May 19, 2024

కలంకారీ శారీ డిజైనర్ భారతి గారితో కాసేపు…

 శ్రీసత్య గౌతమి

మనందరం మనకలల్ని సాకారం చేసుకోవాలని కోరుకుంటాం లేదా చన్నీళ్ళకి వేణ్ణీళ్ళు తోడులా కుటుంబానికి కొంతాదాయం తేవాలని కోరుకుంటాం. దానికి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తేనే కాదు ఇంట్లోవుండి కూడా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నిర్వర్తించుకోవచ్చు లేదా ఉన్న ఉద్యోగం లో వచ్చే ఆదాయం తో పాటు హోం బెజినెస్ వల్ల మరికొంచెం ఆదాయాన్ని జమా చేసుకోవచ్చు. ఇది అంత సులభమైన పనికాదు అలాగని అసాధ్యమూ కాదు. ఇటువంటి ఆలోచనలతో ఏమి చెయ్యాలా, ఏ మార్గాన్ని వెతుక్కోవాలా అని ఊగిసలాడే వాళ్ళకి కొన్ని సులభమైన ఉపాయాలను ఈ ఆర్టికల్ లో చర్చించిద్దాం. నిజానికిది కేవలం స్త్రీలకే పరిమితం కాదండి, పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇందులో మరొక కిటుకుంది, స్త్రీ ఏమిచెయ్యాలన్నా ఇంట్లో పురుషుని అంగీకారం, ప్రోత్సాహం, అవసరమైతే అతని సహాయం ఆమెకి కావలసివుంటుంది. ఆ విధం గా ఆవిడ ప్రతి విజయం లో అతని హస్తం తప్పకుండా వుంటుంది. చూశారా టీం వర్క్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది!

0

ఇకపోతే కొన్ని బిజినెస్ గురించి సులభమైన ఐడియాలు- మనలో ఆర్టిస్టిక్ టాలెంట్ వుంటే ఆ టాలెంట్ నే ఒక సామర్ధ్యంగా మార్చుకొని బిజినెస్ చెయ్యవచ్చు. ఉదాహరణకి పెయింటింగ్స్. వాటిని అంతర్జాలం గా అమ్మకాలు చెయ్యవచ్చు. అలాగే కుట్లు, అల్లికలు మరియు జ్యుయలరీని కూడా…వ్యాపార దృష్టివుండాలే గాని. అలాగే బ్లాగర్. ఇంటికి వెళ్ళాక మనకిష్టమయిన టాపిక్ మీద కేంద్రీకరించి స్వంత ఆలోచనలని, ప్రతిపాదనలని ప్రపంచం దృష్టికి తీసుకురావడం. అలాగే ఫుల్ టైం బుక్ కీపింగ్, బ్రైడల్ కన్సల్టంట్, లైఫ్ కోచ్, రైటర్, జీనియాలజీ పరిశోధన మరియు ఫ్యామిలీ ట్రీ డిజైనింగ్, గ్రేంట్ రైటింగ్- నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి ఆర్ధిక సహాయం కోసం, గ్రాఫిక్ డెజైనింగ్, ఫేషన్ కన్సల్టన్సీ, ఆన్ లైన్ స్టోర్, ఆన్ లైన్ టీచింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఇంటెర్ నెట్ మార్కెటింగ్, ఫుడ్ మెనూ ప్లేనింగ్, కేక్ దెకొరేషన్స్, పెర్సొనల్ చెఫ్, ట్రావెల్ ప్లానింగ్ ఫర్ వెకేషన్స్, ప్రెస్, ఈ-బుక్ సెల్లింగ్, పబ్లిక్ రిలేషన్స్, ఫొటోగ్రఫీ, వెబ్ డిజైనింగ్, ఫిట్ నెస్ ట్రైనర్, ఇంట్లో పెంచుకునే పెట్ రిలేటడ్ సర్వీసెస్…ఇలా ఎన్నో. కూర్చొని ఆలోచిస్తే మరెన్నో తడతాయి.

 

ఇటువంటి ఇంటెర్ప్రెన్యూర్షిప్ ఎదగడానికి కేవలం ఇష్టం వుంటే చాలదు. విత్తనం వేసి చెట్టు అయ్యేంతవరకూ ఎలా సంరక్షిస్తామో బిజినెస్ ఐడియాని కూడా అలాగే పెంచి పోషించాలి. దానికి వ్యాపారదృష్టి, స్కిల్స్, ఇన్వెస్ట్మెంట్, ఆర్గనైజేషన్, డెలిగేషన్, రిస్క్స్, రివార్డ్స్ మొదలైనవన్నీ ఎరువు వేస్తేనే అభివృద్ది. ఈ ఆర్టికల్ లో ఒక హోం బిజినెస్ ఇంటెర్ప్రెన్యూర్ శ్రీమతి భారతి రెడ్డి గారు మనతో తన బిజినెస్ గురించి, దాని అభివృద్ది కోసం తాను తీసుకుంటున్న జాగ్రత్తలను చర్చించడానికి మనతో కొంత సమయాన్ని గడుపుతున్నారు. వీరు కువాయిట్ లో నివసిస్తున్నారు. తనకిష్టమైన, నచ్చిన బిజినెస్ కలంకారీ శారీస్ మరియు వాటికి అనువైన అద్భుతమైన బ్లౌస్ డిజైనింగ్స్ అంతేకాకుండా వాటికితగ్గ అలంకరణ పద్దతులను కూడా సూచించడం ఒక అద్భుతమైన టాలెంట్. ఆవిడతో ఒక సాయంత్రం సరదాగా ఫేస్ బుక్ చాట్ చేస్తుండేటప్పుడు అలవోకగా ఎన్నో విషయాలు చక చకా చెప్పేశారు. సరదాగా మాట్లాడినప్పుడే ఎన్నో విషయాలు చెప్పిన భారతి గారూ, మన పాఠకులకు అవసరమైన టిప్స్ కూడా ఇవ్వగలరు అని భావించాను. అడగగానే సంతోషం గా భారతిగారు మనతో పంచుకొంటున్న కొన్ని విషయాలు, అంతేకాకుండా తమ దగ్గిర లభ్యమయ్యే కొన్ని డిజైనింగ్ చీరల చిత్రాలు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు. అంత బిజీ గా వున్నా అడగగానే తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి సూచనలను ఇచ్చారు. భారతిగారికి ధన్యవాదాలు.

1

“మేము హోం బిజినెస్ గా బొటీక్ నడుపుతున్నాం. మా బొటీక్ ప్రత్యేకత ఇండియా లోని వివిధ రాష్ట్రాలలో తయారయ్యే హ్యాండ్లూం శారీస్- కాటన్ మరియు ప్యూర్ సిల్క్ శారీస్ మా దగ్గిర దొరుకుతాయి. నాకు మొదటినుండీ చేనేత చీరలంటే చాలా ఇష్టం.  ఆ ఇష్టం వల్లే ఈ బిజినెస్ ని ఎంచుకున్నాను. లేడీస్ కోసం ఆకర్షణీయమైన చీరల్ని తయారుచేయించి ఇచ్చినప్పుడు ఆ డిజైన్లని ఇష్టపడి చీర్లను కొనుక్కొని వెళ్తుంటే, అది నా వర్క్ మీద విశ్వాసాన్ని పెంచుతుంది. చాలా సంతోషిస్తాను. బిజినెస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్నేహితులకు మాత్రమే తెలుసు. తర్వాత వాట్స్ అప్, ఫేస్ బుక్ ద్వారా ప్రచారానికి పూనుకున్నాం. దీనివల్ల మాకు కస్టమర్స్ పెరిగారు. ఈ సోషల్ వెబ్సైట్లకు ధన్యవాదాలు. అంతేకాకుండా ఎగ్జిబిషన్లలో ఫ్రీక్వెంట్ గా మా చీరలను పెడుతుంటాము. ఈ మధ్యనే కువాయిట్ నేషనల్ లైబ్రరీ లో జరిగిన ఒక పెద్ద ఎగ్జిబిషన్ లో మా లేటెస్ట్ శారీ కలెక్షన్స్ ని పెట్టాము. ఎక్కువమంది కస్టమర్స్ ని పొందాము, వాళ్ళకి మా శారీ డిజైన్స్ ఎంతగానో నచ్చి కొనుక్కొని వెళ్ళారు. మాకు కస్టమర్ సాటిస్ఫేక్షనే పెద్ద పెట్టుబడి. బిజినెస్ ప్రారంభదశనుండి కూడా కస్టమర్ల చాయిస్ ప్రకారమే చీరలను అందించేవాళ్ళము. ఆవిధంగా వారి విశ్వాసానికి మేము పాత్రులమయ్యాము. తెలిసినవారి నోటంబడి ప్రచారము, సోషల్ వెబ్సైట్ల ద్వారా ప్రచారము మాకు మంచి కస్ట్మర్లను సంపాదించిపెట్టింది. ఇటువంటి బిజినెస్సే కాదు, ఏ హోం బిజినెస్ అయినా విజయవంతం కావాలంటే మన అందిస్తున్న ప్రాడెక్ట్స్ గురించి పూర్తి అవగాహన వుండాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ లో వాటి అప్ డేట్స్ ని ఫాలో అవ్వాలి. ముందుగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చెయ్యక్కరలేదు. తక్కువ డబ్బుతో మొదలుపెట్టి మెల్ల మెల్లగా బిజినెస్ ని పెంచాలి.

చేసే పనిమీద శ్రద్దపెట్టి అంకితభావాన్ని కలిగివున్న మంచి టీము నాకు దొరికింది. మా కలంకారీ హ్యాండ్ ప్రింటెడ్ సిల్క్ శారీస్ కి మేమే డిజైన్లు చేస్తాము. వాటికోసం నాణ్యమైన ఫ్యాబ్రిక్ పెయింట్స్ ని ఉపయోగిస్తాము. అందువల్ల మేము కస్టమర్ల నమ్మకాన్ని పొందాము. ఈ క్రెడిట్ మా టీము అందరిది. ఇప్పటివరకూ మాకు ఎదురయిన సమస్యలేమీ లేవు. అప్పుడప్పుడు చిన్న చిన్న డామేజులున్నశారీస్ వస్తుంటాయి. వెంటనే వాటిని గుర్తించి సప్లయిర్స్ కి తిరిగి పంపించేస్తాము.

2

ఏ బిజినెస్ కయినా పోటీ వుంటుంది. చీరల, వాటిపై డిజైన్ల అందానికీ, నాణ్యతకు ప్రాముఖ్యతనిస్తూ, రీజనబుల్ ధరలకే అమ్మకాలు జరపడం వల్ల పోటీ సమస్యలను సులభంగా ఎదుర్కొంటాము. ఇప్పటివరకూ సాధించిన విజయాలతో మేము బిజినెస్ ని పెద్దది చేసుకోగలిగే స్థానానికి చేరుకున్నాము. కస్ట్మర్స్ ని పొందడానికి అవసరానికి మించి ప్రాడక్త్స్ గురించి చెప్పుకోవడం, అమితమైన ఆసక్తి ని వారిపై చూపించడం లాంటివి చెయ్యకూడదు. ఇలాంటివి చేస్తే కస్టమర్స్ ని కోల్పోయే ప్రమాదమున్నది. అందువల్ల ఇటువంటి బిజినెస్ నడిపేవారికి ఇది ఒక ముఖ్య సూచన గా చెప్పగలను.

ఇష్టం ఒక వ్యామోహం గా మారి దాన్ని ఒక బిజినెస్ రూపంలో పది మందితో పంచుకునేటప్పుడు పనిలో అసలు అలసటే తెలియదు. క్రొత్త క్రొత్త రంగులు, ఫ్యాబ్రిక్ పైయింట్సు, క్రొత్త డిజైన్లు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎక్కడలేని ఉత్తేజం కలుగుతుంది నాకు. మా కస్టమర్లు మేము డిజైన్ చేసిన శారీస్ ని ధరించి తిరుగుతుంటే మాకు అది ఎంతో సంతోషదాయకము, ప్రోత్సాహకరం గా వుంటుంది”.

2 thoughts on “కలంకారీ శారీ డిజైనర్ భారతి గారితో కాసేపు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *