May 18, 2024

శ్రీముఖ లింగేశ్వరం

రచన: నాగలక్ష్మి కర్రా…nagalakshmi

శివరాత్రి…..

 

ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్ధశిని శివరాత్రిగా హిందువులు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. ఆంగ్ల కేలండర్ ప్రకారం ఈ సంవత్సరం 17-02-2015న ఈ శివరాత్రిని హిందువులు జరుపుకుంటున్నారు.

shiv-wallpapers-2

ఉత్తర భారతదేశంలో హిందువులు సంవత్సరంలో  రెండుసార్లు శివరాత్రిని జరుపుకుంటారు.  శ్రావణ శుక్ల చతుర్ధశిని పార్వతి పరమేశ్వరుల కల్యాణం జరిగిన రోజుగానూ, మాఘ బహుళ చతుర్దశిని శివుడు హాలాహలం  గ్రహంచిన రోజుగానూ మరియు లింగంగా ఉద్భవించిన రోజుగానూ జరుపుకుంటారు. శ్రావణమాసంలో అమావాస్య మొదలు చతుర్దశి వరకు గంగాదీక్ష ఆచరించడం ఉత్తర భారతదేశంలో పురాణకాలం నుంచి వుంది. ఈ దీక్షలో భక్తులు తమతమ గ్రామాలనుంచి హరిద్వార్ గంగానది వరకు కాలినడకన వెళ్లి గంగనీటిని తెచ్చి తమ వూరిలో వున్న శివాలయాలలో అభిషేకం చేస్తారు. కొందరు హరిద్వార్ లోని గంగని తీసుకొని కాలినడకన హరిద్వార్ కి సుమారు 42కిమి. దూరంలో వున్న నీలకంఠ మహాదేవ కోవెలలోని శివలింగానికి అభిషేకాదులు నిర్వహిస్తారు.

శివరాత్రి నాడు భక్తులు వేకువనే స్నానాదులు ముగించుకొని శివాలయాలలో అభిషేకాదులు చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం, జాగారం చెయ్యడం అనాదిగా వస్తున్న ఆచారం. దేశంలో వున్న అన్ని శివాలయాలలోను శివరాత్రి నాడు పగలు రాత్రి కుడా విశేష పూజలు నిర్వహిస్తారు . శివుడు అభిషేక ప్రియుడు అందుకే భక్తులు శివరాత్రినాడు బిల్వ పత్రాలతో అర్చన, నీళ్ళు, పాలు, కొబ్బరి నీరు , తేనె, చెరుకురసం మొదలగు వాటితో అభిషేకాలు నిర్వహిస్తారు.

ఓం నమః శివాయః అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినంతనే ప్రసన్నుడై కోరిన వరాలను ప్రసాదించేవాడు కావున ఈశ్వరునికి భోళా  శంకరుడు అనే పేరు కూడా వుంది. ఈశ్వరున్ని భోళా శంకరుడు అనడానికి మన పురాణాలలో రావణాసురుడు, భస్మాసురుడు, నరకాసురుడు మొదలైన  కధలు ప్రాచుర్యంలో వున్నాయి. అలాగే శివరాత్రి మహాత్యాన్ని చెప్పే “భక్త కన్నప్ప ,బిల్వమంగళుడు ,లుబ్ధకుడు ” కధలు బహుళ ప్రాచుర్యం పొందేయి.

ఇంతటి పర్వదినాన మొత్తం భారతదేశం మరచిపోయిన ఆంధ్రరాష్ట్రంలో వున్నఅద్భుతమైన   శైవ క్షేత్రాన్ని పరిచయం చేస్తాను.  అత్యుత్తమమైన వన్యసంపద, జీడిపలుకులు (cashew nuts) , పసుపు పంట విరివిగా వుండి  కూడా రాజకీయనాయకుల అలక్ష్యానికి గురైన శ్రీకాకుళం జిల్లాలో 8వ, 9వ శతాబ్దానికి చెందిన అనేక మందిరాలు మరుగున పడిపోయేయి. అందులో అరసవిల్లి సుర్యనారాయణమూర్తి కోవెల , శ్రీకూర్మం, శ్రీ ముఖలింగం ముఖ్యమైనవి.

image1

ఇప్పుడు మనం శ్రీముఖలింగం గురించి చెప్పుకుందాం. స్వామివారి పేరుమీదే ఈ వూరిని కూడా శ్రీముఖలింగం అనే అంటారు. శ్రీకాకుళానికి సుమారు 56 కి.మీ దూరంలో ఒరిస్సా వైపు వో మారుమూలలో  వున్న పల్లె ఇది. టౌను అనాలేమో గాని ఆ వూరు చూస్తే మాత్రం పల్లెకు ఎక్కువ,  టౌను కి తక్కువగా వుంటుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం హౌరా రైలు మార్గంలో వున్న పెద్ద రైలు స్టేషన్. ఇక్కడ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ తో సహా అన్ని ట్రైన్స్ ఆగుతాయి. చెన్నై నుంచి హౌరా వెళ్ళే NH-5 మీద శ్రీకాకుళం వుంది. అటు  విజయవాడ నుంచి యిటు ఒరిస్సా నుంచి కూడా రోడ్డు మార్గాన ప్రయాణించవచ్చు.

శ్రీకాకుళం నుంచి NH-5 మీద సుమారు 30 కి.మీ.. ప్రయాణించిన తరవాత నరసన్నపేట  అనే టౌను చేరుకుంటాం. ఇదే శ్రీముఖలింగానికి దగ్గరగా వున్నటౌను. ఈ నరసన్నపేట తరవాత అన్నీ చిన్న  పల్లెలే. కాఫీ,టీ దొరికే సౌకర్యం కూడా ఉండదనే చెప్పాలి. లేత ఆకుపచ్చ వరిచేలు రాత్రి కురిసిన మంచులో స్నానమాడి ప్రొద్దుటి లేలేత సూర్యకిరణాల నులివెచ్చని వేడిలో వళ్ళుకాచుకుంటూ సన్నని గాలికి తలలూపుతూ దారిపొడవునా మనకు స్వాగతం పలుకుతూ వుంటాయి. నరసన్నపేట తరవాత మన ప్రయాణం NH-5 నుంచి చిన్న రోడ్డు మీదకి మారుతుంది,ఇక్కడ నుంచి మిగిలిన 25,26 కి. మీ దూరం సన్నని  గతుకుల రోడ్డుమీద సాగుతుంది. కొన్ని చోట్ల రోడ్డు కూడా వుండదు.. మనమే వెతుక్కోవాలి.

చరిత్రలోకి వెళితే గోదావరీ తీరం వరకు కళింగ రాజుల పరిపాలనలో వుండేది . పదవ శతాబ్దంలో కళింగ దేశాన్ని పరిపాలించిన “అనంతవర్మ చోడగంగ” రాజధానిని కళింగనగరం(ఇప్పటి ముఖలింగమ్) నుంచి “కటకం”(కటక్) కి మార్చేడు. రాజధాని మారడంతో కళింగనగరం ప్రాముఖ్యతను కోల్పోయి చరిత్ర పుటలలో కలిసిపోయి వో మూడువేల జనాభా గల చిన్న నగరంగా మిగిలిపోయింది.

srimukhalingam

శ్రీముఖలింగం ఊరిలోకి ప్రవేశించగానే ముందుగా మనకి సోమేశ్వరాలయం కనిపిస్తుంది.  ఇది శ్రీముఖలింగం కోవెల కన్నా ముందుగా కట్టబడినట్లు ఆర్కియాలజి వారిచే గుర్తింపబడింది. శిల్పకళాద్భుతంగా ఆర్కియాలజీ వారిచే గుర్తింపబడి సంరక్షించ బడుతోంది. ఇక్కడ శిల్ప కళ యెక్కువగా లేదు.  ప్రవేశద్వారానికి  అటూ, యిటూ గంగామాత, యమునామాతల విగ్రహాలు వుంటాయి. ఈ కోవెల మొత్తం ఒక రాయిమీద మరో రాయి పేర్చి కట్టినది..  రాయికి రాయికి మధ్య గట్టితనానికి ఏవిధమైన పదార్ధం వాడలేదు. ఈ మందిరాలు 8వ శతాబ్ధానివి చెందినవి. ఎనిమిదవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రాకృతిక విపత్తులను తట్టుకొని చెక్కుచెదరకుండా నిలబడగలిగిందంటే నిజంగా అదివొక అద్భుతమే.

అనియంక భీమేశ్వర మందిరం.. దీనిని అనియంక భీమ అనే రాజు చేత కట్టబడింది. ఇది శ్రీముఖలింగం మందిరం తరువాత కట్టబడింది. శ్రీముఖలింగం కోవెలలో వున్నంత శిల్పకళ  లేదు కాని ఇందులో బ్రహ్మ,నరసింహమూర్తి, దక్షిణామూర్తి విగ్రహాలను అంతరాలయాలలో చూడొచ్చు.

image1.JPG

 

వంశధార నది వొడ్డున వున్న శ్రీముఖలింగం కోవెల ఎనిమిదవ శతాబ్ధం పూర్వార్ధంలో గంగ వంశానికి చెందిన రెండవ కమర్ణవ అనే రాజుచే నిర్మించబడింది. మొత్తం కళింగ శిల్ప కళతో కట్టిన ఆలయంగా చెప్పొచ్చు. లోపలి ప్రాకారంలో పదకొండు చిన్న చిన్న కోవెళ్ళు వున్నాయి. అవి   వినాయకుడు, కుమారస్వామి మొదలైన దేవీ దేవతలకి ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి. అక్కడినుంచి నంది మండపంలోకి ప్రవేసిస్తాము. మండపం అంతా రాతి కట్టడమే. మండు వేసవిలో కూడా ఈ నంది మండపంలో కూర్చుంటే A.C. లో వున్నట్లు వుంటుంది. గర్భ గుడిలో వున్న శివలింగానికి వెండి తొడుగు వేసి వుంచారు . నిజలింగ దర్శనం ప్రొద్దుటే చేసే హారతి సేవకి రాగలిగితే చూడొచ్చు అని పూజారులు చెప్పేరు. వీరిని కాళింగ బ్రాహ్మణులు అని పిలుస్తారు. శివలింగానికి ఇక్కడ అర్చన చెయ్యరు. ఎందుకు చెయ్యరు? అని అక్కడి పురోహితులని ప్రశ్నించగా శ్రీముఖలింగేశ్వరుడు విప్ప చెట్టులోంచి స్వయంభువుగా అవతరించేడు,ఆ వృక్ష అవశేషాలను సంరక్షించడం కోసం అర్చనలను, అభిషేకాలను రద్దు చేసేరు అని చెప్పేరు. నిత్యాభిషేకాదులు వుత్సవ విగ్రహాలకు చేస్తారుట.

విప్పవృక్షం లోంచి శివలింగం యెలా వచ్చింది అని అడుగగా వారు ఈ కధని చెప్పేరు. ఇద్దరు అన్నదమ్ములకి వుమ్మడి ఆస్తిగా వొక యిల్లు, ఆరుబయట వున్న విప్పచెట్టు(మధువు చెయ్యడానికి వీటి పువ్వులు వుపయోగిస్తారు) వస్తాయి. ఆ పువ్వులకోసం తోటికోడళ్ళ మధ్య రోజు గొడవలు జరుగుతూ వుంటాయి. గొడవలతో విసుగెత్తిన అన్నదమ్ములు గొడ్డళ్ళతో చెట్టు మొదలు నరకడానికి ప్రయత్నించగా చెట్టులోంచి నెత్తురు కారడం గమనిస్తారు. ఆ వింత  చూడ్డానికి అందరితో పాటు రాజా కమర్ణవ -2 కూడా వచ్చి చెట్టుని జాగ్రతగా తీయించగా నెత్తురు కారుతున్న శివలింగం కనిపిస్తుంది. అప్పుడు ప్రజలంతా శివుడిని స్తుతించగా నెత్తురు కారడం ఆగిపోయిందిట. అక్కడే ఈ  రాజా కమర్ణవ-2 కోవెల కట్టించి వందల ఎకరాలు కోవెల మాన్యంగా ఇచ్చేడు. కాలక్రమంలో ఆ భూములు ఎవరి పరమయ్యాయో తెలీదుగాని ఇప్పుడు దీపధూప నైవేధ్యాలకి కూడా జరుగుబాటు లేని పరిస్తితి. నంది మండపంలోంచి గర్భగుడి లోపల శివుని దర్శించుకున్న తరువాత శివలింగం వెనక వైపున పెద్ద మట్టిగోలెం మీద పడింది నాదృష్టి..  నాకున్న సహజ కుతుహలంతో ఆ గోలెం అక్కడ యెందుకుందో అడిగాను. దానికి పూజారులు చెప్పిన కధ ఇది

ఆ వూరిలో పరమశివభక్తుడైన కుమ్మరి ఉండేవాడు. అతనికి ఎంతకాలమైనా పిల్లలు కలగలేదు. అతను నంది మండపంలో కూర్చొని శివుని పరిపరి విధాలుగా  స్తుతించి సంతానాన్ని ప్రసాదించమని వేడుకొని ,సంతానం కలిగితే తాను చేయ్యగలిగినంత పెద్ద మట్టిగోలేలని చేసి యిస్తానని మొక్కుకుంటాడు. ఏడాది లోపల కొడుకు పుట్టిన తరువాత మొక్కు తీర్చుకోవడం కోసం రెండు మట్టి గోలేలని తీసుకోని కోవెలకి వస్తాడు. కాని ఆ గోలేలు ద్వారంలోంచి లోపలలికి తీసుకు వెళ్ళడం సాధ్యం కాలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా గోలేలని లోపల పెట్టలేకపోతారు. అప్పుడు ఆ కుమ్మరి “నా మొక్కు నేను  తీర్చుకున్నాను పరమేశ్వరా , నీ వస్తువులని నువ్వే కాపాడుకో” అని చెప్పి ద్వారం బయట రెండు గోలేలను విడిచి పెట్టి వెళ్లి పోతాడు. మరునాడు వొకగోలెం శివలింగం వెనకాల పెట్టబడి వుండడం , మరొకటి బద్దలయి ముక్కలు బయట పడివుండటం పూజారి చూస్తాడు. ఆ పరమ శివుడే గోలాన్ని లోపలకు తీసుకువెళ్ళి ఉంటాడని అక్కడి వారి నమ్మిక. ఇప్పటికి సంతానం కోసం వచ్చేవారు ఆ గోలేనికి మొక్కుకుంటారు.

అందుకే స్వామివారికి సంతానేశ్వరుడు, మధుకేశ్వరుడు అనే పేర్లతో  కూడా ప్రసిద్దుడయ్యాడు.

ఇక్కడ వున్న శిల్ప సంపద చాలా అరుదైనవి. సహృదయులైన పాలకులు పూనుకొని ఇక్కడి పూజారులకు కొంత భృతి ఏర్పరిచి పూజాది ఆర్యక్రమాలకు కొంత సొమ్ము కేటాయించితే బాగుంటుంది. అలాగే పర్యాటక సంస్థవారు, ప్రభుత్వంవారు ఇలాంటి అరుదైన మందిరాలను కాపాడితే బాగుంటుంది. ఇక్కడి శిల్పకళ ఇప్పటి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లోని మందిరాలని పోలి వుంటుంది. ఐతే ఇవి ఎనిమిదవ శతాబ్దానికి చెందినవి, భువనేశ్వర్ లోని మందిరాలు పదిహేడవ శతాబ్దానికి చెందినవి. శ్రీముఖలింగం ఊరిలో యెక్కడైనా పునాదికి గాని చెట్లు నాటడానికిగాని కొంచెం లోతుగా తవ్వితే శివలింగాలు గాని,మరేవైనా దేవతాముర్తుల శిల్పాలు గాని  లభ్యమౌతున్నాయని ఈ వూరివాసులు చెప్తున్నారు. సముద్రంలో కలసిపోయిన ద్వారకలాగా ఏదో నగరం భూస్థాపితం అయిపోయిందా? ఏమైనా మనం యేమి చెయ్యలేము. ప్రభుత్వం ముందుకు వచ్చి త్రవ్వకాలు చేపట్టి శిల్పసంపదను కాపాడాలని మనవి. మనం చెయ్యగలినది మనకు తెలిసినవాళ్ళకు ఈ కోవెల గురించి తెలియజేసి వాటికి ఇటువంటి పురాతనమైన, అరుదైన మందిరాల గురించి ఆశక్తి కలిగేటట్టు చెయ్యడం అది.. నేను చేసాననే అనుకుంటున్నాను . మరి మీరేమంటారు?

 

3 thoughts on “శ్రీముఖ లింగేశ్వరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *