May 5, 2024

ఆరాధ్య 9

రచన: అంగులూరి అంజనీదేవి

”కొంచెం కూడా కడుపులో మిగల్లేదు హేమంత్‌! మొత్తం పోయింది” అంటూ అబద్దం చెప్పింది.
అతను నమ్మాడు ”అయ్యో! అలాగా! మళ్లీ తింటావా! కలిపి పెడతాను” అంటూ అన్నం ముద్దలు పెట్టబోయాడు.
”వద్దు హేమంత్‌! తిన్నా నిలవదు!” అంది పడుకుంటూ.
ఇలా అయితే ఎలా అన్నట్లు ఆలోచనలో పడ్డాడు హేమంత్‌.
హేమంత్‌ని క్రీగంట చూస్తూ ”నువ్వు తిను హేమంత్‌!” అంది ఆరాధ్య.
అతను తినకుండా చేయి కడుక్కొని ఫ్రిజ్‌లోంచి యాపిల్‌ తెచ్చి, దాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేశాడు. ఒక్క ముక్క తీసి ఆమె నోట్లోపెట్టి ”తిను” అన్నాడు.
”వద్దు హేమంత్‌! అది తిన్నా వేస్టే! మళ్లీ వాష్‌బేసిన్‌ దగ్గరకి వెళ్లాల్సి వస్తుంది. నాకు అక్కడికి వెళ్లే ఓపిక కూడా లేదు” అంది నీరసంగా చూస్తూ.
ఆశ్చర్యపోయాడు. ఆమె మాటలే అలా వున్నప్పుడు తనేం చెయ్యగలడు? బిడ్డ కావాలన్న కోరిక తన ఒక్కడికే వుంటే సరిపోతుందా? ఆమెకు కూడా వుండాలిగా! ఆమెకు లేకుండా బిడ్డను కనటం సాధ్యమా? ఒకవేళ పుట్టాక సరిగా చూస్తుందా?
”బిడ్డ కావాలని నీకు లేనప్పుడు నేనేం చెప్పను చెప్పు! నా ఫోర్స్‌మీదనే బిడ్డను కనాల్సిన అవసరం కూడా నీకు లేదు. నువ్విక ఈ టాపిక్‌ మీద నాతో మాట్లాడాల్సిందేమీ లేదు. నీకు ఎలా అన్పిస్తే అలా చెయ్యి. నువ్వెలా చేసినా నా అభ్యంతరం ఏం వుండదు. నీకు మీ ఊరు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లు” అన్నాడు. అతనా మాటలు మనస్ఫూర్తిగా అనటం లేదని ఆమెకు అర్థమైంది.
అందుకే దిగ్గున లేచి వాష్‌బేసిన్‌ దగ్గరకి మళ్లీ పరిగెత్తింది. ఈసారి ‘వాక్‌ వాక్‌’ అంటూ గొంతులోంచి పెద్దగా సౌండ్‌ చేస్తూ అక్కడే నిలబడింది. ఒక్కక్షణం హేమంత్‌ వస్తాడేమోనని, చెవులు మూస్తాడేమోనని, కంగారు పడతాడేమోనని ఎదురుచూసింది. అతను రాలేదు. కూర్చున్న చోటే కూర్చుని జుట్టులోకి వేళ్లుపోనిచ్చి నేలవైపు చూస్తూ తన ఆలోచనలో తనున్నాడు.
తనకో బిడ్డ కావాలని ఎవరైనా ఆశించడంలో తప్పులేదు. శాసించటమే తప్పు. హేమంత్‌ జాబ్‌ వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడే కాని ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదు. అనుకుంటే ఆరాధ్యను ప్రేమించేవాడు కాదు. పెళ్లి చేసుకునేవాడు కాదు. దగ్గరయ్యేవాడు కాదు. రమాదేవి కూడా తన కూతురికి ‘తల్లి తనం’ కష్టమను కున్నప్పుడు పెళ్లి ప్రసక్తి తెచ్చి వుండాల్సింది కాదు. ఏ తల్లి అయినా కూతురు నెల తప్పిందని తెలియగానే డెలివరీ కోసం ఎదురుచూస్తుంది కాని అబార్షన్‌ కోసం కాదు. కడుపు తీపి తనకే కాదు తన కూతురికి కూడా రుచి చూపాలని తపించి పోతుంది. తన బిడ్డ మరో బిడ్డకి జన్మ ఇచ్చినప్పుడు జన్మ ధన్యమైనట్లు తరించిపోతుంది. దగ్గరుండి పురుడు పోస్తుంది. రమాదేవిలో ఈ లక్షణాలు లేవు. ఆమెను గుర్తు చేసుకోవాలంటేనే అసహ్యమని పించింది హేమంత్‌కి.
ఆరాధ్య హేమంత్‌ కోసం ఎదురుచూసి అతను రాకపోవడంతో వెంటనే టాప్‌ తిప్పి ముఖం మీద నీళ్లు చల్లుకొని, వాటిని తుడుచుకునే ఓపిక కూడా లేనట్లు నీరసంగా నడుచుకుంటూ వచ్చి హేమంత్‌ ముందు నిలబడింది.
”ఉదయం నుండి ఇంతే హేమంత్‌! గడియ గడియకి వాష్‌బేసిన్‌ దగ్గరకి వెళ్లలేక చచ్చిపోతున్నా!” అంటూ కళ్లు తేలేసి బెడ్‌మీదకి ఒరిగింది.
కంగారు పడ్డాడు హేమంత్‌. వెంటనే ఆమె మీదకి వంగి ఆత్రంగా ”ఆరాధ్యా! ఆరాధ్యా!” అంటూ పిలిచాడు. ఆమె కళ్లు తెరవలేదు. మాట్లాడలేదు. భయపడ్డాడు హేమంత్‌. ఆమె ముఖంమ్మీద నీళ్లు చల్లాడు. చెంపల మీద తడుతూ ”కళ్లు తెరువు ఆరాధ్యా!” అన్నాడు.
ఆమె కళ్లు తెరిచి చూడలేదు. పైగా ఊపిరాడనట్లు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అతను ఆందోళనగా చూస్తూ పిలుస్తూనే వున్నాడు. ఒక్కసారి కళ్లు తెరిచి మళ్లీ మూసుకుంది.
ఇక లాభం లేదనుకొని కాశిరెడ్డికి ఫోన్‌ చేసి ”కాశీ! వెంటనే వెహికిల్‌ పంపు. ఆరాధ్యను అర్జంట్‌గా హాస్పిటల్‌కి తీసికెళ్లాలి” అన్నాడు.
భర్త కాశిరెడ్డితో మాట్లాడటం వినగానే కర్రలా బిగుసుకుపోయింది ఆరాధ్య. వెంటనే రిలాక్సై నెమ్మదిగా కదిలి స్పృహలోకి వచ్చినట్లు ”హేం!” అంది కళ్లు తెరవకుండానే.
”చెప్పు ఆరాధ్యా! ఎలా వుందిప్పుడు? హాస్పిటల్‌కి వెళ్దాం! వెహికిల్‌ వస్తోంది” అన్నాడు.
”వద్దు హేమంత్‌! నాకు హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే ఎలర్జి. ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తే మా మమ్మీ శొంఠిముద్దలు తినిపిస్తుంది. నువ్వేం కంగారుపడకు. తగ్గిపోతుంది. వెహికిల్‌ పంపొద్దని మీ ఫ్రెండ్‌కి కాల్‌ చెయ్యి” అంది. ఆమె కళ్లు మూసుకునే మాట్లాడుతోంది. కళ్లు తెరిస్తే ఎక్స్‌ప్రెషన్స్‌ కన్పిస్తాయని కళ్లు మూసుకునే వుంది.
”కళ్లు కూడా తెరవలేకపోతున్నావ్‌! హాస్పిటల్‌కి వద్దా! ఏం మనిషివే నువ్వూ! శొంఠిముద్దలతో తగ్గటానికి నువ్విప్పుడేమైనా పెళ్లికి ముందు ఆరాధ్యవా?” అంటూ కేకలేశాడు. వెహికిల్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.
అతని ప్రవర్తన చూస్తుంటే హాస్పిటల్‌కి వెళ్లక తప్పేటట్లు లేదు. మెల్లగా కళ్లు తెరిచింది.
”నాకేం కాలేదు హేమంత్‌! ఈ టైంలో ఇలాగే వుంటుందని మమ్మీ చెప్పింది. హాస్పిటల్‌కి వెళ్లాల్సినంత సీరియస్‌ కాదు” అంటూ లేచి నిలబడింది.
హేమంత్‌ ఆమెను కిందనుండి పైకి చూశాడు.
అతనలా చూస్తుంటే తను చేసిన యాక్షన్‌ తెలిసిపోతుందని వెంటనే తూలింది.
హేమంత్‌ ఆమెను పట్టుకొని ”లేవకు. పడిపోతావ్‌! పడుకో!” అంటూ బెడ్‌మీద పడుకోబెట్టాడు.
ఆమె పడుకున్న క్షణానికే చేయిచాపి బయటకి చూపిస్తూ
”అదిగో వెహికిల్‌ వచ్చినట్లు సౌండ్‌ వస్తోంది హేమంత్‌! వద్దని చెప్పిరా! ప్లీజ్‌! హాస్పిటల్‌ వాతావరణం అంటేనే నాకు పడదు. అక్కడ మళ్ళీ వాంటింగ్స్‌ అవుతాయి” అంది. రిక్వెస్ట్‌గా చూసింది.
”ఓ.కె. నువ్వు పడుకో. లేవకు…” అంటూ బయటికెళ్లి వెహికిల్‌ని వెనక్కి పంపి వచ్చాడు. వెహికిల్లోంచి కాశిరెడ్డి దిగి హేమంత్‌తో పాటే లోపలికి వచ్చాడు.
హేమంత్‌ గుండె ఆరాధ్యకు ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయంతో కొట్టుకుంటోంది.
”ఇలా అయితే కష్టంరా కాశీ! నా మాటవిని నువ్వు పెళ్లి చేసుకోకు” అన్నాడు.
”ఇచ్చిన అడ్వయిజ్‌ చాల్లే!” అంటూ లోపలికి వెళ్లి ”నీకిప్పుడు ఎలావుంది ఆరాధ్యా?” అంటూ ఆమెవైపు చూశాడు కాశిరెడ్డి.
”ఓ.కె.” అంది సింపుల్‌గా. కాశిరెడ్డితో పెళ్లికి ముందున్నంత క్లోజ్‌గా, ఎఫెక్షన్‌గా ఇప్పుడు వుండటం లేదు ఆరాధ్య. ఒక పెళ్లిలో ఎన్ని సాంగ్యాలు వుంటాయో అవన్నీ వాళ్ల ఫ్యామిలీ ద్వారానే హేమంత్‌కి తెలిశాయన్న కోపం వుందామెలో…
కాశిరెడ్డి చాలా ప్రశాంతంగా చూస్తూ ”రే! హేం! ఆరాధ్యచేత ఓ పదిరోజులు లీవ్‌ పెట్టించి వాళ్ల ఊరు పంపించరా! హెల్త్‌ ముఖ్యం. ఆ తర్వాతనే అన్నీ!” అన్నాడు.
కాశిరెడ్డి వైపు కృతజ్ఞతగా చూసింది ఆరాధ్య. ఆమెకు అతనిమీద వున్న కోపంలో సగం కోపం తగ్గిపోయింది.
కాశిరెడ్డి వచ్చాక కొంచెం కంగారు తగ్గినట్లై ”పంపిస్తాను కాశీ! ఆరాధ్యను రేపే వాళ్ల ఊరు పంపిస్తాను” అన్నాడు హేమంత్‌.
హేమంత్‌ ముఖంలోకి పరిశీలనగా చూశాడు కాశిరెడ్డి. ”రేయ్‌! హేం! కూల్‌రా! ఎందుకంత ఎగ్జయిట్‌ అవుతావ్‌? ఆరాధ్యకు ఏం కాదు” అంటూ ధైర్యం చెప్పాడు.
”ఏమోరా! ఇంత దడ ఎప్పుడూ పుట్టలేదు నాకు” అన్నాడు హేమంత్‌.
ఒక్క క్షణం ఆగి ”హేం! నువ్వు తిన్నావా?” అడిగాడు కాశిరెడ్డి.
”లేదు కాశీ! జస్ట్‌ తినాలని కూర్చున్నాను. అంతే! అంతలోనే ఆరాధ్యకు ఇలా అయింది. పాపం! తనకి మార్నింగ్‌ నుండి ఇలాగే వుందట. ఆఫీసుకి కూడా వెళ్లలేదు. ఇవాళ ఊరెళ్తానంది. నేనే వద్దన్నాను” అన్నాడు.
”వెళ్లనివ్వాల్సింది. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్లు వుంటారు కదా! నువ్వయినా ఇలా వుందని తెలియగానే మా మమ్మీకో, మీ మమ్మీకో కాల్‌ చేస్తే బావుండేది. వాళ్లుంటే కాస్త ధైర్యంగా వుంటుంది”
”కానీ ఈ టైంలో వాళ్లను నిద్రలేపి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాశీ! అందుకే వాళ్లిద్దరికి కాల్‌ చేసి చెప్పలేదు” అన్నాడు.
”సరేలే! ఆరాధ్యకు ఇంకేం కాదు. నువ్వు తిను. నేను నీతో కూర్చుంటాను” అంటూ హేమంత్‌ని లాక్కెళ్లి ప్లేటు ముందు కూర్చోబెట్టి తనూ కూర్చున్నాడు కాశిరెడ్డి.
వాళ్లిద్దరు మాట్లాడుకుంటుంటే తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగింది ఆరాధ్య. ఏదో మాట్లాడుకుంటున్నారు కాని ఆమెకు విన్పించటం లేదు. వాళ్ల దృష్టిని తనవైపుకి తిప్పుకోవాలని సడన్‌గా లేచి వాష్‌బేసిన్‌ దగ్గరకి పరిగెత్తింది.
ఆమె పరిగెత్తేది చూసి వాళ్లు కూడా అటువైపు వెళ్లారు. ఒకటే కంగారు… ఒకటే టెన్షన్‌ హేమంత్‌కి.
తెల్లవారే ఆరాధ్యను వాళ్ల ఊరు పంపాడు హేమంత్‌.
ఆమె ఉద్దేశమే అది కాబట్టి ఆనందంగా వెళ్లింది ఆరాధ్య.

*****

ఆరాధ్యను చూడగానే ఏదో విజయం సాధించినట్లు ఎప్పుడూ కలగనంత సంతోషం కలిగింది రమాదేవికి… కానీ అంతలోనే ఓ అంతరాయం కలిగింది. అదేంటంటే…! ”మీ అమ్మాయిని హైదరాబాదు నుండి త్వరగా రప్పించండి రమగారు!” అని చెప్పిన పక్కింటి నర్స్‌ మాత్రం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయింది. ఆవిడ ఎందుకలా వెళ్లిపోయిందో! ఏం జరిగిందో రమాదేవికి తెలియదు.
”ఇదేం మాయండీ! ఆ నర్స్‌ రోజూ నాతో మాట్లాడేది. ఒక్క మాటయినా నాతో చెప్పకుండా వెళ్లిపోయిందేం? మరీ దారుణంగా వుందే!” అంది రమాదేవి భర్తతో.
”నీకు తెలియదా! ఆవిడ ఎందుకెళ్లిందో?”
”తెలియదండీ! తెలిస్తే ఆరాధ్యను ఎందుకు రప్పిస్తాను?”
”ఆరాధ్యను నువ్వు రప్పించావా? ఆరోగ్యం బాగుండలేదని కదా వచ్చింది? నువ్వు రప్పించడం ఏంటి?” ఆశ్చర్యపోయాడు.
”నేనే రప్పించాను. ఆశ్చర్యపోవడం తగ్గించండి!”
”నువ్వు దాన్ని సుఖంగా కాపురం చేసుకోనీయవా? దాన్నెందుకే అనవసరంగా ఇప్పుడు రప్పించటం?” అన్నాడు గొంతు పెంచి.
”మా ఆడవాళ్ల బాధలు మీకు తెలియవు. నేనేది చేసినా దాని మంచికే చేస్తాను. మీరు జోక్యం చేసుకొని నాకు కోపం తెప్పించకండి!” అంది గట్టిగా.
”నీకు తెలియదే! నామాట వినవే! ఇలాంటి పనులతో తలనొప్పు లొస్తాయి. ఆ నర్స్‌ వెళ్లిపోవటానికి కారణం కూడా ఇదే!” అన్నాడు.
”ఇదా! ఇదంటే! నేను దానికి అబార్షన్‌ చేయిస్తానని తెలిసి ఆ నర్స్‌ను హేమంతే వెళ్లగొట్టించి వుంటాడంటారా?”
”హేమంత్‌ కాదు. మన పక్కింటి నర్స్‌ పనిచేస్తున్న హాస్పిటల్లో డబ్బులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా అబార్షన్స్‌ చేస్తున్నారట. అది ఏ న్యూస్‌ఛానల్‌ ద్వారా బయటకొచ్చిందో తెలియదు కాని ఆ హాస్పిటల్‌ని సీజ్‌ చేశారట. ఆ డాక్టర్‌కి సస్పెన్షన్‌ నోటీస్‌ ఇచ్చారట. అందుకే ఆ నర్స్‌ వెళ్లిపోయంది” అన్నాడు.
ఆలోచనలో పడిపోయింది రమాదేవి.
అబార్షన్‌ చేయించటం నేరమైతే కావచ్చు కాని ఆరాధ్యకు ఇప్పుడెలా అబార్షన్‌ చేయించాలి? చేయిస్తేనే కదా అది హాయిగా ఉద్యోగం చేసుకునేది. అల్లుడు అసలే మాట వినే రకం కాదు. గుట్టుగా పని అయిపోతుందను కుంటే ఈ నర్స్‌ కాస్త ఇప్పుడే వెళ్లిపోవాలా?
భార్య మాట్లాడక పోవడంతో ”ఇదెప్పుడు నామాట వింటుందో ఏమో!” అనుకుంటూ శాంతారాం షాపు దగ్గరకి వెళ్లాడు.
”ఏంటి రమా! అలా వున్నావ్‌?” అంటూ వచ్చింది సీతాలమ్మ.
”నర్స్‌ ఎందుకెళ్లిపోయిందో నీకు తెలుసా వదినా?” అడిగింది రమాదేవి.
”తెలుసులే! దాని గొడవ ఇప్పుడెందుకు?”
”మరి ఆరాధ్యకు అబార్షన్‌ ఎక్కడ చేయించాలి?”
”అదే నాకూ అర్థం కావటంలేదు రమా!” అంటూ ఆమెకూడా ఆలోచనలో పడింది.
”ఆరాధ్యను మా ఊరు తీసికెళ్లి చేయిద్దాం వదినా!” అంది రమాదేవి.
”మీ ఊరేమైనా సిటీయా రమా! కనీసం మండలం కూడా కాదు. మారుమూల పల్లెటూరు. అక్కడివాళ్లే ఏం జరిగినా సిటీకి వస్తుంటారు”
”కానీ ఇలాంటి పనులకు మా ఊరిలో చాలా తెలివైన మంత్రసానులు వున్నారు. పెద్దపెద్ద కాన్పులు కూడా చేస్తుంటారు. లోగడైతే బొడ్డుతాడును కొడవలితోనే కోసేవాళ్లట. ఇప్పుడు బ్లేడును వాడుతున్నారు. వాళ్ల చేతులతో పురుడు పోసిన పిల్లలు కూడా చాలా బాగుండడం చూశాను. కాన్పులే అంత అవలీలగా చేస్తుంటే అబార్షన్‌దేముంది. వాళ్లకది పెద్ద లెక్కలోది కాదు” అంది.
”నువ్వలా అనుకుంటున్నావ్‌! కానీ అక్కడ నువ్వనుకున్నట్లు వుండదు. ఒక్కోసారి వాళ్లు చేసే వైద్యానికి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఆరాధ్యకేమైనా జరగరానిది జరిగితే అక్కడెవరు బాధ్యులు? కష్టపడి బి.టెక్‌ చదివించావ్‌! సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయించుకుంటున్నావ్‌! అలాంటి అమ్మాయిని తీసికెళ్లి మంత్రసానుల చేతిలో పెడతావా?”
”మరెలా వదినా?” అంటూ ధీనంగా చూసింది రమాదేవి.
”ఎలా అంటే ఎలా? ఏదో ఒక మార్గం చూసుకోవాలి” అంది సీతాలమ్మ.
”నాకే మార్గం తెలియదు వదినా! అదేదో నువ్వే చూడు” అంది.
”నన్ను చూడమంటే నాకు మాత్రం ఏం తెలుసు రమా? నా పిల్లలకి నేనేమైనా ఇలాంటివి చేయించానా? వాళ్లేమైనా ఉద్యోగాలు చేస్తున్నారా? కాకుంటే నువ్వు బాధపడుతుంటే చూడలేక మాట్లాడుతున్నాను. నువ్వేం బాధపడకు”
”బాధపడక చేసేది ఏముంది వదినా?”
”ఏముందీ అంటే ఎవరుమాత్రం ఏం చెప్పగలరు? బయటకెళ్లి అడిగి తెలుసుకోవాలి. మనకు తెలియ కుండా ఎన్ని స్కానింగ్‌ సెంటర్లు లేవు. ఎన్ని హాస్పిటల్స్‌ లేవు. ఎక్కడోచోటుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా పని ముగించుకు రావాలి. అంతేకాని బాధపడితే ఇలాంటి పనులు జరుగుతాయా?” అంటూ ధైర్యం చెప్పింది సీతాలమ్మ.
వెంటనే ఆమె రెండు చేతులు పట్టుకొని ”ఎవరకీ తెలియకుండా ఈ పని చేయించగలమా వదినా?” అంది రమాదేవి.
”ఎవరికీ తెలియకుండానే చేపిద్దాం! అందుకేగా ఆరాధ్యకి గర్భం వచ్చిందన్న సంగతి మనవాళ్లలో ఎవరికీ తెలియకుండా దాచాం. హేమంత్‌కి మాత్రం ”ఆరాధ్య బాత్‌రూంలో జారిపడిపోయింది. ఆ దెబ్బతో అదికూడా పడిపోయింది” అని ఆరాధ్య చేత చెప్పించు. లేకుంటే అతను గొడవ చేస్తాడు. మొన్నటి వరకు బంగారం గొడవతోనే సరిపోయంది. మళ్లీ ఇదో కొత్త గొడవెందుకు?” అంది.
చూడటానికి బక్కగా వున్నా సీతాలమ్మ ఆలోచన చాలా గొప్పగా అన్పించింది రమాదేవికి…
శాంతారాం వద్దంటున్నా వినకుండా, సీతాలమ్మ సహాయంతో ఆరాధ్యను హాస్పిటల్‌కి తీసికెళ్లి, అబార్షన్‌ చేయించింది రమాదేవి.
ఇన్నిరోజులు అదో పీడలా భావించిన ఆరాధ్యకు ఇప్పుడు చాలా తేలిగ్గా, రెక్కలు విప్పుకొని ఎగురుతున్నంత హాయిగా వుంది.

*****

వారం రోజుల తర్వాత ఆరాధ్య హైదరాబాదు వెళ్లాలని బయలుదేరింది. ట్రైన్లో ప్రయాణం చేస్తోంది.
ఆమె వెళ్లి కూర్చోగానే ఒక తల్లీ, కూతురు వచ్చి ఆమెకు ఎదురు సీట్లో కూర్చున్నారు. కూతురుకి ఆరాధ్య వయసు వుంటుంది. చదువుకున్న అమ్మాయిలాగే వుంది.
వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదుకాని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరైనా చూస్తారేమోనని వెంటనే తుడుచుకుంటున్నారు. వాళ్ల బాధ మామూలుగా లేదు. కడుపులోంచి తన్నుకొస్తోంది. వీళ్లెందుకిలా వున్నారు? వీళ్లకేం జరిగింది? వాళ్లనే చూస్తోంది ఆరాధ్య.
చూస్తూ అందరిలా వూరుకోలేకపోయింది. అడిగి తెలుసుకోవాలనుకుంది. ఏమాత్రం సంకోచించకుండా ఆ అమ్మాయి చేయిపై చేయిపెట్టి కదిలించింది. ”ఏం జరిగింది?” అని ఫ్రెండ్లీగా అడిగింది.
అడిగింది అమ్మాయినే అయినా తల్లి సమాధానం చెప్పింది.
”నా బిడ్డకు వాళ్ల అత్తా, ఆడపడుచు, మొగుడు కలిసి వద్దంటున్నా వినకుండా అబార్షన్‌ చేయించారమ్మా! వాళ్లసలు ఆడవాళ్లేనా? వాడసలు మొగుడేనా? అల్లుడని అతన్ని ఎంత గౌరవంగా చూసుకున్నాం! అల్లుడి మర్యాదలు ఎంత ఘనంగా చేశాం! అనుకున్న ప్రకారం పైసా తేడా రాకుండా మొత్తం పెళ్లిపందిట్లోనే ఇచ్చేశాం! ఇంతచేసినా నా కూతురికి ‘అమ్మా’ అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేశాడు. దీనికింక పిల్లలు పుడతారా? పుట్టినా వాళ్లు వుంచుతారా? వాళ్లకి మగపిల్లలే కావాలట. ఆడపిల్లలువద్దట. అది ఆడది కాదా? దాని కూతురు ఆడది కాదా? అదే దాని కూతురుకైతే ఇలా అబార్షన్‌ చేయించేదా? చేయిస్తే ఊరుకునేదా? ఇప్పుడు దీని ఆరోగ్యం ఏమైపోవాలి? అడిగేవాళ్లు లేరనేగా! అబార్షన్‌ పేరుతో నా కూతురెంత నరకయాతన అనుభవంచిందో నాకు తెలుసు” అందామె.
ఆమె గొంతులో ఆవేశం కన్నా ఆవేదనే ఎక్కువగా కన్పిస్తోంది.
ఆమె చెప్పేదంతా నిజమే! అబార్షన్‌ చేయించుకోవటం ఓ పేషన్‌లా ఎందుకనుకుంటున్నారో! ‘మేము చాలాసార్లు చేయించుకున్నాం. మీరు కూడా చేయించుకోండి!’ అంటూ చేయించుకోనివాళ్లను కూడా చేయించు కోమని ఎందుకు సలహా ఇస్తున్నారో తెలియదు కాని అది చేయించుకున్నాక మళ్లీ ఇలాంటి పని జీవితంలో చేయకూడదనిపించింది. తప్పు చేశాక సరిదిద్దుకోలేని తప్పుల్లో ఇదో పెద్ద తప్పు!
”పోలీసులతో చెబితే దాని కాపురం పోతుందని, పదిరోజులు వుంచుకొని పంపిస్తానని ఇంటికి తీసికెళ్తున్నాను. కన్నబిడ్డ బాధ కన్నతల్లికి తెలుస్తుంది. అత్తకేం తెలుస్తుంది? కడుపులో వుండేది ఆడపిల్లని తెలియగానే గొంతు నులిమేసింది. శత్రువునైనా హత్య చెయ్యాలంటే ఆలోచిస్తారు. అది సొంత మనవరాలినే కడుపులో చంపేసింది. ఒక్కోసారి అబార్షన్‌ చేస్తున్న టైంలో తల్లి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం వుందట. అయినా ఆ దుర్మార్గురాలికి లెక్కలేదు. ఆడపిల్ల పుట్టకుంటే చాలు. అది అసలు అత్తకాదు. అత్తరూపంలో వుండే రాక్షసి” అందామె. స్టేషన్‌ రాగానే ఇద్దరు దిగిపోయారు.
వాళ్లను చూస్తుంటే వాళ్ల మాటలు వింటుంటే అక్కడున్నవాళ్లకు బాధనిపించి ఆ అమ్మాయి అత్తను, ఆడపడుచును తిడుతున్నారు.
వెంటనే ఆరాధ్యకు తనకు జరిగిన అబార్షన్‌ గుర్తొచ్చింది.
ఆరోజు హాస్పిటల్లో ఆపరేషన్‌ థియేటర్లోకి తనని తీసికెళ్తున్నప్పుడు హేమంత్‌, లక్ష్మీశార్వాణి గుర్తొచ్చారు. తను తల్లి కాబోతున్నానని తెలిసి వాళ్లిద్దరు చూపించిన ప్రేమ గుర్తొచ్చింది. ఆ ప్రేమ కోసమైనా తల్లి తనకు చేయిస్తున్న అబార్షన్‌ను వద్దనుకొని వెనక్కి వెళ్లిపోవాలనుకుంది.
కానీ అప్పటికే డాక్టరు గారు వచ్చేశారు. తల్లికూడా తన చెంపల్ని నిమురుతూ ‘ఏం కాదమ్మా నీకు. ధైర్యంగా వుండు’ అంటూ లోపలికి పంపింది. ఎవరికైనా తల్లేకదా తొలి గురువు… కానీ ఈ తల్లిని చూస్తుంటే తన తల్లిలో అన్నిరోజులు కన్పించిన తొలి గురువు మసకబారి కన్పిస్తోంది.
హైదరాబాదు రాగానే ట్రైన్‌ దిగి ఇంటికెళ్లింది ఆరాధ్య.
ఆరాధ్య వెళ్లినప్పటికన్నా ఇప్పుడు చాలా తేడాగా వుంది. ఆరోగ్యంగా వుంది. అది చూసి హేమంత్‌ సంతోషించాడు. ప్రేమగా మాట్లాడాడు. ఎప్పుడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా తిరిగాడు. చాలా రోజుల తర్వాత అతని
”అయితే వద్దులే!” అన్నాడు. ఆమె అలా అంటుంటే అతనికి కూడా బాధగానే వుంది.
ఆరాధ్యకు వెంటనే ”బిడ్డ కడుపులో వున్నంత వరకు ఏమీకాదు. కాని బయటకొచ్చాక అసలు కష్టాలు మొదలవుతాయి. ఎలా చేస్తావో ఏమోనే ఆరాధ్యా!” అంటూ తల్లి రోజూ ఫోన్లో చెప్పే మాటలు గుర్తొచ్చి హేమంత్‌ వైపు కోపంగా చూసింది.
”ఒక్కరోజా! రెండు రోజులా హేమంత్‌! రోజూ ఇలా నేను తిన్నది వాంతి చేసుకుంటుంటే చూస్తూకూడా నీకేం అన్పించటం లేదా? కళ్లముందున్న నాకన్నా కడుపులో ఇంకా ఫాంకూడా కాని ఆ బిడ్డ ఎక్కువైందా? నీకు నేను అవసరం లేదా?” అంది. ఆమె ఎప్పుడో తప్ప ఎక్కువగా హేమంత్‌ని నువ్వు అనే పిలుస్తుంది.
హేమంత్‌ మాట్లాడలేదు.
”చెప్పు హేమంత్‌! ఆ బిడ్డ నీకంత ముఖ్యమా?”
ఆరాధ్య అలా మాట్లాడుతుందని అతను వూహించలేదు.
ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదించింది ఆరాధ్య. అబార్షన్‌ చేయించుకున్న విషయాన్ని దాచేసింది. అది దాచినా దాగదన్న సత్యం అప్పుడామెకు తెలియలేదు.

*****

రెండురోజుల తర్వాత హేమంత్‌ ఫ్రెండ్స్‌ కొందరు జంటలు, జంటలుగా ఇంటికి వచ్చి ఆరాధ్యకు కంగ్రాట్స్‌ చెప్పారు. వాళ్లెందుకొచ్చారో ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. వాళ్లంతా ఒకేసారి ఆమె చుట్టూ చేరి ”ఆరాధ్యా! నువ్వు చాలా లక్కీ! త్వరలోనే తల్లివి కాబోతున్నావ్‌! ఇవాళ రేపు మన సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లో కొందరికి పిల్లలు పుట్టటం అనేది ఓ యజ్ఞంలా అయిపోయింది. అలాంటప్పుడు నువ్విలా అని తెలియగానే హ్యాపీ అయ్యాం. మా హ్యాపీనెస్‌ని ఇలా ఇంటికొచ్చి నీతో పంచుకోవాలని చాలా రోజులుగా ప్లాన్‌ చేస్తున్నాం. నువ్వు సిటీలో లేవని హేం చెప్పారు. నువ్వు రాగానే వచ్చాం! ఆరోగ్యం జాగ్రత్త. ఆఫీసులో కాని, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో కాని లిఫ్ట్‌నే ఎక్కువగా యూజ్‌ చెయ్యి. మంచి ఆహారం తీసుకో!” అన్నారు. వాళ్లలో ఎక్కువ మంది ‘హౌస్‌ వైఫ్‌’లే వున్నారు. హౌస్‌వైఫ్‌ల కన్నా జాబ్‌ హోల్డర్సే ఎక్కువ జాగ్రత్తలు చెప్పారు.
వాళ్లు వెళ్లాక ‘ఓ మైగాడ్‌’ అంటూ తల పట్టుకొని కూర్చుంది ఆరాధ్య.
అది చూసి హేమంత్‌ మళ్లీ కంగారుపడ్డాడు. ”మీ ఊరు నుండి వచ్చాక బాగానే వున్నావుగా! మళ్లీ మొదలైందా కళ్లు తిరగడం?” అన్నాడు.
ఆరాధ్య అబార్షన్‌ విషయం భర్త దగ్గర దాచి తప్పు చేశాననుకుంది. ఆరోజే తల్లిచేత చెప్పించి వుంటే బావుండేది. ఇప్పుడు చెబితే ఏమనుకుంటాడో ఏమోనని ముందు కంగారుపడింది. తర్వాత నెమ్మదిగా నోరు విప్పి ”మీకు మా మమ్మీ కాల్‌ చేసి చెప్పలేదా ఏం జరిగిందో?” అని అన్నది.
”చెప్పలేదే! ఏం జరిగింది?” అన్నాడు హేమంత్‌.
”నేను కాలుజారి బాత్‌రూంలో పడిపోయినప్పుడు డేట్‌ వచ్చింది. చెబుదామనుకుంటూనే నేను మరచి పోయాను. మమ్మీ చెప్పిందనుకున్నాను” అంది.
”డేట్‌ వచ్చిందా? అంటే ప్రెగ్నెన్సీ??” షాకింగ్‌గా చూశాడు.
”పోయింది” అంది సింపుల్‌గా.
అతను తేరుకొని ”పోయిందా?” అన్నాడు.
ఆమె అవునన్నట్లు తలవూపింది.
”నేను ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లే జరిగింది. మీ పేరెంట్స్‌ అన్నంతపని చేశారు. నేను వాళ్లను నమ్మి నిన్ను పంపటం వల్లనేగా ఇలా జరిగింది?” అన్నాడు.
”ఎక్స్‌పెక్ట్‌ చేసినప్పుడు పంపకుండా వుండాల్సింది. పంపటం వల్లనేగా నేను బాత్‌రూంలో కాలుజారి పడ్డాను. ఇక్కడే వుంటే పడేదాన్నా…?” అంది.
”నువ్వు పడడం అబద్దం!” అతను గిర్రున వెనక్కి తిరిగి పక్కకెళ్లిపోయాడు.
అతని ప్రవర్తనకు ఆమె నివ్వెరపోలేదు. మామూలుగానే అతని దగ్గరకి వెళ్లి నడుం మీద చేతులు పెట్టుకొని కళ్లు పెద్దవి చేసి చూస్తూ
”అబద్దం అనగానే సరిపోయిందా? పడినప్పుడు దెబ్బలేమైనా తగిలాయా అని అడగొద్దా? ఏం ప్రేమండీ మీది?” అంది.
అతని ముఖం పూర్తిగా కళ తప్పింది. ఒంట్లో వున్న శక్తి అంతా హరించుకుపోయినట్లయింది. మొన్న అతని తల్లి ఫోన్లో మాట్లాడుతూ ”జీవితం అంటే ముళ్లకు అంటుకుని వుండే మకరందాన్ని నాలుకతో చప్పరించటానికి ప్రయత్నించటమేరా!” అంది. ”అలా అని ముళ్లను చూసి భయపడి చప్పరించటం మానేస్తే జీవితం రుచి తెలియదురా” అని కూడా అంది. ముళ్లంటే ఏమో అనుకున్నాడు కాని ఆ ముళ్లు మరీ ఇంత రాక్షసంగా వుంటాయనుకోలేదు.
”ఇక మాట్లాడరు! ఏదో ఆలోచించుకుంటూ మీ లోకంలో మీరుండిపోతారు. నాకు తెలుసు హేమంత్‌! అసలు నీకు నేనంటేనే లక్ష్యం లేదు. బాధ్యత లేదు. ఇలా చూస్తే బాధపడుతుందేమోనన్న ధ్యాసలేదు” అంది.
నవ్వబోయాడు. నవ్వు రాలేదు. నవ్వటం ఇంత కష్టమని ఇప్పుడే తెలిసింది. అతను నెమ్మదిగా నోరు విప్పి ”దెబ్బ తగిలినప్పుడు ఫోన్‌ చేసి చెప్పివుంటే వెంటనే ట్రైనెక్కి నేనే వచ్చేవాడిని… దెబ్బలు ఎక్కడ తగిలాయో చూసేవాడిని, ఓదార్చేవాడిని. ఇప్పుడెందుకు? అంతా అయిపోయింది కదా! బి హ్యాపీ!” అన్నాడు.
”నాకంత హ్యాపీగా ఏం లేదు” అంటూ తలవంచుకుంది. ముఖం అదోలా పెట్టుకుంది.
అతనామె వైపు చూడకుండా అటువైపు తిరిగి ”హ్యాపీ ఎందుకుండదు? వాంతులు పోయాయి. ఆఫీసుకి వెళ్లొచ్చు. మంచి మంచి డ్రస్‌లు వేసుకోవచ్చు. అందం తగ్గదు” అన్నాడు.
సడెన్‌గా తల ఎత్తి అతనివేపు చూసింది. ఆమె అభిప్రాయం అదే అయినా ఆ మాటల్ని అతని నోటి వెంట వినలేకపోయింది. ప్రాణం చచ్చిపోతున్నట్లనిపించింది.
ఆమెను అలాగే వదిలేసి అతను చకచక రెడీ అయి ఆఫీసుకెళ్లిపోయాడు. ఆఫీసు కెళ్తున్నప్పుడు రోజూ వేసినట్లు ఆమె నడుం మీద చెయ్యి వెయ్యలేదు. ‘బై’ చెప్పలేదు. ఇద్దరి మధ్యన వచ్చిన గ్యాప్‌ను స్పష్టంగా చూపించి వెళ్లాడు.
అతను వెళ్లిన ఓ గంట తర్వాత ఆమె కూడా ఆఫీసు కెళ్లిపోయింది.

*****

ఆఫీసుకు వెళ్లాక ఆరాధ్యకు హేమంత్‌ గుర్తొస్తున్నాడు. అతను రోజూ ‘బై’ చెబితే కలిగే ఆనందం ఎంత స్పష్టంగా కన్పించేదో, ‘బై’ చెప్పనప్పుడు ఏర్పడిన బాధ కూడా అంతే స్పష్టంగా కన్పించింది. ఇద్దరు మనుషులు కలిసి వున్నంత మాత్రాన ఆనందం రాదు. ఒకరిని ఒకరు నిజాయితీగా ప్రేమించు కోవాలి. గౌరవించుకోవాలి. మనం ఇలా వుండాలి. మన లైఫ్‌ ను ఇలా తీర్చిదిద్దుకోవాలి అని ఇద్దరూ ఒకే మాటమీద వుండాలి. ఆ మాటల్ని ఆచరణలో పెట్టుకోవాలి. అభిప్రాయాలను, ఆలోచనలను, అభిరుచుల్ని, బాధ్యతల్ని పంచుకోవాలి. ఏదీ పంచుకోకుండా ఏదీ పెంచుకోకుండా ఆనందం రమ్మంటే రాదు. మనశ్శాంతి అంతకన్నా రాదు.
వైబ్రేషన్‌లో వున్న ఆరాధ్య మొబైల్‌ స్క్రీన్‌ మీద శార్వాణి మొబైల్‌ నెంబర్‌ పడటం చూసి ఒక్కక్షణం లిఫ్ట్‌ చెయ్యాలా వద్దా అని ఆగింది. వెంటనే లిఫ్ట్‌ చేసి ‘హలో! ఆంటీ!’ అంది.
”ఆరాధ్యా! బాగున్నావా? హేమంత్‌ ఇప్పుడే మాట్లాడాడు. నేను విన్నది నిజమేనా?” అడిగింది శార్వాణి ఆత్రుతగా.
”నిజమే!” అంది ఆరాధ్య.
”ఇలా జరగాల్సింది కాదు ఆరాధ్యా! వినగానే బాధపడ్డాను. హేమంత్‌ కూడా బాధపడ్డాడు” అంది. ఆమె గొంతు నిండా బాధ, వ్యధ.
ఆరాధ్య ఒక్కక్షణం రెండు కళ్లూ గట్టిగా మూసుకొని ”ఆంటీ మీకూ, మీ అబ్బాయికీ బాధపడటం తప్ప ఇంకేం రాదా? ఎందుకండీ మీరు బాధపడి అవతలవాళ్లను బాధ పెడతారు? సెంటిమెంట్స్‌ వుండొచ్చు. మరీ ఇంతనా?” అంది.
ఆ మాటలు వినగానే షాక్‌ తిన్నది శార్వాణి. అవాక్కయింది.
శార్వాణి షాక్‌లోకి వెళ్లినట్లు ఆరాధ్యకు అర్థమై ”ఆంటీ! నేను మళ్లీ మాట్లాడతాను. మా టీమ్‌ లీడర్‌ పిలుస్తున్నారు. బై…” అంటూ కావాలనే కాల్‌ కట్‌చేసింది. చెంపమీద కొట్టినట్లైంది శార్వాణికి.
కాల్‌ కట్‌ చేశాక ఆలోచనలో పడింది ఆరాధ్య.
ఎప్పుడైనా ఆరాధ్యకు శార్వాణి కాల్‌ చేసి చాలా అభిమానంగా మాట్లాడుతుంది. అత్తగారు అయినందు వల్లనో ఏమో అలా వుండాలి, ఇలా వుండాలి అంటూ తనకు తెలియనివి తెలిసేలా చెబుతుంది. చెప్పేటప్పుడు కూడా ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఓపికగా ఒక తల్లి బిడ్డకు చెప్పినట్లు చెబుతుంది. అలాంటి ఆమెతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసింది. హర్ట్‌ అయ్యేలా మాట్లాడవలసింది కాదు. ఏమిటో రోజురోజుకి తన మైండ్‌ నిండా పొల్యూషన్‌ పెరిగిపోతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోతోంది.
అదే విషయం లంచ్‌ బ్రేక్‌లో సరయుతో చెప్పి ఫీలయ్యింది ఆరాధ్య.
”నువ్వేం ఫీలవ్వకు. నువ్వు చాలా కరెక్ట్‌గానే మాట్లాడావ్‌! లేకుంటే వాళ్లు బాధపడి నిన్ను బాధ పెడతారు. నీకంత బాధ అవసరం లేదు. ఇప్పుడేదో హాయిగా వున్నావ్‌! అలాగే వుండు. అత్తగార్లకి చనువిచ్చినా, గౌరవం ఇచ్చినా దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మనల్ని చేతకాని వాళ్లను చూసినట్లు చూస్తారు. ప్రతిదీ మనకు నేర్పాలని చూస్తారు. మనమేమైనా చిన్నపిల్లలమా నేర్చుకోటానికి? అయినా వాళ్ల మాటల్ని వినేంత టైం మనకుందా?” అంది సరయు.
”లేదు. కానీ ఆవిడ చాలా మంచావిడ సరయు” అంది ఆరాధ్య. ఆమెకు తొలిసారి ట్రైన్లో కలిసి ఇంటికి తీసికెళ్లిన శార్వాణియే గుర్తొస్తుంటుంది.
”అలాగే అన్పిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు ఒకచోట లేరుగా! వుంటే తెలిసేది ఆవిడ ఎంత మంచావిడో! అయినా నాకు తెలిసి మీ అత్తగారికి, మీ హజ్బెండ్‌కి సెంటిమెంట్స్‌ ఎక్కువ ఆరాధ్యా! అవి వున్నచోట మనశ్శాంతి వుండదు. వాళ్లతో నువ్వెలా చేస్తావో ఏమో? ఏది చేసినా ఏది చెయ్యకపోయినా నీ లైఫ్‌ను మాత్రం వాళ్ల చేతుల్లో పెట్టకు…”
”అలాగే సరయు” అంది ఆరాధ్య.
”నీకు అబార్షన్‌ జరిగి ఫ్రీ అయ్యావు కదా! నాకు పార్టీ ఇవ్వాలి. ఇంటికెళ్లేముందు ఏదైనా మంచి ఫుడ్‌కోర్టుకెళ్దాం. సరేనా!” అంది సరయు.
”ఓ.కె. వెల్దాం” అంది ఆరాధ్య. ఆమెలో ఇప్పుడు అత్తగారిని హర్ట్‌ చేశానన్న ఫీలింగ్‌ పోయింది.

*****

రాత్రి ఎనిమిది గంటలకు క్లయింట్‌తో మీటింగ్‌ వుండడంతో కాన్ఫ్‌రెన్స్‌ రూంలోకెళ్లాడు హేమంత్‌. అతనితో పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ లీడర్‌, ఇంకా హేమంత్‌తో సేమ్‌ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ వున్న మరో ఇద్దరు ఆ మీటింగ్‌కి అటెండయ్యారు. అది చాలా ఇంపార్టెంట్‌ మీటింగ్‌. అలాంటి మీటింగ్స్‌ నెలకోసారి జరుగుతుంటాయి.
ఆ కాన్ఫరెన్స్‌ రూం పెద్ద విశాలంగా ఏం లేదు. సింగిల్‌ బెడ్‌రూం అంత వుంది. అందులో పొడవాటి ఖరీదైన బల్ల. దాని చుట్టూ ఛైర్స్‌ వున్నాయి. బల్ల మధ్యలో స్పీకర్‌ ఫోన్‌ వుంది. హేమంత్‌, ఆ నలుగురు కలిసి ఆ బల్ల చుట్టూ వున్న కుర్చీల్లో కూర్చున్నారు. మొబైల్స్‌ సైలెంట్‌మోడ్‌లో పెట్టుకున్నారు. జనరల్‌గా వాళ్లు ఆడియో కాలింగ్‌నే ఎక్కువగా యూజ్‌ చేస్తారు. కానీ ఆ రోజు వాళ్లు డిస్కషన్‌ చేసుకున్న వర్క్‌ను బట్టి క్లయింట్‌కి ఇంపార్టెంట్‌ వర్క్‌ను ప్రజెంట్‌ చేసే పని వుండటంతో వీడియో ఫోన్‌కాల్‌ని పెట్టుకున్నారు. ‘ఇవాళ వీడియో కాల్‌కి జాయిన్‌ కాండి!’ అని వాళ్లు అమెరికాలో వుండే క్లయింట్‌కి మెసేజ్‌ పెట్టుకోగానే ఆయన రెస్పాండ్‌ అయి వీడియో ఫోన్‌కాల్‌లో జాయిన్‌ అయ్యాడు.
ఆ ఐదుగురికి మానిటర్‌ లోంచి అమెరికాలో వుండే క్లయింట్‌ కన్పిస్తున్నాడు. వాళ్లుకూడా ఆయనకు కన్పిస్తున్నారు.
క్లయింట్‌ మాట్లాడుతున్నాడు. ఆయన లాంగ్వేజ్‌ చాలా ఫాస్ట్‌గా వుంది. వాళ్లంతా శ్రద్ధగా ఆయన వైపు చూస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఏమాత్రం డిస్ట్రబెన్స్‌ మూడ్‌లో లేకుండా ప్లజెంట్‌గా వుండి ఆయనేం అడుగుతున్నాడో దానికి సమాధానం చెబుతున్నారు.
అక్కడున్న ఆ ఐదుగురిలో ఒక్క హేమంత్‌ మైండ్‌ ప్రజెంట్‌ కరెక్ట్‌గా లేదు. సమాధానాలు సరిగా చెప్పలేకపోతున్నాడు. ఆయన చెప్పేది అర్థం కాక మళ్లీమళ్లీ అడుగుతున్నాడు.
…ఎంతో ఉద్విగ్నంగా సాగిన ఆ మీటింగ్‌ ఒక గంట లోపలే పూర్తయింది. వీడియో కాల్‌ ఆగిపోయింది.
వీడియో కాల్‌ ఆగిపోయాక ”హేమంత్‌! ఒన్‌ మినిట్‌!” అంటూ తన ఛాంబర్‌వైపు నడిచాడు మేనేజర్‌.
మేనేజర్‌ తనను ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా హేమంత్‌ అడుగులు అప్రయత్నంగానే ఛాంబర్‌ వైపు కదిలాయి.
మేనేజర్‌ మన స్టేట్‌వాడే! అతను హేమంత్‌తో చాలా ఫ్రీగా వుంటాడు. వాళ్ల మధ్యన ఆఫీసు రిలేషనే కాక పర్సనల్‌ రిలేషన్‌ కూడా వుంది. ఆరాధ్య జాబ్‌ విషయంలో కూడా ఒకప్పుడు అతను చాలా హెల్ప్‌ చేశాడు. దాన్నెప్పుడూ మరచిపోడు హేమంత్‌.
హేమంత్‌ వెళ్లి ఆ మేనేజర్‌కి ఎదురుగా కూర్చున్నాడు. అతను కూర్చున్న విధానం చూస్తుంటే బాగా మూడ్‌ అవుట్‌లో వున్న వ్యక్తిలా అన్పిస్తున్నాడు. మేనేజర్‌ దాన్ని గమనించి చాలా కూల్‌గా, స్మూత్‌గా
”మన క్లయింట్‌తో ఎందుకలా మూడ్‌ఆఫ్‌లో సమాధానాలు చెప్పావు మిస్టర్‌ హేమంత్‌!” అని అడుగుతూ హేమంత్‌ ముఖంలోకి పరిశీలనగా చూశాడాయాన.
మేనేజర్‌ చూపుల్ని తప్పించుకోలేక సమాధానం చెప్పలేక ఒక్కక్షణం సతమతమయ్యాడు హేమంత్‌.
”వాట్‌ హేపెండ్‌ మిస్టర్‌ హేమంత్‌?” అడిగాడు మేనేజర్‌.
హేమంత్‌ బరువుగా శ్వాస తీసుకొని టేబుల్‌ మీద వున్న పెన్‌స్టాండ్‌ వైపు చూశాడు.
”టెల్‌మి హేమంత్‌! వాట్‌ హేపెండ్‌?” ఈసారి మరింత చొరవగా అడిగాడు.
”నో సర్‌! అది చెప్పుకునేంత పెద్ద మేటరేం కాదు. పర్సనల్‌ ప్రాబ్లమ్‌! అంతే!” అన్నాడు.
”పర్సనల్‌ ప్రాబ్లమా?” అడిగాడు ఆలోచనగా మేనేజర్‌.
”అవును సర్‌! నేను బాగా డిస్టర్బ్‌ అవుతున్నాను. త్వరగానే ఫ్రీ అవుతాను. నో ప్రాబ్లమ్‌!” అన్నాడు హేమంత్‌.
”చూడు హేమంత్‌! నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేనోమాట చెప్పనా?”
”చెప్పండి సర్‌!”
”ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి. ఎంతో రిలాక్స్‌గా వుండాల్సిన వాడివి. ఇలా వుండటం బాగాలేదు”
”నాక్కూడా అలాగే అన్పిస్తోంది సర్‌! కానీ ఏదో తెలియని గ్యాప్‌ నాకూ ఆరాధ్యకు మధ్యన ఏర్పడింది. దాన్ని కవర్‌ చేసుకోలేకపోతున్నాను”
”చేసుకోవాలి. లైఫ్‌ అంటే ఏదో ఒక్కదానికోసమే ఆరాటపడడం కాదుగా! చాలా వుంటాయి. సక్సెస్‌, ఫెల్యూర్స్‌, కెరీర్‌, ఇవన్నీ నువ్వే మేనేజ్‌ చేసుకోవాలి. పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌ వుండొచ్చు. వుంటాయి. అవి లేనిది ఎవరికి? కాని వాటి ఎఫెక్ట్‌ నీ వర్క్‌ మీద పడకూడదు కదా!”
హేమంత్‌ మేనేజర్‌ ముఖంలోకి సూటిగా, ధైర్యంగా చూడలేక టేబుల్‌ మీద వున్న గ్లోబు వైపు చూస్తున్నాడు.
”హేమంత్‌! నాకు తెలిసి నువ్వు వెరీ టాలెంటెడ్‌! దాన్ని మిస్‌యూజ్‌ చేసుకోకు!” అన్నాడు మేనేజర్‌.
ఈసారి మేనేజర్‌ వేపు చూశాడు హేమంత్‌.
”అవును హేమంత్‌! నువ్వు దేన్ని ప్రజెంట్‌ చెయ్యాలనుకుంటున్నావో నీ కాన్‌సన్‌ట్రేషన్‌ దాని మీదనే వుంచు. పక్కకు వెళ్లకు. నీకు నువ్వు ముఖ్యం. నీ వర్క్‌ ముఖ్యం. ఆ తర్వాతే అన్నీ…” అన్నాడు చాలా నెమ్మదిగా మేనేజర్‌.
హేమంత్‌ అతను ఆఖరులో చెప్పిన మాటల్ని సిన్సియర్‌గా విని-
-”ఓ.కె. సర్‌!” అన్నాడు.
ఆ తర్వాత వాళ్ల మాటలు కంపెనీ ప్రోడక్ట్‌ మీద హేమంత్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ మీద సాగాయి.
అప్పటికే రాత్రి పదకొండు గంటలయింది.
ఇంటికెళ్లాడు హేమంత్‌.
హేమంత్‌ని చూడగానే ”తొమ్మిది గంటల నుండి కాల్‌ చేస్తూనే వున్నాను. లిఫ్ట్‌ చెయ్యాలని తెలియదా? నాకేమైనా జరిగి చచ్చినా ఇంతేనా?” అంది ఆరాధ్య.
”ఛఛ…. అలా ఎందుకనుకుంటావ్‌! నేను క్లయింట్‌ మీటింగ్‌లో వుండి నీ కాల్‌ని చూసుకోలేదు ఆరాధ్య!” అంటూ అతను కూల్‌గానే సమాధానం చెప్పాడు.
ఆరాధ్య చిరాగ్గా చూసి ”రోజూ మీటింగ్‌లే! అవి లేనిదెప్పుడు? ఏం మీటింగ్‌లో ఏమో! పిచ్చిలేస్తోంది” అంది.
”పిచ్చి వెయ్యడమేంటి? నీకు తెలియదా మీటింగ్‌లు వుంటాయని? ఆల్‌రెడీ నువ్వూ చూస్తున్నావుగా! చూస్తూ కూడా అడుగుతావేం! ఏం మాట్లాడుతున్నావ్‌ ఆరాధ్యా!”
”ఉన్నదే మాట్లాడుతున్నాను”
”ఉన్నదా?”
”ఆ…!”
”అదేంటి! అమెరికాలో వుండే క్లయింట్‌తో మనం కాంటాక్ట్స్‌ పెట్టుకున్నప్పుడు వాళ్ల టైమింగ్స్‌ని మనం ఫాలో కావాలి కదా! ఇండియన్‌ టైమింగ్‌ ప్రకారం వాళ్లకు మనకు కొన్ని గంటలు తేడా వుంటుంది. వాళ్లకు పగలు అయినప్పుడు మనకు రాత్రి…. రాత్రి టైంలోనే వాళ్లతో ఏది మాట్లాడుకోవాలన్నా ఫోన్లో మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఆల్‌రెడీ నీకు తెలుసు. నార్మల్‌ లేడీలా బిహేవ్‌ చేస్తావేం? నిన్నిలా చూస్తుంటే నువ్వసలు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసే అమ్మాయివేనా అనిపిస్తోంది”
”సాఫ్ట్‌వేర్‌ అమ్మాయికి మనసుండదా? భర్తతో స్పెండ్‌ చెయ్యాలన్న కోరిక వుండదా? నేను ఏది షేర్‌ చేసుకోవాలన్నా ఇదిగో ఈ ఇంట్లో వుండే ఫర్నీచరే నాకు కన్పిస్తోంది. మీరు కన్పించరు. ఇప్పుడు రాత్రి పదకొండు దాటింది. పడుకోగానే నిద్రొస్తుంది. తెల్లవారి ఆఫీసుకెళ్తాం. మనం మాట్లాడుకునేదెప్పుడు? ఒకరినొకరు చూసుకునేదెప్పుడు? ఇవాళ నేను ఐదు గంటలకే ఆఫీసు నుండి ఇంటికొచ్చాను. అప్పటి నుండి నేనెంత లోన్లీగా వున్నానో తెలుసా?”
”దీనికి నా దగ్గర సమాధానం లేదు. నేనైతే ఈ జాబ్‌ని వదులుకోలేను. ఆఫీసులో నా టైమింగ్స్‌నీ మార్చుకోలేను. నా డిన్నర్‌ అయింది. నువ్వు తింటే పడుకో! లేకుంటే తిని పడుకో” అంటూ అతను వెళ్లి డ్రస్‌ మార్చుకొని పడుకున్నాడు.
”రోజూ ఇలాగే బయట తినేసి వస్తారా?”
”లేదు. ఇవాళ మా మేనేజర్‌ రెస్టారెంట్‌కి తీసికెళ్లారు”
”ఓ.కె… ఓ.కె.” అంటూ ఆమె వైట్‌ నైటీలోకి మారి లైట్‌గా స్ప్రే చేసుకొని వచ్చి హేమంత్‌ పక్కన పడుకుంది.
అతను నిద్రపోకపోయినా అటువైపు తిరిగి ఆమె వచ్చి పడుకోవడం గమనించనట్లే వున్నాడు.
”హేమంత్‌! ఇటు తిరిగి పడుకో!”
”నేను తిరగను.”
”ఎందుకు?”
”అవసరమేముంది?”
”నన్ను అవాయిడ్‌ చేస్తున్నావా?”
”అంత పెద్ద డైలాగు ఇప్పుడు అవసరమా?”
”అవసరమా అంటే అవసరమే! నావేపు చూడవెందుకు?”
”నీవైపు చూస్తే నిన్ను తాకాలనిపిస్తుంది”
”తప్పేంటి? పెళ్లి అయిందిగా!”
”గుర్తు చేస్తున్నావా పెళ్లి అయిందని? అది మరచిపోయే పెళ్లా? నాచేత సరిగ్గా మిట్టమధ్యాహ్నం చూసి తాళి కట్టించారు మీవాళ్లు… అది చాలా పవర్‌ఫుల్‌ ముహూర్తమట. చూసినవాళ్లు చెప్పారు”
”సరే! అవన్నీ ఇప్పుడెందుకు. ఇటు తిరుగు హేమంత్‌!”
”నేను తిరగను!”
”ప్లీజ్‌! ప్లీజ్‌!”
”నువ్వెంత బ్రతిమాలినా నేను నీవైపు తిరగను”
”ఇప్పుడేనా! రోజూనా?”
”అది తర్వాత డిసైడ్‌ చేసుకుంటా!”
”ఎందుకు?”
”ఎందుకంటే ఏం చెప్పను”
”చెప్పాలి. నాక్కూడా తెలియాలిగా!”
”అన్నీ తెలిసే జరుగుతున్నాయా?”
”ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్లే వుంది హేమంత్‌! నేను ఈరోజు నీతో హ్యాపీగా గడపాలని మార్నింగ్‌ నుండి అనుకున్నాను. ఆఫీసులో కూడా అదే ఆలోచన చేశాను. నన్ను డిజప్పాయింట్‌ చెయ్యకు”
”బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా?”
”ఆలోచించే మాట్లాడుతున్నాను. కోపంలో వున్నప్పుడు ఎలా వున్నా మిగతా టైంలో హేమంత్‌ నాకు కావాలనిపిస్తుంది. అర్థం చేసుకో!’
”నిన్ను అర్థం చేసుకుంటే నెలతిరక్కముందే నీకు వాంతులు అవుతాయి. అదెంత తలనొప్పినో నేను ఫేస్‌ చేశాను”
”డేస్‌ మెయిన్‌టెయిన్‌ చేద్దాం”
”భయపడుతూ చేసే ఈ ప్రయోగాలు నాకు నచ్చవు. ఇది లాబ్‌ కాదు. కాపురం. నువ్వు పడుకో”
ఆరాధ్య ఇంకేం మాట్లాడకుండా పడుకుంది.

*****

ఎప్పుడైనా హాఫ్‌ ఇయర్లీకి ఒకసారి హేమంత్‌ ప్రాజెక్ట్‌ క్లయింట్‌ అవుటింగ్‌ అరేంజ్‌ చేస్తుంటాడు. అది లంచ్‌ కావచ్చు… డిన్నర్‌ కావచ్చు. టీమ్‌ అవుటింగ్‌ కావచ్చు. ఈ టీమ్‌ అవుటింగ్‌ అనేది ఎందుకంటే ఎంప్లాయిస్‌కి మధ్యన ప్రొఫెషనల్‌ రిలేషన్‌ కాకుండా పర్సనల్‌ రిలేషన్‌ కూడా డెవలప్‌ కావాలని… దాని వల్ల కంపెనీ ప్రొడక్టవిటీ పెరుగుతుంది. ఎంప్లాయిస్‌ హ్యాపీగా ఫీలవుతారు. రీఫ్రెష్‌ కూడా అవుతారు.
కొంతమంది క్లయింట్స్‌ ఇవేమీ చూడకుండా లాభాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇలాంటి టీమ్‌ అవుటింగ్‌లు అరేంజ్‌ చేస్తుంటారు.
అందులో భాగంగా ఆ రోజు హేమంత్‌ వాళ్ల కంపెనీ క్యాబ్‌ వెళ్లి ఎంప్లాయిస్‌నందరిని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గర పికప్‌ చేసుకుంది. సిటీ అవుట్‌కట్స్‌లో వుండే రిసార్ట్స్‌కి వెళ్లాలని ముందురోజే ఎంప్లాయిస్‌ అందరికి వాళ్ల క్లయింట్‌ మెసేజ్‌ పాసాన్‌ చెయ్యటంతో అందరూ రెడీగా వున్నారు.
కంపెనీ క్యాబ్‌ ఇంకో అర్ధగంటలో హేమంత్‌ దగ్గరకి వస్తుందనగా ”టీమ్‌ అవుటింగ్‌ వుంది వెళ్తున్నాను” అంటూ ఆరాధ్యతో చెప్పాడు. అతను వేసుకున్న డ్రెస్‌ కాక ఇంకో డ్రస్‌ని అడిషనల్‌గా బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోవటం చూసింది ఆరాధ్య.
”ఈ డే మొత్తం ఇంటికి రారా?”
”రాను. సిటీ అవుట్‌కట్స్‌లో వుండే రిసార్ట్స్‌కి వెళ్తున్నాం. వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో చెప్పలేను”
”మరి నేను అప్పటి వరకు ఒంటరిగా వుండాలా?”
”పదిమంది నీ చుట్టూ వుండటానికి నువ్వేమైనా…” అంటూ అతను ఏదో అనబోతుంటే అతన్ని ఆపి ” ”మీరేమీ అనకండి! ఏమోషనల్‌లో మీరేదో అంటారు. నేను బాధపడాలి. నేను ఆఫీసు నుండి నేరుగా ఆంటీ దగ్గరకి వెళ్తాను” అంది.
”మా అమ్మ నిన్ను రమ్మని చెప్పిందా?”
”చెప్పకపోయినా వెళ్తాను. నేను వెళ్తే వద్దనరు. చాలా హ్యాపీ అవుతారు. మీ నాన్నగారు కూడా నన్ను ఒకప్పుడు చాలా బాగా చూసేవారు. పెళ్లయ్యాకనే కలవలేదు. ఇప్పుడు వెళ్లి కలుస్తాను” అంది.
…వాళ్ల నాన్నగారి మాట ఎత్తగానే హేమంత్‌లో మార్పు వచ్చింది. ముఖమంతా యాసిడ్‌ కన్నా భయంకరమైన ద్రవం పడినట్లు మాడిపోయింది.
అప్పుడే కంపెనీ క్యాబ్‌ వచ్చి ఇంటిముందు ఆగడంతో అతను వెళ్లిపోయాడు. ఆమెను వాళ్ల అమ్మదగ్గరకి వెళ్లమనలేదు. వద్దు అనలేదు. అలా చెప్పేంత టైం కూడా అతనికి లేదు.
హేమంత్‌ ఎక్కగానే ఆఫీసు క్యాబ్‌ సిటీ అవుట్‌కట్స్‌ వైపు బయలుదేరింది.
క్యాబ్‌లో వున్నవాళ్లంతా చాలా ఎంజాయ్‌గా వున్నారు. కొంతమంది వాళ్ల స్నేహితులతో మాట్లాడుకుంటుంటే కొంతమంది క్యాబ్‌లో వున్న ఆడియో లోంచి పాటలు వింటున్నారు. అలా ఓ అర్ధగంట ప్రయాణం చెయ్యగానే రిసార్ట్స్‌ వచ్చింది.
అబ్బాయిలు, అమ్మాయిలు బ్యాక్‌ప్యాక్‌లు తగిలించుకొని క్యాబ్‌ దిగారు. వాళ్లకి ప్రొవైడ్‌ చేసిన రూమ్స్‌వేపు మాట్లాడుకుంటూ వెళ్లారు.
మార్నింగ్‌ ఫ్రష్షప్పయి, టిఫిన్‌ తిని క్రికెట్‌ ఆడారు.
చిన్నచిన్న ఆటలు సరదాగా ఆడారు.
బోటింగ్‌ చేశారు. అంతా సరదా, సరదా…
లంచ్‌ అయ్యాక రెస్ట్‌ తీసుకున్నారు.
మళ్లీ ఆటలు ఆడేవాళ్లు ఆటలు, పాటలు పాడేవాళ్లు పాటలు పాడుతూ ఒక రేంజ్‌లో ఎంజాయ్‌ చేశారు.
హేమంత్‌ మాత్రం ఏమీ చెయ్యలేదు. సైలెంట్‌గా వుండిపోయాడు. అతనికి అతని తండ్రి గుర్తొస్తున్నాడు. తండ్రి గురించి తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. అవి ఒకటే పెయిన్‌ పుట్టిస్తున్నాయి.
ఈపాటికి ఆరాధ్య తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వుంటుందా? వెళ్తే అక్కడి వాతావరణం ఎలా వుండి వుంటుంది. ఆమెను వాళ్లు ప్రేమగా రిసీవ్‌ చేసుకుని వుంటారా? ఇవే ఆలోచనలు హేమంత్‌లో… ప్రశాంతంగా వుండలేకపోతున్నాడు.

*****

శార్వాణి వాళ్ల ఇల్లు ఇంకో పది అడుగులు వుందనగా ‘ఆంటీతో మొన్న ఫోన్లో సరిగా మాట్లాడనందుకు సారీ చెప్పాలి. ఇంకెప్పుడూ అలా మాట్లాడనని చేతిలో చెయ్యేసి ప్రామిస్‌ చెయ్యాలి. హేమంత్‌ తనని దూరంగా వుంచుతున్నాడు. అదికూడా ఆంటీకి చెప్పుకోవాలి. ఆంటీకి చెబితే హేమంత్‌కి నచ్చచెప్పుకుంటుంది. హేమంత్‌ ఎవరిమాట విన్నా వినకపోయినా వాళ్ల అమ్మ మాట తప్పకుండా వింటాడు. అమ్మ మాటవినే అబ్బాయిలు తడిసిన మట్టిలా వుంటారట. ఆ మట్టిని ముద్ద చెయ్యాలన్నా, ఆకృతిగా మార్చుకోవాలన్నా చాలా సులభం. మట్టేకదా!” అని మనసులో అనుకుంటుంటే గేటు వచ్చింది.
ఆ దారి, ఆ గేటు, ఆ పరిసరాలు ఆరాధ్యకు కొత్తకాదు. చిరునవ్వుతో గేటు తీసుకొని లోపలికి వెళ్లింది.
లోపలికి వెళ్లగానే ఆమెకు గతంలో వున్నట్లు లేదు. ఇది నా ఇల్లు. వీళ్లు నావాళ్లు అన్న భావన కలుగుతోంది. ఆ భావన చాలా శక్తినిస్తోంది. ఈ సొసైటీలో తనకు తెలిసిన సరయు కన్నా, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్‌కన్నా తనే చాలా సెక్యూర్డ్‌ అనిపిస్తోంది.
”ఆంటీ!” అని పిలిచింది ఆరాధ్య. ఆ పిలుపు హృదయంలోంచి వచ్చినట్లు స్వచ్ఛంగా వుంది. అలా అని విన్నవాళ్లకి ఈజీగా అర్ధమవుతుంది.
”ఎవరదీ?” ఉపేందర్‌ గొంతు గట్టిగా విన్పించింది.
అది పరిచయమైన వాయిస్‌ కావడంతో వెంటనే ”అంకుల్‌! నేను. ఆరాధ్యను” అంది.
ఆయన ఆరాధ్యకు సరిగ్గా నాలుగు అడుగుల దూరంలో నిలబడి ఒక్కక్షణం ఆమెను నిశితంగా చూసి ”ఆరాధ్య అంటే?” అన్నాడు.
”నేను అంకుల్‌! గుర్తుపట్టలేదా?” నవ్వుతూ ఆయన ముఖంలోకి చూసింది. ఇప్పుడు గుర్తుపట్టారా అన్నట్లు నవ్వింది. అలా నవ్వి ఎంత కాలమైందో ఆరాధ్య. ఇప్పుడు మళ్లీ అదే నవ్వు ఆమె పెదవులపై స్వచ్ఛంగా మొలిచింది. ఆ క్షణంలో తను ఒకప్పుడు ఆ ఇంట్లోంచి వెళ్లగొట్టబడిన వ్యక్తి అన్నది గుర్తు రాలేదు.
”గుర్తు పట్టాను. ఒకప్పుడు నువ్వు మా పేయింగ్‌ గెస్ట్‌వి. శార్వాణి నిన్ను అప్పుడే వెళ్లగొట్టిందిగా! మళ్లీ ఎందుకొచ్చావ్‌?” అన్నాడు ఉపేంద్ర.
”ఇప్పుడు నేను మీ కోడల్ని అంకుల్‌!” ఒక అడుగు ముందుకేసి ఇది మీకు తెలియదా అన్నట్లు చూసింది.
”ఆగు అక్కడే! అడుగు ముందుకెయ్యకు” అన్నాడు ఉపేంద్ర.
”అదేంటి అంకుల్‌! ఆంటీ లేదా ఇంట్లో?” అంది ఆరాధ్య.
”ఎందుకూ? నిన్ను తన కోడలిగా నాకు పరిచయం చెయ్యటానికా?” ఆయన వాయిస్‌లోని వెటకారం ముఖం మీద కొట్టినట్లైంది.
ఈసారి ఖంగుతిన్నది ఆరాధ్య.
”కాదు అంకుల్‌! ఆంటీని ఒకసారి పిలవండి! ప్లీజ్‌!” అంది.
”అవసరం లేదు. అదెందుకు నీ ముందుకు….? నేను మాట్లాడటమే ఎక్కువ…” అన్నాడు ఉపేంద్ర.
”నన్ను మీరు ఎవరనుకొని ఇలా అంటున్నారో! నేను మీ అబ్బాయి హేమంత్‌కి భార్యను. మీ కోడల్ని…” అంది. ఆమె నిలబడే వుంది. ఆయన కూడా నిలబడే వున్నాడు.
”ప్రూఫ్‌ చూపించు”
”ప్రూఫా?”
”అవును. ప్రూఫే!”
”ఆధార్‌ కార్డులాగా ఇలాంటి వాటికి ప్రూఫేంటి అంకుల్‌! నేను మీ కోడలిని అని చెబుతున్నాను కదా!” అంది.
”నీ సంగతి తర్వాత. వాడు నా కొడుకు అని ప్రూఫేంటో పట్టుకురా!” అన్నాడు.
”మీ కొడుక్కి ప్రూఫెందుకు అంకుల్‌! శార్వాణి ఆంటీ హేమంత్‌ వాళ్ల మదర్‌ అయినప్పుడు మీరు ఫాదర్‌ కారా?”
”వాడెప్పుడో చనిపోయినట్లు మా బంధువుల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రతికాడని చెబితే ఎవరూ నమ్మరు. నువ్వు మా కోడలివని వచ్చి మా పరువు తియ్యకు. వెళ్లు” అంటూ గుమ్మం వేపు చేయి చూపాడు. ఈ క్షణమే వెళ్లమన్నట్లుంది ఆయన ఎక్స్‌ప్రెషన్‌.
ఆ ఎక్స్‌ప్రెషన్‌కి ఆమె భయపడలేదు. ధైర్యంగా నిలబడి
”బ్రతికి వున్న కొడుకును ఎవరైనా చనిపోయాడని చెప్పుకుంటారా? ఇది వింటే మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి ఊహించుకోండి! మీరు పెద్దవారు. మీ వయసుకి గౌరవం ఇచ్చి నేనేమీ అనలేకపోతున్నాను. ఇప్పుడు సరే! ఇంకెప్పుడూ మీ కొడుకు చనిపోయాడని అనకండి! నేను వినలేను. ఆయన నా భర్త”
”నీకు సెంటిమెంట్స్‌ లేవని విన్నాను”
”సెంటిమెంట్స్‌ లేకుంటే హేమంత్‌ నా భర్త కాడా? మీరు చెప్పినంత తేలిగ్గా చచ్చిపోయాడని ఎవరూ చెప్పుకోరు. ఆయన మనిషండీ! ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌! అలాంటి ఆయన్ను పట్టుకొని చనిపోయాడంటారా?”
”నేను బ్రతికున్న నా కొడుకును చనిపోయాడని చెప్పుకున్నాను. నేను దుర్మార్గుడినే! కానీ నువ్వు నీ కడుపులో జీవం పోసుకుంటున్న బిడ్డను నిజంగానే చంపేసుకున్నావు… అలాంటి నువ్వు కూడా నన్ను అనేదానివే! వెళ్లు. అన్నది చాలు. ఉన్నది చాలు” అన్నాడు.
అప్రయత్నంగానే ఆమె బయటకి నడిచింది. మనసంతా చిద్రమైనట్లు ఒకటే నొప్పిగా వుంది.
ఉపేంద్రను హేమంత్‌ తండ్రి స్థానంలో ఊహించుకోలేకపోతోంది.
తను కూడా ఏదో తప్పు చేసినట్లు తొలిసారిగా అన్పించింది.
శార్వాణి ఆంటీ ఇంట్లో లేకపోయినందుకు బాధగా వుంది. వుంటే అసలేం జరిగిందో! హేమంత్‌ని చనిపోయినట్లు ఎందుకు ప్రచారం చేసుకున్నారో అడిగి తెలుసుకునేది. తెలుసుకుని తనేం చేయాలి? బ్రతికే వున్నాడని హేమంత్‌ని తీసికెళ్లి వాళ్ల బంధువులకి చూపిస్తుందా? చూపించటానికి హేమంత్‌ బంధువులెవరో ఆమెకు తెలుసా? అయినా హేమంత్‌కి తనకీ మధ్యన ప్రస్తుతం ఏముందని? భార్యా, భర్త అనుబంధమేమైనా వుందా? అతని బిహేవియర్‌ చూస్తుంటే తనని ఇక టచ్‌ చేయడనిపిస్తోంది. మరి అటువంటప్పుడు తామిద్దరి మధ్యన వుండే రిలేషన్‌ ఏమిటి? భార్యా, భర్తలా? స్నేహితులా? ప్రేమికులా? రూంమేట్సా? ఈరోజు నుండి అతని దగ్గర ఏ రిలేషన్‌ మెయిన్‌టెయిన్‌ చెయ్యాలి? ఏది మెయిన్‌ టెయిన్‌ చెయ్యాలన్నా ఉపేంద్ర ఇచ్చిన షాక్‌కి తేరుకోలేకపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *