May 19, 2024

మారుతున్న కాలంలో

 రచన:-ఓలేటి శశికళ

సోమవారం ప్రొద్దున్నేవంటింట్లో అష్టావధానం, శతావధానం చేస్తున్నాను.” అమ్మా! పెద్దమ్మగారు లేచారా?”, ఇది నాలుగోసారి అడగడం తులసి. తొందరగా ఆమె గది చేసేసి వెళ్ళిపోవాలని దాని తొందర. టైం తొమ్మిదవుతోంది. ఇంక లేస్తారేమోలే అన్నా. మా అత్తగారికి అరవై ఏళ్ళు. మావగారు పోయినా క్రుంగి పోకుండా, సాహిత్యమని, సంగీతమని, లలిత గుడిలో పారాయణలని, ఫేస్ బుక్ లో కొన్ని గ్రూపుల్లో మంచి స్నేహబృందం తో సాహితీ కాలక్షేపం, సాయంత్రం నడక…… ఇలా రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం పెట్టుకున్నారు. రాత్రి చాలా సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటారు. పైగా ఆర్త్రైటిస్ ఉంది. ఆలస్యంగా పడుకుంటారు. అందుకే నేను ఆవిడని పొద్దున్నే లేపను. లేచి ఏమి చెయ్యాలి? నేను వంట దగ్గరకు రానీయను.  నా పని నాకు తప్పదు. ఆవిడొచ్చి ఏం చేసేయాలి? నలుగురు పిల్లల తల్లిగా, పెద్దింటి కోడలిగా మరుదులు, ఆడపడచులతో అన్నిభవసాగరాలు ఈదిందామె. డిగ్రీ చదివారు. నాలుగయిదు భాషలు అవలీలగా మాట్లాడేస్తారు. మంచి వ్యవహారవేత్త. నలుగురిని శాశించగల మాట పటుత్వం. మళ్ళీ చాలా మంచి మనిషి. నాకు ఆవిడ అనుభవం చాలు. ఆవిడతో పోటీలు, పంతాలు పెట్టుకునే మనస్తత్వం కాదు. ఇద్దరం ఒకరి స్వేచ్ఛనొకరం గౌరవించుకుంటాం. ఎవరి పరిదుల్లో వారుంటాం.

నాకు కాస్త పాప భీతి ఎక్కువ. మనమేం చేస్తే అదే మనకు పరివర్తనం అవుతుందని నమ్ముతాను. మా అమ్మ మా బామ్మని పువ్వుల్లో పెట్టుకు చూసింది. మా అమ్మకి ఆణిముత్యాల్లాంటి కోడళ్ళు దొరికారు. మా అత్తగారికి నేనంటే ప్రాణం. పాపం నా ఢిల్లీ తోటికోడలు ఎన్నిసార్లు పిలిచినా, నేను సాయం వస్తేనే వెళ్ళి 15-20 రోజుల్లో మళ్ళీ బయలుదేర తీస్తారు. మా ఇంట్లో ఆవిడకి మంచి స్వతంత్రం ఉంటుంది. ఆవిడ రూం, ఆమె లాప్ టాప్, ఎక్కడికెళ్ళాలన్నా కారు. ఎవరికీ జవాబుదారీ కానక్కర్లేదు. నాయనమ్మ మూడ్ బట్టీ కలిసిపోయే మా పిల్లలు. ఆవిడని విసిగించకుండా, గౌరవం ఇస్తూ వాళ్ళక్కావలసింది నేర్చుకుంటారు. ఇంక మా ఆయన పెద్దకొడుకు. అమ్మ తరవాతే ఏదయినా, ఎవరయినా. ఆవిడ ఆడపిల్లలు ఇద్దరూ అమెరికాలో ఉంటారు.

నా ఆలోచనల్లోంచి బయటికొచ్చా. అత్తగారు తలుపు తెరుచుకుని బయటకొచ్చారు. స్నానాదులయిపోయి ఫ్రెష్ గా ఉన్నారు.

“అమ్మయ్య లేచారామ్మా. పొద్దున్నుండి మీకోసమే చూస్తున్నా” అంది తులసి. కోపం వచ్చింది నాకు.

“వేరే పని చూసుకుని రావచ్చు కదా అంత గాభరా పడిపోకపోతే” అన్నా.

“గది ఊడవడం కోసం కాదమ్మా. పెద్దమ్మగారితో పని ఉంది” అంది.

మా అత్తగారు పనివాళ్ళలో ఫేవరెట్. వీళ్ళంతా చీటీలు కడతారు. ఒకసారి జాలరిపేటలో కోటిరూపాయలు మూట కట్టుకుని ఒక చీట్లది పారిపోయింది. మా చుట్టుపక్కల పని వాళ్ళంతా లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారు. మా అత్తగారు పోలీసు యంత్రాంగాన్నికదిలించి, ఆ మోసగత్తెని పట్టించి వీళ్ళందరికీ ఎంతో కొంత ఇప్పించారు. వీళ్ళందరికీ బేంకు పాసుపుస్తకాలు చేయించి, పొదుపు నేర్పించారు. వీళ్ళకి మధ్య మధ్యలో ఐదారువేలు సర్ది ముక్కుపిండి వసూలు చేస్తారు. పెళ్ళిళ్ళకూ, వాళ్ళ పిల్లల చదువులకు అదీ ఈవిడే వాళ్ళకి అడ్వయిజర్. ఎంత శ్రమయినా ఆనందంగా చేస్తారు. ఒక్కోసారి వాళ్ళతాగుబోతు మొగుళ్ళని  వదిలేయమని సలహాలు కూడా ఇస్తుంటారు. మా అత్తగారు అందుకున్నారు.

“నీకిచ్చిన ఎనిమిది వేలు తీర్చేవరకు ఒక్కపైసా కూడా ఇవ్వను” అని. ఈ లోపున మా వంటింటి కప్ బోర్డు లోంచి పెద్దకవర్ తీసింది తులసి, ఎప్పుడు పెట్టిందో ఏమో.

“ పెద్దమ్మగారు! వీణమ్మగారు మీకిమ్మన్నారమ్మా. ఇయ్యాళ పొద్దున్న ఆరింటి విమానానికి వెళ్ళిపోయారు. ప్రతిమ పాప అత్తగారు, మాంగారు మొన్నొచ్చారు కదా. ఆరితో యెళ్ళిపోయారు. నన్ను పక్కకి పిలిచి ఇది కేవలం మీకే ఇమ్మన్నారమ్మ” అని ఆ కవర్ ఆమె చేతిలో పెట్టింది.

తులసిలో గొప్పతనం అదే. తనకి చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఒకరింటి విషయాలు ఒకరికి తెలియనివ్వదు. ఆఖరికి మా అత్తాకోడళ్ళవి కూడా. అత్తగారి మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనపడుతోంది. నేనిచ్చిన ఫిల్టర్ కాఫీగ్లాసుతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మెల్లగా కవర్ ఓపెన్ చేసారు.

వీణాంటీ! మేము మా ఫ్లాటు గృహప్రవేశంకి ఇరుగు పొరుగు వాళ్ళని పిలుద్దామని మా పక్క అపార్ట్ మెంట్ కి వెళ్ళినపుడు మొట్టమొదటిసారి వీణాంటీని చూసా. వయసు తెలియనివ్వని నాజూకుతనం. పాలరాయి రంగులో తెల్లటి వర్చస్సు. పెద్ద జడ, చిన్న బొట్టు, సున్నితమయిన నగలు, లేతరంగు కాటన్ చీరలో. మా అత్తగారి సూక్ష్మ బుద్ధి ఆవిడెవరో గ్రహించేసింది.

“మీరు రైటర్ మహతి కదా. పదేళ్ళ క్రితం దీపావళి కధకి మొదటి ప్రైజ్ ఒచ్చినపుడు ఒక్కసారే మీ ఫోటో వేసారు. మళ్ళీ ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు. నాకు మీ రచనలంటే ప్రాణం” అన్నారు.

ఆవిడ సిగ్గు పడుతూ అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు చూసి, ఎంతో ఒద్దికగా, స్నేహంగా మాట్లాడింది. ఆవిడ ఇల్లొక కళాఖండం. ప్రతీ మూల ఎంతో అందంగా సర్దబడి, ప్రతి వస్తువు యజమానురాలి కళాహృదయాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. మా అత్తగారు, వీణాంటి అనతికాలంలో అత్యంత సన్నిహితులయిపోయారు. ఇద్దరు ఎన్నో విషయాల్లో భిన్నదృవాలు. కానీ ఇద్దరు మంచి మనసున్న వ్యక్తులు. స్పందించే హృదయం, కళలంటే మక్కువ ఇద్దరినీ విడలేని స్నేహితుల్ని చేసేసింది.

ఆంటీకి ఇద్దరు పిల్లలు ప్రతిమ, ప్రదీప్. ప్రతిమ ప్రేమవివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ప్రదీప్ చాలా చదువుకున్నాడు. రకరకాల ఉద్యోగాలు మారుతూ, అమ్మాయిలకి వంకలు పెట్టుకుంటూ పెళ్ళి ఆలశ్యం చేసుకున్నాడు. ఆఖర్న ఫ్రెండ్ కజిన్ ముఫ్ఫైరెండేళ్ళ అరుణని పెళ్ళిచేసుకున్నాడు. సోషియాలజీలో డాక్టరేట్ అరుణ. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ప్రశాంతంగా సాగిపోతున్న వీణాంటీ జీవితంలో పెద్ద కుదుపులాగ ఎంతో ప్రేమించే ఆమె భర్త కళ్ళముందు ఆక్సిడెంట్ లో పోవడంతో క్రుంగిపోయారామె.

” సువర్చలా” అని మా అత్తగారిని పట్టుకుని ఏడ్చేసేవారు. మెల్లగా, స్నేహితురాలి సహకారంతో మనుషుల్లో పడడానికి రెండేళ్ళు పట్టింది. ఇద్దరూ కలిసి అమెరికా వెళ్ళి ఆరునెలలు గడిపి వచ్చారు కూడా. అయితే ఆవిడ జీవితంలో అనుకోని పెనుమార్పు అరుణ రూపంలో వచ్చింది.

ప్రదీప్ తల్లిలా అందమయినవాడు. అరుణ ఛామన ఛాయ, పెద్దకళ్ళు, పొట్టి ఉంగరాల జుట్టు, ఆరోగ్యంగా, బుగ్గ సొట్టలతో బాగానే ఉంటుంది. సామాన్యమయిన కుటుంబం నుంచి వచ్చింది. తల్లి నుండి నోములు, వ్రతాలు పుణికి పు చ్చుకుని, తెచ్చిపెట్టుకున్న ఆరిందాతనం, ముదరతనంతో ఆరిందాలా ఆధ్యాత్మిక విషయాలు అందరికీ బోధిస్తూ ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తే వదిలేసి, పెళ్ళికోసం వెర్రిపూజలు చేస్తూ కూర్చుంది. నిజంగానే మంచి సంబంధం వచ్చింది. కానీ ఆ అమ్మాయికేం కావాలో తనకే తెలియదు. అసంతృప్తి, అసూయ, అహంకారం, ఆత్మన్యూనత బాగా జాడ్యంలా పట్టించుకుంది.

అంకుల్ పోవడంతో ప్రదీప్ కలకత్తాలో ఉద్యోగం వదిలేసి వైజాగ్ వచ్చేసి ఏదో కంపెనీలో చేరాడు. లారీడు సామాన్లతో వచ్చింది అరుణ. పాత ఇనప మూకుళ్ళు, రోలు, రోకళ్ళు, పసుపు కుంకాలద్దిన తిరగళ్ళు, నాలుగు కంద మొక్కల కుండీలు, పాత ఫర్నీచరు.

కారులోంచి దిగిన అరుణ చాలా మందినే ఆకర్షించింది. పెద్దంచు ముదర రంగు గద్వాల్ చీర, పావలాకాసంత బొట్టు, కాళ్ళకి పసుపు, మువ్వల పట్టీలు, చేతులనిండా ఎర్ర గాజులు, తల్లో వాడిపోయిన పూలదండ. సున్నితంగా దేవతలా ఉండే వీణాంటీ పక్కన మోటుగా, చాలా గడుసుగా అనిపించింది. ప్రదీప్ ఏమిటో చిన్నవయసు లోనే జుట్టు నెరిసిపోయి, గెడ్డాలు, గుంటకళ్ళతో ఏదో లోకంలో ఉన్నవాడిలా ఉన్నాడు. పిల్లలిద్దరూ పుల్లల్లా ఉండి, కేశ సంస్కారం లేకుండా, వస్తూనే పెద్ద అరుపులు అరుచుకుంటూ, కొట్టుకుంటూ, గోడలెక్కేస్తూ, సెల్లార్ లో కార్లన్నీబొమ్మలతో కొట్టేస్తు హైపర్ గా ఉన్నారు.

ఇద్దరినీ ధబాధబా బాది ఈడ్చుకు పోయింది అరుణ.ఆపబోయి నిస్సహాయంగా ఆగిపోయారు ఆంటీ. బాల్కనీలోంచి ఈ సీనంతా చూస్తున్న నాకు, మా అత్తయ్యకి భవిష్యత్తు ఎంత సవ్యంగా ఉండబోతోందో సుడిగుండాల మధ్య కనిపించింది.

సాయంత్రం మా అత్తగారు, నేను వీణాంటీ వాళ్ళింటికి వెళ్ళాము కొన్ని స్నాక్సు, రోటీలు, వండిన కూరలు పేక్ చేసుకుని. ఇల్లు రణరంగంలా ఉంది సామాన్లన్నీ చిందర వందరగా ఉన్నాయి. మధ్యలో పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఆంటీ ఎక్కడ సర్దాలో తెలియక అయోమయంలో నిలబడి ఉన్నారు. మమ్మల్ని చూసి చేటంత మొహం అయ్యింది. ఆవిడకి నా సామర్ధ్యం మీద అపారమయిన నమ్మకం ఎక్కడో అక్కడ ఆ సామానంతా తోసేయగలనని. ఒక ప్రక్క ప్రదీప్ పిల్లలకి పాలు పట్టించడానికి తంటాలు పడుతున్నాడు. వాళ్ళు ఆ పెట్టెల మధ్య పరుగులెడుతు అతనిని ఏడిపించేస్తు న్నారు. సరే మెల్లగా వెళ్ళి వాళ్ళను కాస్త పొగిడి, బుజ్జగించే సరికి మెల్లగా నా దగ్గరకొచ్చారు. పాలు తాగించి స్నేక్స్ ఇచ్చా. నోటితో చింపేసి పేక్ ను ఇల్లంతా చిమ్మేసారు. మాకిది అలవాటే అంటూ ప్రదీప్ అవన్నీ ఎత్తాడు.

ఈ లోపల “ఎందుకు ప్రదీప్ ఈ సామాన్లన్నీ.  అమ్మిపాడేయ లేకపోయావా? మీ అమ్మవే బోలెడు” అన్నారు మా అత్తగారు ఊరుకోకుండా.

అంతే, ఝామ్మని దేవుడి గదిలోంచి దూసుకొచ్చేసింది అరుణ. “అవ్వదండి. మీరు, మీ ఫ్రెండు సెంటిమెంట్లు లేకుండా బతక గలరేమో. కానీ మాకు ప్రతీ వస్తువుతో అనుబంధం ఉందండి” అని తీవ్రంగా జవాబు చెప్పింది.

ఏదో అనబోయిన ప్రదీప్ భార్య చూపుకి భయపడి, భుజాలెగరేసి గదిలోకి వెళ్ళిపోయాడు.

“రండి ఆంటీ బొట్టుపడతాను” అని చనువుగా నా చెయ్యిపట్టుకు లాగింది అరుణ. ఆంటీనా! నాకన్నా పెద్దది తను. ఉడుకుమోత్తనం వచ్చింది నాకు.

“మానసది నీ వయసే అరుణ”, అంటున్నారు ఆంటీ. విననట్టే దేవుడి గదిలోకి తీసుకెళ్ళింది. ఏ మాటకామాటే చెప్పాలి. గుళ్ళోకెళ్ళినట్టనిపించింది. ఆంటీ దేవుడి గది చాలా క్లాసీ గా ఉంటుంది. చక్కటి పాలరాతి మందిరంలో, సీతారాముల విగ్రహాలు అంతే. వేరే ఇంకేమీ ఉండవ్. ఏ పండగయితే ఆ విగ్రహాలు పెడతారు. దానికి విరుద్ధంగా అరుణ, రకరకాల ఫోటోలు, విగ్రహాలు, గంగాజలం బిందెలు, అఖండంగా వెలిగిపోతున్న దీపాలు, ఒక డజను అగరత్తులు, సాంబ్రాణి ధూపం, పూలదండలతో అలంకరించేసింది దేవుడి గది అంతా. ఒకలాంటి అలవాటు లేని పవిత్రత ఆవరించింది. పక్కనే రోలు.రోకలి, సన్నికిల, కందచెట్లు. నిండిపోయింది గదంతా. నాకు బొట్టు పెట్టి పళ్ళిచ్చింది. మాఅత్తగారు కూడా లోపలికి వచ్చి దణ్ణం పెట్టుకున్నారు. ఎందుకే మొహం చిట్లించి కనీసం పండయినా చేతులో పెట్టలేదు. నాకు చాలా గుబులుగా అనిపించింది. కాని మా అత్తగారు ఇలాంటి ముదుర్లని అస్సలు పట్టించుకోరు.

సరే మొత్తానికి అత్తాకోడళ్ళుఇద్దరూ ఇల్లు ఒక కొలిక్కి తెచ్చారు. ఆ రెండు రోజులు మా ఇంట్లోంచే భోజనం పంపా. ఆంటీకి బయట ఫుడ్ పడదు. మూడవ రోజు సాయంత్రం అరుణ మాఇంటికి ఒచ్చింది. పచ్చటి పట్టుచీరలో చక్కగా నగలు పెట్టుకుని. సరదా వేసింది చూడగానే.

నాతో “ఆంటీ! రేపు ఇంట్లో లలితా పారాయణం, సుమంగళి పూజ ఉన్నాయి. పొద్దున్న పదింటికల్లా ఉండాలి. భోజనాలక్కడే” అని పిలిచింది.

మా అత్తగారికేసి తిరిగి “మామ్మగారు మిమ్మల్ని మా అత్తగారు సాయం రమ్మన్నారు. మీ వయసు వాళ్ళని పెట్టుకోలేదండి” అంటూ సాగదీసింది. నాకు ఎందుకో మా అత్తగారి మొహం చూడ్డానికి ధైర్యం చాల్లేదు. నేను ఆంటీ, మా అత్తమ్మ మామ్మ.

”దేవుడా!” వెళ్ళిపోతూ గుమ్మం దగ్గరాగి “ఆంటీ! మర్చిపోయాను. ఈ డైమండ్ నెక్లేస్ మొన్న అమ్మ పెట్టింది పండక్కి” చూపించేసి వెళ్ళిపోయింది అరుణ.

“ఎంత ధైర్యంగా అబద్ధం చెప్పేసిందే! ఆ నెక్లేస్ వీణా, నేను వెళ్ళి కొన్నాం వైభవ్లో. తన పుట్టింటి వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి బడాయి కబుర్లు” వెనకాల మా అత్తగారు అందుకున్నారు ఉడుకు మోత్తనంగా.

సరే మరునాడు అమిత వైభవోపేతంగా చేసింది అరుణ పూజ. సుమంగళి పూజ అంటూ ఆంటీని, అత్తమ్మని బెడ్ రూంకి పరిమితం చేసింది. తన వైపు చుట్టాలెవరో వచ్చారు. వాళ్ళు పులుముకుని పనులు చేసేస్తున్నారు. పారాయ ణం, పూజ నాకు చాలా ఆనందం కలిగింది. ఎటొచ్చీ వీణా ఆంటీ సొంత ఇంటిలో పరాయిదానిలా. అందరికీ మంచి చీరలు పెట్టి, కేటరింగు భోజనం పెట్టి సాగనంపింది. మా ఇరుగు పొరుగందరం, చారుమతి దేవి కధలో ముత్తయిదువుల్లా ” ఆహా! ఏమి అరుణ భాగ్యం. భాగ్య వశమున మనమీ పూజ చేసుకున్నాము” అనుకుంటూ ఇళ్ళకెళ్ళాము. దెబ్బకి అరుణ ఇన్ స్టంట్ గా పాప్యులర్ అయిపోయింది.

రోజు చుట్టుపక్కల గుడుల కెళ్ళడం, ఆ పూజ సరిగ్గా చెయ్యలేదు, ఆ సేవ జరగలేదు, ఈ పద్ధతి తప్పు  అని గుడి పూజారులతో పోట్లాడడం. లలిత గుడి పూజారి వచ్చిమా అత్తగారికి మొరపెట్టుకుంటే, ఆ విషయమై అరుణతో ఆమెకి పెద్ద గొడవే అయ్యింది. గుడి తాలూకు ఫండ్సుతినేస్తున్నారని నింద వేసి పెట్టింది. కానీ మొత్తం కాలనీ అంతా ఎదురు తిరిగే సరికి నోరు మూసింది.

చకచక అల్లుకు పోతోంది అరుణ మా కాలనీలో తన మాటకారి తనం, పూజలు, భజనలతో. పోలిటిక్సులో చేరితే తిరుగుండదామెకు. నాలుగు కిట్టీలులో చేరిపోయింది. కిట్టీల్లో లలిత, విష్ణు పారాయణలు తప్పనిసరి ఇప్పుడు. అన్య మతాల మా స్నేహితులు మెల్లగా కిట్టీ పార్టీల నుండి తప్పుకున్నారు. ఎందుకో ఎవ్వరం ఇదివరకులా సరదాగా ఉండ లేక పోతున్నాం. ఏదో అభద్రతా భావం. ఒకరి మీద ఒకళ్ళకు నమ్మకాలు పోయాయి.

అంతటికీ అరుణే కారణం అంటారు అత్తయ్య. నిజమని అందరికీ తెలుసు.కానీ డైరక్టుగా అటాక్ చేసే ధైర్యం లేదు.పాపభీతి పట్టించింది అందరికి. ఎవరయినా తన చెయ్యి జారిపోతున్నారనిపిస్తే, వెంటనే ఏదో పూజ వంకని వాళ్ళకో పట్టుచీర పెట్టేస్తుంది. అంతే నోరు మూత. అంటితో పోలేదు. మాతో యోగా, వాకింగు అన్నింటికీ తయారు. అందరి మీద వేళాకోళాలు చెయ్యడం, ఉచిత సలహాలు ఇవ్వడం, వితండ వాదనలు ఒకటేమిటి, విశ్వరూపం చూపించేస్తోంది. అందరికి ఉంచుకోలేని, వదిలించుకోలేని గుదిబండయి పోయింది అరుణ.

ఇదంతా ఒకెత్తు వీణాంటీ పరిస్థితి ఒకెత్తు. ఆవిడ ఇంచుమించు ఫుల్ టైం సర్వెంటు అయిపోయారు. ప్రదీప్ కి, పిల్లలికి వండిపెట్టి, తయారు చేసి పంపడం, ఇల్లు బాధ్యతలు, పిల్లల అల్లరి, వాళ్ళ చదువులు, అన్నీ అత్తగారికి చుట్టేసింది అరుణ. ఏమన్నా అంటే మా అమ్మ మా అన్నయ్యల పిల్లల్ని ఎంత బాగా పెంచుతుందో అనో, మీ కూతురు పిల్లలయితే ఇలా అంటారా అని దెప్పుడు మొదలు పెడుతుంది. ప్రదీప్ చూస్తే స్థిరంలేదు. ఇంటిఖర్చంతా ఆంటీయే పెట్టుకుంటున్నా, డబ్బు చాలట్లేదంటాడుట. ఈ అమ్మాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎక్కడ లేని ఖర్చు అవుతుంది. ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా వెళ్ళిచీరలు కొనేసి తల్లికి, అక్కచెల్లెళ్ళకీ పంపేస్తుంది. ఆంటీ రచన వ్యాసాంగం మూలపడి పోయింది. సంగీతం, వాకింగ్ బంద్. ఆవిడకి గట్టిగా మాట్లాడితే గుండె దడ వస్తుంది. అంకుల్ చాలా అపురూపంగా చూసుకునే వారు. ఆమె గురించి ఆలోచనలతో మాఅత్తగారికి మనశ్శాంతి కరువై పోయింది.

అరుణకి తెలుసు మాఅత్తగారి అండలో ఆంటీకి ధైర్యం అని. అందుకే మాఅత్తమ్మని అటాక్ చేసి, తనింటికి రాకుండా నిరోధించేసింది.

ఆ మధ్య బీచ్ రోడ్ లో వాకింగ్ నుంచి వస్తూ స్నేహితులమందరం గట్టుమీద కూర్చున్నాము. అరుణ కూడా చేరి తన అత్తగారి మీద అవాకులు, చవాకులు పేలసాగింది. నిధి అని మా మార్వాడీ ఫ్రెండు వెంటనే తగులుకుంది అరుణని. ఆ అమ్మాయి ఆంటీ దగ్గర పెయింటింగ్ నేర్చుకుంది. మా అందరికి వీణాంటీ అంటే ప్రాణం. అరుణని పట్టుకుని నిధి నోటికొచ్చినట్టు తిట్టింది ఇంగ్లీషులో.” డి స్గస్టింగ్ లేడీయని.. రెచ్” అనీ. అందరం ఆఅమ్మాయిని పరోక్షంగా సమర్ధించాము. ఇంక చూడండి అరుణ రియాక్షను.

రెండు రోజులు పోయాక నిధి వాళ్ళాయన షాప్ కి ఫోనొచ్చింది .ఆఅమ్మాయి కేరక్టర్ మంచిది కాదని. తిరుగుబోతని. ఇంక చూడండి వాళ్ళు మొగుడు, పెళ్ళాలు ఇద్దరూ ఏకంగా ఆంటీ ఇంటికే వెళ్ళి వార్నింగిచ్చి వెళ్ళారు. ప్రదీప్ వెర్రి నవ్వు నవ్వి వూరుకున్నాట్ట. ఆంటీకి తన కొడుకు మానసిక స్థితి గురించి కొత్త బెంగ పట్టుకుంది. పిల్లల విషయంలో ఆవిడ పడ్డ శ్రమ ఫలించి పిల్లలు మాత్రం కొంత దారిలో పడ్డారు. నేను కూడా మా ఇంట్లో చదువు అదీ చెప్పి, కొంత భరిస్తా వాళ్ళని.  అరుణకి మాత్రం వాళ్ళు బ్రహ్మాయుధం. పిల్లల్ని అడ్డుపెట్టుకుని అత్తగారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది.

నిధి గొడవతో అరుణని అందరం కొంచెం తప్పించుకు తిరుగుతున్నాము. సామ, దాన, భేద, దండోపాయాలు మా మీద ప్రయోగించినా ప్రయోజనం లేక పోయింది. ఆ తిరస్కారం తీసుకోలేక ఇంట్లో అత్తగారి గురించి వాగడం మొదలుపెట్డింది. పాపం బయట వాకింగ్ కి వీలుకావట్లేదని సెల్లార్ లో నడుస్తున్నారు ఆంటీ. అంకుల్ ఫ్రెండు కనిపిస్తే నిలబడి మాట్లాడేరుట. అంతే ఆవిడకి శీల పరీక్ష పెట్టేసింది.ఇంక వింటూ కూర్చోలేక సాచిపెట్టి లెంపకాయ ఇచ్చాట్ట అరుణకి ప్రదీప్. అంతే పూనకం ఒచ్చినట్టు లేచి, స్టవ్ మీద వేడి కుకర్ తీసి, పిల్లాడి నెత్తి మీద మొత్తేయ పోయిందిట. ఆంటీ కాళ్ళు పట్టకుని బ్రతిమాలి ఆపించారుట. పాపం ఆవిడ చెయ్యంతా వేడికి కమిలిపోయింది. ఆత్మాభిమానం ఉన్న గొప్పింటి మనిషి ఆవిడ. బర్నాల్ రాసుకుని పని చేసుకుంటున్నారు. బయట పెట్టుకుంటే పరువు పోతుందని. రాత్రి పూట మా అత్తగారికి చెప్పుకుని ఏడుస్తున్నారు.

ఇంక మాఅత్త గారి సహనం అయిపోయింది. వాళ్ళని వెంటనే వేవు కాపురం పెట్టించమని సలహా ఇచ్చారు ఆంటీకి. కానీ వాళ్ళని బయటకి పంపిస్తే పిల్లలతో బ్రతికే ఆర్ధిక స్థోమతు లేదు. వద్దు అంది ఆంటీ.

ఒక రోజు రాత్రి మా అత్తగారు, ఆంటీ కూతురు ప్రతిమకి ఫోన్ చేసారు. పరిస్థితంతా వివరించారు. నివ్వెరపోయింది ఆ అమ్మాయి. తనకివేమీ తెలియలేదని, అన్నగారు తన దగ్గర కూడా డబ్బు తీసుకుంటాడని చెప్పింది. తల్లికి గ్రీన్ కార్డు ప్రోససింగ్ అయిపోయిందని, తన దగ్గరకు తీసుకెళ్ళిపోతానని చెప్పింది. అన్నట్టే ప్రతిమ అత్తగారు, మామగారు వచ్చారు. రెండు రోజుల్నుంచి ఏవో మాటలు, గొడవలవుతున్నాయని ఛూచాయగా తెలుస్తోంది. నిన్నంతా అత్తయ్యకి ఫోన్ చెయ్యలేదు ఆంటీ. ఇదిగో ఇప్పుడు తులసి తెచ్చిన ఉత్తరం.

“వీణా”!అని పెద్దగా అరుస్తూ మా అత్తమ్మ ఏడుపు విని హడిలిపోయి పరిగెట్టా గదిలోకి. పొర్లి పొ్ర్లి ఏడుస్తున్నారు. నేను ఏడవడం మొదలు పెట్టాను ఆమె ఏడుస్తుంటే ఏమయిపోయిందో అని.

” చదువే మానస!………. మహా ఇల్లాలు ఎంత కష్టం సహించి బ్రతుకుతోందో. ఆఖరికి వెళ్ళిపోయిందే నా నేస్తం నన్నొదిలేసి. ఇంకెవరున్నారు నాకు” అంటూ నన్నుకావలించుకుని ఏడుస్తూ, ఉత్తరం నా చేతికిచ్చారు. అది ఉత్తరం కాదు, ఒక వ్యధాభరిత ఆర్తనాదం.

అరుణ పెళ్ళయి వచ్చినప్పటి నుండి ఆమె ప్రవర్తన, ప్రదీప్ భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి, అది విఫలమయ్యి మనసు స్థిమితం తప్పి, కొంత వెర్రితనంగా తయారవ్వడం గురించి రాసారు. ఇంతయినా ఆమె అరుణ మీద సానుభూతి చూపిస్తున్నారు. అరుణ చిన్నతనంలో తన తల్లిని తన బామ్మ పెట్టిన కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. ఈ కష్టాలు తీరడానికి మార్గం దైవభక్తి, దైవనామము, పూజలూ, వ్రతాలే అని నమ్మిన అరుణ తల్లి, పిల్లలందరిని దైవమార్గంలోకి మళ్ళించిందని, అది వికటించి వీళ్ళలో అది ఒకలాంటి ఉన్మాదం లాగ మారిందని, అరుణకి మానసిక చికిత్స ఎంతో అవసరం, కానీ థెరపీకి అరుణ ఒప్పుకోదని రాసింది.

అలాగే మాఅత్తగారికీ, తనకూ కలిసి ఉన్న జాయింట్ అకౌంటులో పదిహేను లక్షలేసానని, ప్రదీప్ ని ఎలాగయినా ఒప్పించి, మా మరిది పిల్లలు చదువుతున్న కోయంబత్తూరు ఈశా రెసిడెన్షియల్ స్కూల్ లో జాయన్ చేయించమని నాకు బాధ్యత ఇచ్చారు. ఇంకా మిగిలిన ఆస్తులన్నీ మళ్ళీ వచ్చినపుడు పిల్లల పేరున పెట్టి, మమ్మల్ని గార్డియన్సుగా పెడతానని రాసారు. మా అత్తగారు కూతురుల దగ్గరకు అమెరికా వచ్చినపుడు అన్నీవివరంగా మాట్లాడుకుందామని రాసారు. కొడు కుని, కోడల్ని అసహ్యించుకోవద్దని, సానుభూతితో అర్ధం చేసుకోమని రాసారు దాంట్లో.

“సువర్చలా! అమెరికాలో నా సంగీతం, ఆర్టు పెట్టుకుని బతికేయగలను. నిన్ను చూస్తే నేనింక వెళ్ళలేను. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నా భారం నీ భుజాల మీద పడేసి” అంటూ మా అత్తగారిని ఉద్దేశించి. హృదయం ద్రవిస్తూనే ఉంది మా ఇద్దరికీ. కళ్ళు చెమరిస్తూనే ఉన్నాయి.

వారం తరువాత, సాయిబాబా గుడిలో ” మాకు అమెరికా గ్రీన్ కార్డు వస్తోంది అండి. త్వరలో అమెరికా వెళ్ళిపోతున్నాం. మా ఆయనకి అమెరికాలో ఉద్యోగాలు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడిపోతున్నాయి. ముందు మా అత్తగారిని పంపేసాము. పిల్లల్ని వచ్చేవారం కోయంబత్తూరులో జాయిన్ చేస్తున్నాము——” సాగిపోతోంది వాక్ప్రవాహం.  ఎవరా అని చూసా. ఇంకెవరు? అరుణే. విసుగ్గా మొహం పెట్టి వింటున్న గుడి పూజారికి రికార్డు వేస్తోంది. పైగా తాము అక్కడికి వెళ్ళగానే ఆయనకీ వీసా పంపిస్తామని, అక్కడ గుడిలో పెద్ద జీతానికి చేరొచ్చని గొప్పగా చెప్పింది. వెంటనే ఆయన ఇనుమడించిన ఉత్సాహముతో అరుణకి అష్టోత్తరం చెయ్యడం మొదలు పెట్టాడు.

“ఓ!  మొత్తానికి…పిల్లల్ని హాస్టల్ లో వెయ్యడానికి ఒప్పుకున్నారన్న మాట. అమ్మయ్య. వీళ్ళెలా పోతే నాకే. ఆ అమాయకులయిన  పిల్లలు  వీళ్ళ పిచ్చిల మధ్య నలిగి పోకుండా ఉంటే చాలు. హూ! అరుణ మారడం కల్ల. సైకియాట్రిస్టుకు కూడా పటిక బెల్లం నైవేద్యం పెట్టి మాయ చేయగల దిట్ట. ఆమెది వ్యాధి కాదు. తన మాట నెగ్గించుకోడానికీ, తన ఆత్మన్యూనత కనిపెట్టి, అందరిలో తనొక ప్రత్యేక వ్యక్తిలా చెలామణి అవ్వడానికి దైవభక్తి అనే ఆయుధాన్నివాడుతూ, తన వాళ్ళందరినీ హింసిస్తూ బ్రతికేస్తున్న ఒక అతితెలివి జీవి. జీవితం నుండి పాఠాలు నేర్వకుండా, అవకాశ వాదం ముసుగు కప్పుకున్న ఒక ప్రమాద కరమయిన కీటకం. మారే కాలంలో, మారడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్యని పరాన్నభుక్కు. ఆమె మాటలు వింటూ, ఒక లాంటి జుగుప్స ఆవరించగా గుడిలోకి వెళ్ళకుండా వెనుతిరిగి పోయాను.

13 thoughts on “మారుతున్న కాలంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *