April 30, 2024

2. చాదస్తపు మొగుడు

రచన: కిరణ్మయి గోళ్ళమూడి

“లాస్యా! ఎక్కడ విహరిస్తున్నావ్! పాలు పొయ్యిమీద పెట్టి నిద్రపోవద్దు అంటే వినవేం?” కార్తీక్ అరుపుతో కళ్ళు తెరిచింది లాస్య!
“పాలు ఎవరు కాచారు?” కంగారుగా అడిగింది.
వంటగదిలోకి వెళ్లిన కార్తీక్ కి స్టవ్ పైన గిన్నె కనబడలేదు. పొయ్యి వెలగడం లేదు. వెనకనుండి లాస్య క్రీగంటి చూపులు గుచ్చుకుంటున్నాయి.
“గిన్నె మాడిన వాసన వస్తోంది!” నాలుక కరుచుకుని పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు.
“పొయ్యి వెలిగించకపోయినా పాలు పొంగుతాయా?” అంది అమాయకంగా.
“మనింట్లోనే అనుకున్నాను!” బెట్టుగా ఉంది స్వరం.
“ఎవరింట్లో గిన్నె మాడినా నన్నే కోప్పడతారా?” కొరకొరా చూస్తున్న లాస్యకు తన చూపులు దొరకకుండా పేపరు మరింతగా తెరిచాడు.
పేపర్ లాక్కుంటున్న లాస్యకు అందకుండా “వారంలో కనీసం ఏడురోజులు పాలు పొంగిస్తావు కదా!” కవ్విస్తున్న శ్రీవారిని వింతగా చూసింది.
“అలాగా! మరి మిగతారోజుల సంగతి?” తాపీగా అడిగింది.
‘అబ్బే! ఇంక లాభంలేదు!’ అనుకుంటూ పారిపోతున్న కార్తీక్ ని “వదిలేది లేదు” అంటూ వెంటపడింది.
పెళ్లి అయ్యి ఆరునెలలు మాత్రమే అయినా ఆరేళ్ల అనుభవం చవిచూసింది
లాస్య.
“మీ ఇంటిపేరు ఏమిటీ?” సీరియస్ గా అడుగుతున్న భర్తని ఎగాదిగా చూసింది.
“ఎమ్ అంటే ఏమిటి?” మరో ప్రశ్న బాణంలా.
“ఎమ్ అంటే మౌనం కూడా అంటావా?”
ఎలాగూ మాట్లాడనివ్వడని మౌనం వహించింది.
“మూతలేనివారు కదూ?” రెట్టిస్తున్న స్వరంతో కార్తీక్.
“దేవుడా!” బిక్కమొహం పెట్టింది.
“దేవుడు ఏమిచేస్తాడు? ఎన్నిసార్లు చెప్పాలి మూతలుపెట్టాలని! పాలగిన్నెకు మూతలేదు, నీళ్లబిందెపై మూతలేదు!”
“పాలు కాఫీ కలిపేందుకు ఇప్పుడే తీశాను! బిందెలో వేడినీళ్లు కాచాను… చల్లారుతాయని!” నసిగింది.
“అన్నిటికి సమాధానం రెడీగా ఉందన్న మాట!” వెక్కిరింత.
“సర్లెండి! ఎప్పుడూ ఉండేదేగా! ఉప్మా తిందురు రండి!”
“ఉప్మానా! ఎప్పుడు చేశావు? అసలు వాసనకూడా రాలేదు. పక్కింట్లో ఉప్మా చేస్తే ఇక్కడికి గుప్పునవస్తుంది. మనింట్లో చప్పుడుకూడ తెలియదు!”
“అలాగా! వెళ్ళి పక్కింటిముందు నిలబడండి. అప్పుడు మనింట్లోనుండి కమ్మటి ఉప్మా పరిమళం వస్తుంది!” ఉక్రోషంగా అంది లాస్య.
“సర్లే! ఎంత వెతుకుదామన్నా అల్లం ముక్క కనబడదు! దాచుకున్నావా పుట్టింటికి పంపేందుకు?” వెక్కిరింపు.
“చిన్నముక్క చాలుకదా అని!” చీదటం ఒక్కటే తక్కువ.
“అమ్మో! నీళ్లకుళాయి విప్పకు!” దూరంగా నిలబడ్డాడు కార్తీక్.
“రెండు రోజులు నీళ్లురావని చెప్పారు టీవీలో!” అమాయకంగా మొహంపెట్టింది.
జీడిపప్పు ఉప్మా కమ్మగా నోరూరిస్తోంది.
‘బాగుంది అని చెబితే ముత్యాలు రాలిపోతాయా!’ లాస్య ఆశగా చూస్తోంది.
“మరీ అంతలా చూడకు! బాగుంటే నేనే చెబుతాగా!” ఆమె ఆంతర్యం తెలిసినట్లు అంటుంటే అవాక్కయింది.
వంటింట్లో నిలబడి ఆలోచిస్తోంది. ఆ రోజు తేదీ గుర్తువచ్చింది. బామ్మ ఈ నెలలోనే కదా వచ్చేది. చిన్న ఆలోచన తళుక్కున మెరిసింది. పెదవులపై నవ్వు విరిసింది.
“ఏమిటీ? ఏవైనా పన్నాగాలు పన్నుతున్నావా?” అనుమానంగా అడుగుతున్న కార్తీక్ ని చూడగానే చిలిపి ఆలోచన.
“అబ్బే! మా బామ్మ గుర్తుకు వచ్చింది!” అంది నవ్వుతూ.
“బాబోయ్! ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది!” భుజాలు తడుముకున్నాడు.
“ఆవిడకు మీరంటే, మీ మాటలు అంటే బాగా ఇష్టం!” కవ్వింత కనబడకుండా అంది.
“పెళ్లిలో చూసానుగా! అమ్మో! మీ బామ్మ అసలు మామూలుగా లేదు!” భయం నటించకుండానే వచ్చేసింది.
“బామ్మ కాశీయాత్రకు వెళ్లేముందు వీలైతే మనదగ్గర వారం ఉండివెళ్తా అంది. ఈ నెలలోనేగా! అదే గుర్తువచ్చింది!” అంది కళ్ళలో చిలిపితనం కనబడనివ్వకుండా.
“ఓ! అలాగా!” గదిలోకి వెళ్లిపోయాడు పని ఉన్నట్లు, వెనకనుండి నవ్వుకుంటున్న లాస్యని పట్టించుకోకుండా.
వారం తర్వాత రైల్వే స్టేషన్ కి వెళ్లారు కార్తీక్, లాస్య.
తెల్లని గ్లాస్కోరవిక, మెత్తని గద్వాలచీర, జుత్తు వేలిముడి వేసుకుని, దబ్బపండు ఛాయలో హుందాగా ఉన్న బామ్మకు స్వాగతం పలికారు.
“ఏమిటే లాస్యమ్మా! చిక్కిపోయావూ!” దీర్ఘం తీసింది బామ్మ దిగుతూనే.
“ఏం అబ్బాయ్! మీ ఆవిడ తిండి సరిగ్గా తింటుందా? పట్టించుకుంటున్నావా? లేక నీ దారిన నువ్వు ఉంటున్నావా?” ఉరుము లేని పిడుగులా ఖంగుమంది ఆవిడ కంఠం.
“అబ్బే! అలాంటిది ఏమీలేదు బామ్మా! మరి మరి…!” కార్తీక్ నసుగుతున్నాడు.
“నేను బాగానే తింటున్నా బామ్మా! ఆరు నెలల తర్వాత చూస్తున్నావు కదా నీకు అలా అన్పిస్తుంది అంతే! తేడా ఏమీ లేదు!” అంటూ బామ్మ చెయ్యి అందుకుని ముందుకు నడిచింది.
లగేజీ మోస్తూ కార్తీక్ గింజుకుంటున్నాడు. ‘రాగానే రామబాణం వదిలింది’ అని అర్థం అయ్యాక గిలగిలలాడకుండా ఉంటాడా మరి.
ఉదయానే బ్రష్ చేసుకుంటూ వంటింట్లోకి తొంగిచూశాడు కార్తీక్. వంటగట్టు గబగబా శుభ్రం చేస్తోంది లాస్య.
“మళ్లీ పాలు పొంగబెట్టేసావా? ఎందుకంత పరధ్యానం?” విసురుగా రాబోతున్న గొంతు తమాయించుకున్నాడు.
“పాలు పొంగితే మంచిదేరా అబ్బాయ్! శుభసూచకం! గాబరాపడకు!” అంది బామ్మ ఇడ్లీముక్క నోట్లో వేసుకుంటూ.
“ఎప్పుడో ఒకసారయితే పర్లేదు బామ్మా! రోజూ ఇంతే!” కసి కనబడకుండా అన్నాడు.
“అయితే రోజూ సత్యనారాయణ స్వామి వ్రతమే అన్నమాట మీఇంట్లో!” అంది బామ్మ నవ్వుతూ.
“అదేంటి బామ్మా!” అన్నాడు.
“అదేనయ్యా! రోజూ మీఇంట్లో గృహ ప్రవేశం అవుతోంది అంటున్నాను!” అంది కొంటెగా బామ్మ.
“ఏం గృహప్రవేశం! బోలెడు పాలు నేల పాలు అవుతున్నాయి!” జుట్టులోకి వేళ్ళు పోనిచ్చాడు.
“గట్టిగాలాగకు! బట్టతల వస్తుంది!” అంది ఆవిడ నవ్వుతూ.
“హమ్మో! ఆవలించకుండానే లెక్కించగలదు!” ఉలిక్కిపడ్డాడు.
కార్తీక్ ఆఫీసుకెళ్లాక బోలెడు సమయం చిక్కింది ఇద్దరికి. ఆరునెలల సంగతులన్నీ పూసగుచ్చింది.
కార్తీక్ గడుసువాడు తప్ప చెడ్డవాడు కాదు… దుబారా చెయ్యడు, పొదుపు ఎక్కువ. అలా అని పిసినారి కాదు అని బామ్మకు అర్థం అయ్యింది. ఆ ‘చాదస్తపు మెలిక’ ఒకటి సరిచేస్తే సరి అనుకుంది బామ్మ.
దువ్వెనతో బామ్మ వీపుగీరుతూ ఆవిడ చెప్పే దాంపత్యపు చిట్కాలు అలకిస్తోంది లాస్య.
లాస్య ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.
“బామ్మ మందులచీటీ ఇచ్చిందిగా తీసుకు వచ్చారా?” అని అడుగుతున్న లాస్య మొహంలోకి కంగారుగా చూసాడు.
ఉదయం వెళ్ళేటప్పుడు గుమ్మంలో చీటీ ఇచ్చింది మరచిపోకుండా తెమ్మని. గుమ్మం దాటగానే మరచిపోయాడు.
వస్తూవస్తూ తెచ్చే మల్లెపూలదండ కూడా మరచిపోయాడు తొందరలో.
గబగబా బాత్రూంలో దూరి రెండు చెంబులు నీళ్లు పోసుకుని ఒళ్ళు తుడుచుకుంటూ బయటకువచ్చాడు ఆలోచిస్తూనే…!
రెండునిమిషాల తర్వాత లాస్య కేక వినబడుతోంది… ‘ఎవరో బాత్రూమ్ లో నల్లా ఆపలేదు… సెలయేరు చెరువుగా మారిందని’. గబుక్కున బాత్రూమ్ వైపు వెళ్ళాడు. అప్పటికే నల్లా ఆపేసి గుమ్మంలో లాస్య…!
“మీ ఇంటిపేరు ఏమిటి?” కొంటెగా అడుగుతున్న లాస్యవైపు అనుమానంగా చూశాడు.
టాబ్లెట్స్ కోసం బయటకు పరుగుపెట్టిన కార్తీక్ ని చూస్తూ ఇద్దరూ నవ్వుకున్నారు.
“లాస్యా! ఉప్పులో పప్పు లేదు!” కోపంగా అరిచాడు కంచం ముందు కూర్చుని.
“అవునా! నేను సరిగానే విన్నానా! బామ్మకు బీపీ ఉంది అందుకే తగ్గించి వేసాను. ఉప్పు ఎక్కువ తినకూడదుట… కోపం పెరుగుతుంది అని బామ్మ చెప్పింది. పక్కన ఆవకాయ ఉందిగా కలుపుకోండి సరిపోతుంది!” ముసిముసిగా నవ్వుతూ
చెప్పింది లాస్య.
తన తడబాటుకు మింగలేక కక్కలేక పళ్ళునూరుకుని ఆవకాయ అన్నంలో కలుపుకున్నాడు.
లాస్య రివర్స్ గేమ్ కి బామ్మ పెదాలపై చిరునవ్వు మెరిసింది.
వారంరోజులు ఇట్టే గడిచిపోయాయి.
బామ్మ వెళ్లే రోజు చీరె పెట్టి కాళ్లకు నమస్కరించారు దంపతులు.
“షడ్రుచుల సమ్మేళనంలా మీ కాపురంలో అన్ని రుచులు చవిచూడాలి. సంసారంలో సరిగమలు ఎప్పుడూ శ్రుతి దాటకుండా చూసుకోవాలి. అపుడపుడు వచ్చే ఒడిదుడుకులు జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒకరికి ఒకరుగా ఉండటమే జీవితం! మీ కొంటె కాపురం మూడుపువ్వులూ ఆరుకాయలుగా సాగాలి!” అంటూ ఆశీర్వదించింది బామ్మ.
“ఈసారి ఎక్కువ రోజులు ఉండేట్లు రావాలి బామ్మా!” మనస్ఫూర్తిగా అంటున్న కార్తిక్ ని మురిపెంగా చూసింది లాస్య.
స్వస్తి!

* * *

1 thought on “2. చాదస్తపు మొగుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *