May 22, 2024

శ్రీకృష్ణదేవరాయలు – 1

రచన:- రాచవేల్పుల విజయభాస్కర రాజు

శ్రీకృష్ణ దేవరాయలు-4-1

దక్షిన భారత దేశాన్ని మహమ్మదీయుల దండయాత్రల నుండి రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయ నగర సామ్రాజ్య  వైభవానికి ప్రతీక ఆనాటి రాజధాని విజయనగర పట్టణం. శత్రు రాజులు సైతం ఈ మహానగరాన్ని చూసి తరించాలని ఉవ్వీళ్ళూరారు. దేశ విదేశాలకు చెందిన ఎందరో పర్యాటకులు, వ్యాపారులు విజయనగరాన్ని సందర్శించారు. ఆనాడు కళ్ళారా చూసిన విజయనగర పట్టణాన్ని, సామ్రాజ్య వైభవాన్ని, జాతర్లు, వసంతోత్సవాలు, కవితా గోష్టులు, విజ్ఞాన వినోద వేడుకలను తదితర కార్యక్రమాలను ఎందరెందరో గ్రంథస్థం చేశారు. తదనంతరం వచ్చిన వారు సైతం విజయనగర స్థాపన నుండి తాము సందర్శించిన కాలం వరకు ఆ నోటా ఈ నోటా విని నమ్మదగిన పరిణామాలనన్నింటిని కథితం చేశారు.

అలాంటి విదేశీ పర్యాటకుల్లో పోర్చుగీసు దేశానికి చెందిన డొమింగో పేయిస్, ఫెర్నావో న్యూనిజ్ లు తమ మాతృ బాషలో విజయనగర చరిత్రను రికార్డు పుటల కెక్కించారు. ఆనాటి వారి కథనాలతో పాటు మరెన్నో రచనలను పరిశీలించి విజయనగర చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా ఆంగ్లంలోకి అనువ దించాడు రాబర్ట్ స్యూయల్.  రాబర్ట్ స్యూయల్ కథనంతో పాటు ఇటు తెలుగు అటు కన్నడ మరోవైపు తమిళ గ్రంథాలలో లభ్యమవుతున్న సమాచార వివరాలను బట్టి ఈ మాలిక పత్రిక ద్వారా నేనందిస్తున్న జ్ఞాపిక దీపిక ధారా వాహికంగా మీ ముందుకు ……

మహాను భావులు, గొప్పవారు, గొప్ప పదవులు అలంకరించి ప్రజా మన్ననలు పొందిన వారు, తమదంటూ ఒక చరిత్ర సృష్టించిన వారు ఎలా ఉండే వారో?వారి మనస్తత్వం ఎలా ఉండేదో ? తెలుసు కోవాలనే కుతూహలం చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉంటుంది. విజయనగర సామ్రాజ్య  వైభవం విదేశీయులను సైతం ఆకర్షించేలా తనదంటూ ఓ చరిత్ర సృష్టించిన చక్రవర్తి శ్రీ కృష్ణ దేవ రాయలు. ఆయన పరిపాలనా కాలం, శరీర ఛాయ, రూపు రేఖలు, అభిరుచులు, అలవాట్లు, పరిపాలనా వ్యవహార శైలి, మనస్తత్వం, వ్యక్తిత్వం, విదేశీ, స్వదేశీయుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయ, సామాజిక, సంగీత సాహిత్యాల్లో అనుసరించిన విధానం దగ్గరుండి నిశితంగా గమనించిన వాడు డొమింగో పేయిస్. ఈయన క్రీ.శ. 1520-22 మధ్య కాలంలో విజయనగరానికి వచ్చారు. కాగా శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ. 1530 లో మరణించాక మరో ఆరేళ్ళ కాలానికి న్యూనిజ్ వచ్చాడు. వచ్చీ రావడం తోనే అంతవరకు జరిగిన విజయనగర చరిత్రతో పాటు తాను ప్రత్యక్షంగా చూసిన విషయాలను, ఆ నోట, ఈ నోట విన్న విషయాలను నిజ నిర్ధారణ గావించుకొని కథనం చేశారు. వాటితో పాటు విజయనగర సామంత సంస్థానీకులు రాసిన వారి వంశావళి చరిత్ర ననుసరించి మనకు అందుబాటులో ఉన్న చరిత్ర వివరాల మేరకు………

శ్రీ కృష్ణదేవరాయలు తెల్లని శరీరఛాయ కలవాడు. ముఖంపై అమ్మవారి స్ఫోటకపు మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. అనునిత్యం తెల్లని పట్టు వస్త్రాలు ధరించే వాడు. గలీషియన్ టోపీ నమూనా కిరీటం ధరించే వాడు. మీసములు మెలి తిరిగి ఉండేవి. కళ్ళు మేక కళ్ళను పోలి ఉండేవి. మెలి తిరిగిన కండలతో మంచి శరీర సౌష్టవం కలిగిన బలశాలి. అనుదినం వ్యాయామంతో తన శరీర సౌష్టవాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునే వాడు. అందుకోసం తెల్లవారు ఝామునే నిద్ర లేచి కాల కృత్యములు తీర్చుకునే వాడు. ఆ వెంటనే వ్యాయామ ప్రక్రియలో భాగంగా కొంత పరిమాణం నువ్వుల నూనె సేవించి, మరికొంత నువ్వుల నూనె తన శరీరానికి పట్టించుకునే వాడు. గదలను త్రిప్పుతూ కండరాలను పొంగించే వాడు. మల్ల యుద్ధం చేసి సరికొత్త పట్లు సృష్టించే వాడు. అనంతరం సుదీర్ఘమైన కత్తి సాము చేస్తూ యుద్ధ ప్రక్రియకు అవసరమైన సరి కొత్త మెళుకువలను కనిపెట్టే వాడు. గుఱ్రపు స్వారీ చేస్తూ అందులోని నైపుణ్యాన్ని గ్రహిస్తూ మంచి అశ్వికునిగా పేరు గడించే వాడు. అంతకు ముందు తాను త్రాగిన నువ్వుల నూనె మొత్తం స్వేదం రూపంలో బయటకు వచ్చేంత వరకు సుదీర్ఘ వ్యాయామం గావించే వాడు. పిమ్మట రాజ ప్రసాదం లోని కొలనులో ఈదులాడి స్నానం ఆచరించే వాడు. అనంతరం పండితుల వేద మంత్ర పఠనంతో హజారా రామ చంద్ర దేవాలయం దర్శించి పూజలు నిర్వహించే వాడు.ఈ లోగా సూర్యోదయం కాగానే కొలువు దీరే వాడు.

శ్రీ కృష్ణ దేవ రాయలు మంచి స్ఫురద్రూపి. అందువల్ల ఎదుటి వారు ఎలాంటి వారైనా ఠక్కున ఆకట్టుకో గలిగే వాడు. ముఖంలో అనునిత్యం సంతోషం కొట్టొచ్చినట్లు కనబడేది. ఎల్లప్పుడూ నవ్వుతూ హుషారుగా  ఉండే వాడు. చమత్కార బాష్యంతో సరదాగా గడిపే వాడు. స్వాభిమానం మెండుగా కలిగిన వాడు. దైవ ప్రీతి ఎక్కువ. అందరినీ కలుపుకు పోయే వాడు. మంచి చెడ్డల విచక్షణ, న్యాయ నిరతి గల ఆదర్శ ప్రభువు. స్వచ్చమైన పరిపాలన అందించే ప్రభువుల కుండాల్సిన అన్ని లక్షణాలను పుణికి పుచ్చుకున్నవాడు.

రాజు అంటే ఇలా ఉండాలి అని శత్రువులు సైతం కీర్తించ గలిగే ఏకైక చక్రవర్తి శ్రీ కృష్ణ దేవ రాయలు. శత్రురాజుల రాజ్యాలు పట్టుబడి నప్పుడు వారి అంతః పుర స్త్రీలను పుట్టినింటి వారివలె గౌరవించే మృదు స్వభావి. వైయుక్తికంగా ఎంతో పలుకుబడి కలిగి విస్తృత అధికారాలను తన చెప్పు చేతల్లో పెట్టుకున్న సార్వ భౌముడు. అందుకే శత్రురాజులు ఆయనంటే గజ గజ వణికి చచ్చేవారు. వాస్తవంగా శ్రీ కృఇష్ణ దేవ రాయలు వైష్ణవుడైనప్పటికీ పరమత సహనం పాఠించేవాడు. అందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినంగా శిక్షించేవాడు.

శ్రీ కృష్ణ దేవరాయలు మరీ పొట్టి కాదు. అలాగని మరీ పొడగరీ కాదు. మధ్యస్తమైన ఎత్తుగా ఉండేవాడు. అయినప్పటికీ ఎంతో ధైర్యవంతుడు. చాలా శక్తిమంతుడు. యుద్ధ సమయాల్లో సమస్త సైన్యానికీ స్వయంగా తానే నాయకత్వం వహించేవాడు. యుద్ధ ప్రణాళికలను స్వయంగా రూపొందించేవాడు. యుద్ధంలో క్షతగాత్రులైన వారిని తానే దగ్గరుండి రాజ వైద్యులతో చికిత్స చేయించేవాడు. సాక్షాత్తూ చక్రవర్తే తమ పట్ల చొరవ చూపి సకాలంలో సరైన చికిత్స అందించే ఏర్పాట్లు చేయడం వల్ల గాయపడిన సైనికులు త్వరగా కోలుకునేవారు. యుద్ధంలో వీర మరణం పొందిన వారి పార్థివ దేహాలకు తన ఖజానా సొమ్ముతో అంత్యక్రియలు చేయించేవాడు.

తన పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ? వారు ఎక్కడైనా తన పట్ల మనసు నొచ్చుకుంటున్నారా? తన సామంతులు, పాళెగాళ్ళు, జాగీర్దారులు, రాజ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడి లంచాలు తీసుకుంటున్నారా? ప్రజలను ఇతర విషయాల్లో పీడిస్తున్నారా? మహిళల పట్ల వేధింపులు ఉన్నాయా? తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం సేకరించేవాడు. అందుకోసం నిపుణులైన రాజభటులను ఎంపిక చేసి వేగులుగా నియమించుకునేవాడు. వేగులందించే సమాచారం లోని నిజనిజాలను గ్రహించేందుకు రాత్రి వేళల్లో మారు వేషాల్లో వెళ్ళి పరిశీలించేవాడు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని సామంత రాజుల ఎదురుగానే చీవాట్లు పెట్టేవాడు. ఆ విషయంలో ఎంతో నిష్కర్షగా ఉండేవాడు. ఎవరి వ్యవహార శైలి అయినా తనకు నచ్చ లేదంటే ఉన్నఫళంగా ఆగ్రహంతో ఊగిపోయేవాడు.

తన రాజ్యంలోని వారే కాక విదేశీయులెవరైనా తన సందర్శనకు వస్తే ఆదరించి స్వాగత సత్కార్యాలు చేసేవాడు. విదేశీయులతో మాట్లాడేటప్పుడు వారి వారి దేశ వ్యవహారాలు, ఆచారాలు, అలవాట్లు, అక్కడి పరిపాలనా శైలి ఎలా ఉంటుందంటూ గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకునేవాడు. అతిథులను సత్కరించడంలో ఏ లోటు రానిచ్చేవాడు కాదు. బహుమానాలతో వారిని సాగనంపేవాడు. ఇతర రాజ్యాలకు సంబంధించిన రాయబారులు ఎవరైనా తన సందర్శనార్థం వస్తే వారిని ఉచిత రీతిన సత్కరించి ఆ తర్వాత సందేశం అడిగి తెలుసుకునేవాడు. సాహిత్యం అంటే చెవులు కోసుకునేవాడు. కవులను సమున్నత రీతిలో గౌరవించి, భూరి విరాళాలిచ్చి పెంచి పోషించాడు. దానధర్మాలు చేయడంలో చేతికి ఎముక లేని మహారాజు.

ఇదిలా ఉండగా శ్రీ కృష్ణదేవ రాయలు నలభై అయిదేళ్ళ వయసు వరకు మాత్రమే బ్రతికాడని చాలా మంది రచయితలు తమ రచనల్లో పొందుపరిచారు. ఇతమిద్దమైన సమాచారం లేకపోవడంతో రచయితలు కాస్త తడబడ్డారు. వాస్తవంగా ఆయన అరవై ఏండ్లు సంపూర్తిగా బ్రతికాడు. కాగా ఆయన జన్మదిన తేదీలపై అనేక మంది రచయితలు వాదోపవాదాలు చేసుకుంటూ నేటికీ నిఖార్సైన తేదీలను తేల్చలేక సందిగ్దంలో ఉన్నారు.

క్రీ.శ. 1906 సంవత్సరంలో జనవరి నెల 18 వ తేదీన “సత్యవాదిని” అనే వార్తా పత్రిక శ్రీకృష్ణదేవరాయల పుట్టిన తేదీని తేటతెల్లం చేసింది. తెలుగు సంవత్సరాల ప్రకారం తిథి, పక్షం, వారం, నెల, ఆనాటి సంవత్సరం పేరును కవితా రూపంలో ప్రచురించి మనకందించింది. ఆ మేరకు తెలుగు సంవత్స రాలను ఆంగ్ల సంవత్సరాలతో సరిచూసి, గణించి, గుణించి పరిశీలించగా శ్రీకృష్ణదేవరాయల పుట్టిన తేదీ ఒక కొలిక్కి వచ్చింది. అదేమంత సత్య దూరం కాదు. ఇందుకు సంబందించిన వివరాలు, బాల్యం, యుక్తవయస్సుల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం.

 

{ ఇంకా వుంది }

 

1 thought on “శ్రీకృష్ణదేవరాయలు – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *