April 23, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా? 8

రచన: అంగులూరి అంజనీదేవి

..

హాల్లో తారమ్మ కూర్చుని వుంది. ఒక్కక్షణం ఆమె దగ్గర ఆగి ”ఆంటీ బాగున్నారా!” అని అడిగింది. ఆమె సమాధానం చెబుతుండగానే ఆఫీసుకి టైం కావడంతో వెళ్లిపోయింది మోక్ష. మోక్ష వెళ్తుంటే తారమ్మ చూపు తిప్పుకోలేనంతగా మోక్షనే చూస్తూ ”మీ తోడికోడలు చాలా బాగుంది కదూ!” అని దృతితో అనటం ఆనంద్‌ విన్నాడు. ఆనంద్‌ కూడా తారమ్మను పలకరించి ఆఫీసుకెళ్లాడు.
రాత్రికి మోక్ష ఆనంద్‌ ఒకే టైంకు ఇంటికొచ్చారు. అంకిరెడ్డి వాళ్లిద్దరికన్నా ముందే ఇంటికొచ్చి లాప్‌టాప్‌ ముందు పెట్టుకొని కూర్చున్నాడు. ఆయనకు ఆ టైంలో ఎప్పుడైనా లాప్‌టాప్‌ ఒక్కటే కాలక్షేపం. డిన్నరప్పుడు మాధవీలత ‘డిన్నర్‌ చేద్దురు రండి’ అని పిలవగానే వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుని డిన్నర్‌ చేసి మళ్లీ తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. ఆయన ఈ మధ్యన ఏదీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పది రోజుల క్రితం హాస్పిటల్‌కు వెళ్తే అంతకు ముందు రాత్రే ఆయనకు నిద్రలో మైల్డ్‌ స్ట్రోక్‌ వచ్చినట్లు ఇ.సి.జి. రిపోర్ట్‌లో కన్పించింది. ‘ఈ వయసులో మీరు నిద్రలేవగానే వాకింగుకు వీలైతే ప్రాణాయామం చేసుకుంటూ గడపాలి కాని వేరే రకమైన టెన్షన్సేమీ పెట్టుకోకూడదు’ అని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం మాధవీలతకు చెప్పకుండా దాచాడాయన.
ఎప్పటిలాగే డిన్నరయ్యాక ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు.
బెడ్‌మీద పడుకొని వున్న ఆనంద్‌ అటు తిరిగి పడుకొని వున్న మోక్షను భుజం మీద చెయ్యేసి గట్టిగా గుంజాడు. ఆమె వెంటనే అతని వైపుకి తిరిగింది. అతని వైపుకి తిరగగానే ఆమెకో అనుమానం వచ్చింది. తన బర్త్‌డే సందర్భంగా ఈయనగారికి మూడ్‌లాంటిదేమైనా వచ్చిందేమోనని… అదే భావం వ్యక్తం అయ్యేలా కనుచూపుల్ని కదిలించింది…
”అలాంటిదేం లేదు గాని అదిగో హ్యాంగర్‌కి తగిలించి వున్నదే అదేనా ఈరోజు నువ్వు వేసుకున్న డ్రెస్‌?” అని అడిగాడు.
అవునన్నట్లు తల వూపింది మోక్ష.
అతనికి ఆ డ్రెస్‌ను చూస్తుంటే చాలా కోపంగా వుంది. దాని ధర రెండు వేల పైనే వుంటుంది. ఎక్కడో అప్పు చేసే కొని వుంటుంది. శాలరీ రాగానే ఇచ్చేస్తుంది. అలా ఇస్తే కట్టాల్సిన చిట్టీకి ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి? ఇప్పుడా డ్రస్‌ కొనకుంటే ఏమైంది? ఎవరు కొడతారు? ఎందుకంత అర్జెంటుగా అన్ని డబ్బులు పెట్టి ఆ డ్రస్‌ కొనటం? డ్రెస్సుల కోసమా పుట్టిన రోజులు వచ్చేది. పుట్టినరోజుల కోసమా డ్రెస్‌లు వుండేది. ఒకటే ఘర్షణ అతనిలో…
”ఆ డ్రస్‌ నీకు నచ్చిందా?” అన్నాడు నెమ్మదిగా.
”నాకే కాదు, మా కొలీగ్స్‌కి కూడా నచ్చింది” అంది ఇంకా నెమ్మదిగా.
”నీ విషయం చెప్పు” అన్నాడు కాస్త గొంతు పెంచి.
”నచ్చింది” అంది స్థిరంగా.
”కానీ ధృతికి నచ్చలేదు” అన్నాడు.
ఉలిక్కిపడింది మోక్ష.
ఒక్కక్షణం మౌనంగా చూసి ”మీతో చెప్పిందా?” అంది. అతను చెప్పిందని కాని చెప్పలేదని కాని అనేలోపలే దిగ్గున లేచి కూర్చుంది. ఆమె ఎందుకలా లేచి కూర్చుందో అతనికి అర్థం కాక అలాగే చూస్తుంటే ”ఏంటసలు మీ ఇద్దరి వ్యవహారం నాకు అర్థం కావటం లేదు. నాతోనేమో డ్రస్‌ కత్తిలా వుందక్కా అంది. మీతోనేమో నచ్చలేదన్నదా? అసలేం జరుగుతోందండీ ఈ ఇంట్లో? ఆ ముసలోళ్లిద్దరు ఏదీ పట్టించుకోరు. పోనీ అత్తగారు ఆడమనిషి కదా ఏమైనా చెప్పుకుందామా అంటే ఆవిడకేం చెప్పినా భయంతో చస్తుందని భయం. ఇలా అయితే ఏం చేయాలండీ నేను…?” అంది బేలగా తలపట్టుకొని చూస్తూ
”నువ్వు క్లియర్‌గా వినకముందే తలపట్టుకోవటం, తల కొట్టుకోవడం చెయ్యకు” అన్నాడు.
”ఏమోలెండి! నాకు రోజురోజుకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది”
”నీక్కాదు. నాకు లేకుండా పోతోంది. నీ డ్రస్‌ల గురించి చూసిన వాళ్లు చేస్తున్న కామెంట్స్ ని వింటుంటే చచ్చిపోవాలనిపిస్తోంది” అన్నాడు.
ఈసారి షాక్‌ తిన్నది మోక్ష.
”ఏం చీరలు కట్టుకోలేవా? నీకెందుకే ఈ డ్రెస్‌లు? నువ్వేమైనా పెళ్లికాని పిల్లవా? జాబ్‌ చేస్తున్నంత మాత్రాన చీరలు కట్టవా? చీరలు కడితే ఆఫీసులకి రానివ్వరా? నువ్వేమైనా ఇంగ్లీషు దొరసానివా?” అన్నాడు.
షాక్‌లోంచి తేరుకుంది. ”మీరింకేం మాట్లాడకండి! ముందు నా డ్రస్‌ల గురించి ఎవరేమన్నారో చెప్పండి! అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ప్లీజ్‌!” అంది.
”ఇంకెవరు ధృతి”
”నేను నమ్మను”
”ఇవాళ తారమ్మ వచ్చింది చూశావుగా… అదయినా నమ్ముతావా లేదా?”
”ఊ! చెప్పండి! ఆ తర్వాత ఏం జరిగిందో?” అంది.
ఏదో ఒకటి చెప్పి ఇంకెప్పుడూ ఆమెచేత డ్రెస్‌లు కొనకుండా చెయ్యకపోతే ఉన్న డబ్బులన్నీ ఆ డ్రెస్‌లకే పోతాయని ఆలోచిస్తున్నాడు ఆనంద్‌. ఏ స్త్రీ అయినా తోడి కోడలి కామెంట్స్ ని తట్టుకోలేదు. ఈలోపలే తొందరపెడుతూ ”చెప్పండి!” అంటూ అసహనంగా కదిలింది మోక్ష.
”నువ్వు బాధ పడనని… ‘ఇలా నువ్వు అన్నావా’ అని ధృతిని అడగనని నాకు మాట ఇవ్వు. అలా అని నా మీద ఒట్టు కూడా వెయ్యి. అప్పుడు చెబుతాను” అన్నాడు.
”సరే!” అంటూ అతని చేతిలో చేయి వేసి మాట ఇస్తూ ”మీ మీద ఒట్టు, దృతిని అడగను” అంటూ అతని తలమీద చేయి పెట్టింది.
”ఈ వయసులో మా అక్కయ్యకి ఆ టైట్ డ్రెస్‌లు అవసరమా ఆంటీ! చూడడానికి గలీజుగా లేవు” అంది నువ్వు ఆఫీసుకి వెళ్లగానే తారమ్మతో ధృతి” అన్నాడు ఆనంద్‌. మోక్ష ముఖంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయోనని పరిశీలనగా చూస్తున్నాడు.
మోక్ష కోపంగా ”అది టైట్ లెగినా! దానికసలు బుద్ది వుందా? వెళ్లి అడగనా? ఆ డ్రెస్‌ తీసికెళ్లి చూపించనా?” అంది.
”నా మీద ఒట్టు వేసింది ఆ డ్రెస్‌ తీసికెళ్లి చూపించానికా? చెప్పింది విని మనసులో పెట్టుకుంటానంటేనేగా నేను చెబుతున్నాను. ఆ మాత్రం మాట నిలుపుకోలేవా? ఎందుకంత ఆవేశం?” అన్నాడు.
మోక్ష రొప్పుతోంది. అభిమానం దెబ్బతిన్న దానిలా అనీజీగా చూస్తోంది.
”ఎందుకే ఇంత బాధ నీకు? ఆ డ్రెస్‌లు వేసుకోవటం మానెయ్యరాదు”
”ఒక్కి చెప్పండి! అదేమైనా టైట్ లెగినా? కాదు కదా! ఇలాంటి డ్రస్‌లు కూడా వేసుకోకూడదా నేను?”
”నాకేం తెలుసు. వెళ్లి వాళ్లను అడుగు. ఎగతాళి చేయించుకున్నది నువ్వా నేనా? తారమ్మ ఇప్పుడేదో అలా వుంది కాని లోగడ ఎంత చెండాలపుదో మనకు తెలియదా? చివరకి ఆవిడ కూడా నిన్ను విమర్శిస్తోంది. వెళ్లి వాళ్ల ఊరిలో ఎంతమందికి చెబుతుందో చూడు” అంటూ రెచ్చగొట్టాడు.
ఆమెకేం చేయాలో తోచనట్లు ఆలోచనగా చూస్తోంది. జుట్టుకున్న క్లిప్పును తీసింది. వేళ్లను చెవుల మీదుగా పోనిచ్చి అటుఇటు కదిలిన జుట్టును ఓ చోటకు చేర్చి గట్టిగా పట్టుకుంది. మళ్లీ క్లిప్‌ పెట్టింది.
”నువ్వలా ఆలోచించి చేసేదేం లేదు. జరిగిందేదో జరిగి పోయింది. ఇకముందు డ్రెసెస్‌ కొనకుండా చీరలు కట్టుకో! కావాలంటే నేను మీ ఆఫీసుకొచ్చి మాట్లాడతాను” అన్నాడు.
”మీరేం మా ఆఫీసుకొచ్చి మాట్లాడనవసరం లేదు. మాకు మా ఆఫీసులో డ్రెస్‌ కోడ్‌ వుంటుంది. ఆరంజ్‌ కలర్‌ టీషర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్. ఈ చీరలు, ఈ డ్రస్‌లు అక్కడ వేసుకోవానికి లేదు. ఆఫీసుకెళ్లగానే మేమందరం డ్రస్సింగ్‌ రూంలోకెళ్లి వాళ్లిచ్చిన డ్రస్‌ వేసుకొని మా సీట్లల్లో కూర్చుంటాం. ఇది మీకు చాలాసార్లు చెప్పాను”
”చెప్పావులే! కానీ ఇప్పుడిదో ప్రాబ్లమ్‌ వచ్చింది కదా! నువ్వెలా ఛేంజ్‌ అయితే బావుంటుందో ఆలోచించు మరి”
”నేను ఛేంజ్‌ కావాలా?? నాకన్నా చిన్నది. నా తర్వాత ఈ ఇంట్లోకి వచ్చింది. దానికి నేను భయపడి ఛేంజ్‌ కావాలా?” అంటూ జుట్టుకున్న క్లిప్‌ను మళ్లీ లాగి, ఒక్కక్షణం ఆగి ఆ క్లిప్‌ను మళ్లీ పెట్టుకుంది.
”నువ్వా జుట్టు కత్తిరించుకునేటప్పుడే చెప్పాను వద్దని. అందరు అలా వుంటే నేనిలా వుండాలా అన్నావ్‌! ఇప్పుడు చూడు ఆ పొట్టి జుట్టును ఎన్నిసార్లు విప్పాల్సి వస్తుందో! అదే జడ అయితే ఇన్ని సార్లు విప్పగలిగే దానివా? ఏదీ వినవులే నువ్వు…” అన్నాడు.
అతని మాటలు ఆమె వినడం లేదు. ధృతి మీద కోపంతో పళ్లు కొరుకుతోంది. ”రేపటి నుండి చూడు నేనేంటో దానికి చూపిస్తా! నా డ్రస్సుల్నే వేలెత్తి చూపుతుందా? పోన్లే పాపం కడుపుతో వుందన్న జాలితో రోజూ జ్యూస్‌లు తెచ్చి తాగించాను.. ఇక చూడు” అంది.
”జ్యూస్‌లా! జ్యూస్‌లు తాగించావా? డబ్బులెక్కడివే! ఆఫీసులో ఏమైనా అప్పు చేస్తున్నావా?”
”కాదు. అత్తగారి దగ్గర తీసుకొని తెచ్చేదాన్ని… మీరు రోజూ అష్టాక్షరి, చెమ్మాక్షరి, తొక్కాక్షరి అంటూ అన్నం తినకుండా చేస్తున్నారుగా దాన్ని… కళ్లు తిరిగి చస్తుందని నేనే తెచ్చి తాగించేదాన్ని… ఈసారి డాక్టర్‌ దగ్గరకి చెకప్‌ కోసం ఎవరు తీసికెళ్తారో చూస్తాను. అత్తగారి వల్ల కాదు ఆ పని…”
”అంత పని చెయ్యకే పాపం!” అన్నాడు దొంగచూపులు చూస్తూ. అతనికి అంతపని చెయ్యాలనే వుంది. ఎలాగైనా ధృతిని ఇంట్లోంచి వెళ్లగొడితే సతీష్‌చంద్రకి మళ్లీ పెళ్లి చెయ్యొచ్చు. కోట్ల రూపాయలు ఇస్తామన్న అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదట. ఎలాగైనా ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా రప్పించి కోట్లకు పడగలెత్తాలి. ఈ జన్మలోనే కోటీశ్వరులనిపించుకోవాలి.
”మీకలాగే అన్పిస్తుంది లెండి! అది నన్ను కదా ఎగతాళి చేసింది. మీకేం నొప్పి. పడుకోండిక…” అంటూ ఆమె పడుకుని దుప్పి కప్పుకుంది.
ఆనంద్‌కి ఎంత ఆనందంగా వుందో… అతను ఎటు నరుక్కు రావాలని ఎటు నరుక్కొచ్చాడో అతనికే అర్థం కావటం లేదు.
*****
ఆఫీసు కెళ్లినా కూడా మోక్ష మనసు బాగాలేదు. పనిలో నిమగ్నం కాలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా దృతి తనని అలా అందా అన్నదే గుర్తొస్తోంది. బాధగా వుంది. ఇప్పుడు తనెంత బాధపడుతుందో ధృతిని కూడా అంతే బాధ పెట్టాలనుకుంది. అయితే అది ఎలా అన్నదే ఆమెకు తెలియటం లేదు. చాలా రకాల ఐడియాలు వస్తున్నాయి. వాటిలో దేన్ని ఫాలో అవ్వాలన్నా ఆమెకు కొంత సమయం కావాలి. అంత సమయం ఆదివారమయితేనే దొరుకుతుంది. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఆమె ఆఫీసులో వుంటుంది. మోక్ష ఆలోచనలన్నీ ఆదివారం చుట్టే తిరుగుతున్నాయి.
*****
ఆఫీసులకి సెలవుదినమైన ఆదివారం వచ్చింది.
అంకిరెడ్డి ఉదయాన్నే నిద్రలేచి ఎప్పటిలాగే వాకింగ్‌ వెళ్లాడు. ఆయన కారు గేటు దాటగానే ”అత్తయ్యా! మీరుకూడా మామయ్యగారితో వాకింగ్‌కెళ్లొచ్చుగా!” అంది మోక్ష. అది ఆమె ప్రేమతో అనలేదు. మనసులోకి చేరిన పాముపిల్ల కదులుతుంటే అంది.
మాధవీలత ఉలిక్కిపడింది. ”నేను ఆయనతో వెళ్లి వాకింగ్‌ చెయ్యటమా! అక్కడ ఆయన స్నేహితులుంటారు. ఏం బావుంటుంది?” అంది. ఆమె ఆ క్షణంవరకు అమాయకంగానే వుంది.
”మరి మేడమీద కెళ్లి నడవండి! అలా నడిస్తే మీ ఫేస్‌లో గ్లో వస్తుంది”
”నాకెందుకు మోక్షా! గ్లో?” ఇప్పుడు కూడా అమాయకంగానే అంది.
”అయ్యో అత్తయ్యా! అలా అనకండి! మీరు కూడా మామయ్య గారిలా ఆరోగ్యంగా, స్లిమ్‌గా వుండొద్దా! ఆయన పక్కన ఎటు వెళ్లాలన్నా మీరు కూడా బాగుండాలి కదా!”
”ఇప్పుడు బాగాలేనా?” అంది. అంతవరకు ఆమెలో అలాంటి సందేహమే లేదు. ఇప్పుడొచ్చింది.
”ఇప్పుడు బాగున్నారు. ఇంకా బాగుండేలా నేను మిమ్మల్ని తయారుచేస్తాను. అది చూసి మామయ్యగారు ఆశ్చర్యపోవాలి”
”ఎందుకులే మోక్షా! ఇప్పుడున్నది చాలదా?” అంది. పైకి అలా అన్నదే కాని ఆమెకు కూడా లోలోపల బాగుండాలనే వుంది. అందుకే వెంటనే ”ఈ వయసులో నేను బ్యూటీపార్లర్‌కి వెళ్లటం ఏం బావుంటుంది” అంది.
”మీరలా అనుకుంటున్నారా! మీ వయసువాళ్లే స్కిన్‌ కోసం, హెయిర్స్‌ కోసం ఎక్కువగా బ్యూటీ పార్లర్‌కి వెళ్తుంటారు. కానీ అక్కడ అందరి స్కిన్‌లకి వర్కవుట్ కాదట… ఇంతెందుకు మా కొలిగ్‌ హెయిర్‌ వూడకుండా వుండాలని పార్లర్‌కెళ్లి హెయిర్‌ ఆయిల్‌ తెచ్చుకుంది. అది వాడాక తలమీద వెంట్రుకలన్నీ చర్మంతో సహా ఊడి వస్తున్నాయట. మనీ కూడా చాలా ఖర్చయింది. వేస్ట్‌ అక్కడ. నేను మీకు నేచురల్‌ ఫేషియల్‌ చేస్తాను. మీరిలా కూర్చోండి” అంటూ ఆమెను ఫ్రిజ్‌ ప్రక్కన కుర్చీలో కూర్చోబెట్టింది.
మాధవీలత కోడలి మాటల్ని బాగా నమ్మింది. ”అయినా ఇప్పుడెందుకిదంతా మోక్షా!” అంటూనే కూర్చుంది. ఆమెకు కూడా అంకిరెడ్డి లాగే ఆరోగ్యంగా, అందంగా వుండాలని వుంది. లేకుంటే అంకిరెడ్డికన్నా వయసులో పెద్దదనుకుంటారు.
మోక్ష లోలోన సంతోషపడుతూ ఆమె కూర్చోగానే ఫ్రిజ్‌లోంచి కూరగాయలు, పండ్లు బయటకు తీసి మిక్సీలో వేసింది. మెత్తి గుజ్జులా చేసి దాన్ని ఒక స్టీల్‌ గిన్నెలోకి తీసి కొద్దికొద్దిగా ఆమె ముఖానికి, చేతులకి, మెడకి పూసింది. అది పూయగానే మాధవీలతకు హాయిగా, చల్లగా అన్పించింది. కాకపోతే ఆ వాసనే ఒక రకంగా వుంది. ఇబ్బందిగా వుంది. అయినా భరించాలి. అంకిరెడ్డి భార్య పర్వాలేదు. బాగానే వుంది అని అనిపించుకోవాలి.
”ఇది ఆరటానికి సమయం పడుతుంది అత్తయ్యా! ఆరాకనే స్నానం చెయ్యాలి” అంది మోక్ష.
ఆమె ”సరే” అంది.
ధృతి అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటోంది. అప్పటికే బయట ముగ్గేసి వచ్చింది. ధృతిని చూడగానే ”దృతీ! నా స్నానం లేటవుతుంది. పనిలో వున్నాను. నువ్వు స్నానం చేసి తులసికోటకు పూజ చెయ్యి” అంది మాధవీలత. ధృతి వెంటనే స్నానం చేసి తులసి దగ్గర పూజ చేసి వంటగదిలోకి వెళ్లింది.
మోక్ష ”అత్తయ్యా! ఈ పేస్ట్‌ కాస్త ఆరాక స్నానం చేస్తే ముఖం నిగనిగ లాడుతుంది. వుండండి ఒక్క నిముషం. ఈ కీరదోస ముక్కల్ని కళ్లమీద పెడతాను. కళ్లు మూసుకోండి” అంది. ఆమె కళ్లు మూసుకుంది.
ఆమె కళ్లు మూసుకోగానే సన్నగా చక్రాల్లా కోసిన కీరదోస ముక్కల్ని ఆమె కనురెప్పలపై వుంచింది.
”వీటిని కొద్దిసేపు ఇలాగే వుంచుకుంటే కళ్ల చుట్టూ వుండే నల్లని వలయాలు తగ్గుతాయి అత్తయ్యా” అంది మృదువుగా.
”నిజంగానే తగ్గుతాయా?” అంది చాలా ఉత్సాహపడుతూ.
”నిజంగానే తగ్గుతాయి. మీరు కదలకుండా కూర్చోండి!” అంది మోక్ష.
”అలాగే” అంటూ ఆమె బిగుసుకుపోయి కూర్చుంది. కదిలితే సరిగా పని చేయదేమోనని ఆమె భయం.
మోక్ష అత్తగారి వెనకాలే నిలబడింది. ఆమె భుజాలను పట్టుకొని ఆప్యాయంగా నిమురుతూ ఎటో చూస్తూ ఆలోచిస్తోంది.
ఆదివారం కాబట్టి ఆనంద్‌ గదిలో పడుకొని నిద్రపోతున్నాడు. అతనిప్పుడే లేవడు. ధృతి వంటగదిలో వుంది. ఉదయం నుండి రాత్రి వరకు తను ఆఫీసులో వుండటం వల్ల అత్తగారికి దృతి బాగా దగ్గరయింది. ఆ దగ్గరతనం ఇలాగే సాగితే ఈ ఇంట్లో తన విలువ పూర్తిగా పడిపోతుంది. ఇప్పటికే ధృతి కళ్లు నెత్తికెక్కి తనను అతిగా కామెంట్స్ చేస్తుంది. అప్పుడిక పట్టలేం. మగవాళ్లు కామెంట్స్ చేసినా ఏమీ అన్పించదు కాని ధృతి తన డ్రస్‌ని కామెంట్ చెయ్యటం నరాలు మెలిపెట్టేంత బాధగా వుంది. ఆ బాధ కసిగా మారింది.
ధృతిని ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి. అత్తగారు కళ్లు మూసుకుని వున్నప్పుడే చెయ్యాలి. ఇదే మంచి సమయం. ఇలాంటి సమయం మళ్లీ రాదు.
మోక్ష ఏమాలోచించిందో ఏమో అత్తగారి చెవి దగ్గరకి వంగి
”అత్తయ్యా!” అంటూ మెల్లగా పిలిచింది.
కోడలు ఎందుకు పిలిచిందో అర్థంకాక, ఆమె కదిలితే కళ్ల మీద వుండే కీరదోసకాయ ముక్కలు కింద పడిపోతాయని చాలా జాగ్రత్తగా ”ఊ” అంది…
ఇప్పుడు ఏం చెప్పాలి అత్తగారికి అని ఆలోచిస్తూ చూస్తోంది మోక్ష.
మోక్ష మాట్లాడకపోవటంతో మాధవీలత పెదాలను బిగబట్టి ”ఊ…ఊ” అంటూ నెమ్మదిగా చేయి లేపి ధృతికి చెప్పు ఏదైనా పని వుంటే చేస్తుంది అన్నట్లు సైగ చేసింది.
”ధృతినే చేస్తుంది అత్తయ్యా! అప్పుడప్పుడు ఫ్రిజ్‌లోంచి అవసరమైనవి పట్టుకెళ్తోంది. నో ప్రాబ్లమ్‌!” అంది.
ఆమె ప్రశాంతంగా కూర్చుంది.
మోక్ష ఆమెలాగా ప్రశాంతంగా లేదు. ఏ అమ్మాయి అయినా తనను అబ్బాయిలు కామెంట్ చేస్తే వూరుకుంటుందేమో కాని అమ్మాయి కామెంట్ చేస్తే వూరుకోదు. ఏదో ఒకటి చేసి తనెంత బాధపడిందో అది అవతల వాళ్లకి తెలిసేలా చెయ్యాలనుకుంటుంది. అవతలి వాళ్లు ఎవరైతేనేం మనం వాళ్లకి ఎంతో వాళ్లూ మనకు అంతే అనుకుంది మోక్ష.
”అత్తయ్యా! చూస్తున్నారా?” అంది మోక్ష.
ఎలా చూస్తాను? కళ్లకు మూతలేసి చూస్తున్నావా అంటుందేం ఈ మోక్ష. ఆమె ఈసారి ‘ఊ’ అనికూడా అనలేదు.
మళ్లీ అత్తగారి చెవి దగ్గరకి వంగి చాలా రహస్యంగా
”నేను నీకు ఫేస్‌ ప్యాక్‌ చెయ్యటం చూసి ధృతి నవ్వింది అత్తయ్యా!”
”ఆ… ధృతి నవ్విందా?” బిర్రబిగుసుకుపోయింది మాధవీలత.
”నాకన్నా చిన్నదిలే అని వదిలేస్తున్నా కాని లేకుంటే ఈ క్షణంలోనే గొడవ పెట్టుకొని వుండేదాన్ని… నేనేమైనా తప్పు చేస్తున్నానా అత్తయ్యా! మీకే కదా మేకప్‌ చేసింది” అంది.
”అవును. నాకే చేస్తున్నావ్‌? దానికెందుకు నవ్వటం” అని మాట్లాడకపోయినా హావభావాల ద్వారా ప్రకటిస్తూ నమ్మలేకపోతోంది మాధవీలత.
”కావాలంటే మీరలాగే కూర్చోండి! ధృతిని పిలుస్తాను. కదలకండి! కళ్లు కూడా తెరవకండి! నేను కీరముక్కల్ని మీ కళ్ల మీద నుండి తీసినప్పుడే కళ్లు తెరవండి. ఎలా నవ్వుతుందో చూద్దురుగాని!” అంటూ ధృతిని పిలిచింది.
ధృతి వచ్చింది. మాధవీలతకి ఎదురుగా నాలుగు అడుగుల దూరంలో నిలబడింది. ”ఏంటక్కా” అంది.
అత్తగారు ఎలా వున్నారు అన్నట్టు సైగ చేసింది మోక్ష. చాలా బాగుంది అన్నట్లు దృతి కూడా సైగ చేస్తూ నవ్వింది. ఇదే మంచి సమయం అన్నట్లు అత్తగారి రెండు కళ్లమీద వున్న కీరముక్కల్ని వేళ్లతో పట్టుకొని ఆ చేతుల్ని గాల్లోకి లేపింది. చేతుల్ని ఆడిస్తూ నిశ్శబ్దంగా నడుం తిప్పుతూ వచ్చీరాని నాట్యం చేసింది. అది చూసి ధృతికి నవ్వు ఆగలేదు. గట్టిగా నవ్వితే శబ్దం వచ్చి అత్తగారు కళ్లు తెరుస్తారని పెదాలకు చెయ్యి అడ్డు పెట్టుకొని శబ్దం రాకుండా నవ్వుతోంది ధృతి.
కీర దోస ముక్కల్ని తీసినప్పుడే టప్పున కళ్లు తెరిచిన మాధవీలత ధృతి నవ్వటం చూసి షాకైంది.
మోక్ష నాట్యం చెయ్యడం ఆపకుండానే ”అరె అలా నవ్వకు దృతి. ఎందుకలా నవ్వుతావ్‌! అత్తగారు చూస్తే బావుండదు” అంది బాగా గొంతు తగ్గించి.
మోక్ష మనసులో వుండే రాక్షసిని అర్థం చేసుకోలేని ధృతి నోటిమీద నుండి చేతిని తియ్యకుండానే నవ్వుతూ ”నువ్వు చేస్తున్న పని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు అక్కా!” అంటూ వంటగదిలోకి వెళ్లిపోయింది. మోక్ష అత్తగారి వెనకాల నిలబడి అంతవరకు చేసిన నాట్యం ఆపి కొద్దిగా వంగి ”చూశావుగా అత్తయ్యా!” అంది.
మాధవీలత అప్పుడు తేరుకుని వెంటనే కుర్చీలోంచి లేచింది.
”అయ్యో మీరు కూర్చోండి అత్తయ్యా! లేవకండి! అలాంటి వాళ్లు నవ్వగానే ఏమవుతుంది? అదేమైనా పెద్ద ఇదా! మీరు అందంగా తయారయ్యాక నోరుమూసుకుని చూస్తుంది. ఇక అప్పుడు నవ్వదు. ‘అయ్యో అనవసరంగా నవ్వానే’ అని బాధపడుతుంది” అంది మోక్ష.
ఆమె అదేం వినకుండా పక్కనే వున్న వాష్‌ బేసిన్‌ దగ్గర ముఖం మొత్తం కడిగేసి చేతులు కడుక్కొని తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకొంది.
ఆమెకెందుకో ఏడుపు ఆగడం లేదు. నవ్వు అనేది ఇంత బాధపెడుతుందా. అసలు ఎందుకు నవ్వింది ధృతి? తనకి వయసైపోయాక కూడా తన చర్మానికి ముడతలు రాకుండా జాగ్రత్త పడుతుందనా? కడుపులోకి తినాల్సిన పండ్లను, కూరగాయాలను పిచ్చిదానిలా ముఖానికి, చేతులకు పూసుకుందనా? లేక ఈ వయసులో ఈ పిచ్చి ఏంటి అనా? ఏది ఏమైనా తను ఎంతో ఇష్టంగా కూర్చుని ఫేషియల్‌ చేయించుకుంటుంటే అదీ తన ఇంట్లో తన కోడలితో… ఈ ధృతికి ఏమైంది. ఎంతయినా ధృతి పైకి కన్పించేంత మంచిది కాదు. అమాయకురాలు కాదు. సామాన్యురాలు అంతకన్నా కాదు. ఆ నవ్వు చూస్తేనే తెలిసిపోతోంది.
అలా నవ్వినందువల్లనో ఏమో ధృతి ఇప్పుడు తన కోడలిలా అన్పించటం లేదు. మోక్ష ఒక్కతే తన కోడలుగా అన్పిస్తోంది.
మోక్ష ఎంతో కష్టపడి పూసిన గుజ్జునంతా మధ్యలోనే కడిగేసుకున్నందుకు బాధగా వుంది. ధృతి అంత ఇదిగా నవ్వాక కడిగేసుకోకుండా ఎలా వుంటుంది? ఇది పక్కనుండే అపార్ట్‌మెంట్లోని తన స్నేహితురాళ్లకి చెబితే ఏమంటారు? తన ముందు జాలిపడ్డా వాళ్లు కూడా నవ్వుతారు. నిజానికి వాళ్లంతా బ్యూటీపార్లర్లకి వెళ్లేవాళ్లే కానీ వాళ్లను చూసి ధృతిలాగా నవ్వేవాళ్లు ఎవరూ లేరు. వుంటే వాళ్లు కూడా బాధపడేవాళ్లు… ఆ నవ్వు ఏమైనా మామూలుగా వుందా? లేదు. ఎంత తేలిగ్గా తీసుకుందామన్నా శూలమై పొడుస్తోంది. కళ్లు గట్టిగా మూసుకున్నా ఆ నవ్వునే కన్పిస్తోంది. చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ నవ్వుతోంది. ఇవన్నీ ఎందుకక్కా అత్తగారికి అన్నట్లు నవ్వుతోంది… అంటే తనకి ఇప్పుడేం వద్దా! అంతా అయిపోయిందా?
అంకిరెడ్డి వాకింగ్‌ నుండి వచ్చి ”ఈ టైంలో పడుకున్నావెందుకు మధూ?” అని అనగానే కళ్లు తెరిచింది మాధవీలత. ఆమె ముఖంలోకి చూసి కంగారు పడ్డాడు.
”ఏం జరిగింది?” అన్నాడు. ఆమెవైపు పరిశీలనగా చూశాడు.
ఆమె చేతులకి, ముఖానికి అక్కడక్కడ బొప్పాయి పండు గుజ్జు అంటుకుని వుంది. కోడలు నవ్విందన్న బాధలో సరిగా కడగకపోవడం వల్ల ఆ గుజ్జు ఆమె ఒంటి మీద నుండి పూర్తిగా పోలేదు. అంకిరెడ్డికి అదేంటో అర్థం కాక వేలితో తాకి ”ఇదేంటి మధూ?” అన్నాడు.
ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆయన అలాగే నిలబడి ఆమె జుట్టుకి అతుక్కున గుజ్జును తుడుస్తూ ”ఇదంతా ఏంటే మధూ?” అని మళ్లీ అడిగాడు. ఆమెకు వెంటనే దృతి నవ్విన నవ్వు గుర్తొచ్చింది. అది గుర్తు రాగానే
”ఇక ఈయన ఒక్కడే నవ్వాలి. అదొక్కటే ఇప్పుడు తక్కువ” అని గొణుక్కుంటూ లేచి బట్టలు అందుకొని బాత్‌రూంలోకి దూరింది. స్నానం చెయ్యాలని బోల్టు పెట్టుకుంది.
*****
స్నానం చేసి వచ్చాక మాధవీలత తిరగలేదు. పడుకుంది. ఆరోజు వంట దృతినే చేసింది. ఆరోజు నుండి మాధవీలత బెడ్‌మీద నుండి లేవటం తగ్గించింది. మోక్ష అప్పుడప్పుడు వంటగదిలోకి వెళ్లి ”అత్తయ్య పడుకోవటం వల్ల నీకు బాగా కష్టమైంది కదా!” అనేది. ”నో ప్రాబ్లెమ్‌ అక్కా! ఇదేమైనా పెద్ద పనా?” అంటూ రోజూ వంటంతా ధృతినే చేస్తోంది.
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఆనంద్‌ నస పెట్టేవాడు. మాధవీలత అతన్ని మందలించేది కాదు. ఆమె ధ్యాసంతా ఆమె ముఖంమ్మీద వస్తున్న ముడతల మీదనే వుంది. మోక్ష చెప్పేంత వరకు ఆమె ముఖం మీద ముడతల గురించి ఆమెకు తెలియదు. ఇప్పుడనిపిస్తోంది తనకంటే తన భర్తనే స్లిమ్‌గా వున్నాడేమోనని! దాన్ని సవరించుకునే అవకాశం ధృతి నవ్వటం వల్లనే పోయింది. లేకుంటే ఈ పాటికి మోక్ష అన్నట్లు తన ముఖం నున్నగా మారేది. తన భర్త మెచ్చుకునేవాడు. ధృతి వైపు ఆమెకు చూడాలనిపించటం లేదు. అసలు దృతి అనే ఒక మనిషి తన ఇంట్లో వున్నట్లు కూడా ఆమెకు అన్పించటం లేదు. ఆమె మనసులో దృతి పట్ల ఒక విధమైన విరక్తి, విముఖత ఏర్పడింది.
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర అంకిరెడ్డి ఏమీ అనేవాడు కాదు. ఆనంద్‌ కర్రీస్‌ బాగుండటం లేదని వంకలు పెట్టేవాడు. ఒక్కో కర్రీని ఒక్కో రకంగా కామెంట్ చేసేవాడు. కామెంట్ చేస్తూనే శుభ్రంగా తినేవాడు. తిన్నాక ‘ఆకలైతే తినకేం చేస్తాం. ఎలా వున్నా తినాలిగా!’ అంటూ లేచి వెళ్లి చేయి కడుక్కునేవాడు. ధృతి మాత్రం అందరికి నచ్చాలనే చేస్తుంది. మెప్పించాలనే చేస్తుంది. అత్తగారు ఎలా వండేదో అలాగే గుర్తుపెట్టుకొని చేస్తుంది. కానీ ఆనంద్‌ ఒక్కడే ‘నిన్ను వదల బొమ్మాలీ!’ అన్న పద్ధతిలో ఏదో ఒకి అంటూనే వుంటాడు. ధృతి తట్టుకోలేక
”అక్కా! ఎక్కడైనా అన్ని వంటలు అందరికి నచ్చుతాయా? మౌనంగా తినాలి గాని బావగారెందుకలా అంటారు? మీరు చెప్పొచ్చు కదా అలా అనొద్దని… నాకు మాత్రం ఈ ఇంట్లో వచ్చినప్పుడు ఇక్కడి వంటలు నచ్చాయా? అలవాటు చేసుకోలేదా! ప్లీజ్‌ అక్కా! బావగారిని నన్నేమీ అనొద్దని చెప్పరూ!” అంటూ బ్రతిమాలింది.
”చెప్పటానికి ఆయనేమైనా ఇప్పుడు నా మాట వింటున్నారా? నీ మాటేగా వింటున్నారు. నాతో ఏమైనా మాట్లాడుతున్నారా? నీతోనేగా మాట్లాడుతున్నారు” అంది మోక్ష.
”నాతో మాట్లాడుతున్నారా? నీ మాట వినటం లేదా? ఏమంటున్నావో నాకేం అర్థం కావటం లేదక్కా?” అంది బేలగా చూస్తూ ధృతి.
”నాకు మాత్రం అర్థమై ఏడ్చిందా? ఎవరి ఏడుపు వాళ్లది లెమ్మని ఒక ఏడ్పు ఏడ్చి వూరుకోవటం లేదా? ఎవరైనా మనతో మాట్లాడాలన్నా, మాట వినాలన్నా వాళ్లకి మనమీద ఏదో వుండాలట. ఆయనకు నామీద అది వుందో లేదో! మా ఆఫీసులో చెబితే వాళ్లు కూడా అదే అన్నారు. నీకు ఇలాంటివి అర్థం కావులే…” అంది.
ధృతికి కళ్లు తిరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా కింద పడిపోతానేమో అనిపిస్తోంది. మోక్ష అనే మాటలు కూడా ఆమెకు సరిగా విన్పించటం లేదు.
మోక్ష మాత్రం చాలా తెగింపుగా ”నీకు నీ వంట నచ్చలేదన్న బాధ ఒక్కటే! మాకిక్కడ మా బ్రతుకులే నచ్చటం లేదు. మా బాధలెవరిక్కావాలి” అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయింది.
ఆమె పూర్తిగా గదిలోకి వెళ్లకముందే ధృతి కింద పడిపోయింది. మోక్ష వెంటనే తల తిప్పి ధృతిని చూసింది. ”అయ్యో! ధృతి క్రింద పడిపోయిందే” అని కంగారు పడలేదు. కారణం ఈమధ్యన ఆనంద్‌ ఎక్కువగా ‘నువ్వుకూడా ధృతిలాగా చీరలు కట్టుకో! చూడలేకపోతున్నాను’ అని అనడం వల్లనే కావచ్చు. ధృతి ఎప్పుడు కన్పించినా నిప్పుతో కొట్టినట్లనిపిస్తోంది మోక్షకు… అయినా చూడలేనంత వికారంగా వుందా తను? ఏ భార్య అయినా భర్త తనను మెచ్చుకోకపోయినా వూరుకుం టుందేమో కాని వేరే స్త్రీని మెచ్చుకుంటే మాత్రం భరించలేదు. పైగా తను వేసుకునే డ్రస్సుల్ని కామెంట్ చేసి తన భర్తకు తన డ్రస్‌లపై గౌరవం లేకుండా చేసింది. ఇంత చేసిన దాన్ని కింద పడగానే ఏ మొహం పెట్టుకెళ్లి లేపాలి? అదే లేస్తుందిలే అనుకుని తన గదిలోకి వెళ్లిపోయింది.
ధృతి కొద్దిసేపు అలాగే పడుకొని తెలివి రాగానే తెప్పరిల్లి తనంతట తనే లేచి నిలబడింది. నిలబడలేక వెంటనే అక్కడ వున్న సోఫాలో కూర్చుంది. నీరసంగా వుంది. లేవలేకపోతోంది. చెవులు గడలు పడ్డట్లైంది. ఏ చిన్న శబ్దం కూడా విన్పించలేదు. రెండు చేతులతో చెవుల్ని మూసి తీసింది. ”అమ్మో! నాకేమైంది” అనుకుంది. రెండు మూడు రోజుల నుండి ఆమెకు అలాగే వుంది. కొద్దిసేపు నడవగానే కళ్లు తిరుగుతున్నాయి. కళ్లు తిరుగుతున్నాయని కూర్చుంటే పని చెయ్యాలి కదా అన్న భయంతో అలాగే మొండిగా తిరుగుతోంది. అలసిపోయి రాత్రిపూట త్వరగానే నిద్రపోతోంది. గతంలో లాగా సతీష్‌చంద్ర ఫోన్‌కోసం ఎదురుచూడలేకపోతోంది.
‘…హాల్లో ఏంటి లైటు వెలుగుతోంది’ అని అనుకుంటూ హాల్లోకి వచ్చింది మాధవీలత. అక్కడ సోఫాలో కూర్చుని వున్న ధృతిని చూసి మౌనంగా వెనుదిరిగింది. ”అక్కడెందుకు కూర్చున్నావ్‌?” అని దృతిని పలకరించలేదు. ‘ఏమైనా కావాలా’ అని అడగలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఆమెకు మనసులో ఒకటే వుంది… ధృతి తన కన్నకూతురైతే తనను చూసి నవ్వేదా? కోడలు అయినందు వల్లనే కదా అలా నవ్వింది. అలాంటప్పుడు ఆమెతో నాకేం పని… కోడలు అయితే అవుగాక తనెందుకు మాట్లాడాలి? కోడలు అయినందువల్ల ఈ ఇంట్లో వుండే హక్కును సంపాయించుకుందేమో కాని తనను చూసి నవ్వినప్పుడే తన మనసులో స్థానాన్ని పోగొట్టుకుంది.
అత్తగారు తనను చూసికూడా ఎందుకు పలకరించలేదో ధృతికి ఆశ్చర్యంగా వుంది. ఆమె ఈ మధ్యన పలికీ పలకనట్లూ, చూసీ చూడనట్లు తనను ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావడం లేదు. తనకెందుకింత నీరసంగా వుందో అంతకన్నా అర్థం కావటం లేదు. పనిలో పడి తిండి సరిగా తినని మాట నిజమే అయినా మరీ ఇంత నీరసమా!!!
మెల్లగా లేచి హాల్లో లైట్ ఆపేసి గదిలోకి వెళ్లి పడుకుంది.
పడుకున్న వెంటనే సతీష్‌చంద్ర నుండి ఫోనొచ్చింది.
లిప్ట్‌ చేసి మాట్లాడింది. ఆమె లిఫ్ట్‌ చెయ్యగానే అతను మాట్లాడిన మొట్టమొదటి మాట ”హాస్పిటల్‌కి వెళ్లావా?” అని… ఆమె ఆశ్చర్యపోయి ”నాకు నీరసంగా వుందని మీకెలా తెలిసింది. ఇంకా వెళ్లలేదు. అక్కతో చెప్పి వెళతాను” అంది నీరసంగా.
”త్వరగా వెళ్లు! రోజూ టైంకు తిని రెస్ట్‌ తీసుకో!” అన్నాడు.
ఆమె ‘సరే’ అంది.ఇంట్లో పనిమనిషి లేని విషయం అతనితో చెప్పలేదు. అదేకాదు బావ తనను విసిగిస్తున్నాడని, అక్క కోపంగా వుందని, అత్తగారు ముభావంగా వున్నారని, మామగారు ఏదీ పట్టించుకోరని కూడా చెప్పలేదు. నిశ్శబ్దంగా వుండిపోయింది.
”సరే పడుకో! నీరసంగా వుందన్నావుగా! రేపు హాస్పిటల్‌కి వెళ్లు” అని చెప్పి కాల్‌ కట్ చేశాడు సతీష్‌చంద్ర.
*****
సతీష్‌చంద్ర గత మూడు నెలలుగా ధృతి అకౌంటులోకి ఎక్కువ డబ్బులు పంపుతున్నాడు. అకౌంట్ బుక్‌ అంకిరెడ్డి దగ్గర వుంటుంది కాబట్టి ఆ విషయం ఆయన ఒక్కడికే తెలుసు. అలా ఎక్కువ డబ్బులు ఎందుకు పంపిస్తున్నాడో సతీష్‌చంద్ర తల్లితో కాని తండ్రితో గాని చెప్పలేదు. ధృతి గర్భవతి. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో! ఇప్పటికే ఐదు నెలలు నిండాయి. నెలనెల క్రమం తప్పకుండా హాస్పిటల్‌కి తీసికెళ్లాలి. అక్కడ చెకప్‌లని, టెస్ట్‌లని, మందులని డబ్బులు బాగానే అవసరం అవుతాయి. అందుకే పంపుతున్నాడు. రెండో నెల రాగానే ప్రెగ్నెన్సీ కన్‌ఫమ్‌ అయిందని చెప్పాక తల్లికి ఫోన్‌చేసి ”ధృతి ఎలా వుందమ్మా?” అని అడిగాడు.
ఆమె చాలా సంతోషంగా ”బాగుంది సతీష్‌! మోక్ష నిన్ననే ధృతిని హాస్పిటల్‌కి తీసికెళ్లి చెకప్‌ చేయించి, మందులు తీసుకొచ్చింది. అలవాటు లేదని పాలు, గుడ్డు తినకుంటే మోక్షనే బలవంతంగా తినిపిస్తోంది. మోక్ష ఆఫీసు నుండి వచ్చేటప్పడు రిలయన్స్‌ మార్ట్‌ కెళ్లి ట్రాపికానా (జ్యూస్‌) తెచ్చి తాగిస్తోంది. మెట్లు దిగే చోట ఎక్కే చోట దృతిని వెళ్లనివ్వకుండా మోక్షనే వెళ్తోంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. అసలు వాళ్లను చూస్తే తోడికోడళ్లలా లేరు. అక్కాచెల్లెళ్లలా వున్నారు. అన్నయ్య కూడా దృతితో మ్లాడుతూ సరదాగానే వుంటున్నాడు. ఇక్కడ నువ్వు భయపడాల్సిందేమీ లేదు. నువ్వు జాగ్రత్త!” అంది.
ఇక అప్పటి నుండి ధృతి గురించి అడగడం మానేశాడు. దృతిని చూసుకోటానికి చాలామంది వున్నారు. అత్తా, మామ, బావ, అక్క. అందరూ మంచివాళ్లే! అందరూ నమ్మదగినవాళ్లే! ఒకరకంగా చెప్పాలంటే నరేంద్ర తల్లి తారమ్మనే నమ్మకూడదు. అలాంటి నమ్మకూడని వ్యక్తినే నమ్మి నరేంద్ర తన భార్యను వదిలి నిశ్చింతగా వుండగా తనకేం తక్కువ. అని అనుకొన్నాడే కాని వ్యతిరేకంగా ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే అతనక్కడ కందకాల్లో పడుకోలేడు. కడుపునిండా తినలేడు. దేశం కోసం తాపత్రయపడలేడు. కడుపు నిండితేనే కదా మంచి ఆలోచనలు వస్తాయి? అతని మనసు నిండా మంచి ఆలోచనలే! ఆరోగ్యవంతమైన ఆశలే!
*****
ధృతికి ఆరో నెల నడుస్తోంది.
తారమ్మ పొలంలో పండిన సీతాఫలాలను బుట్టలో పెట్టుకొని ఆ బుట్టను నెత్తిమీద పెట్టుకొని నడుచుకుంటూ అంకిరెడ్డి ఇంటికి వచ్చింది.
తారమ్మను చూసి ముందు ఎవరో అనుకుంది మాధవీలత. ఆ తర్వాత గుర్తుపట్టి ”నువ్వా తారమ్మా! ఏంటా బుట్ట? అంత పెద్దగా వుంది? కూర్చో!” అంది.
తారమ్మ మర్యాదగా నవ్వి ”నేనే మాధవమ్మా! బాగున్నారా?” అంటూ తలమీద బుట్టను నెమ్మదిగా కింద పెట్టి కూర్చుంది. తారమ్మ పుష్టిగా తెల్లగా చేయిపెడితే జారిపోయేలా వుంది. తలకి కట్టిన గుడ్డను విప్పి ఒళ్లో పెట్టుకుంది. ఎవరైనా వచ్చి నీళ్లిస్తే తాగాలన్నట్లు అటు ఇటు చూస్తోంది.
మాధవీలత లేచి వెళ్లి నీళ్లు తెచ్చి తారమ్మకి ఇచ్చింది. తారమ్మ నీళ్లు తాగుతూ మాధవీలత వైపు చూసి ”నువ్వు బాగా మారిపోయావు మాధవమ్మా! మొన్న వచ్చినప్పుడు బాగానే వున్నావ్‌! ఏమైనా జబ్బున పడ్డావా? నాకో ఫోన్‌ చేస్తే వచ్చేదాన్నిగా!” అంది ఆత్మీయంగా.
అది వినగానే మాధవీలత చూపుల్లో కాంతి తగ్గింది. అసలే ఆ మధ్యన మోక్ష ‘మీ చర్మానికి అప్పుడే ముడతలొస్తున్నాయి అత్తయ్యా! కేర్‌ తీసుకోవాలి’ అన్నప్పటి నుండి వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తిలా అయింది. దానికి తోడు చిన్న కోడలు నవ్విందన్న బాధ ఒకి. ఇప్పుడు ఈ తారమ్మ వూరుకోకుండా జబ్బున పడ్డావా అని అనగానే ముంపుకు గురైన ప్రాంతంలా అయింది. అదీగాక ఎదురుగా వున్న తారమ్మ మెరుస్తున్న కొండలా, దిట్టంగా వుండటం చూసి సునామీ వచ్చిన ఊరులా మారింది. ఆమెకిప్పుడు ఎవర్ని చూసినా బాధగానే వుంది. ఆమె శరీరం తప్ప అందరి శరీరాలు కాంతులీనుతున్నట్లున్నాయి. ఆమెకన్నా అందరూ అందంగా వున్నట్లున్నారు. అందం తగ్గితే ఏ భర్తా ఏ భార్యను పట్టించుకోడన్నది సత్యమన్నట్లు బాధపడుతోంది. బాధతోపాటు కసి కూడా ఎక్కువైంది.
అనుకోకుండా హాల్లోకి వచ్చిన ధృతి తారమ్మను చూసి నవ్వింది. ”మీరా ఆంటీ!” అంటూ దగ్గరకి వచ్చింది.
తారమ్మ ఒక్క ఉదుటన లేచి ధృతి కడుపు మీద చేయిపెట్టి నిమురుతూ ”ఎన్నో నెల?” అని అడిగింది.
”ఆరు నడుస్తోంది ఆంటీ” చెప్పింది ధృతి.
నమ్మలేక షాక్‌ తిన్నది తారమ్మ.
మాధవీలత వైపు చూసి ”నీ కోడలు చెప్పేది నిజమేనా మాధవమ్మా!” అడిగింది తారమ్మ.
”అంటే?” అర్థం కానట్లు చూసింది మాధవీలత. ఆమె కోడలితో మాట్లాడక, కోడలి వైపు చూడక చాలా రోజులైంది. ఇప్పుడు కూడా ఆమె సరిగా దృతి వైపు చూడకుండా ముఖాన్ని పక్కకి తిప్పుకొని కూర్చుంది.
”పొట్ట కన్పించడం లేదు. ఎంత ‘లోపొట్ట’ అయితే మాత్రం కొంత అయినా పైకి కన్పించాలిగా. మా ఇళ్ల దగ్గర ఒకమ్మాయికి ఆరోనెల. అక్కడ చూసి ఇక్కడ చూస్తుంటే మూడో నెలలా అన్పిస్తోంది” అంది.
వెంటనే తారమ్మ వైపు చూసి ”మా అబ్బాయి వెళ్లి ఐదు నెలలు కావస్తుంది. నువ్వేంటి తారమ్మా మూడు నెలలు అంటున్నావ్‌! ఇదేదో తేడాగా వుందే?” అంది.
”అంత తేడా ఏం లేదు. ధృతిలో రావలసినంత మార్పు రాలేదు. అందుకే అలా అన్నాను” అంది తారమ్మ ఏమాత్రం తడబడకుండా.
”నువ్వన్నాక నాక్కూడా అలాగే అన్పిస్తోంది. అసలేం జరిగిందో పక్కకి తీసికెళ్లి అడుగు. మాకెలా చెబితే అలా నమ్మాం. పిచ్చోళ్లం” అంది మాధవీలత.
తారమ్మ అదేం పట్టించుకోకుండా ”వేళకు తింటున్నావా తల్లీ!” అంది. నిజానికి దృతికి తిండి తినకనే చాలా నీరసంగా వుంటోంది. ‘నాకిలా వుంది ఒకసారి హాస్పిటల్‌కి తీసికెళ్లి చెకప్‌ చేయించండి!’ అని అత్తగారిని కాని, తోడికోడలిని కాని అడగలేకపోతోంది. అంకిరెడ్డి, ఆనంద్‌ మగవాళ్లు కాబట్టి వాళ్లతో ఇలాంటివి చెప్పుకోలేదు. ఒకవేళ చెప్పినా అది విని ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయోనని భయం. భర్త ఎక్కడో వున్నాడు. ఎవరితో చెప్పుకోవాలి?
ధృతి, తారమ్మ ఒకరితో ఒకరు అంత ఆత్మీయంగా మాట్లాడుకుంటుంటే మాధవీలతకు కోపం వస్తోంది. ఎంత పొగరు వీళ్లకి…. నేనిక్కడ వున్నా నావైపు చూడటం లేదు. వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంత నిర్లక్ష్యం నేనంటే? నా చర్మం ముడతలు పడి నా అందం తగ్గిందనా! అంత వికారంగా వున్నానా నేను?? అందుకేనా వీళ్లు నాకు ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వడం లేదు.
కసితో పళ్లు కొరికి ”తియ్యగా మాట్లాడడానికి, చెయ్యేసి నిమరానికి నీకు నా కోడలే దొరికిందా తారమ్మా!” అంది మాధవీలత.
ఉలిక్కిపడి చూసింది తారమ్మ. ధృతి కూడా అత్తగారి వైపు చూసింది.
”నువ్వలా నిమిరితే నా కోడలు ఏమనుకుంటుంది? మా అత్తకన్నా బయట అత్తే నన్ను ప్రేమగా నిమిరిందనుకోదా?” అంది.
”ఛఛ అలా ఎందుకనుకుంటుంది?” అంది తారమ్మ.
”అలాగే అనుకుంటోది. నీ కోడలు నీ వల్లనే కోమాలోకి పోయిందని తెలిసి ఎందరొచ్చారు నీ కోడల్ని నిమరటానికి…? మనం కూడా మనమేంటో తెలుసుకోవాలి. మిడిసిపాటు తగదు” అంది. ఆమె ఏం మాట్లాడినా తక్కువే అన్నట్లు రెచ్చిపోయి మాట్లాడుతోంది.
తారమ్మ ధృతి చేయి పట్టుకుని వదలకుండా చాలా సౌమ్యంగా ”ఎవరి ప్రేమ వాళ్లదిలేమ్మా! అయినా నీ కోడలి మీద నీకున్నంత ప్రేమ ఎవరికుంటుంది. వుంటుందన్నా ఎవరు నమ్ముతారు. ఇప్పటి పిల్లలకి ఆ మాత్రం అర్థం కాదా ఏం!” అంది.
”అర్థమయినా అర్థం కానట్లు చెయ్యటానికే నీలాంటి వాళ్లు పొంచుకొని వుంటార్లే తారమ్మా! ఏదో వచ్చావ్‌! చూసిపో… ఈ నిమరడాలు, చేతులు పట్టుకోవడాలు దేనికి? ఓవర్‌ యాక్షన్‌ కాకపోతే!” అంది.
”పల్లెటూరువాళ్లం… అలాంటి యాక్షన్లు మాకు రావు” అంది ముక్తసరిగా.
”మీకు కోడళ్లను కోమాలోకి పంపించటం మాత్రమే వస్తుంది”
”మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావా మాధవమ్మా?”
”నాకేముంటుందమ్మా మనసులో… నేను ఎప్పుడైనా వచ్చి నీ కోడల్ని నిమిరానా? నీ ఇల్లు చూశానా?”
దెబ్బతిన్నట్లు చూసి ”అంటే ఇప్పుడు నేను రావడం నీకు ఇష్టం లేనట్లుందిగా! వెళ్లిపోనా?”
”వద్దులే! కూర్చో! ఎంతసేపు కూర్చుంటావో! ఆ తర్వాత అయినా వెళ్లి పోవలసిందేగా!”
అత్తగారి మాటలు దృతికి నచ్చడం లేదు.
”నువ్వు చాలా గొప్పదానివనుకున్నానమ్మా ఇన్నిరోజులు…” అంది తారమ్మ.
”నీకన్నా గొప్పదాన్నే తారమ్మా! ఎందుకంటే నీ కోడలు సైకియాటిస్ట్‌ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాకనే నిన్ను దగ్గరకు రానిచ్చిందట కదా! అది ఈ మధ్యనే తెలిసిందిలే నాకు. అది మరచిపోయి మాట్లాడకు”
తారమ్మకు అక్కడ వుండాలనిపించలేదు. వెంటనే లేచి నిలబడింది. నాలుగు అడుగులు వేసిందో లేదో ”ఆగు తారమ్మా! అప్పుడే వెళ్లిపోతావేం? ఆరోనెల మనిషిని పట్టుకొని మూడో నెలలా వుందన్నావ్‌గా! దాన్ని తేల్చకుండానే వెళ్తావా?” అంది.
ఆమె వెనుదిరిగి చూడకుండానే ”ఏముంది తేల్చానికి?” అంది.
”ఏముందటున్నావా? అదే నీ కోడల్ని అలా అంటే నువ్వు ఒప్పుకుంటావా? మనవాళ్లు దూర దేశాలకు వెళ్లిపోయాక నెల తప్పేవాళ్లలా కన్పిస్తున్నామా మేము” అంది.
ధృతి వెంటనే ”అయ్యో! అత్తయ్యా ఆమె అలా అనలేదు” అంది.
”నువ్వు నోర్ముయ్‌! లోపలకెళ్లు. నీకు తెలుసా? నాకు తెలుసా తారమ్మ సంగతి” అంది మాధవీలత.
తారమ్మ ఏమాత్రం ఆవేశ పడకుండా ”పెడర్థాలు తీసి నువ్వెంత రాగాలు తీసినా ప్రయోజనం లేదు మాధవమ్మా! కోడల్ని డాక్టరమ్మకు చూపించు. లోపల బిడ్డ పెరుగుతుందో లేదో తెలుస్తుంది. ఎంతయినా నువ్వు మహా గొప్ప దానివిలా వున్నావ్‌! పైకి కన్పించవు గాని” అంటూ వెళ్లిపోయింది.
స్థాణువులా నిలబడి వున్న ధృతి వైపు చూసి ”ఇంకా ఎంతసేపు నిలబడతావ్‌! ఆ బుట్టను తీసికెళ్లి బయటపడెయ్యి” అంది మాధవీలత.
”అవి తినే పండ్లు” అంది ధృతి.
”నాకు నువ్వు నేర్పకు. బయట పడెయ్యమన్నానా!”
ధృతి రోషంగా ఆ బుట్టను బయటకు తీసికెళ్లింది. దాన్నేం చెయ్యాలో ఒక్కక్షణం అర్థం కాక నేరుగా చూసింది. దూరంగా తారమ్మ గుడ్డ దులిపి తలకు కట్టుకుంటూ వెళ్తోంది.
సీతాఫలాలున్న బుట్టను రెండు చేతులతో పట్టుకొని నిలబడి వున్న ధృతిని చూసి ఆటో ఆగింది. ధృతి వెంటనే ఆ ఆటోలోకి తొంగి చూసి ”ఆటో అన్నా! ఈ పండ్లని పట్టుకెళ్లి పిల్లలకు పెట్టుకో! ఇవి అదిగో ఆ వెళ్తున్నావిడ చెట్లకి కాసినవి. తినేటప్పుడు ఆవిడను తలచుకుంటూ తినండి!” అంటూ ఆ బుట్టను ఆటోలో పెట్టి ఇంట్లోకెళ్లింది ధృతి.
ఆమెకెందుకో అత్తగారి వైపు చూడాలనిపించలేదు. తనని చూసి మూడో నెలలా అన్పించిందని తారమ్మ అనగానే అదేదో పక్కకి తీసికెళ్లి మాట్లాడు తారమ్మా అని తారమ్మతో అన్నప్పుడే ఆమె మీద గౌరవం పోయింది. అత్త అంటే ఎలా వుండాలి? ఇది నా కుటుంబం, నా కోడలు, నా కొడుకు, నా కోడలికి పుట్టబోయే బిడ్డ అన్న భావనతో వుండాలి. అలాంటి భావన లేని ఏ అత్త అయినా అడవిజంతువు లాంటిది. అలాంటి జంతువులో వ్యక్తిత్వాన్ని వెతుక్కోకూడదు. విలువల్ని ఆశించకూడదు. ఇన్నిరోజులు పెద్ద ఇంట్లో వుండి, ఖరీదైన చీరలు కట్టే అత్తగారికి కోడల్ని కావటం గొప్ప అదృష్టంగా భావించింది. అది వట్టి భ్రమ. పెద్ద ఇల్లులు, ఖరీదైన చీరలు ఇలాంటి ఆడవాళ్లకి వ్యక్తిత్వాన్ని నేర్పవు. వీళ్లకి కుటుంబాన్ని గౌరవించుకోవటం రాదు. కుటుంబంలోని వ్యక్తుల్ని ప్రేమించటం రాదు… చర్మ సౌందర్యం కోసం ఉదయాన్నే ముఖానికి పచ్చిపాలు పూసుకొని సోఫాలో కూర్చుంటే ముఖం మీద ముడతలు పోతాయేమో గాని మనసు మీద ముడతలు పోతాయా? వాళ్లను వాళ్లు గౌరవించుకుంటారా? ఇతరుల చేత గౌరవించబడతారా?
పాపం తారమ్మ ఎంత ప్రేమతో వచ్చిందో!
అంత బాధతో, ఎండలో నడుచుకుంటూ వెళ్లింది. అది ఏమాత్రం నచ్చలేదు ధృతికి… తారమ్మ వచ్చి వెళ్లినట్లు సతీష్‌చంద్రకి మెసేజ్‌ పెడుతూ తన గదిలోనే వుండిపోయింది.
*****
తారమ్మ ఇంటికెళ్లగానే కాళ్లు కూడా కడుక్కోకుండా ”నరేంద్రకి ఫోన్‌ కలిపి ఇవ్వు” అంది సౌమ్యతో.
సౌమ్య వెంటనే నరేంద్రకు కాల్‌ చేసి అతను లిఫ్ట్‌ చెయ్యగానే ”అత్తగారు మీతో మాట్లాడతారట” అంటూ మొబైల్‌ను తారమ్మ చేతిలో పెట్టి అవతలకెళ్లింది. తారమ్మ ఆ మొబైల్‌ని చెవి దగ్గర పెట్టుకొని పెద్దగా ‘హలో!’ అంది. ఆమె ఎప్పుడైనా అంతే! కొడుకు దూరంగా వున్నాడు కాబట్టి గట్టిగా మాట్లాడితేనే అతనికి విన్పిస్తుందనుకుంటుంది.
నరేంద్ర ”చెప్పమ్మా! ఎలా వున్నారు? నాన్న, సౌమ్య బాగున్నారా?” అన్నాడు.
”బాగున్నారు నరేంద్రా! కానీ మనం అనుకున్నంత మంచిది కాదు నాన్నా అంకిరెడ్డి కుటుంబం. ధృతిని చూస్తుంటే జాలిగా వుంది. మనిషి బాగా తగ్గిపోయి వుంది. ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయో తెలియదు కాని చాలా బాధలో వున్నట్లు అన్పిస్తోంది. నాతో చెప్పమని అడిగేంత వ్యవధి కూడా నాకక్కడ దొరకలేదు” అంటూ ఆగింది.
”అసలేం జరిగిందమ్మా?”
”ఏదో జరుగుతోంది నరేంద్రా! అది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నువ్వు వెంటనే సతీష్‌చంద్రకి ఫోన్‌ చేసి మాట్లాడు. ఏం మాట్లాడతావో ఆలోచించి మాట్లాడు. విషయమైతే అది. దృతికి తల్లిదండ్రులు లేకపోవటం వల్ల ఏదీ బయటకొచ్చే అవకాశం లేదు. నాకైతే ధృతిని చూస్తుంటే విషసర్పాల మధ్యన చిక్కుకున్న కప్పపిల్లలా కనిపిస్తోంది. నువ్వు నమ్ము” అంది.
”నేను ఇప్పుడే సతీష్‌కి కాల్‌ చేసి మాట్లాడతాను. నువ్వు ఫోన్‌ పెట్టెయ్యమ్మా!” అంటూ కాల్‌ క్‌ చేసి సతీష్‌చంద్రకి ఫోన్‌ చేసి మాట్లాడాడు నరేంద్ర.
*****
అంకిరెడ్డి ఆఫీసులో వుండగానే సతీష్‌చంద్ర దగ్గర నుండి ఫోనొచ్చింది. అతను ఎక్కువగా భార్యకే ఫోన్‌ చేసి మాట్లాడుతుంటాడు కాని తల్లిదండ్రులకి, అన్నా వదినలకి ఫోన్‌ చెయ్యడు. అందుకే, అతని నెంబర్‌ చూసి ఆశ్చర్యపోతూ లిఫ్ట్‌ చేశాడు అంకిరెడ్డి.
”నేను ఆఫీసులో బిజీగా వున్నాను సతీష్‌! ఇంటికి ఫోన్‌ చేసి ధృతితో మాట్లాడు” అంటూ ఆయన ఫోన్‌ పెట్టెయ్యబోయాడు.
”ఒక్క నిముషం నాన్నా! నేను నీతోనే మాట్లాడాలి. ఒక గంట ఆగి మళ్లీ ఫోన్‌ చేస్తాను” అంటూ ఫోన్‌ పెట్టేసి ఓ గంట ఆగి మళ్లీ ఫోన్‌ చేశాడు సతీష్‌చంద్ర.
అంకిరెడ్డి వెంటనే లిఫ్ట్‌ చేసి ”ఏంటి సతీష్‌! ఏంటి సంగతి? బాగున్నావా?” అన్నాడు.
”బాగున్నాను నాన్నా! మీరు బాగున్నారా? ధృతి ఎలా వుంది?” అడిగాడు సతీష్‌చంద్ర.
”ఓ.కె. సతీష్‌! అందరం బాగున్నాం” అన్నాడు.
”ధృతిని హాస్పిటల్‌కి తీసికెళ్తున్నారా? నెల నెల చెకప్‌ చేయిస్తున్నారా? మంచి ఆహారాన్ని ఇస్తున్నారా?” అన్నాడు సతీష్‌.
”ఊ….” అన్నాడు.
”ఊ… కాదు నాన్నా! ఇవన్నీ ధృతికి అందుతున్నట్లు నువ్వు గమనిస్తున్నావా?” అడిగాడు.
”నేనేంటి సతీష్‌ గమనించేది. ఆడవాళ్లు వాళ్లు వాళ్లు చూసుకుంటార్లే! ఇలాంటివి మనమేం చూస్తాం!” అన్నాడు.
”కాదు నాన్నా! నువ్వు కూడా చూడాలి”
ఆయన మాట్లాడలేదు.
”పనిమనిషి కీరమ్మతో చెప్పి ఒకటికి రెండుసార్లు ధృతికి జ్యూస్‌ తీసిమ్మని చెబుతున్నారా? రెస్ట్‌ తీసుకోమని చెబుతున్నారా? అవునూ! బిడ్డ పొజిషన్‌ లోపల ఎలా వుందో తెలియాలంటే స్కాన్‌ తీస్తారు కదా! అది తీయించారా?”
”ఏమో సతీష్‌! అవన్నీ మీ అమ్మా, వదిన చూస్తుంటారు. ఆ విషయం దృతిని అడగకపోయావా?”
”అడిగాను. అంతా ఓ.కె. అంటుంది. ఏది అడిగినా చెప్పదు. అందుకే నిన్ను అడుగుతున్నాను”
”ఏమైనా వుంటే కదా చెప్పానికి? నువ్వు అనవసరంగా ఏదేదో వూహించుకుంటున్నావ్‌!” అన్నాడు అంకిరెడ్డి. పనిమనిషి కీరమ్మను తీసేసినట్లు దృతి సతీష్‌తో చెప్పకపోవడం ఆయనకు ఆశ్చర్యంగా వుంది.
”కాదు నాన్నా! నువ్వు తన గురించి కేర్‌ తీసుకో! నేను చెప్పినవన్నీ చేస్తున్నారో లేదో ఒకసారి ఇంట్లో అమ్మను, వదినను అడుగు” అన్నాడు.
”సరే! అడుగుతాను. నువ్వు జాగ్రత్త” అన్నాడు అంకిరెడ్డి.
”ధృతి జాగ్రత్త నాన్నా! తనకి మనం తప్ప ఎవరూ లేరు. ప్రవీణ్‌ బిజీగా వుంటాడు. అతనితో ఇలాంటివి చెప్పొద్దు. వుంటాను” అంటూ కాల్‌ కట్ చేశాడు.

1 thought on “జీవితం ఇలా కూడా ఉంటుందా? 8

  1. nijamgaa, జీవితం ఇలా కూడా ఉంటుందా అనిపిస్తూ uMTuMdi, కొన్ని జీవితాలని మనుషుల్ని చూస్తుంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *