రాణ రక్షణకోసం ఎటుతోస్తే అటు కకావికలై పరుగెత్తీ పరుగెత్తీ దరీ దాపూ లేనిచోటికి వచ్చి పడ్డ చిన్న జింక పిల్లలా. ,
పరుగుపెడుతున్నపుడు విచక్షణ నశిస్తుంది. దృష్టంతా గమ్యం మీదే ఉంటుందిగాని ఆలోచన మీద ఉండదు.
దిక్కూ దారీ లేని అడవిగుండా వచ్చీ వచ్చీ ఒక అనిశ్చితిలో నిలబడ్డ తను ఇక భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేయాలి. వెలుగని నమ్మి ఒక సుదీర్ఘకాలం కీకారణ్య చీకట్లలో అన్వేషించీ అన్వేషించీ. . అలసి. ,
చిన్ననాటినుండీ తనకు జీవితమంటే యుద్ధరంగమే ఎందుకైంది. అందరిలా ఒక మైదాన ప్రాంత క్రీడాస్థలిలా ఎందుకు లేదు. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి. . అడవిలోనే తల్లిదండ్రులను కోల్పోయి. . అడవినీ, అరణ్య గర్భాన్నీ అధ్యయనం చేసి. . ఒక వేటలో ఎక్కడో తుపాకీని కాలుస్తే గుండు ఎక్కడికో వచ్చి పడ్డట్టు. ,
అకస్మాత్తుగా ఎదుట కొత్త జీవావరణం.
దాదాపు ఇరవై నాలుగేళ్ళ సాంగత్యం అడవితో,
పుట్టి పెరిగి. . అడవి అణువణువునూ ఆపోశన పట్టుకుంటూ తిరిగి. . ఒక సుదీర్ఘ అధ్యయనపూర్వక జీవితాన్ని గడిపిన తర్వాత అర్థమైన విషయమేమిటంటే. . ఈ దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ, గిరిజన, పర్వతప్రాంత జనమంతా తమ కొండలతో, చెట్లతో, నదులతో, సెలయేర్లతో, నేలతో మమేకమై తమకు నచ్చిన రీతిలో తాము సంతృప్తికరంగానే జీవిస్తున్నారు. కాని ప్రజాస్వామ్యం పేరుతో లక్షలాదిగా ఉన్న అడవిబిడ్డల ఓట్లకోసం రాజకీయ నాయకులు ఈ సహజ ప్రకృతి ప్రాంతల్లోకి చొరబడి మనుషుల్లో కాలుష్యాన్ని విరజిమ్మి వాళ్ళలో ఆపేక్షలనూ. . ఆశలనూ. . అనవసర కోరికలనూ పాదుకొల్పి అంతా చిన్నాభిన్నం చేశారు.
వాళ్ళకు సదుపాయాలనీ, ఇంకేవో సంక్షేమకర సౌకర్యాలనీ ఒట్టి కలలను చూపించి. . చివరికి స్వేచ్ఛగా అడవిలో జీవించే జంతువులను బోనుల్లో బంధించినట్టు రాజకీయాల విషకౌగిలిలో అమాయక అడవిబిడ్డలను తమ సహజ ప్రకృతిజీవనానికి దూరం చేశారు. రాజకీయం, వ్యాపార విస్తరణ, అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల పేరుతో క్రమ క్రమంగా ప్రకృతి వనరులపై కన్నేసి ఖనిజాలు, గ్రానైట్, ఇసుక, విలువైన కలప, ఇతర అడవి ఉత్పత్తులు వీటన్నింటినీ కార్పొరేట్ సంస్థలను ప్రవేశ పెట్టడం ద్వారా కబళించడం ఆరంభించి,
ఇప్పుడు తూర్పు మధ్య భారత దేశమంతా కోట్లమంది అరణ్యవాసుల హాహాకారలతో ఆక్రందనలతో అట్టుడికిపొతోంది.
ఎన్నడూ లేని భారీ పరిశ్రమలూ, పవర్ ప్రాజెక్ట్ లూ విస్తరిస్తూ అడవులనూ, అడవి మనుషుల బతుకులనూ ధ్వంసం చేస్తూ,
ఇప్పుడు దేశ దేహ కేంద్రకస్థానం రోగగ్రస్తమైపోయింది.
ఎదో జరగాలిప్పుడు.
ఈ ప్రచ్ఛన్న దోపిడి అంతమైపోవాలి.
కనీసం ప్రకృతి ఒడిలో యధేచ్చగా జీవిస్తున్న మనుషుల జోలికి పోకుండా వాళ్ళ మానాన వాళ్ళను బ్రతుకనిచ్చే కాలుష్యరహిత వ్యవస్థయినా కావాలి.
ఏర్పడుతుందా అది. సాధ్యమౌతుందా ఆ నిర్మల పర్యావరణాన్ని ప్రతిష్టించడం.
ప్రతిష్టించేందుకే ఇన్నాళ్ళూ అహర్నిశలూ శ్రమించీ శ్రమించీ. . అలసి అలసి. ,
కాని. ,
వకుళ కళ్ళుమూసుకుంది. ఒక ఆకాశాన్ని తనలో దాచుకున్న అనుభూతి.
బయట ఉధృతమౌతున్న చినుకుల చప్పుడు.
రాత్రి అనూహ్యంగా కదులుతున్న రైలులోనుండి ప్లాట్ ఫాం పైకి దూకినపుడు ఎదుట రెండడుగుల దూరంలో ఏముందో తెలియనంత దట్టంగా పొగమంచు. తర్వాత ప్రపంచంతో సకల సంబంధాలూ తెగిపోయి పొలీస్ స్టేషన్ లో బీభత్స అనుభవం. . మనసునిండా పొగమంచు, వర్షం. . అంతా చిత్తడి.
ఇప్పుడు మళ్ళీ చినుకు చినుకుగా మొదలై జడివానగా మారుతూ వర్షం.
వకుళ మనసులో తన తుపాకీ కదిలింది. గురిపెడ్తే ఎన్నడూ లక్ష్యం తప్పని తుపాకీ ఫైర్ తనది. దాదాపు పదిహేనేండ్లు శరీరంలో ఒక అంగమై, వెంట ఒక రక్షణై, ప్రాణాలు పోకుండా నిరంతరం రక్షించే ప్రాణమై. . వెంట ఉన్న తుపాకీ. ,
మనసు పోటెత్తుతున్న సముద్రమైపోయింది. కల్లోలం. . మహోగ్ర కల్లోలం.
ఏండ్ల పర్యంతం జరుగుతున్నది అతి సాధారణ కాంక్షకోసం ప్రజాపొరాటం.
జల్. . జంగజ్. . జమీన్.
తాగేందుకు కుండెడు నీరు. జానెడు ఉండేందుకు భూమి. పక్షిలా స్వేచ్ఛగా జీవించేందుకు ఒక అడవి. ఇవన్నీ ప్రతి అడవి జీవికీ జన్మతః సంక్రమించే సహజ హక్కులు. ఇప్పుడు వాటిని హరిస్తూ ప్రపంచీకరణ నేపథ్యంలో ఎక్కడెక్కడినుండో వచ్చి వాలిన పారిశ్రామిక గద్దలు. . లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వుకుపోతూ, పవర్ ప్రాజెక్ట్ లకు నదులకు నదులనే మళ్ళించుకుపోతూ. . అడవిని సామూహిక మానభంగం చేస్తున్న రాక్షస మూకల్లా దోచుకుంటూ. . దశాబ్దాల పర్యంతం సాగుతున్న కబళింతను అడ్డుకుంటూ, ప్రశ్నిస్తూ. ,
ప్రశ్న ఒక ఆయుధం. ప్రశ్న ఒక శతఘ్ని. పాట ఒక ఆయుధం. మనిషిలో లీనమై క్షిప్తమై అగ్నిమొలకై చైతంకెరటమై ప్రభవించేది అక్షరం.
అందుకే ఏండ్లకొద్ది సాగిన అరణ్య ఉద్ధరణ కార్యక్రమంలో చేసిన పనంతా. . అడవిబిడ్డలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పడం. అక్షరాన్ని నేర్పడం. ఆయుధాన్ని పట్టే అపురూప విద్యను నేర్పడం. మనిషిని బ్రతికించే. . అడవి పులకింపజేసే పాటను నేర్పడం.
పాట. ,
పాత జ్ఞాపకం రాగానే వకుళ పులకించిపోయింది.
‘ఏడబుట్టె. . ఏడికొచ్చె. . ఏడికొచ్చి ఏడచచ్చె. . హోళీ హోళీల రంగ హోళీ చెమ్మకేళీల హోళీ. ‘
ఎవరైన ఒక ఉద్యమకారుడు ఎంకౌంటర్లలో అమరుడైనపుడు. . తను ఈ పాటను అడవి కరిగిపోయేట్టు దుఃఖంతో అంతర్ముఖురాలై పాడుతూంటే అరణ్యం అరణ్యమంతా కనీళ్ళతో కరిగిపోయేది.
అడవిని వేదికగాచేసుకుని ఏండ్ల పర్యంతం ఒక తపస్సమాన చైతన్య క్రతువును బాధ్యతాయుతంగా కొనసాగించే ప్రతి అన్నా, ప్రతి యోధుడూ ఎక్కడినుండి అక్కడికి చేరుకున్నట్టు. ఎక్కడినుండి దేనికోసం సకల సౌఖ్యాలనూ త్యజించి వచ్చి నిమగ్నమైనట్టు. దేన్ని ఆశించి మరణానిక్కూడా సిద్ధపడి పోరాడుతున్నట్టు.
ఆ పోరాటంలో అసువులు పాస్తే. . ఏ వీరుడైనా ఎక్కడినుండి వచ్చి ఎక్కడ ఏ ప్రతిఘటనలో పాల్గొని అమరుడౌతాడో. . అన్న నిత్య ఘర్షణలోనుండి. . మృత్యువు అనివార్యమైనపుడు. . దుఃఖ సందర్భంలో ఉద్యమకారుల కన్నీటిని తుడిచేది పాట. ఊరడించేది పాట. తల్లివలె తలనిమిరేది పాట.
ఒక నిస్తబ్దత తర్వాత మళ్ళీ మనిషిని పునరుత్తేజితుల్ని చేసి మహోగ్ర కదన రంగంలో పునఃప్రవేశపెట్టేదీ పాటే.
దళంలో తనకు అప్పగించిన బాధ్యతల్లో ప్రధానమైనవి రెండు. ఒకటి దళ సభ్యులకు తుపాకీ ప్రయోగ శిక్షణ. రెండు. . తుపాకీ తూటాకన్న అతి శక్తివంతమైన పాటను అందరికీ పరిచయం చేస్తూ నేర్పడం. తను పాడితే పాట ఒక ఈటె. పాట ఒక ఫిరంగి. పాట ఒక శతఘ్ని. పాట ఒక ప్రళయం.
వర్షం చప్పుడుతోపాటు ఫెళఫెళమన్న శబ్దంతో ఎక్కడో పిడుగు పడింది.
ఉలిక్కిపడి వకుళ ఈ లోకంలోకొచ్చి. ,
అప్పుడు గమనించింది కిటికీ దగ్గర కూర్చున్న గాంధీని.
చాలాసేపు కిటికీలోనుండి వర్షాన్ని గమనిస్తూ ఉండిపోయిన తను అక్కడే గోడవెంట జారి కూర్చుని. ,
చేతిలో పుస్తకం. . స్టీవ్ జాబ్స్. . చదువుతున్నాడు. దీక్షగా కళ్ళనిండా కాంతితో ఆసక్తిగా చదువుతున్నాడు చిన్నపిల్లాడిలా.
రాత్రి అపస్మారకం. . ప్రొద్దున కళ్ళు తెరిచి స్పృహలోకి రావడం. . తర్వాత మాట్లాడ గల్గడం. . ప్రశ్నకు జవాబు ఇవ్వగల సంధానతను పొందగల్గడం. . ఇప్పుడు అక్షరాలను చదువగల్గడం.
మనిషి ముఖం నిండా ఏదో భాషకందని నిమగ్నత. . లోతైన గర్భత. . ఒక వింతకాంతి.
ఎవరితను.
వ్చ్. . తెలియదు. పూర్తిగా అగంతకుడు.
భారతీయ చింతనలో ఏ వ్యక్తయినా ఏదో ఒక నిర్దుష్టమైన కార్యనిర్వాహక ప్రమేయత లేనిది ఏ వ్యక్తీ మరో వ్యక్తికి అసలు పరిచయమే కాడు. ప్రతి ఇద్దరు వ్యక్తుల పరిచయానికీ ఒక ఉద్దేశ్యం, హేతువు, ఒక కార్యకారకం ఉంటుంది.
ఆ కోణంలో ఈ గాంధీ పరిచయాన్ని స్వీకరిస్తే తామిద్దరూ కలిసి ఏదైనా ప్రత్యేక కార్యం నిర్వహించవలసి ఉందా. సంయుక్తంగా దేన్నైనా సాధించవలసి ఉందా. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కదలదు అన్న భారతీయ విశ్వాసం ప్రకారం ఏదైనా దైవ సంకల్పం ఈ తమ పరస్పర పరిచయం వెనుక దాగిఉందా.
అతని ఒంటిపై ఉన్న బట్టలు అతనివి కాకపోవడంవల్ల చిత్రంగా ‘అన్ ఫిట్ ‘గా ఉన్నాయి. పెద్ద శరీరానికి చిన్న సైజ్ గుడ్డలు. టైట్. . తెలంగాణా భాషలో. . బట్టలతనికి కుత్తెమైనై. అందువల్ల ఏదో విదారకమైన భావన.
వర్షం తగ్గదు. ఈ గదిలో బందీగా ఉండడం ఎంతసేపు.
వాట్ నెక్స్ట్.
తర్వాత ఏమిటి. ఏంచేయాలి. ?
ఇదమిద్ధంగా ఏదీ తోచడంలేదు వకుళకు.
బయట ఏదో చప్పుడు. . ఎవరో గొళ్ళెం కొడుతున్నట్టు.
భయమైంది. ఎవరు. ఎందుకు. . ఏమిటో.
“ఎవరు. ?”అంది.
గాంధీమాత్రం ఏ చలనమూ లేక దీక్షగా చదువుకుంటూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూండగానే అప్పటినుండి నాల్గయిదు పేజీలను తిప్పేశాడు. అంటే గాంధీ సాధారణ ప్రవర్తనా పరిధిలోకి, గాడిలోకొస్తున్నాడా. పుస్తకాన్ని చదవడమనే ప్రక్రియ ఒక మేధోసంబంధ చర్యగదా. అది సక్రమంగా సాగుతున్నదంటే అతని మానసిక స్థితి సక్రమంగా ఉన్నట్టెనా.
గొళ్ళెం చప్పుడు ఎక్కువైంది.
వకుళ నేలపైనుండి లేచి భయం భయంగానే తలుపు తెరిచింది. ఎదురుగా ఓ పదేళ్ళ కుర్రాడు చేతిలో ఫ్లాస్క్, పేపర్ కప్పులతో. “అక్కా చాయ్ కావాల్నా”అని మాట. ముఖం నిండా అమాయకమైన ప్రసన్నత. ముచ్చటేసింది.
“రెండు కప్పులివ్వు”అని వచ్చి పైసలు తీసి ఎంతో అడిగి ఆర్రూపాయలిచ్చింది.
నిజానికి తనక్కూడా టీ తాగాలనే ఉంది అప్పటినుండి. తన అవసరాన్ని, మనసులోని మాటను గమనించినట్టు ఈ కుర్రాడెవడో. ,
చేతిలో రెండు కప్పులు. . వేడిగా. . చేతులు కాలుతున్నాయి.
తొందరగా గాంధీ దగ్గరకెళ్ళి”ఒకటి తీస్కో”అంది.
ఉహు.
అతను కదలలేదు. అలాగే చదువుకుంటున్నాడు.
“టేక్ దిస్” అంది మళ్ళీ గట్టిగా.
అతను ఉలిక్కిపడి చటుక్కున ఆమె చేతిలోని ఒక కప్పును తీసుకున్నాడు.
అతని ముఖంలోకి చూచింది అనూహ్యంగా.
ఒట్టి అభావం.
ఐతే. . అతను టీ తాగుతున్నాడు. వేడిగా ఉంది కాబట్టి పెదవులతో ఉఫ్ మని ఊదుతూ పెదవులు కాలకుండా జాగ్రత్తగానే టీని చప్పరిస్తూ. ,
అంతే ఇది టీ. . దీన్ని తాగాలి. . వేడిగా ఉందికాబట్టి ఉఫ్ మని ఊదుకుంటూ. ,
స్పృహా, గ్రహింపూ ఉన్నట్టేగదా.
చాలా వేగంగా మనిషి గాడిలో పడుతున్నాడు. మామూలు మనిషౌతున్నాడు.
పుస్తకం చదవడం. . తనంతట తాను టీ తాగడం చాలా ఆరోగ్యవంతమైన సంకేతాలు.
ఇక తను చక చకా నిర్ణయాలు తీసుకోవాలి.
‘డెసిషన్ మేకింగ్ అనేది చాలా కీలకమైన వ్యక్తి లక్షణమమ్మా. చాలామంది జీవితానికీ, ఇతరేతర కార్యక్రమాలకూ సంబంధించి సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలులు కావడంవల్లనే విజయాలను సాధించడంలేదు. ‘అని సన్యాల్ సార్ చెప్పిన సంగతి జ్ఞాపకమొచ్చింది వకుళకు.
సరియైన సమయంలో సరియైన నిర్ణయం. . అదీ అతి ముఖ్యమైంది.
తన పరిశీలనలోకూడా తేలిందేమిటంటే. . చాలా మందికి డెషిషన్ మేకింగ్ కెపాసిటీ లేదు.
సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోనివాళ్ళు తర్వాత్తర్వాత తప్పుడు గమ్యాలను చేరి విఫలులు కావడం తనకు చాలానే తెలుసు. ఐతే చిత్రమైన విషయమేమిటంటే నిర్ణయాలు ఒక భౌతికమైన వస్తువువలె స్పష్టంగా కనిపించేవీ, కళ్ళకు తోచేవీ కావు. ఊహాత్మకమైనవీ, భవిష్యత్తును దర్శించగలిగేవీ ఐన నిర్ణయాలను తీసుకోడానికి మనిషి తప్పనిసరిగా ఒక దార్శనికుడై ఉండాలి.
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడైన స్టీఫిన్ ఆర్ కోవె ఏమన్నాడంటే’ చాలామంది ఉన్నతిని చేరడానికి నిచ్చెన అవసరమని సరిగానే గుర్తిస్తారు. కాని నిచ్చెనను ఉపయోగిస్తున్నపుడు దాని పైకొసను ఆనించవలసిన చోటుగురించి ఆలోచించరు. సరియైన చోట కొసను ఆనించకపోవడంవల్ల వాళ్ళు తప్పుడు గమ్యాన్ని చేరుతారు ‘అని.
ఒకసారి తెలిసో తెలియకో తప్పుడు మార్గంలోకి మళ్ళిన తర్వాత మళ్ళీ సరియైన మార్గంలోకి రావడం కష్టం. ఒక్కోసారి అసాధ్యంకూడా కావచ్చు.
అందువల్ల దారిని ఎంచుకోవడం అతి ముఖ్యం.
ఇప్పుడు తను బాగా ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోవలసి ఉంది.
అసలు ఇప్పటికే తను ఒక తప్పుడు అడుగు వేసిందా. రాత్రి తన తోవను తాను చూచుకోకుండా గాంధీనికూడా కావాలని వెంటతెచ్చుకుని పొరపాటు చేసిందా. గాలికిపోయే కంపను ఒంటికి తగిలించుకున్నట్టు మెడలో ఒక బండరాయిని ధరించిందా.
టీ తాగడమైపోయింది.
గాంధీ దిక్కు చూచింది. అతను కూడా టీ తాగి పేపర్ కప్పును ప్రక్కన పెట్టాడు.
‘ఇంతవరకూ గాంధీ తనేదైనా అడిగితేనే జవాబు చెబుతున్నాడు గాని తనంతట తాను ఏదీ మాట్లాడ్డం లేదు. . ఎందుకు ‘.
తదేకంగా చూచిందతనివైపు.
జాలేసింది ఎందుకో.
మొట్టమొదటిసారి రైల్వే ప్లాట్ ఫాం పై చూచినప్పుడుకూడా అంతే. జాలి కలిగింది. అందుకే అతను తనకు కావాలని తృటికాలంలో నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడేం చేయాలి.
జీవితంలో ఇప్పటికే ఇరవై నాలుగేళ్ళ కాలం గడిచిపోయింది. గడిచిపోయినట్టా. . వృధా ఐపోయినట్టా. ?
ఒక అనాలజీ స్ఫురించిందామెకు.
‘జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు ‘
మిగిలిన ఆ సగభాగంలో. . స్థూలంగా కొన్నేండ్లు తింటానికే, కొన్నేండ్లు బాల్యం నుండి ఎదగడానికే, మరి కొన్నేండ్లు యాభై తర్వాత కుంగడానికే. . ఇంకొన్నేండ్లు ఇతరేతర చిల్లర పనులను చేయడానికే సరిపోతే. . ఇక ఏ మనిషైనా నికరంగా బ్రతికేదెన్నాళ్ళు. ఆ బ్రతికే కొద్దిపాటి కాలంలో తనకోసం, సమాజం కోసం, తోటి మానవాభ్యుదయం కోసం వెచ్చించిన కాలమెంత. . ఈ కోణంలో ఆలోచిస్తే ఒక్కోసారి భయమేస్తుంది. నిస్పృహ ఆవహిస్తుంది. నిజంగానే మనం ఇంత అల్పకాలం నికరంగా జీవిస్తున్నామా అనిపిస్తుంది.
వకుళ రెండు కప్పులనూ కిటికీలోనుండి బయటికి విసిరేసి,
గదిలో అటు ఇటూ తిరగడం ఆరంభించింది.
అంటే మెదడుకు ‘ప్రాసెసింగ్’కమాండ్ ఇచ్చినట్టు లెక్క.
నిర్ణయాలు జరిగిపోతున్నాయి.
ఒకటి. . గాంధీకి ఇంకా కొంత. . అంటే రెండు మూడు రోజుల సమయం ఇచ్చి మనిషిలో వచ్చే మార్పును గమనించి అవసరాన్నిబట్టి సరియైన డాక్టర్ కు చూపించడమా. . ఒకవేళ తనకుతానే కోలుకుని మామూలు మనిషైతే అతని పూర్వపరాలను కనుక్కుని తగు చర్యలను చేపట్టుట.
రెండు. . తను ఇదివరకే బాగా ఆలోచించి వరంగల్లులోనే స్థిరపడాలనే తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ సత్రంను ఖాళీ చేసి ఒక రక్షణగల ప్రాంతంలో కిరాయికి ఇల్లు సంపాదించుకుని అక్కడికి మారుట. ఇక్కడే కొనసాగడంవల్ల తమ వయసులవల్లా, ఎంజిఎం లో ఇన్ పేషంట్ గా గాంధీని చేర్పించకపోవడంవల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా పోలీసులనుండి.
మూడు. . ప్రస్తుతం తను పూర్తిగా ఒంటరి. ఏ ఒక్క వ్యక్తికూడా తోడు లేని పరిస్థితి. గాంధీకి తను తోడు కాని తనకు అతడు తోడు కాదు. ఒకరకంగా మెడలో గుదిబండే. కాబట్టి ఎవరో ఒకరి సహకారాన్ని తీసుకోవాలి తను. తప్పదు. గోపాల్ సహాయం తీసుకోవచ్చా. తీసుకోవచ్చనే అనిపిస్తోంది. మనిషిలో తన పరిశీలన ప్రకారం కొంత మూల మానవ లక్షణాలున్నాయి. వీలుంటే మున్ముందుకూడా గోపాల్ తో సోదర సంబంధాన్ని కొనసాగించవచ్చు.
నాలుగు:తను ఏ లక్ష్యాన్నైతే దృష్టిలో పెట్టుకుని వరంగల్లుకు వచ్చిందో. . ఆ పనిని రెండురోజుల తర్వాత చేపట్టి బహిరంగ క్షేత్రంలోకి ప్రవేశించుట.
తెలుసు తనకు స్పష్టంగా. . వైకుంఠపాళీ ఆడుతున్నపుడు తప్పనిసరిగా నిచ్చెనలేకాదు పాములుకూడా ఉంటాయని. ఐతే పాములు లేని వైకుంఠపాళీని తను డిజైన్ చేసుకుంది ప్రత్యేకంగా. . దాంట్లో అన్నీ నిచ్చెనలే ఉంటాయి. ఒక్క పాముకూడా ఉండదు.
జీవితంలో నిర్దేశించుకున్న నిర్వచిత భౌతిక లక్ష్యాలనూ, గమ్యాన్నీ చేరడానికి తప్పనిసరిగా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో ఐతే ముందు ఒక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి మున్సిపల్ కౌన్సిలరై, చైర్మనై, ఎమ్మెల్యే ఐ, ఎంపీ ఐ మంత్రయి. . . ఈ ప్రాసెస్ దీర్ఘమైంది. ఈ స్టెప్ బై స్టెప్ పద్దతిలో మంత్రి, ముఖ్య మంత్రి అయినవాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడూ ఎవడి పంచన చేరి రోజూకలుస్తూ మస్కా కొడ్తూ, ప్రతిరోజూ భజన చేసే అవకాశముందో ముందే గ్రహించి డైరెక్ట్ గా పైనుండి నరుక్కుంటూ వచ్చిన వాళ్ళే భారతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతున్నారు.
తెలుగు రాజకీయాల్లో. . ఒక్కసారికూడా ప్రజలచేత ఎన్నుకోబడక కేవలం ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేసీ చేసీ, మస్కా కొట్టీ కొట్టీ, బ్రోకర్ పనులు చేసీ చేసీ ఒట్టి నామినేటెడ్ పదవుల్లో కూర్చుని వేలకోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి లబ్ధి పొందినవాళ్ళు కోకొల్లలు.
తెలివిగలవాడు జీవితాన్ని అర్థవంతంగా, విలువలతోకూడిన, డబ్బూ పేరుకూడా సంపాదించగల రీతిలో వివేకంతో జీవిస్తాడు.
యుక్తిగలవాడు జీవితాన్ని వ్యూహాత్మకంగా చదరంగమాడుతున్నట్టు జీవిస్తాడు.
భౌతిక ఉదాహరణగా చెప్పాలంటే, తెలివీతో ఫ్యాన్ ను కనిపెట్టినవాడు సృజనకారుడు.
ఫ్యాన్ సూత్రాన్ని కాపీ చేసి దాన్నే తిరగేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను కనిపెట్టి అమ్ముకుని బాగుపడ్డవాడు యుక్తిపరుడు.
బతకడానికి ఎప్పుడైనా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అదొక వెక్టార్ క్వాంటిటీ. అతి దగ్గరిదూరంద్వారానే ప్రయాణ చేయాలి. ప్రజ్ఞ బతకడానికి తోడవుతుంది.
కాని జ్ఞాన సముపార్జన జీవించడం వంటిది. జ్ఞానాన్ని పొందేందుకు షార్ట్ కట్స్ లేవు. చదవడం, అధ్యయనం చేయడం, ఆత్మానుగత ఉన్మీలనను సాధించడం. . వీటికి దగ్గరి దొంగదారులు లేవు.
మనిషిగా మనం బతకాలా జీవించాలా అనేదాన్ని ఎవరికివారు ఆత్మపరిశీలన జరుపుకుని నిర్ణయించుకోవాలి.
వర్షం తగ్గుమొగం పడుతోందా అనిపించి వకుళ. . కిటికీనుండి బయటకు చూచింది. చినుకులు పల్చబడ్డాయి. దర్వాజా తలుపులు తెరిచింది కొద్దిగా.
రివ్వున చల్లని గాలి లోపలికి దూసుకొచ్చి. . ఒళ్ళు పులకించిపోయింది.
“గాంధీ. . “అని పిలిచింది.
అతను వెంటనే దగ్గరకు వచ్చాడు.
వచ్చి ప్రక్కనే నిలబడి. ,
“ఆర్ యు మిస్టర్ గాంధీ”అంది అతని ప్రతిచర్యను గమనిస్తూ,
“యస్”అన్నాడతను.
“వాటీజ్ యువర్ ఫుల్ నేం”
“భార్గవ గాంధీ”
“రియల్లీ. . మిస్టర్ భార్గవ గాంధీ. . ఈజిట్”
“ఎస్. . భార్గవ గాంధీ. . ఎంబిఎ ఫ్రం హార్వార్డ్. ”
“హవ్ ఈజ్ దట్ యు ఆర్ హియర్ ఎట్ దిస్ ప్లేస్”
“ఐ డు నాట్ నొ. బై ది బై హు ఆర్ యు”
ఖంగు తింది వకుళ.
ఓహో. . ఇక్కడిదాకా వచ్చిందా కథ. . అనుకుంది ముసిముసిగా నవ్వుకుంటూ.
“విల్ యు ప్లీజ్ టెల్ మీ ఫ్రం వేర్ యు ఆర్”
“ఐయాం ఫ్రం యుఎస్. ఫిలడెల్ఫియా. ”
“డు యు నో వేర్ యు ఆర్ నౌ”
“సర్ ప్రైజ్ ఫర్ మీ. వాట్ ఈజ్ దిస్ ప్లేస్”
“దిసీజ్ వరంగల్. ఎ గ్రేట్ హిస్టారికల్ ప్లేస్. . ఆఫ్ కాకతీయ డైనాస్టీ. ”
“ఓ. . బట్ హౌ ఈజ్ దట్ ఐయాం హియర్ టు డే”
వకుళ ఖిన్నురాలైంది.
మెమరీ మేనేజ్మెంట్. . ఎక్కడో ఏదో పట్టాలు తప్పి ఈ గాంధీ విషయంగా ఒక విపరిణామం సంభవించింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలి. ఇంతకు ముందు తను తీసుకున్న నిర్ణయాలలో మొట్టమొదటి ప్రాధాన్యత దీనిదే. . అనుకుంది వకుళ. అనుకుంటూనే జాగ్రత్తగా ఈ సమస్యను టాకిల్ చేయాలి తనిప్పుడు అని గదిలోనుండి బయటికొచ్చి వాకిట్లోకి నడిచింది.
వాన పూర్తిగా తగ్గిపోయింది. నేలంతా పచ్చిగా తడిచి. . ముద్ద ముద్దగా. . ముగ్ధ ముగ్ధగా.
వకుళకు ఎందుకో చాలా రిలీఫ్ గా అనిపించింది.
చిత్రమనిపించిందామెకా క్షణం. చాలా యధాలాపంగా తను అడిగింది గోపాల్ ను ఉదయం ఈ మనిషికి ‘ఏదైనా పేరు పెడదామని ‘
గోపాల్ కూడా అలా ఊర్కే నోటికొచ్చి”గాంధీ”అన్నాడు.
కొన్ని నోటి వాక్కులంతే. సరిగ్గా సందర్భానికి సరిపోతాయి.
గాంధీ. . భార్గవ గాంధీ. ఏమి సందర్భ ఏకత ఇది.
అందుకే ‘గాంధీ’ అని పిలుస్తే ఏ సంకోచమూ లేకుండా స్పందిస్తున్నాడు.
ఇక తొందరపడాలి తను అనుకుని. . మొబైల్ ను చేతిలోకి తీసుకుని గోపాల్ కు డయల్ చేసింది.
అటునుండి గొంతు వినగానే “అన్నయ్యా నేను వకుళను. ఉదయం రైల్వే స్టేషన్. . నువ్వు బట్టలిచ్చినౌ. కస్తూర్ బా సత్రం. . జ్ఞాపకమొచ్చిందా”
“ఓ సిస్టర్. . మీరా. . చెప్పండి”
“మీ హెల్ప్ కావాలి. . ఎక్కడున్నారు మీరిప్పుడు”
“ఒక గిరాకీతో ఇక్కడ ములుగు రోడ్ దగ్గరున్నా. . చెప్పమ్మా, ఏం చేయగలను నేను”
“ఒకసారి నువ్వు మాకు కలుస్తే బాగుండుననిపిస్తాంది నాకు. కొంచెం హెల్ప్ కావాలె” అంది.
“ఓ. డెఫెనెట్లీ. ఒక పదిహేను నిమిషాల్లో నీ దగ్గరుంటా” ఫోన్ కట్ ఐంది.
“మిస్టర్ గాంధీ. . వాట్ లంగ్వేజెస్ ఆర్ నోన్ టు యు”
“ఐ నొ మలయాళం. సం తెలుగు. మోర్ ఇంగ్లిష్”
“తెలుగు వచ్చా నీకు”
“కొంచం కొంచం”
“మరి అప్పుడు అడిగితే పలుకలేదే”
“ఎప్పుడు. . జ్ఞాపకం లేదే”
“నీకు ఎప్పుడు మనం ఇక్కడికొచ్చామో జ్ఞాపకముందా”
“లేదు. అసలు ఈ ప్లేస్ ఏమిటి. . హౌ ఐయాం హియర్”
“ప్లీజ్ రికలెక్ట్ . . జ్ఞాపకం తెచ్చుకోండి”
ఇతనికి నిన్నటినుండి జరుగుతూ వస్తున్న ఘటనలేవీ జ్ఞాపక ముండట్లేదు.
జ్ఞాపకశక్తి అనేది పుస్తకంలో ఒక పుటపై మరొక పుటవలె వరుసగా పేర్చబడి ఒక క్రమంలో ఉండవలసింది గాంధీ విషయంలో అలా కాకుండా ఏదో అస్తవ్యస్తత ఏర్పడినట్టుంది.
“నీకు ఆకలి వేస్తోందా గాంధీ”
“యు మీన్ హంగ్రీ”
“ఔను”
“చాలా ఆకలిగా ఉంది”
“ఇంతకుముందు టీ తాగావుకదా”
“నేనా. . టీ తాగానా. ఎప్పుడు”
ఓరి బాబో. . ఇదెక్కడి గోలరా నాయన. శుభ్రంగా పూర్తి కప్పు చాయ్ తాగి నేనెక్కడ తాగినానంటాడేమిటి.
ఇతని మెమోరీ పూల్ అంతా విచ్ఛిన్నమై లొడపెట్టిన బకెట్లోని నీళ్ళవలె టర్బులెంటై పోయినట్టున్నది. ఎవరో ఒకరు ఇతని మనోమయ జ్ఞాపకాల, ఇతరేతర తత్సంబంధ వ్యవస్థను పునఃసంధానం చేయాలి.
ఐతే ఆమెకు అతని గురించి ఏమాత్రం ఆందోళన ఏర్పడలేదు. పుస్తకం యొక్క అన్నిపేజీలూ భద్రంగా ఉన్నయ్. . ఊడిపోయి. మళ్ళీ వాటికి వరుసలో కూర్చి రీబైండ్ చేయడం పెద్ద కష్టమైన పనేంకాదు. మంచి బైండర్ కావాలి.
ముందుకుపోతూంటే వెనుకటి గతం కూలిపోతూ, శిథిలమౌతూ ఏమీ వర్చువల్ మాస్ మిగలట్లేదు.
రియల్. . వర్చువల్ మీమాంస ఒకటి ఇప్పుడు ఓ ప్రధాన సమస్యగా పరిణమించి కూర్చుంది.
గాంధీకి నిజంగానే ఆకలి తెలియడం లేదు. ఐతే ఆకలి కాకపోవడం వేరు. . ఆకలి తెలియకపోవడం వేరు. పాపం ఎప్పుడు తిన్నాడో ముఖంమాత్రం పీక్కుపోయి ఆకలితో నకనకలాడుతున్నట్టే అనిపిస్తోంది ముఖం చూస్తూంటే.
ఇద్దరమూ బయటికి పోయి ఏదైనా తింటే. . అనుకుంది వకుళ.
ఈలోగా టకటకా శబ్దం చేస్తూ గోపాల్ వచ్చాడు తన ఆటోలో.
కొండంత బలమొచ్చింది వకుళకు.
పరుగుపరుగున వెళ్ళి”గోపాల్ అన్నయ్యా ముందు మనం బైటికిపోయి ఏదైనా తిందాం. బాగా ఆకలేస్తోంది. గాంధీ గురించికూడా కొంత చెప్పాలి మీతో. నాక్కొంత సహాయం చేయాలన్నయ్యా. “అంది.
టకటకా సత్రం గదికి తాళం వేసి ముగ్గురూ బయల్దేరారు.
అప్పుడే వర్షం వెలియడం వల్ల వాతావరణమంతా పచ్చి పచ్చిగా తడితడిగా ఉండి. టైం చూచుకుంది. తొమ్మిదీ ఇరవై ఐదు.
రోడ్డుమీదికి వస్తూంటే గుంపులు గుంపులుగా చదువుకోసం వస్తున్న విద్యార్థినులు చేతుల్లో మినీ డ్రాఫ్టర్లతో వస్తున్నారు. కొందరి చేతుల్లో తెల్లని ఆప్రాన్స్.
“ఏదైనా కాలేజ్ ఉందా ఈ గల్లీలో” అనడిగింది వకుళ.
“ప్రక్కనే ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. దాని తాలూకు స్టూడెంట్స్”
మూలమీద లలితా త్రిపురసుందరి దేవాలయం. కుడిదిక్కు తిరగ్గానే రోడ్డుకిరువైపులా అటుఇటూ చిన్నచిన్న ఇడ్లీ, వడ అమ్మే బండ్లు. టీ , పాన్ టేలాలు. న్యూస్ పేపర్ అమ్మే స్టాండ్. హోటల్ శంకర్ కేఫ్.
ఆటో ఆపాడు గోపాల్.
ముందు గోపాల్ నడుస్తూ శంకర్ విలాస్ లో ఒక మూలకు నాల్గు సీట్లు ఖాళీ ఉండి ప్రశాంతంగా మాట్లాడుకునేందుకు వీలున్న చోట కూర్చున్నాడు. అతని వెంట వకుళా, గాంధీ. . కూడా.
గోపాల్ కు అప్పుడు తన తమ్ముని పాత బట్టలను గాంధీకి ఇచ్చిన విషయం. . ఇప్పుడవి వేసుకుంటే అవి అతనికి బాగా కుత్తెంగా ఉన్నవిషయం జ్ఞాపకమొచ్చి. . అసలీ గాంధీ సంగతేమిటో తెలుసుకోవాలని. . ఆసక్తిగా వకుళ చెప్పబోయే సంగతులను వినాలని,
“అన్నా. . నేను చెప్పబోయే విషయాలు. . “అని ప్రారంభించింది వకుళ.
అన్నా అన్న ఆర్థ్రమైన పిలుపు వకుళ నోట విన్నప్పుడల్లా గోపాల్ పులకించిపోతున్నాడు. అతనికి చెల్లెళ్ళు లేరు. ఇద్దరే అన్నదమ్ములు.
వింటూనే గోపాల్ ముగ్గురికీ ముందు ఇడ్లీ, తర్వాత రవ్వా దోశ ఆర్డర్ చెప్పాడు.
అరగంట గడిచింది. గోపాల్ కు ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
గోపాల్ ది సూటి తత్వం. అంతా ఫటాఫట్ కటాకట్.
“నాకంతా అర్థమైంది చెల్లెమ్మా. ఇప్పుడు మనం మూడు పనులు చేద్దాం. ఒకటి. . గాంధీని ఎంజిఎం లో నా చిన్నప్పటి క్లాస్ మేట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నారాయణ ఉన్నడు. ఆయనకు ఇప్పుడే చూపించి వీలుంటే సిటి స్కానింగ్ చేయించి ఈయన అసలు మానసిక స్థితిని కనుక్కుందాం. నా అంచనా ప్రకారం టైం గడుస్తున్నకొద్దీ ఇతను తానంతట తానే కోలుకుంటడు. కాని ఇతను అసలు ఎవరు. . ఎక్కడివాడు. . ఎందుకు ఆ విధంగా రైల్లోనుండి తోసేయబడ్డడు. అది ఒక సంగతి. రెండు. . నువ్వు చెప్పింది కరెక్టే. మీరిద్దరు ఇక ఆ సత్రంలో ఉండడం వద్దు. మా ఇంటిదగ్గరనే మా ప్రక్క ఇంట్ల ఒక రెండుగదుల చిన్న పోర్షన్ ఖాళీగున్నది. కమలమ్మ అని వెనుకట తెలంగాణా రైతాంగ సాయుధ పొరాటంలో పాల్గొని అనేక త్యాగాలు చేసిన వీరవనిత. ఆమెదే ఆ ఇల్లు. ఇప్పుడామెకెవ్వరు లేరు. నేను స్వయంగా కమలమ్మగారితో మాట్లాడి ఏర్పాటు చేస్త. మధ్యాహ్నం అక్కడికి మారుదాం. మూడు. . గాంధీకి రెండు డ్రెస్ లు కొందాం. ఇవి బాగలేవు. అడుక్కుని తొడుక్కున్నట్టే ఉన్నయి. ఇతన్ని చూస్తూంటే అంతా కంఫ్యూజన్ గా ఉంది. ఎంబిఎ హార్వర్డ్. ఇంగ్లీష్ వింటే అద్భుతం. తెలుగుకూడా వస్తాంది. మొత్తంమీద ఇతనిదొక మిస్టరీ. నాలుగు. . నీ విషయమే నువ్వింకా పూర్తిగా నాకు చెప్పలేదు. ఇప్పుడు అవసరంకూడా లేదు. ఈ మూడు సంగతులైపోయిన తర్వాత. . మిగిలినవన్నీ. . ఓకె నా. “గోపాల్ గడగడా చెప్పి ఆగి. . వకుళ దిక్కూ గాంధీ వైపూ చూశాడు. వకుళ కృతజ్ఞతాపూర్వకంగా గోపాల్ వైపు చూచి నిశ్శబ్దం వహించింది. గాంధీ ముఖంలో ఏ భావమూ లేదు. ఊర్కే అలా చూస్తున్నాడంతే.
* * *
గోపాల్ కు చిన్ననాటి స్నేహితుడు కావడం, గాంధీ విషయం వినగానే ఏర్పడ్డ ఉత్కంఠా రెండూ కలిసి డాక్టర్ నారాయణను కాస్త శ్రద్దగానే గాంధీని పరేక్షించేందుకు ఉద్యుక్తపరిచింది. ముందు సి టి స్కానింగ్ చేస్క రమ్మన్నడు. ఇంకేవేవో రెండు పరీక్షలు. ఒక ఎక్స్ రే. . అన్నింటినీ ముందుపెట్టుకుని ఓ పి టైం ఐపోయిన తర్వాత ప్రత్యేకంగా తన రూంలోకి వకుళనూ, గోపాల్ నూ పిలిపించుకుని. . గాంధీని అటుప్రక్క గదిలో కూర్చొమ్మని చెప్పి ఇక రిపోర్ట్స్ చిట్టాను. . విప్పాడు నారాయణ.
మీరేమి చదువుకున్నారు మేడం? అర్థం చేసుకోగలరా విషయాలను. . అని ప్రారంభించాడు.
“ఫరవా లేదు చెప్పండి సార్. అర్థం చేసుకోగలను”అంది వకుళ వినయంగా.
“మనిషి మెదడు ఇప్పటికీ ఎవరికీ సమగ్రంగా అర్థంకాని అతిరహస్యమే. దాదాపు 1. 5 కిలోగ్రాముల బరువుండే మనిషి మెదడు పైన గ్రే కలర్ ను కలిగి ఉండి లోపల మాత్రం తెల్లని వెన్నముద్దవలె సుతిమెత్తగా ఉంటుంది. దీని ఉపరితలంపై, లోపలా అత్యంత సంక్లిష్ట రూపంలో దాదాపు ఒక వంద బిలియన్ల సంఖ్యలో అతి సూక్ష్మ న్యూరాన్స్ అనబడే నర్వ్ సెల్స్ విస్తరించి ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మానవుని జ్ఞాపక శక్తి. . మెమొరీ 1-1000 టెరా బైట్స్. వీటి ప్రధాన వ్యాపకం ఎంకోడింగ్ మరియు రెట్రైవల్. ఇవి ఎలక్ట్రో కెమికల్ సిగ్నల్స్ ద్వారా అతి వేగంగా, అతి సూక్ష్మంగా సంకేతాలను గ్రహించుట, ఉత్సర్గ పర్చుట చేస్తూంటాయి. ఈ వ్యవస్థయొక్క సామర్థ్యాన్నిబట్టి మనిషి మెధోపరమైన చర్యలు ఆధారపడి ఉంటాయి. ఈ అతి సున్నితమైన వ్యవస్థను చాలా సురక్షితంగా కాపాడేందుకు భగవంతుడు కపాలం. . స్కల్ అనే అతి గట్టి పుర్రెలో అతిపదిలంగా భద్ర పరిచాడు. ఏదో ఒక బలమైన దెబ్బ తగిలితే తప్ప ఈ కపాలం పగలదు. మనిషి ఎముకల్లోకి అతి బలమైన నిర్మాణం కలిగిఉన్న పదార్థం ఈ కపాల అస్థియే.
మెమొరీ వ్యవస్థ . . ఇప్పుడు నేను చెప్పే కీలకమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనిషి మెమొరీ వ్యవస్థ ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది. ఒక సెకన్ కంటే తక్కువ కాల జ్ఞాపకానికి స్పందించేది. . సెన్సరీ మెమొరీ. ఒక నిముష కాల జ్ఞాపకాలకు ప్రతిస్పందించే వ్యవస్థ షార్ట్ టర్మ్ మెమొరీ. ఇక జీవితకాల జ్ఞాపకాల నన్నింటినీ నిర్వహిస్తూ మనిషిని నడిపించే ప్రధాన జ్ఞాపక వ్యవస్థ లాంగ్ టర్మ్ మెమొరీ. ఈ లాంగ్ టర్మ్ మెమొరీయే ఇప్పుడు మన గాంధీ విషయంగా ముఖ్యమైంది.
ఈ లాంగ్ టర్మ్ మెమొరీ ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి. . ఎక్స్ ప్లిసిట్. . స్పృహలో ఉన్నప్పుడు ప్రతిస్పందించేది. ఇది డిక్లరేటివ్ మెమొరీ అనే వర్గీకరణ కిందికి వస్తూ. . నిజాలనూ, సంఘటనలనూ సమన్వయ పరుస్తూ నిర్వహిస్తుంది. మళ్ళీ ఇది ఎపిసోడిక్ మెమొరీ. . అంటే ఘటనలూ, అనుభవాలను క్రోడీకరిస్తుంది. కాగా మరో విభాగం. సిమాంటిక్ మెమొరీ. . ఇది సత్యాలనూ, అవగాహనలనూ సమన్వయ పరుస్తుంది. ఇవన్నీ కూడా మనిషి స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే జరిగేవి. మనిషి స్పృహలో లేనప్పుడుకూడా స్పందించేది ఇంప్లిసిట్ మెమొరీ. దీని విభాగమే ప్రొసీజరల్ మెమొరీ. ఇది మనిషియొక్క నైపుణ్యాలకూ, కార్యాలకూ సంబంధించిన అజ్ఞాత సృజన గురించిన జ్ఞాపకాలను సంధాన పరుస్తుంది.
ఇప్పుడు మన గాంధీకి సంబంధించి ఎవరో ఇతని శతృవులు ప్రైమరీ మెమొరీకి చెందిన. . ఎక్స్ ప్లిసిట్ మెమొరీని ధ్వంసం చేసి ఇతనికి గతం జ్ఞాపకం రాకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ విభాగం కనుక ధ్వంసమైపోతే తన గతంలో క్షిప్తమై ఉన్న సత్యాలనూ, ఘటనలనూ. . అంటే గతాన్ని మరిచిపోతాడు. మన ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో వివిధ లొకేషన్స్ లో రకరకాలైన మైక్రో ప్రాసెసర్ చిప్స్ అమర్చి ఉన్నట్టే. . మనిషి మెదడులోకూడా కొన్ని లొకేషన్స్ లో కొన్ని చిప్స్ వంటి న్యూరాన్స్ ఉన్నాయి. వాటిని గనుక డ్యామేజ్ చేయ గలిగితే ఆ వ్యక్తి యొక్క గతం అతనినుండి నిష్క్రమిస్తుంది.
ఇప్పుడితని స్థితిని క్రోడీకరిస్తే,
ఒకటి. . ఇతని గతంతో సంబంధం కలిగి. . ఆ గతాన్ని గనుక గాంధీ విప్పి చెబితే తనకు ఏదో ప్రమాదమున్నదని భావించి ఈ ప్రయత్నం చేశారు ఎవరో. ఐతే. . ఇతన్ని చంపడం కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. కాని అలా చేయలేదు. మనిషి చావొద్దు. కాని ఇతనికి మాత్రమే తెలిసిన ఏదో రహస్యం ఉంది ఇతని దగ్గర. దాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం.
రెండు. . ఇతను హైలీ ఇంటెల్లిజెంట్ వ్యక్తి. గతాన్ని అంత తొందరగా కోల్పోలేకపోతున్నాడు. బలిష్ట కాయుడు కావడం వల్ల మెదడు నాణ్యంగా ఉండి చాలా రక్షితంగా ఉంది.
ఈ ప్రయత్నం ఒక రైల్లో ప్రయాణిస్తూ చేసే చిన్న ఆపరేషన్ కాదు. దీనికి కొంత స్పెషల్ ఎక్విప్మెంట్ తోపాటు అసిస్టెంట్ సహకారం కావాలి.
ఎవరో ఒక ఎక్స్ పర్టే ఈ ప్రయత్నం చేసాడు, కాని పర్ఫెక్ట్ గా చేయలేక పోయాడు. ఎక్స్ ప్లిసిట్ మెమొరీ లొకేషన్ ను ఖచ్చితంగానే గుర్తించి ఒక డ్రిల్ ను చేసి డ్యామేజింగ్ ఫ్లూయిడ్ ఎక్కించాడు. కాని. . ఆ పనినికూడా పర్ఫెక్ట్ గా చేయలేక పోయాడు.
ద వర్క్ ఈజ్ హాఫ్ డన్.
అందువల్ల గాంధీకి జరుగవలసినంత డ్యామేజ్ జరుగలేదు. కాకుంటే అతను వెంటనే పాక్షిక కోమాలోకి వెళ్ళిపోయాడు.
శరీరం బలంగా ఉండడం. . తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మెల్లగా తనంతట తానే కోలుకుని మళ్ళీ మామూలు మనిషైపోతాడు. నథింగ్ టు వర్రీ.
కొంత టైం పడుతుంది. ఓ పది పదిహేను రోజులు. దట్సాల్.
గోపాల్, వకుళ ఇద్దరూ జాగ్రత్తగా డాక్టర్ నారాయణ చెబుతున్నదాన్ని వింటూండగా “ఎక్స్క్యూజ్ మి”అన్న మాట విని అందరూ తలెత్తి. ,
ఎదురుగా గాంధీ. . చిన్నపిల్లాడిలా నవ్వుతూ. . ప్రసన్నంగా.
“కం మిస్టర్ గాంధీ. . ప్లీజ్ సిడౌన్. మీకు తెలుగు ఎలా వచ్చు. “అన్నాడు డాక్టర్ నారాయణ.
“నేను ఒక సంవత్సరం హైదరాబాద్ లో ఉన్నా ఎంబిఎ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నపుడు. . కాని మధ్యలోనే హార్వర్డ్ లో సీట్ రావడంతో. . ”
కొంచెం ఆగి ఆగి మాట్లాడుతున్నా. . గాంధీ మంచి తెలుగే మాట్లాడుతున్నాడు.
మిస్టర్ భార్గవ గాంధీ. ,
ఒక మిస్టరీ.
“థాంక్యూ డాక్టర్. . ఒక తెర తొలగిపోయింది. నాకైతే వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళేందుకు నా దారి సుగమమైపోయింది” అని వకుళ లేచి నిలబడి. . గోపాల్ కూడా లేచి. . కరచాలనాలు. .
ఎంజిఎం నుండి బయటికి రాగానే,
“వకుళా. . ఇక మనం హనుమకొండకు వెళ్ళి తోవలో భోంచేసుకుని, గాంధీకి రెండు డ్రెస్స్ లు కొని, తిరిగొచ్చి కస్తూర్బా సత్రం ఖాళీ చేసి. . “గోపాల్ చెబుతూనే ఉన్నాడు. .
ఆటో కదిలింది.
*****

జీవితంలో ఎవరిని ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో. . ఎందుకు సన్నిహితులౌతారో. . ఎందుకు కొందరి మధ్య విదదీయరాని బలమైన బంధాలేర్పడ్తాయో. . అర్థం కాదు. ఈ కలయికలు ఏ శాస్త్రానికీ అందవు. జస్ట్ ఎ ఛాన్స్. . అంటుంది సైన్స్. దైవ సంకల్పం అంటారు సంప్రదాయవాదులు.
హేతువనేది లేదుగాని,
ఎక్కడి గడ్చిరోలి. . ఎక్కడి బస్తర్. . ఎక్కడి సీలేర్. . కుంట. . సుక్మా. . దంతేవారా. . చిత్రకోట. . ఉమర్కోట. . టిట్లాఘర్. . బాలంగిర్. ,
ఆరోజంతా నిద్ర లేని రాత్రే.
ఆరోజు సాయంత్రం గోపాల్ వకుళనూ, గాంధీనీ తీసుకొచ్చి కమలమ్మ గారితో మాట్లాడి ఇంట్లో కిరాయికి ఫిక్స్ అప్ చేసి వెళ్ళిపోయిండు.
రెండు గదులు. వేయి రూపాయలు కిరాయి. బాగానే ఉంది.
ఏరియా పేరు పోచమ్మ మైదాన్. నగరం నడిబొడ్డు. బయటికి అడుగేస్తే. . చౌరాస్తా. . రత్న హోటల్. . బిఎస్సెన్నెల్ భవన్. . రుద్రమదేవి విగ్రహం.
కమలమ్మ గారిని చూసి ఆశ్చర్యపోయింది వకుళ. . తనకు స్వంత తల్లివలె అనిపించింది. దాదాపు డెబ్బయి సంవత్సరాలు. తల మొత్తం నెరిసింది. తెల్లగా ముగ్గుబుట్ట. ముఖంలో తృప్తితో కూడిన వింతకాంతి. ఎదో తెలియని నిండుదనం. వర్చస్సు.
“బిడ్డా. . నువ్వు విశ్రాంతి తీసుకో. . నేను గీ ఔసులోళ్ళ బుచ్చక్క శవ దహనం కాడికి పోయొస్తా. ఆమె చిన్నప్పుడు నా సోబతి. జీవితమంత ఒగ కష్టపల్లే బిడ్డ. తాగుబోతు మొగడు. పనిదొంగ పోరగాండ్లు. ఎవడెవనితోనో లేచిపోయిన ఆడిపోరగాండ్లు. . థూ. దాని బతుకే బుగ్గి పాలయ్యింది. ఒక్కోసారి అట్ల ఒట్టీగనే వచ్చి నాతాన కూకోని గంటలకొద్ది కష్టాలు చెప్పుకోని వలవల ఏడ్చేది. ఐపాయె. ఒడిచింది. డెబ్బై ఆరేండ్లు. ఒక్కసారి ఆగి వెనుకకు తిరిగి చూచుకుంటనిపిస్తది. . మనిషిది ఏమి జీవితమని. ఇంకెందుకు ఈ బతుకని. కాని చచ్చిపోలేంగద. వచ్చినంక నీ సంగతి ఇంట. నాదో సినిమా సీరియల్ కథ. చెప్త బిడ్డ. “అని వెళ్ళిపోయింది చీకటి పడుతూండగా.
“అక్కా. . పొద్దటినుండి బాగ తిరుగుడైందియ్యాల. ఆటో కిరాయికూడ ఎల్లేటట్టులేడు. అట్ల ఒక నాలుగ్గంటలు సవార్ల కోసం వెళ్ళస్త. నువ్వు రెస్ట్ తీసుకొని కమలమ్మవ్వతోటి మాట్లాడుకో కడుపునిండ. నిజానికి నీదీ, కమలవ్వది ఒకతే బతుకు. పోరాటం చేసినోల్లు మీరిద్దరు. “అని గోపాల్ బయటికి వెళ్తూంటే గాంధీ అనూహ్యంగా అన్నాడు గోపాల్ తో. . “నేను కూడా నీతోటి వస్తా. నీ ఆటోలో డ్రైవర్ సీట్ ప్రక్కన నన్ను కూర్చోపెట్టుకుని వెంట తిప్పరాదు. “అన్నాడు.
ఆశ్చర్య పోయాడు గోపాల్. . వకుళకూడా.
ఒకరకంగా గాంధీ బైటికి పోవడం మంచిదే. అతని మానసిక స్థితి తొందరగా కుదుటపదుతుంది.
“ఓకే. . గాంధీ. కం. పోదాం పద. ”
మరుక్షణంలో ఇద్దరూ ఎప్పటినుండో ఎంతో పరిచయమున్న వ్యక్తుల్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు.
ఇల్లు ఖాళీ.
ఇక ఒక్కతే తను.
అనుకుంది. . ‘నిన్న ఈ వేళకు. . రాయగడ్ ప్యాసింజర్ లో. . దారీ తెన్నూ లేకుండా రైల్లో వస్తూ వస్తూ. . విజయవాడలో దిగి. . అప్పుడే కదులుతున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ లోకి ఎక్కి. . ఫైరింగ్ ఇంటు ద ఏర్. ఈ రోజు. . చిత్రంగా. వెంట ఎవరు ఈ గాంధీ. ఎవరు ఈ గోపాల్. ఎవరు ఈ కమలమ్మ. భద్రమైన ఈ కిరాయి ఇంట్లో సెటిలై. ఎంత మార్పు. ఇక ఒక నిశ్చింతమాత్రం ఏర్పడింది ‘. నిన్న వరంగల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తో తన లొంగుబాటు గురించి రహస్యంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకమొచ్చింది వకుళకు.
ఆమె మనసు ఇక వర్షించబోయే మబ్బుపట్టిన ఆకాశంలా ఉంది.
గదిలో ఒక ప్రక్క బట్ట వాలుకుర్చీ ఉంది. మెల్లగా అందులో కూర్చుంది.
కళ్ళు మూసుకుంది భారంగా.
లోపల ఒక విశాలాకాశం ఫెళఫెళమని గర్జించి ఉరిమి వర్షిస్తున్నట్టు,
హృదయంలో. . కొండల్లో. . సెలయేర్లపై. . పశువుల కొట్టాల్లో. . అడవుల్లో. . ఒకటే వర్షం. ఎడతెగని వర్షం.
ఎనిమిదేండ్లు తనకు.
చత్తీస్ గడ్ లో. . దంతేవార జిల్లా. సుక్మా టౌన్ నుంది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు లోపలికి. . రాంఘడ్.
అంతా ఓ అరవై కుటుంబాలుకూడా లేని చిన్న ఊరు.
చాలా మంది ఎస్సీ. గొల్ల. కుమ్మరి. కుర్మ. . జాట్.
ఊళ్ళో బడి లేదు. గుడి ఉంది. . ఓ ఎత్తైన బండ రాయిపై సన్నగా ఎత్తుగా కట్టిన గుడి. గుడి తలపై రెపరెపలాడుతూ. . ఒక కాషాయ ఝండా.
తల్లి. . తండ్రి. . తను. ముగ్గురే. రేష్మీ. . కునాల్. తను వకుళ.
‘నీ పేరును పూజారిగారు పెట్టిండ్లురా. వకుళ. చాలా బాగుంది కదా’ అని ముచ్చటపడ్తూ నిరంతరం పారే సెలఏరులా నవ్వే నాన్న. . సున్నపు భట్టీల్లో పనిచేసేది. తమ ఊరిచుట్టూ. . అన్నీ సున్నపు భట్టీలే.
ప్రక్కనున్న కొండల్లో సున్నపురాయి దొరికేది సమృద్ధిగా.
అందుకని ఎక్కడినుండో. . మల్కాంగిరి నుండి వచ్చి తమ ఊళ్ళో రాంసింగ్ సేఠ్ ఒక్కడే మొత్తం పద్దెనిమిది సున్నపు భట్టీలను కట్టిండు. ఇక ఊరు ఊరంతా సున్నపు భట్టిల్లో నౌకరి. పొద్దంతా మగవాళ్ళందరూ సున్నపు రాయిని చూర చూర చేసుడు. . భట్టీ కింద నిరంతరం మంట పెట్టుడు. ముంచుకొచ్చే ఘాటు పొగలోపలే మగ్గుతూ. . దగ్గుతూ. . కాలిన సున్నాన్ని సంచుల్లో కుట్టుడు. గాడిదలపై కొందరు మగాళ్ళు సున్నపు బస్తాలనేసుకుని కాళేష్వర్ సంతకు వేసుకుపోవుడు.
ఆడాళ్ళందరూ రాంసింగ్ సేఠ్ మనుషుల ఆర్డర్ పై రోజూ కొండల్లోకి వెళ్ళి చింతపండు, బంక, మోదుగాకులు, తునికి పండ్లు, తేనె, ఇప్పపువ్వు. . ఇలా ఎన్నో. . అన్ని తెచ్చి సేఠ్ మనుషులకిచ్చి పది రూపాయలు తీసుకు పోవాలె. కూలీ. పదిరూపాయలు రోజుకు.
మొట్టమొదటిసారి తమ ఊళ్ళోకి ఒక బడి వచ్చింది. కాని అందరూ ఏమన్నారంటే. . రాంసింగ్ సేఠ్ బడిని పక్కనున్న కుంట ఊరికి తబాదలా చేయించిండని.
ఆరోజు బాగా జ్ఞాపకం తనకు. . తండ్రినడిగింది. . “నేను బడికి పోదామనుకున్న. . కాని ఎందుకు నాయినా బడిని మనూళ్ళెనుంచి తీసేసిండ్లు” అని.
నాన్న కునాల్ ఏ జవాబూ చెప్పలేదు. “మనకు చదువెందుకు అంటున్నడు సేఠ్’ అన్నడు సన్నగా తనలోతనే గొణుక్కుంటున్నట్టు.
తననుకూడా అమ్మ అడవిలోకి రమ్మనేది. వస్తే పది రూపాయల కూలి వస్తదని చెప్పేది.
నిజమే అనిపించేది తనకు కూడా. . ముఖ్యంగా అడవిలోకి వెళ్తే ఆ చెట్లు, గాలి, కొండలను ఎక్కడం, చెట్లపైకి పాకుతూ ప్రకృతిలో కలిసిపోవడం. . ఎంతో బాగనిపించేది.
పసితనం. బాల్యం. గాలిలో కాగితం ముక్కవలె. ఎటు గాలి వీస్తే అటే గమనం.
ఒకరోజు సేఠ్ కొడుకు మోటర్ సైకిల్ వేసుకుని వచ్చాడు తమ ఊరికి సాయంత్రం. వచ్చి వెళ్ళలేదు. భట్టీల దగ్గరే తమ బెంగులూర్ గూన పెంక ఇంట్లోనే ఉన్నాడు రాత్రంతా. ఆరోజు రాత్రి అడవికి పోయిన అమ్మ ఇంటికి రాలేదు. చాలాసేపు ఎదురుచూచీ చూచీ నిదురపోయింది తను. నాయిన ఉన్నాడు తనదగ్గరే.
మర్నాడు తనకు తెలివొచ్చి మేల్కునేసరికే. . ఇంటిముందు అంతా జనం. అరుగుపైన అమ్మ శవం. అటు ఎదురుగా వాకిట్లో ఉన్న చింత చెట్టుకు ఉరేసుకుని వ్రేలాడుతూ నాన్న.

1 thought on “అంతిమం 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *