May 18, 2024

ఎగిసే కెరటం

                                                                                రచన: శ్రీసత్యగౌతమి

ఎపిసోడ్-1

డా. కౌశిక్ నేరుగా మీటింగ్ రూం నుండి లాబీ లోకి వచ్చి ఫోన్ చేసుకుంటున్నాడు. దూరం నుండి సింథియా కౌశిక్ ను గుర్తుపట్టి …“ఎన్నాళ్ళకి కనిపించాడు” అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా గత జ్ఞాపకం లోకి జారుకుంది. తన బాస్ చటర్జీ ద్వారా కౌశిక్ పరిచయమయ్యాడు. కౌశిక్ ని అమెరికా నుండి అఫీషియల్ పన్లమీద ఇండియా రప్పించినప్పుడు కౌశిక్ ఉన్న నాలుగు రోజులూ అతని స్టే, అఫీషియల్ వర్క్ కి కావలసిన అవసరాలు, సిటీ సైట్ సీయింగ్ చూసుకోమని తన బాస్ తనకే పురమాయించడం తో కౌశిక్ తో తిరిగే అవకాశం, అతని మంచి చెడ్డలు చూస్తూ అతని మంచి తనాన్ని తెలుసుకునే అవకాశం సింథియాకు దొరికింది. అప్పుడే ఒక నిజాన్ని తెలుసుకుంది, తన బాస్ కన్నా కౌశిక్ ఎన్నో రెట్లు సున్నిత మనస్కుడు … పైగా అమెరికా డాలరున్నవాడు.

ఈలోపుల కౌశిక్ ఫోన్ మాట్లాడడం పూర్తిచేశాడు. పాత జ్ఞాపకంలోనుండి బయటపడి కౌశిక్ ను చేరుకుందామని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అతనివైపు బయలుదేరింది. ఇంతలో కౌశిక్ కి కుడివైపునున్న మీటింగ్ హాల్ నుండి లహరి బయటికి వచ్చి కౌశిక్ ని కలిసింది. ఇద్దరూ ఏదో మాట్లాడుకోవడం మొదలెట్టారు. లహరి ఏదో నోట్ బుక్ తీసి చూపిస్తున్నదీ, మళ్ళీ మరో బుక్ ని బ్యాగ్ లోంచి తీసి కౌశిక్ కి ఇచ్చింది, అతనేదో పేజీలు త్రిప్పుతున్నాడు. వాళ్ళిద్దరి వాలకం చూస్తుంటే ఏదో మీటింగ్ విషయాలు సీరియస్ గా చర్చించుకున్నట్లే అనిపించిందే తప్పా…మరో భావన కలిగేటట్లుగా లేదు. అయినా సింథియా అన్ని కోణాల్లోని ఆలోచించాలని నిర్ణయించుకుంది, దీనికి కారణాలు లేకపోలేదు.

సింథియా పుట్టిన నాటినుండీ మధ్యస్థమయిన బ్రతుకు బ్రతకవలసివచ్చింది, తనకిష్టం లేకపోయినా. అలాగని తన కన్నవాళ్ళు వీధిన వదిలెయ్యలేదు, కాకపోతే తనకే తన జీవితం తృప్తిగావుండేది కాదు. తల్లి పాయసం చేసి ఇస్తే తనకు బయట పాతిక రూపాయలు పెట్టి బాదుషా తినాలనిపించేది. తను పదవతరగతి పాస్ అయితే తండ్రి వాచీ కొనిచ్చాడు, అది చాలా చీప్ గా అనిపించింది, మోపెడ్ కావాలని పేచీపెట్టింది. కన్నవాళ్ళు తనకు పెట్టిన పేరు అందియ, అది తీసి పారేసి సింథియా గా మార్చుకొని చలామణి అవుతుంది. ఇలాగే తన జీవితం తనకు ఏనాడు సంతృప్తినివ్వలేదనీ అహర్నిశలూ మరింకేదో వెతుకుతుంటుందీ అందియ వురఫ్ సింథియా.

తనకు పెద్దగా చదువు మీద నమ్మకం లేదు కానీ జీవితం లో పెద్ద పెద్ద ఆశలున్నాయి. “బ్రతుకగలిగే చాకచక్యం వుంటే విలాసవంతమైన జీవితం జీవించొచ్చు, చదువెందుకు? దానికి కావలసిన మార్గమే ధనికుడైన మగాడు” అనేటటువంటి ఆలోచనా ఒరవడిలో పడిపోయింది సింథియా. ఆ ఆలోచనల ప్రకారమే తాను స్నేహాలు చేస్తూ, మార్గాలు వెతుక్కుంటూ తాను ఏమిపోగొట్టుకోవాలనుకున్నాకూడా వెనుకడుగు వెయ్యకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నది. ఎక్కడెక్కడో ఎలాగెలాగో స్నేహాలు, అమ్మానాన్న మాటవినదు కాబట్టి వాళ్ళు చెప్పరు, అడగరు. ఏదో ఉద్యోగం చేస్తున్నది, జీతానికి మించిడబ్బితెచ్చేస్తున్నది … కన్నవాళ్ళనీ, తన తర్వాతి వాళ్లనీ పోషించేస్తున్నది. అందువల్ల కన్నవాళ్ళు కూడా మౌనం పాటించడం మొదలుపెట్టారు. తన బాస్ కూడా ఏదో సొసైటీ పార్టీ లో తాను పట్టిన పిట్టే. ఆ బంధాన్ని గట్టిపరుచుకొని అతని ఆఫీసులో అన్నిపనులూ చూసుకునే ఒక సెక్రటరీ లా చేరింది. చటర్జీ ఒక డాక్టర్, పేషంట్స్ ని చూస్తూ రెండు చేతులా ఎడా పెడా సంపాదించడమే కాకుండా మెడికల్ స్టూడెంట్స్ కి కూడా మెడికల్ కాలేజీలో టీచ్ చేస్తుంటాడు. ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు రీసెర్చ్ కూడా చెయ్యాలి రీసెర్చ్ గ్రాంట్స్ తెచ్చుకోవాలంటే. అలా గ్రాంట్స్ తెచ్చుకోవడం, రీసెర్చ్ చెయ్యడం అనేది ఒక ప్రెస్టీజ్. ఎందుకంటే డాక్టర్లు రీసెర్చ్ చెయ్యలేరు, వాళ్ళకా లైసెన్స్ లేదు, పి.హెచ్.డి ఉండదు కనుక. కానీ చటర్జీ అన్నిట్లోని వ్రేలు పెట్టి, తన వైద్య కమిటీ లో తాను ఒక గొప్ప వ్యక్తి గా చూపించుకోవాలని అహర్నిశలూ మార్గాలు వెతుకుతూ వుంటాడు. ఒకవిధం గా చటర్జీ కూడా సింతియా లాగే ఆలోచిస్తుంటాడు. కానీ చటర్జీ కష్టపడే మార్గాలు వెతుకుతుంటే, సింథియా సుఖపడే మార్గాలు వెతుకుతుంటుంది.

చటర్జీ వల్ల అన్నిరకాలుగా సుఖపడుతున్నా ఎప్పటిలానే సింథియాకి తృప్తిలేదు. ఇంకా తెలివిగా ఆలోచిస్తే తానింకా సుఖపడొచ్చేమో అనే ఆలోచన నిరంతరమూ ఆమె బుర్రని తొలిచేస్తూవుంటుంది. చటర్జీ ఆఫీసుపన్లలో తాను చేసే ముఖ్యమైనపని డేటాబేస్ మేనేజ్మెంట్. ఎలాగో చచ్చీ చెడి డిగ్రీ పూర్తిచేసి, ఏదో కంప్యూటర్ క్రేష్ కోర్సు నేర్చుకొని చటర్జీకి తగులుకుంది. ఎలాగో మెడికల్ ల్యాబ్లో పేషంట్ల స్యాంపుల్స్ ని టెస్ట్ చేసే విధానాల్ని, వాటికి ఉపయోగించే కిట్లని తెలుసుకొని నేర్చుకున్నది. ఆమె దృష్టిలో మరో నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి మరొక మార్గం. ఇంటికి ఎంత ఆలశ్యం గా వెళ్ళినా అడిగేవారులేరు, ఒకవేళ అడిగినా ఎక్కడ వాళ్ళవసరాలు తీరవో అని భయపడేవాళ్ళే తప్ప, దైర్యం చేసేవాళ్ళు లేరు.

ఇలా అత్తెశరుపన్లు నేర్చుకొని తాను ఎంతో ప్రేమతో చటర్జీ కోసమే నేర్చుకొన్నదని చటర్జీకి చెప్పి నమ్మిస్తూ వుంటుంది. తన ప్రతిపనిలోనూ నీడలా తనకి సహాయపడుతున్నదనే విశ్వాసాన్ని చటర్జీనుండి పొందింది, దానితో ఆమెకోసం స్వర్గం నుండి కల్పతరువుని కొట్టేయమన్నాకూడా తూ చ తప్పకుండా చేసేలా అతన్ని కండిషన్ చేసుకుంది. ఆమెని పూర్తిగా నమ్మేసి, తన సిబ్బందిలో ఎవరికీ ఇవ్వని మరియాద, స్థానం ఈమెకు ఇస్తూ, ఈమెకన్నా ఎంతమంది ఎంత గొప్పగా పనిచేసినా ఈమె ముందు తక్కువగానే చూసేవాడు. ఎందుకంటే మిగితావాళ్ళు డబ్బుకి పనిచేస్తున్నారు కానీ సింథియా మాత్రం తన కోసం పనిచేస్తుందనే ఒక వెర్రి భావన చటర్జీది. ఆ భావన తో సిబ్బందిని అసంతృప్తి పాలు చేస్తుండేవాడు చటర్జీ. దానివల్ల తానూ మిగితా వారి అసంతృప్తీ, అలజడులతో సతమతమవుతూవుండేవాడు, అయితే ఏం సింథియా మాత్రం తనపధకాలతో హాయిగావుండేది. అలా “తనది” అనుకున్న సింథియాని కౌశిక్ కు పరిచయంచేశాడు. కౌశిక్ ఇండియాలోవున్న ఆ నాలుగురోజులూ, ఆక్టోపస్ లాంటి సింథియా తన టెంటకిల్స్ ని కౌశిక్ వైపు తిప్పింది. కౌశిక్ తిరిగి అమెరికా వెళ్ళిపోవడానికి ముందు రోజు రాత్రి మొత్తం కలకత్తా అంతా తిప్పి చూపించి దగ్గరవ్వడానికి ప్రయత్నించింది. తనూ వైన్ తీసుకుంటూ, కౌశిక్ కు వైన్ సెర్వ్ చేస్తూ అందులో తనకలవాటయిన ప్రక్రియ మత్తుమందు కలిపింది. తన ప్రయత్నాన్ని సఫలం చేసుకుంది. ఇదంతా వెర్రి చటర్జీకి తెలియదు. కౌశిక్ వెళ్ళిపోయాడు, ఇదిగో మళ్ళీ ఇలా అమెరికాలో కాన్ ఫెరెన్స్ లో దూరంగా చూడడం. అలవాటుగా చటర్జీతో కలిసి కాన్ ఫెరెన్స్ కి ఉచితంగా వచ్చేసింది.

హోటల్ రూం కి తిరిగి వచ్చి తన టెంటకిల్స్ ని లహరివైపు తిప్పింది, కనీసం ఆమెపేరుకూడా తెలియకపోయినా. “ఎంత అందంగా వుందీ ఆ అమ్మాయి? కౌశిక్ కి అక్కడే పరిచయమయ్యిందా లేకా అతనితో కలిసి పనిచేస్తున్నదా? ఇండియనే…అంటే తాను చటర్జీని పట్టుకున్నట్లు ఆమె కౌశిక్ ని పట్టుకుందా? ఎలా వచ్చి వుండవచ్చు అమెరికాకి ఆమె? అమెరికాకి రావడం అంటే మాటలా? నేనే ఇంతవరకూ రావడానికి నా నా…గడ్డి తినాల్సి వచ్చింది, ఆడది చదువుకొని అయితే ఇంత దూరం రాలేదు (మరి తన నమ్మకం), అమెరికా రావాలంటే ఏదొక మార్గం తొక్కాల్సిందే, పైగా అందగత్తె వుంది…తన కన్నా అందగత్తె!”.

వెళ్ళి అద్దంలో చూసుకున్నది. చామనచాయ రంగు, జిడ్డుకారే చర్మం, కళ్ళద్దాలు అవితీసేస్తే కళ్ళు కనబడవు, పలుచని జుట్టు. లహరిని చూసాక తనలోని వికారాలు తనకు తెలిసాయి. (స్వగతం) “ఇటువంటి ఆడవాళ్ళను తమ తమ వృత్తుల్లో కలిసినా…చటర్జీ లాంటి బిగ్ షాట్స్ తననెందుకు కాపాడుకుంటున్నట్లు?” సందేహం కలిగింది. వెంటనే ఆమెకి తోచిన సమాధానం కౌశిక్ తో కనబడిన ఆ స్త్రీ లాంటివాళ్ళు చటర్జీ ఆఫీసులో లేకపోవడం, ఒకవేళ ఒకళ్ళిద్దరూ వున్నా ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా తాను వాళ్ళకీ, చటర్జీ కి మధ్య కావలసినన్ని పుల్లలు పెట్టి ఎప్పటికప్పుడు రాజేస్తున్నది కాబట్టి తన పొజిషన్ సేఫ్. మరి తాను ఇక చటర్జీ ని వదిలేసి అమెరికాలోనే వుండిపోయి డాలర్ సంపాదించుకోవాలంటే కౌశిక్ చెంత చేరిపోవాలి. కౌశిక్ చుట్టూ ఏ ఆడదీ ఇక వుండడానికి వీల్లేదు, ముఖ్యం గా ప్రొద్దున్న చూసిన వ్యక్తి. ఆమెవరో తెలుసుకోవాలి, కౌశిక్ ని కలవాలి, మాట్లాడాలి వీలయితే ఆ రోజు గడిపిన మధుర రాత్రిని మళ్ళీ తీసుకురావాలి. చటర్జీ ద్వారా కౌశిక్ వివరాలు తీసుకోవాలి. ఇంతకీ కౌశిక్ ని చటర్జీ ఈ మీటింగ్లో కలిశాడాలేదా? నాకు చెప్పనేలేదేమిటి? ఎలాగయినా అనుకున్నది అనుకున్నట్లుగా గబ గబా జరిపించాలి, అని తొందర తొందర పడడం మొదలుపెట్టింది సింథియా.

ఇంతలో చటర్జీ రూం కొచ్చేశాడు. ఎప్పటినుండో తన గురించే ఆలోచిస్తూ ఎదురుచూస్తున్నట్లు గా ఎక్కడ్లేని హొయలుపోవడం మొదలెట్టింది. మాటల్లో చెప్పింది తను కౌశికి ని చూసినట్లుగా. వెంటనే చటర్జీ.. “యస్…రేపు మనతో డిన్నర్ కి కలుస్తున్నాడు. తాను తన అసోసియేట్స్ తో కలిసి వచ్చాడు”.

అది విని మనసులోనే ఎగిరి గంతేసింది. మళ్ళీ అడిగింది “కౌశిక్ వాళ్ళందరితో వస్తున్నాడా?”

“లేదు. తను మాత్రమే మనల్ని కలుస్తున్నాడు. వాళ్ళందరినీ నేను ఇన్ వైట్ చెయ్యలేదు. ఎందుకు?” చటర్జీ అడిగాడు.

“అహ…ఊరికే అడిగాను, చేసివుంటే అందరినీ కలిసేవాళ్ళము గా” అన్నది.

చటర్జీ కి అర్ధం కాలేదు కానీ ఏమీ మాట్లాడలేదు, పట్టించుకోకుండా ఊరుకున్నాడు.

సింథియా కి కౌశిక్ అసోసియేట్స్ లో అతనికి ఎవరు దగ్గరున్నారో తెలుసుకుందామని తపన. పచ్చకామెర్లవాడికి ఊరంతా పచ్చగా వుంటుంది, తనలాగే అమెరికా వచ్చినవాళ్ళందరూ అనుకొంటోంది.

****************

కౌశిక్ ని మళ్ళీ చూడడానికి జస్ట్ ముందే రామాయణంలో పిడకల వేటలాగ సింథియా ఇంటెర్నెట్ లో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒకడితో భాగోతం నడిపి పెళ్ళికి సిద్ధం చేసుకుంది. చటర్జీ అంగీకరించాడు, ఎన్నేళ్ళని పెట్టుకుంటాడు సింథియాని. ఇంకేం చటర్జీకి, సింథియాకి కౌశిక్ కనిపించగానే ప్రాణం లేచొచ్చింది కూడా. సింథియా కి ఆ అమెరికా అబ్బాయి తో పెళ్ళి, కౌశిక్ దగ్గిర ఉద్యోగం!….చటర్జీ తన బాధ్యతను కౌశిక్ చేతిలో పెట్టాయాలని నిర్ణయించుకున్నాడు.

కౌశిక్ రానే వచ్చాడు వాళ్ళతో కలిసి డిన్నర్ చెయ్యడానికి. పాత స్నేహితులందరూ ఎక్కడలేని అభిమానాన్ని ఒలకబోసుకున్నారు. సింథియాని చూశాక కూడా కౌశిక్ లో పెద్ద చలనం లేకపోగా జెనెరల్ గానే ఆ మాటా ఈ మాటా మాట్లాడుతుంటే సింథియాకి బాధకలిగింది. పాతరిలేషన్ వున్నా తనకి పెద్ద ప్రిఫరెన్స్ వున్నట్లు కనబడలేదు. దీనికంతటికీ కౌశిక్ తనదగ్గరున్న అందమైన ఆడవాళ్ళతో కులుకుతున్నాడేమో అనుమానం రాగానే ముందా లహరి మీద ఆసూయత తొంగిచూసింది. పాపం లహరి ఇప్పటినుండే సింథియా అసూయతకి బలయిపోయింది. చివరిగా, చటర్జీ కౌశిక్ కు సింథియా పెళ్ళి విషయం చెప్పాడు, ఆమెకి కాబోయే భర్త గురించి చెప్పి, సింథియాని తన ఆఫీసులో వేసుకోమని అడిగాడు. అలాయితే పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ దగ్గిర్లోనే వుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు…అని.  పెళ్ళిమాటలు రాగానే సింథియా సిగ్గుల మొగ్గయ్యింది.

కౌశిక్ ప్రస్తుతానికి తన దగ్గిర ఖాళీలులేవనీ, ఇంకెక్కడయినా తనకి తెలిసిన కొలీగ్స్ దగ్గిర చూస్తానని చెప్పి శెలవు తీసుకున్నాడు. వెళ్ళిపోయేముందు తన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. ఇంటి జీవితానికి పెళ్ళికొడుకు దొరికిపోయాడు. డబ్బుకి పదవికి కౌశిక్ దొరక లేదు, సింథియాకి ఇంకా బాధ ఎక్కువయ్యింది, ఎప్పటిలాగే సంతృప్తి కలగలేదు. కాన్ ఫెరెన్స్ అయిపోయి ఇండియా వెళ్ళిపోయింది చటర్జీతో. కానీ మనసు నిలకడవుండడంలేదు, ఇండియా నచ్చడం లేదు, అమెరికా వెళ్ళిపోవాలి తాను కౌశిక్ తో సెటిల్ అవ్వాలి. తాను ఎప్పటికైనా ఏ విషయం లోనైనా పనికొస్తాడనే కదా ఆనాడు చేసిన ప్రయత్నాలు, మరవి నిర్వీర్యం అయితే ఎలా? ఇక ఫోన్ నెంబర్ వుంది గా కౌశిక్ కి ఫోన్లు చెయ్యడం మొదలెట్టింది. వాటి ఫలితం గా తన కొలీగ్ ఆఫీసులో ఉద్యోగం వెతికిపెట్టాడు. ఉద్యోగవిధులు కొన్ని ఆమెకి తెలిసినవే డేటాబేస్ మ్యానేజ్మెంట్, పేషంట్ స్యాంపుల్స్ మీదా పరీక్షలు చేసి డాక్టర్స్ కి రిపోర్టులు తయారు చెయ్యడం, మరికొన్ని క్రొత్తవి నేర్చుకొని చెయ్యాల్సినవి క్లరికల్ పన్లు, గ్రాంట్లకు అప్లై చేసే దాంట్లో పనులు ఇంకా అలా ఎన్నో. తనకి అమెరికాలో ఉద్యోగం సునాయాసం గా, సర్టిఫికెట్లని చంకలో పెట్టుకొని వెతుక్కునే పనిలేకుండా పాత పరిచయం తో కొట్టేసినందుకు గర్వంగా వుంది. ఇక చక చకా పన్లు అయిపోయాయి, ఆమె కి J1 వీసా ఝారీ చేసేసారు. ఇక పెళ్ళికి ముందే విమానమెక్కి సింథియా ఎగిరిపోయింది. దీనితో తను ఎంచుకున్న మార్గం మీద ఇంకా నమ్మకం స్థిరపడిపోయింది. సింథియా తన దాహాన్ని ఇంతటితో ఆపేస్తే ఎంతబాగుణ్ణు!

సింథియా తను ఇప్పటివరకూ గడిపిన జీవితంలో ఎప్పుడూ తక్కువ కష్టం, ఎక్కువ సుఖం వుండేందుకే పరుగులు తీసింది కాబట్టి అమెరికాలో వళ్ళు వంచి కష్టపడలేకపోయింది, పైగా లేడీ బాస్. ఏవిటి వుపయోగం? లేడీ బాస్ కి కోపంవచ్చి సరిగ్గాపనిచెయ్యలేకపోతున్నదనీ ఉద్యోగం లోంచి పీకి పారేసింది. దీనికి ముందరే పాపం సింథియా రాకేష్ ని ఇండియాలో అందరి సమక్షంలో పెళ్ళి చేసుకున్నది. భర్త మంచివాడే, తను చూసుకుంటానన్నా డబ్బు స్వాతంత్ర్యము లేకుండా తాను వుండనని ఖరాఖండి గా చెప్పేసింది. ఇక అమెరికా నుండి చటర్జీని బాధించడం మొదలెట్టింది ఉద్యోగం కోసం. తనకు ఉద్యోగం కావాలంటే ఇలా తన పరిచయస్థులని బాధించడమే తప్పా, సాధారణం గా అందరిలా ఉద్యోగాలు వెతుక్కోవాలనే ఆలోచనే లేదు, పైగా అది చాలా చిన్నతనం గా కూడా ఫీల్ అవుతుంది, తాను కోరుకున్న ఉద్యోగానికి డైరక్ట్ గా కారు దిగి తన ఆఫేసులో కి నడవాలని కోరుకుంటుంది, ఇప్పటిదాకా ఏ రాజకీయాలో చేసుకుంటూ అలాగే జీవించుకొచ్చింది. అమెరికా వచ్చాకే మొదటి పరాభవాన్ని చవి చూసింది.

(సశేషం)

6 thoughts on “ఎగిసే కెరటం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *