May 13, 2024

స్త్రీ – పురుష సమానత – ఒక మిధ్య

రచన: అజితా కొల్లా

 

ఆగండి ఆగండి –

మహిళా దినోత్సవ సందర్భంగా మేము సంబరాలు చేసుకుంటుంటే, ఇలా నిప్పుల మీద నీళ్ళు పోస్తావు అని నన్ను ఆడిపొసుకునేముందు, కల్- ఆజ్ – కల్ రూపంలో నేను చెప్పేది , కాదు వ్రాసేది కాస్త చదవండి !!!!!

కల్ – నిన్న………

“ఏవోయ్! నేను వచ్చేవరకు ఆలశ్యం అవుతుంది అని చెప్పా కదా , భోంచేసి పడుకోపొయావా?”

“అదేవిటండి, మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా?”

నిన్నటి మహిళామణి , పతి సేవయే తన ధర్మం అని నమ్మి, అదే మార్గం అనుసరించాలి అని గుడ్డి నమ్మకంతో ముందుకు సాగిన సతి. అప్పటి పరిస్తితుల ప్రకారం అది చెల్లింది. అవే పరిస్తితులు రాన్రానూ  స్త్రీని ఒక వంటింటి కుందేలుని చేసి నీ ప్రపంచం ఇదే అని కట్టిపడేసాయి. ఆ విధంగా మగవాడు ఇంటి పెద్ద – ఆడది వంటింటి పెద్దగా స్థిరపడ్డారు.

రాను రాను ఇది కాస్తా, రౌతు మెత్తన ఐతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది అన్న చందాన ఒక పురుష ఆధిపత్యం కింద మారిపోయింది. అంటే, ప్రేమతో చేసేది వేరు, అలాకాదు చెయ్యాలి అని నిబంధనల ప్రకారం చేసేది వేరు. అది మరిచి స్త్రీ ఒక నిబందనల చట్రంలో  ఇరుక్కుపోయింది. ఇక కాలం గడుస్తున్న కొద్దీ     స్త్రీజాతి జాగృతమై తమకంటూ ఒక స్థానం, గుర్తింపూ వుండాలి అని నడుం బిగించి  తమను కట్టిపడేసిన గీతను దాటి పురుషాధిపత్య రంగాలలోకి దూకేసారు!!!!!!

ఇంతవరకు బానే వుంది. ఇక ఆజ్ – నేడు  విషయానికి వస్తే పరిస్థితులు ఎలా మారాయో చూడడానికి ఒక ఉదాహరణ

“జ్యోతీ నాకు ఆఫీసుకి లేటు అవుతుంది, లంచ్ ప్యాక్ చేసావా?”

“నాకేమన్నా వంద చేతులు వున్నాయా,  పిల్లలని స్కూలుకి పంపి , అన్ని పనులూ చేస్తున్నా కదా, ఇంటి పని ఆఫీసు పని అంతా నా నెత్తి మీదే, ఒక్క పని అందుకోరు, మళ్ళీ అన్నిటికీ వంకలు”

” ఒయ్!!  నిన్నేమన్నా నేను ఉద్యోగం చెయ్యమని తరిమానా? మా వ్యక్తిత్వం, మా అర్ధిక స్వాతంత్రం  అని బయలుదేరారు మీ ఆడోళ్ళంతా, ఇక అయితే రేపటి నుండి ఇంట్లోనే కూర్చో ”

” మీ మగాళ్ళంతా ఎప్పుడూ మా మీద పడి ఏడవటమే, ఆ కూర్చునేదేదో మీరే చెయ్యండి”

“అబ్బో !!! ఇదేమన్నా బాపూ గారి మిస్టర్ పెళ్ళాం సినిమా అనుకున్నావా? ఆడోళ్ళు ఒక్కచేత్తో అన్నీ చేస్తారు అని చూపడానికి, ఆఫీసులో ఎంతమందితో నెగ్గుకురావాలి – ఛీ ఇవ్వాళ బయటే ఏదో ఒకటి గతికేస్తా”

ఇలా రుసరుసలు నసనసలు. ప్రతీ ఇంట్లో ఇదే అని నేను చెప్పడం లేదు, కాని దాదాపు ఇలాంటి పరిస్థితి వుంటుంది, పనితో సతమతమవుతూ, ఏదో ఒక సాకుతో ఎవరో ఒకరిమీద చిరాకు పడిపోతూవుంటారు.

ఈ కాలంలో రెండు సంపాదనలు లేనిది ఒక సాధారణ కుటుంబం నడవడం అన్నది కష్టమే మరి –

ఒకటే పరుగు,

అలుపు ఎరుగని పరుగు ,

పక్కవాడికంటే మనమే ముందుండాలి అని పరుగు,

లేక ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డ బ్రతుకు పరుగు.

ఇహపోతే – కల్ – రేపు

“Girls, We can live without Men..  మగవాళ్ళ అవసరం మనకి లేదు, మనమూ సంపాదించుకుంటున్నాం, వాళ్ళలాగే సిగిరెట్లు తాగుతున్నాం , మందు కొడుతున్నాం, పబ్బులకి వెళుతున్నాం, విమానాలు నడుపుతున్నాం, దేశాలు ఏలుతున్నాం, మనకేం తక్కువ?” అనుకుంటూండే శాతం ఎక్కువ అవ్వొచ్చు. లేక ఇలాగే ఘర్షణలూ – సంఘర్షణలు కొనసాగి  మగవాళ్ళు గొప్పా?? ఆడవాళ్ళు గొప్పా?? అనే సంవాదం కాస్తా మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. తెగేదాకా లాగడం కంటే ఒక అవగాహనకి వచ్చేద్దాం, సరేనా ?

ఎంత అరచి గీపెట్టినా ఆడ-మగ సమానం కాలేరు , కారు కూడా!!! ఇది సృష్టి రహస్యం. మగవాళ్ళూ పిల్లల్ని కనలేరు అన్నది ఎంత నగ్నసత్యమో – ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా (ఆర్టిఫిషీల్ ఇన్సెమినషన్) మగవాడి సహకారం లేకుండా ఆడవాళ్ళు పిల్లల్ని కనడం అనేది దుర్లభం. నేను ప్రస్తుత విషయాలనే ఉపమానాలుగా చేసుకొని చెపుతున్నా. ముందు ముందు మన వైద్యశాస్త్రం ఇంకా ఇంకా అభివృద్ది చెంది – నే చెప్పిన మాట దుర్లభం కాదు అని నిరూపణ జరగవచ్చు!!!!! ఏమో!!

కాని అసలు విషయం ఏమిటీ అంటే – దేనిలో అయినా హెచ్చుతగ్గుల గలాటా వరకు పోతే మిగిలేది బూడిదే . ఆడ అయినా – మగ అయినా – ఇద్దరూ మనుషులే , ఇద్దరికీ వుండే అన్నపానాలు , నిత్యావసరాలు సమానమే. కాని సహజసిద్ధంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కొన్ని గుణాలు అలవడతాయి. అవి రూపుమాపడం కష్టం. ఇక మగవాళ్ళు చెడ్డవాళ్ళూ అని, ఆడవాళ్ళూ గయ్యళిగంపలు అని వాదించేవారికి ఒక మనవి – ఎవరో కొందరు వున్నారు అని జాతి మొత్తాన్ని నిందించటం మన అవివేకాన్ని తెలుపుతుంది. మంచి-చెడు అనేవి ప్రతీ ‘మనిషిలో’ వుంటాయి, వాటికి ఆడా-మగా అనే లింగభేదం లేదు. తరచూ వినిపించే ఇంకో విమర్శ –  ఆడవాళ్లకి రక్షణ ఎందుకు??  ఏ రక్షణ అయినా స్త్రీకి అవసరమే. సహజంగా స్త్రీలు శారీరకంగా బలహీనులు, అంత మాత్రాన వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు.  మానసిక స్థైర్యంతో ధైర్యంగా ఉన్న స్త్రీని ఎదుర్కోవడం చాలా కష్టం. కాని కొన్ని విషయాల్లొ రక్షణ అవసరం, అలాగే మానసిక స్థైర్యం చెప్పే స్త్రీ అండ ఉండడం పురుషుడికి కూడా ఎంతో  అవసరం.   పురుషాధిపత్య రంగాలుగా పేరుపడిన అన్ని రంగాల్లో  స్త్రీ ప్రవేశం కొంచెం ఆలశ్యంగా జరిగింది. కాబట్టి కొంచెం ప్రొత్సాహం, సహకారం అవసరం.

పాశ్చాత్య దేశాల్లో మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధాలు స్త్రీల శక్తిసామర్ధ్యాలకి సవాలుగా నిలిచాయి. మగవాళ్ళు యుద్ధభూమిలో నిరంతర పోరాటం జరపటంలో నిమగ్నమై వుంటే, పరిశ్రమలు మూతబడి ఇబ్బంది వచ్చిన సమయంలో, యుద్ద సామగ్రి పరిశ్రమలని సమర్ధవంతంగా నడపటమే గాక, యుద్ధభూమిలో  వేగుల పని సైతం సమర్ధవంతంగా నిర్వహించారు. ఇలా మిగతా దేశాల కంటే ముందు వీరు పురుష ప్రపంచంలొకి ప్రవేశించారు. అదే అవకాశం భారతీయ స్త్రీకి స్వాతంత్ర సమరంలో లభించింది. కాని అంతలా కాదు. కొన్ని సంస్కతీ సంప్రదాయాలు ఇంకా స్త్రీని కట్టడి చేస్తూనే వున్నాయి. ఇలాంటివి వున్నాయి కాబట్టి రక్షణ తప్పనిసరిగా అవసరం అయింది.

అలాగే మన ఆలోచనా ధృక్పధంలో మార్పులు చేర్పులూ రావాలి – అలోచనాసరళి లింగ భేధాన్ని చూపకుండా మనవతావాదంలోకి మళ్లాలి.  అప్పుడే  ఈ అసమానతల హద్దు చెరిగేది. కాబట్టి ఇద్దరూ తమ అసమానతలను పక్కన బెట్టి సమానతలతో ప్రపంచపు మార్పులు – చేర్పుల కోసం పాటుపడితే మంచిది. అందరూ కలసిరండి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇందులో కూడా నిరూపిద్దాం – అందరికి   శుభాకాంక్షలు .

2 thoughts on “స్త్రీ – పురుష సమానత – ఒక మిధ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *