May 8, 2024

అర్చన 2020 – సాయం సంధ్య

రచన: పి.ఎల్.ఎన్ మంగారత్నం

ఆశ మనిషిని బ్రతికిస్తుంది.
ఏ రోజుకారోజు రేపటి సూర్యోదయాన్ని చూడగలనో! లేదో! అన్నట్లు ఉంటుంది డెబ్బై రెండేళ్ళ అమరేశ్వరి పరిస్థితి. లేచి౦దా సరే! సమస్య లేదు.
ప్రొద్దుటే . . వీధి గుమ్మం తుడిచి ముగ్గేస్తుంది. లేవలేకపోతే లేదు.
అలాంటి పరిస్థితిలో అన్నయ్య వెంకటశాస్త్రి హోటల్ నుంచి కూరలు పట్టుకొచ్చి, అన్నం వండుతాడు.
అమరేశ్వరికి భర్త లేకపోతే, వెంకటశాస్త్రికి భార్య లేదు.
అతనికీ డెబ్బైఅయిదేళ్ళ పైనే. అలా అని వాళ్ళకు పిల్లలు లేరా! అంటే, అదీ కాదు. అమరేశ్వరి ఓ కొడుకూ, కూతురైతే . . వెంకటశాస్త్రికి ఓ కూతురు.
ఇద్దరూ ఆడపిల్లల దగ్గరికి వెళ్లి ఉండలేకపోవడం . .
కొడుకు ఉన్నా అమరేశ్వరిని రమ్మని పిలవకపోవడంతో . . ఒంటరి వాళ్ళయిన అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి అద్దెకు ఉంటున్నారు ఆ అపార్టుమెంటులో.
ఆ వయసు వాళ్ళకి అపార్టుమెంట్లే ఆశాదీపాలు. అయినవాళ్ళు దగ్గరలో లేకపోయినా వీధివాకిలి తెరుచుకుంటే, ఆ ఫ్లోర్లో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తారు.
కష్టం సుఖం చెప్పుకుంటే . . అలా ఓ రోజు గడిచిపోతుంది.
ఎవరి ఆయుషు ఎంత వరకో! ఎవరికి తెలుసు? ఊపిరి ఉన్నంతవరకూ బ్రతకాలి.
టీచరుగా పనిచేసిన అమరేశ్వరికి సర్వీసు పెన్షను వస్తుంటే, వెంకటశాస్త్రి తద్దినం బ్రాహ్మడుగా వేరెవరి దగ్గరో జీతానికి పని చేస్తాడు.
ఆదాయానికి ఇబ్బంది లేకపోయినా . . ఆదరణే కరవు. చేసి పెట్టేవాళ్ళు లేక . . నోరు కదలాలంటే బయటకు వెళ్ళాల్సిందే.
***
అమరేశ్వరికి పెన్షను తక్కువగా ఉండడంతో . . కొడుకు రాజశేఖర్ ప్రతినెలా కొంత డబ్బు వేస్తాడు ఆమె అకౌంట్లోకి. అతను హైదరాబాదు . . హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజరు.
తరచూ ఫోన్లో, తల్లి యోగక్షేమాలు తెలుసుకుంటాడు.
ఎప్పుడైనా “వంట్లో బాగా లేదురా! రాజా” అంటే,
“ రోజూ క్రమం తప్పకుండా మందులేసుకుంటున్నావా! అవసరం అయితే ఓసారి డాక్టరు దగ్గరకి వెళ్ళు” అంటాడు. డాక్టరు దగ్గరకు వెళితే ఆయుష్షు ఎన్నాళ్లయినా పెరిగిపోతుందనుకుంటాడేమో! లేని ఓపిక వచ్చేస్తుందని అనుకుంటాడేమో!
“ నాలుగు రోజుల నుంచీ భోజనం సహించడం లేదు రా! నాలిక అంతా చేదు. ఏమీ తినడం లేదు. అసలు మంచం మీద నుంచేలేవడం లేదనుకో. ఒకటే, నీరసం. నా పరిస్థితి చూసి . . మా ఎదురింటి ఆవిడ చాలా బాధ పడుతుంది. మీ అబ్బాయి దగ్గరకో, లేదా ఏదైనా ఓల్డ్ ఏజ్ హోంకో వెళ్ళి ఉండాలి. మీరు ఇక పని చేసుకోగలిగే ఓపికలో లేరు” అని జాలి పడుతుంది”
అంతే . .
అటునుంచి మౌనం. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు మాట పెగలదు. .
ఆమెకి తెలుసు అలాగే జరుగుతుందని. ఆ మౌనమే గుండెను కోస్తుంది. అభద్రతాభావం వెంటాడగా నిరాశ, నిస్పృహ ముంచుకొచ్చి ఎందుకొచ్చిన జీవితం . . ఎన్నాళ్ళు ఈ ఒంటరి పోరాటం అనుకుంటుంది.
“ సరే! రా . . రాజా నా సోదితో నిన్ను విసిగిస్తున్నట్లున్నాను. ఫోన్ పెట్టేయ్యమంటవా? అడుగుతుంది.
“నువ్వు వచ్చేస్తే . . మామయ్య వంటరి వాడైపోతాడు కదే ” అంటాడు మామయ్య మీద జాలిపడుతున్నట్లు. అయినా, విషయం అఖిలకి చెబుతాను. ఏమంటుందో” అంటాడు చివరికి కొసమెరుపులా.
అఖిల అంటే, కోడలు. ఆ కోడలు కూడా ఎవరో కాదు స్వంత మేనకోడలే. తమ్ముడి కూతురు. అయినా అత్తగారిని సహించే ఓపిక ఆమెకి లేదు.
***
అప్పుడప్పుడూ తల్లిని చూడడానికి కాకినాడ వస్తాడు రాజశేఖర్.
హైదరాబాదు నుండి రాజమండ్రి వరకూ విమానం. అక్కడి నుండీ కాకినాడకు టాక్సీ.
ముందు . . అక్కడే ఉన్న అత్తవారింట్లో దిగుతాడు. ఎప్పుడైనా భార్య అఖిలని తీసుకువచ్చినా . . అత్తగారిని చూడాలని అనుకోదు ఆమె. పుట్టింటిలోనే ఉండిపోతుంది.
తను మాత్రమే తల్లిని చూడడానికి వస్తాడు.
వచ్చిరాగానే వంగి తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తాడు “ నా ఆయుష్షు కూడా పోసుకుని నూరేళ్ళు సుఖంగా వర్దిల్లురా రాజా” అంటుంది అమరేశ్వరి.
ఇంటిని పరిశీలించి చూసి “ పని మనిషిని పెట్టుకో. ఎన్నాళ్లని నువ్వే పని చేసుకుంటావు” జాలి పడతాడు.
“ వంటరిగా ఉన్న ముసలివాళ్ళు అంటే, వాళ్ళకీ చిన్న చూపేరా! అందరికీ చేసేసిన తరువాత ఏ పదింటికో, పదకొండింటికో వచ్చి . . ఏదో దయ మీద చేసినట్లు, చేసిపోతారు. అంతసేపూ పాచి వాకిలి అలా ఉంచలేక . . వాళ్ళు అడిగినంతా ఇవ్వలేక, చేసుకోవడం”
“ అయినా సరే ఇంకా డబ్బు కావలిస్తే పంపిస్తాను” అంటాడు.
అలా ఓ గంట కూర్చుని వెళ్ళిపోతాడు.
***
ఓరోజు . .
“ నేను హైదరాబాదు వెళుతున్నాను. మా అబ్బాయి నాలుగు బెడ్రూముల అపార్టుమెంటు కొన్నాడట. ఎనభై లక్షలు . . వారం రోజుల్లో గృహప్రవేశం . . రమ్మన్నాడు. టిక్కెట్లు కూడా బుక్ చేసాడు” చెప్పి౦ది అమరేశ్వరి ప్రక్క పోర్షన్ అక్షరతోనూ, ఎదురింటి కల్పనతోనూ సంతోషంగా.
“ వెళ్ళేటప్పుడు మరీ రెండు జతల బట్టలు కాకుండా, పెద్ద బేగ్గు వేసుకుని వెళ్ళండి. ఇక అక్కడే ఉండిపోవడానికి వచ్చానన్నట్లు చెప్పండి మీ అబ్బాయితో ” చెప్పింది కల్పన, రెండేళ్ళ పరిచయంతో.
ఆమె మాటలకి నవ్వేసి ఊరుకుంది అమరేశ్వరి.
అది జరిగేపని కాదని తెలుసు. రానూపోనూ టిక్కెట్లు ఆమె సెల్ ఫోన్ లోకి వచ్చేస్తే, కొన్నాళ్ళ పాటు వచ్చి ఉంటానని, ఏమని అనగలదు? గృహప్రవేశం అయిన సాయంత్రానికే తిరుగు టిక్కెట్టు.
నాలుగు బెడ్రూముల ఫ్లాటు . .
అంటే తనకీ ఏ మూలో అలాంటి ‘ఆశ’ లేకపోలేదు.
కొడుకు తనని దృష్టిలో పెట్టుకుని కొన్నాడా?అన్నట్లు. అయినా, ఆ మాట కొడుకు నుంచి రాకపోతే తనేం చెయ్యగలదు? “ఇక ఓపికలేదు. వచ్చేసి . . చివరి వరకూ మీ ఇంటిలో ఉంటానురా” అని ఏమని దేబిరించుకోగలదు?
తన అసక్తతను చెప్పకనే చెబుతుంది అస్తమానం. రోజురోజుకీ ప్రాణం దిగలాగుతున్నా . . వత్తి ఎగదోసుకుంటునే ఉంది. టీ. వీ ల్లో చూపించే బలం మాత్రలు తెప్పించుకుంటూ.
***
ఇంతకు ముందైతే కొడుకుది రెండు బెడ్రూముల ఫ్లాటే.
బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్న కోడలు . . అందులోనే బ్యూటీ పార్లరు పెట్టింది. హైదరాబాదులో ఇద్దరి సంపాదనా లేకపోతే, రోజులు గడవడం కష్టం అని.
ఎప్పుడైనా . . వెళ్లి పది రోజులు ఉండాలని అనుకున్నా . .
ఇల్లు ఇరుకు కావడం, కోడలు పని పార్లర్కే పరిమితం అయిపోయి . . ఇంటిని పనిమనిషికి అప్పగించేయడం . . ఆ పనిమనిషి వాళ్ళకి కోడిగుడ్లతో ‘ఆమ్లెట్లు’ వేసిపెట్టడం నచ్చేది కాదు.
“ అదేమిటే? అంటే . .
“ ఇప్పుడు గుడ్లు కూడా శాఖాహారంలోకే వస్తున్నాయి అత్తా” అంటుంది కోడలు.
పుట్టి బుద్దెరిగిన తరువాత తమ ఇంట అలాంటి పనులు జరగలేదు.
***
మొన్నీమధ్యే . . డెబ్బయ్యో దశకంలో పడిన తరువాత . .
కొద్దిగా . . పెరాలిసిస్ స్ట్రోక్ రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. ఆరు నెలల ట్రీట్మెంట్ తరువాత . . లేచి తిరగగలిగే ఓపికలోకి వచ్చి౦ది.
అలాంటి సమయంలో అయినా కొడుకు హైదరాబాదు వచ్చి ఉండమని పిలవలేదు. మొగుడు వదిలేసిన ఆడపడుచే దగ్గర ఉండి చూసింది.
సుఖపడాల్సిన మలి వయసులో భవిషత్తు అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది అమరేశ్వరి.
ట్రీట్మెంట్లో భాగంగా డబ్బు అవసరాల కోసం స్వంత ఇంటిని అమ్మేసి . . ఇప్పుడు ఉంటున్న అపార్టుమెంటులోకి అద్దెకు దిగారు అన్నాచెల్లెళ్ళు.

***
గృహప్రవేశానికి వెళ్ళిన . .
అమరేశ్వరిని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు.
అందరూ అయినవాళ్ళే అయినా అమరేశ్వరి వైపు నిలబడే౦దుకు ఎవరూ సిద్దంగా లేరు. మాకెందుకు వచ్చిన తల నొప్పని.
డిగ్రీ చదువుతున్న. . రెండవ మనవరాలు తేజస్విని అన్ని గదులూ తిప్పి చూపిస్తుంది నానమ్మ అమరేశ్వరికి.
కూకట్పల్లిలో . .
అయిదు అంతస్తుల అపార్టుమెంటులో. . మూడవ ఫ్లోరులో . . ఇల్లు కావడంతో కావలసినంత గాలీ, వెలుతురు. ఇల్లు అంతా పెద్దపెద్ద గ్రానైటు రాళ్లు పరిచి, అలమరాలకు కప్ బోర్డులు కట్టించి, బాల్కనీల్లో అద్దాల పార్తిషనులతో, వంటగదిలో, బాత్రూముల్లో లేటెస్టు డిజైన్ల టైల్సూతో ప్రతి గదికీ ఏ. సీ సౌకర్యంతో చాలా మోడరన్గా కట్టించాడు కొడుకు.
ఇంతే కాదు, కొత్త ఫర్నిచరు కూడా అప్పుడే ఇంట్లోకి వచ్చి చేరింది. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు.
బాగా పెద్దదిగ్గా ఉన్న గదిని చూపిస్తూ “ ఈ గది అమ్మానాన్నాల బెడ్రూము”
“ ఈ గది బ్యూటీ పార్లర్ కోసం, అందుకే దీనికి వేరుగా . . ఓ డోర్ పెట్టించింది అమ్మ. ఇంట్లోకి సంబంధం లేకుండా, మెట్ల వైపుకి వచ్చేలా ”
“ ఈ నీలం రంగు పెయింటు వేసింది అక్క బెడ్రూము, ఆ ప్రక్కదే నాది” అంటూ చూపించింది సంతోషంగా.
ఆ పిల్ల ఆనందాన్ని చూస్తూ అనుకుంది అమరేశ్వరి.
‘వాళ్ళకో నానమ్మ ఉందనీ, ఆమె కూడా ఈ ఇంటి మనిషే అన్న విషయం పిల్లలకే కాదు . . పెద్దలకీ, ముఖ్యంగా కొడుక్కే తెలిసిరాలేక లేకపోవడం తన దురదృష్టం’ అని దిగులు పడింది మనసులోనే.
తను ఎంతో మంది స్కూలు పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళ భవిషత్తును తీర్చిదిద్దింది. సమస్యల్ని ఎదుర్కొని ధీటుగా నిలబడే విధంగా. అయితే, ఇప్పుడు తనే తన జీవిత సమస్యను గట్టేక్కలేక పోతుంది.
ఎదురింటి కల్పన అన్నట్లు . .
చివరికి . . ఓల్డ్ ఏజ్ హోమే తనకు దిక్కవుతుందా? మనసు పరిపరి విధాల పోతుంది.
కొత్త ఇంటినీ, బంధువుల హడావుడినీ చూసి కడుపునిండినా . . సంతోషంగా ఉండలేకపోయింది.
ఎక్కడో దూరాన్న ఉన్న ముసలి నానమ్మ వాళ్ళకి కంటికి ఓ అనవసరపు వస్తువు.
నాలుగో రోజుకే తిరిగొచ్చేసిన అమరేశ్వరిని చూసి ఆశ్చర్యపోలేదు చుట్టుప్రక్కల వాళ్ళు.
***
ప్రయాణం చేసి వచ్చిన అమరేశ్వరి అంత త్వరగా కోలుకోలేకపోయింది.
ఏ. సీ ప్రయాణమే అయినా నీరసం ముంచుకువచ్చింది.
ఇంటికి వచ్చేసరికి . .
వాంతులూ, విరోచనాలు. మొదటి రెండురోజులూ అస్సలు మంచం మీద నుంచి లేవలేకపోయింది. వీధి వాకిలి తెరిచింది లేదు.
అమరేశ్వరి బయటకి కనిపించకపోవడం. ఇంటికి డాక్టరు వచ్చిపోవడం పొరుగు వాళ్ళయిన అక్షర, అంతర్వేణి, వసుమతి, అన్నపూర్ణమ్మలు గమనిస్తునే ఉన్నారు.
అయినా ఏం చెయ్యగలరు? కేటరింగు యూనిట్ల మీద ఆధారపడి, ఎవరెవరి చేతి వంటో తింటున్నారని తెలిసినా . . ఏదైనా వండి ఇవ్వడానికి ‘బ్రాహ్మణులు వాళ్ళు’ అన్న భావన దూరంగానే ఉంచుతుంది.
కొడుకు ఫోన్ చేస్తే . .
“అస్సలు బాగాలేదురా! రాజా! అక్కడ నుంచి వచ్చింది మొదలు వాంతులూ, విరోచనాలు. జ్వరం. అన్నీ మామయ్యే చూస్తున్నాడు. ఇందాకే, డాక్టర్ను తీసుకువచ్చాడు. ఆ మందు బిళ్ళలు వేసుకుంటే, ఓపిక వచ్చి ఇప్పుడే లేచాను. మామయ్య కాఫీ పెట్టి ఇస్తే, తాగుతున్నాను ” చెప్పింది అమరేశ్వరి.
ఆ మాటకి రాజశేఖర్ చాలా బాధపడ్డాడు.
అలా పడడమే కాదు ఆవేశంగా “ నువ్వు అర్జంటుగా వంటకు ఏదైనా ఏర్పాటు చేసుకో. లేకపోతే, నేను చచ్చినంత వట్టే” అంటూ కోపం తెచ్చుకున్నాడు.
ఏం మాట్లాడలేక మౌనం వహించింది అమరేశ్వరి. కొడుక్కు తెలీదా? తను ఎలాంటి పరిస్తితిలో ఉందో! మరో మనిష సహాయం లేక, గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేక అల్లాడుతుందని.
“ సరే! నేను ఇప్పుడే ఫోనులో, అక్కడే ఉన్న మా మామగారితో మాట్లాడి . . ఏదైనా కేటరింగు నుంచి కూరలు వచ్చే ఏర్పాటు చేస్తాను” అన్నాడు.
అన్నట్లు అరగంటలో “ మరెవరిదో కాదు విద్యుత్ నగర్లో ఉంటున్న మన సుందరమ్మ పిన్నిదే. వందరూపాయలకి . . పప్పూ, పచ్చడీ, వేపుడూ . . ఓ సాంబారుతో మెనూ ఏర్పాటు చేసాను” అంటూ చెప్పి వాళ్ళ పోన్ నెంబరు కూడా ఇచ్చాడు. వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారంటూ.
***
వంట వండుకునే బాధ లేకపోవడం . . డాక్టరు మందులు పని చెయ్యడంతో, పని తగ్గి కాస్త స్తిమిత పడింది అమరేశ్వరి.
వారం తరువాత . . రాజశేఖర్ పలకరింపుకి . .
“ ప్రస్తుతం బాగానే ఉన్నాను రా. మందులు వేసుకుంటున్నాను కదా ఓపిక వచ్చింది. లేచి తిరుగుతున్నాను. హాలు నుంచి నా గదిలోకి కొద్దిగా వాకింగ్ చేస్తున్నాను”
“ ఆ కేటరింగు అతను ఉదయం పదకొ౦డున్నరకే కూరలు పట్టుకొచ్చేస్తున్నాడు. ఆన్నం పొయ్యి మీద పడేసుకుంటున్నాను. పెరుగు ఎలాగూ తోడు పెడతాను కదా! మామయ్యకూ, నాకూ ఆ కూరలే సరిపోతున్నాయి, ప్రోద్దుటా . . సాయంత్రమూను”
“ ఆ . . ఆ . . భోజనానికే౦ . . ఎప్పుడో అయిపోయింది. మనవాళ్ళ వంటకాలే కదా! బయట హోటల్లోలా కారాలూ, మషాలాలు లేవు. సుందరమ్మ పిన్ని వంటలు బాగా చేస్తుందని తెలుసు గానీ ఇలా కేటరింగు పెడుతుందని అనుకున్నామా! పోనీలే ఇదీ మన మంచికే అన్నట్లు . . నా ప్రాణం తెరిపిన పడిందనుకో ” చెప్పింది కులాసాగా.
“చెయ్యడానికి వేరే పనేం ఉంది? టీ. వీలో క్రికెట్టు మాచ్ వస్తుంటే, రోజంతా టీ. వీ ముందే ఉన్నా. నువ్వు చూస్తున్నావో! లేదో! గాని ధోనీ ఎంత బాగా ఆడుతున్నాడనుకున్నావ్. శ్రీలంక మీద. అన్నీ సిక్షర్లే. ఇక కప్పు మనదే. అస్సలు టీ. వీ దగ్గర నుంచి కదల బుద్ది అవడం లేదనుకో. కుర్చీలో కూర్చుని . . కూర్చుని నడుంనొప్పి పుడితే, ఇప్పుడే . . మంచం మీద పడుకుని సెల్లో చూసుకు౦టున్నాను” చెబుతుంది అమరేశ్వరి.
చాలా రోజుల తరువాత తల్లి అలా హాయిగా మాట్లాడంతో ఉపిరి పిల్చుకున్నాడు రాజశేఖర్ ‘ హమ్మయ్యా! ఫర్వాలేదు అమ్మ బాగానే ఉంది’ అనుకున్నాడు నేటితరం కొడుకు .

 సమాప్తం —

1 thought on “అర్చన 2020 – సాయం సంధ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *