May 21, 2024

మన వాగ్గేయకారులు – 7 ( శ్రీ జయదేవుడు )

రచన: సిరి వడ్డే

కొంత మంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 13 వ శతాబ్దానికి చెందిన, వ్యాసుని అవతారంగా భావించే ‘ జయదేవుడు’ ఇటువంటి వారిలో ఒకరు. ఈయన జీవితం, పూర్ణ భావంతో, భక్తీ విశ్వాసాలతో, సాధన చేస్తే, భగవంతుడే, అనేక రూపాల్లో వచ్చి రక్షిస్తాడని, తెలియజేస్తుంది. బాల్యంలోనే , ఆశుకవిత్వం చెప్పిన ఏకసంధాగ్రహి, జగన్నాధుని భక్తుడు, జయదేవుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు కనిపించడంవల్ల, బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి. జయదేవుడు సంస్కృత కవి, పండితుడు. ఈయన 12వ శతాబ్దమునకు చెందినవారు. వీరు వ్రాసిన రాధాకృష్ణుల ప్రణయకావ్యం, “గీత గోవిందం” హిందూమత భక్తి ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. జయదేవుడు ఒడిషా రాష్ట్రం, ఖుర్దా జిల్లాలోని ప్రాచి లోయలో ఉన్న కెందుళి(బిందుబిల్వ) గ్రామంలో ఒక ఉత్కళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కెందుళి సాసన్(ఇప్పుడిలా పిలువబడుతోంది) గ్రామం, పూరీ కి సమీపంలో ఉంటుంది. కెందులి పట్నము, కెందులి దౌళి, కెందులి సాసనము మూడు గ్రామములలో కలసిన ప్రదేసము. ఇవి ప్రాచీనది ఒడ్డున ఉన్నవి. ఈనది పరమపవిత్రమైన నది. కెందులి గ్రామసీమ నుండి రెండుమైళ్ళ దూరంలో ఖుశభద్రానది రెండు పాయలతో ప్రాచీనదిని కలిసేచోటును జనం త్రివేణీసంగమమని వ్యవహరిస్తారు. కెదులి గ్రామములో వాసుదేవ విగ్రహాలు నారాయణ నామంతో అనేకం కనిపిస్తున్నాయి. అందువల్ల జయదేవుని జన్మగ్రామం ఒరిస్సాలోని ప్రాచీనది ఒడ్డున ఉన్న కెందులి అని చారిత్రకారులు నిర్ణయించారు. ఈ విషయమును జయదేవుడు 7వ అష్టపదిలో “కిందుబిల్వ సముద్ర సంభవ” అని పేర్కొనెను. జయదేవుడి తల్లిదండ్రులు, శ్రీ భోజదేవుడు మరియు శ్రీమతి రమాదేవిలు. జయదేవుడు జన్మించినప్పుడు ఒడిషా చోడగంగ దేవ ఏలుబడిలో ఉండేది. జయదేవుడు కుర్మపాటకలో తన సంస్కృత విద్యాభ్యాసం గావించాడు. తరువాత దేవదాసీ అయిన పద్మావతిని వివాహమాడారు. ఆమె కృష్ణ భక్తురాలు. ఆ కాలంలో ఆ ప్రాంతమంతా వైష్ణవ బ్రాహ్మణుల ప్రాబల్యంలో ఉండేది. జయదేవుడు చిన్నతనం నుండే సంగీత సాహిత్యములలో గొప్ప పాండిత్యమును సంపాదించెను. బీద బ్రాహ్మణుడైన జయదేవుడు ఊరి చివర ఒక గుడిసెలో నివసిస్తూ చాలా వరకూ ధ్యానములో కాలము గడిపినారని తెలియుచున్నది.

బెంగాలులోని నవద్వీపమునకు రాజైన లక్షణసేనుని ఆస్థానమున క్రీ.శ. 1116 లో జయదేవుడు ఒక పండితుడిగానున్నట్లు అచట గల ఆధారములను బట్టి తెలియుచున్నది. మహారాజు కోటద్వారము వద్ద గల రాతిపై “గోవర్థనుడు, పారణ, జయదేవుడు” అను మూడు రత్నములు మహారాజు కొలువులో నున్నట్లు చెక్కబడియున్నవి.

జయదేవుని వివాహము పద్మావతితో జరుగుటకు ఒక ముఖ్య కారణము కలదు. ఆ గ్రామములోనే దేవశర్మ యను మరియొక బ్రహ్మణుడు ఉండెడివాడు. దేవశర్మ తన మొదటి సంతానమును శ్రీ పురుషోత్తమ స్వాములకు అర్పించునటుల మొక్కుకొనెను. ఆ విధముగా దేవశర్మ భార్య విమలాంబకు ఒక ఆడ శిశువు జన్మించగా ఆ శిశువునకు ‘పద్మావతి’ అని నామకరణం చేసిరి. యుక్త వయస్సు వచ్చిన పిదప ఆమెను శ్రీ పురుషోత్తమ స్వామికి అర్పించి దేవశర్మ యింటికి వెడలిపోయెను. ఆ రాత్రి దేవస్థానములోని పూజారులకు శ్రీ పురుషోత్తమ స్వామి కలలో కనబడి “ఆ బాలికను జయదేవుని వద్దకు తీసుకుని వెళ్ళి, అతనికి ఇచ్చి వివాహము చేయమని” చెప్పినాడట. మరునాడు ఉదయము వారు దేవశర్మను, ఆ బాలికను జయదేవుల సమక్షమునకు గొనిపోయి దేవశర్మ మొక్కుబడిని గూర్చి, స్వప్నమున శ్రీ స్వామి చెప్పిన విషయములన్నియు విశదీకరించిరి. కాని జయదేవుడు దేవశర్మతో ” ఈ కూటికి గతిలేని బీద బ్రాహ్మణుని అల్లునిగా ఏల ఎంచుకున్నావయ్యా” అని తన దారిద్ర్యమును గూర్చి చెప్పి నిరాకరించెను. కాని దేవశర్మ పద్మావతిని అచటనే విడచి వెళ్ళిపోయెను. కొంతకాలము తరువాత పద్మావతి తన పట్ల చూపుతున్న శ్రద్ధకు, సేవలకు ముగ్ధుడై ఆమెను శాస్త్రోక్తముగా వివాహమాడెను. జయదేవుడు శ్రీ పురుషోత్తమ స్వామి అంశమని అంటారు. తరువాత వీరిద్దరూ అన్యోన్యానురాగములతో దాంపత్య జీవితమును గడుపుచూ, కృష్ణుని మహిమలను గానము చేయుచూ జీవితమును గడిపిరి. పద్మావతీదేవి పాతివ్రత్యమును పరీక్షింపనొకమారు సాత్యకిరాజు స్వామి ఇంటలేని సమయమునందు విచ్చేసి “మీభర్త దుర్జనులచే హతమైనాడని” ఒక యళీకవార్త వినిపింప నామె ఆత్మహత్య చేసుకొనగా జయదేవస్వామి తిరిగివచ్చి కృష్ణ సంకీర్తన మొనర్పగా ఆమె “సుప్తిబోధిత” వలె మేల్కొని నట్లు మరియొక జనశ్రుతి వినవచ్చుచున్నది.

జయదేవుడు ఉపాస్యదేవత అయిన నారాయణమూర్తి కైంకర్యం కోసం ధనార్జన చేయటానికి బృందావనం, జయపురం మొదలయిన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చోరులు ఆయన ధనాన్ని అపహరించి కాళ్ళూ చేతులు విరుగగొట్టి పోయినారట! ఒక ప్రభువు వేటకు వచ్చి ఆయన దుర్దశను చూచి రాజధానికి తీసుకొనిపోయి చికిత్సచేయించి స్వాస్థ్యం చేకూర్చిన తరువాత పద్మావతితో ఆకవి అక్కడనే కాపురం చేస్తూ ఉన్నారు. యతివేషాలు వేసుకొని వెనుకటి చోరులు ఆరాజధానికి వచ్చినా తెలుసుకొనికూడా వారికి జయదేవుడు శిక్షచెప్పించలేదట!

సాహిత్యం :

జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, దశకృతికృతే, కృష్ణుడు మూడు ముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, త్రిభంగి అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. జయదేవుని రెండు అష్టపదులు సిక్కుల మతగ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ లో కనబడతాయి. దీనిని బట్టి, జయదేవుని రచనలు గురునానక్ మీద, అతడు పూరీని సందర్శించినప్పుడు, ఎంత ప్రభావం చూపాయో అర్థమౌతుంది.

గీత గోవిందం-కృష్ణుడు గోపికలు :

గీత గోవిందం జయదేవుని గొప్ప కావ్యం. రాధాకృష్ణుల ప్రేమ తత్వమును గూర్చి అష్టపదులుగా రచించిన మహానుభావుడు. అది 12 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం 24 ప్రబంధాలుగా విభజింపబడింది. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిది ద్విపదలు ఉంటాయి. వీటినే “అష్టపదులు” అంటారు. ఈ గ్రంథము 24 అష్టపదులు, 80 కి పైగా శ్లోకములు కలిగి, 12 సర్గలతో వ్రాయబడెను. గోవిందుని గూర్చి రచింపబడిన గేయ ప్రబంధమగుటచే దీనికి “గీతగోవిందం” అని పేరిడిరి. ఈ అష్టపదులు నాయకా, నాయకీ, నటులచే పాడబడినట్లు రచింపబడెను. దీనిలో 19 వ అష్టపది “దర్శనాష్టపది” అనియు ” సంజీవనీ అష్టపది” అనియు చెప్పబడినది. ఇది రాధాకృష్ణుల ప్రణయతత్వమే పరమార్థంగా భావించే, నింబార్కుడి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ఉన్నకావ్యం. నవవిధ భక్తి మార్గాలలో – 1. పిత్రాపుత్ర 2. రక్ష్య రక్షక 3. ఆధారధేయ 4. శరీరాత్మ 5. జ్ఞాతజ్ఞయ 6. భోక్తృభోగ్య 7. స్వస్వామి 8.భార్యాభర్తృ 9.శెషశేషి అను భార్యాభర్తృ భక్తిమార్గం గీతగోవిందంలో జయదేవుడు నిరుపించారు.

ఇందులో సర్గనామములు సాభిప్రాయములు- సామోద దామోదరము, క్లేశ కేశవము, ముగ్ధ మధుసూదనము ఇత్యాదులు పలు సర్గలు. రసము శృంగారము, ఏకాదశ ద్వాదశ సర్గలలోని శృంగారము, సంభోగము. నాయకుడు గోవిందుడు. నాయిక రాధ. జయదేవ కవి రాధ ఇంద్రాణి అయినట్లు జయదేవ స్వామి చరిత్రలో ఇలా ఉంది. ‘తొల్లి ఒకప్పుడు స్వర్గరాజ్య రమమైన ఇంద్రాణి వైకుంఠధాముని దర్శించటానికి వెళ్ళి ఆతని నవమన్మధ మన్మధాకృతిని దర్శించి నంత మాత్రాన మోహబాణ పాతాలకు పాలై స్వామిని చూచి “ఓ దీనమూర్తి హరా! నన్ను నీ ఉత్సంగానికి ఆశ్రితురాలిగా చేయవే” అని ప్రార్ధించింది. భగవంతుడు ఆమెను చూచి “నేను సాధుసంత్రాణ శీలుడనై కృష్ణాఖ్యతో భూమిమీద అవతరిస్తాను. నీవు రాధగా జన్మించి నీ మనోధసిద్ధి పొందుదువుగాక.” అని అనుగ్రహించినాడు.

సర్ విలియమ్ జోన్స్ 1792 లో, తొలిసారిగా గీత గోవిందాన్నీఆంగ్లంలోకి అనువదించారు. తరువాత ఇది ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా చేయబడింది. గీత గోవిందం సంస్కృత కావ్యాలలోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది.

గీత గోవింద సారాంశం :

జయదేవుడు శ్రీ కృష్ణుని పరబ్రహ్మ స్వరూపముగా పూజించెను. ఈ గీత గోవిందమును శృంగార రసముతో, మధుర భక్తితో, నాయకా, నాయకీ భావముతో స్తుతించెను. ఇందు రాధ నాయకి-జీవాత్మ, కృష్ణుడు నాయకుడు-పరమాత్మ మరియు సఖి – ఈ సఖి జీవాత్మను ముక్తి పథములో నడిపించి పరమాత్మలో లీనము చేయుటకు తోడ్పడును. ఇదియే గీత గోవిందములోని సారాంశము.

దర్శన అష్టపది :

జయదేవుడు గీత గోవిందమును మిక్కిలి ఉత్సాహముతో, దీక్షతో , భక్తితో వ్రాయుచుండెను. 10 వ సర్గలో గల 19 వ అష్టపదిలో 7 వ చరణమును రచించుచున్న సమయములో తన భావనాకల్పన అతి విచిత్రముగా నుండెనట. కృష్ణుడు రాధతో…

“స్మరగళ ఖండన మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం….. ”
“రాధా! ప్రేమ అను విషము నా తలకెక్కి యున్నది. అందువలన నీ కోమలమైన పాద పద్మములను నా శిరస్సు పై నిడుము. అపుడు ఆ విషమంతయు దిగును.” అను అర్థము వచ్చునటుల వ్రాసినాడట. కాని వెంటనే “ఏమీ! రాధ తన పాదమును కృష్ణ పరమాత్మ తలపై నుంచుటయా? ఇది మహాఘోరమైన పని. ఇట్లు వ్రాయుట మహాపచారము” అని తలచి ఆ పంక్తులను కొట్టివేసి, జయదేవుడు లేచి, అభ్యంగన స్నానమునకు నూనె ఒంటికి, తలకు రాసుకొని నదికి వెళ్ళినాడట.

కొంత సేపటికి ఆ స్వామి జయదేవుని రూపమున తిరిగి వచ్చి ఆ వ్రాతప్రతిని తెమ్మని పద్మావతిని ఆడిగి, ఆ కొట్టివేసిన పంక్తులనే మరల వ్రాసి వెళ్ళిపోయెనట. స్నానము చేసి వచ్చిన జయదేవ కవికి తాను కొట్టివేసిన పంక్తులు మరల వ్రాసి యుండుట చూసి, ఆశ్చర్యపడి ఎవరు వ్రాసినారని పద్మావతిని అడిగెనట. ఆమె “స్వామీ! మీరే కదా మరల వచ్చి వ్రాసి పోయితిరి. నూనె బొట్లు కూడా ఆ ప్రతిమీద నున్నవే” అని చెప్పగా సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మయే వచ్చినాడని తెలుసుకొని, పద్మావతి పుణ్యమును వేనోళ్ళ కొనియాడుచూ శ్రీ కృష్ణుడు తన భార్య పద్మావతికి దర్శనమిచ్చినందున ఆ అష్టపదికి “దర్శనాష్టపది” అని నామకరణం చేసెను. ఈ అష్టపది యొక్క ఎనిమిదవ చరణమున.

“జయతు పద్మావతీ రమణ జయదేవకవి
భారతీఫణీత మితిగీతం ”
అని తనపేరుకు ముందుగా ఆమె పేరు పెట్టెనట.

సంజీవని అష్టపది :

జయదేవ కవి, భార్యయగు పద్మావతితో శ్రీ లక్షనసేన మహారాజుచే గొప్పగా గౌరవింపబడుచుండెను. అది సహించలేని రాజుగారి భార్య రాణి తగిన సదవకాశము నకై వేచియుండెను. ఒకనాడు రాజు పరివారముతో కూడి జయదేవకవితో కలసి వేటకై వెళ్ళినాడట. రాణిగారు పద్మావతి కి జయదేవ కవికి వైపరీత్యము జరిగినట్లు అబద్ధపు సమాచారమును తెల్పెనట. అంత పద్మావతి దుఃఖ సముద్రమున మునిగి అసువులు బాసెనట. ఇటువంటి విషాద సంఘటన జరుగునని రాణి ఈషణ్మాత్రమైనా యోచించలేదు. రాణి భయముచే ఒణికి పోసాగెను. కొంత సమయము తరువాత రాజు, జయదేవుడు వేట నుండి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన చూచి, ఏమిచేయవలెనో తెలియక దిగులుపడిరి. అపుడు జయదేవుడు “తన మరణవార్త విన్నందువల్ల చనిపోయినది కాని ఇప్పుడు తాను బ్రతికే ఉన్నాను కదా” అని చెప్పి 19 వ అష్టపది అయిన “పదసీయతి” పాడి ముఖముపై నీళ్లు చల్లగా, ఆమె నిద్ర నుండి మేల్కొనినట్లు లేచి కూర్చుండినదట. ఈ అష్టపదిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వహస్తములతో వ్రాసిన పంక్తులు కలవు. కనుక ఆమె మరల పునరుజ్జీవము పొందినది. అందువల్ల ఈ అష్టపదికి “సంజీవని అష్టపది” అని పేరు కలిగినది.

జయదేవుడు స్వయముగా దేవాలయములలో అష్టపదులను పాడుతున్నప్పుడు పద్మావతి వాటికి నాట్యము చేసెడిదట. 21 వ అష్టపదిలో పద్మావతితో నున్నట్లు వ్రాయబడినది. ఉదా:

“విహిత పద్మావతి సుఖసమాజే
భణతి జయదేవకవి రాజరాజే ”
మొదటి శ్లోకములోనే “పద్మావతీ చరణ చారణ చక్రవర్తి” అని జయదేవ కవి వ్రాసినాడు

జయదేవపురం :

ఒడిషా రాజైన పురుషోత్తదేవునకు జయదేవునిపై ఎడతెగని ఈర్ష్య. అందువలన జయదేవుని “గీత గోవిందము” ను పోలి ఉన్న ‘అభినవ గీత గోవిందం” అను గ్రంథమును రచించెను. తన గ్రంథములోని రచనలనే పాడవలెనని ప్రజలను నిర్బంధించెను. కాని ప్రజలు గీతగోవిందమునే పాడుచుండిరి. అందుకు ఇష్టపడక తన గ్రంథము గొప్పదో లేక జయదేవుని “గీతగోవిందం” గొప్పదో పరిశీలించుటకు ఇద్దరి గ్రంథములను శ్రీ జగన్నాధస్వామి యొద్ద పెట్టి తలుపులు మూసివేసిరి. మరునాడు ప్రాతః కాలమున తలుపులు తెరచి చూచుసరికి జయదేవుని గ్రంథము శ్రీ స్వామి చేతిలోనూ, రాజుగారి గ్రంథము గర్భగుడిలో ఒకమూల నుండుటను గమనించి, రాజు ఖిన్నుడై “గీత గోవిందము” శ్రేష్టతను కొనియాడెను. ఈ అష్టపదులు రచింపబడిన స్థలము నాటి నుండి జయదేవపురముగా పిలువబడుచున్నది.

పీయూష లహరి :

పీయూష లహరి జయదేవుడు రచించిన ప్రముఖ సంస్కృత గోష్ఠీ రూపకము. దీనికి కథావస్తువు గీత గోవిందంలోని కథా వస్తువైన రాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపడము కథాంశము. అందువలన పీయూష లహరిని గీత గోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడ్డాడు. ప్రాచీన కాలంలో జగన్నాధస్వామి ఆలయంలో అనేకములైన ఏకాంకనాటికలను ప్రదర్సించేవారు. పీయూషలహరిని కూడా అటువంటి నాటకసమాజంతో కలిసి జయదేవుడు దీనిని ప్రదర్శించినట్లు పీయూషలహరి లోని “గోష్ఠి శ్రీ జయదేవ పండితమణేః సావర్తతే నర్తితుమ్” అన్న వాక్యంవల్ల వ్యక్తమౌతున్నది.

జయదేవుడు గీతగోవిందంలోనూ, పీయూషలహరిలోనూ నిరూపించిన ‘రాసలీల’ భాగవతం పురాణాన్ని అనుసరించింది కాదు. భాగవత రాసలీల శరత్తులో జరుగుతుంది. జయదేవునికి మూలం బ్రహ్మవైవర్తము.ఈ రాసలీల మూడు దినాలు. భాగవత రాసలీల పంచదశద్రాత్రులు. జయదేవుని తరువాత జన్మించిన అనేక వైష్ణవ కవులు కూడా ఈ బ్రహ్మవైవర్త రాసమే అనువదించారు.జయదేవుని గీతగోవిందం, పీయూషలహరి అర్ధంచేసుకోవటానికి ఒరిస్సా వైష్ణవాన్ని గురించిన విజ్ఞానం కొంత అవసరం. కళింగదేశంలో క్రీ.శ. 8 వ శతాబ్దములో ప్రవేశించిన మహాయాన బౌద్ధం క్రమంగా వజ్రయాన, సహజయానాలుగా రూపొందింది. క్రీ.శ.729 నాటి ఒరియారాజు ఇంద్రభూతి, చెల్లెలు లక్షింకర వల్ల సహజయానం ఆదేశంలో ప్రవేశించిందని ప్రతీతి. ఇంద్రభూతి జ్ఞానసిద్ధిలో జగన్నాధుడుని బుద్ధదేవునిగా స్తుతించారు . సహజయానం ప్రచారం చేసినవారు కౌపదాదులు ఔఢ్రదేశీయులు. వజ్రయానము, సహజయానము వైష్ణవాలు కలిసి ఔఢ్రదేశంలో నూతన వైష్ణవానికి దారితీసి ఉంటవి. దానికి ముఖ్యమైన ప్రవక్తలు- జయదేవుడు, రామాసంద రాయలు. సహజయాన పాంధేయులు జయదేవుణ్ణి ప్రధమ ప్రవక్తగానూ, నవరసికుల్లో ఒకడినిగాను ప్రకటిస్తారు. క్రీ.శ 15, 16,17వ శతాబ్దాల్లోని ఔఢ్రరచయితలు సరళదాసు, బలరామదాసు, అచ్యుతానందులు, పీతాంబరుడు మొదలైన కవులు సహజయానాన్ని అనేక గీతాల్లో ప్రశంసించారు.

అష్టపది -1

మొదటి అష్టపదిలో, దశావతారాలను స్తుతించి, తన కావ్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని ప్రార్ధిస్తారు, జయదేవులు. ‘మత్స్యావతారంలో, వేదాలను ఓడవలె ఉద్ధరించావు, కూర్మావతారంలో, ఇంకా భూమిని మోస్తున్నావు, వరాహావతారంలో, నీ కోరలందు ఎత్తిన భూమి, చంద్రునిలో మచ్చలా నల్లగా ప్రకాశిస్తోంది.

వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంక కలేవ నిమగ్నా ।
కేశవ! ధృత సూకరరూప! జయ జగదీశ! హరే! ॥

నారసింహావతారంలో తామరపూవు లాంటి కొనగోటితో, హిరణ్యకశిపుని చీల్చేసావు, వామనావతారంలో ముల్లోకాలు ఆక్రమించి, నీ కాలిగోటి నుంచి గంగానదిని సృష్టించావు.

తవ కరకమల వరే నఖమద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తను భృంగం ।
కేశవ! ధృత నరహరిరూప! జయ జగదీశ! హరే! ॥

శ్రీరాముడివై, లోకక్షేమం కోసం దశకంఠుడిని కూల్చావు. బలరామ రూపంలో నాగలి దెబ్బకు, యమునానది పరుగెత్తి నీ వైపు వచ్చేలా చేసావు. కృష్ణావతారంలో, పశుబలి నిరోధించావు, కల్క్యవతారంలో తోకచుక్క వంటి కత్తితో, దుర్మార్గులను సంహరించడానికి అవతరిస్తావు.’ అంటూ కీర్తిస్తారు.

వేదానుద్ధరతే జగంతి వహతే భూగోలముద్బిభ్రతే
దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే ।
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః ॥

*********************************************************************************
అష్టపది -2

శ్రిత కమలా కుచమండల! ధృత కుండల! ఏ
కలిత లలిత వనమాల! జయ జయ దేవ! హరే! ||
దినమణిమండల మండన! భవ ఖండన! ఏ
మునిజనమానస హంస! జయ జయ దేవ! హరే! ॥
కాళియ విషధర గంజన! జన రంజన! ఏ
యదుకులనళిన దినేశ! జయ జయ దేవ! హరే! ॥

రెండవ అష్టపదిలో, శ్రీకృష్ణుడి గుణ రూప వర్ణన. ‘పాదాల వరకు తులసి మాల ధరించినవాడు, కుండల ధారి, ముని మానస సంచారి, యడుకులోద్ధారి, కాళీయ సంహారి, సూర్యమండలాన్ని వెలిగించేవాడు, రాక్షస సంహారి, భాక్తజనోద్ధారి, నవ నీల మేఘ సుందరుడు, మంధర ధారి, మునుపు రామావతారి, అగు శ్రీకృష్ణుడి పాద పద్మాలకు మంగళం.’ అంటూ మంగళ గీతం
సమర్పిస్తారు.

శ్రీ జయదేవ కవేరిదం కురుతే ముదం ఏ
మంగళముజ్జ్వల గీతం జయ జయ దేవ! హరే! ॥
*********************************************************************************
అష్టపది -3

3వ అష్టపదిలో , అద్భుతమయిన బృందావన వర్ణన ఇవ్వబడింది …

వసంత ఋతువులో కృష్ణ విరహంతో, కృష్ణుడిని వెతుకుతూ, వడిలిన అడవి మల్లెపువ్వులాగా, సుకుమారమయిన శరీరంతో విహరిస్తున్న రాధతో, చెలికత్తె, ఇలా అంటున్నది.

మన మనసులు కూడా గోపికలై, యమునా తీరవిహారి అయిన కృష్ణుడిని, వేణుగాన సమ్మోహనుడిని, బృందావనంలో దర్శి స్తున్నట్టుగా భావించుకుందాం. బృందావనం…

లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే ।
మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే ॥
విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి
యువతీ జనేన సమం సఖి! విరహి జనస్య దురంతే ॥

వసంత ఋతువు… చల్లని గాలి కోమలమయిన లవంగ తీగల పైనుంచి వీస్తోంది… తుమ్మెదల ఝుంకారాలు , కోకిల రావాలు కలసి, పొదరిళ్ళలో ప్రతిధ్వనిస్తున్నాయి. పొగడ పూల గుత్తుల మీద వాలే గండు తుమ్మెదలతో నిండు వసంతం ప్రకాశిస్తోంది.

కానుగ చెట్లను అల్లుకున్న చిగురుటాకులతల నుండి, కస్తూరి వాసనలు విరజిమ్ముతున్నాయి. విరహాన్ని చీల్చే ,మన్మధుడి పదునయిన గోళ్ళ వంటి మోదుగ పూలతో వసంత ఋతువు శోభాయమానంగా ఉంది.

మదన మహీపతి కనక దండ రుచి కేసరకుసుమ వికాసే ।
మిళిత శిలీముఖ పాటల పటల కృత స్మర తూణ విలాసే ॥

మన్మధరాజుకు పట్టిన బంగారు గొడుగులా ఉన్న నాగకేసర పుష్పాలు( నాగమల్లి పూలు) గమ్మత్తయిన పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పాటల పుష్పాలపై గుంపులుగా వాలిన తుమ్మెదలు, మన్మధుడి అంబుల పొదిలా కనిపిస్తున్నాయి.

వికసించిన మొగలి పూలు, తెల్లటి కరుణ వృక్షాల పూలు, మన్మధుడి ‘కుంతలమనే’ ఆయుధం లాగ, విరహుల గుండెలు రగులుస్తున్నాయి.

మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ ।
ముని మనసామపి మోహనకారిణి తరుణా కారణ బంధౌ ॥

గురివింద తీగలు అల్లుకున్న మామిడి చెట్లతో,మాలతీ, మాధవీ పూల వాసనలు గుబాలిస్తుండగా, మునులను సైతం లొంగదీయగల పరిమళం అంతటా వ్యాపించి ఉంది.

యమునా నదీ జలాలతో పవిత్రమయిన ఆ బృందావనంలో, కృష్ణుడు ప్రియురాండ్లతో కలిసి,
ఆనందంగా ఆడుతూ, పాడుతూ విహారం చేస్తున్నాడు. ఆ ప్రదేశానికి పోదాం రావమ్మ, రాధా!

దర విదళిత మల్లీ వల్లి చంచత్పరాగ
ప్రకటిత పట వాసైర్వాసయన్కాననాని ।
ఇహ హి దహతి చేతః కేతకీ గంధ బంధుః
ప్రసర దసమబాణ ప్రాణవద్గంధవాహః ॥

అప్పుడే విరిసే మల్లెల పరిమళాలను, గేదంగి పూల పరిమళాలను మోసుకొస్తున్న వసంత గాలి, మన్మధుడి ప్రాణవాయువులా ఉంది. మావి చిగురులు తిన్న కోకిలా రావాలు, మకరందం త్రాగిన గండు తుమ్మెదల ఝుంకారాలు, బాటసారుల మనసులో, తమ ప్రియురాళ్ళ తలపులను రేపుతూ, ఆరాటపెడుతున్నాయి. ఇట్టి వసంతంలో, అనేక నారీమణుల మధ్య సమీపంగా ,క్రీడిస్తున్న కృష్ణుడిని, రాధకు చూపిస్తూ, చెలికత్తె, ఇలా అంటున్నది.
****************************************************************************

అష్టపది -4

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ ।
కేలి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ ॥
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరే ॥

‘ఓ రాధా, చందనము పూసిన నల్లని దేహము కలవాడు, పీతాంబరం(పసుపు పట్టు వస్త్రం), తులసిమాల ధరించినవాడు, చెవులకు కదలాడే మణి కుండలాలు ధరించిన వాడు, అయిన కృష్ణుడు, ముగ్ధలయిన గోపికలతో నవ్వుతూ, విలాసంగా ఉన్నాడు.

పీన పయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం ।
గోప వధూరనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగమ్‌ ॥
కాఽపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం ।
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజమ్‌ ॥

ఒక గోపిక కృష్ణుడి నేత్ర విలాసం వల్ల, మోహవశురాలై, మైమరచి, అతడి ముఖాన్నే చూస్తోంది. మరొక గోపిక కృష్ణుడిని, ఆలింగనం చేసుకుంటోంది, మరియొక గోపిక జలక్రీడలకు కృష్ణుడిని ఆహ్వానిస్తోంది. ఒక యువతి, అతని వేణుగానానికి అనుగుణంగా, గాజుల చప్పుడుతో నృత్యం చేస్తూ, అతడి మెప్పు పొందుతోంది.

కాఽపి కపోల తలే మిలితా లపితుం కిమపి శ్రుతి మూలే ।
చారు చుచుంబ నితంబవతీ దయితం పులకై రనుకూలే ॥
కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునా జల కూలే ।
మంజుల వంజుల కుంజ గతం విచకర్ష కరేణ దుకూలే ॥
కర తల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే ।
రాసరసే సహ నృత్య పరా హరిణ యువతీ ప్రశశంసే ॥

కృష్ణుడు ఒక కాంతను కౌగిలించుకొనుచున్నాడు, ఒక భామను ముద్దులాడుతున్నాడు, ఒకామె వెంట పడుతున్నాడు, ఒక కాంతను సంతోషపెడుతున్నాడు. అలా మనోహరుడయిన ఆ హరి, అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ, నల్ల కలువల వంటి కోమలమయిన అవయువములతో మదనోత్సవం జరిపిస్తూ, గోపికల అంతరంగం, బహిరంగము చేతా ప్రేమించ బడుతున్నవాడై, విహరిస్తున్నాడు.

శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం ।
పశ్యతి సస్మిత చారు తరామపరామనుగచ్ఛతి వామామ్‌ ॥
శ్రీ జయదేవ భణితమిద మద్భుత కేశవ కేళి రహస్యం ।
బృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యమ్‌ ॥

ఆ సమయంలో, ప్రేమాతిసయం చేత పరవశించిన రాధ, కృష్ణుని కౌగలించుకుని, ‘కృష్ణా! నీ వదనము సుధామయము. అందుకే, నీవు పాడే ప్రతి గీతం అమృతమయంగానే ఉంటుంది,’ అని పొగుడుతూ, ఆ నెపంతో చుంబిస్తూ ఉండగా, ముగ్ధమనోహరంగా నవ్వుతూ ప్రకాశిస్తున్నాడు కృష్ణుడు. కృష్ణుడు అందరు స్త్రీలను, తనతో సమానంగా భావించడం, రాధకు ఈర్ష్య కలిగించింది. తను, మిగిలిన గోపికలు సమానం ఎలా అవుతారు. తన పట్ల ఎక్కువ ప్రేమ చూపించాలి కదా! అందుకే అలిగి, ఒక పొదరింట చేరి, దుఖంతో, తన చెలికత్తెతో ఇలా అంటున్నది…
*****************************************************************************

అష్టపది 5 :

ఓ చెలీ, కృష్ణుడు నన్ను లెక్కచేయక, పరిహసించినా, నా మనసు ఆ వేణుగాన సమ్మోహనుడినే కోరుకుంటోంది. మేఘాల్లో ఇంద్రధనస్సులా, నల్లని కేశాల్లో గుండ్రటి నెమలి పించము ధరించిన కృష్ణుడు, నాలో ఉన్నాడు. మంకెన పువ్వు వంటి ఎర్రనయిన పెదాలపై చిరునగవుతో ప్రకాసించేవాడు, తన మణి భూషణాల కాంతితో, చీకటిని పోగొట్టు వాడు అయిన కృష్ణుడు నాకు గుర్తొస్తున్నాడు. మేఘాల మధ్య చందమామలా- నుదుట కస్తూరి తిలకం ధరించినవాడు, నా కొరకు రావి చెట్టు మొదట ఎదురు చూసేవాడు, నా మానసచోరుడు, కలి కల్మషము నివారించువాడు, అనేక మంది పులకిత గోపికలచే చుట్టబడినవాడు, నారదాది మునులచే, ఇంద్రాది దేవతలచే సేవింపబడుతున్న వాడయిన , ఆ మొహనుడినే, నా మనసు స్మరిస్తున్నది…’ నన్ను విడచి ఇతరులతో క్రీడించువాడునూ, యువతులలో ఎంతో
తృష్ణ గలవాడును అయిన కృష్ణుని మరలా నామనస్సు కోరుకొనుచున్నది. అతని గుణగానమే చేయుచున్నది. భ్రమచేతనైనా కోపము పొందదు. అతని దోషములను మరచుచున్నది. పైగా సంతోషము పొందుచున్నది. ఏమి చేయనే చెలీ! ఓ సఖి, చిన్న చిన్న పువ్వుల గుత్తులతో సోగసైన అశోకవృక్షములు గల సరస్సులతో, విరాజిల్లు ఉద్యానవనములలోని గాలి సయితం నన్ను బాధిస్తున్నది. ఆడు తుమ్మెదల గానముచే రమణీయమైన శిఖరాలు గల మామిడి చెట్ల మొగ్గలు సైతం నాకు సుఖకరంగా లేవు. తియ్యటి చిరునవ్వు మాటలతో, నన్ను మురిపించువాడు, నా అనురాగాన్ని అర్ధం చేసుకుని, నన్ను రంజింపచేయువాడు, అయిన కృష్ణుడికి, నా మనసు తెలిపి, ఇక్కడికి తీసుకురావే!’ అంటూ, తన విరహ వేదనను అంతా వివరించి, అభ్యర్దిస్తుంది రాధ.

నిజమైన మనసు భగవంతుడి భావనలో లీనమయినప్పుడు, మన స్థితి అతనికి విన్నవించాలా? అక్కడ రాధ మనసు తెలిసిన మాధవుడిది, అదే పరిస్థితి. రాధను బాధించితినే, అని పశ్చాత్తాప పడుతున్న గోవిందుడు, గోపికలన్దరినీ త్యజించి, రాధను వెదుకుతూ, ఒక పొదరింటిలో విషాదంగా కూర్చుని, తనలో తను ఇలా అనుకుంటున్నాడు,’ గోపికలతో కూడి ఉన్న నన్ను చూసి, రాధ అలిగి వెళ్ళిపోయింది. నేను అపరాధిని కాబట్టి వెళ్ళవద్దని, చెప్పలేకపోయాను. నా ప్రియురాలు, రాధ లేని నాకు ధనమెందుకు, ఇల్లెందుకు, జీవితమెందుకు? కోపంతో ఎర్రబడ్డ రాధ మొహం, తనపై వాలే తుమ్మెదలను చూసీ, చికాకుపాడు ఎర్రతామరలా ఉంది. అయినా, నేను ఎక్కడో రాధను వెదుకుతూ, బాధపడడం ఎందుకు? నా మనసులోనే ఉన్న రాధకు, నా వేదన విన్నవించుకుంటాను. ఓ చెలీ! నా అపచారం వల్ల నీవు మనసు కష్టపెట్టుకున్నావు. లేకపోతే, ఎందుకు నన్ను విడిచి వెళతావు? నీకు దణ్ణం పెడతాను, బ్రతిమాలుకుంటాను. నన్ను మన్నించు. నీవు నా ఎదుటే తిరుగుతున్నట్టు , నాకు అనిపిస్తోంది. నన్ను కరుణించి, నీ దర్సన భాగ్యం ఇప్పించు.’

నిజమయిన మనసుతో ఆర్తిగా తపించే, భక్తుడి కోసం భగవంతుడూ, అంతగానే తపిస్తాడు. భక్తి మార్గం దుర్లభం, ప్రేమ మార్గం సులభం. అందుకే, జయదేవ కవి, ప్రేమను కావ్య వస్తువుగా ఎన్నుకున్నారు అంతర్లీనంగా భక్తి సందేశాన్ని ఇచ్చారు. రాధ అంత ప్రేమతో తపిస్తే, భగవంతుడయినా సులభుడే. నా ప్రియురాలి కనుబొమలనే విల్లునుంచి, ఎక్కుపెట్టిన చూపులనే బాణ పరంపరతో గాయపడి ఉన్నాను. నల్లటి పెద్ద జడ, వెచ్చటి స్పర్శ అందమయిన ముఖ కవళికల విలాసాలు, దొండపండు లాంటి పెదవులు, చక్కటి వాక్చాతుర్యం, ఎంతటి ముగ్ద రాధ! నీ అస్త్రాలన్నింటిని, రాధాలో అమర్చి, నా పై సంధించావా? లేకపొతే, నా మనసు ఎంతగా ఆమెలో లీనమై, ఆరాధిస్తూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా, విరహ వేదన ఎందుకు తగ్గడంలేదు?’ అలా, యమునా తీరంలోని పొదరింటిలో, నిరాశగా ఉన్న కృష్ణుడి వద్దకు రాధ చెలికత్తె వచ్చి ఇలా అంటోంది.

(సావిరహే తవ దీనా… 8 వ అష్టపది)

‘ఓ కృష్ణా, నీ ఎడబాటు వల్ల దుఖితురాలయిన రాధ, మన్మధుడి బాణాలకు భయపడి, నీ మనసులో దాక్కుంటోంది. చల్లటి చందనాన్ని, చందన వృక్షపు గాలులను, విషంగా భావిస్తోంది. చంద్రకిరణాలను దూషిస్తోంది. మన్మధుడు తనపై సంధించే బాణాలు, తన మనసులో ఉన్న నీకు తగిలి, నిన్ను బాదిస్తాయేమో, అని తామారాకులను కవచంగా ధరిస్తోంది. కుసుమ తల్పంపై, నీ విరహంతో, మేఘములవలె కన్నీళ్ళు కురిసే కళ్ళతో, రాహువు కొరికిన చంద్రుడిలా ఉంది. కస్తూరితో నీ రూపాన్ని చిత్రించి, భరించరాని వేదనతో, నిన్నే తలస్తూ, వెర్రిగా నవ్వుతూ, పరిగెడుతూ, ఏడుస్తూ, నిన్నేధ్యానిస్తున్నది. ‘ఓ గోవిందా! నీ చరణాలను ఆశ్రయిస్తాను, నన్ను కరుణించు,’ అని ప్రార్దిస్తుంది.

.
జయదేవుని అష్టపదులలో బహుళ ప్రాచుర్యం పొందినవి … ‘హరిరిహముగ్ధవధూనికరే’, ‘చందన చర్చిత నీల కళేబర’ మరియు ‘సావిరహేతవదీనా రాధా’ మొదలగునవి. జయదేవునికి ముందు రాగ, తాళాలతో పాటలు పాడినవారుకానీ, పాటలు రచించినవారుకానీ ఉన్నట్టు దాఖలాలు లేవు. కావున జయదేవుడే మొదటి వాగ్గేయకారుడని చరిత్రకారులు అభిప్రాయం. ఎప్పుడో 12వ శతాబ్ధ కాలంలో పుట్టిన అష్టపదులు నేటికి ప్రచారంలో ఉన్నాయి. భజనల్లో, నాట్య ప్రదర్శనల్లో మనకు ఈ అష్టపదులు వినిపిస్తున్నాయి.

జయదేవుడు గీతగోవిందమేకాక, యీసత్కవిచంద్రాలోకం, రతిమంజరి, కారకవాదం, తత్త్వచింతామణి అనే గ్రంధాలను విరచించారు. కృష్ణ భక్తితత్త్వాన్ని కళ్లకు కట్టినట్టుగా విరచించిన జయదేవుడు క్రీ. శ 1153 , డిసెంబరు 28 న శ్రీముఖనామ సంవత్సర మార్గశిర బహుళ ఏకాదశి దినమున కైవల్యము పొందెను.

తరువాత భాగంలో శ్రీ రామదాసు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం నేస్తాలు.

(సేకరణ – కొన్ని అంతర్జాల లింకుల నుండి…వారికి హృదయపూర్వక ధన్యవాదములు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *