May 20, 2024

అర్చన 2020 – శిక్ష

రచన: యమున చింతపల్లి

“అఖీ, ఐ లవ్ యు “ శ్రీరామ్ చేతులు అఖిలను చుట్టేశాయి. ఆ మాటలకు ఎప్పటిలాగానే అఖిల మనసు అనురాగంతో పులకించాలి. కానీ కంటిలోని నీరు మండుతున్న ఆమె చెంపలను, తలకింద దిండుని కూడా తడుపుతోంది.
“నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపోతాను “ మరింత దగ్గరగా జరుగుతూ అన్నాడు.
గొంతు దిగిన మందు, తలకెక్కిన కిక్కుతో కాదు ఆ మాట అన్నది మనసులోని ప్రేమతో నిజాయితీగానే అన్నాడు. దశాబ్దం క్రితం అతను అలా చెప్పిన మాటకే ఆమె మనసు ఇచ్చి మనువాడింది. అతను ఏ స్థితిలో ఉండని, అఖిల పై ప్రేమ తరగదు. ఒక్కోసారి ఆ ప్రేమను అతనిలోని తొందరపాటు మింగేస్తుంది.
వాళ్ళ ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు, స్నేహ బంధమూ ఉంది. అది వారి ప్రేమకు ఆ పై పెళ్ళికి దారి తీసింది. ప్రేమిoచేముందు, కనీసం పెళ్లిముందు కూడా అతనికి ఆ అలవాటు లేదు. ఒకవేళ అప్పటికే ఆ అలవాటు ఉన్నా, అఖిల శ్రీరామ్ తో అనుబంధం వద్దనుకునేది కాదేమో. “అతనిని నేను మార్చుకుంటాను, నా ప్రేమతో “ అని ఎందరో ఆడపిల్లల్లాగానే ముందుకే అడుగువేసేదేమో!
ఈమధ్యనే శ్రీరామ్ కి ఉద్యోగo లో ఎదురైన ఫెయిల్యూర్స్ ఫ్రెస్టేషన్ కు దారితీసి అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలకు తెర తీస్తోంది. కొంతమంది అంతే, బలంగా ఎదుర్కోవాల్సి న సమస్యలను వదిలిపెట్టి బలహీనతల బాట పడతారు. ఎప్పుడు ఏ మార్పులు సంభవిస్తాయో ఎవరికి తెలుసు, అది కెరియర్ లో అయినా కట్టుకున్న భర్తలో అయినా ?? ఇదమిద్దమని తేల్చి చెప్పుకోలేనిదే జీవితమేమో !!
జీవితంలో శ్రీరామ్ తనపై చెయ్యి చేసుకుంటాడనేది అఖిలకు ఊహకు కూడా అందని ఆటవిక చర్య. ఇంతలా ప్రేమిoచేవాడు తనపై చెయ్యి ఎలా ఎత్తుతాడో తనకు అసలు అర్ధం కాని విషయం.
“వెన్నెలలాంటి ప్రేమను పొందటానికి ఈ అనాగరిక ప్రవర్తన భరించక తప్పదా ? ఇంతేనా జీవితం. అమావాస్య, పౌర్ణమి ప్రకృతి ధర్మాలు. ఇది కూడా అంతేనా…. అంత సహజమా ?” కారుతున్న కన్నీళ్లను ఆపుకోవటం కష్టంగా ఉంది.
అఖిలకు ఆర్ధిక స్వాతంత్రం ఉంది, ఆత్మాభిమానం ఉంది. అంతకు మించిన ప్రేమ శ్రీరామ్ పై ఉంది. తనని విడిచి పెట్టేస్తే, ఇంకా దిగజారిపోతాడేమో అనే భయం ఉంది. ప్రేమ ఉన్న చోట భయమూ ఉంటుంది, వదులుకోలేని బలహీనతా ఉంటుంది.
చుట్టుకున్న శ్రీరామ్ చేతులను తొలగించి లేచి ప్రక్క బెడ్ రూమ్ లోకి నడిచింది. గత రెండేళ్లగా ‘నువ్వు పెద్ద దానివయ్యావు. ఒక్క దానివే పడుకోవాలి ‘ అని కూతురికి అలా విడిగా పడుకోవటం అలవాటు చేశాడు శ్రీరామ్.
“అదేంటి, అది చిన్న పిల్ల “ అన్న అఖిల మాటలను “ పిల్లలికి డిపెండెన్సీ తగ్గి ఇండివిడ్యువాలిటీ ఎంత తొందరగా పెరిగితే అంత మంచిది “ అని కొట్టి పడేసాడు.
కూతురు ప్రక్కన చేరి ‘అంజూ, నువ్వేరా నా ఊపిరి నిలిచి ఉండటానికి కారణం ‘ అనుకుంటూ స్వాంతన పొందుతూ హత్తుకుని పడుకుంది అఖిల.
*****
చెంప మీద తేలిన వాతలు తెల్లారేసరికి మాయమయ్యాయి. కానీ మనసుకు అయిన గాయాలో ? అవీ చెరిగిపోతాయి కానీ అంత సులభంగా మటుకు కాదు. వేదనా భరిత హృదయంతో, నిద్ర లేక ఎర్రబడ్డ కళ్ళతో ఆ రోజు ఆరంభమయ్యింది అఖిలకు. దానికి తోడు చెప్పా పెట్టకుండా మానిన పనిమనిషి, స్కూల్ కి వెళ్లాల్సిన కూతురు పని రెండూ కలిసి మరింత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
“అఖీ, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు ? నేను హెల్ప్ చెయ్యనా “ వెనకగా వచ్చి నిలబడి అడిగాడు శ్రీరామ్. మౌనంగా కానీ వేగంగా తన పని చేసుకుపోతోంది అఖిల.
తప్పిదం చేసినా మాటలలో సారీ చెప్పడు శ్రీరామ్. చేతల్లో చూపిస్తాడు. రోజూ అప్పుడప్పుడు ‘తను ఏం చేస్తోందా’ అని తొంగి చూసే వాడు, అలాంటి తప్పు జరిగినప్పుడు మటుకు అతుక్కునే ఉంటాడు. లంచ్ లో తప్పితే ఫోన్ చెయ్యని వాడు నాలుగైదు సార్లు టైమ్ ని కుదుర్చుకుని చేస్తాడు.
“అంజుకి, సాయంత్రం స్నాక్స్ సర్దావా ? “
“మాట్లాడవా అఖీ, బాదం, అంజీర పెట్టావా. తనకు మంచి ఫుడ్ అవసరం “
“అంజూకి ఎందుకు ఆ యాక్టివిటీస్ ? ప్రొద్దున వెడితే రాత్రి ఏడవుతోంది. అలసిపోతోందనిపిస్తోంది “ బిడ్డ మీద ప్రేమ ఆమె ఆమె మౌనాన్ని ఓడించింది. మాట్లాడేటట్లు చేసింది.
“అంత చిన్న పిల్లా తను ? తొమ్మిదేళ్లు నిండాయి. ఈ రోజుల్లో పిల్లలు ఎoత ఫాస్ట్ గా ఉన్నారో చూడు “
“ఇంకొకరితో పోలిక అవసరమా ? ఆరునెలలుగా తనను పరుగెత్తించి టెన్షన్ పెడుతున్నారు “
“తను బానే ఉంది. నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ఇంకొకరితో పోల్చి కాదు నేటి సమాజంలో ఆడపిల్లకి ఆత్మరక్షణ అవసరమని తనను చేర్పించాను “
“అమ్మా, నాకేమీ స్ట్రెయిన్ గా లేదు. చాలా ఇంటరెస్ట్ గా ఉంది. ఈ రోజు మా సార్ స్పెషల్ క్లాస్ తీసుకుంటారుట. ‘ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వద్దు’ అని చెప్పారు “ అప్పుడే వచ్చిన అంజలి హుషారుగా చెప్పింది.
“నీకేంటి అంజూ, నువ్వు అన్నిట్లోను సూపరే. ఏది చెప్పినా నువ్వు ఇట్టే నేర్చేసుకుంటున్నావుట. మీ సార్ చెప్పారు “ అన్నాడు శ్రీరామ్ అంజును ఎత్తుకుని ముద్దుపెట్టుకుంటూ.
“ ‘నా తండ్రి కూడా నన్ను ఒక్క తిట్టు తిట్టకుండా, దెబ్బ వేయకుండా ఇంత గారంగానే పెంచాడు. కానీ ఏమి లాభం నీ చేతిలో చెంప దెబ్బలు తినాల్సి వస్తోంది. రేపు నీ కూతురికి నా స్థితే వస్తే అప్పుడు… ’
ఛా, ఏంటీ ఈ చెత్త ఆలోచనలు. అంజు కు కష్టం వస్తే నేను బ్రతకగలనా! శ్రీరామ్ మీద చిరాకు అంజు భవిష్యత్తు మీద చూపటం ఎంత హీనం “ తనలోని ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటూ సిద్ధం చేసిన బాక్స్ లను చిన్న బాస్కెట్ లో సర్దేసింది. అంజూకి గబ గబా జడలు కట్టేసి, గాఢoగా ముద్దుపెట్టుకుంది.
తరువాత శ్రీరామ్ కి లంచ్ బాక్స్, టిఫిన్ రెడీ చేసింది. టిఫిన్ తింటూ “నువ్వు తిన్నావా ? లేదు కదూ. టేస్ట్ చేసి ఉంటే నాకు ఒక్కటి కూడా పెట్టేదానివి కాదు“ అన్నాడు తుంపిన దోశ ముక్కను బలవంతంగా తన నోటిలో పెడుతూ.
ఓ అర్ధం కాని పజిల్ ని చూసినట్లు ఆ కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూసింది. గుంటలో అడుగున మట్టి ఉన్నా పైకి తేరుకున్న వాన నీరంత నిర్మలంగా ఉన్నాయి ఆ కళ్ళు.
“ఇంకో దోశ వెయ్యనా “
“ఈ ప్రేమ చాలు “ అన్నాడు నిట్టూర్పు విడుస్తూ. అభావంగా చూసింది.
****
మరో చెడ్డ రోజు. శ్రీరామ్ ఫ్రస్టేషన్ కి గురైన రోజు. మందు తాగ లేదు కానీ మండుతున్న గుండె అతన్ని అదుపు తప్పిస్తోంది.
“కాస్త కూల్ అవ్వు రామ్ “
“అఖీ, నా అపజయం నీకు ఎదురైతే తెలుస్తుంది. సలహాలు ఇవ్వటానికేం, నేనూ ఇస్తాను ఇంట్లో కూర్చుని “
“నీ ఫైల్యూర్స్ ఏమో కానీ అది నామీద చూపిస్తున్నావు. నీతో ఇన్ని మాటలు పడతానని, నామీద చెయ్యెత్తుతావని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. నీది కాదు అపజయం నాది “ మొట్టమొదటిసారి ఆవేశంగా అరిచింది అఖిల.
“నన్ను చేసుకోవటం తప్పా. ఏమన్నావు, యు బి…. “ ఫటా ఫటా చెంపలు వాయిస్తున్నాడు. అడ్డుకునేవారు లేరు అడ్డుపెట్టుకుంటున్న అఖిల సుకుమారమైన చేతులు తప్ప. ఏ పీడ కలకో భయపడి లేచి, అప్పుడే తలుపు తీసుకుని రూమ్ లోకి అడుగు పెట్టిన అంజూని కూడా గమనించే స్థితిలో లేడు.
“ఆగు రామ్, అంజూ చూస్తోంది. భయపడుతుంది… ” తన శరీరం పైన, అభిమానం మీద తాకుతున్న దెబ్బలకన్నా పాప చూస్తోందనేదే అఖిలను ఎక్కువ బాధిస్తోంది. గబుక్కున చేతిలో పట్టుకున్న జుట్టును వదిలి పెట్టేశాడు.
అంతకు ముందు జరిగిన బీభత్సం ఆనవాలు లేకుండా ఆ గదిని నిశ్శబ్దం ఆక్రమించింది. నైట్ డ్రెస్ లో ఉన్న అంజు …. తొమ్మిదేళ్ల అంజు వేగంగా నడిచి గాలిలోకి ఎగిరి ఒక్క కరాటే కిక్కు ఇచ్చింది శ్రీ రామ్ గుండెల పైన. తూలి కింద కూల బడ్డాడు శ్రీరామ్. ఎదురుగా అంజు…. విజయమా, నాన్న మీద ఆగ్రహమా… అమ్మ పై ప్రేమా అంజూ మొహం లో మాటలకు అందని ఏదో భావం.
“డాడీ…. ” అంటూ శ్రీరామ్ భుజం పై తలవాల్చి భోరున వెక్కి వెక్కి ఏడుస్తోంది అంజు. శ్రీరామ్ కళ్ళు కూడా
వర్షిస్తున్నాయి.
“అంజు తల్లీ, అమ్మకు కూడా కరాటే నేర్పిద్దామా? “ అన్నాడు కూతురిని దగ్గరగా హత్తుకుని.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *