April 30, 2024

1. కొత్త కోడలు- తెలుగు కాపురం

రచన: కనకదుర్గ జొన్నలగడ్డ

“అక్కా, యు నో వాట్? శ్రీకర్ వాళ్ళ బామ్మా నీకు పులిహోర కలపడం వచ్చా అని అడిగింది?” అంటూ ఒకింత ఆశ్చర్యంగా, ఎగతాళిగా తన అక్కకు చెప్పింది త్రిష.
“అవునా? అయినా ఈ ఏజ్ లో ఆవిడకు పులిహోర కలపడం గురించి ఎందుకే? దట్ టూ విత్ యు! కొత్త కోడలివి. బామ్మ బాగా స్పోర్టివ్ అన్న మాట! ఆయితే రేపు మేము వచ్చినప్పుడు ఫుల్ మీ ఇంట్లో మాకు ఫుల్ ‘జబర్దస్త్’ షో అన్న మాట” అంటూ అవతలి నించి ఒక వెకిలి నవ్వు నవ్వింది త్రిష వాళ్ళ అక్క.
త్రిషకు, శ్రీకర్ కు పెళ్లై నాలుగు నెలలైంది. పెద్ద పండగకు శ్రీకర్ వాళ్ళ బామ్మగారి ఊరికి వచ్చారు. అందరూ ఊరికి రావాలని శ్రీకర్ వాళ్ళ తాతగారు చెప్పారని, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్న ఆయన కుటుంబం పిల్లా పాపలతో ఊరికి వచ్చేశారు. వారిలో రెండో కొడుకు కోడలు త్రిష.
‘కొత్త ఒక వింత, పాత ఒక రోత’ లాగా ఆధునికమంటే ఇప్పటి ట్రెండ్ పాటించటం, ముఖ్యంగా సనాతన పద్ధతులని తూలనాడక పోయినా, సంప్రదాయంగా వున్నా, అవి పాటించినా వారు పాత చింతకాయ పచ్చడి అన్న ధోరణి త్రిష వాళ్ళ కుటుంబానిది. ఇంట్లో పద్ధతులు, మాట్లాడే భాష కూడా ఎక్కువ ఇంగ్లీషే. వాళ్ళకి తెలుగు అంటే టి.వి.లో, రీల్స్ లో వచ్చేదే.
ఇక శ్రీకర్ విషయానికి వస్తే, ‘శంకరాభరణం’ సినిమాలో, ‘అబ్బాయి స్ఫూరద్రూపి, బుద్ధిమంతుడు’ అంటూ కాముడు గురించి శంకరశాస్త్రి స్నేహితుడి పాత్ర వేసిన అల్లురామలింగయ్య చెప్పినట్టు, మన శ్రీకర్ కాఫీ అలవాటు వున్నా, పొద్దున్నే చద్దన్నం తినగలడు. ఆధునికమైన భావాలు కలిగినా, సనాతన ధర్మానికి గౌరవం ఇస్తాడు. మన సంప్రదాయాలలో ఉన్న విశిష్టత తెలిసి మరీ పాటిస్తాడు. దానికి ముఖ్యకారణం వాళ్ళ తాతగారు.
సంస్కృతాంధ్రాలలో పండితులు ఆయన. ఆయన పిల్లలకు కూడా తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువ. అలాగే శ్రీకర్ తరంలో కూడా అందరూ తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలరు. అందరూ కలిస్తే చక్కని ఛలోక్తులతో, నవ్వులతో ఇల్లంతా గలగలలాడుతుంది. యూనివర్సిటీలో స్నేహం, ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది కాబట్టి త్రిష, శ్రీకర్ల ప్రేమలో భాషాభేదాలు రాలేదు. అయినా ప్రేమ అటువంటిది కదా! గుడ్డిదే కాదు, చెవిటిది కూడా! అందుకే పెళ్లికి ముందు త్రిష తెలుగు పాండిత్యం శ్రీకర్ కి తెలియదు.
పండుగకి రెండు రోజుల ముందే ఒకరు వెనకాల ఒకరు ఊరికి రావడం మొదలుపెట్టారు. త్రిష పుట్టింటివాళ్ళని కూడా ఆహ్వానించారు. త్రిష శ్రీకర్ వాళ్ళతో రెండు రోజులు ముందు వచ్చింది.
ఊరికి వచ్చిన మర్నాడు, అందరూ పెందరాడే భోజనాలు తిందామని మిగతవారు వంటకు ఏర్పాటును చేస్తున్నారు. తాతగారు మందులు వేసుకోవాలని కొత్త కోడలు త్రిషను తాతగారి కోసం ఉప్మా చేయమన్నారు.
ఉప్మా చేసి ప్లేట్ లో పెట్టి స్వయంగా త్రిషనే తెచ్చి ఇచ్చింది. తాతగారి పక్కనే త్రిష వాళ్ల మామగారు కూర్చుని వున్నారు. కొత్త కోడలు ఉప్మా చేసి తెచ్చిందని ఆయన “ఉప్మా ఎలా ఉంది నాన్నగారూ?” అని అడిగారు.
అప్పుడే ఒక స్పూన్ తిన్న ఆయన, “మా అమ్మగారు పరమపదించిన నాడు కూడా నేను ఇంత కంట తడి పెట్టలేదురా” అన్నారు. ఆ మాటలు విని తను చేసిన ఉప్మా తినగానే తాతగారికి వాళ్ళ అమ్మగారు గుర్తు వచ్చారని మురుసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది త్రిష.
“ఉప్మాలో మిర్చి, అల్లం ఎక్కువైందా అండి? తినగలుగుతారా?” అని అడిగిన కొడుకుకి, “ఫర్వాలేదులే” అని చెప్పారు ఆయన.
“రా బావా, రా” అంటూ గుమ్మంలో నించే బావగారిని ఆహ్వానిస్తూ “శ్రీకర్, మామయ్య వచ్చారు. కూర్చోపెట్టి కుర్చీ వేయండి” అని శ్రీకర్ వాళ్ళ నాన్నగారు అనగానే, “చాల్లెండి, అంత మర్యాద మా అన్నయ్యకి ఎందుకు? మీ చెల్లికి చేసుకోండి. మా అన్నయ్యకి కుర్చీ వేసి కూర్చోబెడితే చాలు” అంటూ వచ్చిన ఆడబడుచు కుటుంబాన్ని ఆహ్వానించింది శ్రీకర్ వాళ్ళ అమ్మ.
ముఖ్యమైన రోజు వాళ్ళ అమ్మా వాళ్ళు కూడా వచ్చారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. పొద్దున టిఫిన్ లు అయినాయి, రెండో విడత కాఫీలు జరుగుతున్నాయి. మగవాళ్ళు వసారాలో కూర్చుని, పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు భోజనాల ఏర్పాట్లలో ఉన్నారు. పెద్దవాళ్ళు వంట పర్యవేక్షణలో ఉంటే, చిన్నవాళ్ళు వడ్డన ఏర్పాట్లు చూస్తున్నారు. త్రిష వాళ్ళ అమ్మ కూడా ఆడవాళ్ళతో కూర్చుని ఉంది.
భోజనానికి కావలసిన అరిటాకులు తడిగుడ్డతో తుడుస్తున్నారు శ్రీకర్ వాళ్ళ చెల్లి కామాక్షి, బాబాయి కూతురు. త్రిష వాళ్ళతోనే కూర్చుని ఉంది. వాళ్ళమ్మ త్రిష పక్కన కూర్చొని ఉంది.
“వదినా, నీకు వంట వచ్చా?”
“వచ్చు. ఐ నో హౌ టు సెట్ కర్డ్స్” అనగానే ఆడపిల్లలిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వు కున్నారు.
“ఏమిటీ, భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నాయా? కానీయండి!
‘అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో’ అని అందరికీ అరిటాకులు సరిపోతాయి కదా” అంటూ అటు వైపుగా వెళ్తూ అనేసి వెళ్లిపోయారు శ్రీకర్ బాబాయి. కామాక్షికి, వాళ్ళ బాబాయి కూతురికి ఆయన అన్నది అర్థమై నవ్వారు కానీ, త్రిషకు, వాళ్ళ అమ్మకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!
టేబుల్స్ వరసగా వేసి, చక్కని అరిటాకులు పరచి అందరూ కూర్చుని ఉన్న తర్వాత వంకాయ కూరతో వడ్డన మొదలుపెట్టారు.
“ఆహా, వంకాయ వంటి కూర, పంకజముఖి సీత అని, వెరీ గుడ్.” అన్నారు శ్రీకర్ పెద్ద బాబాయి.
ఒక పదార్థము తరువాత ఒకటి వడ్డన తీరుగా సాగుతోంది.
“పులిహోర, పులిహోరండి” అంటూ వడ్డించడం మొదలుపెట్టగానే త్రిష, వాళ్ల అక్కా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వారు.
“చిత్రాన్నం! పులిహోర మహాప్రసాదం! నలభీములు సునాయసుముగా, అవలీలగా చేసిన వంటకం! ఈ రోజు కన్నా మర్నాటికి అద్భుతం అన్నారు కదా” అన్నాడు శ్రీకర్ వాళ్ళ బాబాయ్.
ఈలోగా మజ్జిగ పులుసు వడ్డనకు తీసుకుని వచ్చారు. “మతి లేని వారింట్లో మజ్జిగ పులుసని, మంచిగా అల్లం, మిర్చి వేశారా?” అంటూ మజ్జిగ పులుసు కలుపుకుని “అద్భుతం” అంటూ ఆస్వాదించాడు శ్రీకర్ వాళ్ళ అన్నయ్య.
మధ్యలో చక్కని పద్యాలు పాడారు. గడ్డ పెరుగుతో భోజనం ముగించి ‘భోజనానంతే భగవాన్ నామస్మరణ గోవిందా’ అంటూ అందరూ విస్తళ్ల ముందు నించి లేచారు.
అసలు ఈ మాటలు కానీ, ఈ భోజనాల పద్ధతి కానీ త్రిషకు చాలా కొత్తగా ఉంది.
ఆ రోజు సాయంత్రం కొత్త జంట తోట వైపు వెళ్తున్నప్పుడు శ్రీకర్ ని అదే అడిగింది. దానికి శ్రీకర్, “మా ఇంట్లో తెలుగు, తెలుగు పద్ధతులంటే అందరికీ చాలా ఇష్టం.” అన్నాడు.
“నిజానికి మామ్మగారు నన్ను పులిహోర కలపడం వచ్చా అని అడిగితే నేను చాలా షాక్ అయ్యాను. మా అక్కా, నేను చెబితే మనింట్లో ఫుల్ జబర్దస్త్ భాష మాట్లాడతాం అనుకున్నాము. కానీ మీరేమో ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు?” అన్న త్రిష ప్రశ్నకు
“భాష వస్తే భావం అర్థం అవుతుంది. టి.వి.లు రీల్స్ లో వినే భాష రోడ్డు మీద దొరికే చిరుతిండ్లు లాంటివి. రేపటి నించి పెద్ద బాలశిక్ష చదువమ్మాయి, పులిహోరంటే ఏమిటోనే కాదు, అమృతమంటే కూడా ఏమిటో తెలుస్తుంది” అన్న శ్రీకర్ మాటలు సీరియస్ గా తీసుకున్న త్రిష మూడు నెలల్లో ఛందస్సుతో పద్యాలు వ్రాయడం నేర్చింది.

* * *

1 thought on “1. కొత్త కోడలు- తెలుగు కాపురం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *