May 18, 2024

మాయానగరం – 25          

భువనచంద్ర

“అమ్మాయ్ బిళహరి.. నేను చెప్పబోయేది నీ మంచి కోసమే అని చెబుతున్నా బాగా విను. కామేశ్వర రావు చాలా మంచివాడు. ఏ దురలవాటూ కూడా లేనివాడు. ఒకే ఒక లోపం ఏమిటంటే, అతను తల్లిదండ్రులను ఎదిరించలేడు. నాటకాల పిచ్చి వున్నవాడు గనక, అన్నీవూహల్లోనే కానిస్తాడు, ప్రాక్టికల్ గా ఏమీ చేయలేని పిచ్చివాడు. పోనీ వాళ్ళ వాళ్ళని ఎదురించి పెళ్ళి చేసుకున్నాడే అనుకుంద్దాం.. ఎంత కాలం నిన్నుభరించగలడు? ఏడాదో రెండేళ్ళో గడిచాక తోక ముడుచుకొని పారిపోకపోతే చెప్పెట్టికొట్టు!” ఎడంకాలి చెప్పు చూపిస్తూ అన్నాడు సర్వేశ్వర రావు.

“అంతేనంటారా?” విసుగునంతా లోపల దాచుకొని, బాధని స్వరంలో వ్యక్తం చేస్తూ అన్నది బిళహరి.

“కాక? నేనేదో పెద్దవాడిని కనుక వున్నదున్నట్టుగా చెబుతున్నాను. మరో విషయం కూడా నువ్వు గమనించాలి. ఇదా ఓ మహానగరం. ఇక్కడ అడుగడుగునా పులి వేషం వేసుకున్నమేకలే కాదు, గోవు వేషం వేసుకున్న పులులు సిమ్హాలు కూడా సమ్హరిస్తూనే వుంతాయి. పైకి తియ్యగా మాట్లాడుతూ లోపల గోతులు తవ్వే మహానుభావులకి లెక్క లేదు. నువ్వా పల్లెటూరి అమాయకపు పిల్లవి. అందునా ప్రేమించి పారిపోయి వచ్చేశావు. యీ విషయం ఎవరి చెవిన పడ్డా వాళ్ళు నిన్ను తోడేళ్ళు పట్టుకున్నట్టు పట్టుకుంటారనుకో! అందుకే కామేశ్వర రావుని కాస్త కేక లేసి నన్నునాయింట్లో వుంచాను. గొప్పచెప్పుకోకూడదు కానీ, యీ సిటీ అంతటికీ నేనెవరో తెలుసు. సర్వేశ్వర రావు గారంటే సాక్షాత్తు ’సమవర్తి’ అని అందరికీ తెలుసు. ఎంత రౌడీ గూండా అయినా నా జోలికొచ్చే ధైర్యం చెయ్యడు. ఒక వేళ చేశాడా, చచ్చాడన్నమాటే!”గర్వంగా అన్నాడు సర్వేశ్వర రావు.

“అబ్బా.. ఇప్పుడు నాకు ప్రశాంతంగా వుంది బాబయ్య గారు” పిచ్చి విసుగుని మనసులోనే దాచుకొని ‘తృప్తి’ నటిస్తూ అన్నది బిళహరి.

“కదూ మరి. అయినా బిళహరి నన్ను బాబయ్య గారు అని పిలవద్దు. ఎందుకంటే అలా పిలిచిన వాళ్ళు పాపం ఘోరంగా దెబ్బతిన్నారు. అయినా, వయసుకేం? పోనీ.. ‘ఈశ్వర్ ‘ అని పిలువు. నీ వయసుకి తగ్గట్టు వుంటుంది, భగవన్నామం స్మరించినట్టు వుంటుంది” మురిపెంగా అన్నాడు సర్వేశ్వర రావు.

“వీడి బొంద.. ముసలి ముండాకొడుక్కి మురిపెం కూడానూ” అని లోలోపల అనుకుంటూ వుండగానే గేటు చప్పుడయ్యింది. చూస్తే కామేశ్వర రావు వస్తున్నాడు కూరగాయల సంచీతో.

“రావోయి కాముడూ … రా! నీ గురించే అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు చాలా మంచివాడివనీ, అయినా తల్లీదండ్రుల చాటు కుర్రాడివనీ, గొప్పనటుడివనీ, అయినా ఇవ్వాళ రేపు ‘నటన’ అన్నం పెట్టదనీ, నువ్వు చాలా ఎమోషనల్ పర్సన్ వనీ, అయితే ఎమోషనల్ కారెక్టర్ అంటే క్షణానికో రూపుమార్చుకొనేమబ్బులాంటిదనీ, బిళహరికి వివరంగా చెబుతున్నాను!” ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మాటలు పేర్చాడు సర్వేశ్వర రావు.

“మీరెప్పుడూ నన్ను పొగుడుతూనే వుంటారు, అది మీ మంచితనం”ఆనందించాడు కామేశ్వర రావు. సర్వేశ్వర రావు మాటల్లోని ‘లౌక్యము, హేళనా’ అతను ఒక్క ముక్క కూడా గ్రహించలేదని, పైగా దాన్ని పొగడ్తగా భావించడంలో తన వెర్రి తెలివితేటల్నిమరింత బయటపెట్టుకున్నాడనీ బిళహరికి స్పష్టంగా అర్ధమయ్యింది. ఆ క్షణంలో భయపడింది. ‘ఇల్లు వదిలి తప్పు చేశానా? పెనం పై నుండి పొయ్యిలో పడ్డానా?”అని.

“అదేమిటోయ్.. నీలో గొప్ప లక్షణాలను పొగిడాను కానీ ఉత్తినే పొగడలేదుగా. నువ్వు మంచివాడివి కనుక ఢంకా బజాయించి మరీ నువ్వు మంచివాడివని చెప్పాను. ‘సత్యం బ్రూయాత్’ అన్నారు పెద్దలు. తీపిదయినా చేదుదయినా సత్యం మాత్రమే చెప్పాలి. ఎన్ని పూజలు, పుణ్యాలు చేస్తే యీ మానవజన్మ లభించింది? అందుకే, సత్యమార్గం లోనే నడవాలి. సత్యాన్నే చెప్పాలి. ఎవరేమనుకున్నాసరే సత్యం వచించడానికి భయపడకూడదు. నువ్వేమీ అనుకోనంటే ఒక గొప్పసత్యం చెప్పనా?” గాలి పీల్చుకోడానికి ఆగిఅన్నాడు సర్వేశ్వర రావు.

“చెప్పండి గురూజీ. అంతకంటేనా? మీలాంటి విజ్ఞులు మాట్లాడితే మాబోటి వాళ్ళం ఎంతో నేర్చుకుంటాం”. అతి వినయంగా అన్నాడు కామేష్. అతని అతివినయం అంత్యంత నాటకీయంగానే గాక కొంచెం అసహ్యంగా కూడా అనిపించింది బిళహరికి.

“నువ్వు ‘చెప్పొద్దు’ అని అన్నా చెప్పక మాననయ్యా కామేషు. ఎందుకంటే, సత్యం చెప్పడం అనేది ఎంత పుణ్యమో, అసత్యన్ని ‘దాచడం’ అనేది అంత పాపం. తెలిసి తెలిసీ ఆ పాపం చెయ్యకూడదు” సస్పెన్స్ కోసం ఓ క్షణం ఆగాడు సర్వేశ్వర రావు.

“లోకంలో ఓ విచిత్రంవుంది కుతూహలం! ఆ కుతూహలాన్నిఇబ్బడి ముబ్బడిగా రేపే పత్రికలూ, టి.వీ. లూ ‘సీరియల్స్’ తో రేటింగులనీ, సర్క్యూలేషనీ పెంచుకుంటున్నాయి. అవసరమైన ‘కుతూహలం ‘ జ్ఞానాన్ని పెంపోదిస్తే , అనవసరమైన కుతూహలం కాలాన్ని హరిస్తుంది. మనిషి మనసుని ముళ్ళపొదలా మారుస్తుంది”.

“చెప్పండి గురూజీ.. చెప్పండి!” అనవసర కుతుహలంతో సర్వేశ్వర రావుని తొందరపెట్టాడు కామేష్.

“ఇదిగో.. చెప్పాక నువ్వూ ఏమీ అనుకోకూడదు !” ముందస్తు ‘ముగాళ్ళ బంధం’ వేశాడు సర్వేశ్వర రావు.

“అయ్యో.. ఎందుకంటాను? మీరంటే నాకు పిచ్చిగౌరవం. ఈలోకంలో నాకున్న ఏకైక ఆప్తుడు మీరే!” మరింత వినయంగా రెండు చేతులు జోడించి మరీ అన్నాడు కామేష్.

“అదీ.. ఇంతకీ చెప్పాలనుకున్న సత్యమేమిటంటే, ఈ పిల్లని చూడు, ఈ పిల్లనేనయ్యా…బిళహరిని, నా జన్మలో ఇంత మంచిదాన్ని, సత్ప్రవర్తన కలిగినదాన్ని, చూడలేదంటేనమ్ము. నువ్వు చాలా గొప్పపని చేశావోయ్ కామేషు. బిళహరిలాంటి పిల్లని కాపాడి తెచ్చావంటే ఎంత ‘దమ్ము’ ఉన్నవోడివి! శభాష్. ఇలాంటి సుశీలకోసమూ, సౌందర్యవతి కోసమూ ప్రాణాలు క్షణాలలో వదిలేయవచ్చు. కోటికి ఒక్కరుండరు ఇలాంటి సౌదర్యవంతులు. మన ఆఫీసులోనూ వున్నారు సినీ హీరోయిన్లలాంటి అందగత్తెలు. వాళ్ళ ముఖాలలో బిళహరికున్నంత నునుపూ, మెరుపూ బూతద్దం పెట్టి వెదికినా కనిపిస్తాయా? ఎప్పుడూ లిప్ స్టిక్కులు, ఫేషియల్సే గానీ , చూడు .. బిళహరి పెదాలంత ఎరుపు, బుగ్గలంతనునుపు ఒక్కటంటే ఒక్కదానికైనా ఉన్నాయా? అవేవిటీ, వెధవ సిలికాన్ బ్రాల సౌందర్యం తప్ప, మన ‘బిళహరి’ లాంటి సహజమైన వొంపుసొంపులున్నాయా? ‘చొంగకారుస్తూ’ నోటిదూల తీర్చుకున్నాడు సర్వేశ్వర రావు.

“క్షమించండి బాబాయ్ గారు. మీరు నాకంటే పెద్దవారు. ఇలా అంగాంగ వర్ణన చేయడం మీకు తగని పని. అయినా మీకెన్నో పనులుంటాయి మీ సమయాన్నంతా మేమే తినేస్తే, లోకంమమల్నితప్పుపడుతుంది, వెళ్ళిరండి!” విపరీతమైన కోపాన్ని అణచుకునే ప్రయత్నం చేస్తూ అన్నది బిళహరి. సర్వేశ్వర రావు గుండెలో రాయి పడింది. ‘పొగడ్తకు’ పడని ఆడది ఉండదనే అతని నమ్మకం బిళహరి కాల్చేసే చూపుకి మాడి మసై నేలరాలింది. ‘పొగడ్త’ కి లొంగని ఆడది మొదటిసారిగా అతని ముందు ‘ఇంతింతై వటుడింతై ‘ అన్నంత ఎత్తున నిలిచింది.

“అదీ! అదేనమ్మాయ్.. ‘సత్యం’ వినడానికి కటువుగానే వున్నా సత్యం సత్యమే మరీ… అన్నట్టు నువ్వు చెప్పిందినిజమేఅవతలబోలెడుపనులు నా కోసం ఎదురు చూస్తున్నాయి. వస్తానోయ్ కామేషూ… రేపు ఆఫీసులో కలుద్దాం!” అంటూ గబగబా వీధెక్కాడు సర్వేశ్వర రావు.

బిళహరి చూపులోని తీవ్రత చాలా సేపు అతన్ని వెంటాడుతూనే వుంది.

‘భయం’ సర్వజీవ లక్షణం. చిత్రమేమిటంటే ‘ధైర్యం’ పుట్టేది ఆ ‘భయం’ నుంచే! ******************************

“ఈ రోజు ప్రత్యేకత ఏమంటే , నేను అనాథ శరణాలయం వారికి దొరికిన రోజు. అంటే, వారి రికార్డుల ప్రకారం  నా పుట్టిన రోజు” చిరునవ్వుతో అన్నది మిస్ శోభరాణి బియ్యస్సీ.

అది ఊరికి కొంచం దూరంగా వుండే పంజాబీ ధాబా. పేరుకి పంజాబీ ధాబానే కానీ నడుపుతున్నది తెలుగువాళ్ళే.  లారీలు అవీ అక్కడ ఆగవు. కారణం ఊరికి మరీ దూరం లేకపోవడం. అయితే ఆ ధాబా అక్కడ కట్టడానికి కారణం స్టూడెండ్స్. ఆ ధాబా చుట్టుపక్కల నాలుగైదు రెసిడెన్షియల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు వున్నాయి.

‘మెస్’ భోజనం నచ్చని వాళ్లకి ఈ ధాబా అన్నపూర్ణ ధామం.

ప్రస్తుతం ధాబాలో మిస్ శోభారాణీ బియ్యస్సి తో పాటు మాధవి, ఆనంద రావు, మరో పదిమంది శోభతో పని చేసే టీచర్లు (సౌందర్యతో సహా ) విశ్రాంతిగా కూర్చుని వున్నారు.

సాయంకాలం ఏడు గంటలుదాటడంవల్ల చల్లగా వుంది. దీపాలు వెలుగుతూ చిన్నచిన్న దీపం పురుగుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆడవాళ్ళు పూసుకున్న పర్ ఫ్యూమ్ లు చల్లగాలిలో కలిసి పరిసరాల్ని సుగంధభరితం చేస్తున్నాయి.

“శోభా… గతాన్నిమరచిపో. గతం పునాది మీద వర్తమానం నిలబడి వున్నదని నాకు తెలుసు. ఏ భవంతి అయినా నిలబడేది పునాది మీదే. అయితే పునాది తవ్వి చూడం కదా? అట్లాగే , మన గతాన్ని మన గతాన్ని మనం తవ్వుకోకూడదు” శోభారాణి భుజం తట్టి లాలనగా అన్నది సౌందర్య.

“అక్కా… నా జీవితానికి పునాదే లేదు. నీటిమీద తేలేనాచులాగా లోకం అనే చెరువులో తేలుతున్నా. నా జీవితంలో దురదృష్టం ఎంత వుందో, అదృష్టమూ అంతే వుంది. నాకు కులం లేదు, మతం లేదు, ఫలాన దేవుడనే దేవుడూ లేడు. అన్ని కులాలు, మతాలు, దేవాలయాలు, దేవుళ్ళు కూడా నావే. నిన్నమొన్నటివరకూ నాతో పాటు అనాధలుగా పెరిగినవారే నావాళ్ళనుకున్నా కానీ ఇవ్వాళ మీరంతా కూడా నావాళ్ళయ్యారు. చెల్లీ అని నోరార పిలుస్తున్నారు. నా మంచిచెడులన్నీ చూస్తున్నారు. చక్కని సలహాలిచ్చి నా జీవితానికి సరైన బాటలేస్తున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అందుకే ఈ నాటి నా పుట్టిన రోజుని , నా వారైన మీ అందరితో కలిసి జరుపుకోవాలనుకున్నాను” ఓ చిన్నిఉపన్యాసం లాంటి సమాధానం ఇచ్చింది శోభారాణి.

“అలాగే జరుగుగాక… ప్రతి పుట్టిన రోజూ కూడా. ఈ పుట్టిన రోజుని నేను స్పాన్సర్ చెయ్యాలనుకుంటున్నాను” వినయంగా తలవొంచి అందరితో అన్నాడు ఆనందరావు .

“నో.. నో… పార్టీ న్యాయంగా ఇవల్సింది నేనే!” అన్నది శోభ. “ఇప్పుడే పుట్టిన పిల్లలు పార్టీలు ఇవ్వకూడదమ్మ … యూ ఆర్ ఏ బేబీ నౌ” సరదాగా అన్నాడు అనంద రావు.

“అదీ కరక్టే! అలాగే కానివ్వండి ఆనందరావు గారు, అయితే ఓ చిన్న ఎమెండ్ మెండ్… సగం ఖర్చు నాది. నేను తనని అక్కని గనక ” చిరునవ్వుతో అన్నది మిసెస్ మాధవీ రావు.

“నో… నో… నో… మొత్తం ఖర్చు నాదే! ” గట్టిగా శమ్యూల్ రెడ్డి గొంతు ఎంట్రన్స్ దగ్గర వినపడటం తో అందరూ అటు తిరిగారు. “మీకెలా తెలుసూ?” సంభ్రమంగానూ ఆశ్చర్యగానూ అన్నది శోభారాణి.

“మిస్ శోభా… స్కూల్లో మీ సర్టిఫికెట్లు ఉంటాయనీ వాటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందనీ మరచిపొయారా?” పెద్దగా నవ్వి అన్నాడు శామ్యూల్ రెడ్డి.

ఒక్కో క్లాస్ పిల్లలు లోపలకి రావడం మొదలెట్టారు. అందరి చేతుల్లోనూ పూలున్నాయి. ఓ ఇరవై కేజీలకి మించిన బరువున్న కేకుని ముగ్గురు బేరర్లు యూనిఫామ్ లో పట్టుకొచ్చారు. స్టూడెంట్స్ ఎట్టాలేదన్నా ఓ ఎనభై మంది ఉంటారు.

“మైగాడ్.. ఇదంతా ఎలా ఎరేంజ్ చేయగలిగారు? సాయంత్రం వరకు పిల్లలందరూ మాతోనే వున్నారుగా!” ఆశ్చర్యంగా అంటూ గుడ్లు తేలవెసింది హెడ్ మిసెస్.

“వేర్ దేర్ ఈజ్ విల్… ” అంటూ ఓ పుష్ప గుఛ్చాన్ని శోభకి అందించాడు శామ్యూల్.

“మద్యలో అంతరాయం కలిగించినందుకు మీరంతా నన్ను క్షమించాలి. శోభ వచ్చాక మా స్కూల్కి ఓ వెలుగొచ్చింది. అంతే కాదు నా దగ్గర పని చేసేవాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవల్సిన బాధ్యత నాకుంది. ఇక నుంచి ప్రతీ టీచరు పుట్టిన రోజు స్కూల్ యాజమాన్యమే జరుపుతుంది. ఆ సంప్రదాయానికి ఆరంభం శోభ పుట్టిన రోజుతోనే. దయ చేసి అందరూ నన్ను మన్నించి కేక్ కట్టింగ్ అయ్యాక మీకు కావల్సింది చక్కగా ఆర్డర్ చేసి డిన్నర్ చెయ్యాలని నా కోరిక. స్కూల్ పిల్లల భోజనాలు ఇక్కడే” వినయంగా తలవొంచి అందరికీ అభివాదం చేస్తూ అన్నాడు శామ్యూల్ రెడ్డి.

తూర్పు పడమర కాగలదా? పగలు చంద్రుడు రాత్రి సూర్యుడు రాగలరా? రాజకీయనాయకులు సత్ప్రవర్తన తో మెలగగలరా? సినీ హీరో సినిమాల్లో తప్ప నిజంగా హీరోయిజం చూపించి జనాలకి మేలు చేయ్యగలడా? మరో వెయ్యేళ్ళకైనా భారతదేశం “స్వఛ్చ భారత్ ‘ గా మారగలదా?

“సార్.. మీరు మీరేనా?” నమ్మలేక నమ్మలేక అడిగింది సౌందర్య.

“నేనే సౌందర్య గారు ” నవ్వాడు శామ్యూల్ రెడ్డి.

“గారూ నా?” ఆశ్చర్యపోయింది సౌందర్య మాత్రమే కాదు, హెడ్ మిసెస్ కూడా.

“ఇవాళ్టి నుంచి మనందరిదీ ఒకే కుటుంబం” ఆనంద రావు ని చూస్తూ అన్నాడు శామ్యూల్ రెడ్డి.

“కమాన్.. లెట్ అజ్ కట్ ద కేక్ ” శోభా రాణి చెయ్యి పట్టుకొని , కేక్ పెట్టిన టేబుల్ దగ్గరకి తీసుకెళుతూ అన్నాడు.

“హాపీ బర్త్ డే టూ యూ ” అన్న పాటా ఆ ‘ధాబా ‘ ఆవరణలో మొదటి సారి మారుమ్రోగింది. ధాబా ఓనర్ గబగబా ‘షామియానల ‘ వాళ్ళా  కి ఫోన్ చేసి అర్జెంటుగా టేబుల్స్ కుర్చీలు తెమ్మని పురమాయించాడు. బయట కూల్ డ్రింక్స్ షాపు లోనుంచి రకరకాల చల్లని కూల్ డ్రింక్స్ ని కూడా ఆర్డరిచ్చాడు. ఒకేసారి తొంభై మంది ఆ హోటల్ కి రావడం ఆ హోటల్ చరిత్రలో మొదటిసారి.

************************

“నిన్న మీ బర్త్ డే అని నాకు తెలియదు” బాధపడ్డాడు బోస్.

“అయ్యో అదేంటి సార్! అదేమన్నా మహాత్మా గాంధీ పుట్టినరోజా? ఓ అనాధ పుట్టినరోజు, అంతే!” తేలిగ్గా అన్నది మిస్ శోభ రాణి.

“అనాధా?” ఆశ్చర్యంగా అన్నాడు బోస్.

“అవును.. నా తల్లిదండ్రులు ఎవరో నాకు నిజంగా తెలియదు. ఓ అనాధశరణాలయం వారు నన్ను పురిటిగుడ్డుగా చేరదీశారు… పెంచారు… చదివించారు. నాకు ఉద్యోగం వచ్చేసరికి ఆ శరణాలయమే మూతబడింది. కారణం ఓ రాజకీయ నాయకుడి కుడి కన్ను ఆ స్థలం మీద పడటమే. దేవుని దయవల్ల మిగిలిన కొద్దిమంది పిల్లల్ని మిగతా శరణాలయాలు చేరదీశాయి. తను పెరిగిన శరణాలయన్ని తలచుకొనే సరికి కళ్ళ నీళ్ళు తిరిగాయి శోభకి.

“సారీ..” ఆమె కంట నీరు కారడం చూడలేకపోయాడు బోస్.

“మీరెందుకు సారీ చెప్పడం, ప్రజలకి ఎంతో సేవ చెయ్యలనే గొప్ప సేవాభావం వున్న యువనాయకులు మీరు. మీలాంటి వారు ఒక పదిమంది చాలు.. యీ దేశం బాగుపడటానికి” సిన్సియర్ గా అంది శోభ.

“నేనా” అవాక్కయ్యాడు బోస్.

“అవును మీరే.. అవాళ గురుపూజోత్సవం లో చూశాగా! మళ్ళీ సిన్సియర్ గా అని,

“నిజం బోసుగారు! సరే స్కూల్ కి టైం అయ్యిపోయింది. మళ్ళీ కలుద్దాం సరేనా?” కళ్ళు తుడుచుకొని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మిస్ శోభ రాణి బీయ్యస్సి.

అలాగే నిలబడ్డాడు బోస్ బాబు.

“నేనా?” ఈ ప్రశ్న అతని గుండెల్లో సుడులు తిరుగుతూనేవుంది. మొదటిసారిగా అతని అంతరాత్మ అతన్ని ప్రశ్నించడం మొదలెట్టింది. అన్యమనస్కంగా ముందుకు నడిచాడు బోసు బాబు. మనసులో ఏదో అలజడి. ఏదో ఆలోచన. ఏదో గాబరా. గ.మో.కా. వీధి చివరినున్న బస్ స్టాప్ లో అప్పుడే బస్సు దిగాడు వెంకటస్వామి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *