May 19, 2024

అనుంగత  

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

కళ్లజోడు సరిచేసుకుంటూ, మధ్యమధ్యలో గాల్లోకి చూస్తూ, కలం విదిలిస్తూ లేత నీలి రంగులోని ఇన్లాండ్ లెటర్ ను అక్షరాలతో నింపేస్తున్నాడు సుబ్రహ్మణ్యం..

“ప్రియమైన శారదకు..ఉభయకుశలోపరి” అని ప్రారంభించి ఇన్లాండ్ లెటర్ లోని మూడు వైపులా పూర్తయినా, ఇంకా వదలకుండా, ప్రక్కకు త్రిప్పి చిన్నచిన్న అక్షరాలను ఇరికించి మరీ వ్రాస్తున్నాడు. తాను చెప్పాలనుకుంటున్న భావాలకు అక్షరాలు సరిపోవటంలేదు. అక్షరాలు ఇరికించేందుకు లెటర్లో స్థలం సరిపోవటంలేదు. సుబ్రహ్మణ్యం తన జీవితంలో తొలిసారి వ్రాస్తున్న ప్రేమలేఖ అది. మనసులో అంతర్లీనంగా నిక్షిప్తమైన భావాలను అక్షరీకరించే యోగిపుంగవుడిలా ఉన్నాడు ఆ క్షణం.

ఇంకా చెప్పాలి.. చివరి సారిగా ఇంకా..ఇంకా. చాలాసేపు అలా వ్రాస్తూనే ఉన్నాడు. పూర్తయిందని సంతృప్తి చెందాక లెటర్ ను మడతపెట్టి నాలికతో అతికిస్తూ తన గది లోంచి బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం ఎదురుగా వస్తున్న కుర్రాడు శ్రీరాం ను చూసి “ఒరేయ్ చిన్నా ఇటురా, ఈ కవరు కాస్త పోస్ట్ డబ్బాలో వేసిరా!” అన్నాడు..

“ఇదేంటి తాత”.. ఆశ్చర్యపోతూ కవర్ కేసి, తనకేసి చూస్తూ …

“ఇన్లాండ్ లెటర్ లే బాబూ నీకు తెలీదు.. కాస్త పోస్టాఫీస్ వద్ద ఉన్న పోస్ట్ డబ్బాలో వేసి, ఆ విషయం నాకు చెప్పు చాలు” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఇన్లాండ్ లెటర్ అని తెలుసు తాతా, అయినా ఇప్పుడివన్నీ ఏందీ..? ఓల్డ్ ఫ్యాషన్ కదా. మొబైల్ ఉందిగా మొబైల్ లో ఎంత సేపైనా మాట్లాడొచ్చుగా..” అంటూ కొంత స్టైల్ కలసిన తెంగ్లీష్లో మాట్లాడాడు శ్రీరాం.

“అదేరా లెటర్ లో ఉన్న గొప్పదనం… మన మనసులో ఉన్న, ఎన్నో ఊసులు ఎదుటి వారి గుండెలపై నేరుగా లిఖించే ఏకైక అస్త్రం లెటర్.. ఈ ఫాస్ట్ కల్చర్ వారికి చెప్పినా అర్ధం కాదులే చిన్నా..! వెళ్ళి ..లెటర్ పోస్ట్ చేసి, తర్వాత వచ్చి నాకు చెప్పు..” అన్నాడు సుబ్రహ్మణ్యం.

“ఎవరికి తాతా ఈ లెటర్?” ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు శ్రీరాం. ఈసారి ఇంతకు ముందుటి వ్యంగ్యభాష లేదు.. కుతూహలం నిండిన భాష ను కళ్లల్లో నింపుకుని జాగ్రత్తగా అడిగాడు.

“మీ బామ్మకు వ్రాశాన్లేరా..! వెళ్ళు..వెళ్ళి పోస్ట్ చెయ్”. బామ్మ అనే మాట దగ్గర సుబ్రహ్మణ్యం కంట్లో కన్నీరు ఉబికి   వచ్చాయి.

“మీరు ఒక్కరే కదా..మరి ఎవరికి రాశారూ?” అని గొణగబోయిన శ్రీరాం, ఎదురుగా  పెద్దాయన  ఆర్ద్రంగా నించుని  ఉండటం మొదటిసారి చూస్తున్నాడు. దాంతో  కిమ్మనకుండా రోడ్ వైపుకు అడుగులేశాడు.

తన గదిలోకి అడుగులేస్తూ, సుబ్రహ్మణ్యం తన భుజం పై కండువాని కళ్లజోడులోకి చొప్పించి నెమ్మదిగా తడిని అద్దే ప్రయత్నం చేశాడు. కానీ గతం ఊటగా మారి పెల్లుబికుతూ కన్నీటి ప్రవాహమై, భారంగా మారుతున్న మనసును తేలిక చేయాలని ప్రయత్నిస్తున్నట్లుంది.

సుబ్రహ్మణ్యంకి డైభై ఏళ్ళు ఉంటాయ్. పండిపోయిన తల, చేతికర్ర, బైఫోకల్ కళ్లజోడు, పంచెకట్టు, హ్యాండ్స్ బనీను, బనీనుకి ఉన్న జేబు, అందులో లో పెన్ పెట్టుకుని, చేతికర్ర తీసుకుని తిరిగి తన గదిలోని  డెస్క్ వద్దకు వెళ్ళాడు సుబ్రహ్మణ్యం.

స్తబ్దుగా తన గదిలోకి వెళ్లాడే గానీ జ్ఞాపకాల దొంతర భూకంపంలా కదులుతోంది. ఒక్కసారిగా మిన్ను విరిగి పైన పడ్డ ఫీలింగ్ దు:ఖం అమాంతం పొంగుకొచ్చింది. వెక్కి వెక్కీ ఏడ్వాలనిపిస్తున్నా, ఏడ్వలేక గుడ్లలో కన్నీరు కుక్కుకున్నాడు సుబ్రహ్మణ్యం.  తన భార్య శారద కళ్లముందు కదలాడింది. తెరలు తెరలుగా, అలల పొంగులా దు:ఖం తన్నుకు

వస్తోంది. “శారద.. ఐ లవ్యూ” అని పైకి అనేసిన సుబ్రహ్మణ్యం “ఈ మాట తనతో ఎప్పుడైనా అన్నానా?” అని తర్కించుకుంటూనే, “ఒక్కసారైనా శారదకు నేరుగా చెప్పి ఉంటే ఎంత సంతోషించేదో కదా” అని నొచ్చుకున్నాడు. ఎదురుగా ఉన్నంతకాలం దేవతను గుర్తించని తాను, ఇప్పుడు ఆ దేవత చూపుల కోసం తహతహలాడుతున్నాడు.

“అవును శారద అల్పసంతోషి. తన జీవితం మొత్తం నాకోసం ధారపోసింది..ప్చ్.. కానీ…!!” తనలో తాననుకుంటూ సమాధానం బోధపడక తన గతం చేసిన గాయాన్ని తడిమి చూసుకోసాగాడు సుబ్రహ్మణ్యం.

******************************

ఆర్.ఎండ్.బీ లో సీనియర్ క్లర్క్ గా  పనిచేసి రిటైర్ అయ్యాడు సుబ్రహ్మణ్యం. రిటైర్ అయ్యాక కొన్నేళ్లపాటు సజావుగా సాగిన కుటుంబంలో వయసు రీత్యా వచ్చే వృద్దాప్యపు రుగ్మతలు ఇబ్బందిగా మారాయి. సుబ్రహ్మణ్యం భార్య శారదను కూడా అనారోగ్యం వెంటాడింది. గుండె వీక్ గా ఉంది కొన్నాళ్ళు పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవాలని సూచించారు డాక్టర్లు . తాము కొద్దిరోజులు కొడుకులు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్లతో గడపాలని నిర్ణయించుకున్నారు.  అదే విషయాన్ని  పిల్లలందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని సంక్రాంతి పండగ పేరుతో వారందరినీ స్వగ్రామం రమ్మని పిలిచారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కొడుకులు, కూతురు పిల్లలతో సహా వచ్చారు. ఉన్న నాలుగు రోజులు అందరూ సరదాగా గడిపారు.  ఇక ఎవరి ఊరికి వారు ప్రయాణమయ్యేందుకు మరో రోజు ఉందనగా పిల్లలతో , భార్య శారద  టాపిక్ తెచ్చాడు సుబ్రహ్మణ్యం.

“నాన్న.. నేను ఉండను.. నాది టూర్స్ జాబ్.. సో.. నాదగ్గర కన్నా తమ్ముడి దగ్గరే కరెక్ట్” టాపిక్ ప్రారంభం లోనే తాను ప్రిపేర్ అయిన విషయాన్ని బద్దలుకొట్టాడు పెద్దోడు హరీష్.

“ఒఫ్ఫో…మై వైఫ్ సునంద కెనాట్ సర్వ్, యాస్ షీ హాస్ హర్ స్కూల్ డ్యూటీస్. వై డోంట్ యూ గోటు మై లవ్వింగ్ సిస్టర్స్ హౌస్ టు స్టే..!” ఇంగ్లీష్ లో చితకబాదేశాడు చిన్నోడు హృతిక్.

(My wife Sunanda can’t serve as she has her school duties. Why don’t you go to my loving sister’s house to stay?)

“ఏం మాట్లాడుతున్నార్రా, మీ బావ అస్సలొప్పుకోడు. అమ్మో పండగకి ఆయన రాకపోవటం మంచిదైంది. లేకుంటే పెద్ద గొడవే అయ్యేది..ఆ” ఆంటూ నోరుతెరిచి మాటలు కక్కింది కూతురు నీరద.

ఏం చెయ్యలో పాలుపోలేదు వృద్ధ దంపతులకు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. టాపిక్ హాట్ హాట్ గా ఉన్న సమయంలో కూడా పని చేయడమే పరమావధిగా అలవాటైన శారద జరుగుతున్న గొడవ తనకేం పట్టనట్టు వంటింటిలోకి వెళ్ళి అందరికీ కాఫీలు పెట్టి తెచ్చింది.

“అదికాదురా… మీరంతా అలా అంటే ఎలా? అమ్మకి ఆరోగ్యం  చాలా క్షీణించిందని డాక్టర్లు చెప్పారు. ఈవిడేమో పనులు ఆపదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నార్రా..! నేనూ ఉద్యోగం చేశా..! నేను బ్రతక గలను. కానీ తను మీకు పొత్తికడుపులో ఉన్ననాటి నుంచి ఇదిగో ఈ కాఫీ వరకూ అన్నీ తానే చేసింది కదా. కనీసం కొంత కూడా కన్నతల్లి ఋణం తీర్చుకోవాలని లేదట్రామీకూ.. ఆ..?” అని కాస్త కంఠం పెంచి కన్న బిడ్డల్నినిలదీశాడు సుబ్రహ్మణ్యం .

తనకు వత్తాసుగా తొలిసారి ఇంత గట్టిగా మాట్లాడుతున్న సుబ్రహ్మణ్యం కేసి  ఆరాధనగా చూస్తోంది శారద. తానంటే తన భర్తకి ఎంత ప్రేమో అనుకుంటూ!

చేసిన ఉద్యోగం  అదనపు సంపాదనకు ఆస్కారమున్నా, చేతికి మరక లేకుండా విరమణ చేశాడు సుబ్రహ్మణ్యం. ఆలస్యంగా సర్వీస్ లో చేరటం తో సుబ్రహ్మణ్యం కి  పింఛన్ కూడా అతి తక్కువే వస్తుంది. కొడుకుల చదువులు, కూతురి చదువు, పెళ్ళి వాళ్ళ పిల్లల చిన్న చిన్న కార్యక్రమాలకూ  చేసిన అప్పులు తీర్చేందుకు వచ్చిన రిటైర్మెంట్ సొమ్ములంతా  ఆవిరైపోయాయ్.  సంపూర్ణ  సగటు మధ్యతరగతి జీవికి కేరాఫ్ అడ్రెస్ సుబ్రహ్మణ్యం. అందుకే అంతగా ఆలోచనలో పడ్డాడు. “పోండిరా..పోండి..” అని ధైర్యం చేయలేక పోతున్నాడు. అనారోగ్యంతో విల విల లాడుతున్నభార్య శారదకు ఎలా సేవ చేయాలో అర్ధం కావట్లేదు. తన పెంపకంలో పెరిగిన కొడుకులు చరమాంకంలో ఆసరాగా నిలుస్తారనుకున్నాడు సుబ్రహ్మణ్యం. అందుకే తన భవిష్యత్ కోసం ఏం చూసుకోకుండా, దాచుకోకుండా అంతా తన పిల్లల ఎదుగుదలకే   వినియోగించాడు. అంత్య ఘడియల్లో ఆదుకుంటారనుకున్న పిల్లలు వారిష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, వింతగా తోచి చూసి తట్టుకోలేక తన్నుకొస్తున్న కన్నీరు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది శారద.  ముగ్గురు పిల్లలూ కలిసి తర్జనభర్జన పడ్డారు, మాట్లాడుకున్నారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు.

********************

“పోస్ట్..” అని ‘ఆసరా వృద్ధాశ్రమం’ వద్ద పోస్ట్ మాన్ కేకకి. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.. “కె. శారద.. . పోస్ట్” అనే సరికి మంచం పై పడుకున్న శారద ఒక్కసారి లేచి కూర్చుంది, తనకి పోస్ట్ రావటమేమిటి? ఎవరు వ్రాశారు? శ్రీవారు వ్రాసుంటారా? అంతలేదు, ఆయనకంత ఆలోచన ఉండదు. అయినా రెండు రోజులకోమారు ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా! మరి ఎవరై ఉంటారూ.. అని బుర్ర ఆలోచనలతో పగిలిపోతుండగా, చీరె కొంగు సరిచేసుకుని, కళ్ళజోడు పెట్టుకుని  తన గదిలోంచి బయటకు వచ్చిన శారద,  పోస్ట్ మాన్ తలుపు గడియ లో  ఇరికించిన లెటర్ చేతికి తీసుకుంది… అడ్రస్ లో ఉన్నది తన పేరే..!  పంపిందెవరో అన్న ఆత్రంతో  అని వెనక్కి త్రిప్పి చూసింది. అవును సుబ్రహ్మణ్యమే..! తన శ్రీవారే..!  ఆనందం రెక్కలు విచ్చుకుంది,  ఆశ్చర్యం వెంటాడుతుండగా!!

సంతోషంతో లెటర్ చించబోయి, కలవరపడింది ఒకవేళ ఒంటరితనం భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా! ఆ ఆలోచన మెదలగానే తల గిర్రున తిరిగింది శారదకి కొద్దిసేపు తమాయించుకుని, చేతిలోని లెటర్ ను వణుకుతున్న చేతులతో చించింది.

లెటర్ లోని అక్షరం అక్షరం ఒద్దికగా చదవనారంభించింది. గుండె చప్పుడు స్పీకర్ లో వింటున్నంత నిశబ్ధం చుట్టు ఆవరించింది.

.

.

“ప్రియమైన శారదకు,

ఉభయకుశలోపరి. నేను బావున్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది తెలుపగలవు. నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఈ లేఖ వ్రాస్తున్నా!  ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు, చెప్పడానికి నాకు కాస్త ఇగో ఏమో అడ్డుపడుతోంది. అందుకే నేరుగా నా మనసు చెప్పే మాటలన్నీనీకు మాత్రమే వినిపించాలనేలా ఈ ఉత్తరాన్న్ని ఎంచుకున్నాను. యాభై ఏళ్ల మన ప్రయాణంలో మనం ఇలా విడివిడిగా బ్రతకాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడూ ఊహించలేదు.  అయినా పెళ్ళైన తర్వాత మాత్రం మనం ఎప్పుడు కలిసి ఉన్నామని? నేను నిద్రలేచి ఆఫీసుకి వెళ్లడం, ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి పక్కనే పడుకోవడం. ఆ కొద్దిసేపైనా నీ ప్రక్కనుంటే ఎంతో సేదతీరినట్లు అనిపించేది.  మరలా ఉదయాన్నే పనికి వెళ్లాడానికి అది ఊతమిచ్చేది. అంటే ఆఫీస్ కి వెళ్లి ఆలస్యంగా రావటానికి  నువ్వే కారణం అని నేను చెప్పటం లేదు..

ఇప్పుడు ఆ సేదతీరే అవకాశం కూడా లేకపోవడం, నాకు వెలితిగా ఉంది. పెళ్లై యాభై ఏళ్ల మన ప్రయాణంలో  ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, నానీడల్లే నడిచిన, సౌభాగ్యవతివి నీవు. నిత్యం కష్టంతోనే కాపురం చేసిన సహనశీలత్వం నీది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా, నాకంటే నువ్వే ఎక్కువగా కష్టపడ్డావ్. వారికి నేను చేసింది ఎంత అని బేరీజు వేస్తే పదిశాతం కూడా కనిపించడంలేదు. నీకు ఏ చిన్న అనారోగ్యం చేసినా, నీకు నువ్వే సర్ధుకున్నావ్ కానీ, నేను ఎప్పుడూ నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిన జ్ఞాపకం లేదు. నీ స్మృతులు నన్ను వేధిస్తున్నాయ్. ఇలా జరుగుతుందని.. కన్నపిల్లలు ఇంతగా మన మధ్య పెనవేసుకున్న బంధాన్నివిడదీస్తారని అనుకోలేదు. అసలు ఆ ఊహెప్పుడూ నాకు కలగలేదు. అనుక్షణం మాకోసం, నీ జీవితమంతా ధారపోశావ్. ఆఖరికి కాటికి కాళ్ళు జాచిన ఈ సమయంలో  నువ్వక్కడ, నేనిక్కడ. ఈ ఎడబాటు నన్ను దహించి వేస్తోంది. అనారోగ్యంతో ఉన్న నిన్ను అలా వదలి నీకు దూరంగా బ్రతకటం సిగ్గుగా ఉంది”.

చదువుతూ ఉన్న శారద కళ్ళలోంచి ధారాపాతంగా కురుస్తున్న కన్నీరు లెటర్ ను తడిపేస్తోంటే ఒక్కసారి చదవటం ఆపి, చీరకొంగును చేతికి తీసుకుని కను దరికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుండగా ఎవ్వరి జీవితంలో రాకూడని ఆ చీకటి రోజు జరిగిన తన ఇంటి బాగోతం శారద కళ్ళముందు మెదలింది.

*****************************************

“చూడండి నాన్న.. మేము ఒక నిర్ణయానికి వచ్చాం.. మీరా ఏమీ సంపాదించలేదు. లేకుంటే ఏ నర్సునో, హౌస్ హెల్పర్ నో, వంటమనిషినో పెట్టుకునే వాళ్లం. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తక్కువే వచ్చాయ్. అవి పూర్తి పోగా ఇంకా అప్పులు తీరాల్సి ఉంది. సొంత ఇల్లు అనేదీ కూడా కట్టని పిసినారివి నీవు. అందరికీ యాభై వేలకి పైనే పెన్షన్ వస్తుంటే , మీకు వస్తోంది మాత్రం ముష్టి పదివేలు. ఇంటి చాకిరీ చేసేందుకు అమ్మకి హెల్ప్ ఉండేందుకు ఎవరిని మాట్లాడినా ఐదువేలు నెలకి ఖచ్చితంగా అడుగుతారు. అది మీరు చెల్లించలేరు” అని హరీష్ అంటుండగా…

“మేమా.. అంతంతమాత్రం.. ఎప్పుడైనా రెండువేలో, మూడు వేలో అయితే అందరం కలసి  సర్దగలం కానీ నెలనెల సర్దలేం. కాబట్టి మీ ఇద్దరినీ వృద్ధాశ్రమం లో చేరుద్దాం అనుకుంటున్నాం. మీకోసం కాకపోయినా అమ్మకోసం” అంటూ హృతిక్, నీరద లు  ఓ ప్రేమ ట్యాగ్ లైన్ తగిలించేశారు.

ఒక్కసారిగా గుండెపట్టినంతపనైంది సుబ్రహ్మణ్యంకి. శారద వంటింట్లో నే కుప్పకూలిపోయింది. తమ ఆశ, తమ ఆసరా అన్నీ అయిన వారే ఇలా వృద్ధాశ్రమంలో పడేస్తామంటుంటే తట్టుకోలేకపోయాయి ఆ ముసలి హృదయాలు.

ఆ యాంత్రిక మాటలకు, తల్లిదండ్రుల నుంచి ప్రతిస్పందన కూడా రాకుండానే  హృతిక్ దగ్గరలోని వృద్ధాశ్రమంలో మాట్లాడేందుకు వెళ్ళాడు.

సుబ్రహ్మణ్యం, శారద లను ఎవ్వరూ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఎవరి ఫోన్లలో వారు బిజీగా గడిపేస్తున్నారు. అంతలో బయటకు వెళ్ళి వచ్చిన హృతిక్ మరో బాంబు పేల్చాడు.

“అందరూ వినండి. వృద్ధాశ్రమంలో  భార్య, భర్త  ఇద్దరూ ఉంటే చేర్చుకోరట.  ఒకరైతేనే చేర్చుకుంటారట. ఇద్దరినీ గనుక చేర్చుకుంటే, అక్కడున్న వృద్ధులు వారి బెటర్ హాఫ్ ను గుర్తుచేసుకుని నొచ్చుకుంటారని అందుకే ఒంటరి అయితేనే ఎంట్రన్స్ అన్నారు ఆర్గనైజర్స్. సో…” ..అంటూ తాను వృద్ధాశ్రమంలో తెలుసుకొచ్చింది వారికి చెబుతుండగానే..

“సో.. ఏంట్రా సోంబేరి వెధవా. మమ్మల్ని విడదీస్తున్నావా?” ఊగిపోయాడు సుబ్రహ్మణ్యం.

“తప్పదు నాన్న.. అంతకంటే వేరే మార్గం లేదు. నీవా ఇంతవరకూ అమ్మను జాగ్రత్తగా చూసిన పాపాన పోలేదు.  మాకా ఆమెకు కనీసం వైద్యం అందించే సంపాదనలు లేవు. వృద్దాశ్రమంలో  ఓ మూడువేలు కనుక వృద్ధాశ్రమం ఆర్గనైజర్స్ కి పడేస్తే నర్సులు, డాక్టర్లు అందరూ ఉంటారు. అమ్మ హ్యాపిగా ఉంటుంది. ఎటొచ్చీ నీవే మిగిలిపోతావు. నీకు ప్రక్క ఊర్లోనేఉన్న అంకురం వృద్ధాశ్రమంలో మాట్లాడతాము కాదనకు నాన్న..  అమ్మ  అసలే రోగిష్టిది. ఇబ్బంది పడిపోతుంది. మిమ్మల్ని అక్కడ వదిలే వెళ్తాము  అన్నట్లు మీరు ఇద్దరు అని మాత్రం ఆశ్రమ నిర్వాహకులకి చెప్పకండి. మీరు మాకు చేసే సాయం అదొక్కటే. మరేదైనా ఆరోగ్యపరంగా అమ్మకి అవసరమైతే జాగ్రత్తగా నీ హెల్త్ కార్డ్.. ఆమె రేషన్ కార్డ్ ఉండనే ఉన్నాయి కదా! కాబట్టి అదే ఫైనల్” తేల్చి చెప్పేశాడు పెద్దోడు హరీష్.

“ఓరి మీ ప్రేమ తగలబెట్టా…నేనొప్పుకోను” అని పెద్దగా సుబ్రహ్మణ్యం పెట్టిన గావుకేక ఆయన గొంతు దాటి బయటకు పెగల్లేదు.

అదేంట్రా మమ్మల్ని కాస్త కూడా ఆలోచించుకోనివ్వరా? అన్నాడు చిన్నగా.

“ఏంటి మీరు ఆలోచించుకునేది? మీరిద్దరూ ఇక్కడే ఉండి రోగాలు రొష్టులూ అంటూ మమ్మల్ని ప్రతిసారీ పిలవటం, మేము రాలేక పొతే , చుట్టు ప్రక్కలోళ్ళు మమ్మల్ని ఆడిపొసుకోవటం అవసరమా చెప్పండి నాన్న” అంది కుమార్తె నీరద.

*******************************************************

ఆ రోజు జరిగిన ఘటన ఇప్పుడే జరిగినట్లు తోచింది శారదకు. సొంతవారి  సూటిపోటి మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తూ  గుండెలో దిగబడ్డ శూలాల్లా బాధిస్తుంటే ఆపుకోలేక భోరున ఏడ్చేసింది. చెమ్మగిల్లిన ఆ మసక కళ్ళలోంచి ఎదురుగా రెపరెపలాడుతున్న సుబ్రహ్మణ్యం  మనసుని చదవటం కొనసాగించింది.

“శారదా …!  నీకోసం ఏదో చేద్దామనుకున్నానే కానీ, నిన్ను ఇలా నేను  బ్రతికుండగా వదిలేస్తాననుకోలేదు. కనీసం ఒక ఇల్లు కూడా కట్టకుండా నిన్ను రోడ్డున పడేశానేమో అన్న గిల్టీ ఫీలింగ్ నన్ను దహిస్తోంది. రిక్షావాడుకూడా తాను సంపాదించిన  దాన్లో భార్యను పొదివి చూసుకుంటాడు. కానీ నేను.. దౌర్భాగ్యుడిని .. నాపాపానికి పరిహారం కనిపించలేదు” సుబ్రహ్మణ్యం చేతి  అక్షరశరాల వెంట ….. శారద కళ్ళు అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయ్.

నీవులేని జీవితం భంగురమే. నిన్ను వదిలిపెట్టాననే కన్నా, నా నీడను నేను నరుక్కున్నట్లు చాలా బాధగా ఉంది. పెంచుకున్న ఆశల కొమ్మలు చెట్లనే నరికేశాయంటే, వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారో కదా!  అయినా వారిని అనుకుని ఏం ప్రయోజనం చెప్పు అన్నింటికీ కలిపి నన్ను ఒకేసారి పెద్దమనసుతో క్షమించు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు భార్యనై నీ ఋణం తీర్చుకుంటా! మిస్ యు మైడియర్..వైఫ్ ! శెలవ్.! చివరగా ఒక్కమాట..!!

నీతో గడపాలని,  కొద్దిసేపైనా నీ ప్రేమలో తడిసిపోవాలని,.. నీ ఒడిలో సేదతీరాలని ఉంది శారు.

ప్రేమతో నీ పతి సుబ్రహ్మణ్యం”.

లేఖలోని చివరి పదాలు శారద పెదాలపై చిరునవ్వు పూయించాయి. భారం నిండిన హృదయంతో, భర్త సుబ్రహ్మణ్యంతో మాట్లాడేందుకు ఫోన్ చేతిలోకి తీసుకుంది. కొద్దిసేపు ఫోన్ మాట్లాడాక తెలియని మానసిక స్థితిలో పెద్దగా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు.

*********************************

పట్టుచీరె కట్టుకొని వెంకన్న కోవెల దగ్గర నిలుచుంది శారద, తన ప్రేమమూర్తి వస్తాడని!

పట్టుపంచె కట్టి, పాల జుట్టును సవరించుకుంటు జారుతున్న పైపంచెను సర్ధుకుంటూ కృష్ణమూర్తిలా చిరునవ్వులు చిందిస్తూ శారదను సమీపించాడు సుబ్రహ్మణ్యం.

భార్యను సమీపిస్తూనే  మనసు నిండా ప్రేమను నింఫుకుని “ఐలవ్యూ శారదా..” అంటూ ఆశ్రమంలో కోసుకొచ్చిన ఎర్రగులాబీని ఆమెకి అందించాడు.

నీలి కళ్ళు ఉప్పొంగుతుండగా  “ఐటూ” అని సిగ్గు మొగ్గైంది శారద. ఇద్దరూ కలసి ఒకరిచేయి ఒకరు పట్టుకున్నారు.. అడుగులో అడుగులేసుకుంటూ తామెంచుకున్న క్రొత్త మార్గం  పయనమయ్యారు, నవదంపతులై. భర్త అడుగులో అడుగేసుకుంటు ధైర్యంగా ముందుకు సాగింది శారద.

వెనుక నుంచి వెంకన్న కోవెలలోని మైక్రోఫోన్ లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం వినిపిస్తోంది.

“ఇయం సీతా మమసుతా సహధర్మచరీతవ, ప్రతీచ్ఛ చైనం భద్రంతే, పాణిం గృహ్ణీశ్వ పాణినా, పతివ్రతా మహాభాగా ఛాయ ఇవ అనుగతా సదా”

జనకమహారాజు సీతాదేవి  కన్యాదాన సమయంలో శ్రీరాముడితో ఈ విధంగా చెబుతున్నాడు “ఈమె సీత, నా పుత్రిక, నీకు ధర్మాచరణలో సహచరి అవుతుంది, నీకు భద్రం కలుగుగాక, ఆమె చేయి పట్టి పాణిగ్రహణం చెయ్యి. ఈమె మహాపతివ్రత , ఎటువంటి పరిస్థితిలో నైనా, నిన్ను నీడలాగా అనుసరిస్తుంది” అని కొనసాగుతున్న కోటేశ్వరరావు ప్రవచనం మెల్లగా దూరమైపోయింది.

రెండో రోజు “గుర్తు తెలియని వృద్ధ దంపతుల  ఆత్మహత్య” వేరే రాష్ట్రం న్యూస్ పేపర్ లో ఎవరు పట్టించుకోని చిన్న ఐటం అయ్యింది.

(వృద్ధులైన అమ్మ నాన్నలను ఆదరించండి! ముసలి వారిపై తిరస్కార భావం విడనాడండి!!  -మీ కరణం)

19 thoughts on “అనుంగత  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *