May 17, 2024

అర్చన 2020 – బళ్లు షెడ్ కి వెడుతున్నాయి

రచన: చెంగల్వల కామేశ్వరి

అమ్మా! పండక్కి ఈ సారి పిండి వంటలు ఏమీ చేయలేదా!
కొడుకడిగిన ప్రశ్నకు “లేదురా! ఏ రోజుకారోజు చేసేవి ఎలాగూ ఉన్నాయిగా! అందుకే ఈ సారి చేయలేదు ” సంజాయిషీగా చెప్పింది కమలమ్మ.
అదేమిటి? నిలవపిండివంటలు రకరకాలు చేస్తావు కదా! నేను మా ఆఫీస్ లో వాళ్లకిద్దామనుకునున్నాను నువ్వు చేసే జంతికలు అరిసెలు లడ్డూలు కజ్జికాయలు చెక్కావడలు అస్సలు పిండివంటలు ఏమీ చేయలే్దా! పండగ ఇంక రెండు రోజులేగా ఉంది! ఆశ్చర్యంగా అడిగాడు.మధు
లేదురా! ఈసారి అంత ఓపిక లేదు. ఆ పిండి మిల్లులకి వెళ్లడం రావడం నాన్నకి కష్టంగా ఉంది చూపు ఆనటంలేదు కదా! నాకేమో నడుమునొప్పి.
“అయినా అంత…. కష్టపడి చేసినా అందరికి పంచడమే కదా!! నాకూ నాన్నకీ షుగర్.నీకు మీ ఆవిడకి తినటానికి టైమ్ దొరకదు.అదీ, నువ్వు పోటీలు పడి కొలీగ్స్ కి పట్టుకుపోవడమే కదా! పిల్లలు ఎంతసేపూ ఆ పిజ్జాలు బర్గర్లు తినడం బలవంతంగా తినమంటే తిన్నంత తిని పారేయడం నాలుగురోజులయ్యేసరికి నిల్వ అయిపోయాయని పనివాళ్లకిచ్చేయడం, లేదా ఫ్రిడ్జ్ లో పడేయటం! ఇంతేగా!
ఎలాగూ స్వగృహా లో అన్నీ దొరుకుతున్నాయి కదా!
పిల్లలకీ మీకూ ఏంకావాలో తెచ్చేసుకోండి”.అన్న కమలమ్మ మాటలకు కోడలు దీప మొహం చిట్లించింది.
“ఎలాగయినా నీకు ఇంట్రస్ట్ తగ్గిపోయింది అమ్మా! స్వగృహాలో కొన్నా మనింటిలో నువ్వు చేసినట్లుండవు కదా ! సరుకు కూడా ఆట్టే కనిపించదు. ఎవరికేం పంపిస్తాము కావాలంటే ఈ ఆదివారం మేమంతా సహాయం చేస్తాము. చేద్దాము ప్లీజ్ అన్నాడు మోహన్.
అనగానే దీప కూడా” అవునత్తయ్యా! మేమంతా సహాయం చేస్తాము. అంది. వాళ్లలా అడుగుతుంటే బాధ అనిపించి సరే! అలాగే చేసుకుందాము. అంది.తనకీ ఆనందమే! తాను చేసినవి పిల్లలు ఇష్టంగా తింటే సంతోషమే! కానీ కింద కూర్చోలేక, ఎక్కువసేపు నిలబడలేక కాళ్లూ నడుమూ పోట్లొస్తున్నాయి.
ఇదివరకయితే డబ్బాల కొద్దీ అన్నిరకాలు చేసి వరసలవారీగా వాటిపేర్లు రాసి అలమరాలో సర్దితే కడుపునిండినట్లు ఉండేది.
మొదట్లో అత్తగారింటిలో ఆవిడ పొయ్యి దగ్గర కూర్చుంటే తనూ తోడికోడళ్లు, కబుర్తలు చెప్పేసుకుంటూ, ఆవిడకి అన్నీ అందించేవారు.మిల్లుకెళ్లడాలు,పిండికలపడాలు, చేగోణీలు చుట్టడం పాలకాయలకు ఉండలు చేయడం అన్నీ చేసేవారు.
సొంతకాపురంలో పనివాళ్లు లేకున్నా తానే రేషన్ షాపులకెళ్లి ఆ రేషన్ బియ్యాన్ని పిండివంటలకోసం నానపెట్టి ఎండపెట్టి మిల్లు పట్టించేది. రాత్రిళ్లు కొన్ని, ఆయన ఆఫీసు కెళ్లాక పిల్లలు స్కూలు కెళ్లాక కొన్ని అన్నట్లు చేసేది. చేసినవి దేముడికి చూపించి భర్తకు ఇస్తే ఆయన శెభాష్ బాగా కుదిరాయి. అంటే చాలు. ఐ ఎస్ ఐ మార్కు పడినట్లే సంబరపడేది.
తర్వాత పిల్లలు కాస్త ఎదిగాక వాళ్లని బ్రతిమాలి వాళ్ల సహాయంతో చేసేది. పెద్ద చదువులు ఉద్యోగాలు వంకతో వాళ్లు తప్పించుకుంటుంటే, సరే! అనుకుని అన్నీ తనే చేసుకోవడం అయ్యేది. పిల్లల పెళ్లిళ్లుఅయి మనవలు పుట్టాక ఆయన రిటైర్ అయ్యాక చిన్నచిన్నసహాయాలు చేస్తున్నా తనవల్ల కావటంలేదు.
తాము తినకున్నా తినేపిల్లలు ఉన్నప్పుడు “చేయకపోతేఎలా! అనుకుని లేని ఓపిక తెచ్చుకుని చేస్తోంది. వాళ్లు అడక్కపోయినా చేసిపెడుతుంటే వాళ్లకేమి తెలియటంలేదు. తను కష్టపడి చేసినవి వాళ్లకిచ్చాను వీళ్లకిస్తాను అని అందరికి పంచిపెడుతుంటే నచ్చటంలేదు.
“శ్రమ తనది పంచుళ్లు వాళ్లవి! ఇన్నేళ్లయినా కోడళ్లకి ఇవేమి తమకు రావే అన్న చింతలేదు. నేర్చుకోరు. ఇంట్లో ఉన్నా ఫోన్స్ పట్టుకుని కంప్యూటర్స్ ముందు ఆ పిల్లల వెనకాల పఢటం తప్ప వంటింటిలోకి రారు.
ఏదయినా అంటే పెత్తనం నీదే కదా ! అంటారు! ఏం పెత్తనం ! ఆడదానికి బ్రతికున్నన్నాళ్లు వంటింటి పెత్తనం బాగానే ఉంటుంది.
అది కూడా మొగుడూ పిల్లల కనుసన్నల లోనే
వాళ్లకిష్టమైనవి చేసిపెడుతూ మెప్పించటంలోనే సగం జీవితం వెళ్లిపోతుంది.అనుకుని నిట్టూర్చింది కమలమ్మ.
ఆదివారం మధ్యాహ్నం త్వరగా భోజనాలు చేసి పిండివంటల కార్యక్రమం మొదలయింది. ముందు అరిసెలకి తడిపిండి, జంతికలకి పొడిపిండి పట్టించడాలకు మిల్లుకెళ్లాలంటే పిల్లలను తీసుకుని హుషారుగా వెళ్లాడు మధు.
అక్కడున్న రష్ కి విసుగొచ్చేసింది మధుకి అయినా కూడా ఓపిగ్గా మిల్లాడించుకునొచ్చాడు.
అరిసెలు చేయడం కోసం బెల్లం తరిగిచ్చి,ఏలకులు దంచిచ్చి
జంతికలకి ,చేగోణీలకి, చెక్కావడలకు కజ్జి కాయలకు పిండి తయారు చేసి కోడలు దీప అలిసిపోయింది.
ఇంక తను అరిసెలు వేయిస్తుంటే, అరిసెలు వత్తడం , వేయించిన అరిసెలు రెండు చట్రాల నడుమ ఉంచి నూనె ను తీసేయడం
కమలమ్మ వాళ్లాయన వెంకట్రావు పని.
ఇంక అసలు పనంతా కజ్జికాయలు లో పూర్ణం నింపడం, చేగోణీలు, రింగులు గా చుట్టడం, చెక్కావడలు వత్తడం, ఇవన్నీ చేతకాక చేయలేక మధు, దీప, సతమతమయ్యారు. అందులో కింద కూర్చోవడం ఇంకా కష్టమయింది వాళ్లకి.
” పోనీ వేయించమందామంటే అంతసేపు నిల్చుండటం కూడా కష్టమే అయింది. జంతికలు చుట్టమంటే చేతులు నొప్పులని ఇద్దరికీ ఏదీ చేతకాక ఒకదానితర్వాత ఒకటి కష్టపడి కమలమ్మే పూర్తి చేయాల్సి వచ్చింది.
తల్లి పడుతున్న శ్రమ ను శ్రధ్దను చూసిన మధుకి
అత్తగారికి ఆ పనులపట్ల ఉన్న నేర్పు కూర్పు చూసి దీపకు నోటమాటరాలేదు.ప్రతి ఏటా కమలమ్మ ఎంత కష్టపడితే పండుగ పిండివంటలు సమకూరుతున్నాయో ప్రత్యక్షంగా చూసిన వారి కనులు చెమర్చాయి.
గొప్పల కోసం తాము అందరికీ పంచిపెట్టేస్తున్నారు “ఆహా” ఓహో! అంటూ తినేస్తున్నారు కాని ఇంత శ్రమ ఈ వయసులో అమ్మ ఎలా చేస్తోందో తెలుసుకోడంలేదు అనిపించింది.
రాత్రి పదిన్నరకు పనంతా ముగించి పడుకుని అమ్మా! అబ్బా! అనుకుంటున్న తల్లిని చూస్తే మనసు ద్రవించిపోయింది.
వెంటనే” దీపా! అమ్మకి మోకాళ్లు పెయిన్స్ బాగా ఉన్నటున్నాయి.
ఆ పెయిన్ బామ్ కొబ్బరి నూనె తీసుకురా! అంటూ కమలమ్మ గదిలోకి వెళ్లి తల్లి పక్కలో కూర్చున్నాడు.
కమలమ్మ ఆశ్చర్యపోతూ “ఇంకా పడుకోలేదేమిట్రా! అంటూ లేవబోయింది..
లేవబోతున్న తల్లిని వారించి పడుకోమ్మా పొద్దున్నుండి అలిసిపోయావు. అనంటూ దీప తెచ్చిన పెయిన్ బామ్ అందుకుని తల్లి కాళ్లకు రాయడం మొదలు పెట్టాడు.
మరోవైపు దీప కూడా రాయడం చూసి కమలమ్మ అయ్యయ్యో! పొద్దున్న ఆఫీస్ లు పెట్టుకుని నాకీ సేవలేంటర్రా!
అనగానే మధు “రాయనీయమ్మా! ఏటేటా ఇంత కష్టపడి అవన్నీ మా కోసం చేసేదానివని ఇవాళ చూస్తే తెలిసింది.
నీకు ఓపిక లేకపోయినా పళ్లబిగువున మా కోసం ఇప్పటికీ చేస్తున్నావు కాని మేము ఇప్పుడే ఏమీ చేయలేకపోతున్నాము.
నెక్ష్ట్ టైమ్ నుండి ఎవరినయినా ఇంటికి వచ్చి చేసేవాళ్లుంటే పిలుద్దాము. నువ్వు దగ్గరుండి చేయిద్దువుగానీ” అన్న కొడుకు మాటలకి మురిసిపోయింది కమలమ్మ.
“ఏదో బయటివాళ్లకు చేసానేంట్రా? నేను చేయలేక వదిలేసినా నా నొప్పులు తగ్గేవి కాదు కాని, మీరంతా మీ కోసం చేసిపెట్టే ఈ అమ్మ శ్రమను ప్రేమను గుర్తించి తింటే అదేచాలు! నేను బ్రతికున్నన్నాళ్లు దేముడు నాకు ఆ ఓపిక ఇవ్వాలనే కోరుకుంటున్నాను.నాపిల్లలకి నేను చేసి పెట్డుకోలేని అశక్తత నాకు రావొద్దనే దేముడిని కోరుకుంటున్నాను.కానీ నొప్పులు, నీరసాలు చూసే భయమేస్తోంది
ఈ “బళ్లు షెడ్ కెడుతున్నాయి.! అనిపిస్తోంది. అన్న తల్లి చివరిమాటకు ఒక్కసారిగా నవ్వాడు. మధు.
ఏంటీ! బళ్లు షెడ్ కెళ్లటమేమిటమ్మా! అనంటూ నవ్వుతుంటే ఈ సారి కోడలు దీప పడుకుని వీరిమాటలు వింటున్న వెంకట్రావు కూడా నవ్వడం మొదలెట్టారు.
కమలమ్మ కూడా నవ్వుతూ” అవునురా మీరు నడిపే కార్లూ స్కూటర్స్ లాగా, ఈ శరీరాలు కూడా రకరకాల రిపేర్లు వచ్చి బెడ్ ఎక్కుతున్నాయి. అవి షెడ్ కెడితే ఇవి బెడ్ ఎక్కుతున్నాయి. అంతే తేడా! ఈ శరీరాలకు షెడ్ లు అవేకదా! అని చెప్పిన కమలమ్మ మాటకి మరింతగా నవ్వారందరూ!
మధు నవ్వుతూనే “అది సహజమే కదమ్మా! వాటి ని ఎలా బాగు చేసుకుంటామో! మిమ్మల్నీ అలాగే జాగ్రత్తగా చూసుకుంటాము.
సర్వీస్ కోసం కాదు.పండుగలు సందళ్లు వస్తుంటాయి అవన్నీ మీ అండదండలతో ఆనందంగా చేసుకోవ డానికే ! మాకవన్నీ రాకపోయినా, మా పిల్లలకి స్వయంగా చేసిపెట్టలేకపోయినా, నాన్నా నువ్వు అన్నీ నేర్పి మా జీవితాలకు ఆనందాలు అందించినట్లు , కొంతవరకు మా పిల్లలకి కూడా మీ ద్వారా నేర్పిస్తే అంతేచాలు!.
అంతేకదా దీపా! అనగానే “అవునత్తయ్యా! ఈ ఉద్యోగాల వల్ల నేనేమి నేర్చుకోలేదు. మీకేసహాయం చేయలేదు.అన్నీ మీరే చేసారిన్నాళ్లు. ఇకమీద పండుగలకిమీ అబ్బాయి చెప్పినట్లు ఎవరి చేతనయినా ఇంట్లోనే చేయించుకుందాము. అనంటున్న కోడలి తల ఆప్యాయంగా నిమిరింది కమలమ్మ.

END

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *