May 13, 2024

స్వర్ణయుగపు వార్తాహరులు

రచన: క్రిష్ణవేణి

dd_doordarshan_hd

స్వర్ణయుగపు వార్తాహరులు

బ్రేకింగ్ న్యూస్, స్కామ్

-అంటూ అరుపులూ, కేకలూ పెట్టే ఏంకర్లు.

పానెల్ డిస్కషన్స్, టీఆర్‌పీలు, వీటిని బట్టి వచ్చే వాణిజ్య ప్రకటనల రాబడి.

వీటన్నిటికీ తగ్గట్టు ఈ పానెల్ డిస్కషన్స్‌లో పాల్గొనే నిపుణులైన(?)వక్తలు- ‘గుడిగుడి గుంజం గుండారాగం’ అన్నట్టుగా- ఒకే రోజు, అదే న్యూస్ గురించిన డిస్కషన్స్‌లో వేరే వేరే ఛానెళ్ళలో కనిపిస్తారు. వక్తలేమిటి చెప్పబోతారో అని ఏంకర్లకి ముందే దివ్యదృష్టితో తెలుస్తుంది! కాబట్టి ఆ వక్తలని ఆహ్వానిస్తారే తప్ప వారికి నోరిప్పడానికి అవకాశం ఎలాగూ ఇవ్వరు. ఈ ఉద్యోగాలు చేసే ఏంకర్ల జీతాలు సంవత్సరానికి 5 నుంచీ 10 కోట్లు!!!

కొంతసేపు వీరిని మరిచిపోయి గతంలోకి తొంగి చూద్దాం.
ఒకానొకప్పటి దూర్‌దర్శన్‌ న్యూస్ చదివేవారందరి మొహాలూ/పేర్లూ ముందు తరం వారికి పరిచితమే.

ఒక గంట ప్రాంతీయ వార్తలూ, ఒక గంట హిందీలో మరియు ఒక గంట ఇంగ్లీష్లో జాతీయ వార్తలు ప్రసారం అయే దూర్ దర్శన్ రోజులు గుర్తుకొస్తాయి ఈ ప్రైవేట్ ఛానెళ్ళని చూస్తుంటే. కనీసం ఆ గంటో, రెండు గంటలో న్యూస్ వినడానికి అన్ని పనులూ కట్టిపెట్టి టివి ముందు కూర్చునేవాళ్ళం.

డిడి ప్రభుత్వ ఛానెల్ అయినప్పటికీ, న్యూస్‌లో యదార్థం పాళ్ళు ఎక్కువన్న నమ్మకం ఉండేది అప్పటి  ప్రేక్షకులకి. ఆనాటి న్యూస్ రీడర్లు తమతమ విశిష్టమైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, వృత్తి ధర్మం గుర్తుపెట్టుకుంటూ, స్పష్టమైన ఉచ్ఛారణతో న్యూస్ చదివేవారు. తమ అభిప్రాయాలని ప్రేక్షకులమీద రుద్దేవారు కాదు.

కొంతమంది న్యూస్ రీడర్ల(ఆరోజుల్లో వాళ్ళింకా న్యూస్ ఏంకర్లు కాలేదు)ని గుర్తు చేసుకుందాం.
దూర్ దర్శన్ ప్రారంభ స్వరం/ప్రకీర్ణకంతో మొదలుపెడదాం.

సల్మా సుల్తాన్

salma 

ఈమె డిడిలో 30 సంవత్సరాలు హిందీ న్యూస్ రీడర్గా పని చేసి, 1997 లో రిటైరయింది. ఆమె ఎడం చెవికింద ఉండే గులాబీ పువ్వు గుర్తే కదా! తన ఇంటిముందున్న తోటలో గులాబీ చెట్లుండేవి కనుక మొదటి రోజు తను కట్టుకున్న చీర రంగుకి మాచ్ అయే గులాబీ పెట్టుకుంది. ఆ రోజుల్లో డిడి ఆఫీస్ బయట ఒక లెటర్ బాక్స్ ఉండేది. మూడవరోజున గులాబీ పెట్టుకోకపోతే  ‘పువ్వెందుకు పెట్టుకోలేదని’ అడిగుతూ ఉన్న ఉత్తరాలు ఆ డబ్బాలో కనిపించేయి. డిడి బ్లాక్ అండ్ వైట్‌నుంచి కలర్‌లోకి మారినప్పుడు చీరలైతే రోజూ వేరువేరువి కట్టుకునేది కానీ వాటి రంగులకు మాచ్ అయే బ్లౌసులు లేకపోవడం వల్ల, వేసుకున్న బ్లౌస్ రంగు కనిపించకుండా రెండు భుజాలమీదా ‘వి’ షేప్లో ఉండేలా పమిటచెంగు కప్పుకునేది. అదే స్టైల్ స్టేట్‌మెంటయింది ఆ తరువాత.
  ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు సల్మా సుల్తాన్ చాలా భావోగ్వేదానికి గురై, కళ్ళనీళ్ళతోనే న్యూస్ చదివింది.
“ఆకాలంలో ఉండే టైప్ రైటర్లు పాతవి. వాటి కీస్ సరిగ్గా పనిచేసేవి కావు. ఒకరోజు టెలిప్రాంప్టర్ మీద – ‘పురానే జమానే మే ఔరతోంకో పరదే మే బంద్ రఖా జాతా థా’. అని టైప్ చేసి ఉండవలిసినది కాస్తా అక్షరాలు తారుమారు అయి, ‘పురానే జమానే మే ఔరతోంకో బందర్ ఖా జాతా థా’ అని రాసి ఉండాలి. నయం. చదువుతున్నప్పుడు ఆ పొరపాటుని గమనించి సరిగ్గానే చదవగలిసేను” అంటుందామె.

ఇప్పుడామె “లెన్స్ వ్యూ “ అన్న ప్రొడక్షన్ హౌస్ నడుపుతుంది.

మీనూ తల్వార్

geet

 

ముందు “చిత్రహార్ “- అలాంటి ప్రోగ్రాములకి ఏంకర్‌గా పని చేసిన తరువాత 1970 లలో న్యూస్ చదవడం ప్రారంభించింది.

కనిపించడానికి చిన్న వయస్సున్నట్టుగా ఉండడం వల్ల ఒకసారి వాళ్ళమ్మాయితో కూడా ఖాన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పిల్ల స్నేహితుడు “ అందంగా ఉన్న నీ స్నేహితురాలి నంబర్ ఇవ్వవా?” అని అడిగేడా అమ్మాయిని.

ఫేమినా పత్రికలో తన ఇంటర్వ్యూ అచ్చయి, “సెక్సీ మీనూ” అన్న హెడ్‌లైన్స్ ఉన్న పత్రిక ఇంటికి రావడంతోనే ఎక్కడ దాన్ని తన మామగారు చూస్తారో అనే కంగారుతో ఆమె పత్రికని దాచేసింది. ఆమె పాటలు బాగా పాడుతుంది. ఈ వయసులో  కూడా జిమ్‌కి వెళ్ళే అలవాటుంది. డిడిలో ఇప్పుడు కన్సల్టెంట్‌గా పని చేస్తోంది.

షమ్మీ నారంగ్

shammi

వృత్తిరీత్యా ఇంజినీర్. మంద్రస్వరం. ఇప్పుడు ఇతని గొంతు ఢిల్లీలోనే కాక ఇతర అన్ని పట్టణాల మెట్రోలలోనీ  ప్రతిధ్వనిస్తుంది.

సమాచారం చదువుతున్నప్పుడు, ఒక షాట్‌నుండి ఇంకో షాట్‌కి మారే మధ్య వచ్చే కొన్ని సెకెన్ల విరామాన్నీ నింపడం కోసం తీరిగ్గా పెన్ను కాప్ మూసి పెన్ జేబులో పెట్టుకునేవారు. ఒకరోజు ఒకమ్మాయెవరో ‘షమ్మీ అంటే తనకి చాలా ఇష్టమనీ, అతనికి కూడా తనంటే ఇష్టం ఉంటే కనుక ఆ రోజు బులెటిన్ చదువుతున్నప్పుడు పెన్ను మూసి జేబులో పెట్టుకోవద్దనీ’ రాసి ఉత్తరాల డబ్బాలో వేసింది. మర్నాడు ఆ అమ్మాయిని ఏడిపించడానికి పెన్ను మూసి జేబులో పెట్టుకోబోతున్నట్టు అభినయిస్తూ, తిరిగి పెన్ను చేతిలోకి తీసుకున్నారతను.

“ ఆ కాలంలో సమాచారానికి ఏ కూడికలైనా చేసినా, క్రమం తప్పినా న్యూస్ డైరెక్టర్ ఊరుకునేవారు కారు. ఆడియన్సుతో ఉండే బాంధవ్యమే మాకు ప్రేరణ కలిగించేది.”-అంటారతను.

మే 1990 లో ఇతను డిడి వదిలిపెట్టేరు.

ఇప్పుడతనికి పిన్ డ్రాప్ అన్న స్టూడియో ఉంది.

ప్రణయ్ రోయ్

pr

 

తన డిడి ఉద్యోగాన్ని జెనెరల్ ఎలెక్షన్స్ గురించిన కవరేజ్‌తో ప్రారంభించి “న్యూస్ టునైట్ “ మరియు “థ వర్ల్డ్  థిస్ వీక్” అన్న ప్రోగ్రాములని హోస్ట్ చేసేవారు. ‘24 గంటల సమాచార ప్రసారం’ అన్న ఆలోచన కలిగినది మొదట ఈయనకే. దాని ఫలితంగానే ‘ఎన్‌డీ టివి’ ప్రారంభం చేసేరు.

ఆ కాలం న్యూస్ రీడర్లు ఎక్కువ పరిణితిగలవారుగా ఉన్నట్టు కనిపించాలన్న నియమం ఉన్నందువల్ల మరీ వయస్సు తక్కువ ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకునేవారు కారు.

గీతాంజలీ అయ్యర్

dunno1

 

 ఆ రోజుల్లో ఆమె హైర్ కట్ చూసి ఆమె హైర్ స్టైలిస్ట్ ఎవరో తెలుసుకుని, అదే స్టైల్ తమకీ కావాలని ఆమె హెయిర్ డ్రెసర్ వద్దకే వెళ్ళేవారు కొంతమంది ఆడపిల్లలు. ఒకరోజు ఆమె న్యూస్ చదువుతుంటే తన మైకుని ఎవరో లాగుతున్నట్టనిపించి, చదవడం ఆపకుండా, మైక్ వైర్ని తనవైపు లాక్కుని కొనసాగించింది. మళ్ళీ ఎవరో లాగేరు. ఈమె తనవైపు లాక్కోవడం- వీటన్నిటితో స్క్రీన్ మీద ఆమె జుత్తూ, మొహం కదలుతూ కనపడ్డం ప్రారంభించేయి. బులెటిన్ పూర్తి అయిన తరువాత ఆమె వైర్ పట్టుకుని లాగి చూస్తే, అక్కడ ఒక యూనిట్ వ్యక్తి వైర్ చుట్టుకుపోయిందనుకుని దాన్ని సరి చేయడానికని ముళ్ళు విప్పుతూ కనిపించేడు.

నీతీ రవీంద్రన్

neeti

ఈవిడ మన టివి తెరలమీద ప్రతీ రాత్రీ హుందాగా ప్రత్యక్షం అయేది. “న్యూస్ వినడానికి ఇది సమయం” అని గుర్తు చేస్తూ, ఆమె తన క్వీన్స్ ఇంగ్లీష్లో అంతర్జాతీయ న్యూస్ రీడర్స్ ఉచ్ఛారణనిరీతిని సవాలు చేస్తూ న్యూస్ చదవడం మొదలుపెట్టేది.

‘ఎలా చదవాలో అన్న ట్రైనింగేదీ మాకు ఇవ్వబడలేదు కనుక మాలో అందరమూ తమ తమ శైలిలోనే చదివేవారం– అంటారు నీతీ రవీంద్రన్.
1980లలో ఒక బులెటిన్‌ చదవడానికి- కాసువల్ న్యూస్ రీడర్లకి 75 రూపాయలు, సీనియర్ కాసువల్ రీడర్లకి 100 రూపాయలూ ఇచ్చేవారు.

జేవీ రమన్ (రమణ)

jv raman

సమాచార పరిశ్రమలో ఈయనది గంభీరమైన కంఠధ్వని. ఢిల్లీ యూనివర్సిటీలో 44 సంవత్సరాలు ఎకొనొమిక్స్ బోధించేరు. 1990 చివరి వరకూ హిందీలో సమాచారం చదివేరీయన. హిందీలో ఆయనది ఎంత శుద్ధ శైలి/వాచకం అంటే ఆయన తెలుగాయన అని తెలిసేదే కాదు. రమణ ఆగస్ట్ 7న, 2014 లో కిడ్నీ ఫైల్యూర్ వల్ల మరణించేరు. థియేటర్ పట్ల ఉన్న ఆసక్తితో, మరణించే వరకూ ఆయన అభియాన్ అనే థియేటర్ గ్రూప్లో పని చేసేవారు. బ్రహ్మచారి.

మృనాళినీ సింగ్

dunno2

 

ఈమె మాటల్లో-“ టెస్టుల, ఇంటర్వ్యూల సమయంలో, మేమెంత వేగంగా చదవగలమో, తప్పులు పట్టగలమో లేదో అని పరీక్షించేటందుకు కొన్ని కామాలు చెరిపేసీ, కొన్ని అచ్చుతప్పులు ఉన్న కాగితాలనీ మాకందించేవారు.
ఎప్పుడైనా ఒక న్యూస్ రీడర్ రాకపోతే ఆఖరి నిముషంలో నన్ను పిలిస్తే, కార్లోనే అద్దం చూసుకుంటూ మేకప్ వేసుకుని, అక్కడికెళ్ళి ద్వారం వద్దే మొహానికి పౌడర్ అద్దించుకున్న రోజులు కూడా ఉన్నాయి.”
ఇలాగే ఒక రోజు రీనీ సైమన్ ఖన్నాని అర్జెంటుగా న్యూస్ చదవడానికి రమ్మంటే, వేసుకుని ఉన్న జీన్స్ తోటే వెళ్ళి సల్మా సుల్తానాని అనుకరిస్తూ చొక్కా రెండు భుజాలమీదా చున్నీ కప్పుకుని న్యూస్ చదివింది. ఈమె ముందు ఆల్ ఇండియా రేడియోలో పని చేసేది.

సరళా మహేశ్వరీ కట్టుకునే రంగురంగు చీరలమీద ఎంతోమంది ఆసక్తి చూపించేవారు. ఈమె అందంగా, నిరాడంబరంగా ఉండేది.
తేజేశ్వర్ సింగ్ తన గంభీరమైన గొంతుతో న్యూస్ చదవడమే కాక ఎడిటర్ల నోట్స్ కూడా సరిచేసేవారు.

టెలిప్రాంప్టర్లు లేని రోజుల్లో కూడా అసామాన్యమైన జ్ఞాపకశక్తి ఉన్న రామూ దామోదరన్ సమాచారం చదువుతున్నప్పుడు స్క్రిప్ట్ వైపు చూడను కూడా చూసేవారు కారు.

డిడి బయట ఉన్న డబ్బాలో వీరిని ఉద్దేశ్యిస్తూ రాసిన ఉత్తరాలు వేసి ఉండేవి. వీరంటే తమకి ఎంత అభిమానమో అనో లేకపోతే ఫలానా ఫలానా న్యూస్ రీడర్ ముందటి రోజు న్యూస్ చదవడంలో ఏ తప్పు చేసేరో అని సున్నితంగా మందలిస్తూ రాసినవో. ఆడ న్యూస్ రీడర్లకి పెళ్ళి ప్రొపోసల్స్ కూడా వచ్చేవి. అదీ బయో దాటాలతో సహా.

స్టూడియోలో పిల్లులూ, బల్లులూ, ఈగలూ, దోమలూ –అన్నీ స్చేచ్ఛగా తిరుగుతుండేవి.

ఆ కాలంలో తమ న్యూస్ స్క్రిప్టులని తెచ్చి పెట్టే ప్యూనంటే వీరందరికీ గౌరవమూ, భయమూ కూడా ఉండేవి. చదవాల్సిన న్యూస్‌ని, క్లిప్ బోర్డ్ మీద క్లిప్ చేసి తెచ్చేవాడు ప్యూన్. పేజీలేమైనా కానీ ఇటూ అటూ అయితే, ఖాళీ స్క్రీన్ వైపు చూస్తూ ఉండాలేమో అన్న పీడకల అందరికీ వచ్చేది మరి! తరువాత టెలిప్రాంప్టర్లు వచ్చేయి. సహజంగా కనిపించడం కోసం టెలిప్రాంప్టర్ ని చూస్తూ అక్కడ స్క్రోల్ అవుతున్న న్యూస్‌ని కళ్లతో అనుసరిస్తూ, తమ చేతిలో ఉన్న పేజీలని తిప్పడం- ఇవన్నీ వాళ్ళు సంవత్సరాలుగా అభ్యసించిన కళ.

వీరందరూ మనతో విజయాలనీ, విషాదాలనీ పంచుకున్నవారు. వీరొక రకంగా మన వ్యసనం అయి ఉండేవారు.

ఇప్పుడు డిడి ఉండటం అయితే ఉంది. కానీ టిఆర్‌పీల పోటీతో ఆ స్వర్ణయుగం మాత్రం ముగిసింది.

 

23 thoughts on “స్వర్ణయుగపు వార్తాహరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *