May 18, 2024

మాయానగరం – 22

 

భార్యలు భర్తలను అనుమానించడం, భర్తలు భార్యలను అనుమానించడం యీ పవిత్ర భారతదేశంలో అతిసర్వసామాన్యం. ఇతరదేశాల్లో ఇలాంటి అనుమానాలు ఉండవా? అంటే, ఎందుకుండవు. వాళ్ళు క్షణాలలో విడిపోతారు. విడిపోయే వెసులుబాటు వాళ్ళకి ఉంది. మనకీ వుంది. అయితే కోర్టుకెళ్ళి విడిపోవడం కన్నా  విషం తాగి చావడం మేలు. కారణమేమిటంటే పబ్లిక్ లో నగ్నమవ్వాల్సిన ఖర్మ పడుతుంది.

“అమ్మాయ్ మదాలసా… నువ్వు విడాకులు తీసుకోవాలంటే నీ భర్తకి మరో స్త్రీతో సంబంధం వుందనో, నీ భర్త నిన్ను శారీరకంగానో మానసికంగానో హింసిస్తున్నాడనో, అతని మానసిక పరీస్థితి సరిగా లేదనో, అతనికి ఎన్నడు తగ్గని రోగాలు ఉన్నాయనో, లేదా ఎయిడ్స్ లాంటి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజస్ వున్నాయనో ఋజువు చెయ్యాలి. సరే ! ఎలా ఋజువు చేస్తావు? పోనీ నీ మరదలో అత్తగారో, ఇరుగుపొరుగు వారో సాక్ష్యం చెబుతారా? పైపైకి ఎవరు ఎంత ఆప్యాయాలు జాలీ కురిపించినా, పోలీస్ స్టేషన్ కి, కోర్టుకి రమ్మంటే ఒక్కళ్ళు కూడా రారు. మరొకటి ఏమిటంటే కోర్టు కూడా వెంటనే విడాకులు ఇవ్వద్దు. మీ ఆయన అంటున్నది ఏమిటంటే నువ్వు మరో కుర్రాడితో చేతులు కలుపుకొని నడుస్తుండటం చూశానని.  ఆ విషయం వరకు నిజమేనని, కానీ అలా నడవడంలో దురుద్దేశమేదీ లేదనీ నువ్వే ఒప్పుకున్నావు, నిన్ను నమ్ముతాను గనక నాకు ఓ.కె. . కానీ కోర్టు ఒప్పుకుంటుందా? ఎవరి కోసం ఆ పిల్లాడిని కలిసావో కనీసం ఆ నీరజ అయినా నీకోసం కోర్టులో నిలబడి సాక్ష్యం చెబుతుందా? నాకు తెలిసి చెప్పద్దు… చెప్పలేదు. కూర్చున్న కొమ్మను ఎవరూ నరుక్కోరు. ఎంత చెడ్డా నీ మొగుడు మూర్ఖుడే కానీ శాడిస్టు కాదు. అటువంటి పని జన్మలో చేయనని మాటిస్తే ఏలుకుంటానని అంటున్నాడుగా! అందువల్ల మరోసారి ఆలోచించుచు. మనవి మధ్య తరగతి కుటుంబాలు. ఏం చేస్తే మంచిదో మరోసారి బాగా ఆలోచించి చెప్పు. కేసు ఫైలు చేయడం పెద్ద కష్టం కాదు. కానీ….” మధ్యలోనే వాక్యాన్ని తుంచేశాడు అహోబిల రావు. ఆయనో లాయరు. మదాలసకి దూరపు బంధువు. మనిషి మంచివాడు. లాయర్ గా గొప్ప పేరున్నా, డబ్బు మాత్రం పెద్దగా సంపాదించింది లేదు. కారణం న్యాయవాద వృత్తిని దైవమిచ్చిన వరంగా భావించడమే. అట్లాంటి వాళ్ళు లక్షకి ఒక్కడున్నా దేశం ఎక్కడో వుండేదని తోటి లాయర్లు అంటారు.

‘బాబాయ్.. నన్ను చంపి ముక్కలు చేసినా బాధపడను, కానీ అతను నన్ననే మాటలు నీకు చెప్పలేను. ఒక్కో మాట వెయ్యి కత్తి పోటులకంటే గాయపరుస్తుంది. నీకు నిజం చెబుతున్నా.. నడిరోడ్డు మీద వున్నా నా బ్రతుకు ఇంతకన్న సుఖంగానే గడుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నారో లేరో కూడా మరచిపోయా. వాళ్ళు వుండీ లేనట్టే… అసలు నేనెందుకు బతకాలి?” బోరుమంది మదాలస.

అహోబిల రావు మౌనంగా వున్నాడు. ఆయనకి మదాలస వ్యక్తిత్వం తెలుసు. సుందర రామమూర్తితో మాట్లాడాక  ఒక్క విషయం ఆయనకి అర్ధమయ్యింది. సుందరరామమూర్తి ప్రస్తుతానికి శాడిస్టు కాకపోవచ్చు. కానీ శాడిస్టుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అర్ధమైంది. మనిషిలో వుండే ‘అసంతృప్తి’ శాడిజానికి మూల కారణమౌతుంది. సుందరరామమూర్తి లో సెల్ఫ్ పిటీ నే గాదు, ఆత్మన్యూనతా భావం ( ఇంఫీరియారిటి కాంప్లెక్స్ ) కూడా చాలా ఎక్కువగా వుంది.

పోనీ ఓ పని చేద్దాం, నాకు తెలిసిన ఓ స్కూల్లో నీకు ఏ ఎటెండరు పోస్టో, ఆయా పోస్టో ఇప్పిస్తా. అది చేస్తూ డిగ్రీకి కట్టు. అమ్మాయ్… యీ లోకంలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి ముందు సంపాదించుకోవాలి. ఆ తరవాతే పెళ్ళిళ్లు పేరంటాలు. ఈ విషయం మీ నాన్నకి వెయ్యి సార్లు చెప్పినా చెవికి ఎక్కించుకోలేదు. ఫరవాలా. ఇప్పటికీ మించిపోయింది ఏవీ లేదు. ఏ క్షణాంలో నువ్వు ఉద్యోగంలో చేరతావో ఆ క్షణంలోనే నీ భర్త అహానికి పగుళ్ళు పడతాయి. అతని స్వభావం ఏమంటే, ఎదుగుతున్న వాళ్ళను చూసి భయపడటం. నువ్వు వదిలేస్తే  ఈ జన్మకు నీలాంటిది మళ్ళీ దొరకదని అతనికి తెలుసు. అందుకే లోపలే ఇంఫీరియారిటీ కాంప్లెక్స్ దాచుకుంటూ ‘క్షమార్పణ చెపితే ‘ వదిలేస్తానంటున్నాడు. నువ్వు క్షమార్పణ చెప్పక్కర్లేదు.. డైరెక్ట్ గా ఆ కుర్రాడ్ని మీ యింటికే తీసుకొచ్చి నీ మొగుడికి నీరజకి పరిచయం చెయ్యి. ఆ తరవాత చూడు. ఏదీ ఏమైనా ఉద్యోగ విషయం మాత్రం నిర్లక్షంచేయకు” అన్నాడు అహోబిల రావు.

“థాంక్స్ బాబాయ్… నువ్వు చెప్పినట్టే చేస్తా!” ఓ నిశ్చయంతో లేచింది మదాలస. సరైన సమయానికి సరైన సలహా ఇచ్చేవారు దొరకడం కూడా అదృష్టమే. ఒక చిన్న సలహా జీవితాన్ని సమూలంగా మార్చగలదు.

“క్షమించు వదినా.. తెల్లవార్లు నీ ఏడుపు వింటూ కూడా ఏమీ చేయలేకపోయిన అశక్తురాలిని” రెండు చేతులు పట్టుకొని నీరజ అంటే నవ్వింది మదాలస.

“ఫర్వాలేదు.. నువ్వు కాస్త మొహం కడుకొని సిద్ధంగా వుంటే , నేనెవరితో తిరుగుతున్నానని మీ అన్నయ్య అన్నాడో ఆ కుర్రాడిని ఇక్కడకే తీసుకొస్తా.

అతన్ని చూసి అడగాల్సిందేదో  మీ అన్నగారు అడగొచ్చు. చూడాల్సినదేదో నువ్వూ చూడచ్చు!” నీరజ భుజం తట్టి లోపలకి వెళ్ళింది మదాలస.

“అంటే? వాడు నీ బాయ్ ఫ్రండ్ అని డిక్లేర్ చేస్తావా?” అసహ్యంగా మొహం పెట్టి అన్నాడు సుందర రామ మూర్తి.

“బాయ్ ఫ్రండే అయితే ఇంటికెందుకు తీసుకురావడం? వెలగబెట్టే శృంగారం అతని రూం లోనే ఎవరి కళ్ళబడకుండా వెలగబెట్టవొచ్చుగా !” నవ్వింది మదాలస.

“నీకు…నీకు వొళ్ళు కొవ్వెక్కిందే!” పళ్ళు నూరాడు సుందరరామమూర్తి.

“కదూ! అది చూసేగా నువ్వు పెళ్ళి చేసుకున్నది. చూడు సుందరరామమూర్తి.. పేరులో మాత్రమే కాదు మనసులో వుండాలి సౌందర్యం. నేను నిజంగా చెడాలనుకుంటే ఆపగలవా?” సూటిగా రామూర్తి కళ్ళలోకి చూస్తూ అన్నది మదాలస.

సుందరరామమూర్తి కళ్ళు వాలిపోయాయి. అవాక్కయ్యాడు. లోకంలో ఆడది ఎదురు అడిగిననాడు ఎవరి కళ్ళు కిందకి వాలిపోవు. ఆడది ఇచ్చినంత కాలమే మగవాడికి మర్యాద.

********************************

బోసుబాబు ప్రభ వెలిగిపోతోంది. గా.మో.క. వీధే గాక గుడిసెల సిటి అంతా బోసుబాబు అడుగులకుమడుగులొత్తుతుంది. సూపర్ సారా, స్పెషల్ కల్లు, లెక్కలేనన్ని బహుమతులు, ఇంకేం కావాలి?

‘రేపు వచ్చే కోటి కంటే నేడు ఇచ్చే రూపాయే గొప్పది’ అనేది పేదవాడి సిద్ధాంతం. అందుకే వడ్డి ఎంత వుంటుందో, చక్రవడ్డి ఎంతవుతుందో వాడికేం పట్టదు. అప్పు దొరికిందా లేదా? అదే ముఖ్యం.

సేట్ చమన్ లాల్ కోట్లకి ఎలా పడగెత్తాదు? గుడిసెలోళ్ళు ఇచ్చే వడ్డితోనే. ‘అసలు ‘ అనేది తీరదు.  ఆ విషయం అప్పు ఇచ్చిన వాడికి, తీసుకున్నవాడికీ ఇద్దరికీ తెలుసు. వడ్డీ మాత్రం ‘అసలు’ ని దాటి ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుంది ‘ఇచ్చిన ‘ వాడికి కావల్సింది అదేగా?

కాదేదీ కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీగారు.

కాదేదీ తాకట్టు కనర్హం అంటారు పాన్ బ్రోకర్లు. నగలు, ఇల్లు, కంచం, చెంబు, రేషన్ కార్డు,  ఆఖరుకి ఇవ్వాళా రేపు పంపినీ చేస్తున్న ‘ఆధార్ కార్డు ‘ కూడా తాకట్టుకి అనర్హం కాదు.

“వీటితో ఏం చేస్తారు?” అని ఒక బ్రోకర్ ని అడిగితే చెప్పాడు,

“బాబూ, ప్రభుత్వ ధనం అంతా ప్రవహించేది ప్రజల్లోకే. కొంత అధికారులదీ, ఇంకాస్త ఎక్కువ మంత్రులదీ, ప్రజాప్రతినిధులదీ, మిగిలినదంతా ఇదిగో యీ జనాభాది. ఎన్నిలోన్లు తీసుకోవచ్చో మీకు తెలుసా? ఎన్ని రాయితీలు వున్నాయో మీకు తెలుసా? తెలీదు. మీ వూహకి కూడా అందదు.. పేరు వాళ్ళది… లాభం మాది. ఏం చేస్తాం అని అడక్కండి. చెప్పం. చెబితే మీరే ఎంచక్క మా షాప్ ముందే ఇంకో షాప్ పెడతారు! ” అని నవ్వాడు.

“మనం నిజంగా చదువుకున్న వాళ్ళమేనా? మన చదువులు నిజంగా మనకు లోకజ్ఞానం నేర్పిస్తాయా? అసలు గవర్నమెంటు టాక్సులు ద్వారా వచ్చే ధనాన్ని దేనికెంత ఇస్తోందో, ‘అసలు సిసలు ‘ లాభం పొందుతున్నది ఎవరో కనీసం తెలుసుకొనే ప్రయత్నం ‘సో కాల్డ్ ‘ విద్యావంతులమని పిలవబడే మనం చేశామా? నో!

ఓ బాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి అడగండి ఎన్ని రకాల లోనులు ఉన్నాయో. ఏ లోనుకి ఎంత రాయితీ ప్రభుత్వం కలిపిస్తోందో .అసలు ఎనెన్ని ప్రణాలికలూ పధకాలు వున్నాయో మనం విచారిస్తేగా! అందుకే .. మధ్యతరగతి మధ్యలోనే నలిగిపోతోంది. పాపపుణ్యాలు,  స్వర్గనరకాలూ అంటూ పిచ్చివాళ్ళు సృష్టించిన , సృష్టిస్తున్న పిచ్చిలోకంలోనే తన్నుకుంటోంది.

ఆచారాలు అనాచారాలు అంటూ మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంటోంది.

ఒకడు నిన్నటి వరకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాడు ఇవ్వాళ విద్యాశాఖా మంత్రి ఎలా అయ్యాడు?

నీ ఇంటి ముందే .. నీ కళ్ళ ముందే పుట్టినవాడు బ్లాకు టికెట్ల నుండి ఎదిగి సమితి ప్రసిడెంటై, ఎమ్మెల్యే అయి,  ఆ తరవాత అంతస్తుల మీద అంతస్తులు ఎలా కట్టగలుగుతున్నాడు. స్వయంకృషేనా? ధర్మసంపాదనేనా?

నువ్వు అడగవు “ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ??కర్మ ‘అంటూ శాస్త్రాలు  చెబుతావు. ముక్కోటి దేవతలకి ఆరుకోట్ల ముడుపులు కడతావు. గుండు గీయించుకుంటావు.

సీజంకోమారు చొప్పున మెళ్ళో(????)  తీసుకొని పుణ్యతీర్థాలు సేవిస్తూ పుణ్యాల్ని కొండంతలుగా నీ అకవుంటులో (అదీ చచ్చాక ఓపెనయ్యే పాపపుణ్యాల ఎక్కవుంట్లో ) జమ చేస్తూ వుంటావు.

నీ బిడ్డలు వీభూతులు కుంకుమబొట్లు పెట్టుకొని అలుగుడ్డలతో తిరుగుతూ వుంటారు.

నీ పెళ్ళం చిరిగిపోయిన చీరకి వందోసారి టాకా వేస్తూ లక్ష్మీసహస్రనామాలు వల్లె వేస్తూ వుంటుంది. మీ అమ్మ, మీ బామ్మ లక్షల కొద్ది వత్తులు చేస్తూ ‘చిత్రగుప్తుడి ‘ నోమో, గుర్నాధుడి (?) పొంగలో చేస్తూ రాబోయే జన్మకి పునాదులేసుకుంటూ వుంటారు.

భేష్.. మధ్యతరగతి మహానుభావా… చావు. ఇక్కడే పడి చావు. శ్లేష్మం లో పడ్డ ఈగలా , కుడితిలో పడ్డ బల్లిలా,  కొట్టుకొని కొట్టుకొని చావు. ” అంటూ పకపకా నవ్వాడు ఫాలాక్షుడు. పాలాక్షకుడు ఏ ‘ఇస్టు’ కాడు. ఈ ‘ఇజా ‘ న్ని నమ్మడు. నిజాన్ని తప్ప. ఆ ఫాలాక్షుడు నా ఫ్రండ్.

“అలాగే చస్తాం కానీ, ముందీ కథని ఏం చేయమంటావో చెప్పు?” అడిగాను.

“ఇక్కడ దాకా రాసుకొచ్చినవాడివి రాయలేవా?” నవ్వాడు ఫాలాక్షుడు.

“ఇప్పటిదాకా రాసినవి పచ్చి నిజాలు. ఫాలాక్షుడూ, అబధాలు కల్పించి రాయడం మరీ తేలిక. నిజాన్ని నిజ్మగా రాయడం చాలా కష్టంగా వుందిరా. మదాలసని చూస్తే నాకు ఏడుపొస్తోంది. ఆ పరమశివాన్ని చంపి పాతరెయ్యాలనుంది. ఆ పిచ్చిది మాధవి నెత్తిపగలగొట్టి మూర్ఖురాలా జీవితమంటే ఊహల్లో ఉండే ప్రేమ కాదే అని చెప్పాలనుంది, ఆ సుందరీబాయ్ నుంచి షీతల్ ని కిషన్ చంద్ గాడ్ని రక్షించాలనుంది…. ఎనెన్ని చెప్పమంటావు? ప్రతి కారెక్టరూ ఒరిజినలే.. నిజ జీవితంలో చూసిన పాత్రలే. వాటిని ‘కల్పిత పాత్రలు ‘ గా మలచలేను. ” నిజంగా కళ్ళొత్తుకున్నాను నేను.

“ఒరేయ్ బాబు.. కొత్తగా ఏమీ చెయ్యకర్లేదు, చూసింది చూసినట్టుగా విన్నది విన్నట్టుగా రాయి. అంతకు మించిన ‘కల్పన ‘ మరోటి వుండదు. ! ” నవ్వాడు ఫాలాక్షుడు.

“కల్పనా?” ఆశ్చర్యంగా అడిగా.

“సృష్టిని మించిన బ్రాంతి ఇంకోటుందా?” పరిహాసంగా అన్నాడు.

“శభాష్… నువ్వూ మద్యతరగతి వాడివేనని ఇప్పుడు నిరూపించావురా ఫాలాక్షా… పద… ఇద్దరం చూద్దాం! ” ఏడుస్తూ పెదాల మీద నవ్వు పులుముకున్నాను నేను చేసేదేముంది !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *