April 30, 2024

2. అయిందా పెళ్లి!

రచన: కర్రా నాగలక్ష్మి

ఇంకా జోరుగా పరుగెత్తాలి, బుసలు కొడుతూ వెంబడిస్తున్న నాగుపాముల బారిన పడకుండా తప్పించుకోవాలి, చెమటలు శిరస్సు నుంచి సిరిపాదం వరకు కారిపోతున్నాయి, అరవైయేళ్ల శరీరం పరుగెత్తేందుకు సహకరించటంలేదు, ఐనా పరుగెత్తాలి, పరుగెత్తుతూనే ఉన్నాను…
ఢిల్లీ నుంచి విశాఖ వెళ్లే ట్రైనులో ప్రయాణిస్తున్న సౌజన్య బండి కుదుపుకి ఉలిక్కిపడింది. మూసుకు పోతున్న కళ్లను బలవంతంగా విప్పి చూసింది. ఎసి సెకెండ్ క్లాసు పెట్టలో నైటు బల్బు నీలంగా వెలుగుతూ కనబడింది.
ఓహో కలలో పాములు వెంబడించాయా?, ‘అబ్బ! కలని నిజం అనుకొని ఎంతభయపడ్డానో! నయం బయటకి కేకలు పెట్టలేదు’ అనుకొని పక్కకి తిరిగి కళ్లుమూసుకొంది.
పక్కనే గట్టిగా పాము బుస వినిపించి దిగ్గున లేచి కూర్చుంది సౌజన్య.
ఎదురు బెర్తుమీద మూడు శాల్తీలు పొట్టని కిందకీ పైకీ లేపుతూ పాముల్లా బుసలు కొడుతున్నారు.
తుళ్లిపడి, ఆ గాబరా వల్ల నోట్లోంచి రాబోయిన తిట్టుని ఆపుకొని, మెల్లగా లేచి కూర్చుంది.
అయితే ఆ గళ్ల చొక్కా శాల్తీ. నిన్నటి నుంచి గడ్డం బాబాగారి యోగా గురించి చెప్పి చెప్పి మిగిలిన ఇద్దరినీ తన తోవలోకి తెచ్చేడన్నమాట. అందుకే తెల్లవారక ముందే ఈ బుసల కార్యక్రమం పెట్టేరు.
ఇలాంటి చిన్నచిన్న సంఘటనలతో నిద్ర పాడు చేసుకోడం ఇష్టంలేని సౌజన్య అటు తిరిగి నిద్ర పోయింది.
చాయ్… చాయ్… అనే కేకలతో తిరిగి నిద్రా భంగమైంది సౌజన్యకి.
ఐదు కూడా కాలేదు, లేవాలని అనిపించక ఇటు తిరిగి బుసలు వినిపించక పోవడంతో అరకన్ను విప్పి ఎదురు బెర్త్ వైపు చూసింది. ముసుగు తన్ని నిద్రపోతున్న బానబొజ్జ బాబాయి ని చూసి ‘కొత్త మోజు తీరిందా నాయనా! నన్ను భయపెట్టి బొజ్జున్నావు’ స్వగతంలో అనుకొంది. ‘గళ్మచొక్కా ఏంచేస్తున్నట్లో’ అనుకొంటూ పై బెర్తు వైపు దృష్టి సారించింది.
కాళ్లు చేతులూ మెలికలు పెట్టి అదేదో జంతువులా కూర్చొని ఉన్న గళ్లచొక్కాని చూసి ‘కదులుతున్న ట్రైనులో అదీ పై బర్త్ మీద వంకరటింకర ఆసనాలు అవసరమా?, అక్కడినుంచి పడితే…, ఒక్కరోజు ఆసనాలు మానెస్తే ఎవరైనా ఫైను కట్టమంటార్రా’ అనుకొంటూ లేచి బాత్రూం వైపు నడిచింది.
దబ్బుమన్న శబ్దానికి గబుక్కున వెనక్కి తిరిగిన సౌజన్యకి గళ్లచొక్కా శాల్తీ రెండు బెర్తుల మధ్య చేతులతో తల వెనుకభాగాన్ని రుద్దుకుంటూ, మెలికలు పడ్డ కాళ్లతో కనిపించేడు.
‘అయిందా పెళ్లి?’, మరి యోగా గురించి ఎవరికీ స్పీచ్ లు ఇవ్వకు’ అనాలని అనిపించింది.
పళ్లబిగువున బాధని దిగమింగుకుంటున్న గళ్లచొక్కాని చూస్తే కాస్త జాలి కూడా కలిగింది.
*****.
రైలు విజయవాడ దాటింది.
ఈ మధ్య తోటి ప్రయాణీకులతో సంభాషించాలి అంటే విసుగు అనిపిస్తోంది, ఎంతసేపు తను వాగడమే కాని ఎదుటి వారిని మాట్లాడనివ్వటం లేదు ఎవ్వరూ. స్వడబ్బావే తప్ప పరడబ్బా వినాలనే ఓపిక ఉండటం లేదు, మరి పరస్పర డబ్బాకి అవకాశమే లేదు. అందుకే ప్రయాణాలలో ఎదుటివారి భాష తనకు రానట్లుగా మౌనంగా ఉంటోంది సౌజన్య.
మెల్లగా గళ్లచొక్కా పై బెర్తు మీద నుంచి దిగి సైడు కిటికీ దగ్గర కూర్చున్నాడు, ఎదురు సీట్లో ముతకచీర కట్టుకొన్న పెద్దావిడ కూర్చొని ఉంది.
సెల్ లో కథ చదువుకుంటున్న సౌజన్య ఓ చెవి గళ్లచొక్కా మీద పడేసింది.
‘ఈమెకి కూడా యోగా మీద ఉపన్యాసం వినిపిస్తాడా? రేయ్ పాపం పెద్దావిడరా!, జాలితలచి వదిలేయరా!’
స్వగతంలో అనుకొంది.
సెల్ లో కథ పూర్తి చేసి ఎదుటి బెర్త్ వైపు చూసింది సౌజన్య.
పెద్దావిడ ముఖంలో విసుగు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
‘అయ్యో ఈ గళ్లచొక్కా విసిగించేసాడా? ఆమెని పాపం’ అనుకొంది సౌజన్య.
‘అది కాదమ్మా! మీలాంటి పెద్దవాళ్లు తప్పకుండా ప్రాణాయామం చేస్తూ, ప్రతీరోజూ మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడవాలమ్మా’ అంటున్నాడు.
‘మాకెందుకు సారూ అయినా నాతో ఏటి పరాచికాలు, నన్నొగ్గీ బావూ’.
‘పరాచికాలేంటండి, మీ ఆరోగ్యం మీ చేతులలో ఉండాలంటే నేను చెప్పినవన్నీ రోజూ చెయ్యాలి, గడిచిపోయిన వయసునొదిలెయ్యి, ఇకపై రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కొన్ని ఊపిరి పీల్చి వదలటం లాంటివి…’
మధ్యలోనే అడ్డుకొని ‘నాకు తెలుసయ్యా, కపాలభాతి అంటారని’
‘తెలుసు కాని కరెక్ట్ గా ఎలా చెయ్యాలో చూపిస్తాను తరువాత మీరు అలాగే చెయ్యండి, ఒకసారి కరెక్టగా చేస్తే తరువాత మీరు రోజూ ప్రాక్టీసు చేసుకోవచ్చు’ అంటూ ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా గబగబా గళ్లచొక్కా విప్పి పక్కన పడేసి పొట్టని పైకి కిందకి ఊపుతూ పెద్దగా బుసలు కొడుతూ గాలి పీల్చి వదులుతూ ‘చూడండి చూడండి పొట్ట ఇలా పైకీకిందకీ ఊగాలి’.
‘ఆపు బాబూ, సస్తన్నం నీ బాడీ సూడనేక, ఎవురో సన్నాసోడు సేసి మనకి సెప్పడం, పనీపాటా లేక ఒల్లు పెంచీసినోల్లు సేస్తే ఏటన్నా కరుగుతాదేమో, పొలం పనులు సేసేటోల్లమి మాకెందుకు ఇయన్నీ, రోజుకి మాము పొలంల పదికిలోమీటర్లకు పైగానడుత్తాం, మాకు వాకింకులేటి? మాకాడ టాకింగుకే సమయంనేదు.
ఏటి గుడ్లు మిటకరిస్తన్నావ్?, పొలంల పనంటాది సల్లబండెక్కి నాదేటనుకుంతన్నావా? పిల్ల సుకపడతాదని ఓ నాలుగెకరాలు కాలుకో సెయ్యకో ఉంటాదని ఉంచుకొని మిగతాది అమ్మి కర్సులెట్టి ఇంజనీర్ కిచ్చి పెల్లి సేసినాం…’
‘ఓ పెద్దమ్మా… మీ ఇంటి సంగతులొద్దమ్మా, నా పొట్టమీద దృష్టిపెట్టు, ఎలా కదులుతోందో చూడు’
‘సెస్ ఒల్లకోవయ్యా…, కాలుకో చెయ్యకో ఉంటాదని ఎట్టుకొన్న మడిసెక్క అమ్మనీకి పొతన్నా, ఎల్లుండి మా అల్లుడుగోరికి ఆపరేసను మరి, టెకెట్టు నేదంటే ఈ సల్లపెట్టెక్కినాను, ఆ రోజుకి మడిసెక్క అమ్మీసి సొమ్ములు ఒట్టుకెల్లాల, తిని తిన్నగుండక నా పాణానికి తెచ్చినాడు…’
గళ్లచొక్కా అడ్డుకోకపోతే ఇంకా ఏమనేదో, గళ్ల చొక్కాకి స్వడబ్బా మీదే దృష్టి పరడబ్బా వినే ఓపికే లేదు.
‘ఓ టెన్షనులో ఉన్నారా? అయితే మీరు తప్పకుండా కపాలభాతి చెయ్యలి…’.
‘సెస్ సెప్తంటే మడిసివి కావేటి? మాయల్లుడుగారు ఇనగే ఆ కల్లుమెచ్చే సన్నసోడి కాడ కోరుసు అని పీజు కట్టి మరీ ఎల్లేరు. ఆడంటే పిల్లపాపా లేని సన్నాసోడు, ఆడేటి సెప్పినాడో, ఈయనగోరు ఏటి ఇన్నారో మరి, ఆడు పొట్టని రుబ్బుపొత్రం నాగ తిప్పినాడంటా, ఈయనగోరు ఆడినాగ తిప్పినారంట, ఆపొట్టెల్లి ఈపుకి అంటుకు పోనాది. డాక్టరు కాడ కెల్తే ఆపరేసను చెయ్యాల, 5లచ్చలు కర్సు అవుతాదని సెప్పినారు. అరిజెంటుగా ఎల్లాలంటే ఇదిగో ఈ సల్లబండి ఎక్కీసి ఎల్తన్నాను. నా పాటికి నాను కూకుంతే నీ గోలతో నా పాణాలు తోడెత్తన్నావు, మల్ల నాకాడికొచ్చి యోగా గీగా అన్నావంతే మంచిమాట కాదు సెప్తన్నాను’.
పెద్దమ్మ ధాటికి గళ్ల చొక్కా షాకు తగిలిన కాకిలా ముడుచుకు పోయి పై బెర్త్ ఎక్కేసాడు.
గమ్యం చేరే వరకు పై నుంచి దిగలే గళ్లచొక్కా.
తెలుగు రానట్లుగా నటిస్తున్న సౌజన్య నవ్వుని పళ్ల బిగువున దాచలేక నిన్నటి ఆంగ్ల పత్రిక వెనకాల ముఖం దాచుకుంది.

***

1 thought on “2. అయిందా పెళ్లి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *