April 30, 2024

ఏడు పదుల ప్రేమ గోల

రచన: పావని pvls

“లక్ష్మీ! లక్ష్మీ! ఏమేవ్ లక్ష్మీ! ఎక్కడున్నావే? ఉన్నావా లేదా??” అంటూ గావు కేకలు పెడుతున్నాడు ప్రసాదరావు పడకగదిలో నుంచి గుక్క తిప్పుకోకుండా…
“అబ్బబ్బబ్బా! వంటింట్లో నా తిప్పలు నేను పడ్తుంటే ఏమిటండీ మీ అరుపులు? నేనేమైనా చిన్న పిల్లనా? మీరు పిలవగానే పరిగెత్తుకు రావటానికి. డెభ్భై యేళ్లు నిండాయి నాకు. ఊరికే లక్ష్మీ లక్ష్మీ అంటూ అరుస్తుంటారు” అంటూ కసిరింది వంటింట్లోంచి లక్ష్మి.
“ఓహో! నేనేమైనా బాలాకుమారుడినా? నీ పని మానుకుని వచ్చి నాతో ముచ్చట పెట్టమనటానికి? నాకూ ఎనభై దగ్గర పడ్డాయి! పిలుస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోవద్దూ, పని లేకుంటే పిలవను అని” అంటూ నిష్టూర్చాడు ప్రసాదరావు…
ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేసేసి ఒకరికి ఒకరు తోడుగా జీవనం గడుపుతున్నారు లక్ష్మీ ప్రసాదరావు దంపతులు…
అబ్బాయీ, కోడలు, మనవడు అమెరికాలో ఉంటారు. వారానికోసారి ఫోన్ చేస్తూ… నాలుగేళ్లకొకసారి వచ్చి పోతూ ఉంటారు. కూతురు వీళ్ళ ఊరికి కాస్త దగ్గరలోనే స్థిరపడింది తన భర్త పిల్లలతో. అప్పుడప్పుడు వీళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటుంది.
అబ్బో! అంటూ లక్ష్మి వంటింట్లో నుంచి ఏదో చెప్పేలోపు, “అక్కడ నుంచే మాట్లాడతావా ? ఏమి కావాలో కనీసం దగ్గరికి వచ్చి అయినా అడగవా అరుస్తుంటే” అని మళ్లీ నస మొదలెట్టాడు ప్రసాదరావు.
“అబ్బబ్బబ్బా! ముసలాడు నన్ను పని చేస్కొనివ్వడు” అంటూ తిట్టుకుంటూ పడకగదిలోకి వెళ్ళింది లక్ష్మి.
“ఏమిటండీ మీ అరుపులు? వంట చేస్కొనివ్వరా నన్ను? ఊరికే ఏదో ఒకటి కావాలి అని పిలుస్తుంటే వంట పని ఎప్పటికి అయ్యేనూ?మళ్లీ ఆకలి అని గోల పెట్టేదీ మీరే” భర్తని అంటూ కసిరింది లక్ష్మి.
“ఒక కూరా పప్పు ఇంత చారూ…అంతేగా… మహా గొప్ప అని… చిటికెలో చెయ్యచ్చులే… దానికే తెగ కిందా మీదా పడి పోతావే” అంటూ దెప్పసాగాడు భార్యని ప్రసాదరావు…
“అవునులెండి…మీరు అలానే చేశారుగా ఇన్నేళ్లనుంచీ… నేనంటే ఇప్పుడే వంట నేర్చుకున్నాను మరీ… ఏం చేస్తాం” అని మూతి విరుచుకుంటూ, “ఎందుకు పిలిచారో చెప్తారా నేను వంటింట్లోకి వెళ్లిపోయేదా?” అంటూ ఒక అరుపు అరిచింది లక్ష్మి…
“ఆగవే! కాసేపు ఇలా కూర్చో. నీతో ఒక విషయం చెప్పాలి” అన్నాడు ప్రసాదరావు.
“ఇప్పుడే బాలకుమారుడిని కాదు అని ముచ్చట్లకి కూర్చోమంటే, పొయ్యి మీద అన్నం కూరా ఏమి కానూ?” అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి…
“ముసలిదానికి పెళ్ళయ్యి ఇన్నేళ్ళు అయినా అసలు ఓపికే లేదు” అంటూ గొణగసాగాడు ప్రసాద రావు…”అబ్బో పెద్ద మీకేదో ఉన్నట్టు!” అని ఇవతల పక్క నుంచి లక్ష్మి మూతి విరుపుళ్ళు…
‘వయసు పెరిగినా దీనికి చెవులు బానే పని చేస్తున్నాయి’ అంటూ భార్యను కవ్వించసాగాడు ప్రసాదరావు.
“నా వినికిడి కంటే తమరిది మహా గొప్ప లెండి” అంటూ కసిరింది లక్ష్మి. ఇద్దరూ భోజనం చేసి పడకెక్క గానే ఏమిటో ఇందాక తెగ అరిచి గీ పెట్టారు? ఇప్పుడు చెప్పండి ఏమిటో ” అంటూ మాట కలిపింది భర్తతో.
“అరిచి గీ పెట్టానా? నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువయ్యిందిలే, ముసలాడిని అని గౌరవం లేకుండా పోయింది, అంతేలే. సంపాదన లేదుగా, ఇంకేం…అంటావ్! ఎన్నైనా అంటావ్” అంటూ మళ్ళీ నసగసాగాడు ప్రసాదరావు…
“ఆ! బాగుంది.ఇప్పుడు ఇన్ని మాటలు అని నన్ను బాధపెట్టాలనే కదూ అసలు మీ ఈ గోల… అంటారు, ఎన్నైనా అంటారు… ఇంక నాకూ ఓపిక తగ్గిందిగా, ఇంకేం ప్రేమ ఉంటుంది నా మీద మీకూ” అంటూ మూతి విరిచింది లక్ష్మి…
అంతే ఎడ మొహం పెడ మొహం వేసుకుని నిద్రపోయారు ఇద్దరూ…
తెల్లారగానే ఇంటి పనులు, వంట పనులు ముగించుకుని కూతురికి ఫోన్ చేసింది లక్ష్మి..
“అమ్మా! ఎలా ఉన్నావు? బాగున్నావా? నాన్న ఎలా ఉన్నారు?” అంటూ పలకరించింది కూతురు…
“ఏం చెప్పనమ్మా! ఈ మధ్య అన్నిటికీ గోల మొదలేడ్తున్నారు మీ నాన్న. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. కూర్చున్నా తప్పే, నిలుచున్నా తప్పే. ఏదో ఒకటి అనంది ఉండరే ఏ రోజూ… విసుగొస్తోంది ఈయన చాదస్తంతో” అంటూ చెప్పుకొచ్చింది తల్లి కూతురితో…
“ఇదేంటమ్మా ఈ వయసులో మీ గోల? మాలా ఉన్నారు అంటే ఏవో టెన్షన్లులే అనుకోవాలి గొడవలు పడటానికి. ఏం బాధలు ఉన్నాయనీ ఏం కష్టం వచ్చిందనీ మీ ఈ పోట్లాటలు?” అంటూ విసుక్కుంది కూతురు.
ఇలా రోజులు గడుస్తున్నా ఇద్దరిలో మార్పు లేదు…కీచులాటలు తగ్గలేదు…ఇలా కాదు అని కూతురు వచ్చి తల్లిని కొన్ని రోజులు తనతో ఉంచుకుంటాను అంటూ అడిగింది తండ్రిని.
“అబ్బా! తీసుకుపో… తెగ విసిగిస్తుంది నన్ను ఈ వయసులో. కొన్ని రోజులు ఏ కర్రీ పాయింట్ నుండో, మంచి హోటల్ నుండో కూరలు పప్పులు తెచ్చుకుంటానులే. ఏం పోయింది” అంటూ సమాధానం చెప్పాడు తండ్రి…
సరే అని తల్లిని తనతో తీసుకువెళ్ళింది కూతురు..
మొదటి 2-3 రోజులు లక్ష్మి-ప్రసాద రావు అసలు మాట్లాడుకోనే లేదు…
నాలుగు రోజులు గడిచాక భార్యకి ప్రసాదరావు ఫోను…”ఏమిటోయ్! ఇంకా నీ వెకేషన్ అవ్వలేదా?” అంటూ…
“తీస్కుపొమ్మని పంపారుగా ఏమిటో మీ బాధ?” అంటూ మొత్తుకుంది లక్ష్మి.
“బాధ ట బాధ… ఎలా మాట్లాడుతుంది చూడు” అని విసుగ్గా కోపంగా ఫోను పెట్టేశాడు ప్రసాదరావు..
ఇది జరిగిన గంటకి కూతురికి ఫోన్ చేసాడు.
“ఏమ్మా! ఎలా ఉన్నారు అందరూ ? మీ అమ్మ బాగుందా? ఏం చేస్తోంది రోజూ?” అంటూ…
“అమ్మ బానే ఉంది నాన్నా. ప్రతి పూటా మిమ్మల్ని తలవంది ఉండదుగా. ఏం చేస్తున్నా మీ నాన్న ఉంటే ఇలా అనే వారు. ఇది చేసే వారూ అంటూ ఒకటే చెప్తుంది మీ గురించి” అని చెప్పసాగింది కూతురు.
ఇంతలో ప్రసాదరావు “దానికి నేనంటే ప్రాణం తల్లీ, కానీ కాస్త కోపం అంతే. అయినా ఇంకా ఎన్ని రోజులు నేను ఈ ఉప్పు కారాలు సరిగ్గా లేని కర్రీ పాయింట్ కూరలు తినాలో ఏంటో. మీ అమ్మ ఉంటే కమ్మటి భోజనం తింటూ… అదీ ఇదీ అంటూ కాలక్షేపం అయిపోయేది” అని మొత్తుకున్నాడు కూతురితో ప్రసాదరావు. “సర్సర్లే! మీ అమ్మతో నేను నీతో ఇదంతా మాట్లాడినట్టు చెప్పకు” అంటూ ఫోన్ పెట్టేసాడు.
మర్నాడే తిరుగుటపాలా వచ్చేసింది లక్ష్మి తన కూతురి ఇంటి నుండి..
“అబ్బబ్బా! ఏంటి నాన్నా అసలు? మీరు ఇద్దరూ ఒక దగ్గర ఉంటే ఒక గోల. లేకుంటేనేమో ఇంకో రకం గోల. మిమ్మల్ని అడిగే కదా తీసుకెళ్ళాను? మళ్లీ ఈ గోల ఏంటి మీది? ఫోన్ ల మీద ఫోన్ లు చేసి రమ్మన్నారుట అమ్మని. బాగుంది మీ వరస” అంటూ మూతి విరిచి తన ఇంటికి వెళ్ళిపోయింది కూతురు.
ప్రసాదరావు ఫోను చేసింది ఒక్కసారి అయితే కూతురు ఇలా అన్నదేంటా అని మెల్లిగా భార్యను మంచి మాటలతో కదిలించాడు ప్రసాదరావు..
“ఏమిటోయ్! నేనెక్కడ చేశాను నీకు అన్నిసార్లు ఫోను? నువ్వు చెప్పావా దానికి? బానే ఉన్నావే!” అంటూ ఆరాలు మొదలెట్టాడు…
ఉలకదు..పలకదు..
“ఏమేవ్! నిన్న” అంటూ అరిచాడు…
“అబ్బబా! ఏంటి మీ నస? రాగానే మొదలయిందా” అంటూ కసిరింది..
“వార్ని! ఇదెక్కడి భాగోతం!”అంటూ పక్కకి వెళ్ళిపోయాడు ప్రసాదరావు..
మెల్లిగా పక్కకి వచ్చి కూర్చుంది లక్ష్మి.
“అసలేం సంత బాబూ! పొద్దున్నే లేవరు. లేచినా ఆ ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. కాస్త పెందలాడే లేచి నా మొహాన ఏ కాఫీ నీళ్ళో పోద్దామని కూడా లేదు మీ కూతురికి. టిఫిన్లు అయితే 10:30-11 గంటలకి తింటారు. ఇంక భోజనాల సంగతి సరే సరి. వండిన రోజు వండినంత.. లేదా అవేవో సిగ్గీలు, బిగ్గీలూ ఇంకా అదేదో టొమాటోలుట… ఇంటికి ఇంత కూడు పార్సెల్ తెచ్చి పారేస్తారుట, ఆ పిల్లలైతే ఇరవై నాలుగు గంటలు ఫోన్లలో ఆటలే. అమ్మమ్మ అని వచ్చి పలకరించే టైం లేదు వాళ్ళకి. ఏమైనా అంటే మాతో ఆ ఫోన్లో గేమ్ ఆడమంటారు. నాకేం వచ్చి చచ్చని, ఆ వెధవ తన్నుకు చచ్చే ఆటలు. అమ్మ బాబోయ్!నా వల్ల కాలేదు, నాలుగు రోజుల్లో ప్రాణం పోయినంత పని అయ్యింది. అందుకే మీరు ఫోన్లు చేశారని చెప్పి వచ్చేశా” అంటూ లేచింది.
“అదీ మరి! మొగుడిని కాదని పోతావా ఈ వయసులో కూతురి వెంట? బాగా అయ్యింది నీకు. నేను చూడు, ఎంత హాయిగా ఉన్నానో ఈ నాలుగు రోజులు” అంటూ నవ్వసాగాడు ప్రసాదరావు..
“అవునవును! మీ కూతురుతో మీరు మాట్లాడిన మీ కర్రీ పాయింటు గోల అంతా విన్నాను నేను కూడా. బాగానే తిన్నట్టు ఉన్నారు ఈ నాలుగు రోజుల్లో నాలుగు కిలోలు పెరిగేలా” అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది లక్ష్మి.
“ఉండండి ఒక అరగంటలో వంట చేసేస్తాను. మీకు నచ్చిన బెండకాయ కూర చేసి వేడివేడిగా అన్నం వడ్డించ్చేస్తాను. తిందురు” అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది లక్ష్మి..
“అవునే మరీ! నాకు నీ వంట తప్ప ఎవరిది అలవాటు? నచ్చటానికి. చెప్పు!” తిట్టినా నువ్వే! పెట్టినా నువ్వే మన పెళ్ళైన 54 ఏళ్లలో” అన్నాడు ప్రసాదరావు.
“మరి నాకో. మన పెళ్ళయ్యిననాటికి నాకు పదహారు. అన్నీ మీరే అని వచ్చేసాక మీరేగా నాకు మంచి జోడీ. మీ నస లేనిది నిద్ర కూడా పట్టలేదు ఈ నాలుగు రోజులు” అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మి…
వెళ్లిపోయిన కూతురు ఏదో చెప్పాలని వెనక్కి వచ్చేసరికి అమ్మానాన్న ముచ్చట్లు విని తెగ నవ్వుకుంది.
లోపలికి వచ్చి “అమ్మదొంగలూ! ఇదా మీకు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ. భార్యా భర్త అనుకునే ప్రతి మాటలోనూ , పడే ప్రతి గొడవలోనూ ఉండేది ప్రేమే కదూ.ఇది మీ ఇద్దరి అల్లరి గిల్లికజ్జాల ఆట అన్నమాట! మీ గొడవ నిజం ఏమో అని భయపడి నేను బలిపశువుని అయ్యానుగా” అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
ప్రేమించి పెళ్లి చేసుకుంటే నే కాదు. చిన్నప్పటి నుంచి ఇలా ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్న ప్రసాదరావు లక్ష్మిల ఏడు పదుల వయసులో అయినా వారి మధ్య ఉన్నది అదే ప్రేమ..
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, ఇలా ఎన్ని బంధాలు ఉన్నా ఆ వయసులో కూడా గిల్లికజ్జాలు పెట్టుకుంటూ గడిపే క్షణాలు అపురూపం. అందుకే ఒకరికి ఒకరు అని భార్యా-భర్తలను మాత్రమే అంటారు.
ఈ లక్ష్మీ ప్రసాద రావులాగే ఎన్నో ప్రేమ జంటలు మన చుట్టూ ఉంటారు.
చూసి సంబరపడటం మన అదృష్టమే కదూ!
మరి మీకు తెలిసిన వారివో, మీవో… జ్ఞాపకాలు తిరగేసి నవ్వుకోండి సరదాగా.

* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *