April 30, 2024

5. ‘ప్ర’మా’దాక్షరి’

రచన : ఇందిరారావు షబ్నవీస్

“ఒరే సురేష్, నీకు ఈ అమ్మాయి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుందిరా” అంది తల్లి.
అదేదో సినిమాలోలాగ “అంత గట్టిగా ఎలా చెప్పగలవు?” అన్నాడు నాటకీయంగా సురేష్.
“నీ మొహం, అంత చదువుకున్నది కాకపోయినా చూడ్డానికి బాగుంది. తెలిసిన వాళ్ళు. అయిన సంబంధం. చేసుకోరా” అంది మళ్ళీ.
“సరే, నువ్వంతగా చెప్తుంటే కానీ” అన్నాడు సురేష్.
నిజంగానే అమ్మాయి చాలా బాగుంది…కాదనడానికి కారణం ఏమి తోచలేదు. పేరే కొంచెం వింతగా అనిపించింది. ‘ప్రమోదాక్షరి’ ట పేరు. వాళ్ళ అమ్మ అడక్కుండానే వివరణ ఇచ్చింది… అమ్మాయి తండ్రికి తెలుగు అక్షరాలు అంటే చాలా ఇష్టంట… అచ్చులు, హల్లులు కలిసి వచ్చేటట్టు ఏదయినా పేరు పెడదామనుకున్నారుట… పురోహితుడు అలా కష్టం అని అక్షరం అని పెట్టమన్నాడుట… ఇంతలో పాప దరహస వదనం చూసి ‘ప్రమోదాక్షరి” అని పెట్టారుట.
సురేష్ ఒక బ్యాంకులో పని చేస్తున్నాడు…గ్రాడ్యుయేషన్ అయ్యాక బ్యాంకు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించు కున్నాడు. ఈ రోజుల్లో అమ్మాయిలకి కావలసిన అర్హతలు అంటే ఆరు అంకెల జీతం, సొంత ఇల్లు, తల్లితండ్రుల బాధ్యత లేకపోవడం, ఇలాంటి అర్హతలు ఏమి లేవు అతనికి… సొంత ఇల్లు లేదు, పైగా తల్లి బాధ్యత కూడా వుంది… అమ్మాయి ఎక్కువ చదువుకోకపోయినా మిగిలినవన్నీ బాగున్నాయి కదా అనుకున్నాడు.
పెళ్ళి అయిన ఒక నెల రోజులకు తల్లి తన అక్కగారికి ఒంట్లో బాగులేదు సహాయం రమ్మంటే ఇంటిని, కొడుకుని, కోడలుకి అప్పగించి వెళ్ళింది… కొత్త కాపరం తనకి ఇలా ప్రైవసీ దొరికినందుకు చాలా సరదాపడ్డాడు సురేష్.
ఆ ఆదివారం పొద్దున్నే వంటింట్లో బిజీగా వంట చేస్తున్న భార్య దగ్గరికి వెళ్ళి “ఏంటో మంచి మంచి వంటలు చేసేస్తున్నావు, ఏంటి సంగతి?” అన్నాడు.
“మీకోక సర్ప్రైజ్. మా ఫ్రెండ్ ఒకమ్మాయి ఈ వీడియో పంపింది… ఇవాళ నుండి ఒక వారం వరకు సప్తాహం, మంచి మంచి వంటలు” అంది. ఆ రోజు నుండి రోజుకొక చిత్రహింస మొదలైంది సురేష్ కి. ఆ మంచి వంటలు ఏంటో అనుభవంలోకి వచ్చింది.
మొదటి రోజు కాకరకాయ పనీర్, రెండవ రోజు పనీర్ పచ్చడి, మూడు పనీర్ పులుసు, నాలుగు పనీర్ వంకాయ, ఐదు పనీర్ పులిహోర, ఇంక ఆరవ రోజు వాంతులు, విరోచనాలు సురేష్ కి.
“ఇంక ఆపవే తల్లి! ఇదా సప్తాహం అంటే?” అన్నాడు నీరసంగా నాలుగోసారి బాత్రూమ్ లోంచి వస్తూ.
“అయ్యో అలా అంటారేంటండీ? ఇంకా పనీర్ తో చాలా చెయ్యొచ్చు, నిన్న మా ఫ్రెండ్ ఇంకో రెండు వీడియోలు పంపింది. పనీర్ ఉప్మా, పనీర్ మజ్జిగ పులుసు… ఇంకా అవి చెయ్యనే లేదు” అంది.
“ఇంక ఆపవే, పనీర్ అంటేనే డోకు వస్తోంది”. అని ఆమాట అంటూనే బాత్‌రూమ్‌కి పరిగెత్తాడు భళుక్కుమంటూ డోక్కోడానికి. “ఏంటో ఈయన?? ఆ వీడియోలో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ ఎలా తిన్నారు?” అనుకుంది.
ఒక నాలుగు రోజులు గడిచాక ఆదివారం పొద్దున్నే బయలుదేరదీసింది “పదండి మనం చెట్లు పెంచాలి. ఇవాళ వీడియోలో చూపించారు” అని.
కావలసిన మట్టి, ఎరువు, కుండీలు కొంది…
“మరి మొక్కలు?” అన్నాడు.
“అవి నేనే ఇంట్లో మొలిపిస్తాను” అంది గర్వముగా.
సురేష్ కి అర్థం కాలేదు…సరే పోనిలే అనుకుంటూ కావలసినవన్నీ కొని ఇచ్చాడు. ఒక వారం రోజులు ఏదో ఏదో చేసింది రకరకాల కూరగాయలు, పళ్ళు కొని. పది రోజులు, 15 రోజులు అయినా కుండీలో గడ్డి కూడ మొలవలేదు.
“ఏంటే ఇది? ఏమి రావటం లేదు?” అన్నాడు. “మరే 10 రోజుల్లో వస్తాయని వీడియోలో వుంది…ఈ పాటికి రావాలి.. ఏమైందో? వీడియోలో చెప్పినట్టే చేశాను” అంది.
“ఏం చెప్పారు?? ఏం పాతావు??” అన్నాడు కుతుహలంగా.
“బంగాళాదుంప + ఆపిల్ రెండూ కట్ చేసి ఒక పుల్ల గుచ్చి మట్టిలో పెడితే ఆపిల్ దుంపలు/ఆపిల్ పొటాటోలు పండుతాయి. ఇదిగో ఈ కుండీలో అది, ఈ పక్కన దాంట్లో టమాటో + పైనాపిల్,అంటే పైనాఆపిల్ టొమోటో పండుతాయి. అందరిలో ఎంత గర్వంగా ఉంటుంది? ఈ మూడో కుండీలో కాకరకాయ + ఉల్లిపాయ కలిపి పెట్టాను. ఉల్లి కాకరలు. ఇంక ఈ కాయలు గనుక కాస్తే కూరలో వేశాము అంటే వేరే ఉల్లిపాయలు వెయ్యక్కర లేదుట” ఇలా చెప్పుకుంటూ పోతూ పక్కన ఏదో పెద్ద శబ్దం అయితే పక్కకి చూసింది.
సురేష్ దబ్బున కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.
“అయ్యో, ఈయనకి మూర్ఛ రోగం ఉన్నట్టు పెళ్లికి ముందు ఎవరూ చెప్పలేదే?” అనుకోని కంగారుపడుతూ లోపలకి వెళ్ళి ఇన్ని నీళ్ళు మొహాన కొట్టింది.
సురేష్ లేచి కూర్చోగానే “ఇదిగో ఇంకా పూర్తిగా మన మొక్కలు చూపించనే లేదు” అని ఏదో చెప్పబోతుంటే సాష్టాంగ నమస్కారం పెట్టాడు సురేష్.
“ఛ, ఛ, ఇదేంటండీ?” అంది వెనక్కి జరుగుతూ. “నన్ను వదిలేయవే ఈసారికి” అని బావురుమన్నాడు. ‘ఏంటో పిచ్చి మాలోకం’ అని జాలి పడింది. ఒక వారం ఎలాంటి గండాలు లేకుండా గడిచాయి. భార్య ఫోన్ చూసింది అంటే దడ పట్టుకుంది సురేష్ కి.
ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో మార్పు కనిపించింది… ముందు ఏంటో అర్థం కాలేదు… కాసేపు కూర్చొని ఇల్లంతా మళ్ళీ మళ్ళీ చూసాడు. ఇంట్లో తలుపులు, కిటికీలు, బెడ్ రూమ్ లో మంచాలు, దిళ్ళు
అన్నీ కొత్తగా కనిపించాయి.
వెనక నుండి వచ్చి “ఇంట్లో ఏమైనా మార్పు కనిపిస్తోందా” అంది మురిపెంగా.
“ఏం చేసావు మళ్ళీ” అన్నాడు గుండె పట్టుకొని.
“నిన్న కొత్త వీడియో వచ్చిందండి. ఇంట్లో వున్న చీరలతో ఇలా ఇంటి స్వరూపం మార్చేయవచ్చు అని. చక్కగా అన్ని చీరలు చింపి ఇలా సోఫా కవర్లు, కర్టైన్స్, దిండు కవర్లు, దుప్పట్లు కుట్టేసాను” అంది.
“బానే వుంది కానీ…” అని దగ్గరకి వెళ్ళి చూస్తే గుండె గుభిల్లుమంది.
“ఇవి, ఈ కర్టైన్ నీ పెళ్ళి పట్టుచీర కదే? Rs.18,000/- పెట్టి కంచిపట్టు చీర కొన్నాము కదా… కొంపదీసి అదేనా ఇది” అన్నాడు భయం భయంగా…
“అరె, భలే గుర్తు పెట్టుకున్నారే!! చిలిపి… మొగాళ్ళకి చీరలు అస్సలు గుర్తు వుండవు అనేది మా అమ్మ. శుద్ధ అబద్దం అని చెప్పాలి మా అమ్మకి” అంది మురిసి పోతూ.
“అయినా రెండుసార్లు కట్టాను… అందరూ చూసేసారు, ఇంక ఎన్నిసార్లు కడతాను? చూడండి, ఎవరి ఇంట్లో అయినా కంచిపట్టు కర్టైన్స్ ఉన్నాయా?? అంది.
“మరి ఈ సోఫా కవర్లు?” అన్నాడు అనుమానంగా చూస్తూ.
“అవి…అవి అత్తగారు తన పెళ్ళి పట్టుచీర అని దాచారుగా, అయినా ఇంత అమాయకులేంటి బాబు మీ అమ్మ? ఇలా ఇన్నేసి సంవత్సరాలు అవే చీరలు కట్టుకుంటుంటే కొత్త చీరలు కొనేదెప్పుడు? కట్టేదెప్పుడు?? అందుకే దాంతో ఇలా కుషన్ కవర్లు కుట్టేసాను… అయినా అత్తగారు చెప్పినట్టు చీరకి 50 ఏళ్ళు దాటినా మెరుపు పోలేదు సుమండీ” అంది సంతోషంగా. తల్లిని తలుచుకుంటే గుండె బరువెక్కింది సురేష్ కు. తన పెళ్ళి పట్టుచీర ఇలా రూపాంతరం చెందింది అంటే తల్లి తట్టుకోగలదా? సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు.
“నీకు ఏం అన్యాయం చేశామని మా జీవితం ఇలా నాశనం చేస్తున్నావే? అయినా నీకు ‘ప్రమోదాక్షరి’ కాదు ‘ప్ర’మా’దాక్షరి’ అని పెట్టాల్సింది మీ వాళ్ళు” అని తల మీద బట్ట వేసుకొని ఏడవటం మొదలుపెట్టాడు.
“అయ్యో, అది మీ పెళ్ళి పట్టు పంచ… టేబుల్ క్లాత్ గా బాగుంటుంది అని కుట్టాను… మళ్ళీ మరకలు అంటుకుంటే…” అని అతని మొహం చూసి మధ్యలో ఆపేసింది ‘ప్రమోదాక్షరి’ కాదు కాదు ‘ప్ర’మా’దాక్షరి’.

* * *

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *