May 13, 2024

హాట్ హాట్ కూరగాయలు

రచన: టి.జ్ఞానప్రసూన

“ఏమండోయ్ కూరలు  తేవాలి ,అన్నీ అయిపోయాయి , ఒక్క పచ్చిమిరపకాయ కూడా లేదు “అంది మీనా

“చచ్చామ్రా బాబూ ఇదొక శిక్ష” అనుకొంటూ లేచాడు  పరంధామయ్య. డబ్బు తీసి సంచీలో వేసుకొని ఖాళీ పర్సు చేతిలో పట్టుకొన్నాడు.

అది చూసి  మీనా “అదేమిటండీ!! డబ్బులు సంచీలో వేసి  ఖాళీపర్సు చేత్తో పట్టుకొన్నారేం ?

అంతే మరి!  కూరలెంత మండిపోతున్నాయ్!  సంచీలో డబ్బు పట్టుకెళ్ళి పర్సులో కూరలు  తెచ్చుకోవాలి. అని వీధి తలుపు జారవేసి   వెళ్లి పోయాడు.

ఇదివరకు   ఆడవాళ్ళు  కలుసుకొన్నపుడు పరస్పరం వేసుకొనే ప్రశ్న “ఇవాళ ఎం వండారు ?అని ఆ అలవాటు పోయింది. కొంత తీరిక లేక, కూర చెయ్యలేదని చెప్పుకోవడం ఇష్టం  లేక కావచ్చు. బీదవాళ్ళ కిందో,  పిసినారుల కిందో  లెక్క కడతారని భయము కావచ్చు.  ఆర్ధిక స్తోమతు అంతా మన మెనూలో  తెలిసిపోతుందని కొందరు లలనామణులు వారి దర్పం, జోషు కలిపి “మా  ఆయనకీ వంకాయ కారం కూర చేసాను, మా చిన్నాడికి  బెండకాయ వేపుడు, సాంబారు, అప్పడాలు,  దోసకాయ పచ్చడి” –ఇలా చెప్తారు. ఆ అబద్ధాలు, బడాయిలు చెప్తుంటే వారి ముఖకవళికలే  చెప్తాయి  ఇదంతా వట్టి బాజా అని.

కూరలేని కూడు అని   చీత్కారం చేస్తారు. తెల్లరిలేస్తే  ముద్దపప్పా? పొడి పప్పా! అనే ఆలోచన. పొద్దు కూకితే  చాలు పప్పు చారా? వేపుడా అనే గోలే ! ఈ ఆలోచనలతోనే  ఆడవారి బుర్ర గంధపుచెక్కలా  అరిగిపోతుంటుంది .

మా  అచ్యుతం అక్క పొద్దుటిపూట ఉషారుగా పప్పు కూరా, పచ్చడి చేసేది. సాయంత్రం నాతో  కాసేపు కబుర్లు చెప్పాక “వంట చెయ్యాలి జానీ ! పొద్దున్న వంటలన్నీ వండానా?  అన్నీ గంగలో కలిసిపోయాయి. ఒక్కటి లేదనుకో! మీ బావ గారికి ఏ లోటు  వచ్చినా విడాకుల కాగితం  ముందు పెడతారు అని గబాగబా వెళ్లి పోయేది .

ఇప్పుడు  కూరలు లేకుండా  వంట చెయ్యాల్సి వస్తోంది.. ఉష వంటింట్లో ఒక బోర్డ్ పెట్టింది. వారాల  ప్రకారం రోజు సాయంత్రం వేళ పప్పు పచ్చళ్ళే! కంది  పచ్చడి, శనగపప్పు పచ్చడి, పెసరపప్పు పచ్చడి. మినప పప్పు పచ్చడి, ఉల్లిపాయ కారం, అల్లం పచ్చడి, కొత్తిమీర  పచ్చడి . ఎవరికైనా   ఇష్టం లేకపోతే  నన్ను కూడా తీసుకుని   హోటల్ కి వెళ్ళవచ్చు. అని

ఇంటి పెరట్లో   కూరగాయలు పండించుకొందామంటే అసలు పెరడేదీ !  నిన్న ఒకావిడ  కూరాలకి వచ్చి “అన్నిటికంటే చవకగా ఏ కూర వుందో  అదియ్యి  అంది. అతను నవ్వి చవకంటే   వానలొచ్చాకే! అన్నాడు.

మా రాముకి  ఎక్కువ ఖరీదు పెట్టి కూర కొనాలంటే అసలు మనసొప్పదు. సిమ్లామిర్చి, గోరుచిక్కుడుకాయలు తెచ్చి వాటితో వారోత్సవాలు చేస్తాడు. ఇదేమిటి?  అంటే   ఏమి చేస్తాం , ధరలు పెరిగిపోయాయి , అంత  పెట్టి కొంటే ఇవాళ పండగ రేపు ఎండగ , సంసారం నడవొద్దూ !అంటాడు.

నేను రమ షాపింగ్ కి వెళ్లి వచ్చేసరికి ఎనిమిది అయింది.  పిల్లలకి అరగంటలో అన్నం వండి పెట్టింది. ఇంత తొందరగా ఎలా చేసావే!అంటే   ఏముంది

నేటి బాలలే రేపటి పౌరులు  నిన్నటి పప్పే నేటి పప్పుచారు అంది.  మళ్ళీ నవ్వి నేటి కూర రేపటి పరాఠా అంది . ఆకాశాన్నంటే  ధరలు   ‘జిహ్వ చాపల్యం  తగ్గించుకోండి, ఒక్క ఆదరువ తో భోజనం చెయ్యడం నేర్చుకోండి అని  చెప్పక చెప్పుతున్నాయి. అలా చేస్తే బోలెడు సమయం కలిసి వస్తుంది.

మొన్న ఒకావిడ చవకగా వచ్చాయని ముదురు బెండకాయలు తెచ్చి కూర చేసిందిట. నూనె తక్కువ వేసి పోపులో వేస్తే  దాన్నిండా గింజలే కనపడ్డాయి కానీ బెండకాయ ముక్క లేదు. భర్త  భోజనానికి కూర్చుని  కూర చూసి సగ్గు బియ్యం కూర చేసావా? అన్నాడట . మరీ చెప్తారండి! కాస్త  ఆలస్యంగా  కోసినట్లున్నారు నలుగు గింజలు పడ్డాయి. గట్టిగా నమిలితే సరి , సోమ్మెట్టి కొనుక్కొన్నది పారేసుకొంటామా?అందిట.

తిండి తింటుంటే డబ్బే కనిపిస్తోంది కానీ,  తృప్తి ఎక్కడిది?

5 thoughts on “హాట్ హాట్ కూరగాయలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *