May 17, 2024

మాయానగరం – 15

రచన: భువనచంద్ర

హింస అనేది ఎప్పుడు పుట్టిందో తెలుసా? జీవుల పుట్టుకలోనే హింస ఉంది. నొప్పి లేకుండా ప్రసవం జరుగుతుందా? పోనీ అలాంటి నెప్పులు వెరచి అన్నా మానవుని మనసు అహింస వైపు కంటే హింస వైపే ఎక్కువ మళ్ళుతుంది. ఓ హీరో వందమందిని చావగొట్టాడు. థియేటర్లో వాళ్ళు క్లాప్స్ కొడతారు. అదే హీరో ఒక గుడ్డివాడ్ని రోడ్డు దాటిస్తే ‘ ఓహో ‘ అనుకుంటారు గానీ చప్పట్లు కొట్టరుగా. అంతెందుకూ , ఎవడి మీద నీకు కోపం వచ్చినా నీ మనసు ఆలోచించేది ఏమిటి? వాడ్ని తందామనో లేక పది మందిలో పచ్చిగా అవమానిద్దామనో లేక చంపేద్దామనో! కాదంటావా? ” విశ్రాంతిగా బీడి వెలిగించి అన్నాడు పరమశివం.
“ఇవన్నీ నాకెందుకు చెపుతున్నావు? ” అసహనంగా అన్నాడు వెంకటస్వామి. హోటల్ లో రష్ లేదు. కారణం బస్సుల బంద్.
“నీకు తెలుసుండాలే! తెలియదా? ” నవ్వాడు పరమశివం.
“నీ బుర్రలో ఏముందో నాకేం తెలుసు? ” సీరియస్ గా అడిగాడు వెంకటస్వామి.
“నన్ను వీలున్నంత త్వరగా చంపెయ్యాల్ని ఉంది. నన్ను అడ్డు తొలగించుకొని నందినిని ఆస్తితో సహా నీదాన్ని చేసుకోవాలని ఉంది. ఎలా చంపాలో అని రకరకాలుగా ఆలోచిస్తున్నావు కూడా! ” కిసకిసా పరమ కౄరంగా నవ్వుతూ అన్నాడు పరమశివం.
“నిన్ను చంపినంత మాత్రాన నందిని నా పరం అవుతుందా? ” ధైర్యంగా పరమశివం కళ్ళలోకి చూసి అన్నాడు వెంకటస్వామి. అటో ఇటో తేల్చుకోవల్సిన సమయం ఎంతో దూరం లేదని వెంకటస్వామి మనసుకి అనిపించడం వలన వచ్చిన ధైర్యం అది.
మనసు మనిషిని భయపెడుతుంది. ఒక్కోసారి ఆ మనసే మనిషిని భయాన్నుంచి బయట పడేస్తుంది.
“గుడ్.. ఇప్పుడు నచ్చావ్. యీ క్షణంలో నీ కళ్ళలో ‘తెగింపు ‘ కనిపిస్తోంది. శభాష్. ఇప్పుడు మజా వస్తుంది. ఎందుకంటే ఏమాత్రం ఎదురుతిరగలేని మనిషిని చంపడంలో ‘థ్రిల్ ‘ ఏముంటుంది? వెంకటస్వామీ.. పులి కూడా డైరెక్టుగా జింక మీదకు దూకదు. పరిగెత్తిస్తుంది. జింక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయేదాక మహోత్యాహంగా దాన్ని వెంటాడుతుంది. పరిగెత్తిన కొద్ది జింక నెత్తురు వేడెక్కుతుంది కదా… ఆ వేడి నెత్తురి కోసమే పులి జింకకి అవకాశం ఇచ్చి మరీ పరిగెత్తిస్తుంది ” మరో బీడి వెలిగించుకుంటూ ఆగాడు పరమశివం. వెంకటస్వామి ఆలోచిస్తున్నాడు. వీడు ఇప్పటికే నన్ను చంపేందుకు ప్లాన్ సిద్ధం చేసి ఉండాలి. లేకపోతే ఇంత నిబ్బరంగా మాట్లాడుతూ కూర్చోడు. “ఊ!.. ఒకోసారి జింక, పులి నుంచి తప్పించుకుంటుంది కూడా. కానీ అది నోరు, తెలివితేటలూ లేని జంతువుల వేట. నాదలా కాదు. పులీ, సింహం, తాబేలు, ఎలుగుబంటి ఛాయిస్ ఇచ్చినా, నేను ఛాయిస్ ఇవ్వను. నేను అనుకొన్న పద్ధతిలో, నేను నిర్ణయించిన క్షణాన నువ్వు మరణిస్తావు. అది మరణం కాదు. ‘మృత్యువే నయం ‘ అని నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు! ” బీడి దమ్ము మరోసారి గాఢంగా పీల్చి అన్నాడు పరమశివం. “అంటే ‘ వరం ‘ అన్నమాట! ” అని పొగ వదిలాడు పరమశివం.
అసలు అంత పగ నా మీద ఎందుకు? సరే.. నందిని అందగత్తే.. పోనీ అమాయకురాలు. డబ్బు ఉంది. అటువంటి వాళ్ళ కోసం ఎవరైనా ప్రయత్నిస్తారు. ఏం నువ్వు ప్రయత్నించవా? ఉన్న స్థితిలో నుంచి పైకి ఎదగాలనుకోవడం తప్పా? పరమశివం…నిన్నటి వరకు నిన్ను చూసి భయపడ్డ మాట నిజమే. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నేను దుర్మార్గుడ్ని కావచ్చు, కానీ నీలాగా శాడిస్టుని కాను. ఇప్పుడు చెపుతున్నాను విను. నీ వేటలో నువ్వుండు… నా వేటలో నేనుంటాను. నీ వేట కేవలం నన్ను చంపడం… అదీ భయంకరంగా. కానీ, నా వేట నిన్ను చంపడం కోసమే కాదు నందినిని దక్కించుకోవడానికి కూడా. నిన్నటి వరకు నందినిని ఒక నిచ్చెనలాగా వాడుకుందామనుకొన్నాను. నీలాంటి శాడిస్టు రాస్కేల్ చేతుల్లో తాను పడకుండా ఉండాలంటే నేనే నిన్ను చంపాలి… బీ రెడీ! ”
పరమశివం మందున్న బీడికట్టలోంచే ఓ బీడిని తీసి వెలిగించి, దమ్ము పీల్చి , ఆ పొగని పరమశివం మొహం మీదకే వూదాడు వెంకటస్వామి.
ఇప్పుడు అవాక్కవ్వడం పరమశివం వంతయ్యింది.

***********************

“పాలిష్ చేయ్!.. ” పాతిక్కి పైగా వున్న చెప్పుల జతల్ని శీతల్ వైపుకి విసురుతూ అన్నది సుందరీ బాయ్.
జరీవాలా చూస్తూనే ఉన్నాడు. కానీ ఏమీ అనడానికి లేదు. ఏం అన్నా సుందరికి ‘ అనుమానం ‘ వస్తుందని సైలెంటుగా ఉండిపోయాడు.
“హాంజీ!.. ” చెప్పుల్ని జగ్రత్తగా వరుసలో పెడుతూ అన్నది శీతల్. శీతల్ కి అర్ధమైంది… సుందరీ బాయ్ కి అనుమానం కలిగినందుకే కక్ష సాధింపు మొదలెట్టిందని. కానీ శీతల్ కి తెలియదు ….. వాళ్ళిద్దరు ఏకాంతంలో వుండగా సుందరి చూసిందని, సుందరిది మామూలు పగ కాదని…
“డార్లింగ్…. కొంతమంది మగవాళ్ళు అన్నీ సౌఖ్యాలు అందుతోన్నా పరాయి ఆడదాని వెంటపడి ప్రేమ ప్రేమా అని మొత్తుకుంటూ ఉంటారట? ” అడిగింది సుందరి నవ్వుతూ పొరపాటుగా స్టాండ్ లోని చెప్పులజతని విసిరినట్టుగా నటిస్తు చెప్పు శీతల్ మొహానికి తాకేటట్టు విసిరింది. శీతల్ అప్రమత్తంగా ఉండటంలో తప్పించుకుంది లేకపోతే హీల్ దగ్గర సన్నగా పొడుగ్గా ఉన్న ‘పాయింట్ ‘ ఆమె కళ్ళకు తగిలేది.
“అవునా? నాకేం తెలుస్తుంది ? ” నవ్వీనవ్వనట్టు నవ్వి అన్నాడు జరీవాలా.
“ఏమో! ఓ డిష్కషన్ వచ్చిందిలే. అవసరం కోసం భార్య, ఆనందం అనురాగం కోసం ఇంకోతిని మగవాళ్ళు కోరుకుంటారని! ” లోలోపల మండిపోతూ, పైకి మాత్రం సరదాగా అన్నట్టు అంది.
“హ..హ.. మంచి డిస్కషనే ! చూడు సుందూ.. కొన్ని కొనుక్కోడానికి దొరుకుతాయి. కొన్ని దొరకవు. అక్కడ ‘టెరంస్ ‘ మనీ కాదు… హృదయం. కొందరు డబ్బుకి విలువ ఇస్తే, కొందరు ప్రేమకి విలువిస్తారు. ఈ లోకంలో మనిషి బ్రతకడానికి డబ్బు ఖచ్చితంగా వుండి తీరాల్సిందే. కానీ ‘మనస్సు ‘ బ్రతకడానికి ప్రేమ. కోటానుకోట్ల మంది దాహం తీర్చే తీయ్యని జలాలు కలిగిన నది, తన దాహం తీరడం కోసం ఏం చేస్తుందో తెలుసా? తనంతట తాను ఉరకలేస్తూ ‘ఉప్ప’ ని సముద్రుడిలో కలుస్తుంది. ధనము, ధన సంపాదనా, వ్యసనాల్లాంటివి. ప్రేమ వ్యసనం కాదు. మనిషిని మనిషిగా నిలబెట్టేది. మనిషిలో మానవతని నింపేది కేవలం ప్రేమ మాత్రమే. అది అధికారంతో వచ్చేది కాదు. అందుకే చాలా మందికి ప్రేమ అనే మాటకి అర్ధం కూడా తెలియదు. దానికి వయసుతోటో, అందం తోటో, అధికారంతోటో సంబంధం లేదు. మరో మాట చెప్పనా? భార్య ఉండగా ప్రేమ కోసం కలవరించే భర్తలు ఎందరుంటారో, భర్త వున్నా ప్రేమ కోసం అలమటించే ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువమందే వుంటారు. ఒక గూడు కింద జీవిస్తున్నాము కదా అని ఒకరికొకరు రాజీ పడవచ్చు. అది తప్పు కాదు. రాజీ పడటం కూడా జీవితంలో ఒక భాగమే. సరే.. నేను ఆఫీస్ కు వెళ్ళాలి. మీ నాన్నగారు ఎందుకో ఆఫీస్ కి రమ్మన్నారు. వెళ్ళొస్తాను. ” సూటిగా సుందరి వంకే చూస్తూ చెప్పాల్సినది చెప్పి బయటకు నడిచాడు జరీవాలా.
సుందరికి షాక్ కొట్టినంత పనైంది. ఎందుకంటే జరీవాలా ఎప్పుడూ నాలుగు మాటలకి మించి ఆమె ముందు మాట్లాడలేదు. అసలు అతను మాట్లాడగలడని ఆమె అనుకోలేదు. సడన్ గా శీతల్ వంక చూసింది సుందరి. శీతల్ తల వంచుకొని చెప్పులు పాలిష్ చేస్తొంది. చాలా శాంతిగా.. చాలా శ్రద్ధగా…

***********************

జి.ఎం.కె. (గాంధీ మోహన్ దాస్ కరంచంద్ ) వీధిలో “చీపురు పుల్లావిడ ” ఎదురుపడింది మాధవికి. “ఎలా వున్నావు?” అని అడిగింది.
“ఎలా వుండేదేంటి అమ్మగారు…. అలాగే వున్నానండి. ఆడు చచ్చిన దగ్గర నుంచి నేను బతుకుతా వున్నానండి. తాగితాగి చచ్చాడండి. ఆడేంటండి వరసగా కల్తీసారా దెబ్బకి మావోళ్ళంతా కాకుల్లా రాలిపోయారు గదండి. మీలాంటి పెద్దోళ్ళందరూ మా గుడిసెల్లోకి వచ్చేసి పరామర్శలు చేశారు గదండి. అమ్మా.. ఒకటడుగుతామడి.. సెప్తారాండీ? యీ గోర్మెంటు అంటారు సూడండి. అదెక్కడుంటాదండి? సచ్చినోళ్లందరికీ మనిషికి యాబ్భై ఏలు ఇస్తానన్నదంట ఆ గోర్మెంటు. ఎవడెవడో వచ్చి మా చేత నిశానీలు కూడా ఏయించుకెళ్ళారండి. బాబ్బాబు అదెప్పుడొత్తాదో తెలిత్తే మా పాణాలు కుంచెం చల్లబడతాయండి. ఆ ఎడ్రస్ చెపుతారాండి. ” గోనె సంచీని కిందపారేసి మాధవిని చూస్తూ అంది చీపురుపుల్లావిడ.
” కల్తీసారాకి చచ్చిపోయారా? కలరాకి కాదు చచ్చిపోయింది? ” ఆశ్చర్యంగా అడిగింది మాధవీ రావ్.
“అంత ఆశ్చర్యము ఎందుకండి? చచ్చినోళ్లందరూ చచ్చింది కల్తీ కల్లు తాగే. కలరా ఏడనుంచి వస్తదండి? గుడిసెల్లోకి రావాలంటే యమదరమరాజైనా కల్తి కల్లు తాగి రావాలసిందే గానీ మామూలుగా రాగలడేంటండి? ఆ మారాజే రానప్పుడు కలరా ఎట్టా వస్తాదండి? ” దీనంగా నవ్వింది చీపురుపుల్లావిడ
“మరి మీరంతా అవ్వాళ ఎందుకు ఎదురు తిరగ లేదు? ” నిర్ఘంతపోయి అడిగింది మాధవి.
“ఎవరి మీద ఎదురు తిరగాలండి? అమ్మగారు! తాగితాగి సచ్చింది మావోళ్ళేకదండి. ఎవరూ ఆళ్లని బలవంతం చేసి తాగించలేదు కదండీ. పాపం ఆ బోసుబాబు, కల్లు దుకాణం పెట్టించింది ఆయనేనండి. ఆరే మావోళ్ల ‘ చావుఖర్చు ‘ లిచ్చి ఆదుకున్నారండి. లేకపోతే శవాలు దిక్కులేకుండా పడుండల్సిందే కదంది. అయినా మా పిచ్చి కాకపోతే మీకు మాత్రం గోర్నమెంటు గారి అడ్రస్సు తెలుస్తాదాండి? ఒకేళ్ళ తెలిసినా మీలాంటి పెద్దోళ్ళు మాకు సెపుతారాండీ? ” గోనేసంచినీ భుజానికి వెసుకొని అన్నీ తెలిసిన వేదాంతిలా నవ్వుకుంటూ నడచిపోయింది చీపురుపుల్లవిడ.
మాధవికి మనసు నిండా అశాంతి.
చీపురుపుల్లావిడ మాటల్లో వ్యంగ్యం లేదు. ఎవరి మీదా కోపం లేదు. వున్నది నిస్సహాయత. ఆఖరికి ఎవరి కల్తీ కల్లు తాగి భర్త చచ్చిపోయాడో , అంత్యక్రియలు జరిపించినందుకు అతని మీద కృతజ్ఞతే కానీ క్రోధము లేదు. మాధవి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
యీ దైర్యాన్ని యీ మనుషుల్ని చూసి గర్వపడాలో, ఇంతటి ఘోరమైన అసమానతల్ని చూసి రగిలిపోవాలో ఆమెకి అర్ధం కాలేదు.
“నమస్తే మాధవిగారు! ” కళ్ళు మెరుస్తుండగా అని, షాక్ తిని…
“ఎందుకీ కన్నీళ్ళు? ” విస్మయంతో అదిగాడు ఆనంద రావు.
నడుస్తూనే విషయం వివరించింది మాధవి. ” నేను ఇప్పటి వరకూ కలరా మరణాలే అనుకున్నాను ఆనందరావుగారు, ఇప్పుడు తెలుస్తోంది ఇదంతా జనాల్ని పక్కదోవ పట్టించడానికి ‘ కలరా ‘ జబ్బుని సృష్టించారని. అసలు చచ్చేటప్పుడు ఏం కట్టుకుపోతామని యీ అడ్డదారులు, కల్తీలు, స్వార్ధాలు? తలచుకుంటేనే గుండె చెరువైపోతోంది! ” విషాదం గొంతులో ధ్వనిస్తుండగా అన్నది మాధవీరావు. ఆనందరావు మాట్లాడలేకపోయాడు. నిన్నటి నుంచి అతనికి మనసు మనసులో లేదు. సుందరీబాయ్ గురించి మాధవి చెప్పాలో వద్దో అతను నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఒక పక్క చెపుద్దామని వుంది. కారణం సుందరి మాటల్లో పగ. రెండో పక్క చెప్పవద్దని అనిపిస్తోంది. కారణం మాధవి ఎదుట ‘పిరికివాడు’ గా నిలబల్సి వస్తుందేమో అన్న భయం. మౌనంగా చాలా దూరం నడిచారు.
“మాధవి గారు! మీరు ఏవీ అనుకోకపోతే కాఫీ తాగుద్దామా? ” రిక్వెస్ట్ గా అడిగాడు ఆనందరావు.
“అదీ…” సడన్ గా ఆనంద్ మొహం వంక చూసింది మాధవి, చాలా నీరసంగా, చాలా డిస్ట్రబ్డ్ గా కనిపించాడు.
“పదండి.. మీరేంటి అంత నీరసంగా ఉన్నారు? భోజనం చేయలేదా? ” అని అనూనయంగా అంది మాధవి.
“ఎందుకో తినబుద్ధి కాలా, ఇప్పుడు తినాలని లేదు, కానీ నీరసంగా ఉంది. ” తలవంచుకొని అన్నాడు ఆనంద్.
“నిజం చెప్పనా? పొద్దున నుంచి నేను ఏమీ తినలేదు. తినాలని లేదు. మీరు ‘ కాఫీ ‘ అనేదాకా నాకు ఆకలి గురించే గుర్తు లేదు. ” హోటల్లోకి అడుగుపెడుతూ అంది మాధవి.
వాళ్లిద్దరు హోటల్లోకి వెళ్తుండగా శ్యామ్యూల్ రెడ్డి కారులో వెళుతూ గమనించాడని వాళ్లకి తెలియదు.
అందరికీ అన్నీ విషయాలు తెలీవు. అసలెందుకు తెలియాలి. తెలిసినా జరిగేది జరక్కుండా ఆపగలమా? “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *