April 27, 2024

ఆశ్రమం

రచన: YSR లక్ష్మి

రావి చెట్టు కింద బెంచ్ మీద విచారవదనంతో కూర్చున్న శాంతమ్మ దగ్గరకు రాధమ్మ వచ్చి “ఏమిటి శాంతమ్మా? ఒంటరిగా కూర్చొని ఏమి ఆలోచిస్తున్నావు?”అని అడిగింది.
దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి “ఈ బ్రతుక్కి ఒంటరిగా కాక ఇంకేమి మిగిలింది? ఆయన ఈ కష్టాలేమీ చూడకుండా మహరాజు లాగా వెళ్ళిపోయాడు. నేనేమో దిక్కులేనిదానిలా ఇక్కడ పడి ఉన్నాను. “అని అన్నది శాంతమ్మ.
“అదేమిటి శాంతమ్మా! అలా అంటావు. ఇక్కడ నీ చుట్టూ ఇంతమందిమి ఉన్నాము. మీ అబ్బాయి వారం పది రోజులకొకసారి వచ్చి చూసివెళుతూనే ఉన్నాడయ్యే. ఇంకేమి కావాలి. ”
“ఆ చూస్తున్నాడులే. నన్ను తీసుకు వచ్చి ఈ జైలులో పడేసి బ్రతికున్నానో, చచ్చానో అని వస్తాడు. “అని ఈసడింపుగా అంది.
అప్పుడు ఇంక ఏమి మాట్లాడినా శాంతమ్మ వినదని మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది రాధమ్మ.
*****.
అది ‘కస్తూరిబా వృధ్ధుల ఆశ్రమం’. అక్కడ శాంతమ్మ కంటే పెద్దవారు ఇంచుమించు అదే వయసు వారు 60 మంది వరకు ఉంటారు. కొంతమంది జంటలుగా మరికొంతమంది భార్యాభర్తలలో ఒకరు చనిపోయి మరొకరు ఒంటరిగా ఉంటారు. వారంతా పిల్లలకు దూరంగా ఉంటున్న వృధ్ధులు. కొందరు ఇష్టంగా, మరికొందరు అయిష్టంగా అసంతృప్తిtగా శాంతమ్మ లాగా ఉండే వారు ఉన్నారు. కాని వారి సంఖ్య చాలా తక్కువ.
పట్టణానికి దూరంగా పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆశ్రమం అది. చుట్టూ కాంపౌండ్ వాల్. దానిని ఆనుకొని వేప , రావి, మామిడి, జామ చెట్లు. గేట్లో నుంచి కాలి బాట కిరువైపులా రకరకాల మందారాలు, నంది వర్ధనాలు. కొంచెం ముందుకు వెళ్ళగానే కుడి వైపున ఆఫీసు. అది దాటితే వర్తులాకారంలో మూడు భవనాలున్నాయి. ముందు చిన్న వరండా, వెనుక రెండు రూములు వాటికి అటాచ్డ్ బాత్ రూము ఉన్నాయి. మధ్యలో అంతా పూలమొక్కలు, క్రోటన్ మొక్కలు ఒక క్రమ పధ్ధతి లో పెంచబడినాయి. బిల్డింగుకు వెనుక వంటశాల , భోజనశాల ఉన్నాయి. దానికి మూడు బిల్డింగుల నుంచి దారి ఉన్నది. వాటి ఎడమ వైపున చిన్న గ్రంధాలయం, దానిని ఆనుకొని సమావేశ మందిరం ఉన్నాయి. అక్కడ పనిచేసేవారు ఉండటానికి వెనుక ప్రహరీని ఆనుకొని షెడ్లు వేయబడి ఉన్నాయి. ఉదయం ఇడ్లీ, ఉప్మా, కిచిడీ 7. 30-8 గంటల మధ్యలో పెడతారు. 11-12మధ్య భోజనం, 4కి బిస్కట్లు, టీ, సాయంకాలం 7 గంటలకల్లా మరల భోజనం ఇలా ఒక క్రమపధ్ధతిలో ఉంటాయి. వెళ్ళగలిగినవారు భోజనశాలకు వెళ్ళి తింటారు. లేని వారికి వాళ్ళే రూముకి తీసుకొని వచ్చి పెడతారు. గ్రంధాలయంలో ఆధ్యాత్మిక, మత గ్రంధాలు మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి. రెండు తెలుగు, ఒక ఇంగ్లీషు పేపర్లు వస్తాయి. ప్రతి ఆదివారం ఉదయం డాక్టర్లు వచ్చి పరీక్షించి సలహాలు, సూచనలు చేస్తారు. సాయంకాలం ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. రోజూ వాకింగ్ చేయడమో , సమావేశ మందిరంలో రకరకాల చర్చలు చేయడమో మగవారు చేస్తే, ఆడవారు చెట్ల కింద కబుర్లతో కాలక్షేపం చేస్తారు. కదలడానికి ఓపిక లేనివారు రూముకే పరిమితమై టీవి చూస్తూ కాలం వెళ్ళదీస్తారు. మొత్తం మీద వాతావరణం గంభీరంగా ఉన్నా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆ ఆశ్రమం ఒక ఎన్. ఆర్. ఐ కట్టించింది. అతని పేరు రఘు. వాళ్ళ తల్లిదడ్రుల్ని తన దగ్గరకు వచ్చి ఉండమంటే వారు దేశం వదిలి రాననడంతో నగర ప్రముఖుడు, స్నేహితుడు అయిన బార్గవ్ సలహాతో ఈ ఆశ్రమ నిర్మాణానికి నడుము కట్టాడు. వారితో పాటు మరికొందరికి నిశ్చంతగా ఉండే నీడ కల్పించాడు. అక్కడ ఉండే వారి నుంచి నామ మాత్రపు రుసుము వసూలు చేస్తారు. నిర్వహణ బార్గవ చూసుకుంటాడు. ఆర్ధిక సహాయం రఘు చేస్తాడు. ప్రశాంతంగా జరుగుతోంది.
శాంతమ్మ కొద్దికాలం క్రితమే అక్కడ జేరింది. వచ్చిన దగ్గర నుంచి అందుకు కారణమైన కొడుకునీ, కోడల్నీ తిడుతూనే ఉంటుంది. తనకు ముగ్గురు పిల్లలు ఉంటే తాను అక్కడ ఉండాల్సిన ఖర్మ ఏమిటని? ఆమె ఆలోచన. అక్కడ ఉండే వారందరూ దిక్కులేని వారని ఆమె ఉధేశం.
ఆ రోజు ఆదివారం శాంతమ్మ కొడుకు ఆమెను చూడటానికి వచ్చాడు. కొడుకుని చూడగానే ముక్కు చీదుతూ ఏడుస్తూ తనని అక్కడ నుంచి తీసుకుపొమ్మని గొడవ మొదలుపెట్టింది. అతడు నచ్చ చెప్పబోయినా ససేమిరా వినటం లేదు. ఏమి చేయాలో తోచక నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు. దూరంగా అతన్ని చూసి రెండుమూడుసార్లు మాట్లాడి ఉండటంతో పలకరించడానికీ దగ్గరకు వచ్చి “బాగున్నావా బాబూ?”అన్నది.
అతడు కూడా ఆమెను కుశల ప్రశ్నలు వేసి “చూడండి పిన్ని గారూ! అమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళమని గొడవ చేస్తుంది. రమకి ఆరోగ్యం బాగుండటం లేదు. పరీక్షల కోసం రోజూ హాస్పటల్స్ చుట్టూ తిరగవలసి వస్తోంది. అందుకే ఈమెను ఇక్కడ పెట్టింది. ఇంట్లో ఉంచితే అన్నీ సమయానికి అమరాలి. కొంచెం కూడా సర్దుకుపోదు. మా పరిస్థితికి అది సాధ్యం కాకే ఉంచాను. మా చెల్లెళ్ళ దగ్గరకు పంపమంటుంది. వాళ్ళు తల్లి అని చూడటానికి కూడా రారు. పొరపాటున ఒక్కరోజు ఉంచుకోమని అడిగినా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు. నేనేమీ శాశ్వతంగా ఉండమనటం లేదు. తనకు తగ్గేవరకు ఉండమంటున్నాను. మీరే చెప్పండి? మీరు ఇక్కడ నాలుగు యేళ్ళుగా ఉంటున్నారు. సౌకర్యంగా లేకపోతే ఉండ్లేరుగా?”
“ఆమేం చెబుతుందిరా? వాళ్ళకు చూసే వాళ్ళు లేక ఇద్దరూ ఇక్కడ పడి ఉంటున్నారు. నువ్వుండగా నాకేమవసరం?” అంది శాంతమ్మ కోపంగా.
రాజు గతుక్కుమని రాధమ్మ వేపు చూసాడు. ఆమె నవ్వుతూ శాంతమ్మ చేయి చేతుల్లోకి తీసుకొని పక్కన కూర్చొని “మీరు పొరబడుతున్నారు. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్దవాడు అమెరికాలో, అమ్మాయి డిల్లీ లో, చిన్నవాడు టౌన్ లో ఉంటారు. పెద్దవాడు రెండు రోజులకొకసారి చేసినా, చిన్నవాడు, అమ్మాయి పొద్దున ఒకరు సాయంకాలం మరొకరు రోజూ ఫోన్ చేస్తారు. మేము ముగ్గురి దగ్గరా వారి పిల్లలు కొంచెం పెద్దయ్యే వరకు ఉన్నాము. పిల్లలు చదువులతో పెద్ద వాళ్ళు ఉద్యోగాలతో బిజీ అయ్యారు. మాతో గడిపే సమయం తగ్గిపోయింది. అలా అని వారి పనులు మానుకొని మాతో ఉండలేరుగా. వాళ్ళూ బాధ పడేవారు. చుట్టుపక్కల మా వయసు వారు లేరు. ఎవరి పని మీద వారు వెళితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఉండాల్సివచ్చేది. అప్పుడే మావారి స్నేహితుడు ఈ ఆశ్రమం గురించి చెప్పారు. పిల్లల్ని ఒప్పించి ముందు కొద్ది రోజులు చూద్దామనుకున్నాము. కాని ఇక్కడ ప్రశాంత పరిసరాలు, స్నేహపూరిత వాతావరణం నచ్చి ఉండిపోయాము. ఇప్పటికీ పిల్లలు ఫోన్ చేసినప్పుడల్లా రమ్మని గొడవ చేస్తూనే ఉంటారు. మనం టౌన్ లో ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలన్నా, ప్రవచనాలు వినాలన్నా ఎక్కడెక్కడకో వెళ్ళాలి. పిల్లల మీద ఆధారపడాలి. ఇక్కడ మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒకరికి కొంచెం ఆరోగ్యం బాగోకపోయినా తగ్గేవరకు ఎవరూ సరిగా నిదరపోరు. మనమేమీ ఇక్కడ కష్టపడటం లేదు కదా!పైగా కావలసినంత స్వేచ్చ. టి వి పెట్టుకుంటే పిల్లల చదువులు పాడవుతాయన్న భయం లేదు. వృధ్ధాశ్రమంలో ఉండటం చిన్నతనమో, తప్పో కాదు. మారుతున్న కాలపరిస్థితులకు అనుగుణంగా మనమూ, మన ఆలోచనా విధానమూ మారాలి. తల్లికి పిల్లలు బరువు కానట్లే పిల్లలకు తల్లిదండ్రులూ బరువు కాదు. వయసుతో పాటు మన మనసూ విశాలమవ్వాలి. ‘సర్వత్ర సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు ‘–అనేది గీతా బోధ. మన చుట్టూ మనతో స్నేహంగా మెలిగే వారంతా మనవారే అనుకుంటే నీ ప్రేమ నీ కొడుకు దగ్గరే ఆగిపోదు. అందరూ ఆత్మబంధువులు అవుతారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి వాళ్ళని యిబ్బంది పెట్టి, నువ్వు యిబ్బంది పడితే ప్రేమలు తరిగి అసహనాలు, అసంతృప్తులు పెరిగి మిగిలేది ద్వేషాలే!కొద్ది రోజులే అంటున్నాడుగా! ఉండు” అనునయంగా అంది రాధమ్మ.
శాంతమ్మ , రాధమ్మ మాటలకు కొంచెం ఆలోచనలో పడి”సరే లేరా! కొద్దిరోజులే అంటున్నావుగా ఉంటానులే. ఇక్కడ అందరూ బాగానే ఉంటారు. మన పల్లెటూళ్ళో ఉన్నట్లు ఉంటుంది. రమకు తగ్గగానే వచ్చి తీసుకొని వెళ్ళు. “అంది.
రాజు కృతజ్ఞతాపూర్వకంగా చెమర్చిన కళ్ళతో రాధమ్మ వంక చూసాడు.

*********.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *