May 18, 2024

ఒక గంట కథ      

Story of an Hr cover page                                                                      అనువాదం: క్రిష్ణ వేణి

రచన:   కేట్‍ ఛోపిన్‍

శ్రీమతి మలార్డ్ గుండెజబ్బుతో బాధపడుతోందని తెలిసి, ఆమె భర్త మరణ వార్తని ఆమెకి వీలయినంత మృదువుగా తెలియపరిచే జాగ్రత్త తీసుకోబడింది.

విరుస్తున్న వాక్యాలతో, సగం దాచిపెట్టిన సూచనలతో సమాచారాన్ని వెల్లడిస్తూనే, ఆమె సహోదరి జోసెఫిన్ ఆమెకి వార్తని అందించింది.  ఆమె భర్త స్నేహితుడైన రిచర్ద్స్ కూడా అప్పుడు ఆమె వద్దే ఉన్నాడు. రైలు ప్రమాదం గురించిన కబురు తెలిసినప్పుడూ, “మరణించిన” వారి లిస్ట్లో మొదటి పేరు బ్రెంట్లీ మలార్డ్‌ది అని తెలిసినప్పుడూ కూడా, వార్తాపత్రిక ఆఫీసులో ఉన్నది అతనే. వచ్చిన రెండవ టెలిగ్రాము వల్ల తను తెలుసుకున్నది నిజమే అని నిశ్చయపరచుకునేటంత సమయాన్ని మాత్రమే వెచ్చించి, ఆ విచారకరమైన వార్తని మోసుకు వచ్చే తక్కువ జాగ్రత్తగల, తక్కువ సౌమ్యమైన స్నేహితుడినెవరినైనా సరే, అడ్డగించడానికి త్వరపడ్డాడతను.

ఆ వార్త ప్రాముఖ్యతని అంగీకరించే శక్తిలేమితో, అసమర్థతతో- ఇతర స్త్రీలు కథని విన్నట్టుగా ఆమె దాన్ని వినలేదు. హటాత్తుగా, దిగ్భ్రమమైన పరిత్యాగంతో ఆమె తన సహోదరి భుజాలమీద పడి వెనువెంటనే ఏడ్చింది. దుఃఖం వల్ల కలిగిన తుఫాను వెలవగానే, ఆమె తనగదిలోకి వంటరిగా వెళ్ళిపోయింది. ఎవరూ తన వెంట రావడం ఆమెకి ఇష్టం లేకపోయింది.

తెరిచిపెట్టున్న కిటికీకి అభిముఖంగా, ఒక విశాలమైన వాలుకుర్చీ ఉంది. తన శరీరాన్ని ఆవహించి, ఆత్మవరకూ చేరినట్టు అనిపిస్తున్న భౌతికమైన అలసట కలిగించిన ఒత్తిడితో ఆమె దీన్లో కూలబడింది. తన ఇంటికి ఎదురుగా విస్తరించి ఉన్న చదరంలో, కొత్త వసంత జీవంతో ఊగిసలాడుతున్న చెట్లని ఆమె చూడగలుగుతోంది. గాలిలో కమ్మటి వర్షపు సువాసన ఉంది.  క్రింద ఉన్న వీధిలో, వర్తకుడొకడు తన సరుకులని అమ్ముకుంటున్నాడు. ఎవరో దూరంగా పాడుతున్న పాట స్వరాలు మందంగా ఆమెని చేరుకున్నాయి. ఇంటిచూరు మీద లెక్కలేనన్ని పిచుకలు కిచకిచమంటున్నాయి. ఒకదానితో ఇంకొకటి కలిసిపోయి, ఒకదానిమీద మరొకటిగా పోగుపడి ఉన్న పడమట దిక్కు మేఘాల గుండా, ఇక్కడా, అక్కడా ఆకాశపు నీలం మచ్చలు కనపడుతున్నాయి.

ఏడుస్తూ నిద్రపోయి,  కలలో కూడా ఏడవడాన్ని కొనసాగించిన పిల్లలాగా, కుర్చీపైన ఉన్న ఒరుగుదిండు మీద తన తలని వేలాడేసి, తన గొంతులో వెక్కిళ్ళొచ్చి తనని కదిలించినప్పుడు తప్పా, ఆమె చలనరహితంగా కూర్చుంది.

ఆమె పడుచు వయస్సుది. తెల్లటి ప్రశాంతమైన ముఖం. ముఖంమీద ఉన్న గీతలు అణచివేతనీ మరియు కొంతమేరకు కొంత పటుత్వాన్నీ కూడా కనపరుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్ళల్లో కాంతివిహీనమైన తేరిచూపు ఉంది. అది దూరాన, ఆవలివైపు నీలపు ఆకాశంలో ఉన్న మచ్చలలో ఒకదాని మీద ఆని ఉంది. అది ఆలోచనా దృక్కు కాదు కానీ ఒక తెలివైన ఆలోచన యొక్క నిలుపుదలని సూచిస్తోంది. ఆమెని ఏదో సమీపిస్తోంది. ఆమె దీనికోసం భయపడుతూ, ఎదురుచూస్తోంది. అదేమిటి? ఆమెకి తెలియదు; పేర్కొనేటందుకు అది అతి నిగూఢమైనదీ మరియు అంతు దొరకనిదీ. కానీ ఆకాశం నుండి బయటకి ప్రాకుతూ వస్తున్న ధ్వనుల ద్వారా, వాసనల ద్వారా, గాలిని నింపిన రంగు ద్వారా- ఆమె దీన్ని అనుభవించింది.

ఇప్పుడామె వక్షస్సు పైకీ, కిందకీ ఉద్రేకంగా కదులుతోంది. తనని ఆవహించబోతున్న దీన్ని ఆమె గుర్తించడం ప్రారంభించింది. తన చిత్తంతో దీన్ని తిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తోంది. నిస్సత్తువైన ఆమె తెల్లటి, నాజూకైన చేతులు ఎంత కొట్టగలిగితే- అంతగా. ఆమె తన్ని తాను కొంతసేపు వదిలించుకుంది. ఆ తరువాత, కొద్దిగా తెరుచుకుని ఉన్న ఆమె పెదాలనుండి గుసగుసమంటూ ఒక మాట వెలివడింది. దాన్ని ఆమె పదేపదే లోగొంతుకతో “ స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ“ అంటూ ఉచ్ఛరించింది. ఆమె కళ్ళనుంచి శూన్యంగా ఉన్న తేరిచూపూ మరియు దాన్ననుసరించిన భయమైన చూపూ పోయాయిప్పుడు. కళ్ళు  చురుకుగా, తళతళలాడుతూ ఉన్నాయి. ఆమె నాడి వడివడిగా కొట్టుకుంది మరియు ఆమె శరీరంలో పారుతున్న రక్తం ప్రతీ అంగుళాన్నీ వెచ్చబరిచి, సడలించింది.

తనకి కలిగినది వికృతాకారమైన సంతోషమా! అని ప్రశ్నించుకునేటందుకని ఆమె ఆగలేదు. అది అల్పమైనదన్న సూచనని త్రోసిపుచ్చడానికి, ఒక స్పష్టమైన మరియు మహత్తైన ఎరుక ఆమెకి శక్తిని కలుగజేసింది. మృత్యువు యందు ముడుచుకు పోయున్న దయగల, మృదువైన చేతులని తను చూడగానే తను మళ్ళీ ఏడుస్తుందని ఆమెకి తెలుసు; తన పట్ల ప్రేమతో తప్ప ఇంకేలాగునా కనబడని ముఖం చలనరహితంగా, బూడిదవర్ణంతో ఉండి మరణం పొంది ఉంటుంది.  కానీ ఆ చేదు క్షణానికి అవతల, పూర్తిగా తనకి మాత్రమే చెందే ఎన్నో సంవత్సరాలని ఆమె చూసింది. మరియు వాటిని ఆహ్వానించడానికి ఆమె తన చేతులని బార్లా తెరిచి, చాపింది.

రాబోయే ఆ సంవత్సరాల్లో, తను ఎవరికోసమైనా బతికేటందుకు ఎవరూ ఉండరు; తనకోసం మాత్రమే తను జీవిస్తుంది. తోటి జీవి మీద తమ స్వంత ఇష్టాన్ని రుద్దే హక్కు తమకి ఉందని నమ్మే స్త్రీ పురుషుల ఆ గుడ్డి మొండిపట్టులో, తన ఇచ్ఛని అణిచిపెట్టే ఏ బలమైన చిత్తమూ ఉండదు. ఆమె దాన్ని ఆ క్లుప్త క్షణపు వెలుగులో చూసినప్పుడు, అది దయగల ఉద్దేశం అయినా లేక కఠినమైన ఉద్దేశం అయినాకానీ, అది ఆ చర్యని నేరానికి తక్కువుగా ఏమీ చూపలేదు.

అయినా ఆమె అతన్ని ప్రేమించింది- కొన్నిసార్లు.  తరచూ కాదు కానీ. తేడా ఏమిటి! తన ఉనికి యొక్క అతి దృఢమైన ప్రేరణ అని ఆమె హటాత్తుగా గుర్తించిన ఆత్మ యొక్క అధికారం ఎదుట, జటిల మర్మం అయిన ప్రేమ ఎంత విలువైనదని?
“స్వేచ్ఛ! శరీరం, ఆత్మా స్వేచ్ఛ పొందాయి!” ఆమె గొణుగుతూనే ఉంది.

లోపలకి రావడం కోసం బ్రతిమాలుకుంటూ, తాళపు కన్నం మీద తన పెదాలాన్చి, మూసిఉన్న తలుపు ముందు జోసెఫిన్ మోకాళ్ళమీద కూర్చునుంది. “లూయీస్, తలుపు తెరువు. బతిమాలుకుంటాను. నిన్ను నువ్వు అనారోగ్యం పాలు చేసుకుంటావు. ఏమిటి చేస్తున్నావు లూయీస్? దేవునిమీద ఆన. తలుపు తెరువు.”

“దూరంగా పో. నన్ను నేనేమీ అస్వస్థతపాలు చేసుకోవడం లేదు.” కాదు. ఆమె ఆ తెరిచి ఉన్న కిటికీలోనుంచి జీవితం యొక్క అమృతపు సారాన్ని తాగుతోంది.

ఈ మధ్య ఆమె కన్నా ముందు, ఆమె స్వైరభావం అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. వసంతకాలం, వేసవికాలం- అన్ని రుతువులూ తన స్వంతమే అవుతాయి. జీవితం ఎక్కువకాలం సాగాలని ఆమె చిన్నపాటి ప్రార్థన ఒకటి చేసింది. జీవితం చాలా ఎక్కువకాలం సాగుతుందేమో అని ఆమె భయపడుతూ ఊహించుకున్నది నిన్ననే.
ఆమె తీరికగా లేచి, తన సహోదరి మొండితనాన్ని పట్టించుకోడానికి తలుపు తీసింది. ఆమె కళ్ళల్లో ఉత్తేజితమైన గెలుపు ఉంది మరియు తనకి తెలియకుండానే ఆమె విజయ దేవతలా ప్రవర్తించింది. ఆమె తన సహోదరి నడుం పట్టుకున్న తరువాత, ఇద్దరూ కలిపి మెట్లు దిగారు. క్రింద రిచర్డ్స్ నిలుచుని, వేచి చూస్తున్నాడు.

ఎవరో ముందు తలుపు తాళం తెరుస్తున్నారు. కొంచం ప్రయాణ బడలికతో- తన చేసంచీనీ, గొడుగునీ నిమ్మళంగా మోసుకుంటూ లోపలకి ప్రవేశించినది బెంట్లే మలార్డ్ . ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతను దూరంగా ఉన్నాడు. ప్రమాదం జరిగిందని కూడా అతనికి తెలియదు. జోసెఫెన్ కర్ణకఠోరమైన అరుపు వల్లా మరియు తనని తన భార్య దృష్టి నుంచి మరుగు చేయడానికి రిచర్డ్స్ చురుకుగా కదిలినందువల్లా, అతను ఆశ్చర్యపడి నిలుచున్నాడు.
డాక్టర్లు వచ్చి ఆమె గుండెపోటుతో మరణించిందని చెప్పారు-ప్రాణం తీసే సంతోషం వల్ల అని.
***

“తన భర్త ఒక దుర్ఘటనలో మరణించాడని తెలిసిన తరువాత, ఒక స్త్రీకి కలిగిన ఆలోచనల గురించినది కేట్‍ ఛోపిన్‍ రాసిన ‘ఒక గంట కథ.’ ఈ కథ, మొదట 1894లో వోగ్‌లో ప్రచురించబడింది. ఇప్పుడిది ఆమె రాసిన వాటిల్లో అతి ఎక్కువ జనాదరణ పొందిన వాటిల్లో ఒకటి”. -వికీపీడియా

కథ చిన్నదే అయినప్పటికీ, భర్తవల్ల అసంతృప్తికి లోనై ఉండి కూడా అతనితోనే బతకాల్సిన అవసరం కలిగిన ఈ స్త్రీ కథ ఈనాటికి కూడా మన సమాజానికి సంబంధం కలిగి ఉన్నదే.

12 thoughts on “ఒక గంట కథ      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *