May 14, 2024

సీతామహాసాధ్వి

రచన: బలభద్రపాదుని రమణి

“సీత చాలా మంచి పిల్ల” అన్నారు చిన్నతనంలో..

“సీత బంగారు తల్లిరా!” అన్నారు  వయసు వచ్చాక.

“సీతమ్మ మహా దొడ్డ ఇల్లాలు” అన్నారు హృహిణీగా మారాక.

“సీతమ్మ మహా సాధ్వి” అన్నారు కోడళ్లు వచ్చాక..

సీతమ్మ చెక్కిట  చేయి జేర్చుకొని కూర్చుని చూస్తోంది. చుట్టూ రమణీయమైన ప్రకృతి. భూలోక వైకుంఠమని ఊరికే అన్నారా తిరుపతిని. అలలు అలలుగా కొండల మీదనుంది తేలి వస్తోంది. “శేషశైలావాసా శ్రీ వెంకటేశ్వరా” అని మధుర గాయకుని కంఠ స్వరం.

“బామ్మా! మంచినీళ్లు” మనవడి గొంతు ఆమెని ఇహలోకంలో పడవేసింది.

“వస్తున్నా” అంటూ లేచి వెళ్లి మంచినీళ్ళు ఇచ్చి వచ్చింది.

బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి ఒకసారి తిరుపతి వచ్చింది. ఆ తరువాత కొత్త పెళ్లికూతురిగా భర్త, అత్తమామలతో కలిసి ఒకసారి. ఆ తరువాత ఇన్నేళ్లకి మళ్లీ ఇలా…

“అమ్మా! తిరుపతి వెళ్తున్నాం వస్తావా?” అని చిన్నకొడుకు అడిగేసరికి ప్రాణం లేచి వచ్చింది.

“వెంకన్నా! ఇన్నాళ్లకి మళ్లీ నన్ను పిలుస్తున్నావా? అనుకుని ఆనందంగా ప్రయాణమయింది.

తిరుపతి చేరగానే పెద్ద మనవడికి జ్వరంతో వళ్లు వెచ్చబడింది.

“అయ్యో.. దర్శనం క్యూలో అన్ని గంటలు ఈ జ్వరం పిల్లవాడితో ఎలా?” అని కోడలు కంగారు పడ్తుంటే…

“మరేం పర్లేదు! అమ్మ చూసుకుంటుందిలే.” అన్నాడు కొడూకు.

పట్టుచీర కట్టుకుని చిన్నవాడ్ని చంకన వేసుకుని దర్శనానికి వెళ్తూ “మేము వచ్చేసరికి ఆలస్యమవుతుందేమో! టిఫిన్ తెప్పించాం తినెయ్యండి. బాబు జాగ్రత్త” అని చెప్పింది కోడలు.

సీతమ్మ ఏమీ మాట్లాడలేదు. అలా మాట్లాడటం ఆమెకి ఇన్ని సంవత్సరాలుగా అసలు అలవాటే లేదు.

“అమ్మా! మంచి తల్లివని నీ మొఖమే చెప్తోంది దానం చెయ్యమ్మా” అన్న పిలుపుకి తలతిప్పి చూసింది.

బిచ్చగత్తె కనిపించింది.

“నేను మంచిదాన్ని కాదు అవతలికి పో..” అంటూ అరిచింది.

అది వెళ్లిపోయాక అలా అన్నంది నేనేనా? అని తనలో తనే బోలెడు ఆశ్చర్యపోయింది కూడానూ!

సీతమ్మకి పాపం చాలా మంచి పేరు. ఐదుగురు సంతానంలొ మధ్య పిల్లగా పుట్టింది సీత.

“అన్నయ్యకీ, అక్కయ్యకీ కోసం తెప్పించకూ” అనేది అమ్మ.

“చెల్లినీ, తమ్ముడినీ ఏడిపించక, ఏం కావాలో చూడు” అనేవారు నాన్న.

తను దేనికైనా మారాం చెయ్యబోయినా కావాలని ఏడుద్దామనుకున్నా “మా సీత మంచి పిల్ల. మిగతావాళ్లలా కాదు” అనేవారు అమ్మానాన్నలు.

దాంతో తను ఠక్కున ఏడుపు ఆపేసేది.

తనకి వయసు వచ్చేసరికి అక్క పెళ్ళాయి అత్తారింటికి వెళ్లిపోయింది. ఇంటి పనులన్నీ తనమీదే పడ్డాయి. ఎన్నడూ గుమ్మం ముఖం చూసి ఎరగదు.

“వంచిన నడుం ఎత్తదు. మంచి పనిమంతురాలు” అంటూ పొగిడేవారు అందరూ.

ఆ సర్టిఫికెట్ల పుణ్యమా అని మొదట చూసిన సంబంధమే నిశ్చయం అయిపోయి తను పెళ్లికూతురయింది.

అలా రాఘవరావుగారి ఇల్లాలయింది సీత.

మరుదులూ, ఆడబిడ్డలూ, అత్తమామల మధ్య ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడలేదు. ఎవరికి ఏమీ తక్కువ చెయ్యలేదు. “చాకిరి చెయ్యడానికే పుట్టాను” అనుకునేది.

“మా కోడలు మంచి పిల్ల. ఈ కాలం వాళ్లలా కాదు” అంటూ అత్తగారు నలుగురితో చెప్తుండేది.

సీత వంటింటికీ, పడగ్గదికీ అంకితమయిప్యింది.

పిల్లలు పుట్టాక వాళ్ల ఆలనా పాలనా చూడడంలో పడి తన ఉనికిని తనే మరిచిపోయింది. పిల్లలే ఆమె లోకం అయ్యారు.

పిల్లలు పెద్దయి పెళ్ళిళ్లు అయ్యాయి. కోడళ్లు వచ్చారు.

“మా అత్తగారు చాలా మంచి ఆవిడ” అన్నారు కోడళ్లు.

ఎన్నడూ సీతమ్మనోరు తెరిచి వాళ్లని ఒక్క మాట కూడా అనలేదు. సీతమ్మ చాకిరి ఇంకాస్త పెరిగింది అత్తగారయ్యాక.

ఆమె పెద్దకొడుకు పిల్లలు పెద్దయ్యేవరకూ వాళ్ల దగ్గర ఉంది. తరువాత చిన్న కోడలికి ఉద్యోగం వచ్చాక చిన్న కొడుకు పిల్లల్ని పెంచడానికి వచ్చింది.

“నేను కొడుకుల దగ్గర ఉండను. అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ల్లిపోతున్నాను వస్తావా?” అన్నాడు రాఘవరావు.

అదే మొదటిసారి ఇన్నేళ్ల దాంపత్యంలో ఆయన భార్య అభిప్రాయం అడగటం.

” అమ్మ మమ్మల్ని వదిలి వస్తే ఎలా? అన్నాడు చిన్న కొడుకు

“పనిమనిషి ఇంత బాధ్యతగా చేస్తుందా?” అని బహుశా మనసులో అనుకొని ఉంటాడు.

సీతమ్మ మౌనంగా ఉండటంతో ఆమె భర్త ఒక్కడే వెళ్లిపోయాడు.

ఆమె మంచితనం అతన్ని ఆపలేదు. అతనితో వెళ్లనివ్వలేదు.

సీతమ్మ ఇప్పుడు జీవితం చరమాంకంలోకి వచ్చింది. ఇన్నేళ్ల తరువాత ఇంత తీరుబడిగా కూర్చుని తన జీవితాన్ని సమీక్షించుకునే సమయం చిక్కింది.

ఆమెకి ఒక చిత్రమైన కోరిక కలిగింది

తన తల్లిదండ్రులు తన ముందుకు వస్తే బావుండుననీ, వస్తే.. ఇలా అడగాలని “అమ్మా!! చిన్నప్పుడు అందరు పిల్లల్లా నన్ను ఎందుకు మారాం చెయ్యనివ్వలేదూ? వాళ్లతో సమానంగా నా కోరికలు తీర్చుకోనీయకుండా మంచి పిల్ల అని నా నోరు ఎందుకు నొక్కేవూ? నా అందమైన బాల్యం అందరిలా ఎందుకు అనుభవించనియ్యలేదూ?”

తండ్రితో “నాన్నా! నాకు రంగు రంగుల బట్టలు కట్టుకోవాలనీ, ఇంట్ళో పనే కాకుండా వాకిట్లో కాసేపు నిలబడాలనీ ఉండేది. పుస్తకాలూ, సినిమాలు లాంటివి నాకూ ఇష్టమే. కాని నువ్వు, మా సీత అందరిలాంటి పిల్ల కాదు” అని నా కోరికలని ఎందుకు సమాధి చేసావు?” అనీ.

భర్తని నిలదీసి “అందరి అవసరాలు అడక్కుండానే తెలుసుకుని తీర్చిన మీరు నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నాకు మీతో ప్రపంచం గూర్చిన మాటాముచ్చటా చెప్పుకోవాలనీ,  మీతో కలిసి ఎక్కడికన్నా కాసేపు తిరిగి రావాలనీ, ప్రపంచం గూర్చిన విషయాలు పంచుకోవాలనీ ఉండేది. ఎందుకని మీరు నన్ను మీ పిల్లలకి తల్లిగా మాత్రమే మార్చారూ? మీ జీవిత సహచరిగా, ఓ స్నేహితురాలిగా చూడలేకపోయారు? నా యవ్వనాన్ని పుష్పించే తరుణంలోనే మోడు వార్చేసారు. మా ఆవిడ నా పూర్వజన్మ  సుకృతం అంటూ  ఇలా మరబొమ్మలా ఎందుకు మార్చారూ? అని

కనీసం ఇప్పుడన్నా కళ్లు తెరుచుకుని తన మంచి పేరు మాపుకోవాలి.

” మా అత్తగారు చాలా మంచిది” అని చెప్తూ, “ఆఫీసునించి నేనూ, మీ అబ్బాయి సినిమాకి వెళ్తున్నాం. పిల్లలకి అన్నాలు పెట్టి నిద్రపుచ్చేయండి” అంటున్న కోడలితో..

“లేదమ్మా! నేను మీరు అనుకుంటున్నంత మంచిదాన్ని కాదు.నా మనసులోనూ భావాలు, సంఘర్షణలూ అన్నీ ఉన్నాయి. అవి వ్యక్తపరచలేకపొవడం నా అశక్తత మాత్రమే. మరబొమ్మలా యాంత్రికంగా బ్రతకడం ఇక నా వల్ల కాదు. నన్నూ మీ మావగారి దగ్గరికి పంపించేయండి. కనీసం ఈ జీవిత సంధ్యా సమయంలోనైనా నాలో అణుచుకున్న కోరికలు కొన్నైనా తీర్చుకోనీయండి.” అని చెప్పాలని వుంది.

ఏడుకొండలు ఎక్కి పైకి చేరినా? శ్రీవెంకటేశ్వరుడ్ని దర్శించలేని అశక్తత ఆమె మీద ఆమెకే అసహ్యాన్ని తెప్పించింది. ఆ వేడిలో గట్టిగా నిర్ణయించుకుంది. “ఈ మంచితనపు బరువు ఇంక నేను మొయ్యలేను. మంచిదాన్ని అన్న పేరు త్యాగం చేసైనా సరే నా అభిప్రాయాలు నిక్కచ్చిగా ఇకనుండి వ్యక్తం చేసేస్తాను” అని

మనవడు మళ్లీ “బామ్మా” అని పిలవడంతో లేచి లోపలికి వెళ్లింది.

తిరుపతి నుంచి వచ్చిన మరునాడే పెద్దకొడుకూ, కోడలూ వచ్చారు.

“అమ్మా! నీ నగలు బ్యాంక్‌లోనే ఉన్నాయిగా. అవి అమ్మి నాకిస్తే ఇల్లు పైభాగం పూర్తి చేద్దామనుకుంటున్నాను.. తమ్ముడికి ఈ ఇల్లు మొత్తం ఇచ్చేయచ్చు” అన్నాడు.

ఈ ఒడంబడికకు చిన్నకొడుకు కూడా సుముఖంగానే కనిపించాడు.

సీతమ్మ పెదవి విప్పి మాట్లాడలేదు.

ఆ రాత్రి కూర్చుని ఓ సుదీర్ఘమైన లేఖ కొడుకులని ఉద్దేశించి వ్రాసింది. దాని సారాంశం “బాబూ! ఇన్నాళ్లూ పెదవి విప్పకుండా  అందరి ఇష్టాలకీ అనుగుణంగా మసిలాను. ఇంక నా వల్ల కాదు. మా ఇద్దరి ముసలి  ప్రాణాలూ ఉండగానే నగలూ,, ఇల్లూ అమ్మేసి, మీకిచ్చి అనాధలం కాలేము. మా తదనంతరం అవి ఎలాగో మీవే. కాబట్టి అవి అమ్మి నేను బ్యాంక్‌లో వేసుకుందామనుకుంటున్నాను. ఆ వడ్డీతో మా బతుకులు మీ మీద ఆధారపడకుండా  గడచిపోతాయి. నన్ను రేపే మీ నాన్నగారి దగ్గరికి పంపించెయ్యండి. మా అమ్మ చెడ్డది అనుకున్నాసరే పోయేలోగా ఆ చెడ్డతనాన్ని కూడా అనుభవించే పోతాను” అని వ్రాసి ఆ ఉత్తరాన్ని ప్రొద్దుటే ఇవ్వవచ్చు అనుకుంటూ దిండుగలీబులో పెట్టి నిశ్చింతంగా కళ్లు మూసుకుంది.

“ఇదేమిటి విడ్డూరం!! అత్తగారు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకపోవడం” అంటూ పెద్ద కోడలు ఆవిడ మంచం దగ్గరకు వచ్చింది.

“ఇలా ఎప్పుడూ జరగలేదు అక్కయ్యా! కోడికంటే ముందే లేస్తారు” అంటూ చిన్నకోడలు కూడా వచ్చింది.

“అత్తయ్యా! అత్తయ్యా! అంటూ  లేపడానికి ప్రయత్నించారు.

ఎంత పిలిచినా సీతమ్మ కళ్లు తెరవలేదు. ఇక తెరవలేదు కూడా.

ఆమె మంచితనాన్ని మాత్రమే చూడడం అలవాటయిన దేవుడు ఆవిడ చెడ్డతనం ఏదైనా ఉంటే అది లోకానికి వెల్లడి చేయదల్చుకోలేదు. ఆవిడని మంచిగానే తన దగ్గరికి చేర్చేసుకున్నాడు.

అందరూ గొల్లుమన్నారు.

“పుణ్యాత్మురాలు, దొడ్డ ఇల్లాలు, దేవత” అని స్తుతించారు.

ఆమె భర్త కూడ వచ్చాడు . “నాకు వచ్చే జన్మలోనూ ఇలాంటి ఇల్లాలే కావాలి” అంటూ శోకించాడు.

కొడుకులూ, కోడళ్లూ మరొకందుకు ఏడ్చారు.

దహనం కాగానే ఆమె పక్క బట్టలూ, దిండు గలీబూ దాంట్లో  ఉన్న ఉత్తరంతో సహా చాకలిదానికి ఇచ్చేసారు.

చాకలిది ఆ కాయితం ముక్క గుమ్మం అవతల గిరాటేసి అవి పట్టుకుని చక్కా పోయింది.

ఆ కాయితం అలా.. అలా ఆకాశం వైపు ఎగురుతూ మంచి సీతమ్మగారికి వీడ్కోలు చెప్పింది.

 

************

13 thoughts on “సీతామహాసాధ్వి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *