May 21, 2024

మాయానగరం – 26

రచన: -భువనచంద్ర

 

“బోసు.. దయా, జాలీ, సేవా, త్యాగం, ఓర్పు ఇవన్నీ నాయకుడు కాదల్చుకున్న వాడికి స్పీడ్ బ్రేకర్లు. వీటన్నిటికీ మించిన దుర్గుణం ప్రేమ”. ఊబిలో పడ్డవాడ్ని బయటకి లాగొచ్చు. సముద్రంలో ఈతరాక పడినవాడ్ని రక్షించవచ్చు.  ప్రేమలో పడినవాడ్ని దేముడైనా రక్షించలేడు. నీకు అప్పుడే చెప్పాను.. కావల్స్తే ఆ అమ్మాయిని నయానో, భయానో లొంగదీసుకో, ‘ప్రేమ’ లో మాత్రం పడవద్దని.  అసలే ఆడది… అందునా అనాథ.. దాని ఆలోచన ఎలా వుంటుందీ? లోకాన్ని ఉద్దరిద్ధామనే ఉద్దేశ్యంలో వుంటుంది. అంతరాత్మ, ఆత్మసాక్షి లాంటి పదాలు విరివిగా వాడుతుంది. అవన్నీ వింటే ఒరిగేది ఏమిటో తెలుసా? గట్టిపడుతున్న నీ గుండె కరిగి కన్నీరవుతుంది.  కష్టపడి కట్టుకొస్తున్న నీ రాజకీయ భవనం ఠక్కున ఉన్నదున్నట్టుగా కూలిపోతుంది. ఆ తరవాత కోటిమందిలో నువొకడివి.  బాగా గుర్తుంచుకో…. నువ్వుండాల్సినది నక్కలాగా! కుక్కలాగా విశ్వాసంగా కాదు. నక్కలా జిత్తులు వేస్తుండాలి. అందలం ఎక్కే అవకాశం అందరినీ దక్కదు. నువ్వు పోగట్టుకోబోతున్న చోట్ల కోసం ఆల్రెడీ జనాలు అర్రులు చాస్తున్నారు.  ప్రేమా… ? పదవా… ? బాగా ఆలోచించుకో !” నల్ల కళ్ళద్దాలు తీయకుండా ఓ చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు పీఠాధిపతి.

“మీరెలా చెబితే అలాగే మసులుకుంటాను !” సిన్సియర్గా అన్నాడు బోసు. అప్పటికి ఆ గదిలోకి అడుగుపెట్టి రెండు గంటలయ్యింది. ‘గురుజీ’ నెట్ వర్క్ కి బోసుబాబుకి మతిపోయింది. శోభారాణి కోసం తను చేసే ప్రతి ప్రయత్నమే గాక అవతలివైపు శామ్యూల్ వేస్తున్న నక్క జిత్తులు కూడా గురూజీకి క్షుణంగా తెలిశాయని బోసుబాబు కి అవగతమైంది.

“అసలేముందని ఆ పిల్లలో ? ప్రతీ ఆడదాని దగ్గర ఏముంటుందో ఆ పిల్ల దగ్గర అదే వుంటుంది. నిజంగా ఆలోచిస్తే ఆ శోభ ప్రేమని పొందినా నీకు దక్కేదేమిటి?నాలుగు సుభాషితాలు, నాలుగు వేల నిట్టూర్పులు! అంతేగా? ఒరే బోసుబాబు, యీ లోకాన్ని నడిపించేది పదవీ, అధికారం. ఆ రెండూ కావాలంటే మస్తుగా డబ్బుండాలి. ఆ డబ్బు నువ్వెలా సంపాదించావన్నది ప్రశ్న కాదు. సంపాదించాలంతే!

బెగ్… బారో… స్టీల్… ఏదన్నా చేయ్. వెన్నుపోట్లు పొడు. నమ్మించి గొంతుకొయ్యి. ఏది చెసినా తప్పు కాదు. తప్పు లేదు. కానీ సంపాదించు. లెక్కలేనంత సంపాదించు… వెదజల్లు… ఓట్లని కొను. మళ్ళీ వెదజల్లినదానికి వేయి రెట్లు సంపాదించు బోసూ, నిన్నటి దాకా నిచ్చన నీ దగ్గరే వుంది. ఇవ్వాళా నీ దగ్గరే వుంది. ఏమాత్రం నువ్వు అజాగ్రత్తగా వున్న, నీ తలదన్ని ఇంకోడు నిచ్చెన ఎక్కుతాడు. రాజకీయాలలో వెన్నుపోట్లేగానీ వార్నింగులు వుండవు. అయినా నీకోసం నీ మంచి కోసం చెబుతున్న.. మరో చాన్స్ నీకు దొరకదు. “కళ్ళజోడు తీసి బోసు మొహంలోకి సూటిగా చూశాడు గురువుగారు.

ఆ కళ్ళలో చెప్పలేనంత ‘అసహనం’ కనిపించింది. కంటి చూపు కూడా అంత ‘ కఠినమైన ‘ వార్నింగ్ ఇవ్వగలదని మొట్టమొదటిసారి బోసుబాబుకి తెలిసొచ్చింది. భయంతో అతని వెన్ను వణికింది.

కళ్ళజోడు పెట్టుకొని చిన్నగా నవ్వి ‘ వెళ్ళిరా ‘ అన్నాడు గురూజీ. తలవంచి నమస్కారము చేసి బయటకొచ్చాడు బోసుబాబు.

పదవా? ప్రేమా? ఇదీ బోసుబాబు మనసులో ప్రశ్న. ఓ పక్క సినిమా లో కనిపించినట్టు శోభరాణి దీనంగా “నాకంటే నీకు రాజకీయాలే ఎక్కువ?” అని అడుగుతున్నట్టుగా వుంది. మరోవైపు జనమంతా నవ్వుతూ, “ఒరేయ్… యీడేరా… బ్రహ్మాండమైన మంత్రి పదవిని వదులుకొని ఎదవలాగా ఎవత్తి వెనకాలో పడ్డాడు” అంటున్నట్టుగా మనోఫలకం మీద కనిపించింది.

ఉన్నటుంది ఫక్కున నవ్వాడు బోసుబాబు. “ఆలూ లేదు చూలు లేదు అన్నట్టు అసలు శోభరాణికి తన ప్రేమ గురించే చెప్పలేదు. ఆవిడ దీనంగా ఎందుకుంటుంది? “అని మరోసారి నవ్వుకున్నాడు.

“అయ్యా” రిక్షా ఏసోబు.

“ఏంటీ ఏసోబూ?” చిరునవ్వుతో అడిగాడు బోసుబాబు.

“ఆవిడొచ్చిందండి” కొద్దిగా నవ్వి అన్నాడు ఏసోబు.

“ఎవరూ?” కుతూహలంగా అడిగాడు బోసుబాబు.

“అమ్మగారండి” చేతులు నలుపుకుంటూ అన్నాడు ఏసోబు.

“అమ్మగారా? ఎవరు?” కనుబొమ్మలు ముడిచి అన్నాడు.

“ఆవిడేనండి… బిజినెస్ చూసుకునేవోరు కదండి”

అప్పటికి కానీ నవనీతం అతనికి గుర్తుకురాలేదు.

నవనీతం గుర్తుకురాగానే వళ్ళు ‘జివ్వు’ మంది బోసుబాబుకి. లోకంలో చాలా మంది ఆడవాళ్ళకి సుఖపడటం తెలీదు.  తాము సుఖపడటం సంగతి పక్కన పెడితే, మొగుణ్ణి సుఖపెట్టడం అనేది అసలు తెలియదు. ఎంతసేపు మొగుడ్ని పక్కింటిదో వెనకింటిదో ఎదురింటిదో ‘వలలో ‘ వేసుకుంటుందేమో నన్న వెర్రి ఆలోచనలు తప్ప, అసలు మొగుడి ‘మనసు’ ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే చేయరు.

మొగవాళ్ళు మరీ… అసలు ఆడదానికి ఏం కావాలో, ఏమిస్తే భార్య నిజమైన ఆనందం పొందుతుందో నూటికి ఇద్దరైనా తెలుసుకోరు. తెలియజెప్పినా వినరు. అహం అడ్డొచ్చు వాళ్ళని విననివ్వదు.

నవనీతం విషయం వేరు. కొంతమంది ఆడవాళ్ళు ‘ప్రేమించబడటానికి’ పుడతారు. ఇదేమీ గొప్ప కాంప్లిమెంట్ కాదు. వాళ్ళు అనేక మంది చేత ప్రేమించబడతారే కానీ వాళ్ళకి ‘ప్రేమించడం ‘ రాదు. అసలు తెలీనే తెలీదు. అదంతా వాళ్ళ గొప్ప కింద భావిస్తారు. నాకో హీరోయిన్ తెలుసు. ఎంతసేపు ఆవిడ తన అందచందాల గురించి, ఎవరెవరు తనంటే పడి చచ్చేవాళ్ళో వాళ్ళ గురించి తెగ చెప్పుకునేది. ఆమె అందగత్తే.. నో డవుట్! కానీ విచిత్రమేమిటంటే ఎదుటివాళ్ళు తనని ప్రేమిస్తున్నారనే అహంభావం , అతిశయానికే గానీ, ఏనాడు ఎవర్ని తాను ప్రేమించలేకపోయింది. తద్వారా ఆవిడే ఏం పోగొట్టుకుందో ఆవిడకే తెలియదు.

నవనీతం విషయం వేరు.. ఆవిడది రెండో కేటగిరి. పెళ్ళి మీద నమ్మకం లేదు. ప్రేమ గురించి ఆమెకున్నవి చేదు అనుభవాలే గానీ, ఒక్క తీపి గుర్తు కూడా లేదు. అయితే నవనీతానికి బోసు అంటే ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎంతటి సాఫ్ట్ కార్నర్ అంటే, అతను ఏ తప్పు చేసినా నిద్ద్వందంగా క్షమించగలిగేటంత.

అందుకే వొళ్ళు పూర్తిగా పరిచి ఇచ్చేది. వారి మధ్య నున్నది శృంగారం కాదు… పశు వాంఛ. రెండు బలిసిన పశువులు హోరాహోరీ పోరాటం అది. పోరాటం అయ్యాక ఎవరి దారి వారిది. ‘ఒకరి కోసం ఒకరు’ అనే మాటకి అర్ధం ఇద్దరికీ తెలీదు. ఎప్పుడో అప్పుడు ఈ సన్నని ‘మోహ ‘ దారం కూడా పుటుక్కున తెగిపోక తప్పదని నవనీతానికి తెలుసు. ”అప్పటి సంగతి అప్పుడు” అనే మొండి ధైర్యం మాత్రం నవనీతంలో మొండుగా వుంది.

“వచ్చావా?” అన్నాడు బోసుబాబు. సూటిగా కళ్ళల్లోకి చూసింది నవనీతం. అతని కళ్ళల్లో కాంక్ష ఆమెకి తెలిసిపోయింది. ఎదురుగా వెళ్ళి చెయ్యి పట్టుకొని అతన్ని మీదకు లాక్కుంది. ఆమె కళ్ళల్లో ఓ సంతృప్తి. “వీడింక నన్ను దాటిపోలేడు ” అన్న కంఫర్మేషన్.

పిరికివాడైన మంచివాడి కన్నా ధైర్యవంతుడైన దుర్మార్గుడైన సమాజానికి ఉపయోగపడగలడు. ” అన్నాడో మహానుభావుడు. ఆ మాట ముమ్మాటికి నిజమే అనుకోవాలి. లేకపోతే మంచివాడి వూహలోక్కూడా రాని ‘అనుచరణం ‘వెధవల వెనకాల ఎందుకుంటుంది?

‘ఫలానా వాడు వెధవ’ అని  ప్రజలకి తెలీదా? వాడు చేసిన వెధవ పనులు , నానా అత్యాచారాలు తెలిసి కూడా వాడికే జనాలు ఓటేసి ఎందుకు పదవిని కట్టబెడుతున్నారు?

సరే నూకలు చెల్లిన వాడు చస్తే , మళ్ళీ వాడి కుటుంబం నుంచే మరో వెధవని ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు ఏ మేధావికి అందవు. యుగయుగాలుగా ఈ దేశంలో పేరుకుపోయిన మానసిక బానిసత్వం ఈ సంప్రదాయాన్ని చెక్కు చెదరనివ్వదు.  లక్ష కోట్లు కొట్టేసి , అందులో పది లక్షలు పబ్లిక్ గా దానం చేస్తే చాలు , సదరు వ్యక్తి దాన కర్ణుడైపోతాడు.

నిన్నటిదాక ఫుడ్డుకి లాటరీ కొట్టిన వాడు నేడు కోటీశ్వరుడై పోతే ‘ ఆహా.. ఓహో ‘ అంటూ వాడికి నీరాజనాలు పడతారే కానీ , ‘ఎలా అయ్యాడూ?’ అని ఎవడూ అడగడు. మరీ విచిత్రం ఏమిటంటే , అటువంటి వారి జీవితాలు పిల్లల పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలు అవుతాయి.   పెద్ద పెద్ద యూనివర్సిటీలు వారికి డాక్టరేట్లు ఇస్తాయి కొందరు సదరు జీవితాలను సినిమాలు గా కూడా మలుస్తారు… ముఖ్యంగా నేర చరితుల జీవితాలని.

‘సత్యం’ కంటే నేరానికే గ్లామర్ ఎక్కువ.

శామ్యూల్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. అయినా శోభ పుట్టినరోజు జరిపించి టాక్ ఆఫ్ ద టవున్ అయ్యాడు. రెండు మూడు టి.వి. చానల్స్ వారు శ్యామూల్ రెడ్డిని ఇంటర్వ్యూ కూడా చేశారు.

“అవును.. నా స్కూల్లో పని చేసేవారందరూ నా కుటుంబ సభ్యులేకుటుంబ పెద్దగా వారి అచ్చట్లు ముచ్చట్లు తీర్చవలసిన భాధ్యత నా మీదే వుంది. ఇందులోనూ నాకూ ‘స్వార్ధం’ లేకపోలేదు. వారిని నేను ఎంత మంచిగా చూసుకుంటే , స్కూల్లో చదివే పిల్లలకు అంత మంచి చదువు చెబుతారు. నా స్కూలు పిల్లలు బాగా చదువుకొని గొప్పవారై ఈ దేశానికి పేరు తెస్తే అంత కన్న ఇంకేం కావాలి? అని బోలెడు బిల్డపిచ్చాడు.

పేపరు కట్టింగులన్నీ  జాగ్రత్తగా ఫైల్ చేసి, ఇంటర్వ్యూల వీడియోలన్నీ కలెక్టు చేసి ఫారన్ మత సంస్థలకి పంపి, ఖర్చుపెట్టిన దానికి వేయి రెట్లు సంపాదించడమే కాక, గొప్ప మానవతావాది, మార్గదర్శకుడూ అను పేరు కూడా కొట్టేశాడు శామ్యూల్ రెడ్డి.

డబ్బు డబ్బుని సంపాదిస్తుంది. సంపాదించిన కొద్ది సంపాదించాలనే దాహం పెరిగిపోతుంది. అయితే ధన సంపాదన అనే దాహానికి ఫుల్ స్టాప్ ఉంది. ఎక్కడ యీ ధనదాహం ఎండ్ అవుతుందో, అక్కడే పదవీ దాహం మొదలవుతుంది. ఆ దాహానికి పునాది వేసేది యీ దాహమే. పేపర్లోనూ, ఛానల్స్ లోనూ పేరు మారుమ్రోగిపోయాక శామ్యూల్ రెడ్డి కి పదవి దాహం మొదలయింది. ఎంత డబ్బున్న ఏం లాభం? పదవితో వచ్చే వెలుగే వేరు. అయితే పదవులకి ఎగబాకాలంటే ప్రజల మద్దత్తు కావాలి. అదెలా సంపాదించడం?

పూర్వం ఒకాయన చిన్న చిన్న నటుల్ని పిలిచి ‘సత్కారం ‘ జరిపించి పేపర్ల కెక్కాడు. ఆ తరవాత ఓ మాదిరి పేరొచ్చాక బడాబడా నటులకి గజారోహణలూ, పుష్ప కిరీటాలు రజిత, స్వర్ణ కిరీటాలు తగిలించి మరింత పాప్యులరిటీ పెంచుకొని ‘ఫలాన ‘ అనగానే ప్రజల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ తరవాత నగరంలో చలివేంద్రాలు, బస్ స్టాపుల దగ్గర, గుళ్ళ దగ్గరా ఉచిత ‘మజ్జిగ ‘ పంపిణీలు చేయించి డి.వి.ఎస్. కర్ణ లాంటి బిరుదుల్ని కొనుకున్నాడు.

అక్కడి దాకా ఎక్కితే చాలు, ఆ పైన పైకి ఎక్కించే వాళ్ళో, పైకీ లాక్కు ‘ నే వాళ్ళో చాలా మంది వుంటారు. అంటే ‘పార్టీ ‘ నాయకులన్న మాట. ఆ పార్టీ నాయకులకి , ‘తృప్తి ‘ కలిగిస్తే చాలు, రాజకీయాలు నల్లేరు మీద నడకే.

ఇంకో పద్దతి గూండాగిరి. రౌడీ గూండాగా, గూండా రాజకీయనాయకుడిగా రంగులు మార్చుకుని అందలాలెక్కడం ఈ పవిత్ర భారతదేశంలో సర్వసామాన్యమే.

నేరచరితృలకి టిక్కెట్టు ఇవ్వకూడదని అన్ని పార్టీలూ గగ్గోలుపెడతాయి. కానీ, అటువంటి నేర చరితృలకే పార్టీ టిక్కెట్లు ఎందుకు చులాగా దక్కుతాయో ఎవడికీ అర్ధం కాదు.

ఎన్ని కేసులో బుక్ అయితే అంత త్వరగా ప్రజానాయకుడు కావచ్చు. గాలి వీస్తే మబ్బులు , ఎగిరిపోయినట్టు పదవి రాగానే నేరాలన్నీ కూడా ‘ మాఫీ ‘ అయ్యిపోతాయి. ఏ పోలీసు అధికారి సదరు ప్రజానాయకుల్ని గతంలో మక్కెలు విరగ దన్నాడో ఆ అధికారే వాళ్ళకి బందోబస్తులు చేసి సలాం కొట్టి తీరాల్సిన పరీస్థితులు ఇక్కడ అతి సహజంగా కల్పించబడతాయి.

అర్జంటుగా వారి తప్పులన్నీ ఒప్పులుగా మారిపోవడమే గాక, ఏ తల మాసిన రైటరో వాళ్ళ జీవిత చరిత్రలను రాసి సదరు వెధవల వంశవృక్షాన్ని ఏ రాజాధిరాజుకో ముడిపెట్టి, చరిత్రలో సముచిత స్థనం కల్పించడమూ సకృత్తుగా జరిగే విషయమే.

“ఒరేయ్ నాయనా, వేడిగా వున్నప్పుడే ఇనుముని వంచాలి. వెంటనే నాలుగైదు మంచి పనులు చేయ్యి. పనిలేని సినీతారలకి సన్మానాలు ఏర్పాటు చెయ్యి. వీలుంటే కుర్ర పెట్టల్ని పట్టుకొచ్చి ఐటమ్ డాన్సులు కూడా పెట్టించు. ఇవాళ్టి స్టూడెంట్సే రేపటి నీ ఓటర్లని మరచిపోకు. అంతేగాదు పతంజలిగారనే ఓ మహానుభావుడు చెప్పినట్టు, పత్రికా ప్రపంచంలోనూ మీడియాలోనూ ‘పెంపుడు జెంతువులకి’ లెక్క లేదు. వారానికోసారి మందు పార్టీలు ఏర్పాటు చెయ్యి. స్టీలు కవర్లు ఇవ్వు. పబ్లిసిటీ యవ్వారమంతా వాళ్ళే చూసుకుంటారు. మూడ్నెలలో నువ్వీ సిటీలో ప్రముఖుడివైపోవాలి… అంతే! ” కర్తవ్యాన్ని భోధించి ‘కాజా ‘ బీడి ని వెలిగించాడు విశ్వకర్మ.

విశ్వకర్మ ఏ పని చెయ్యడు, ఏ పని చెయ్యకుండా బతికేసే నేర్పు అతనికి చిన్నతనం నుంచే వుంది. అతను శామ్యూల్ రెడ్డి కి ఫ్రండు కాని ఫ్రండు. విశ్వకర్మకి బ్రైన్ వుంది. శామ్యూల్ రెడ్డికి డబ్బుంది. ఉప్పు పప్పు తోడైతే రుచి. ఉప్పు నిప్పు జతకడితే?????

“ఇప్పుడెలా వుంది?” ఫ్లాస్క్ తో లోపలికొస్తూ అడిగాడు ఆనంద రావు.

“బాగానేవున్నానుగా ” చిన్నగా నీరసంగా నవ్వింది మాధవి రావు.

“భగవంతుడు దయామయుడు” నిట్టూర్చాడు ఆనందరావు. మాధవిని రిక్షా ఎక్కించి ఇంటికి తీసుకొచ్చి ఆ రోజుకి వారం అయ్యింది. నిసత్తువ జ్వరంగా ఎలా మారిందో డాక్టర్లకే తెలీలేదు. ఈ వారం రోజులు ఆనందరావు మాధవి ఇంట్లోనే వుండి సేవ చేశాడు. సేవ చేసిన విషయం అతనికి తెలుసు కానీ మాధవికి తెలీదు. కారణం ఒళ్ళు తెలియని జ్వరంలో పడి వుండటమే. శోభ ప్రతిరోజు ఏదో ఒక టైం కి వస్తూనే వుంది. ఆ పిల్ల వచ్చినప్పుడు మాత్రమే ఆనందరావు బయటకు వెళ్ళి మందులు , కావల్సిన వస్తువులు కొని తెచ్చేవాడు. ఒక్కసారి మాత్రం తన రూమ్ కి వెళ్ళి రెండు జతల బట్టలు తెచ్చుకున్నాడు.

“భగవంతుడి సంగతి నాకు తెలియదు కానీ , దేవుడిలా మీరు నన్ను ఆదుకున్నారు ఆనందరావుగారు.. శోభ చెబితే తెలిసింది. వారం జుల పాటు నాకు జ్వరంతో ఒళ్ళు తెలీలేదనీ, ఆఖరికి మీ మీదే వాంతులు చేశాననీ !” కాస్త సిగ్గు తోనూ, నూటికి నూరు పాళ్ళు కృతజ్ఞతతోనూ తలవంచుకు అన్నది మాధవీరావు.

“అనకూడదు కానీ మాధవి గారు! ఆ అవకాశం లభించడం నా అదృష్టం” అప్రయత్నంగా మనసులో అనుకున్న మాటని బైటకి అనేశాడు ఆనందరావు. అయితే, అనడం మాత్రం చాలా మెల్లగా అనడం వల్ల మాధవికి వినిపించలేదు కానీ, శోభా రాణికి వినిపించింది. శోభారాణి వచ్చాకే ఆనందరావు బయటకు వెళ్ళాడు.

“జీవితంలో ఏనాడు ఎవరి చేత ఇలా సేవ చెయించుకోలేదు. అసలు నాకు ఇలాంటి అవసరం వస్తుందనీ ఊహించలేదు. మీ రుణం ఎలా తీర్చుకోగలను ” అని బేలగా అంది మాధవి.

“రుణం తీర్చుకోవాలని అనుకోకుంటే చాలు… అదే నాకు పదివేలు. ” నవ్వాడు ఆనందరావు.

“ఇప్పట్లో పదివేలకేమొస్తుందండీ ఆనందరావు గారు… ఒక్క పట్టు చీర కూడా రాదు… ఆయమన్నది! పకపక నవ్వింది శోభ.

“అదీ నిజమే!! పోనీ అదే పది కోట్లు అనుకుంటా ” తనూ నవ్వాడు ఆనంద రావు. వాతావరణం కాస్త పలచబడింది, గంభీరత తగ్గి.

“హార్లిక్సు తెచ్చాను ” ఫ్లాస్కు లోనుంచి హార్లిక్సుని గ్లాస్ లో పోస్తూ అన్నాడు ఆనందరావు.

“జావ కూడా రెడీ ” ఎనౌన్స్ చేసింది శోభ.

“అబ్బా.. ఏదీ తినాలనీ  తాగాలనీ లేదండీ ” కొంచం వికారంగా మొహం పెట్టి అంది మాధవి.

“అలాగే వుంటుంది, జ్వరం కదా అయితే ఇప్పుడే డైట్ ఎక్కువ తీసుకోవాలి. లేకపోతే నీరసం మరింత పెరుగుతుంది. ” అనూనయంగా అని , ఆమె చేతికి హార్లిక్సు పోసిన గ్లాసు అందించాడు ఆనందరావు.

“నిజం అక్కా… తాగు. ఈ వారం నుంచీ ఏవో లిక్విడ్స్ తప్ప నీకు సాలిడ్ ఫుడే లేదు ” ముంగురుల్ని సవరించి అన్నది శోభారాణి.

“నేను లోపలకి రావచ్చా .. !” మదాలస మాట విని గిరుక్కున వెనక్కి తిరిగాడు ఆనందరావు.

“నమస్తే మాధవిగారు.. నేను మదాలసని.. శోభగారి గురువోత్సవం రోజున కలిశాం ” చేతులు జోడించి అన్నది మదాలస.

“నమస్తే ” గుర్తు పట్టి అన్నది మాధవి. ఆమెకి మదాలస గుర్తుంది.

“మీరు గబగబా ఇటొస్తుంటే చూసి ఫాలో అయ్యాను ఆనందరావు గారు! ” అంటూ చనువుగా శోభ పక్కన చాప మీద కూర్చుంది మదాలస.

“బాగా నీరసంగా వున్నారే. ఏమయ్యింది?” మాధవిని అడిగింది.

“అక్కకి వారం నుంచీ వొళ్ళు తెలియని జ్వరం. ఆనందరావు గారే కనిపెట్టుకొని వున్నారు ” చెప్పింది శోభ.

“ఓహ్.. ఆనంద రావు గారు.. మాధవి గారు మీకు చుట్టాలా?” అని కుతూహలంగా అడిగింది మదాలస.

“అవసరంలో ఆదుకోడానికి చుట్టాలే కావక్కర్లేదు మదాలసగారూ.  మానవత్వముంటే చాలు ” నీరసంగానే నవ్వి అంది మాధవి.

“నిజంగా ఒక మాట చెప్పనా? చాలా రోజుల తరవాత నేను మనుషుల మధ్య వున్నాననే ఫీలింగు వస్తోంది. ” సిన్సియర్ గా అన్నది మదాలస. చటుక్కున తల తిప్పి ఆమెని చూసింది మాధవి.

కొన్ని ఏమీ చెప్పకుండానే అర్ధమౌతాయి

కొన్ని ఎంత వివరించి చెప్పినా అర్ధం కావు.

మాధవికి ఏదో అర్ధమయింది. దగ్గరకు రమ్మన్నట్టు మదాలసని చూస్తూ చెయ్యి చాచింది.

“ఒరేయ్ వెంకటస్వామీ.. త్వరలోనే హోటల్ మూసేసి కేరళాకి వెళ్ళిపోవాలనుందిరా. పిల్లకి పెళ్ళి చెయ్యాలి. ఆ తరవాత నేనేమైపోయినా పర్వాలేదు.  ” ఆయసంగా అన్నాడు మహదేవన్.

“అక్కడ మాత్రం మీకు ఎవరున్నారు? ఎవరికిచ్చి పెళ్ళి చేసినా వాళ్ళు మిమల్ని జాగ్రత్తగా చూసుకుంటారా?” కంగారుని దాచుకుంటూ అన్నాడు వెంకటస్వామి.

“అలాంటి గ్యారెంటీ ఏమీలేదు అయినా , జననీ జన్మభూమి అన్నారు గదా పెద్దలు. నందిని అమాయకురాలు. ఆ వెధవ పరమశివం గాడిని తలచుకుంటే నాకు ఒళ్ళు గగ్గుర్పోడుస్తోంది. తొందర పడి పెళ్ళి చేసి వుంటే నందిని  బతుకు నాశనమైపోయేది” సుధీర్ఘంగా నిట్టుర్చాడు మహదేవన్.

“అవును” అలోచిస్తూ అన్నాడు వెంకటస్వామి. అతని ముందు రెండే ఆప్షన్లు వున్నాయి. ఒకటి, నందినిని నగలతో సహా లేపుకుపోవడం, రెండు, మహదేవన్ ని నందిని చేతే చెప్పించడం. ఏది మంచిది. ఆలోచిస్తున్నాడు వెంకటస్వామి.

పరమశివం ఆ క్షణంలోనే బస్సు దిగాడని వెంకటస్వామిని నిజంగా తెలీదు.

 

ఇంకా వుంది..

2 thoughts on “మాయానగరం – 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *