May 18, 2024

కాలుతున్న పూలతీగలు.

రచన: మెరాజ్ ఫాతిమా

చిత్రం: చిత్ర ఆర్టిస్ట్

meraj

 

పూలతోటలో పరిమళించాల్సిన  కుసుమాలు ,

దున్నపోతుల  గిట్టలకింద నలుగుతున్నాయి.

 

వెలుగు కిరణాలతో  విరియాల్సిన  గులాబీలు,

నిశి  రాతిరిలో నుసి రేఖలై  రాలుతున్నాయి.

 

అక్షరాల  ఆలయాలలో కూడా రాక్షస పాదాలు.

సంచరిస్తూ  సరదా  తీర్చుకున్తున్నాయి.

 

ఉద్యోగాలిచ్చే కంపెనీలు ఊరిబైట చేరి ఊరిస్తున్నాయి,

మిడతల దండును తరిమేందుకు  మిరియపు పొడినిస్తున్నాయి.

 

గడప దాటిన తనయ  ఘడియైనా  కాకముందే,

వార్తల్లో నాని  నాన్నకి  శవమై  అగుపిస్తుంది.

 

ఎన్ని డేగల ముక్కులు పొడిచాయో..,ఎన్ని కుక్కలు ఎంగిలి చేశాయో

ఎన్ని ఎలుగులు దాడిచేశాయో,క్షణ,క్షణమూ  వీక్షణం.

 

కన్నవాళ్ళ,తోడబుట్టిన వాళ్ళను  కెలికి,కెలికి,

నిజాలు తెలుసు కొంటున్న  వైనాలు.

 

దాడిచేసిన  అడవి దున్నలు,జనారణ్యం లో

రొమ్ము విరుచుకు  తిరుగుతున్నాయి.

 

ఏలికలు  బృహన్నలై  “అభయ” ముద్రలు చూపుతున్నారు,

న్యాయస్థానాలు  “నిర్భయ” వాగ్దానాలు చేస్తున్నాయి.

 

ఆడబిడ్డలని  వివస్త్రలను  చేసిన  ఉన్మాదులకు,

ఇలాంటివి “అనూహ్య ” సంఘటనలవుతున్నాయి.

 

ఒక్కసారి,

 

మదాంధులను  వధించి చూడు,

ఉన్మాదులను ఉరేసి చూడు,

చట్టం దాని పని అది చేసుకొనేలా చూడు,

తక్కెట్లో  న్యాయాన్ని సరిచేసి చూడు.

9 thoughts on “కాలుతున్న పూలతీగలు.

Leave a Reply to Lakshmi Raghava Cancel reply

Your email address will not be published. Required fields are marked *