May 21, 2024

Gausips… ఎగిసే కెరటం – 2

రచన:-డా. శ్రీసత్య గౌతమి

 

(జరిగిన కధ: సింధియా తన బాస్ చటర్జీ తో కలిసి కాన్ ఫెరెన్స్ కి అమెరికాకొచ్చి కాన్ ఫెరెన్స్ లో కౌశిక్ ని చూసింది. కౌశిక్ తో తనకున్న పాత స్నేహాన్ని ఉపయోగించుకొని కౌశిక్ ద్వారా మెల్లగా ఉద్యోగం సంపాందించి అమెరికాలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. అమెరికా రావాలంటే ఉద్యోగమయినా కావాలి, లేదా అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయినైనా పెళ్ళాడాలి. సింధియా జాక్ పాట్ కొట్టింది, రెండూ తన పరమైంది. కౌశిక్ ద్వారా సింధియాకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అమెరికాలో పనిచేస్తున్న రాకేష్ అనబడే వ్యక్తి ని చేసుకుంది. టైం కి ఏమి చేసి తనకు కావలసింది దక్కించుకోవాలో స్కెచ్చులు గీసి సంపాదించుకుంది. అమెరికా ప్రయాణానికి ముందు అలాంటి స్కెచ్చులు గీసే చటర్జీ ని, చటర్జీ దగ్గిర ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అటువంటి సింధియాకు పని చేత కాదని, అమెరికా లోని మొదటి ఉద్యోగం ఊడిపోయింది. ఇది సింధియాకి జీవితం లో మొదటి పరాభవం)  

సింధియా సుధీర్ఘం గా ఆలోచిస్తోంది. ఈసారి ఏలా స్కెచ్ వెయ్యాలో తెలియటంలేదు. ఈ లోపున క్రింద కార్ పార్క్ చేసిన శభ్దం వచ్చింది.

“ఓ రాకేష్ వచ్చినట్లున్నాడు”…స్వగతంగా అనుకొంది. అయినా వేరే ఆలోచనలోకి వళ్ళిపోయింది.

రాకేష్ హుషారుగా లోపలికి వచ్చి, హాయ్ సింధియా డార్లింగ్…వాట్స్ అప్?.. అన్నాడు.

సింధియా నుండి సమాధానం లేదు. రాకేష్ సుధీర్ఘం గా ఆలోచనలో మునిగిపోయిన సింధియాని చూశాడు. ఒకసారి ఆమె ముందుకు వచ్చాడు.

సింధియా భృకుటి ముడిచి, తీక్షణం గా ఎటో వైపు చూసుకుంటుందే తప్పా…రాకేష్ కు రెస్పాండ్ అవ్వలేదు.

రాకేష్ కి అది నచ్చలేదు. కనీసం పలకరింపుగా కూడా చూడకుండా, తాను హ్యాపీ మూడ్ లో లేనూ అనే విషయాన్ని అలా చూపించడం తనకు రూడ్ అనిపించింది.

ఆ టైం కు ఆ ఆలోచనను అక్కడే వదిలేశాడు, తనకు కూడా ఆమె విషయాలు క్రొత్తేగా…ఇంకా తెలుసుకోవాలి అని.

సింధియా మాత్రం క్రొత్త స్కెచ్ వెయ్యటం లేదు గానీ, క్రొత్త పరాభవం వల్ల పాత వైభవాన్ని తలచుకోవడం మొదలు పెట్టింది. దానినుండి ఊరట పొందాలనే తాపత్రయంలో రాకేష్ రాకపోకలు పెద్ద విషయాలుగా సింధియాకు కనబడలేదు.

రాకేష్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి… సింధియా ఎదురుగా సోఫాలో కూర్చొని “ఏవిటీ వీకెండ్ కుకింగ్స్”…అన్నాడు. అప్పుడు ప్రక్కకు తల త్రిప్పి చూసింది.

సింధియా విసుగ్గా, కళ్ళు చికిలించి.. “ఎక్స్క్యూజ్ మీ”.. అని అడిగింది (ఏమిటడుగుతున్నావ్? అన్నట్లు).

ఆవిడ విసుగు కి రాకేష్ కి మనసులో చిరాకు కలిగింది. అయినా బయటకు మేనేజ్ చేస్తూ… ఇవాళ కుకింగ్స్ ఏమిటీ…?అని నవ్వుతూ అన్నాడు.

“లంచ్ కి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాను, ఇంకా అది మిగిలింది, నువ్వు దాన్ని డిన్నర్ చెయ్యవచ్చు”…అంది. రాకేష్ కి కోపం వచ్చింది. పిజ్జా గురించి కాదు, ఆమె బిల్డప్ కి.

ఏమిటలా వున్నావ్? వీకెండ్ కదా… సరదాగా తిరుగుతూ క్రొత్త క్రొత్త గా ఏమైనా వండుతావనుకున్నా.

వెంటనే చివాలున లేచింది. “నేను నీకు వంట చేసి పెట్టడానికి వంట మనిషిని కాను. అయినా నీకోసం ఆలోచించే ఆ పిజ్జా నీకు ఆఫర్ చేస్తున్నాను, లేకపోతే… అప్పుడే ట్రాష్ చేసేదాన్ని”.

వాళ్ళకి పెళ్ళయ్యాక రాకేష్ కి మొదటి షాక్. అప్పటి వరకూ వీకెండ్లు వచ్చిపోతున్నా క్రొత్త పెళ్ళి మోజులో ప్రతిరోజూ బయటి ఫుడ్డే తీసుకు రావడం జరిగింది. ఆ సంధర్భాలు కూడా అలాగే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఒక నిజమైన సంధర్భం వచ్చింది ఆమె గురించి ఒక మెట్టు తెలుసుకోవడానికి.

నీకు నేను వంట మనిషినా అని అడిగేసరికి…రాకేష్ కు మనసు చివుక్కుమంది. అయినా ఏదో బ్యాడ్ మూడ్ లో వుందేమో అని సరిపెట్టుకొని… “వంటమనిషివి అని కాదు, నా మనిషివి అని అడిగాను” అని అన్నాడు.

“ఓహో…మరి తినడానికి హోటల్స్ కి వెళ్ళేటప్పుడు నీ ఆర్డర్స్ తీసుకొని, నీకు సెర్వ్ చేసే వాళ్ళని నీ మనుష్యులు అనుకుంటావన్నమాట”…చివాలున అంది సింథియా.

రాకేష్ కు తల కొట్టేసినంత పనయ్యింది. “సింధియా…హోటల్స్, ఆర్డర్స్, అవుట్ సైడ్ లైఫ్ తప్పా ఇంటి వాతావరణం గురించి ఆలోచించవా? నిన్న మొన్న దాకా ఉద్యోగం చేసొచ్చి అలిసిపోతున్నానన్నావ్. సరే అని బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అఫ్ కోర్స్ నాకు వంట చెయ్యడం వచ్చు…అలాగని నేను నీకు చెయ్యాలి లేదా బయటినుండి తేవాలి అంటే ఎలా? మరి నువ్వు ఎప్పుడు నీ కిచెన్ కు రాణివవుతావు?” అని నవ్వుతూ అడిగాడు.

సింథియాకు “నీ కిచెన్ కు నువ్వు రాణి” అన్న మాట అస్సలు నచ్చలేదు.   “అలా అని నన్ను నీ పని మనిషిగా వాడుకుందామనుకుంటున్నావేమో? నాకిలాంటి పన్లు చెయ్యడం ఇష్టముండదు. నా ఇంట్లోనే నేనెప్పుడూ చెయ్యలేదు, నావాళ్ళు నాకు చెయ్యాల్సిందే తప్పా. డబ్బు సంపాందించి పెట్టమని చెప్పు, చేస్తాను. అంతేగాని నన్నిలాంటి చీప్ టెక్నిక్కులకి వాడుకోవాలనుకోకు”… అని టక టకా చెప్పేసింది సింథియా.

రాకేష్ ఆ మాటలకు ఖిన్నుడైపోయాడు. “మాట్లాడితే వాడుకోవడం అంటాదేంటీ? భార్యగా ఇంటిని చూసుకోదా? అంటే తాను నా యింట్లో ఒక పేయింగ్ గెస్ట్ గా వుంటుందన్న మాట! ఇన్నిరోజుల వరకూ ఈ సంధర్భం రాలేదు. డబ్బు తెచ్చిపడేస్తుందా? నాకా? నేనడిగానా? నేనేమడిగితే ఏమి చెబుతున్నది, సం థింగ్ రాంగ్”… రకరకాల ఆలోచనలతో సతమతమయ్యాడు రాకేష్.

****************

తన పూర్వపు వైభవాన్ని తలుచుకొని మురిసిపోతున్నప్పుడు పానకంలో పుడక లాగ రాకేష్ గోల. రాకేష్ మళ్ళీ నోరెత్తకుండా ఆ గోల ని తొక్కేసి తన ఆలోచనలోకి హాయిగా జారుకుంది సింథియా.

తాను చటర్జీ దగ్గిర వర్క్ చేస్తుండేటప్పుడు, బిశ్వా ఇంకా పి.హెచ్.డి. చేస్తున్నాడు. చాలా తెలివైనవాడని చటర్జీ కూడా ఎప్పుడూ అంటుండేవాడు. బిశ్వా కి సైన్స్ అంటే పిచ్చి, ఎప్పుడూ ల్యాబ్ ని పట్టుకొని వ్రేలాడేవాడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనో లేక ఏదో సైంటిఫిక్ జర్నల్ చదువుతూనో ఆఖరికి తాను చేస్తున్న పరిశోధన మనిషిలోని జీవరసాయన క్రియలకు ఎలా అప్లై చెయ్యాలి, వాటికనుగుణం గా తన పరిశోధనలను ఎలా మార్చి చెయ్యాలి అని మెడికల్ బుక్స్ కూడా చదువుతుండేవాడు. బిశ్వా ఎక్కడ టాక్స్ ఇచ్చినా అదే డైరక్షన్ లో ఇస్తుండేవాడు. అందుకే చటర్జీ కి దగ్గరయ్యాడు. నిజానికి అటువంటి అప్లికేషన్ ఆఫ్ మైండ్ చటర్జీ కి కూడా లేదు, ఎందుకంటే చటర్జీ కేవలం డాక్టరే తప్ప, సైంటిస్ట్ కాడు. అందువల్ల చటర్జీ బిశ్వా ని చాలా ప్రోత్సహించేవాడు, తన మెడికల్ గ్రూప్స్ లో, కాన్ ఫెరెన్సెస్ లో బిశ్వా కి ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు.

సింథియా చటర్జీ కి దగ్గరే అయినా…ఈ కోణం లో తాను దూరం గా ఫీలయి పోయింది. వెంటనే బిశ్వా చుట్టూ ఒక స్కెచ్ గీసేసింది. బిశ్వా స్థానం లో తానే వుంటే…అందరి మధ్యా తనకే ఆ గుర్తింపు వస్తుంది కదా, కేవలం చటర్జీ కి మాత్రమే దగ్గరగా వుంటే తానెప్పుడెదుగుతుంది?

“ఇవాళ కాంఫెరెన్స్ విశేషాలేమిటి”? సింథియా అడిగింది చటర్జీని.

“ఏమున్నాయి, మామూలే బడ్జెటింగుల గురించి మాట్లాడుకున్నాము. నా దగ్గరే బడ్జెట్ ఎక్కువవుంది కాబట్టి నా గ్రాంట్స్ నుండి రూలు ప్రకారం ఎక్కువ పెర్సెంటేజ్ ఎలాగూ వెళ్తుంది, కాకపోతే తమ దగ్గిర వున్న స్టూడెంట్స్ ని కొలొబొరేటివ్ గా నా ల్యాబ్ లో పెడతామంటున్నారు…”

“దాని వల్ల మనకి లాభం”? సింథియా అడిగింది.

“నాకు ఫ్రీ గా రీసెర్చ్ అవుతుంది, ఆ స్టూడెంట్లకు నేను పే చెయ్యక్కరలేదు…వాళ్ళ బాసులు చేసుకుంటారు కాబట్టి. వాళ్ళకి లాభం ఏమిటంటే నా ల్యాబ్ లోని రియేజెంట్స్, కెమికల్స్ వగైరా వాళ్ళ స్టూడెంట్లు వాడతారు, వాళ్ళకి బడ్జెట్ తగ్గుతుంది. ఏదో ఒకటి చేసి కలిసికట్టుగా సెంటర్ ని నడిపించాలి, తప్పదు కదా” అంటూ సోఫాలో వెనక్కి సాగిలపడ్డాడు.

అయితే ల్యాబ్ సంఖ్య పెరుగుతుందన్నమాట, అయితే నాకు పని ఎక్కువే మ్యానేజ్ చెయ్యడానికి” అని నవ్వుతూ అడిగింది.

“వీళ్ళకి నువ్వు చేసేదేముంది. వాళ్ళు వాళ్ళ పి.హెచ్.డి. డిగ్రీలకోసం పనిచేస్తున్నారు, డిగ్రీ పుచ్చుకొని వెళ్ళిపోతారు…నీ పని నీకు మామూలే, ల్యాబ్ ని బిశ్వా మ్యేనేజ్ చేస్తాడు అంతే కాదు ఒక సీనియర్ గా వాళ్ళని గైడ్ చేస్తాడు కూడా. దానివల్ల అందరికీ లాభం, బిశ్వాకి కూడా లాభం. అందరినుండి వచ్చే పబ్లికేషన్స్ లో తానొక ఆథర్ (author) అవుతాడు. అది అతని సెటిల్మెంట్ కి ఉపయోగపడుతుంది.

చటర్జీ టకటకా బిశ్వా భవిష్యత్తుని బిల్డ్ చేసేస్తుంటే సింథియా కది వినడానికి కర్ణకఠోరం గా వుంది, పైగా “ల్యాబ్ లో నువ్వు చేసేదేముంది” అనే మాట అనేసరికి…ఆమె మెదడి లోని కొన్ని నరాలు తెగిపోయాయి.

బిశ్వా కి భవిష్యత్తు కాదు కదా ఒక క్రొత్త వర్తమానాన్ని చూపించాలనుకుంది, చటర్జీ కి బిశ్వా మీద నమ్మకాన్ని పోగొట్టాలనుకుంది. దానివల్ల తనకేమీ రాదు అని తెలుసు, కానీ ల్యాబ్ లో నువ్వు చేసేదేముంది, అది బిశ్వా చూసుకుంటాడులే…అన్నఒక్క తిరస్కారపు మాట ఆమెకి నచ్చలేదు. చటర్జీకి గుణపాఠం చెప్పేతీరాలనుకుంది.

వేరే ల్యాబ్స్ నుండి ముగ్గురు స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు రావడానికి ఇంకా వారం రోజుల టైం వుంది. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారు. తనకు చటర్జీ అన్నీ చెప్తాడు, కాని అందరితో ఏమీ చెప్పడు…ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. తాను వాళ్ళకి బాస్ ని అని ప్రతిక్షణం వాళ్ళముందు నిరూపించు కోవడానికి తపిస్తుంటాడు, సింథియా విషయం లో అలాక్కాదు.

సింథియా వాళ్ళు ఇంకా రావడానికి ముందుగానే క్యాంటీన్లలోనూ, వారి వారి ల్యాబుల దగ్గిరా, క్యాంపస్ లోనూ ఎక్కడ కనిపిస్తే అక్కడ, వాళ్ళు కనబడక పోయినా ఎక్కడో దగ్గిర వాళ్ళని వెతికి పట్టుకొని మరీ మాట్లాడుతుండేది. చటర్జీ ల్యాబ్ లో మిగితా వాళ్ళకంటే టైం గురించీ, రిజల్ట్స్ గురించి ఆంక్షలు గానీ, సింథియాకు ఆ సమస్యలేదు, తాను ఏమి చేసినా తన కోసమే అని చటర్జీ అనుకుంటాడు.

ఇప్పుడీ క్రొత్త వాళ్ళని కలుసుకోవడాలు, పులుముకోవడాలు కూడా చటర్జీ ల్యాబ్ కోసమే అంటుంది, మీరెవరైనా అడిగితే. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, వాళ్ళ ఆలోచన్లలో, వాళ్ళ పని చేసే విధానాలలో ఏదయినా లోపాలు కనిపిస్తే తాను సరిదిద్ది, చటర్జీకి అనుకూలం గా మార్చడానికే తన ప్రయత్నం అని చెబుతుంది. కానీ దాని వెనుక తన స్వంత ఎజెండా మాత్రం తనకి తప్పా…ఆమెని సృష్తించిన దేవుడికి కూడా తెలియదు సుమీ!

ఇప్పుడు తాను తలపెట్టిన ఈ యజ్ఞము లో బిశ్వా ని తగలేసి, చటర్జీకి తానెంత ముఖ్యమో మరొకసారి అప్ డేట్ చెయ్యాలని చూస్తోంది! అలా ఎప్పటికప్పుడు తాను అప్ డేట్ చెయ్యకపోతే చటర్జీకి తాను డియర్ అండ్ నియర్ నెస్ ను మెయింటైన్ చెయ్యడం ఎలా? అందరిలో వుండే శక్తి సామర్ధ్యాలు తనలో లేవని ఆమెకి సంపూర్ణం గా తెలుసు, చటర్జీ తన మాట వింటాడన్న ఒక్క భరోసా తప్ప!!

 

(ఇంకావుంది)

1 thought on “Gausips… ఎగిసే కెరటం – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *