May 21, 2024

శుభోదయం – 6

రచన: డి.కామేశ్వరి

 

శుభోదయం-7                                                                        –డి.కామేశ్వరి

రాధ తరువాత వారం రోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ! మాధవ్‍ది కాకపోతే ఆ రౌడీ వెధవల బిడ్డని తను కని పెంచగలదా! … ఏం చెయ్యాలి తను, మాధవ్‍కోసం…యిదివరకయితే మాధవ్ యిలా కోరితే అరక్షణం ఆలోచించకుండా అంగీకరించేది. కాని, మాధవ్ తన నిర్లక్ష్యం, నిరాదరణతో తనలో ఏదో సున్నిత పొరను బలంగా తాకాడు.  తన మనసు కరుడు కట్టింది. ప్రేమంటే యిదేనా? వివాహబంధానికర్ధం యింతేనా? కష్టంలో, సుఖంలో తోడు నీడగా వుంటామని చేసిన ప్రమాణాల విలువ యింతేనా, మనిషి హృదయం యింత చంచలమా, గతం మరిచిపోవడానికి అరక్షణం పట్టదా! …ఆమె మనసుని దొలిచివేసే ఆలోచనలు క్రమంగా ఆమె మనసుని బండ బార్చాయి. ఇప్పుడీ బిడ్డని చంపుకున్నా మాధవ్ తనవాడవుతాడన్న నమ్మకంలేదు. మాధవ్ ద్వారా మళ్ళీ తను తల్లి నవగలనన్న నమ్మకం వుంటే పోనీ అతని కోరికని అంగీకరించగలదు! మాధవ్ ధోరణి కేవలం లోకం కోసం కల్సి వున్నట్లుంది. అలాంటి అతనికోసం తల్లినవాలనే కాంక్ష  బలిపెట్టుకోవాలా?… పరిపరివిధాల ఆలోచించింది.  మాధవ్‍ని కాదని ఈ బిడ్దని కంటే …ఒకవేళ ఆ బిడ్డ ఆ వెధవల బిడ్డ అయితే…కనీసం రూపురేఖలలో తెల్సిపోతుంది ఎవరి బిడ్డో. అప్పుడు ఆ బిడ్డని తను ప్రేమించి పెంచగలదా? ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా బిడ్డని తల్లి ప్రేమించకుండా వుండ లేదంటారు! కన్నకడుపు, పేగుతీపి ఎక్కడికి పోతాయి ఎలా పుట్టినా! …ఎలాంటివాడికి పుట్టినా మంచి పెంపకంలో, పరిసరాలలో వుంటుంది ప్రభావం! పోనీ ఎవడికి పుట్టినా తల్లిగా తను ఆ బిడ్డని తీర్చిదిద్దలేదా! ఇప్పుడీ బిడ్డని చంపు కుంటే యింక ఈ మాధవ్‍ని విడిచి వెళ్ళినా యింకెవడు ముందుకు వస్తాడు పెళ్ళాడడానికి! మాధవ్ ఎప్పటికో మారు తాడన్న ఆశతో ఈ అవకాశాన్ని వదులుకోవడం తెలివి తక్కువ అవదా!

ఎన్నివిధాల ఆలోచించినా గర్భం పోగొట్టుకోడానికి రాధ మనసు ఎదురు తిరుగుతూంది. ఎంత నమ్మించుకోవాలని చూసినా అమె మనసుని నమ్మించుకోలేకపోయింది. దానికితోడు పదిరోజులుగా మాధవ్ అసలు రాధతో మాట్లాడడం మానేశాడు. రాధ అనే మనిషి లేనట్లు తన పనులు తను చేసుకుంటున్నాడు. అసలు యింటిపట్టునే వుండడం మానేశాడు. కాలేజీనుంచి సాయంత్రం యింటికైనా రాకుండా ఎటో వెళ్ళిపోయేవాడు. రాత్రి పది, పదకొండు, పన్నెండు అతనిష్టం వచ్చినట్లు రావడం, ఎక్కడో భోంచేసి రావడం, రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం తొమ్మిదింటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని, టేబిలుమీద రాధ భోజనం వడ్డిస్తే తినేసి వెళ్ళిపోవడం…ఇంటిపట్టున  మెలకువగా వున్న ఒక గంట కూడా రాధతో అసలు మాట్లాడేవాడుకాదు. అతని ప్రవర్తన చూసి రాధ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇన్నాళ్ళూ అటూ ఇటూ వూగిసలాడిన ఆమె కృతనిశ్చయం చేసుకుంది. బిడ్దని కనడానికి నిశ్చయించుకుంది. మాధవ్ మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తి యింట్లోంచి పొమ్మంటే  వెళ్ళడానికి మానసికంగా తయారైంది కూడా. కాని ఆశ్చర్యంగా మాధవ్ తిరిగి ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఆమెని తప్పించుకుని తిరిగాడు. రాధ వేవిళ్ళతో సతమతమవుతున్నా పట్టించుకోలేదు. నీర్సంతో పడుకున్నా, కాలేజీకి సెలవు పెట్టినా కనీసం అడగలేదు. ఆ నీర్సంలో, ఆ వేవిళ్ళలో శారదే యించుమించు పని అంతా చేసి సహాయపడింది.

“అక్కయ్యా నీవు పడుకో. బావగారికి కాఫీ యిస్తాలే, నేను టిఫినుచేసి పెడతాలే” అంటూ అన్ని పనులూ తనే చేసేది శారద.

రాధకూడా మాధవ్ తన ఉనికి భరించలేనట్టు తను కనపడితే మొహం చిట్లించడం, కాఫీ తీసికెళ్ళినా చేతితో అందుకోకపోవడం, భోజనం వడ్డిస్తే విసురుగా తిని వెళ్ళిపోవడం చూసి తను కంటపడితే మరీ అతని ధోరణి విపరీతంగా మారడంతో అతని పనులు అన్నీ శారదమీద వదిలింది.

శారద ముందు మాధవ్‍తో మాట్లాడడానికి సిగ్గుతో మెలికలు తిరిగి, వెకిలినవ్వులు, అక్కరలేని సిగ్గు ప్రదర్శించేది. కాని ఈ రెండేళ్ళలో అతని దగ్గర చనువు ఏర్పడి “బావగారూ” అంటూ బాగానే మాట్లాడేది. ఇప్పుడు మరీ చనువుగా “బావగారూ కాఫీ…” అంటూ గదిలోకి తీసికెళ్ళి అందించేది. “టిఫిను రెడీ..ఇక్కడికి తేనా.. అక్కడికి వస్తారా , “అదేమిటి బావగారూ రాత్రి భోజనానికి రాలేదు, మీ కిష్టం అని కొబ్బరికాయ పచ్చడి చేశాను…” “బావగారూ అక్కకి మందులు అయిపోయాయి తీసుకురండి….” “బావగారూ యిదిగో ఈ లిస్టులో సామాను తెమ్మంది అక్కయ్య…” అంటూ ప్రతిదానికి వారిద్దరిమధ్య వారధి అయింది.

మాధవ్‍కి ఏం కావల్సినా శారదతో చెపుతూ “మీ అక్కయ్యకియ్యి” అంటూ డబ్బివ్వడం…మొత్తనికిద్దరూ శారద మీదే ఆధారపడ్దారు.

రాధకి యిదంతా చూస్తుంటే మనసు దహించుకుపోయేది ఒకోసారి. “వెకిలిపిల్ల, ఆ నవ్వేమిటి, ఆ మాటలేమిటి, అబ్బ ఆ శారదనెందుకు రానిస్తావు” అంటూ విసుక్కునే మాధవ్‍కి యిప్పుడు తను శారదపాటి కాకపోయిందన్నమాట అంటూ బాధపడేది. శారద అతని పనులు చేస్తూ యింట్లో తిరుగుతూంటే తన స్థానం ఆమె లాక్కున్నట్టు స్త్రీ సహజ మైన అసూయతో దహించుకుపోయింది. కాని శారద తప్పేముంది? తామిద్దరూ తమ అవసరంకోసం ఆమెని ఉపయో గించుకుంటున్నారు అని సమాధానపడేది.

తన స్థితి చూసి పార్వతమ్మ విచారించేది. “ఏమిటోనమ్మా, మీ అన్యోన్యం ఆ భగవంతుడు చూడలేకపోయాడు. ఎలా వుండేవారు ఎలా అయ్యారు, ఏమిటమ్మా యిద్దరికిద్దరూ యిలా పంతాలు పట్టుకుంటే ఎలా తల్లీ, ఆడదానివి నీవే దిగి రావాలమ్మా” అని మందలించేది.

“నన్నేం చెయ్యమంటారు పిన్నిగారూ, నన్ను చూస్తేనే చీదరించుకుంటూంటే ఎలా దగ్గిరకి వెళ్ళమన్నారు. నేను వెడితే అన్నం కూడా సరిగా తినడంలేదు. పోనీ శారద పెడితేనన్నా కడుపునిండా తింటున్నారు. నన్నేం చెయ్యమంటారు చెప్పండి…” ఆవేదనగా అంటుండగా అమె  కళ్ళు చెమర్చాయి.

“ఏమిటో, ఆ అబ్బాయి ఇలా వుంటే రేపింక నీవు ఆ బిడ్దని ఎలా పెంచుతావో నాకర్ధంకాదు. మగాడికిష్టం లేని పనిచేసి వాళ్ళతో మనం చావలేం అమ్మా…అతనన్న మాటే కానీయాల్సింది, అనవసరంగా యింత గొడవ జరిగేది కాదు…” అందావిడ బాధగా.

“మీకు తెలియదు పిన్నిగారూ, నేను నెల తప్పకముందూ ఆయన మామూలుగా లేరు….ఎటొచ్చి అప్పుడు కనీసం కాస్త మాట్లాడేవారు. ఇప్పుడదీ లేదు. కానీండి, ఎన్నాళ్ళు సాధిస్తారో సాధించనీయండి. ఆడదాన్ని ఏం చెయ్యలేనని గదూ ఆయన ధీమా, ఏం చేసినా సహించి పడుండాలని గాదూ ఆయనిలా నన్ను హింసిస్తున్నారు…నా తప్పు లేకపోయినా నన్ను దూరం చేశారు పిన్నిగారూ…నా మనసు విరిగిపోయింది యింక…” రుధ్ధ కంఠంతో అంది.

“ఏమోనమ్మా, నాకు ఏదో భయంగా ఉంది…రేపు పురుడొచ్చాక…ఖర్మకాలి…ఆ బిడ్డ…తన పోలికలు లేక తన బిడ్డ కాదని తెల్సుకుంటే ఏం చేస్తాడో…అప్పుడింక అసలు…”

“ఏం చేస్తారు? మహా అయితే యింట్లోంచి పొమ్మంటారు. కానీండి, ఏదో నా బతుకు నేను బతికే ఆధారం వుంది…ఎంతకని అనుక్షణం భయపడుతూ బతుకుతాను. నాకూ తెగింపు వచ్చింది. యిప్పుడయినా ఆయనిష్టం అయి వుండనిస్తున్నారా? లోకంకోసం, పెళ్ళాన్ని యింట్లోంఛి తరిమారని దుయ్యబడతారని చూసి చూడనట్లూరుకున్నారు. మీరూ చూశారుగా యింటికెవరన్నా వస్తే ఎంతలా నటిస్తూ మామూలుగా మాట్లాడుతున్నారో… ఆయనకు నేను నా బాధ కాదు ముఖ్యం. ఆయన పరువు, ప్రతిష్ట ముఖ్యం” నిట్టూరుస్తూ అంది రాధ.

“ఈడొచ్చిన పిల్ల…శారద అలా అస్తమానం అతనివెంట తిరుగుతూంటే…ఏం బావుంటుంది? చూసేవాళ్ళు ఏం అనుకుంటారు? అదో పిచ్చిమొద్దు, చెప్పినా వినిపించుకోదు. బావగారు…బావగారు…అంటూ తిరుగుతూంది”

“ పిన్నిగారూ, శారద నా చెల్లెలులాంటిది. నేనింట్లో వుండగా ఎవరేం అంటారు. శారదకూడా లేకపోతే ఈ సమయంలో పిచ్చెత్తి పోయేదాన్ని…మూగిదాన్ని అయిపోయేదాన్ని…నిజంగా నా వంట్లో బాగులేనందుకు ఎంత సహాయం చేస్తూందో…నేను చూసుకుంటున్నాను శారదని. మీరేం భయపడకండి” అంది నిబ్బరంగా రాధ.

రాధ తను చూసుకుంటానని నిబ్బరంగా చెప్పింది కాని తాను  చూడకుండా, తనకి తెలియకుండా చాలా జరుగుతూందని ఎన్నాళ్ళకోగాని గుర్తించలేకపోయింది.

మాధవ్, శారదలు చాలా దూరం వెళ్ళినట్టు ఎన్నిరోజులకో గమనించింది.  ఎన్నోసార్లు కాలేజీ నుంచి  ఒక్కోరోజు ఆలస్యంగా వచ్చేసరికి మాధవ్ అప్పటికే యింటికి వచ్చి వుండేవాడు. శారద కాఫీ కాస్తుంటే ఆమె వెనకాల వంటింట్లో ఏదో అంటూ నవ్వుతున్నాడు. మరోసారి  ఇద్దరూ మంచం మీద కూర్చుని పేకాడుతున్నారు.

ఇలా తను యింటికి వచ్చేసరికి శారద, మాధవ్ యింట్లో వున్నా రాధ ఎన్నడూ అనుమానించలేదు. రాధని చూస్తూనే నిష్కల్మషంగా “అక్కయ్యా వచ్చేసావూ…నీవు యింకా రాలేదని మేం కాఫీ తాగుతున్నాం…అక్కయ్యా , నీవూరా ఆడుకుందాం…అక్కయ్యా, బావగారికివాళ పకోడీలు తినాలని వుందంటే చేశాను, బలే వున్నాయంటున్నారు” అంటూ అమాయకంగా  చెప్పే శారదలో మాలిన్యం వుంటుందని ఎన్నడూ అనుకోలేదు. అలా వాళ్ళిద్దరిని చూసిన ఒక్క క్షణం ఆమె మనసు అసూయతో జలించేది….నవ్వుతూ  శారదతో మాట్లాడే మాధవ్ తను రాగానే మొహం ముడుచుకోవడం చూసి మనసు మూలిగేది గాని అనుమానపడేదికాదు. శారద పిచ్చిది. ఎప్పుడూ యింతే, మంచీ చెడ్డా తెలీదు. అలాంటి పిల్లమీద అనుమానం ఏమిటి అనుకునేది.

శారద అమాయకురాలే కావచ్చు. శారదలో మాలిన్యం లేకపోవచ్చు…కాని…మాధవ్ పురుషుడన్న విషయం రాధ మరిచిపోయింది. అందులో సంసార సుఖానికి దూరమైవున్న మగవాడు అన్న విషయం రాధ విస్మరించింది. ఈ తొమ్మిది నెలల్లో శారద, మాధవ్ యిద్దరూ కాకూడనంత దగ్గిరయ్యారు. కాదు, శారదకి దగ్గిర అయ్యాడు మాధవ్. మంచి మాటలతో, తీపి మాటలతో శారదకు చేరువయ్యాడు.

మాధవ్‍కి మొదట్లో శారదంటే చికాకు, ఆ వెకిలిమాటలంటే విసుగు, సాధ్యమైనంత ఎవాయిడ్  చేసేవాడు. కాని, రెండేళ్ళలొ ఆమె అమాయకత్వం, అభిమానం చూసి పాపం పిచ్చిది అనుకునేవాడు. రాధ దూరమైనకొద్దీ శారద చేరువయింది. మొదట్లో ఏదో యింట్లో తిరిగే అమ్మాయి అన్నట్టు  కాఫీ, టిఫిను తెచ్చి యిచ్చినప్పుడు తినడం తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కాని, అతను మగవాడు…నిండు యవ్వనంలో వున్నవాడు. భార్యకి దూరమై కోరికలతో సతమతమవుతున్న సమయంలో శారద చూపే అభిమానం, చనువు అతనికెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి.

రాధతో సంసార సుఖానికి దూరమయి ఐదారు నెలలయిందేమో…ఆ వేడిలో శారద కూడా అందంగా కనపడడం మొదలుపెట్టింది. ఆమె అమాయకత్వం అతనికి ప్రోత్సాహాన్నిచ్చింది.

“నీవు ఎంత బాగా కాఫీ చేస్తావు శారదా…అబ్బ ఈ ఉప్మా రాధ అసలు బాగా చేసేది కాదు నీవెంత బాగా చేశావు..,”  “నీ చేతిలో అమృతం వుంది శారదా, నిజంగా మీ అక్కయ్యకిలా వంట్లో బాగులేనప్పుడు నీవున్నావు కనక నాకిబ్బంది తెలియడంలేదు, నిజంగా శారదా నీవెంత మంచిదానివి, నీ అంత అమాయకురాలిని చూడలేదు సుమా. స్వంత అక్క, బావలకి చేసినట్టు చేస్తున్నావు మాకు, నేనంటే నీకింత అభిమానం ఎందుకు”… అలాంటి పొగడ్తలతో కొన్నాళ్ళు ఆ అమాయకురాలిని ఉబ్బేసాడు. ఆ పొగడ్తలతో సిగ్గుపడి ఆనందపడి అతనిపట్ల అభిమానం మరింత పెంచుకుంది శారద.

ఆ తరువాత ఓ రోజు కాఫీ పట్టుకొస్తే కప్పందుకుంటూ చెయ్యి పట్టుకు కొంటెగా కళ్ళ్లలోకి చూశాడు. పాతికేళ్ళు వచ్చినా పురుషస్పర్శ ఎరుగని శారద పులకించి సిగ్గుపడి మెలికలు తిరిగింది. ఆ అదను కనిపెట్టి చెయ్యి జాపి దగ్గిరకు లాక్కుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. శారద మైమరిచిపోయింది. అయినా  అతను చేసినది తప్పని ఆ అమాయకురాలికి  అర్ధం అయి అతని కౌగిలి విడిపించుకుంది సిగ్గుపడ్తూ…

“శారదా…నీవంటే నాకెంతో యిష్టం…చూడు ఇది మీ అక్కయ్యకు  చెప్పకు సుమా!” అన్నాడు రహస్యంగా.

“ఛీ…ఫో.. చెప్తానేమిటీ” అంది శారద సిగ్గు పడ్తూ.

అలా అవకాశం దొరికినప్పుడల్లా శారదని దగ్గిరికి లాక్కుని, ముద్దు పెట్టుకుని ఆమెమీద మంత్రం చల్లినట్లు నెమ్మదిగా ఆమెని లోబరుచుకున్నాడు.

ఎక్కడికో వెళ్ళి అవసరం తీర్చుకోవాలంటే…ఎవరన్నా చూస్తే పరువు  పోతుంది. పైగా భయం. ఇంట్లో వ్యవహారం ఎవరికీ తెలియదు అని ఆలోచించాడు.

ఓ రోజు పార్వతమ్మ గుడికి వెళ్ళింది. రాధ కాలేజీనించి యింకా రాలేదు. ఆ అదను చూసి కాఫీ చేస్తున్న శారదని అమాంతం కౌగలించుకుని నలిపేస్తూ…ఎత్తుకుని తీసికెళ్ళి పక్కమీద పడుకోబెట్టి శారద ఏమనే లోపల, అనే అవకాశం ఈయకుండా ఆమెను మైమపరుపులో పడేశాడు.

పాతికేళ్ళు  దాటిన శారద శరీరం పురుష స్పర్శ కోసం పరితపిస్తున్న ఆమె దేహం ఆమె ప్రమేయం లేకుండానే అతనికి లోబడిపోయి ఆ మైమరుపులో ఆమెని ఆమే మర్చిపోయింది. అంతా  అయ్యాక  జరగరానిది ఏదో జరిగిందని ఆమెకు అర్ధమైంది. సిగ్గుతో, అవమానంతో అతనివంక చూడలేకపోయింది.

శారదని అతననేక విధాల బుజ్జగిస్తూ, తనకి ఆమె అంటే ఎంతో యిష్టమని, ఆగలేక పోయానని ఏవో తీయని మాటలు చెప్పి ఆమెని సమాధానపరిచాడు. శారద అతన్ని చూస్తూ ఏమీ అనలేకపోయింది. ఈ విషయాలేవీ రాధతో చెప్పకూడదు. నీవూ, నేనూ ఒకటి అంటూ తెలివిగా రాధ దగ్గిర మామూలుగా వుండమని, ఎవరూ లేనప్పుడు తన దగ్గరికిలా రమ్మని శారద ఏ విధంగా ప్రవర్తించాల్సిందీ అంతా బోధపరిచాడు.

ముందు నుంచి మాధవ్ అందచందాలు చూసి ఓ ఆరాధనాభావం ఏర్పరచుకుని, అతను తన వంక చూస్తేనే, మాట్లాడితేనే ఆనందపడే శారద అతను తననింత ప్రేమగా చూడడంతో తబ్బిబ్బు అయిపోయి అతనెలా చెపితే అలా చేసేది. మనిషి రుచి మరిగిన పులి “మేనీటర్” అవుతుంది. అలాగే మాధవ్ అందించిన సుఖాన్ని వదలుకోలేక పోయింది శారద. మాధవ్ ముందు జాగ్రత్తకోసం ఫామిలీ ప్లానింగ్ మాత్రలు కొనితెచ్చి జాగ్రత్తగా దాచి ఎలా వేసుకోవాల్సింది చెప్పాడు.

రాధ గర్భవతిగా వున్న తొమ్మిది నెలల్లో గత నాల్గునెలలనించి తనవెనక జరిగే ఈ భాగోతం గుర్తించలేక పోయింది. మాధవ్ గదిలోకి కాఫీ తీసికెళ్ళి యిచ్చి వచ్చిన శారద మొహంలో సిగ్గు, ఎరుపుదనం ఎందుకో గుర్తించలేక పోయింది.  ఓసారి యింటికి వచ్చేసరికి మాధవ్ వంటింటిలోంచి వస్తూ తనని చూసి తడబడితే అదీ గుర్తించలేక పోయింది. భార్య యింట్లో వుండగా తనని ఎవరూ అనుమానించరని అతను తనని అడ్డుపెట్టుకుని శారదతో ఆడే ఆటలు గుర్తించలేకపోయింది. గుర్తించే వేళకి పరిస్థితి చేయి దాటిపోయింది.

రాధకి నెలలు నిండాయి. తొమ్మిదో నెల రాగానే మెటర్నిటీ లీవ్ తీసుకుంది. రాధ యింటి పట్టున వుండడంతో మాధవ్‍కి  శారదకి స్వేఛ్ఛ దొరకక మాధవ్‍కది చాలా యిబ్బందిగా వుంది. తన సుఖానికి అడ్డువచ్చిన రాధమీద చిరుబురు లాడుతూ, ధుమధుమలాడుతూ యింట్లో వున్న కాసేపు ఏదో కనిపించలేదని, ఏ టిఫినో బాగులేదని ప్రతి దానికి కేకలు పెట్టేవాడు. ఇద్దరి పడక గదులు రాధ గర్భవతి అయిన దగ్గిరనుంచి వేరయ్యాయి. రాధ వీలయినంత వరకు ఆ గది వదిలిరాదు. మాధవ్ యింట్లో వున్నప్పుడు అసలు రావడం మానేసింది. రాధ యింట్లో వుండడంతో శారదని కలవడానికి కొత్త దారులు వెదకవల్సి వచ్చింది మాధవ్‍కి. రాత్రి అందరూ పడుకున్నాక తలుపు తీస్తాను రమ్మని శారదని వప్పించాడు. శారద ముందు భయపడింది. తల్లికి తెలుస్తుందని రానంది. రోజూ వద్దని రెండు మూడురోజుల కోసారి ఎలాగన్న రమ్మని బలవంతపెట్టి వప్పించాడు.

రాధకి ఆ రోజు నెప్పులు వచ్చాయి. లోకం కోసం మాధవ్‍కి  రాధని నర్సింగ్‍హోమ్‍కు  తీసికెళ్ళి జాయిన్ చేయించక తప్పలేదు. పార్వతమ్మ రాధకి తోడు వచ్చింది. ఉదయంనించి కష్టపడ్దాక ఫోర్సెప్స్ వేశాకగాని రాధకి కాన్పు అవలేదు. తెలివి వచ్చాక రాధ ఆరాటంగా బిడ్డకోసం అడిగింది. తెల్లటి గుడ్దలమధ్య నల్లటి…అతినల్లటి బిడ్డని చూసి రాధ కెవ్వుమంది.

“ కాదు…కాదు…వీడు నా బిడ్దకాదు…మీరు మార్చేశారు. పొరపాటుగా తెచ్చారు ఎవరినో..”అంటూ పిచ్చిగా అరిచింది.

పార్వతమ్మ జాలిగా రాధ తల నిమిరింది. “రాధా…అనుకున్నంతా  జరిగిందమ్మా…ఏడవకమ్మా…ఇప్పుడింక ఏడ్చి ఏం లాభం. పచ్చి బాలింతరాలివి ఏడిస్తే  వళ్ళు అదురుతుంది” అంటూ ఓదార్చింది.

“మాధవ్…మాధవ్  ఏమన్నాడు పిన్నిగారూ” ఏడ్పు మధ్య  అంది రాధ.

“హు…”ఆరాటంగా చూశాడు. చూడగానే అతని మొహం వివర్ణమయింది. ఒకసారి నావంక చూసి వెళ్ళిపోయాడు గదిలోంచి“.

“ఆ దేముడికింకా నా మీద కసితీరలేదులావుంది…నన్నింకా యిలా శిక్షించితేగాని తృప్తి తీరలేదు గాబోలు..నేనేం పాపం చేశానని యిలా చేశాడు…”

ఆ పూట అంతా ఏడుస్తూనే వుంది రాధ.

“రాధా…అన్నింటికి సిధ్ధపడే బిడ్డని కన్నావు…యిప్పుడిలా బెంబేలు పడితే ఎలా తల్లీ…ధైర్యంగా కన్నావు. ఆ ధైర్యంతోనే పెంచాలమ్మా…ఎలా పుట్టినా తల్లికి బిడ్డమీద ఎప్పుడూ ప్రేమ వుంటుందమ్మా…”

“ఇంతలా..యింత అనాకారిగా పుట్టి…నాకు జరిగిన అవమానం లోకానికంతటికీ తెలిసేటట్టు వీడిలా పుడతాడనుకోలేదండీ” రాధ దీనంగా అంది.

రాత్రి మాధవ్ ఆస్పత్రికి వచ్చాడు. రాధని చూస్తూనే మాధవ్ కఠినంగా “ఏం, యిప్పటికన్నా అనుమానం తీరిందా…వద్దు వద్దంటే నా మాట నిర్లక్ష్యంచేసి పంతం కొద్దీ కన్నావు … ఏం యిప్పటికన్నా నామీద కసితీరిందా…ఎంత అందమైన కొడుకుని కన్నావో చూసుకున్నావా?” వ్యంగ్యంగా దెప్పి పొడిచాడు.

మాధవ్ మాటలకి రాధ భోరుమంది. హృదయ విదారకంగా ఏడుస్తూ,”మాధవ్! నా మీద నీకెందుకింత కక్ష.  ఈ సమయంలో కూడా యింత కఠినంగా మాట్లాడేంతలా ఎలా మారిపోయావు. అసలే చితికిపోయిన నా హృదయాన్ని మరింత తూట్లు పొడవకు. ఫర్ గాడ్సేక్ వెళ్ళిపో యిక్కడినించి” రెండుచేతులు జోడించి రుధ్ధ కంఠంతో అంది.

“వెడతా…కాని వీడిని ఏం చేస్తావు…ఇంకా ఇంటికి తీసుకొచ్చి పెంచుతావా?”

రాధ కన్నీళ్ళ మధ్యనించి విసురుగా తలెత్తి “కాదు పెంచను. తీసికెళ్ళి పెంటకుప్పలో పారేయి, అదే నీకానందం, తృప్తి యిస్తే అలా చేసిరా”

“అవును. వద్దంటే కన్నావు. ఆ పారేసే పాపం నాకంటకట్టాలని చూస్తున్నావా. పెంచుకో నీ అందాల కొడుకుని”.

“పెంచుకుంటాను మాధవ్…వీడెంత  అసహ్యంగా వున్నా నా పేగు తెంచుకుని పుట్టాడు. వాడు నా రక్తం…ఎలా వున్నా తల్లి భరిస్తుంది, ప్రేమిస్తుంది. ఇంత చదువుకునీ ఆ మాత్రం తెలియకపోతే యిప్పుడేనా తెల్సుకో…”

“ఓహో..మరయితే ఆ ఏడుపెందుకు, ఆనందంగా అందరిని పిలిచి పండుగ చేయి…” హేళనగా  అన్నాడు.

“నా బ్రతుకే హేళన అయింది. మీరింకా చెప్పనక్కరలేదు”  తీవ్రంగా అంది.

“రాధా! సీరియస్‍గా చెప్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఈ బిడ్డని వదిలించుకుంటే నీకు, నాకు మంచిది”

“వదిలించుకుంటే అంటే…చంపమన్నారా?”

“చంపక్కరలేదు..అనాథ శరణాలయాలున్నాయి…వదిలి రావచ్చు”

రాధ అతనివంక సూటిగా ఒక్కక్షణం చూసింది. తరువాత పక్కన పడుకున్న పసివాడ్ని పొత్తిళ్ళతో సహా ఎత్తి మాధవ్ ముందు చాపి “తీసికెళ్లండి, అనాథశరణాలయంలో వదిలిరండి” అంది స్థిరంగా.

మాధవ్ తడబడ్దాడు. రాధ నిజంగా అంటుందా అన్న సందేహంతో ఆమె వంక చూశాడు. ఒకసారి తెల్లటి గుడ్డలమధ్య నల్లగా వుండి…గుప్పిళ్ళు బిగించి అమాయకంగా కళ్ళు మూసుకుని పడుకునివున్న వాడ్ని చూశాడు….

“నేనెందుకు తీసికెడతాను..నీవే యిచ్చే ఏర్పాట్లు   చూస్కో” అన్నాడు బింకంగా.

“హు…మీకే విధంగానూ సంబంధం లేనివాడు, మీ రక్తం పంచుకోనివాడు…ఎవడికో పుట్టిన బిడ్డ…వాడిని తీసికెళ్ళి అనాథ శరణాలయంలో పారేయడానికి మీకే చేతులు రావడం లేదు…అదేదో  పాపపు పనిలా మీరు సంకోచించు తున్నారే..అలాంటిది తొమ్మిది నెలలు మోసి, నరకయాతనపడి కన్న బిడ్డని నేనెలా వదలనండి అనాథశరణా లయంలో, నా  చేతులు ఎలా వస్తాయనుకున్నారు, నా మనసు ఎలా వప్పుకుంటుందనుకుంటున్నారు. వాడ్ని పారేసి నేను నిశ్చింతగా ఎలా బతకగలననుకుంటున్నారండీ. ఆ పాపం చేసిన నాకింక శాంతి ఎక్కడుంటుందండీ…” జవాబు చెప్పమన్నట్టు చూసింది. మాధవ్ ఒక్కసారి  రాధ వైపు కోపంగా చూసి గదిలోంఛి వెళ్ళిపోయాడు.

నర్సు వచ్చి ఏడుస్తున్న పసివాడ్ని వళ్ళో వేసి, పాలు ఎలా యియ్యాలో చెపుతూ…ఆమె స్థనాన్ని బిడ్డనోటికి అందించింది. ఆ లేతపెదాలు తాకగానే…ఆమెకి వెన్నులోంచి ఏదో జరజర పాకినట్టు…ఏదో పులకింత, మైమరుపు కలిగాయి. మాతృత్వపు  మమత  పొంగి  పొరలినట్లు ఆమె స్థనాలలోంచి పాలు బిడ్డనోటికి వెళ్ళాయి. అప్రయత్నంగానే రాధ ఆ బిడ్డని హత్తుకుంది దగ్గిరగా. అంతవరకు సరిగా చూడని రాధ…ఆ బిడ్దని…ఆ నల్లని బిడ్దని దగ్గిరగా పొదువుకుని…ప్రేమగా, ఆర్తిగా…వాడి చిన్నచేయి అందుకుని పెదాలకి ఆనించుకుంది.

 

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *