May 8, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 4

విశ్లేషణ:  టేకుమళ్ళ వెంకటప్పయ్య  

Lord-Balaji-Tirumala-Tirupati4

అన్నమయ్య కొన్ని కీర్తనలలో తనకు కలిగిన సందేహాలనూ సంశయాలనూ సరాసరి శ్రీ వేంకటేశ్వరుడినే ప్రశ్నిస్తాడు.   శ్రీ మహావిష్ణువు అవతారాలలో జరిగిన పరస్పర విరుద్ధమైన విషయాలను “ఇదేమి చోద్యం స్వామీ!” అని నిర్భయంగా నిలదీసి  ప్రశ్నించే హక్కు వున్న  పరమ భక్తాగ్రేసరుడు అన్నమయ్య.  తనకు ముందున్న పురాణ పద్ధతులనూ, పద్య కావ్య పద్ధతుల్నీ విడచిపెట్టి, క్రొత్త పద్ధతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృష్టించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య. భువిపై అతడు ఆడిన మాటెల్ల అమృతకావ్యమైంది. పాడిన పాటెల్ల పరమగానామృతమై నిలిచింది. తన కీర్తనలను మధురభక్తితో అలౌకికజగత్తులో రచించి ఆ సంకీర్తనా పుష్పాల్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని పాదాలకు సమర్పణ చేశాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనల్లో పెళ్ళిపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళపాటలు, ఏలపాటలు, సంవాదపాటలు, తుమ్మెదపాటలు, కోలాటపుపాటలు, సువ్విపాటలు, చిందుపాటలు, తందానపాటలు.. ఇలా ఎన్నో… రక రకాలున్నాయి. కీర్తనల్లో గల విషయాన్ని బట్టి శృంగారకీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు అని విభజన జరిగినా, ఏ విభజనకీ లొంగని కీర్తనలూ కొన్ని గమనించవచ్చు.  అయితే మనం ఎక్కడా కనని అన్ని రకాల కీర్తనలనూ తాళ్ళపాక వంశీకులు సృష్టించారని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.  అన్నమయ్య ఈ కీర్తనలో స్వామిని చిలిపిగా, పరస్పర విరుద్ధమైన విషయాలను ప్రస్తావిస్తూ… “ఇదేమిటి స్వామీ! ఇలా ఎందుకు జరిగింది?”  అని ప్రశ్నించడం మంచి చమత్కారంగా సాగింది.

పల్లవి: ఏది చూచినను గడు నిటువంటి సోద్యములే

మేదినికి గిందుపడి మిన్నందనేలా ||

చరణం-1 కరిరాజుగాంచిన కరుణానిధివి నీవు

అరిది నరసింహరూపైతివేలా

వురగేంద్రశయనమున నుండి నీవును సదా

గరుడవాహను డవై గమనించనేలా ||

చరణం-2 పురుషోత్తమఖ్యాతి బొదలి యమృతము వంప

తరుణివై వుండ నిటు దైన్యమేలా

శరణాగతులకు రక్షకుడవై పాము నీ_

చరణములకిందైన చలముకొననేలా ||

చరణం-3 దేవతాధిపుడవై దీపించి యింద్రునకు

భావింప తమ్ముడన బరగితేలా

శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల_

జీవకోట్లలోన జిక్కువడనేలా ||

(ఆధ్యాత్మ సంకీర్తనలు – రాగి రేకు 23

సంకీర్తన సంఖ్య – 140)

ఏది చూచినను గడు నిటువంటి సోద్యములే

మేదినికి గిందుపడి మిన్నందనేలా

ఇదేమి ఆశ్చర్యం స్వామీ! భూమిక్రిందగా పడటమేమిటి? మరలా అత్యాశ్చర్యకరంగా ఆకాశమంత ఎత్తు ఎదగడమేమిటి? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.   కూర్మావతార ఘట్టాన్నీ…వామనావతార ఘట్టాన్నీ ప్రస్తావనకు తెస్తున్నాడు అన్నమయ్య. ఆవిశేషాలను క్లుప్తంగా చూద్దాం.

ఒకానొక కాలంలో దేవతలు నారాయణుని ప్రార్ధించి “మరణం లేకుండా ఉపాయం అనుగ్రహించవలసిందిగా వేడుకున్నారు. ఆయన ప్రసన్నుడై, క్షీరసాగర మధనం గురించి వివరిస్తూ..  “కార్యసాధనకి మీరు మనకు శతృవులైనా రాక్షసులతో సంధి చేసుకోవాలి. మందర పర్వతం కవ్వంగా, వాసుకి కవ్వం తిప్పేవాడుగా, పాల సముద్రాన్ని మథించాలి. సముద్రం నుంచి ఎన్నో ఆకర్షణీయమైనవి బయటకు వస్తాయి. వాటిని చూసి మోహపడకండి. విషమూ వస్తుంది. జరిగే వానిని మీరు ఆక్షేపించ వద్దు. చివరికి అమృతం వస్తుంది. రాక్షసులకు అది చిక్కకుండా నే చూసుకుంటాను. అమృతం తాగి చావు లేని వారయి, మీరనేక శుభాలు పొందుతారు” అన్న విష్ణువు మాటలకు పరమానంద భరితులై, శ్రీహరి చెప్పినట్లుగానే దేవేంద్రుడు తన దేవతలతో రాక్షసరాజు బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళి, సంధి కోరాడు. అందుకు బలి అంగీకరించిన తరువాత మిగిలిన రాక్షసులందరూ సంతోషంగా వారి అంగీకారం తెలిపారు. మందర పర్వతాన్ని ఒక చేతితో ఎత్తి పాలసముద్రం దాకా శ్రీహరి తీసుకు వెళ్లాడు. కాని అది సముద్రంలో వేయగానే ఏమీ ఆధారం లేక  మునిగిపోసాగింది. బ్రహ్మాది దేవతలంతా మళ్ళీ విచారంలో పడ్డారు. వారి భయాన్ని మాన్పి, వెంటనే శ్రీ మహావిష్ణువు ఎనిమిది లక్షల యోజనాల వైశాల్యంతోనూ లక్షా ముప్పైవేల యోజనాల ఎత్తుతోనూ ఉన్న కూర్మరూపంగా అవతరించి ఆ పర్వతం కిందకు వెళ్ళి దానిని తన వీపు మీద ఉంచి, సముద్రం పైకి పర్వతం వచ్చేలా చేశాడు. ఆ తర్వాత వాసుకిని దానికి చుట్టి సముద్రాన్ని మథిస్తున్నప్పుడు గరళం, లక్ష్మీదేవి, అమృతం అలాంటి వాటితో పాటు అపార ధనరాశులు, నవనిధులు వెలువడ్డాయి. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి లోకోద్ధరణకు సాయం చేశాడు. ఆయన అవతార లక్ష్యం అదే. అలా విష్ణుమూర్తి భూమికి క్రింద పడవలసిన అవసరం ఏర్పడింది.

దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి చక్రవర్తి, రాక్షస గురువైన శుక్రాచార్యుల గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. దేవతలు వారి గురువైన బృహస్పతి మాటలు విని అమరావతి వీడి పారిపోయారు. వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేస్తాడు. అమరావతి కి ఇంద్రుని మరలా అధిపతిని చేస్తాడు. ఆ ఆ సమయము లో మహాభాగవతం లో పోతనార్యుడు చెప్పిన విధంగా ఇంతితై వటుడింతయై, మరియు దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియైన ఆ మహావిష్ణువునకు ఆ ఉదయం సమయంలో సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు. ఇలా అంత పెద్ద ఆకారంతో ఆకాశాన్ని అందుకున్న స్వామీ.. భూమిక్రింద పడడం ఆశ్చర్యం గా ఉంది అంటున్నాడు  అన్నమయ్య.

కరిరాజుగాంచిన కరుణానిధివి నీవు

అరిది నరసింహరూపైతివేలా!

స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం తర్వాత.. తామసుడు మనువు గా ఉన్న కాలంలో  శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు.  ఆసంఘటన పరిశీలించ దగినది. క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతానికి బంగారం, ఇనుము, వెండి అనే మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీద ఉన్న అడవులలొ అన్ని కృఊర మృగాలతో పాటుగా అనేక ఏనుగులు కూడా ఉండేవి. ఒకరోజు దాహ బాధతో తిరుగుతూ నీటికోసం వెదకుచూ ఒక ఏనుగుల గుంపు చీలిపోగా.. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి. గజరాజు దాహబాధ తీర్చుకొనే సమయం లో ఆ చెరువు లో ఉన్న ఒక మకరం ఆ గజరాజు కాలు పట్టింది. ఆ పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని అనుకొంటూ ఉండగా మెసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు ఎంత ప్రయత్నించినా..జలమే మొసలి నివాసస్థానం అవడం వల్ల బలం సన్నగిల్లుతోంది, నీరసిస్తోంది. మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, ఆ మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించగ దేవుడు ఎవరా అని ఆలోచించి విష్ణుమూర్తిని ప్రార్ధించింది. ఆ సమయం లో  శ్రీమహావిష్ణువు వైకుంఠంలో అంతపురంలో శ్రీ మహాలక్ష్మీ దేవితో సరసాలాడుతూ ఉండగా గజరాజు ప్రార్ధన వినగానే సర్వశక్తులు విడిచి గజరాజు రక్షణ కోసం వెంటనే బయలు దేరినాడు. ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరగానే సుదర్శన చక్రాన్ని విడిచి పెట్టగా అది సరోవరంలో ప్రవేశించి ఆ మొసలితలను ఖండించింది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు.

ఇక గజరాజుకు శతృవైన సింహం అవతారము ప్రహ్లాదుడిని రక్షించడానికి విష్ణువు ధరించడం జరిగింది కదా.. ఆ వృత్తాంతమూ చూద్దాం. శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అవతారం ధరించి హిరణ్యాక్షుని చంపగా సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణువును శతృవుగా భావించాడు.హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. అతని విష్ణు భక్తి మానిపించుటకు రాజాజ్ఞ ప్రకారం భటులు  చంప చూసారు. ఏనుగుల చేత తొక్కించారు. కొండమీద నుంచి కిందికి యెత్తిపడేసారు. పాములచేత కరిపించారు. అగ్నిలో పడేసారు. ఏ విధంగానూ చావకపోవటమే కాకుండా చెక్కుచెదరకుండా వాటన్నిటి నుంచీ బయట పడి రాగా, మాతరం కాదని వాళ్లు రాజుకి జరిగినదంతా విన్నవించుకున్నారు. హిరణ్యకశిపుడు కోపించి  చంపబూని నేను కత్తి యెత్తి ఒక్క వేటు వేస్తే అప్పుడు నిన్ను కాపాడడానికి ఆ శ్రీహరి యెక్కడ నుంచి వస్తాడు? ఈ స్తంభం నుంచా?” అని యెదుటనున్న స్తంభం చూపించి హేళన చేస్తూ కత్తి పట్టుకుని ముందుకు అడుగు వేయబూనగా….అంతే! ఆ స్తంభంలోంచి భయంకర సింహ గర్జనతో  ముల్లోకాలూ విని గడగడ లాడే భయంకరమైన రూపం వెలువడింది. సగం మనిషి, సగం సింహం అయిన ఆ నరసింహావతారాన్ని చూసి భయపడుతూ , హిరణ్యకశిపుడు పరుగుతీయబోయాడు. కానీ పౌరుషంతో యెదురుతిరిగి నరసింహ  స్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. నరసింహుడు హిరణ్యకశిపుని పట్టి, తన తొడలపై పెట్టుకుని సభాద్వారమందు గడపపై నిలుచుని, పగలు రాత్రి కాని అసుర సంధ్య వేళ గోళ్లతో చీల్చి ముక్కలు చేశాడు.   గజరాజును గాచిన నీవే దానికి శతృవైన సింహ రూపం కూడా ఎత్తడం ఆశ్చర్యం గొలుపుతుంది కదా!  అంటాడు  అన్నమయ్య.

వురగేంద్రశయనమున నుండి నీవును సదా

గరుడవాహను డవై గమనించనేలా !

పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు. సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగపై మోస్తున్నాడు.  కశ్యపప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుఁడు. ఇతఁడు తన తల్లియైన కద్రువ, వినత యెడల చేసిన యక్రమమునకు ఓర్వ చాలక, గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములయందు మహాతపమాచరింపఁగా బ్రహ్మ అతని సత్యనిష్ఠకును ధైర్యమునకును మెచ్చి భూభారమును వహించునట్టి శక్తిని ప్రసాదించెను.  ఆనాటినుండి ఆదిశేషువు ఈశ్వరప్రసాదముచే విష్ణువునకు పానుపై వేయిపడగలతో భూమిని మోయుచూ ఉన్నాడు. అలాంటి సర్పమునకు బద్ధ విరోధీ.. శతృవు  అయిన గరుడుని వాహనముగా కలిగిన విష్ణు మూర్తిని “ఇదేమి చిత్రమయ్యా స్వామీ.. సర్ప శయనుడవయ్యావు దానికి జన్మత: విరోధి అయిన గరుడుని వాహనముగా చేసుకొని యున్నావు”. అన్నీ చోద్యములే కదా! అని అంటున్నాడు.

పురుషోత్తమఖ్యాతి బొదలి యమృతము వంప

తరుణివై వుండ నిటు దైన్యమేలా!

పాలసముద్రం చిలకడానికీ, అమృతముగురించి దేవతలకు ఉపాయము చెప్పిన పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు చివరకు మోహిని గా స్త్రీ అవతారం ఎత్తవలసి వచ్చింది. అలా జరిగిన క్షీర సాగర మధనం సమయం లో వచ్చిన శ్రీ మహాలక్ష్మీ దేవిని విష్ణువు తీసుకున్నాడు. ఐరావతం వచ్చింది.  అది ఇంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షం, కామదేనువు వచ్చాయి. కానీ రాక్షసులు అవేమీ పట్టించుకోలేదు. వాళ్ల దృష్టి మొత్తం అమృతం మీదే ఉంది. ఆ రెండింటినీ కూడా ఇంద్రుడే తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చింది అమృతం. ముందు మాకు అని దేవతలంటే, కాదు మాకేనని రాక్షసులు అన్నారు. తగదా పెరిగి పెద్దదయే లోపుగా విష్ణువు మోహిని అవతారంలో అద్భుత సౌందర్యం తో సాక్షాతరించే సరికి  రాక్షసులు అంతా ఆ సౌందర్యాన్ని తిలకిస్తూ మాయలో పడిపోయారు. మోహిని ఆ అమృత కలశం అందుకుని దేవతల్ని ఒక వరుసలో, రాక్షసుల్ని మరో వరసలో కూర్చుంటే అందరికీ అమృతం అందిస్తానని చెప్పి మొదట దేవతందరికీ అమృతం పంచేసి తీరా రాక్షసుల వంతు వచ్చేసరికి మోహిని అవతారం అదృశ్యం అయిపోగా ఏం చెయ్యాలో తెలియక రాక్షసులు అడవులపాలయ్యారు.  అలా దేవతలందరికీ మార్గోపదేశం చేసిన పరమ పురుషోత్తముడే స్త్రీ అవతారం (మోహిని) ఎత్తవలసి వచ్చిన దైన్య పరిస్తిని అన్నమయ్య చమత్కారంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు.

శరణాగతులకు రక్షకుడవై పాము నీ_

చరణములకిందైన చలముకొననేలా !

శరణు అన్నవాళ్ళను రక్షించే దయాకరా! కాళియమర్ధన సమయము లో కాళియుడనే సర్పాన్ని నీ కాళ్ళ క్రింద వేసుకుని హింసించవలసిన పరిస్తితి, పట్టుదల ఎందుకు స్వామీ! అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. అన్నమయ్య పోతన రచించిన భాగవతాన్ని ఆమూలాగ్రం చదివి అనేక కీర్తనలను రచించాడనడానికి స్ఫూర్తిగా అనేక కీర్తనలు తార్కాణంగా మనకు గోచరిస్తున్నాయి. అయితే అవన్నీ కృష్ణ లీలలని అన్నమయ్యకు బాగా తెలుసు. కేవలం చమత్కారం కోసమే స్వామిని అలా అడుగుతున్నాడు.

దేవతాధిపుడవై దీపించి యింద్రునకు

భావింప తమ్ముడన బరగితేలా

శ్రీవేంకటాచలస్థిరుడవై లోకముల_

జీవకోట్లలోన జిక్కువడనేలా !

దేవతలందరికీ అధిపతి యైన విష్ణుమూర్తి దేవేంద్రునికి తమ్మునిగా వామనునిగా జన్మించి ఉపేంద్రునిగా పిలువబడ్డాడు. ఇదేమి చిత్రం..ఆశ్చర్యం దేవతలకు అధిపతియైన నీవు నిన్ను సేవించే ఇంద్రునికి తమ్మునిగా పుట్టడం భలే వింత అని చెప్తున్నాడు అన్నమయ్య.   శ్రీ వేంకటాచలం పై సుస్థిర స్తానం ఏర్పరుచుకున్న వాడివి కదా మరి ఇందరి జీవ కోట్లకు రక్షగా వారి చిక్కులలో ఆపదలలో, రక్షింప బూనడం చిత్రమే కదా! అనగా, భూమండలం మీద ఉన్న సకల జీవరాశినీ రక్షించేదుకే అవతరించావు స్వామీ అని అన్యాపదేశం గా చెప్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు – చోద్యము = ఆశ్చర్యము; మేదిని = భూమి; అరిది= దుస్సహము, దుర్లభము; చలముకొను = పట్టుదలవహించు, పగబూను; పరగితివి = కనిపించితివి, అవతరించితివి.

విశేషాంశాలు:

    1. మోహిని అవతార ప్రాశస్త్యం: తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శ్రీనివాసుడు మోహిని అవతారంలో శృంగార రసాధిదేవతగా భక్తులకు దర్శనిమిస్తారు. ఈ వాహన సేవకు ఓ ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల్లో జరిగే అన్ని వాహనాల ఊరేగింపులూ వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. బంగారు తిరుచ్చిపై మోహిని అవతారంలో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. కృష్ణుడిగా మరోరూపంలో దంతపు పల్లకీ పై మాడ వీధుల్లో విహరిస్తారు. సమస్త విశ్వమంతా తన మాయా విలాసమని (విష్ణు మాయ), తన భక్తులు ఆ మాయను సులభంగా దాటి  తరించాలన్నదే  మోహిని అవతార సందేశం.
    2. కాళీయుని కధ:  పూర్వం సర్పజాతిలో గరుత్మంతుడు తమను చంపకుండా వుండేటందుకు జనులు సర్పాలకు సమర్పించిన మధుర పదార్ధాలను కొన్నింటిని భూమిపై వదలివెళ్ళే ఆచారం ఉండేది. కాళియుడు అనే సర్పం మాత్రం మదగర్వం తో గరుత్మంతునికి ఏమీ వదలకుండా తినేసే వాడు. దానికి గరుడుడు కోపించి దాని గర్వం అణగే విధంగా కోరలు పీకి బాధించగా అది వెళ్ళి యమునా నదికి దగ్గరలో ఉన్న మడుగులో ప్రవేశించింది. అలా ఆ మడుగులోనే ప్రవేశించడానికీ కారణం ఉంది. పూర్వం సౌభరి అనే మహర్షి ఆ మడుగు వద్ద తపమాచరించే వాడు. ఒకనాడు గరుడుడు ఆ మడుగులోని చేపలను పట్టి చంపితినగా మిగిలినవి మహర్షికి మొరపెట్టుకున్నాయి. మహర్షి ఈ మడుగులో చేపలను గరుత్మంతుడు తినినట్లైతే ప్రాణాలు విడుస్తాడు అనే శాపం ఇచ్చాడు. ఆ విషయం తెలిసిన సర్పం ఒక్క కాళియుడు మాత్రమే.  ఆ మడుగులో ఉంటే గరుడుని బారినుండి తప్పించుకోవచ్చని తెలిసిన కాళియుడు అక్కడ చేరి నివాసమున్నాడు.
    3. శ్రీహరి జన్మల వృత్తాంతం: శ్రీహరి దేవకి వసుదేవుల పుత్రునిగా మూడు జన్మలు ఎత్తడం జరిగింది. దేవకీ వసుదేవులు పృశ్ని,సుతప ప్రజాపతి గా జన్మించినప్పుడు వారు నాలుగు యుగాల పాటు తీక్షణమైన తపస్సు చేసారు. వారికి శ్రీహరి ప్రత్యక్షము కాగా,   శ్రీహరిని తమ బిడ్డగా జన్మించమనగా..మొదటి జన్మలో శ్రీహరి వారికి పృశ్నిగర్భుడుగా జన్మించాడు. రెండవ జన్మలో కశ్యప ప్రజాపతి, అదితి లకు ఉపేంద్రుని గా జన్మించాడు. అతనినే మనం వామనుని గా చెప్తున్నాం. మూడవ జన్మ లో దేవకి, వసుదేవుడు లకు శ్రీ కృష్ణుడి గా జన్మించారు.

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *