May 12, 2024

ఆడ జన్మకెన్ని శోకాలో

రచన: సిరి వడ్డే

చిత్రం:  Ana Luisa Kaminski Pinturas

ana

పుడుతూనే ఆదిలక్ష్మి అంటారు

ఈడపిల్లవు కాలేని “ఆడ”పిల్లనని

పెరుగుతుంటే ఆంక్షలెన్నో పెడతారు

ఆడపిల్లవి…అణిగిమణిగి ఉండమని

 

అందరి అడుగులకు మడుగులొత్తుతూనే ఉండాలి

మౌనంగా మనస్సుతోనే ముచ్చటించాలి

నవ్వుల గలగలలను మూగగానే రవళించాలి

మాటల ముత్యాలను మౌనంగానే ఒలికించాలి

 

కన్నెప్రాయపు కలలను కన్నీళ్ల పర్యంతం చేయాలి

కళాశాలలో వెంటాడే కళ్ళను మౌనంగానే భరించాలి

ఊహలోకంలో కూడా ఉన్నతంగానే విహరించాలి

ఊహాగానాలతో హింసించే జనాలను ఊరికే మన్నించాలి

 

కన్నబంధాన్ని తెంచేసుకుని కన్నోళ్ళని వదిలేసుకోవాలి

ఇంటిపేరును మార్చుకుని అంగాంగాన్ని అర్పించుకోవాలి

ఒడిని నింపే మమాకారానికై మరు జన్మ ఎత్తాలి

నెత్తిన తన్నేసిపోయినా కన్న మమకారంతో బిడ్డలను నెత్తిన పెట్టుకోవాలి

 

రెక్కలొచ్చి బిడ్డలు వీధిన విసిరేసినా

కన్నీళ్లను రెప్పలమాటునే అణచివేయాలి

రెక్కలుడిగి వృద్దాశ్రమాల పాలుచేసినా

మాటలుమరచిన మూగలై మిన్నకుండి పోవాలి

 

విరించి విరచితం కరుణిస్తే

నిత్య సుమంగళిగా తొలి తాంబూలం నీదే

విధి వక్రించి విధివంచితవైతే

నిత్య సౌభాగ్యానికి నివాళులనే అర్పించాలి

 

ఆడజన్మకెన్ని శోకాలో?

అతివ బ్రతుకుకెన్ని వెతల మలుపులో?

 

6 thoughts on “ఆడ జన్మకెన్ని శోకాలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *