May 22, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 5

విశ్లేషణటేకుమళ్ళ వెంకటప్పయ్య 

balaji 4

జీవితం ఓ కలలాంటిది. అలాంటి తాత్కాలికమైన జీవితంలో జరిగేవన్నీ నిజమేననీ, శాశ్వతాలనీ భ్రమింపజేస్తాయి. అందువల్లనే మానవులు తీరని కోరికలతో ప్రతిదీ నాదీ నాదీ… అనుకుని తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. అవి తప్పటడుగులని తెలిసిన క్షణం నుంచీ జీవితాన్ని సరిదిద్దుకుని మోక్షం వేపు అడుగులు వేస్తాం. లేదంటే ఆ తీరని కోరికలతో నాదీ…నేను.. నావాళ్ళూ..అనే బంధాలలో జిక్కి జనన మరణ చక్రంలో శాశ్వతంగా పరిభ్రమిస్తూనే ఉంటామంటాడు ఈ కీర్తనలో  అన్నమయ్య.

ప.తెలిసితేమోక్షము – తెలియకున్న బంధము

కలవంటిది బదుకు -ఘనునికిని

చ.1.అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది

తనువుపై నాసలేని – తత్వమతికి

పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు

వొనర ఫలమొల్లవి – యోగికిని ||తెలిసితే||

చ.2.తగినయమృతమేది – తలవగ విషమేది

తెగి నిరాహారియైన – ధీరునికిని

పగవారనగ వేరి – బంధులనగ వేరీ

వెగటుప్రపంచమెల్ల – విడిచేవివేకికి ||తెలిసితే||

చ.3.వేవేలువిధులందు – వెఱపేది మఱపేది

దైవము నమ్మినయట్టి – ధన్యునికిని

శ్రీవేంకటేశ్వరుడు – చిత్తములో నున్నవాడు

యీవలేది యావలేది – యితనిదాసునికి ||తెలిసితే||

(అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన రాగిరేకు 104 కీర్తన 19)

తెలిసితేమోక్షము – తెలియకున్న బంధము

కలవంటిది బదుకు –ఘనునికిని

జీవునికి ఒక్కసారి కలల గురించి అవగాహన కలిగితే!  బాల్యము, యవ్వనము, వార్ధక్యము… ఎవరికి? జీవుడు నిద్రలో బాలుడా, యవ్వనుడా?, వృద్దుడా?  ఇవి అన్నీ లేనిదే స్వప్నం. జీవుడు నిద్రనుండి మేల్కొనిన తరువాత దేహముతో సంబందాన్ని ఏర్పరచుకొని మళ్ళీ మనం వివిధ దశలను భావిస్తున్నాడు. ద్రష్ట, దృశ్యముతో సంబంధం ఏర్పడుతోంది. ఈ సంబంధం ఏర్పరుచుకోవడమే బంధము.  వాస్తవానికి జీవుడు ప్రపంచములోని ఏ విషయానికీ బంధీ కాడు. జీవుడు ఆయా విషయాలతో ఏర్పరుచుకున్న సంబంధము వల్లనే అది జీవుని బంధిస్తుంది, బాధిస్తుంది, బంధనాలతో కట్టిపడేస్తుంది.  జీవితం ఒక స్వప్నం అని తెలుసుకున్న నాడు జీవుని ఏవీ బాధించవు. బయట పడటానికి మార్గము దొరుకుతుంది. మనిషి జీవన్ముక్తుడవుతాడు. జీవుడు వేసుకున్న ముడులు  బంధనాలు వాటంతటవి ఒక్కొక్కటిగా తొలగింపబడతాయి. ప్రపంచములో జీవిస్తూ ఉంటామే కాని ప్రపంచము చేత బంధింపబడము. అన్నీ ఉంటాయి కానీ ఏదీ ఉండదు. ఏదీ బంధించదు బాధించదు. అదే నిజమైనమోక్షము. మోక్షము అంటే వచ్చేది కాదు. ఉన్నది పోతే మిగిలేది అని తెలుసుకోవాలి. అలాంటి బతుకే ఘనమైన బ్రతుకు. అలాంటి జీవుడు ఉన్నతుడు, మహత్తరుడు, మహనీయుడు. ఆ జీవుడినే ఘనుడు అంటున్నాడు అన్నమయ్య.

 

అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది

తనువుపై నాసలేని – తత్వమతికి

పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు

వొనర ఫలమొల్లవి – యోగికిని

అసలు జీవికి షడూర్ముల కారణంగానే సుఖ దు:ఖాలు తద్వారా పాప పుణ్యాలు వస్తాయి. ఊర్మి అంటే అల లేక నొప్పి అనే సామాన్యార్థాలున్నా మనం పారమార్థికంగా దర్శిస్తే ధర్మం, తత్త్వం అనే అర్థాలు గోచరమవుతాయి.  జీవి యొక్క ధర్మాలనే షడూర్ములు అంటారు. అవే ఆకలి, దప్పిక, దుఃఖం, మోహం, వార్ధక్యం, మరణం జీవి ధర్మాలు. ఇందులో ఆకలి దప్పులు ప్రాణధర్మాలుగా పరిగణిస్తారు. దుఃఖం, మోహం అనేవి మనస్సు యొక్క ధర్మాలు. వృద్ధాప్యం, మరణం దేహధర్మాలు. మన:షడూర్ములనుండి విముక్తులు కాగలిగితే యోగులుగా మారుతారు. ఇంద్రియములద్వారా కలుగు సుఖదుఃఖములను ఎవరు సమదృష్ఠితో చూడగలరో వారిని ఏమీ బాధించవు. శరీరము ఎప్పటికైనా నశించేదే! అలాంటి  శరీరముపై జీవికి ఆశ ఎందుకు? అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు, దుఃఖము లేదు. అన్నీ సమానమే! ఎవరైతే “సమ దుఃఖం సుఖం ధీరం” అనగా సుఖ దు:ఖాలను సమానముగా చూడగల గల ధైర్యము కలవాడో వాడే మోక్షమునకు తగినవాడు. విషయములందు ఆసక్తి లేకుండా నిష్కామకర్మ చెయ్యడము, అలా చేసేటప్పుడు కూడా ఆ ఫలితాలకు చలించకుండా చేయడమే ప్రథానము. మనంచేసే ప్రతి కర్మ ఫలాపేక్ష లేకుండా చేస్తున్నప్పుడు పాపమూ పుణ్యమూ రెండూ జీవుని అంటవు.  అశాశ్వతమైన శరీరముపై ఆశ ఎందుకనే తత్వవిషయం పూర్తిగా తెలిసిన వారికి సుఖ దుఃఖములు లేవు కదా!  అలా ప్రతిఫలము ఆశించక ఫలత్యాగము చేసే యోగులకు పాపమేమిటి? పుణ్యమేమిటి? జీవుని భ్రమ తప్ప అంటాడు అన్నమయ్య.

 

తగినయమృతమేది – తల పగ విషమేది

తెగి నిరాహారియైన – ధీరునికిని

పగవారనగ వేరి – బంధులనగ వేరీ

వెగటు ప్రపంచమెల్ల – విడిచేవివేకికి

నిరాహారదీక్షచేపట్టిన యోగులకు అమృతమైనా, విషమైనా సమానమే తేడా ఏమీ లేదు. అలాగే ఈ ప్రపంచమంతా మిధ్య అని తెలిసి,  వెగటు చెంది బ్రహ్మములో రమించే యోగులకు పగవాడు లేదు, బంధువు లేడు, ఆడా మొగా అని కూడా అసలు ఏమీ తేడా ఉండదు. అందరూ ఒకటే యోగులకు అంటాడు అన్నమయ్య.  అన్నిటికీ అతీతులై నిరంతరం బ్రహ్మం లో రమించే శుకమహర్షి వంటి వారు. అలాంటివారే నిజమైన యోగులు. ప్రపంచంలోని ఐహిక సుఖాలనన్నీ విడిచిపెట్టి బ్రహ్మంలో రమించే వివేక జ్ఞాన సంపన్నులైన యోగులకు తనవారు పగవారు అనే బేధ భావం ఎందుకుంటుంది? అని ప్రశ్నిస్తున్నాడు  అన్నమయ్య.

 

వేవేలు విధులందు – వెఱపేది మఱపేది

దైవము నమ్మినయట్టి – ధన్యునికిని

శ్రీవేంకటేశ్వరుడు – చిత్తములో నున్నవాడు

యీవలేది యావలేది – యితనిదాసునికి

వేల వేల విధులున్నాయి జీవులకు. జన్మించినదాదిగా బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యాలలో మనిషి తన్మయావస్త పడుతూనే ఉంటాడు.  తృప్తిలేని వారికి, ధన సంపాదనలో చిక్కిన జీవికి, ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించిన సంతోషము రాదు. ఆ సంపాదనకు చేసిన కౄర కర్మల వల్ల పాపపు మూటలు పెరిగిపోతాయి. ఎందరో రాజులు, ప్రభువులు, కోటిశ్వరులు, లక్షాధికారులు కాల గర్భములో కలసి పోయారు. వారి పేర్లు, వూర్లు గూడా ఎవరికి తెలియదు. మరి భగవద్భక్తులు, త్యాగధనుల పేర్లు మాత్రము ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగ మిగిలి ఉన్నాయి. వారే ధన్య చరిత్రులు. వారే శ్రీవేంకటేశ్వరుని దాసులు. ఆ శ్రీవేంకటేశ్వరుని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారికి పాపపుణ్యాలు ఏమీ అంటవు. వారికి ఆవల ఈవల అనే బేధ భావాలు సైతం ఉండవు. అలాంటి దైవాన్ని మనసులో ప్రతిష్టించుకొని శరణు వేడక, ఈ వృధా ప్రయాసలన్నీ మనకెందుకని ఉద్భోదిస్తున్నాడు అన్నమాచార్యులవారు.

ముఖ్యమైన అర్ధములు:  అనయము = అవశ్యము;   అవల=అవతల; పొనుగు=నిస్తేజము; ఒల్లని=ఇష్టపడని; వెగటు= ఏవగింపు, వైరస్యము;   వెరపు=భయము.

 

విశేషాంశములు:

శుకమహర్షి గురించి ఒక విశేషము. భాగవతంలో ఒక సన్నివేశం. ఒకసారి దేవకన్యలు స్నానం చేస్తుంటారు. శుకమహర్షి పక్కగా వెళ్తుంటాడు, ఆయన వంటిమీద గోచీకూడా లేదట. కానీ ఆ అప్సరసలు గమనించీ పట్టించుకోరు. వాళ్ళ జలక్రీడల్లో మునిగిపోతారు. ఆ వెనువెంటనే, శుకుణ్ణి పిలుస్తూ వ్యాసుడు వస్తాడు.  ఆయన్ని చూడగానే, ఆ దేవకన్యలు సిగ్గుపడి, గబగబా తమ చీరలు కప్పుకుని తప్పుకుంటారు. అదిచూసి, వ్యాసుడు ఆ దేవకన్యల్ని”నా కొడుకు మంచి యవ్వనంలో ఉన్నాడు, పైగా నగ్నంగా ఉన్నాడు, అయినా ఆయన్ను చూసి మీరు సిగ్గుపడలేదు. కానీ నేను వస్త్రధారిని, పైగా వృద్ధుణ్ణి. నన్ను చూసి సిగ్గుపడి మీరు చీరలు కప్పుకున్నారు. కారణమేంటో చెప్పండి” అని అడుగుతాడు. దానికి వాళ్ళు,   “వ్యాసమునీంద్రా! నీ కొడుక్కి ఈమె స్త్రీ, వీడు పురుషుడు అన్న భేద దృష్టి లేనే లేదు. ఆయన నిర్వికల్పుడు, నిరంతరం బ్రహ్మం లో రమించే వ్యక్తి. కనీసం ఆయన మమ్మలను గమనించనైనా లేదు చూసారా? కనుక ఆయనకి నీకు చాలా వ్యత్యాసం ఉంది.” అన్నారట. శుకుడు ఏ ప్రదేశం లో కూడా ఆవుపాలు పితికినంత సేపటికంటే ఎక్కువ సమయం గడిపేవాడు గాదట. అలా ఉంటే ఎక్కడ వారితో సంబంధ బాంధవ్య రాగ ద్వేషాలు ఏర్పడి ఐహిక విషయాల్లో మునిగిపోతామేమోనని ఆయన తలంపు.  అలాంటి వారే నిజమైన యోగులు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *