May 19, 2024

శివోద్భవం-శివరాత్రి 

రచన: వెంకట సుశీల

kavd-kavaran-yatra-lordd-shiva

 

విశ్వపిత అయిన శివ పరమాత్ముడు భారతదేశంలో ఉద్భవించిన సమయాన్ని స్మృతిచిహ్నం గా జరుపుకొను పండుగే శివరాత్రి పండుగ. వారిని పరంశివుడు, సదాశివుడు అని పిలుస్తారు. శివ అనేది సంస్కృత శబ్దం. దానికి రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటేమో “బిందువు”, రెండవది “కళ్యాణకారి”. అందుకే మొదటి అర్ధం “బిందువు” వారి రూపానికి, రెండవది “కళ్యాణకారి” వారి కర్తవ్యానికి సరిపోతుంది. ఇతరమతాలవారు కూడా భగవంతుడు ఒక జ్యోతిస్వరూపమనీ, వెలుగనీ అంగీకరిస్తున్నారు. ఏసుక్రీస్తు “గాడ్ ఈజ్ లైట్” అని అన్నారు కదా! శిక్కు ధర్మస్థాపకుడు గురునానక్ పరమాత్మను “ఓంకార్” అని అన్నాడు. మిస్తులు శివలింగాన్ని అయీసిస్ మరియు ఒసిరిస్ పేరుతో పూజలు చేశారు. ముస్లిములు “నూర్-ఎ-ఇలాహి” అని అంటారు. శివలింగము పరమాత్ముని స్మృతిచిహ్నము. అందుకే శివుడంటే దేవాదిదేవుడు.

అజ్ఞానందకార సమయంలో శివ పరమాత్మ బ్రహ్మ శరీరంలో అవతరించి జ్ఞానప్రకాశమిస్తున్నారు. అందుకే శివుని భారతదేశంలో జ్యోతిర్లింగముగా పూజిస్తున్నారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన 12 మఠాలను కూడ ద్వాదశ జ్యోతిర్లింగమఠాలని అంటారు. శివాలయంలో శివుని ఎదురుగా ఉన్ననంది బ్రహ్మకు చిహ్నము. పరమాత్ముని నివాస స్థానము పరంధామము. వారు తల్లిగర్భం ద్వారా జన్మించరు, అవతరిస్తారు. కళ్యాణకారిగా వారి ముఖ్య కర్తవ్యము జీవాత్మలను పాపులనుండి రక్షించి పావనం చెయ్యడము.

పండుగ అనగానే రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని భుజిస్తారు. కానీ శివరాత్రి పండుగనాడు ఉపవాసముంటారు. ఉపవాసమంటే దగ్గరగా నివసించుట. అర్ధరాత్రి శివాలయాలలో అభిషేకాలు చేస్తారు. భక్తులు ఆ సమయాన్నిలింగోద్బవ సమయమని అంటారు అనగా అది శివుడు అవతరించిన సమయమని అంటారు. అది కూడా మాఘబహుళ చతుర్ధశి అనగా పూర్తి అంధకార సమయము. ఇది అజ్ఞానాందకారానికి గుర్తు ఆ సమయంలోనే శివుడు అవతరించి జ్ఞానప్రకాశమునిస్తారు. మనుష్యులను దేవతలుగా మారుస్తారు. తిరుమల వెంకటేశ్వరుని విగ్రహము వెనుక కూడా శివలింగముందని పెద్దలు చెప్తారు. మన ఆత్మలలో అనేక రకాలున్నారు- పుణ్యాత్మ, పాపాత్మ, దేవాత్మ, మహాత్మ కానీ పరమాత్మ ఒక్కరే. పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వ దివ్యగుణాల సాగరుడు, దు:ఖహర్త-సుఖకర్త, శాంతిసాగరుడు, ఆనందసాగరుడు, ప్రేమసాగరుడు.

శివుని సంకల్పమే హోలీ పండుగ

హోలీ పండుగను మంగళ మిలనము, సంస్కారాల మిలనము గా భావించెదరు. పాతశతృత్వాలేమైనా వుంటే దానికి స్వస్తి చెప్పి మరలా ఒకరికొకరు దగ్గరవుతారు. అంతేకాకుండా హోలీ ముందురోజున అందరి ఇళ్ళల్లోఉన్న పాతసామాను, విరిగిపోయి పనికిరాని ఫర్నిచర్ ను, పనికి రానివి ఏవేవి ఉన్నవో వాటన్నిటినీ కాల్చేస్తారు. అందుకే ఈ పండుగను కామదహనమని కూడా అంటారు. మనలోఉన్న పనికిరాని వికారగుణాలను కాల్చివేయుటకు గుర్తుగా పనికిరాని వస్తువులను కాల్చేస్తారు. అన్నిటికంటే పెద్ద శత్రువు కామము, అలాగే ఇతర వికారాలు క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యాలు. ఈ వికారాలని యోగాగ్ని ద్వారా దహించివేయాలి, ఇదే శివసంకల్పము. అందుచేత ఈ సంగమ సమయములో ఆ పరమశివుడు బ్రాహ్మణాత్మలైన మనలను పవిత్రం చేసినందుకు గుర్తుగా హోలీ పండుగను అందరూ ఆచరిస్తున్నారు. బ్రాహ్మణాత్మలు అంటే కులరీత్యా చెప్పుకోవడం కాదు సుమీ. ఆనందం, జ్ఞానం, శాంతి, సుఖము, ప్రేమ, శక్తి మరియు పవిత్రత అనే లక్షణాలతో ఆత్మలను సృష్టించి వాటికి సహనశక్తి, సర్దుబాటు, ఇముడ్చుకొనే శక్తి, పరిశీలన, న్యాయనిర్ణయశక్తి, ఎదుర్కొనే శక్తి, సహయోగ శక్తి, సంకీర్ణ శక్తి అనబడే అష్టశక్తులను ఇస్తాడా పరంధాముడు. ఇట్టి స్థితిలోవున్న ఆత్మలను బ్రాహ్మణాత్మలు లేదా బ్రహ్మచే జ్ఞానాన్నిపొందిన ఆత్మలు గా చెప్పబడినవి. భూమిమీద ఈ ఆత్మలు మనుష్యులుగా జన్మించాక కామ, క్రోధ, మదమాశ్చర్యాలకు లోనయి బ్రహ్మనుండి పుణికి పుచ్చుకున్న తమ లక్షణాలను, శక్తులను పోగొట్టుకొని కర్మలపాలయినప్పుడు, వాటినుండి తప్పించడానికే ఈ వికారాలను యోగాగ్ని లో దహించివేసి పావనం కమ్మని చెప్పడమే శివుని సంకల్పముగా ఈ హొలీ కి అర్ధము.

3 thoughts on “శివోద్భవం-శివరాత్రి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *