May 13, 2024

Tv9 “నవీన”.

రచన: షీతల్ మొర్జారియా, ఝాన్సీ లక్ష్మి

0

“నవీన” అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే  కాదు ఒక “నవీన” విధానం.

2006 లో ఒక డైలీ ప్రోగ్రాంగా టి.వి 9లో ప్రారంభించినప్పుడు అందరూ అన్నివైపుల నించీ తమ అభిప్రాయాలతో ముంచెత్తారు. మహిళా కార్యక్రమం కాబట్టి వంటలు, డైటింగ్, మేకప్ గురించిన సలహాలతో చుట్టుముట్టేసారు. వీటన్నింటినించీ సున్నితంగా తప్పించుకొని,  మా దృష్టికోణాన్ని ప్రకటించడానికి మేము చేసిన ప్రయత్నం చాలామందికి వింతగానూ, కష్టసాధ్యంగానూ అనిపించింది. ఎందుకంటే మేం మేకప్ కంటే వృత్తినీ, ఫాషన్ కంటే మహిళా వార్తలనీ ఎంచుకున్నాం. సంచలనాత్మక విశ్లేషణలకి దూరంగా ఉంటూ సాధారణ స్త్రీల స్పూర్తి దాయకమైన కధనాలకు పెద్దపీట వేశాం. ఇలాంటి అంశాలతో “నవీన”.  కార్యక్రమాన్ని ఆసక్తికరంగా రూపొందించడానికి మాకు మొదట్లో కొంత సమయం పట్టింది. కానీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే “నవీన”.  మధ్యాహ్న సమయంలో మహిళా సాధికారతకు చిరునామాగా, హక్కుల గురించి చైతన్యపరుస్తూ, లింగవివక్షని ప్రశ్నిస్తూ,  ఒక ఉద్యమంలా మారింది.

ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసేందుకు మాకు ప్రేరణ ఏమిటో తెలుసా? కోపం, నిరాశ.. అవును TV ల్లో, సినిమాల్లో, ఇతర మీడియల్లో, వార్తల్లో మూసవిధానాల్తో  మహిళ ల పాత్రల చిత్రీకరణ చూసీ, చూసీ మేం విసుగు చెందాం. రోజూ వచ్చే సీరియల్స్ లో అటు బాధితురాలూ, ఇటు బాధించేది స్త్రీ పాత్రే. స్త్రీలు వంటింటి కుందేళ్ళు గానో, ఇంటిని విచ్చిన్నం చేసే విలన్ గానో చూపించబడుతున్నారు.

ఇక సినిమాలు అందం తప్ప మరో కోణం లేని అంగడి బొమ్మగా చూపిస్తున్నాయి. అయితే అటు సెక్స్ వస్తువుగానో, భావోద్వేగాలని నియంత్రించుకోలేని కన్నీటి బొమ్మగానో కనిపిస్తారు. సాధారణ మహిళల సామాన్య దైనందిన జీవితాలకీ, మీడియా చూపించే స్త్రీ పాత్రలకీ హస్తి మశకాంతరం  ఉంది.

మన రాష్ట్రంలో ప్రాంతీయ టెలివిజన్  మహిళా కార్యక్రమాలకి అప్పటికే ఒక నిర్వచనం సృష్టించేసింది. మహిళ అంటే గృహిణి అనే ఉద్దేశ్యంతోనే అన్ని కార్యక్రమాలూ డిజైన్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ స్త్రీల కార్యక్రమాల తీరు అలాగే ఉంది.  వంటలు, మేకప్, ఫ్యాషన్, ఇంటిని తీర్చి దిద్దడం, చక్కటి ఇల్లాలిగా పేరు తెచ్చుకోవడం వంటి అంశాలే రాజ్యమేలుతున్నాయి. ఆశ్చర్యంగా , అక్కడక్కడా కొన్ని చర్చా కార్యక్రమాలు కనిపించినా, అవి కూడా సంప్రదాయ దృష్టి కోణం నుంచో లేదా మహిళా విజయాలు లేదా సలహాలకి మాత్రమే పరిమితమయ్యాయి. మరికొన్ని కార్యక్రమాలు మహిళా అంశాలపై చర్చ చేపట్టినా వాటిని నిర్దేశించే విధానాల్లో స్పష్టంగా బూజు పట్టిన పితృస్వామ్య భావజాల ఆధిపత్యం కనిపిస్తుంది. ఇటువంటి అంశాలు తెరపైకి తెచ్చినప్పుడు మీడియా సంప్రదాయ లింగ వివక్షనీ, కృత్రిమమైన సహనాన్నీ, నిశ్శబ్దాన్నీ ప్రోత్సహిస్తోంది. స్త్రీల జీవితంలో ప్రతినిత్యం కనిపించే సామాన్య, ‘దైనందిన’ తనం ఏ కార్యక్రమంలోనూ కనిపించదు. సాధారణ మహిళల భావోద్వేగాలు, ఆశయాలు, వారి వ్యక్తిగత, వృత్తి జీవన కోణం నుంచి ప్రతిబింబించవు. సరిగ్గా ఇక్కడే వాస్తవానికీ, మీడియాకి మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది “నవీన”. . ఈ కార్యక్రమంలో సామాన్య మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాలకి పెద్ద పీట వేశాం. అందుకే “నవీన”.  లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని గురించి నిస్సంకోచంగా చర్చించాం.  స్త్రీ తన శరీరం గురించి ఎన్ని సందేహలున్నా చర్చించేందుకు సంకోచిస్తుంది, కానీ మేం ఆ సిగ్గు గోడల్ని కూల్చేసాం.

డైలీ షోగా ప్రారంభమైన “నవీన” మొదటి సంవత్సరం కాంపైన్ మోడ్ ( Campaign Mode) లో రన్ చేశాం. ఇక రెండవ సంవత్సరంలో ఒక పత్రిక ఫార్మాట్ ( Format) లో “నవీన”ని తయారు చేశాం. మహిళలకి సంబంధించినటువంటి వార్తలు, వృత్తికి సంబంధించిన అంశాల్తో ఒక ప్రత్యేకమైన మహిళా బులెటిన్ ని తయారుచేశాం. అమ్మాయిలకి, స్త్రీలకి సంబంధించిన న్యూట్రిషన్ ( Nutrition) ని ఒక ప్రత్యేక సెగ్మెంట్ లో ( Segment) డిస్కస్ చేసాం. ఇక మూడవ సంవత్సరంలో “నవీన” ఒక కొత్త రూపంలోకి అడుగు పెట్టింది. ప్రేక్షకులకి, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి మరింత దగ్గరైన “నవీన” వారి జీవితాల్లో ఉన్నటువంటి అటు పర్సనల్ (personal) ఇటు  ప్రొఫెషనల్ ( professional) సమస్యలని  “నవీన” ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసాం. నిపుణుల్ని నేరుగా స్టూడియోకి తీసుకొచ్చి ప్రేక్షకులకి వివిధ అంశాలపై అవగాహన కలిగించాం. ఆరోగ్యం, విద్య, వైద్యంతో పాటు మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది.  మేగజైన్ రూపంలో ఇటువంటి అంశాలను మాత్రమే కాకుండా కొన్ని నిఘా కధనాల్ని కూడా “నవీన” తయారుచేసింది. నేరుగా సంఘటనా స్థలానికే వెళ్ళి సమస్యను అర్ధం చేసుకుని నిఘా కెమేరాతో “నవీన”.  అందించిన స్టోరీస్ లో జైళ్ళు,  జోగినీలు, హిజ్రాల సమస్యలతో పాటు రాత్రి వేళల్లో రోడ్లు మహిళకు ఎంత సురక్షితంగా ఉన్నాయి? అన్న అంశాలపై వివిధ కధనాల్ని ప్రసారం చేశాం.

మిగిలిన కార్యక్రమాలకీ, “నవీన”కి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం “నవీన” చేపట్టిన అంశాలు మాత్రమే కాదు.ఈ కార్యక్రమాన్ని తయారు చేసి అందించే రీతిలో కూడా పూర్తిగా వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా మటుకు మహిళా కార్యక్రామాలు అనగానే సుకుమారమైన అక్షరాలు, లేత రంగులూ,  సున్నితమైన సంగీతంతో కనిపిస్తాయి, కానీ “నవీన” తీరు వేరు. మొదటి చూపులోనే “నవీన” ధైర్యంగా, నిక్కచ్చిగా కనబడేలా డిజైన్ చెయ్యబడింది. ఇక ఈ కార్యక్రమానికి వాడిన సంగీతం కూడా మిగతా కార్యక్రమాల్లా సున్నితంగా కాక, అవసరానికి తగ్గట్టుగా ధైర్యంగా వినిపిస్తుంది. కార్యక్రామానికి సంబంధించి తయారుచేసిన ప్రోమోలు కూడా  ప్రత్యేకంగా, ఒక కధనాన్ని చెప్తున్నట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక కార్యక్రమానికి వ్యాఖ్యాత అయిన ఝాన్సీ కూడా బలమైన గళాన్ని వినిపించగలిగే ఆధునిక మహిళ. వీటన్నింటి ద్వారా “నవీన” ఆశయం ఒక్కటే. మీడియాలో ఉన్న మహిళా చిత్రీకరణని సమూలంగా మార్చి, ఒక సమకాలీన మహిళా రూపాన్ని నిలబెట్టడం. తన కాళ్ళపై తాను నిలబడగలిగి, ధైర్యంగా ఆత్మ విశ్వాసంతో తన గళాన్ని వినిపించగలిగే “నవీన” మహిళని తయారుచేయడమే “నవీన”.  లక్ష్యం.. సమస్యల్లో ఉన్న మహిళలకి ఉపకరించేలా Toll Free నంబర్లని సైతం ప్రసారం చేయడం జరిగింది. ఏన్నో సందర్భాల్లో “నవీన”కి తమ సమస్యలు చెప్పుకోవడానికి దూర ప్రాంతాలనుంచి ఎందరో మహిళలు స్వయంగా వచ్చేవారు, లేదా ఉత్తరాల ద్వారా తెలియచేసేవారు. అటువంటి పరిస్థితుల్లో వారికి సరైన దిశానిర్దేశం చేసేందుకు వారిని “నవీన”లో పాల్గొనే నిపుణుల దగ్గరకి పంపడం జరిగేది.

స్త్రీవాదులు, ఉద్యమకారులు, డాక్టర్లు, కౌన్సిలర్లు, లాయర్లు అందరూ “నవీన”కి తమ వంతు సహకారాన్ని అందించారు. ప్రాంతీయ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ “నవీన”.  చర్చించిన అంశాలు మరే ఇతర కార్యక్రమం కూడా ఇంత ధైర్యంగా చర్చించలేదు అని గర్వంగా చెప్పొచ్చు. ఉదాహరణకి స్త్రీల శరీరాన్ని గురించి మాట్లాడుతూ అటు సౌదర్యం,  ఇటు ఆరోగ్యం అన్న కోణం నించి మాత్రమే కాకుండా breast series అనే పేరుతో correct bra size  నుంచీ, breast cancer వరకూ మాట్లాడాం. అత్యాచారాల గురించి మాట్లాడుతూ Marital rape  అంటే,  ‘వివాహంలో రేప్’ గురించి కూడా మాట్లాడటం జరిగింది. లైంగిక సమస్యలగురించి మాట్లాడేటప్పుడు పురుషుల లైంగిక సమస్యల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్ని సైతం “నవీన”లో చర్చించడం జరిగింది. ఇవన్నీ “నవీన”.  ధైర్యానికి నిదర్శనాలు. అన్నివేళలా సీరియస్ గా హక్కుల గురించి మాట్లాడే “నవీన”.  సరదాగా మగవారికి చిన్న చిన్న వంటలు నేర్పించేందుకు superman   అనే ప్రత్యేకమైన  segment ని కూడా నిర్వహించింది. సమకాలీన మహిళకి సంబంధించిన అన్ని అంశాలనీ హక్కుల దృష్టికోణంతో సమానత్వ స్పృహతో అందించే కార్యక్రమం “నవీన”. . కేవలం కార్యక్రమంగానే కాక ఒక ఉద్యమంలా పనిచేసే “నవీన”.  వెనుక బృంద సభ్యుల సహకారం ఎంతో ఉంది. యాంకర్ నుంచీ కో ఆర్డినేటర్ ( Coordinator) వరకు, కెమెరా పర్సన్ ( Camera Person)  నించి ఎడిటర్ వరకు, గ్రాఫిక్స్ ( Graphics) నించి మేనేజర్ ( Manager) వరకు “నవీన”.  తో అనుబంధం ఉన్న ప్రతీ వ్యక్తి దీనికి అందించిన సహకారం వెలలేనిది. ఇక “నవీన”.  లో పాల్గొనే నిపుణులు,  మిత్రుల మాట ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. ఇది కేవలం ఒక కార్యక్రమం అనే భావనతో కాకుండా విలువైన తమ సమయాన్ని “నవీన”ని నమ్మి, “నవీన” తీసుకురాగలిగిన మార్పును నమ్మి మరీ వచ్చినటువంటి  panelists  అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకోవాలి.

“నవీన” కార్యక్రమం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన మరొక అంశం  “నవీన” మహిళా కాంటెస్ట్. 2006 జనవరిలో “నవీన”.  తనకంటూ ప్రత్యేక అవార్డ్స్ స్థాపించింది.మహిళలకి సంబంధించిన కాంటెస్ట్ లు అంటే   Beauty Contest  లు లేకపోతే సరదాగా ఆటపాటల కాంటెస్ట్ లు చూసి విసుగెత్తిన “నవీన”.  బృందం నిజమైన,  అసామాన్యమైన కధనాలని వెలికి తీసి వాటికి పట్టం కట్టాలని ఆలోచించింది. ఇక్కడ అందం కంటే ధైర్యానికి, చదువు కంటే ఆత్మ విశ్వాసానికి పట్టం కట్టాం. సాధారణ మహిళలు చేసిన అసాధారణ పోరాటాల గురించి ” నవీన మహిళలుగా” వారికి అవార్డులు ప్రకటించడం జరుగుతోంది. గ్రామీణ స్థాయిలో ఎవరికీ కనిపించనీ, వినిపించనీ స్పూర్థి దాయక  కధనాల్ని వెలికి తీసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సాహసం, సాంఘిక దురాచారానికి వ్యతిరేకం, హక్కుల కోసం పోరాటం ఈ మూడు విభాగాల్లో కృషి చేసిన మహిళలకు అవార్డులు అందచేయడం జరుగుతోంది.

ఈ తొమ్మిదేళ్ళ ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకుంటే బూజుపట్టిన సంప్రదాయ పద్ధతుల్ని బద్దలు కొట్టాం. ధైర్యంగా, ఆధునికంగా మాట్లాడాం. మహిళా కార్యక్రమానికి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాం. ఏన్నో ఆటంకాలు, సమానత్వాన్ని మాట్లాడినా, లింగ వివక్ష గురించి మాట్లాడినా ‘అతివాదులు,’ ‘స్త్రీవాదులు’ అన్నారు. వివాహంలో అత్యాచారం గురించి మాట్లాడితే ‘పురుష ద్వేషులు’ అని కూడా బిరుదునిచ్చారు. ఇక స్వలింగ ప్రేమ గురించి మాట్లాడితే మమ్మల్ని ఏకంగా లెస్బియన్ల జాబితాలో కట్టేశారు. ఇవేవీ “నవీన”ని ఆపలేకపోయాయి. ప్రధాన స్రవంతి మీడియా మాట్లాడని అంశాలు, సమాజంలో ఆలోచించడానికి సిగ్గుపడే అంశాలు మాట్లాడడం ముఖ్యం అనుకుంది “నవీన”. నిశ్శబ్దాన్ని చేధించగలిగినప్పుడే సమానత్వపు స్పృహకు దారులు చేయగలుగుతామని నమ్ముతుంది “నవీన”. .

ఇక న్యాయపరమైన హక్కులని అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆస్తిహక్కు, మెయింటెనెన్స్,   గృహహింస చట్టాల గురించి అవగాహన పెంచాం. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు,  మళ్ళీ మళ్ళీ క్యాంపెయిన్ లు నిర్వహించి ఈవ్ టీజింగ్, నలుపే అందం,  మోసపూరిత NRI పెళ్ళిళ్ళు, కనిపించని క్రీడారత్నాలు చివరికి marital rape   లకి సంబంధించి కూడా ఎన్నోసార్లు క్లిష్టమైన అంశాల్ని చర్చకి చేపట్టాం.

ఇక ఆర్ధిక స్వాతంత్ర్యం విషయానికొస్తే డబ్బుకు సంబంధించిన అంశాలు కేవలం పురుషులకు మాత్రమే కాదు మహిళలకు కూడా తెలిసుండాలని నమ్ముతుంది “నవీన”. Bank Account తెరవడం,  Driving Licence తెచ్చుకోవడం లేదా PAN card కి apply  చెయ్యడం లాంటి చిన్న చిన్న విషయాల గురించి అవగాహన “నవీన”.  ప్రేక్షకులకి కల్పించాం.

“నవీన” ప్రస్థానానికి ప్రధాన బలం టివి 9.  సంచలనాత్మక Breaking News ల కాలంలో  మూస భావనలతో మహిళలకు సంబంధించిన అంశాలను చిత్రీకరించడం చాలా తేలిక. అయినప్పటికీ వీటన్నింటినీ తట్టుకుని “నవీన”.  లాంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగించినందుకు టివి 9 ని అభినందించాలి.  “మెరుగైన సమాజం కోసం” అన్న నినాదంతో ముందుకొచ్చిన టివి9 వాణిజ్యపరమైన అంశాలతో సంబంధం లేకపోయినప్పటికీ, వాణిజ్యపరమైన లాభదాయకం కాకపోయినా గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. నమ్మిన విలువలకి అంకితం కావడం మరే ఇతర ఛానల్ ఇప్పటివరకూ చేయలేదేమో. లాభాల వేటలో, TRP ల పోరులో ప్రతి నిత్యం అస్తిత్వ పోరాటం చేయల్సిన దశలో “నవీన”. కి లభించిన గుర్తింపును ఎలా కాదనగలం? ఒక పక్క సమానత్వపు స్పృహ కోసం చేస్తున్న పోరాటం, మరో పక్క అస్తిత్వాని కోసమే ఆరాటం.  ఈ మధ్యలో TRP లకి తల వొంచని ధైర్యం “నవీన”ది. ప్రతీదీ వాణిజ్యపరంగా కొలిచే అటువంటి తెలివిజన్ ప్రపంచంలో “నవీన”.  తీసుకురాగలిగిన మార్పును కొలవడానికి మరే ఇతర సాధనం లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా,  ఒకటే లక్ష్యంతో అడుగులు ముందుకేస్తున్న  “నవీన”.  కి ఈ ఒంటరి ప్రయాణంలో అప్పుడప్పుడూ తోడుగా నిలిచినవి అవార్డ్ లు. ముఖ్యంగా Ramnath Goenka లాంటి    అత్యున్నత పురస్కారం “నవీన”.  కిరీటంలో ఓ కలికి తురాయి.  News Television, United Nations Fund, Ladli  వంటి అవార్డ్ లు గెలుచుకోవడం మేమెప్పటికీ మరువలేనిది.  ఒంటరిగా సాగిస్తున్న ఈ పోరాటంలో ఇలాంటి అవార్డ్ లు వెన్ను తట్టి ప్రోత్సహిస్తాయి.  “నవీన” మన జీవితాల కధ, “నవీన”.  మన పోరాటం.  “నవీన” మన ఆశయం. పితృస్వామ్య భావజాలం రాజ్యమేలుతున్న మన సమాజంలో మార్పు మెల్లగా రావచ్చు,  కానీ ఏదోనాటికి తప్పకుండా వస్తుందని మనస్పూర్థిగా నమ్ముతుంది “నవీన”. . సమ సమాజం కోసం మేం చేస్తున్న ఈ పోరాటం సమాజంలోని వివిధ కోణాల్లో తప్పకుండా ప్రత్యేకమైన ముద్ర వేస్తుందనే గట్టి నమ్మకంతో సమానత్వ పోరాటానికి పునరంకితమవుతూ “నవీన”.   పదో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది.

 

4 thoughts on “Tv9 “నవీన”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *