May 17, 2024

అర్చన 2020 – భర్తని మార్చాలి!

రచన: జొన్నలగడ్డ రామలక్ష్మి

మహిళలపై అత్యాచారం పెళ్లితో మొదలౌతుందని మా పనిమనిషి జ్యోతి పదేపదే అనేది. అది నిజమని స్పష్టమైనా, ఆర్థికంగా జ్యోతి స్థాయిలో ఉన్న ఆడవారికే అది పరిమితమనుకున్నాను. నాకూ ఆ మాట వర్తిస్తుందని, నా పెళ్లయ్యేక తెలిసింది.
సంప్రదాయపు సంకెళ్ల కారణంగా, జ్యోతితో పోల్చితే నా సమస్య మరింత దుర్భరం. ఆమెకు లభించే పాటి సానుభూతి కూడా నాకు దొరకదు.
‘భర్తకి అవలక్షణాలుంటే అది అసహజమేం కాదు. అలాంటి భర్తని నిరసించే భార్య కులట. మార్చగలిగితే కులసతి’ – చిన్నప్పట్నించీ ఇంటా బయటా మన సంప్రదాయానికి సంబంధించిన ఈ ప్రవచనాన్ని ఎన్నో మార్లు విన్నాను.
నేను అదే ప్రవచనాన్ని అక్షరాలా పాటించాల్సిన అగత్యం వచ్చినప్పుడు నా భర్త నన్ను కులట అన్నాడు. కానీ నేను మాత్రం కులసతిననే అనుకున్నాను. జరిగింది వింటే నేనన్నుకున్నదే నిజమని మీకూ అర్థమౌతుంది.
అసలేం జరిగిందంటే….
– – – – –
“ఈ రోజు ఆఫీసుకెళ్లరా?” అడిగాను శ్రీకాంత్ని. తెలియక కాదు. ఏం చెబుతాడోనని!
ఆఫీసునిండా అప్పులు. అవి తీర్చే దారి లేదు. అక్కడి కొలీగ్సంతా కలిసి అతణ్ణి ఆఫీసు గుమ్మం బైట కూర్చోబెడతామని బెదిరించారు.
“వెళ్లడం లేదు. రఘుపతి కోసం ఎదురు చూస్తున్నాను” అన్నాడు శ్రీకాంత్.
ఎంత తాపీగా అన్నాడు? నాకు మాత్రం రఘుపతి పేరు వినగానే గుండెల్లో అలజడి. వళ్లంతా కంపరం….
– – – – –
శ్రీకాంత్ తాగుడికి బానిస. జీతమంతా దానికే పోతుంది. అప్పులు చేస్తాడు. అవీ దానికే! ఇక నన్ను పుట్టింట్నించి తెమ్మంటాడు. మావాళ్లేమో ఉన్నవాళ్లు కాదు. కట్నం వద్దన్నాడని మురిసిపోయి కూడా గుళ్లోనే తూతూమంత్రం పెళ్లి చేశారు. వాళ్లనెలా అడిగేది?
అసలు తనే పెళ్లి చేసుకుంటానంటూ నా వెంటబడ్డాడు.
అందగాడు. యువకుడు. ఐతే నేను మాత్రం – “వరకట్నం దురాచారం. పెళ్లికి కట్నం తీసుకోకూడదని నా ఆదర్శం” అన్న అతడి మాటలకి పడిపోయాను. కుర్రాడిది మా కులమే కాబట్టి మావాళ్లూ ఓకే అన్నారు.
పెళ్లయ్యేక ఇదీ వరస. కట్నం విషయంలో తన ఆదర్శం గుర్తు చేస్తే – ఏమాత్రం తడబడకుండా, “పెళ్లికి కట్నం తీసుకోకూడదని నా ఆదర్శం. పెళ్లయ్యేక తీసుకుంటే అది కట్నం కాదని నా నమ్మకం” అనేశాడు.
“మందాతురాణాం నభయం నలజ్జా” అనుకున్నాను కానీ ఆ ‘నభయం నలజ్జా’ ఎంతవరకూ వెళ్లొచ్చో అప్పుడూహించలేకపోయాను.
తనవల్ల ఇల్లు గడవదు. పుట్టింటికి పోదామంటే ఇప్పటికే మావాళ్ల గుండెలమీద ఇంకో రెండు కుంపట్లున్నాయి. పెళ్లయిన నేనక్కడ చేరితే, ముగ్గురం కలిసి కుంపట్లని గాడిపొయ్యి చేస్తాం. ఇక్కడేఉండి ఉద్యోగం చేద్దామంటే, ఇంటర్ ప్యాసైన నాకు ఉద్యోగమెవరిస్తారు? వచ్చినా జీతం ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లన్నట్లుంటుంది. వేణ్ణీళ్లు ఇల్లు చేరకపోతే, ఇంట్లో వెచ్చదనానికి పనికొచ్చేవి కన్నీళ్లు మాత్రమే!
“మా రఘుపతి నీకు నెలకి పదిహేను వేల ఉద్యోగమిస్తాట్ట.. ఏటా వెయ్యి ఇంక్రిమెంటు. బోనసుంటుంది” అన్నాడు శ్రీకాంత్ ఓ రోజున.
పెళ్లయిన కొత్తలో ఆ రఘుపతి మా ఇంటికి రెండుమూడు సార్లొచ్చాడు. శ్రీకాంత్కి ప్రాణస్నేహితుణ్ణన్నాడు. ఆర్థికంగా హోదాలో అంత తేడా ఉన్నా, అలాగన్నందుకు అతడిపై నాకు గౌరవాభిప్రాయం కలిగింది. “వాళ్లనీ వీళ్లనీ అడగడమెందుకు? ఆ చేసే అప్పేదో రఘుపతి దగ్గరే చెయ్యొచ్చుగా?” అన్నానోసారి.
“వాడు నాకు చాలా దగ్గరే. అసలీ మందలవాటు వాడే చేశాడు నాకు. ఇప్పటికీ ఖరీదైన మందు పార్టీలకి నేనుండి తీరాలంటాడు. అప్పిస్తే స్నేహం చెడుతుందనీ, స్నేహితులు కానివాళ్లకే అప్పులివ్వాలనీ వాడి నాన్న సిద్ధాంతం. ఆయన వద్ద అప్పు చేసి, కొందరు రోడ్డున పడ్డారు. కొందరు జైళ్లకెళ్లారు. ‘శ్రీకాంత్ మంచి కుర్రాడు. అప్పివ్వకుండా జీవితాంతం మీ స్నేహాన్ని కాపాడుకో’ అన్నాట్ట ఆయన” అన్నాడతడు.
‘ముందరి కాళ్లకు బంధమంటే ఇదే! ఎక్కడైనా బావ కానీ, వంగతోట వద్ద కాదు’ అనుకున్నాను. శ్రీకాంత్ కిచ్చిన అప్పు తిరిగి రాదని – ప్రాణస్నేహితుడైన రఘుపతికి తెలియదా?
ఓసారి శ్రీకాంత్ ఫోన్ చేస్తే రఘుపతి తనే స్వయంగా మా ఇంటికొచ్చాడు. అప్పుడు శ్రీకాంత్ ఇంట్లో లేడు.
“మామూలుగా ఐతే నీ అర్హతలకి దొరికేది ఏ బట్టల షాపులోనో సేల్స్గర్ల్ ఉద్యోగం. రోజంతా, విసిగించే కస్టమర్లతో కూడా చిరునవ్వుతో వ్యవహరించాలి. అందుకు వాళ్లిచ్చే జీతం ఐదారు వేలు” అన్నాడు ఉపోద్ఘాతంగా. అది నిజమని తెలిసినా, ఆ జీతానికే తలొగ్గినవాళ్లు చాలామందే ఉన్నారని ఏ షాపుకెళ్లినా తెలుస్తుంది.
“మాకో గెస్ట్ హౌసుంది. వ్యాపారం పనులమీద గొప్పగొప్ప వాళ్లక్కడ బస చేస్తూంటారు. నీకక్కడ రిసెప్షనిస్టు జాబిస్తాను. శ్రముండదు. అందం నీకు దేవుడిచ్చిన వరం. ఆ అందానికి తగ్గ డ్రెస్సులు, మేకప్పు ఖర్చు మాది. వెళ్లి కుర్చీలో కూర్చుని వచ్చినవాళ్ల మర్యాదకు లోటు రాకుండా ఏర్పాట్లు చూడాలి. టిప్పులూ, ఇంక్రిమెంట్లూ, బోనసులూ నీ సేవల్ని బట్టి వేలల్లో కూడా ఉండొచ్చు” అన్నాడు రఘుపతి.
“సేవలంటే?” అనడిగాను.
“మామూలు సేవలే. ఎటొచ్చీ సంప్రదాయం, ఆచారం అంటూ మడి కట్టుకోకూడదు” అన్నాడతడు.
అర్థమైంది నాకు. ఉద్యోగం వద్దని మర్యాదగా చెప్పేశాను. వెంటనే అతడు, “వద్దంటావని నేనూ అనుకున్నా. కానీ నువ్వొప్పుకుంటావని మా శ్రీకాంత్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ముందుగా రెణ్ణెళ్ల జీతం అడ్వాన్సుగా నీకిచ్చి వెళ్లమన్నాడు. ఇస్తానని మాటిచ్చాను. కాబట్టి ఇస్తాను” అంటూ ముప్పై వేలు ఎదుట టీపాయి మీద పెట్టాడు.
తీసుకోకపోతే తర్వాత శ్రీకాంత్ పెద్ద రభసే చేస్తాడు. కానీ తీసుకునేముందు రఘుపతికి క్లారిటీ ఇవ్వాలని, “ఇది నా ఉద్యోగానికి అడ్వాన్సు కాదు. శ్రీకాంత్కి అప్పనుకుని తీసుకుంటాను” అన్నాను.
“నీకు శ్రీకాంత్ చెప్పలేదేమో, స్నేహితులకి నేను అప్పివ్వను. స్నేహితుడి భార్యవి కాబట్టి, నీకిస్తాను. నెల్లాళ్లలో తీర్చెయ్యడం పూర్తిగా నీ బాధ్యత. నీకైనా ఎందుకిచ్చానంటే, ఆడవాళ్లనుంచి ఆ విలువ రాబట్టే అవకాశముంటుందని!” అని తనూ క్లారిటీ ఇచ్చాడతడు.
‘నభయం న లజ్జా’ శ్రీకాంత్ ట్రేడ్ మార్క్. రఘుపతి అతడికి ప్రాణమిత్రుడు. అలాగనడం అతడికి సహజం.
నా భర్త కారణంగా నా హోదా ఏ స్థితికి దిగజారిందో అర్థమైంది. ఈ విషయం చెబితేనైనా, శ్రీకాంత్లో మార్పు రావచ్చన్న ఆశతో డబ్బు తీసుకున్నాను. రఘుపతి థాంక్స్ చెప్పి వెడితే, నా చర్య అతడికే సంకేతాన్నిచ్చిందో స్ఫురించి సిగ్గుతో సగం వళ్లు చచ్చిపోయింది.
ఆ రాత్రి శ్రీకాంత్కి జరిగింది చెప్పాను. ఆవేశంతో ఊగిపోతాడనుకుంటే, “డబ్బు తీసుకున్నందుకు థాంక్స్” అన్నాడు.
“డబ్బు వెనక్కిచ్చెయ్యమంటావనుకున్నాను. ఎందుకంటే ఇది ఉద్యోగానికి అడ్వాన్సు కాదు. నెల్లాళ్లలో తీర్చాల్సిన అప్పు. మనమెలాగూ తీర్చలేం. అప్పుడు నేను మాయాద్యూతంలో ఓడిన ద్రౌపది నౌతాను” అన్నాను.
“ఎన్నో శతాబ్దాల తర్వాత కూడా ద్రౌపదిని పతివ్రతగా, కులసతిగా కీర్తిస్తున్నారు. పతి మాటపై కానీ, పతి ఆనతిమీద కానీ సతి ఏంచేసినా ఘనకార్యమే ఔతుంది” అన్నాడు శ్రీకాంత్.
పురాణకథల పరమార్థం తెలియనివాడేం కాదు. వక్రీకరించడంలో సమర్థుడు, అంతే!
“ఈ డబ్బు వెనక్కిచ్చే బాధ్యత మీది. నేను మళ్లీ ఆ రఘుపతింటికి వెళ్లను. అతడి మొహం చూడను” అన్నాను.
“డబ్బు వెనక్కివ్వకపోతే, ఇచ్చిన హామీ నెరెవేర్చే బాధ్యత నాది. ఐనా అతణ్ణి చూణ్ణంటే ఎలా డార్లింగ్! జీవితంలో నా మొదటి భార్య మందు. మొదటి భార్య నాకు భారం కాకూడదంటే, ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమని మిత్రులు సలహా ఇచ్చారు. వాళ్ల భరోసాతోనే నేను పెళ్లికి సిద్ధపడ్డాను. వాళ్ల సిఫారసుతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను” అని బాంబు పేల్చాడు శ్రీకాంత్.
ఇది నాకు న్యూస్. “వాళ్లు అంటే?” అన్నాను తెల్లబోయి.
“మొత్తం ఐదుగురు. రఘుపతి వాళ్లలో ఒకడు. వాడిలాగే వాళ్లంతా సౌండ్ పార్టీలు”
భర్త మాటలకు సిగ్గుతో వళ్లంతా చచ్చిపోయిన ఆడదాన్ని చరిత్రలో నేను మాత్రమేనేమో! “అంటే, నన్ను కులటను కమ్మంటున్నారా? ఐతే నేను మిమ్మల్ని వదిలేసి పోవాలి” అన్నాను ఉక్రోషంలోంచి పుట్టిన కోపంతో.
“నువ్వు కులటవు కాదు. కులసతివి. ఐనా నీకు తెలీదా? కళాశాలల్లో, కళారంగంలో, పత్రికాలోకంలో, ఉద్యోగాల్లో – ఆడవాళ్లకు వేధింపులు, వాళ్లపై అక్రమ సంబంధాల పుకార్లు – మామూలే. వాళ్లేమన్నా ఆయా రంగాలు వదిలి వెడుతున్నారా? నీకేమయింది? నీమీద ఏ విధమైన పుకార్లూ రాకుండా చూసే బాధ్యత నాది” అన్నాడు శ్రీకాంత్.
పూర్తిగా అర్థమైంది. ‘నాతి చరామి’ అన్న శపథంతో నన్ను భార్యగా స్వీకరించిన శ్రీకాంత్, ఎవరెవరో నన్ను స్వంతం చేసుకుందుకు తనే సహకరిస్తాడు. ఇక నేనేం చెయ్యాలి?
“మీరు చెప్పిన ఆడవాళ్లు ప్రతిభావంతులు. సాహసవంతులు. ఎన్నుకున్న రంగాల్లో రాణించాలన్న పట్టుదలతో, సంప్రదాయాలకి ఎదురీదుతూ పోరాడుతున్నారు. వారికి నా జోహార్లు. నాకా శక్తి లేదు. నేను సామాన్య గృహిణిగానే ఉంటాను” నిక్కచ్చిగా చెప్పాను.
“ఏమో, అదంతా నాకు తెలియదు. రఘుపతి నీకు అప్పిచ్చాడు. ఎలా తీరుస్తావో, అది నీ ఇష్టం” అని ఊరుకున్నాడతడు.
ఆ క్షణంలో అలా అన్నప్పటికీ, తర్వాత వివేకం మేల్కొని తనలో మార్పొస్తుందని ఆశ పడ్డాను. కానీ క్షణాలు గంటలై, గంటలు రోజులై, రోజులు వారాలై, రఘుపతి ఇచ్చిన గడువు తేదీ దగ్గర పడింది.
నాలో భయం, అసహ్యం, ఉద్వేగం, అసహాయత – అన్నీ కలగలిసి వేధిస్తున్నాయి. ఏదేమైతే అయిందని పుట్టింటికి వెళ్లిపోవాలనుకుని వాళ్లెలాగున్నారోనని ఫోన్ చేస్తే అమ్మ తీసింది. నేను మాట్లాడేలోగానే అమ్మ, “నీకు ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నామమ్మా! నాన్నకి హార్టెటాక్ వచ్చింది. బైపాస్ చెయ్యాలన్నారు. లక్షలు కావాలి. ఎక్కణ్ణించి తెస్తాం? చేతులెత్తేసి దేవుడిమీద భారమేస్తే, ఆ దేవుడే పంపినట్లు వచ్చాడమ్మా సుకుమార్! ఈ రోజే ఆపరేషన్” అంది.
సుకుమార్ పేరు విని ఉలిక్కిపడ్డాను.
యువకుడు. భాగ్యవంతుడు. మగాడికి అందమేమిటీ అనుకోగలిగితే మరీ కురూపి కూడా కాదు. మాది మధ్యతరగతికి కాస్త దిగువనున్న కుటుంబమని తెలిసీ అతడు నన్ను ప్రేమించాడు. డబ్బుని మించిన అగ్రకులమేముంటుందని తెలిసినా, జన్మతః మా కులంకంటే తక్కువ వాడన్న మూర్ఖత్వానికి లోబడి మావాళ్లొద్దన్నారు.
“నువ్వు ప్రేమించినవాడికంటే నిన్ను ప్రేమించినవాణ్ణి పెళ్లి చేసుకుంటే జీవితంలో సుఖపడతావు” అని సుకుమార్ నాకు పదే పదే చెప్పాడు. కానీ శ్రీకాంత్ రూపానికీ, కట్నం వద్దనే ఆదర్శానికీ పడిపోయి అతణ్ణి కాదన్నాను. శ్రీకాంత్ నేపథ్యం గురించి పుకార్లు వినిపిస్తే, ‘మంచివాడైతే సుఖంగా ఉంటాను. చెడ్డవాడైతే మార్చుకుని సుఖపడతాను. ప్రేమకు అసాధ్యం లేదు’ -” అని సంప్రదాయాన్ని స్మరించుకున్నాను.
“నీది ప్రేమ కాదు. ప్రేమంటే నాది. నువ్వు నాకు దక్కకపోయినా, ఎల్లప్పుడూ నీ క్షేమం కోరుకుంటాను. ఎప్పుడైనా అవసరమనిపిస్తే, నన్ను కలుసుకుందుకు వెనుకాడకు. నా ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడూ తెరచే ఉంటాయి” అన్నాడు సుకుమార్.
సుకుమార్కి మా నాన్న ఏమీ కాడు. ఆయనకి లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించాడు. కేవలం నాకోసం! ప్రేమంటే అదేనా?
ఇప్పటి నా పరిస్థితి తెలిస్తే ఏమంటాడో తెలుసుకుందుకు అమ్మనడిగి అతడి నంబరు తీసుకుని ఫోన్ చేశాను. నేను మాట్లాడేలోగానే, “నీ ప్రస్తుత పరిస్థితులు చెప్పాలనుకుంటే వినే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు” అన్నాడు సుకుమార్.
“ఏం తెలుసు? ఎలా తెలుసు?” అన్నాను ఆశ్చర్యంగా. కానీ నా పరిస్థితి చెప్పకుండా ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు.
“అదే ప్రేమంటే?” అన్నాడతడు. నేను ఏం చెప్పాలని అతడనుకుంటున్నాడో నా కర్థమైంది.
– – – – –
“రఘుపతి రాడు. నేనీరోజు మా ఊరెడుతున్నానని కాసేపటి క్రితమే ఫోన్ చేసి చెప్పాను” అన్నాను.
“వాడంత సులువుగా ఒప్పుకోడే?” అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా.
“మా నాన్నకి బైపాస్ సర్జరీ ఉంది. పక్కనుండాలని చెబితే సరేనన్నాడు” అన్నాను.
“బైపాసంటే లక్షలు కావాలి. నాకివ్వడానికి లేదు కానీ, మీ నాన్నకంత డబ్బెక్కడిది?” కోపంకంటే కుతూహలమే ఎక్కువుందా గొంతులో.
“ఆయన వద్ద డబ్బు లేదు. మన పెళ్లికిముందు నన్ను ప్రేమించిన సుకుమార్ ఇస్తానన్నాడు. ఎటొచ్చీ నాకైతేనే ఇస్తాట్ట. నేను వెళ్లాలి” అన్నాను.
నేను సుకుమార్ని కాదని తనని చేసుకున్న విషయం శ్రీకాంత్కి తెలుసు. అందుకని సుకుమార్ ఎవ్వరని అడగలేదు. కానీ కోపంతో అతడి కళ్లు ఎర్రబడ్డాయి. “తండ్రికి వైద్యంకోసం వాడి దగ్గరకు పోతావా – కులటా!” అన్నాడు.
“నా అభిప్రాయంలో నేనెప్పుడూ కులటను కాను, కాలేను. కానీ మీరు కూడా నన్ను కులట కాదు, కులసతి అనుకునే ఉపాయమొకటి చెబుతాను” అన్నాను తాపీగా.
“ఏమిటది?” అప్రయత్నంగా అడిగేడతడు.
“ఆ లక్షలు మీరివ్వండి. అంత డబ్బు లేదనుకుంటే, సుకుమార్ని కలుసుకుందుకు నాకు అనుమతి ఇవ్వండి. నేను కులసతిని అనిపించుకోవడమే కాదు, మా నాన్న ప్రాణాలు కాపాడిన పుణ్యం మీకు బోనస్” అన్నాను.
అతడి స్పందనతో నాకు నిమిత్తం లేదు. ఇంకా చెప్పాలంటే లోకం స్పందనతో కూడా నాకు నిమిత్తం లేదు.
“భర్త చెడ్డవాడైతే అతణ్ణి మార్చాలి” అని భార్యకిచ్చే సంప్రదాయ సందేశానికి అసలు అర్థం నాకిప్పుడు తెలిసింది.
—0—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *