May 18, 2024

శుభోదయం-6                             

                                          -డి.కామేశ్వరి

ఆ రోజు మొదలు రాధ ఎన్నో సందర్భాలలో కన్నీళ్ళు వత్తుకుంటూనే వుంది రోజూ.  ఆమె జీవితంలో మాధుర్యం, తీపి, శాంతి అన్నీ ఆ సంఘటనతో హరించిపోయాయి.

మాధవ్‍లో మార్పు శారీరకంగా దెబ్బతినడంవల్ల వచ్చింది కాదని, మానసికంగా వచ్చిన మార్పని  నెలరోజులలోనే గుర్తించింది రాధ. ఆస్పత్రినుంచి యింటికివెళ్ళాక  యింకా బలహీనంగా వున్న అతను నెలరోజులు సెలవు పెట్టాడు. రాధ కూడా జరిగిన సంఘటన తను మరిచిపోవడానికే కాక, లోకులు మర్చిపోవడానికి కొంత టైము కావాలని అందరి ఎదుటపడి, అందరి చూపులు, అందరి ప్రశ్నలు, సానుభూతి తట్టుకోవడం కష్టం అని రాధకూడా సెలవు పెట్టింది. రాధ సెలవు పెట్టకముందు మాధవే “కాలేజీకి సెలవుపెట్టు కొన్నాళ్ళు” అన్నాడు గంభీరంగా. రాధ జవాబివ్వకముందే “ఛా! ఈ గోలతో యింక అందరిమొహం యెలా చూడాలో అర్ధం కావడంలేదు” గొణిగాడు.

రాధ దెబ్బతిన్నట్టు చూసింది. అలాకాక “సెలవు పెట్టు రాధా, నీకు, నాకు, శారీరకంగా, మానసికంగా విశ్రాంతి కావాలి” అంటే ఎంతో సంతోషించేది. ప్రతిమాటలో తనదే నేరం అన్నట్టు మాట్లాడుతున్న మాధవ్ ధోరణికి కుమిలిపోసాగింది రాధ.

ఆఖరికి యిరవైరోజుల తరువాత వుండబట్టలేక అతని గుండెలమీద తల ఆన్చి “మాధవ్… ఎందుకు…ఎందుకిలా మారిపోతున్నావు…నేనేం పాపం చేశానని, నా అపరాథం ఏమిటి మాధవ్…యిందులో నా నేరం ఏముందని ఆ రోజునించి నన్నిలా శిక్షిస్తున్నావు” అతన్ని చుట్టేసి బావురుమంది.

ఆ ఇరవైరోజులుగా మాధవ్  రాధని చేతితో కూడా తాకలేదు. ఇదివరకు ప్రతి చిన్నపనికి రాధా రాధా అంటూ పిలిచే మాధవ్ యిప్పుడు రాధంతట రాధ వచ్చి చేసేవరకు పిలవడు లేదా తనే చేసుకుంటున్నాడు. చెయ్యి విరిగింది కనక స్నానానికి, బట్టలు మార్చుకోవడానికి రాధమీద ఆధారపడక తప్పలేదు. ప్రతిక్షణం వెంట వెంట తిరుగుతూ ఏదో కబుర్లు చెపుతూ నవ్విస్తూ పసిపిల్లాడిలా తిరిగే మాధవ్ యిప్పుడు యిరవైనాలుగ్గంటలూ పక్కమీదే గడుపు తున్నాడు. పుస్తకం చదువుతూ మధ్య మధ్య అన్యమనస్కుడై అలా గుండెలమీద పుస్తకం పెట్టుకుని నిద్రపోతాడు. ట్రాన్సిస్టర్ పక్కమీద పెట్టుకుని మాట పలుకు లేకుండా అలా వుండిపోతాడు. ఆ యింటి ఆనందమే లోపించింది. నవ్వులే కరువయ్యాయి. రాధ పల్కరించితే జవాబు చెపుతాడు. ఏదన్నా చెపుతూంటే ఊ కొడ్తూంటాడు. అప్పుడ ప్పుడు రాధని పట్టి పట్టి చూస్తూంటాడు. ఇంటికెవరన్నా వస్తే అతని ముఖకవళికలు పూర్తిగా మారిపోతాయి. నిస్తేజంగా, నిర్లిప్తంగా వుండిపోయిన అతన్ని చూస్తూ బలహీనంగా వున్నాడని కొన్నాళ్ళు సరిపెట్టుకుంది. శక్తి పుంజుకున్నాకా అతని ధోరణి మారకపోవడం గుర్తించి అతనిలో మార్పుకి కారణం గ్రహించింది.

“మాధవ్! మాట్లాడు మాధవ్. నీవెందుకిలా అయిపోతున్నావు…కారణం చెప్పు మాధవ్…” విలపిస్తూ అడిగింది.

మాధవ్ ఒక్క క్షణం తడబడ్డాడు. నవ్వడానికి ప్రయత్నిస్తూ “ఎలా అయిపోయాను? అంత గండం గడిచి బయటపడ్దాను…నీరసం అదీ యింకా తగ్గలేదు…” అన్నాడు కుంటి సంజాయిషీ యిస్తూ.

“ఉహు..అదికాదు. నిజం చెప్పు. ఆ మాత్రం గ్రహించలేని వెర్రిదాన్నికాదు. ఎవరో చేసిందానికి నన్ను దోషినిచేసి యిలా దూరంగా వుంచుతావా, నీ ప్రేమ, అనురాగం అంతా ఏమయిపోయింది…చెప్పు మాధవ్…నన్నెందుకిలా చిత్రహింస పెడ్తున్నావు”.

మాధవ్ ఆమె చూపులని ఎదుర్కోలేనివాడిలా కళ్ళు వాల్చుకున్నాడు. “ప్లీజ్ రాధా…ఆ షాక్‍నించి నేనింకా తేరుకోలేదు. నన్నిలా కొన్నాళ్ళు వదిలెయ్ రాధా… కళ్ళు మూసినా, తెరిచినా ఆ దృశ్యమే కనపడుతూంటే…నన్నేం చెయ్యమంటావు చెప్పు…నన్నర్ధం చేసుకో రాధా”.

రాధ అతని గుండెలమీదనించి చివ్వున తలెత్తింది. “మాధవ్, అయితే నా శరీరం మీదనే నీ ప్రేమన్నమాట- నా మనసు నీ కక్కరలేదన్నమాట… నా మనసులోని పవిత్రత, నా ప్రేమ, నా అనురాగం వాటన్నిటికంటే నా దేహమే నీకు ముఖ్యం అన్నమాట. దేహం మలినపడింది కనక నన్ను దూరం చేస్తున్నావన్నమాట. మాధ! మనసా, వాచా నిన్నే ప్రేమించి నా మనసు, తనువు అర్పించాను. ప్రేమిస్తున్నాను. ఆరాధిస్తున్నాను, నీవే దేముడివి అనుకున్నాను. నిన్ను తప్ప నా మనసులోకి మరొకరిని రానీయలేదు. నా ప్రమేయం లేకుందా నా శరీరం అపవిత్రం అయితే దానికిలా శిక్షిస్తావా”  గాయపడిన మనసుతో రోషంగా అంది.

“నీ తప్పుందని అనడంలేదు రాధా.. ప్లీజ్..నేను చెప్పలేను. ..నన్నర్ధం చేసుకోవడానికి ప్రయత్నించి నాకు టైమియ్యి…అంతకంటే నేనేం చెప్పలేను…” మాధవ్ మొహం తిప్పుకుంటూ అన్నాడు.

రాధ దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడుతూ …”మాధవ్..నీవూ ఈ పుణ్యదేశంలో పుట్టిన పురుషుడివే కదూ- మర్చిపోయాను ఆ మాట. ఆడదానికి ప్రాణంకంటే శీలం ముఖ్యం అనేవాళ్ళల్లో నీవూ ఒక్కడివే కదూ! ఆ శీలం పోయిన ఆడది అపవిత్రురాలు, కుక్కముట్టిన కుండ అవుతుంది కదూ?  నా ప్రాణం, నా ప్రేమకంటే నా శీలం నీకు ముఖ్యం. ఆ శీలం పోయిన నన్ను ముట్టుకోవాలన్నా కంపరంగా వుందికదూ? అవును నా భర్తవి….పాపం శీలం పోయిన భార్యతో కాపురం ఎలా చేస్తావు? ఆమెని అంటితే నీవూ అపవిత్రం అయిపోతావు. వద్దు…వద్దు… నన్ను ముట్టుకోవద్దు…ఈ కుక్కముట్టిన కుండని ముట్టుకుని మైలపడి నీ జాతి పోగొట్టుకోకు…మీ మగాళ్ళు పదిమందితో తిరిగితే అంటని అపవిత్రత…ఎవరో యిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అన్యాయం చేసినా ఆ స్త్రీ అపవిత్రురాలేగా..” రాధ పిచ్చిదానిలా రుధ్ధమైన కంఠంతో ఆవేశంతో వణికిపోతూ అంటూ ఏడ్చింది.

“రాధా..” మాధవ్ ఆరాటంగా ఏదో అనబోయాడు.

“వద్దు. నాకింకేం చెప్పకు. నాకర్ధం అయింది నీ సంగతి. అయిపోయింది. నా అదృష్టానికి ఆఖరిరోజు ఆ రోజే అయింది. నా అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని గర్వపడ్డాను. ఆ గర్వం భగవంతుడిలా అణిచాడు. అయిపోయింది. నా అందమైన కల చెదిరిపోయింది. ఈ రాధ నీకింక అవసరంలేదు. కాని మాధవ్ లేని రాధ పిచ్చిదవుతుంది.” నిజంగా పిచ్చిదానిలా ఏడుస్తూ పక్కగదిలోకి పరిగెత్తి తలుపులు వేసుకుని పక్కమీద పడుకుని తనివితీరా ఏడ్చింది.

మాధవ్ దోషిలా తల వాల్చుకుని ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు.

ఆ రోజునించి రాధ చాలా ముభావంగా…తన పనులు తను చేసుకుంటూ మాటలు మర్చిపోయినదానిలా- మతిపోయినదానిలా తిరగసాగింది యింట్లో. మాధవ్‍కి  ఏ ఏ వేళలకి అవి అన్నీ అమర్చేది – వంట చేసేది. వడ్డన చేసేది. ఖాళీటైముంటే అలా ఏ పుస్తకమో చదవడానికి ప్రయత్నించేది. లేదంటే అలా శూన్యంలోకి చూస్తూ పడుకునేది.

ఆ యింట్లో వినిపించేది శారద గొంతే. “అక్కయ్యా, ఏమిటలా పడుకుంటావు…మాట్లాడక్కయ్యా..పేకాడుదాం రా అక్కయ్యా, సినిమాకి వెడదాం” అంటూ వేధిస్తూ వెంట తిరిగేది.

ఆ శ్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఇంట్లో శారదకూడా లేకపోతే నిజంగా రాధకి పిచ్చి ఎక్కేదే! మనసులో ఏ కల్మషం లేకుండా తనవాడు అనుకున్న మాధవ్ తనని వెలేసినా, ఎవరో అయిన శారద తోడబుట్టినదానిలా తనకోసం ఆరాటపడుతూంటే రాధ ఆమె అభిమానానికి చలించింది. రాధ, మాధవ్ ఆస్పత్రినించి యింటికి వచ్చాక..రాధని చూస్తూనే శారద పరిగెత్తినట్టే వచ్చి రాధని చుట్టేసి అమాయకంగా “అక్కయ్యా నీకు ‘మానభంగం’ జరిగిందటకదా- పేపర్లో పడిందక్కయ్యా…ఆస్పత్రికి వెడ్తానంటే అమ్మ వద్దందక్కయ్యా..” అంది.

రాధ మొహం నల్లబడింది. మాధవ్ తలతిప్పుకుని లోపలికి వెళ్ళాడు. పార్వతమ్మ “ఇదో పిచ్చిమొహందమ్మా…ఆస్పత్రికెడతానని ఒకటేగోల. అక్కడికెందుకు, దీని నోరు తిన్ననయింది కాదుగదా…పిచ్చిమొహం మానభంగం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏమనుకోకమ్మా దాని మాటలకి” అందావిడ రాధని జాలిగా చూస్తూ.

ఆ మాత్రం సానుభూతి ఆవిడ చూపగానే “పిన్నిగారూ…చూశారా, ఎంతపని జరిగిందో” అంది ఆవిడ భుజంమీద తల ఆన్చి కన్నీరు కారుస్తూ.

“అయ్యో పిచ్చిపిల్లా…ఇప్పుడే జరిగింది? ఛా…ఏడవకు. అయిందేదో అయింది. మాధవ్ మంచివాడు…నీకు వచ్చే లోటు ఏం వుండదు. ఎవరో వెధవలు ఏదో చేస్తే ఏడుస్తారా” అంటూ ఓదార్చింది.

తల్లిలా ఓదార్చిన పార్వతమ్మని చూసి, పాతకాలపుదైనా ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది. పార్వతమ్మ అన్నట్టు, అనుకున్నట్టు ఆవిడ చూపిన సంస్కారం మాత్రం కూడా ఆధునికుడు అనుకున్న మాధవ్ చూపలేకపోయాడని రాధ బాధ. ఎంతైనా మాధవ్ తన భర్త. తమ మధ్య పొరపొచ్చాలు బయట లోకానికి తెలిస్తే తన బతుకు అందరిలో మరింత లోకువ అవుతుందని ఎవరన్నా వచ్చినప్పుడు నవ్వు మొహంమీద  పులుముకుని మాట్లాడేది. ఆ సంఘటన తమమీద ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పాలని తాపత్రయపడేది. పైవాళ్ళ దగ్గిర దాచగల్గినా యింట్లో మాదిరి తిరిగే పార్వతమ్మ దగ్గిర ఎలా దాచకలదు? అందులో శారద అనుక్షణం తనచుట్టు తిరుగుతూ, తను మాట్లాడడంలేదని, మాధవ్ తనూ మాట్లాడుకోవడంలేదని, ఎప్పుడూ విచారంగా పడుకుంటూందని తల్లికి చెప్పేది. పార్వతమ్మకీ వాళ్ళిద్దరి వరస అనుమానం వచ్చినా అడగలేక వూరుకుంది. ఆఖరికింక ఆగలేక, రాధ మ్లానమైన ముఖం చూడలేక “ఏమిటమ్మా రాధా…మాధవ్ యిలా మారిపోతాడని అనుకోలేదమ్మా…ఎంతో మంచివాడు, సహృదయుడు, ప్రేమించి పెళ్ళాడాడు…ఇంతమాత్రానికే నిన్నిలా…”

“నా దురదృష్టం పిన్నిగారూ! దౌర్భాగ్యురాలిని అందలం ఎక్కించాలన్నా జరగదు. పుట్టుకతోనే దురదృష్టం నన్నంటే వుంది.  ఏదో ఏనాడో చేసిన చిన్న పుణ్యంవల్ల రెండేళ్ళు కలలాగా మంచిరోజులు వచ్చాయి. వెళ్ళిపోయాయి. నా దురదృష్టం నన్ను వరించింది, మళ్ళీ”  ఏడ్చింది రాధ.

ఆవిడ కరిగిపోయింది. “ఛీ…ఛీ.. ఈ మగజాతి యింతేనమ్మా…వాళ్ళకి కావల్సింది మన శరీరం తప్ప మనసుకాదు. వాళ్ళెన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళని మనమేం అనకూడదు. అది తప్పేకాదు వాళ్ళకి. …కాని మనం చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాలి. ..వుండు మాధవ్‍ని అడుగుతాను. ఇదేం అన్యాయం”

“వద్దుపిన్నిగారూ…లాభంలేదు- ఆయన మనసు కావాలి నాకు, ఆయన దేహంకాదు. ఆయన మనసు యింక నామీద లేదు. ప్రేమ, అనురాగంలేని దాంపత్యం కోసం అలమటించడంలేదు. బలవంతాన యిద్దరం ఏం పొందగలం..కానీండి.  ఆయనన్నట్టు కొన్నాళ్ళుపోతే జరిగింది మర్చిపోగలిగితే…మళ్ళీ…మళ్ళీ నా జీవితం చిగురించవచ్చు. యిది మా యిద్దరిమధ్యనే వుండాల్సిన విషయం…ఇంకోరు కలగచేసుకుంటే…బాగుండదు” వారించింది రాధ.

ఈ నెలా పదిరోజులలో రాధ మనసు దెబ్బతిని గట్టిపడింది. ఆమెలో మాధవ్ మారినతీరు చూశాక ఏదో విరక్తి, నిర్లిప్తత చోటు చేసుకుంది.  మాధవ్ ఆమెను చూసి గిల్టీగా ఫీలవసాగాడు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించితే రాధ అడిగిన దానికి జవాబు చెప్పి వూరుకునేది. మాటలు ముందుకి జరిగేవికాదు. యింకేం మాట్లాడాలో తెలియక మాధవ్ మౌనం వహించేవాడు. మాట పలుకులేకుండా తనని సాధిస్తూందన్న ఉక్రోషం వచ్చింది ఓ రోజు మాధవ్‍కి.

“రాధా, ఏమిటిది…నేనేదో హంతకుడినన్నట్టు నన్నెందుకిలా ఎవాయిడ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నావు? ఏదో నేరం చేసినట్లు నన్నెందుకిలా చూస్తున్నావు? మాటా పలుకూ లేకుండా ఎవరిని సాధించాలని నీ ఉద్దేశం?” తీక్షణంగా అడిగాడు.

వెడుతున్న రాధ గిరుక్కున తిరిగి సూటిగా అతని కళ్ళలోకి చూసింది.

“ఎవరు ఎవరిని ఎవాయిడ్ చేస్తున్నారో నేను మళ్ళీ చెప్పాలా? నన్ను చూస్తే మీకు కంటగింపుగా, నా గాలిసోకితే చీదరింపుగా…నా స్పర్శ సోకితే కుష్టురోగి అంటినట్టు జుగుప్సగా ఉంది. అవన్నీ మీ మొహంమీదే కనిపిస్తున్నా మీ దగ్గిర కూర్చుని నవ్వుతూ మాట్లాడాలి. మీరెలా చూసినా సంతోషంగా యింట్లో తిరగాలి. మీరు దయతలచి నన్నింట్లో వుండనిచ్చినందుకే కృతజ్ఞత చూపించి ఆనందించాలి? అవునా, హు…కానీ…నాకు ఓ మనసుందండీ, నన్నసహ్యించుకుంటున్నారని తెలిసి ఎలా మీ చేరువవనండీ” మాట్లాడితే ముందుగా రాధకి గొంతు నిండుకొచ్చి కన్నీరు కారిపోతోందీమధ్య.

“అంటే…సెక్స్…సెక్స్ ఒక్కటే నీకు కావాలన్నమాట…అది లేదని నీవు ఏదో కొంపమునిగినట్లు ప్రవర్తిస్తున్నావా…మనిద్దరిమధ్య వున్న సంబంధం దానితో ముడిపడి వుందా?” తనని సమర్ధించుకుంటూ అన్నాడు.

రాధ చిత్రంగా చూసింది. అదోలా నవ్వింది. “నేననవలసిన మాట మీరంటున్నారు మాధవ్, సెక్స్ అన్నది మీ మగవాళ్ళకి ముఖ్యంగాని మాకుకాదు.  ప్రేమ లేకపోయినా సెక్స్‍ని ఆనందించగలడు పురుషుడు. స్త్రీ అలా కాదు, ప్రేమలేని సెక్స్ నరకం స్త్రీకి. మాధవ్…నీ ప్రేమలేని నీతో సెక్స్ నాకు నరకం. అలాంటి నేను దానికోసం బాధపడ్తు న్నానని ఎలా అనగల్గుతున్నావు.  మాధవ్… ఒక్కసారి దగ్గిరకి తీసుకుని లాలించావా, ఒక్కసారి నీ వడిలోకి నన్ను తీసుకుని ఓదార్చావా? రాధా – నాకు కావల్సింది నీవు…నీ మనసు, నీ ప్రేమకాని నీ శరీరంకాదు, బాధపడకు అని నా కన్నీరు వత్తావా? నీ ఓదార్పుకోసం, సానుభూతికోసం పరితపించే నాకు నీవు ఏం యిచ్చావు మాధవ్…నన్ను దూరం చేశావు. నా ఉనికిని విస్మరించావు. నన్ను అసహ్యించుకుంటున్నావు. ..మీ పురుషులకి ఎంతో ముఖ్యమైన సెక్స్‍కి కూడా దూరమైనావంటే నా పట్ల నీకెంత అసహ్యం ఏర్పడిందో ఊహించలేనా, యింకా నన్నెలా సంతోషంగా వుండమన్నావు!” వణుకుతున్న గొంతుతో అంది.

“రాధా… నీవు ఎంతసేపు నీగురించే ఆలోచిస్తావు. కట్టుకున్న భార్యని, అలా పరాయి పురుషులు నా కళ్ల ఎదుటే అనుభవిస్తుంటే చూసి ఎలా సహించగలడు అని అనుకున్నావా? అదంతా మర్చిపోవడానికి టైము కావాలన్నాను. నా వీక్‍నెస్‍ని అర్ధం చేసుకోలేవేం…కొంతకాలం పోతే…”

“హు…మాధవ్… ఆకలేసినప్పుడు అన్నం పెడితేనే అవతలివారు సంతృప్తి పడతారు. దుఃఖంలో వున్నవారికే సానుభూతి కావాలి. జబ్బుగా వున్నప్పుడే మందు కావాలి. దొంగలు పడ్డాక ఆర్నెల్లకి కుక్క మొరిగిందన్నాట్ట. ఇంకో ఏడాది పోయాక నీ సానుభూతి నాకవసరం వుందదు మాధవ్..ఈలోగా నా మనసు బండబారిపోతుంది. అప్పుడు యింక ఎవరి సానుభూతి నాకక్కరలేదు…దెబ్బలు తినిన శరీరం తరువాత మొద్దుబారిపోతుంది…” వ్యంగ్యంగా అంది రాధ.

“ హు…నీవు పురుషుడవయితే నా బాధ అర్ధమయ్యేది…ఒక మగవాడికి యెలా వుంటుందో నీకేం తెలుస్తుంది..”

రాధ తీరంగా చూసింది. “ఏమిటి తెలియాలి మాధవ్…నీ చేతికి దెబ్బ తగిలితే వైద్యం చేయించుకుని బాగుపరుచుకున్నావు.  నా శరీరంలో ఒక అవయవం బాధకి గురి అయింది. అంతమాత్రాన నన్ను కించపరిచి, అవమానపరిచి, తిరస్కరించాలా? మాధవ్…ఈ పవిత్రత, నీతి అంతా మనసుకి సంబంధించాలిగాని శరీరానికి కాదని చదువుకుని, నవీనుడవైన నీవు నమ్మలేవా?…నీ చదువు, సంస్కారం ఇంతేనా?”

“హు…పెద్ద కబుర్లు చెప్పకు, ఆ డాక్టరు వల్లించిన మాటలు మాట్లాడినంతమాత్రాన పెద్ద అభ్యుదయం వచ్చినట్లు అనుకోకు. తమదాక రానంతవరకు అంతా పెద్దకబుర్లు చెపుతారు. అదే ఆవిడకో, ఆవిడ కూతురికో అయితే యిలా తేలిగ్గా మాట్లాడగలదా!”తీవ్రంగా ఎత్తి పొడిచాడు.

అలా ఆ వాదనని పొడిగించడంవల్ల వరిగేదేం లేదని రాధకి అర్ధం అయింది. కాలం ఒక్కటే గాయాన్ని మాన్చగలదు. కాలం ఒక్కటే దుఃఖాన్ని మరిపించగలదు! మాధవ్ అన్నట్టు ఆ కాలమే తమిద్దరినీ మళ్ళీ చేర్చగలదన్న ఆశతో బతకడంతప్ప చేయగల్గింది ఏమీ లేదని రాధకి అర్ధం అయింది.

మినుకుమినుకుమనే రాధ ఆశ విధి వీయించిన గాలికి ఆరిపోయింది!! రాధ నెలతప్పింది.

ఆరోజు కాలేజీలో పాఠం చెప్తూ మొహం తిరిగి పడిపోయింది రాధ. అప్పటికే గత పదిహేనురోజులుగా రాధ ఆరోగ్యం బొత్తిగా పాడయింది. ఆమె తన ఆదుర్దాలో, అలజడి, అశాంతి, ఆవేదన మధ్య మనసు సరిగాలేని ఆ స్థితిలో పీరియడ్స్ ఆలస్యం అయిందన్న సంగతి గుర్తించలేదు. పదిరోజులుగా ఏదో వికారంగా తిండి సయించకుండా వుంటే మనసుకి శాంతిలేక వ్యథతో నలిగిపోవడంవల్ల యిదంతా అనుకుంది. తిండి సయించదు, ఒకటే నీరసం, దానికి తోడు పని, కాలేజీకి వెళ్ళడం, మాధవ్‍తో విభేదం అన్నీ కల్సి శారీరకంగా, మానసికంగా రాధమీద పనిచేసి రాధ చిక్కిశల్యమైంది. కళ్ళకింద నల్లచారలు, బుగ్గలు పాలిపోయి రాధ శవాకారంలా తయారయింది. ఆ సంగతన్నా గుర్తించలేదు ఆమె. యాంత్రికంగా పనులు చేయడం, కాలేజీకి వెళ్ళి అలవాటుగా పాఠాలు చెప్పడం అంతే! కాలేజీలో విద్యార్థులు సయితం ఆమెని జాలిగా చూసేవారు.

కొలీగ్స్ ఏదో అంటూ సానుభూతి చూపి దయచూపేవారు. ఆ దయ సానుభూతి కూడా భరించడం కష్టమే అని అప్పటికిగాని ఆమెకి తెలిసిరాలేదు. ప్రతివాళ్ళ చూపుల్లో ఏదీ హేళన వున్నట్టు, వాళ్ళ సానుభూతి వెనక వ్యంగ్యం వున్నట్లు అన్పించి రాధ మౌనంగా ఎవరితో మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటూ వుండేది. సరళ చివాట్లుపెట్టి నల్గురిమధ్యకి లాక్కొచ్చేది.

ఆ వాతావరణంకి, ఇంట్లో మాధవ్ నిరాదరణకి యిప్పుడిప్పుడే అలవాటు పడ్తున్న రాధ ఈ వార్త విన్న వెంటనే చకితురాలైంది. ఎదురుచూడని సంఘటన జరిగినట్లు విభ్రాంతి చెందింది. డాక్టరు అనుమానిస్తూ వివరాలు అడగగానే, అప్పటికిగాని తను పీరియడ్స్ మిస్ అయినట్లు గమనించలేదు. తనున్న స్థితిలో ఆ వార్తకి సంతోషించాలో లేదో అర్ధం కాలేదు. ఆమె హృదయం ఒక్కక్షణం లయ తప్పింది.

గత రెండేళ్ళుగా, అందులో మరీ ఏడాదిగా పసిపాపకోసం కలవరించే రాధ అకస్మాత్తుగా అనుకోని సమయంలో ఆ వార్త విని తడబడిపోయింది. మాధవ్…మాధవ్. ఏమంటాడో.. సంతోషించడూ అతనుమాత్రం…పోనీ..ఈ బిడ్డ తమిద్దరిమధ్య వారధి అయితే, యీకారణంగానన్నా మాధవ్ చేరువైతే యింకేం కావాలి తనకు!…ఆ ఆలోచనలతో ఆమె మొహం విప్పారింది. కళ్ళలో సంతోషం కదలాడింది.  “థాంక్స్ డాక్టర్” అంటూ బయటికి వచ్చింది. బయట వరండాలో మాధవ్ కూర్చున్నాడు. రాధ బయటికి రాగానే ఆతృతగా చూశాడు.  చాలారోజుల తరువాత రాధ మొహం కళకళలాడుతూ కన్పించింది. మాధవ్ ఏమిటన్నట్లు ఆరాటంగా చూశాడు.

“పదండి, చెప్తా…యింటికి పదండి” అంది.

“డాక్టర్ ఏమంది?” స్కూటర్‍మీద వెడ్తూండగా మళ్ళీ అడిగాడు.

“ఎందుకంత గాభరా…కంగారేం లేదు..” అంది నవ్వుతూ రాధ.

మాధవ్‍కి ఏదో అర్ధమైనట్లయింది. “మాధవ్..” చాలారోజుల తర్వాత నోరారా పిలిచింది రాధ.

ఇంటికెళ్ళి తలుపుతీసి బెడ్రూములోకి వెళ్ళగానే “మాధవ్…మనం ఇన్నాళ్ళుగా కావాలని పరితపించిన కోరిక తీరింది. మాధవ్…నాకు చాలా సంతోషంగా వుంది…నీకేమనిపిస్తూంది మాధవ్..” అంటూ అతని మొహం చూసి ఆగిపోయింది. “మాధవ్” అంది కంపిస్తున్న గొంతుతో నల్లబడిన అతని మొహం చూసి.

“మైగాడ్” అన్నాడు మాధవ్. ఆఖరికి నోరు పెగుల్చుకుని “నిజమా…ఇది..ఇది..వాళ్ళు…చేసిన…”

“మాధవ్…ఏమిటి… ఏమిటంటున్నావు?” అతని భావం అర్ధం అయి భయవిహ్వలయి అంది కళ్ళు పెద్దవిచేసి. అప్పటివరకు ఆ ఆలోచనే తట్టని ఆమె ఒక్కసారిగా వణికిపోయింది.

మాధవ్ మొహం కూడా మలినమైంది. అతనికి వచ్చిన ఊహ సరిఅయినదే అని ఎందుకో అన్పించింది.

ఇద్దరికిద్దరూ ఏం చెప్పాలో తెలియక అలా కొద్ది క్షణాలుండిపోయారు. రాధ ఉత్సాహం అంతా ఎవరో మంత్రించినట్లు ఎగిరిపోయింది. “మాధవ్…కాదు మాధవ్…దయచేసి అలా అనకు.  నా సంతోషాన్ని నాశనం చెయ్యకు. నాకు మిగిలే ఈ సంతోషాన్ని దూరం చెయ్యకు. అలా అనకు. దయచేసి ఆ పీడకల నేను మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చెయ్యకు..”గద్గదకంఠంతో అంటూ చేతులు జోడించింది.

“హు..నీవు మర్చిపోయినా ఆ దేముడు నిన్ను, నన్ను మర్చిపోకుండా చెయ్యాలనే ఇలా చేశాడు. అనుక్షణం ఆ పాపం, ఆ అవమానం మన కళ్ళముందు నిలవాలనే ఇలా శిక్షించాడు. రాధా…వద్దు…నేను భరించలేను…ఆ బిడ్డ మనదికాదు..పద డాక్టరు దగ్గిరకి వెడదాం…శాశ్వతంగా నిలిచిపోయే మచ్చని మొదట్లోనే తుడిచేయాలి” గంభీరంగా అన్నాడు.

“మాధవ్” రాధ దెబ్బతిన్నట్టు చూసింది. గిలగిలలాడుతూ “మాధవ్, ఏమిటంటున్నావు…తీరక తీరక కోరిక తీరుతూంటే యిప్పుడు యిలా మాట్లాడుతున్నావేమిటి?”

“రాధా…నీకెలా చెప్పాలి… ఆ బిడ్డ  మనదికాదు. ఎవరో రౌడీవెధవల పాపఫలం మోస్తావు నీవు..ఆ బిడ్డని కంటావా?” తీవ్రంగా అడిగాడు.

“ ఆ బిడ్డ నీది కాదని నీకెలా తెలుసు?” రాధ కఠినంగా అడిగింది.

“తెలుసు అంతే. సిక్స్త్‍సెన్స్ లాంటిది చెపుతూంది. గత ఏడాదిగా మనం ఎంత కావాలనుకున్నా కలగనిది ఇప్పుడింత హఠాత్తుగా ఎలా అయింది? అందులో…గుర్తు తెచ్చుకో…ఈ సంఘటనకి ముందు అసలు మనం ఎన్నిసార్లు …లేదు రాధా…నాకు తెలుసు…ఇది నా బిడ్డకాదు. =..వద్దు రాధా…ఈ ఊహే కంపరంగా వుంది…మరొక్క క్షణం భరించలేను…పద డాక్టరు దగ్గిరకి…’

“ఒకవేళ మన బిడ్డే అయితే…చేతులారా చంపుతారా…వద్దు మాధవ్…అలా ఆలోచించకు…ఈ పాపంకూడా చెయ్యమంటావా నన్ను”

“రాధా..” తీక్షణంగా అన్నాడు మాధవ్. “ఎవరి బిడ్దనో కనే ఔదార్యం నీకుందేమోగాని, ఆ బిడ్డకి తండ్రిగా చలామణి అయి, కళ్ళెదుట అనుక్షణం ఆ నరకం భరించే శక్తి లేదు నాకు”.

“మాధవ్…దేముడంత  క్రూరుడు కాదు. నాకింకా అన్యాయం చెయ్యడు. నాకు చేసిన ద్రోహానికి ప్రతిగా ఈ వరం యిచ్చాడు. నే నీ పని చెయ్యలేను మాధవ్…నాకీ బిడ్డ కావాలి మాధవ్…సారం చచ్చిపోయిన ఈ వంటరి జీవితంలో ఆ బిడ్డ తోడైన నాకు మిగలనీ మాధవ్..” దీనంగా అంది.

“ఈ జరిగిన అవమానం చాలక ఆ వెధవలకి పుట్టిన బిడ్డని కని నన్నీ లోకంలో తలెత్తుకోనీయవా…నాకంటే…ఎవడికో పుట్టే బిడ్డే నీకు ఎక్కువా?” కసిగా అడిగాడు.

రాధ జవాబివ్వలేక తల దించుకుంది. ఒక్కక్షణం ఆలోచించింది. “మాధవ్..నీ కోసం…నీ ప్రేమకోసం నీవు చెప్పిండానికి నాకిష్టం లేకపోయినా అంగీకరిస్తాను. …కాని ఆ తరువాత నీవు నా పూర్వపు మాధవ్ అవగలవా? కోల్పోయిన ఆ ప్రేమ, అనురాగం అందించగలవా? మళ్ళీ మన యింట అనురాగం, ఆనందం వెల్లివిరిస్తాయని మాటిస్తే నీకోసం…ఈ బిడ్డని…చంపుకుంటాను…నీ అనురాగంకోసం బిడ్డని చంపిన పాతకిని అవుతాను. చెప్పు మాధవ్…మాటియ్యగలవా మాధవ్” ఆవేశంగా అంది.

మాధవ్ మొహంలో రంగులు మారాయి. ఆ మారుతున్న రంగులని చూసిన రాధకి మాధవ్…పూర్వపు మాధవ్ అవడం అసంభవమన్పించింది.

“రాధా, నేను చెప్పాను. నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను రాధా…నా వీక్‍నెస్ అర్ధం చేసుకుని ఇంకొన్నాళ్ళు టైము యియ్యి రాధా”.

“హు… నీకోసం బిడ్డని చంపుకోవడానికి తయారైనా, యింకా నా శరీరం మైలపడిందన్న భావం నీలో తొలగిపోవడంలేదు. అంటే… నామీద ఎంత ప్రేమ ఉందో అర్ధం అయింది మాధవ్..యింకా నీకోసం ఈ త్యాగం చెయ్యమంటావా” నిరసనగా చూస్తూ అంది.

మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు. “త్యాగం చేస్తావో ఏం చేస్తావో, ఆ బిడ్దని కనడానికి వీలులేదు”కచ్చితంగా అన్నాడు పౌరుషంగా.

“ఏంచేస్తావు..?” రాధ సహనమూ ఆఖరిమెట్టుకి వచ్చింది.

జవాబుకి మాధవ్ తడబడ్దాడు. అంతదాకా వచ్చాక తగ్గిపోవడం యిష్టంలేక తీవ్రంగా చూస్తూ”నేను కావాలో, ఆ బిడ్డ కావాలో తేల్చుకోమంటాను”

“తేల్చుకున్నాక…” ఏదో తెగింపు వచ్చింది రాధలో.

“రాధా…” అరిచాడు. “ఏం ఎదిరించి జవాబులు చెప్పేదాకా వచ్చిందా. తేల్చుకున్నాక నేను అక్కరలేదంటే యింట్లోంచి వెళ్ళమంటాను…”

రాధ అతనివంక సూటిగా చూసింది. “సరే మాధవ్, నిండా మునిగాక చలిఏమిటి?” ఈ యింట్లో యిప్పుడు నీవు నాకిస్తున్న స్థానం వంటమనిషిది మాత్రమే. నీ భార్యగా లోకానికి చలామణి అవుతున్నాను. మన మధ్య యింకా భార్యాభర్తల సంబంధం ఏం మిగిలిందని, నీ ప్రేమ, అనురాగం ఏం మిగిలాయని ఈ యిల్లు పట్టుకు వేళ్ళాడాలి. నేనెప్పుడూ వంటరిదానిగానే బ్రతికాను, యిప్పుడు మాత్రం వంటరిగా బతకలేనా!” రాధ విరక్తిగా అంది.

మాధవ్ మొహం నల్లబడింది. రాధ యింత తెగించగలదని అతను అనుకోలేదు. బెదిరిస్తే భయపడి తనకోసం ఆ పాపఫలాన్ని దూరం చేసుకుంటుందనుకున్నాడు.  కాని, రాధ వెళ్ళిపోతానంటుంది. రాధ నిజంగా వెళ్ళిపోతే తన పరువు ఏం కావాలి. అందర్ని కాదని ఎదిరించి, ప్రేమించి చేసుకున్న పెళ్ళి యిలా అవుతే అందరూ తనని హేళన చేస్తారు? రాధమీద అత్యాచారం జరిగాక అందరి సానుభూతి రాధమీద వుంది. అంత జరిగినా భార్యని మామూలుగా ఆదరిస్తున్నాడనుకుని అంతా తననో సంస్కారవంతుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు రాధ వెళ్ళిపోతే…తను నలుగురి ముందు దోషి అవుతాడు. భార్యకి మానభంగం జరిగింది కనక యింట్లోంచి వెళ్ళగొట్టాడు అని చెప్పుకుంటూ తన కుసంస్కారాన్ని వేలెత్తి చూపుతారు… ఒక్కక్షణంలో అతని మనసులో మెదిలిన ఆలోచన అది…కలవరపాటు అణిచిపెట్టి…ఆమెముందు తగ్గిపోవడం యిష్టంలేక బింకంగా “సరే, నీకు అంత నిర్లక్ష్యంగా వుంటే అలాగే కాని” అని విసురుగా వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *