April 22, 2024

గుర్తింపు

రచన – లక్ష్మి రాఘవlaxmi raghava

 

 

 

 

 

“రాత్రి పూట మీ అమ్మ దగ్గు భరించలేను “ కోడలు సణుగుడు

“ డాక్టర్ దగ్గరికి తీసుకెడతా “ కొడుకు మాట .

“ డాక్టర్ దగ్గరకెందుకు దండగ , మిరియాల కషాయం ఇస్తేసరి “

————————

“ పచ్చడి కావాలిట . రోజూ రుచులకేమీ తక్కువలేదు “ కోడలు రుసరుస

“నాయన కోసం అన్నీ వండిన అలవాటు కదా “

“ అలవాట్లు మార్చుకోవాలి. మరి తీరికగా వండి వార్చడానికి నాకూ ఉద్యోగామాయే . వండినది తినడం అలవాటు చేసుకోవాలి .  అంతేకాదు మీరు చెప్పండి మీ అమ్మకు , మాట్లాడకుండా  పడి వుంటేనే వుంచుకుంటాము . లేకపొతే పల్లెకే ఏగి పోనీ …”

“ నాయన పోయినాక అక్కడ ఒంటరి అనే కదా పిలుచుకు వచ్చింది “

“అదే మీరు చేసిన తప్పు . మీ నాయన వున్నన్నాళ్ళు పిలిచినా వచ్చే వాళ్ళు కాదు కదా? “

“నాయన నిక్కచ్చి మనిషి కదా ఏది అడ్జస్టు  అయ్యేవాడు కాదు తిండి దగ్గర మొదలుకొని అన్నీ విషయాలు  తను అనుకున్న రీతిలో జరిపించుకునేవాడు “

“అబ్బో!  పల్లెటూల్లో వున్న వారికే అంత ఇది అయితే  సిటీ లలో వున్నవారికి అలవాట్లు వుండవేమి ? ఇక్కడ వున్న వాళ్ళు మనుష్యులే . పెద్ద చెప్పొచ్చారు నాయన గురించి ..” కోడలు సాధింపు ..

కొడుకు మౌనం ….పల్లెలో వున్నదైనా, ఇక్కడకు వచ్చాక ఇంట్లో పనిమనుషి  పని చేసి పొయ్యాక వుతికిన బట్టలు మడత పెట్టడం, ఎక్కడివక్కడ సర్దడం , రాత్రి పూట చపాతీలు చెయ్యడం ఇవన్నీ అమ్మ చేసే పనులే కదా ఎందుకు లెక్కకు రావు ?…స్వగతం కొడుక్కి ..

“ నావల్ల కాదు!  ఇంకో మనిషిని మేపుకుంటూ పనులు చేసుకోవడం. పైగా ఆ దగ్గు ఏమైనా చెడుదో ఏమో …పల్లెలో వదిలెయ్యండి “

“ జబ్బు ఎక్కువైతే డాక్టరుకు చూపించాలి కానీ దగ్గుతా వున్నావు ఫో  అంటామా ?’

“ అయితే ఏమి మీరు మాట్లాడేది ? ఇక్కడ నేను బాధపడితే పరవాలేదు . చాలు చాలు . ఆమెను పంపించేస్తే బాగుంటుంది “

భార్యను ఎదురించలేని నిస్సహాయత …. అమ్మ అర్థం  చేసుకుంటుంది ..కాని భార్య జీవితాంతం సహకారం ఇవ్వాలి కదా….అందుకే ఆమె వైపే మొగ్గు .

రెండు నెలలు కోడలు సణుగుడు కు విశ్రాంతి ..

“మీ అమ్మ ఏమి జబ్బు అంటించి వెళ్ళిందో ఏమో .ఈ వొళ్ళు నొప్పులు తగ్గడం లేదు. జ్వరము అప్పుడప్పుడు సతాయిస్త్తావుంది “

“ నీకు వొంట్లో బాగాలేకపోయినా కారణం అమ్మే నా ?”

“ ఆవిడ వూరు వెళ్లినప్పటి నుండే  నాకు బాగలేదు “

“ డాక్టరు దగ్గరికి వెడదామా ?”

“ జబ్బు వచ్చినాక  తప్పుతుందా ?”

అమ్మ జబ్బుకి ఇది  వర్తించదా ? కొడుకు ఆలోచనలే తప్ప ఆవేశ౦  తక్కువ….అందుకే అడగలేదు .

“ ఎన్ని రోజుల నుండీ మీకు బాగాలేదు?” డాక్టరు ప్రశ్న.

“నెలన్నరగా అప్పుడప్పుడు జ్వరం రావటం ..నొప్పులు ..”

“పని ఎక్కువ చేస్తున్నారా ?”

“ పనేమీ ఎక్కువలేదు “

“ ఏదైనా టెన్షను వుందా ?”

“ ఇన్ని రోజులు వుండేది ఇప్పుడు లేదు “ అత్త గారి గురించి ఆలోచిస్తూ అంది.

“పదిరోజులు  ఈ  మెడిసిన్స్ వాడి చూడండి . తగ్గకపొతే ..బ్లడ్ టెస్టు అవీ చేద్దాం “

పదిరోజుల్లో ఎమీ  తగ్గక పోయేసరికి  తిరిగి డాక్టరు, రక రకాల టెస్టులు . రిపోర్ట్లు …

“ పడుకోండి . టెస్టు చేస్తాను “ అన్నది డాక్టరు .

స్కెటత్కోపుతో  అంతా  చూసాక  “ ఒక్కసారి చెయ్యి పైకి ఎత్తండి “

“ మీకు ఇక్కడ నొప్పి ఏమైనా వుందా “ అంది బ్రెస్టు నొక్కుతూ.

“ నొప్పేమీ లేదు కాని ఏదో గడ్డలాగా తగులుతుంది నెల నుండి. నొప్పి లేదు కదా అని పట్టించుకోలేదు .”

“మీరు బయట కూర్చోండి. కొన్ని టెస్టులు రాస్తాను “అని ఆమె భర్తను వుండమని సైగ చేసింది

భర్త బయటకు వచ్చాక “ ఏమిటి మళ్ళీ  టెస్టులు అంటోంది “

“ బయాప్సీ చేయించుకోవాలిట”

“ఎందుకు ?”

“కాన్సరు అని  అనుమానం “

“కాన్సరు  నాకెందుకు వస్తుంది ?”

“ ఎవరికైనా రావచ్చు …నిజంగా కాన్సరు కానక్కర లేదు . ఒక వేళ కాన్సరు అయితే  గడ్డ తీసేస్తారు “

“కాన్సరు అంతటితో ఆగదేమో “

“చూద్దాం ముందు బయాప్సి కానీ “ ఇదే జబ్బు మా అమ్మకు వచ్చివుంటే  ఆ ఆలోచన చెయ్యడానికే భయం వేసింది అతనికి ……

“ ఆపరేషను అవసరమన్నాడు కదా . మా అమ్మకు ఫోన్ చేసి పిలిపించుకుంటాను “ అంది అమె

“చెయ్యి తోడు కావాలి కదా “ ఎంతైనా తన అమ్మ వస్తేనే మేలు కదా . అడ్జస్ట్ అవడానికి ప్రాబ్లెం వుండదు అనుకున్నాడు అతను

అమ్మకు ఫోను చేసింది ఆమె . విషయం చెప్పాక  అడిగింది

“ అమ్మా నాకు అవసరం వుంటుంది . ఒక నెల రోజులు  ఇక్కడ వుండేలా రాగలవా ?”

“ నెలరోజులు కష్టమే తల్లీ . నాకూ వొంట్లో బాగుండదు “

“ మొదట రామ్మా చూద్దాము “

వారం లోనే ఆపరేషను ఫిక్స్ అయ్యింది . ఆమెకు  అమ్మ వచ్చేయ్యడం  బోలెడంత రిలీఫ్ ఇచ్చింది .

కూతురికి వచ్చిన కష్టం గురించి చాలా బాధపడుతూ  ఏడ్చింది రాగానే .

“ అమ్మా ఏడవకు అంతా సరిపోతుందిలే “

“ఈరోజు హాస్పిటల్ లో చేరతానూ కదా . ఆయన అక్కడే వుంటాడు . నీవు ఇంట్లో చూసుకోవాలి అమ్మా “ అని చెప్పి వెళ్ళింది .

ఇంటికి వచ్చాక చూస్తే ఇల్లంతా గందరగోళంగా అనిపించి,

“ఇల్లంతా ఇలాగుందేమిటమ్మా? “ అంది

“ఆస్పత్రి నుండి ఇప్పుడే ఇంటికి వచ్చావు . రూం లోకెళ్ళి రెస్టు తీసుకో “అంది అమ్మ కూతురితో

“ అదికాదే …పని మనిషి రాలేదా “

“ పని మనిషి  ఎంతసేపు వుంటుందే అరగంటలో తుర్రు మంటుంది . నేను చిన్న చిన్న పనులు చేసుకోలేను.”

‘ మా అత్తగారు వున్నప్పుడు కూడా ఇదే పనిమనిషి. ఇల్లంతా నీట్ గా  వుండేది “

“ఏమో ..ఆవిడ చేసుకునేదేమో “

నిజమే ఆవిడే చేసేదేమో …ఆలోచించనే లేదు..అనుకుంది స్వగతం గా ..

రెండు రోజులకే “నీవు ఇంటికి వచ్చేశావు కదా ..నేను వెడతానే…నాకు కూడా మోకాళ్ళ నొప్పులు . అన్ని పనులు చేసుకోలేను . దేవుడి దయవల్ల నీ ఆపరేషను బాగా జరిగింది “

“ ఇంకా కొద్ది రోజులు రెస్టు తీసుకోవాలమ్మా “

“ అయితే ఒక పని చెయ్యి . మీ అత్తగారిని పిలుచుకో “

ఆమాటతో  ఆమెకు నిస్సహాయత .

“ ఏమండి  అమ్మ వెళ్లిపోతానని అంటుంది  అత్తగారిని  పిలుచుకు వస్తే మేలేమో “

“ అవసరమున్నప్పుడే అమ్మ కావాలా “ అతడికి అనడానికి ఒక అవకాశం !

“అలా దెప్పి పొడవక్కర్లా “ కొంచం నిస్సహాయతతో కూడిన కోపం .

“సరే  తీసుకు వస్తా “

“  అమ్మాయీ   కొంచం హార్లిక్స్ తాగు. టిఫిను తిన్నాక మోసంబి రసం తీసి పెడతాను “ అంటున్న అత్తగారిని ఆప్యాయంగా చూసింది .

ఇంట్లో అన్ని పనులూ సిస్టమాటిక్ గా జరిగి పోతున్నాయి . మామ గారి ట్రైనింగు అయి వుండచ్చు అనుకోక తప్పలేదు

“ లేవద్దమ్మా ..అన్నం అక్కడికే తెస్తాను “ ఆశ్చర్యం ..అత్తగారు ఒక తల్లిలా ఆదరిస్తోంది .

క్యాన్సరుతో తను ఎన్నాళ్ళు జీవిస్తుంది ? దగ్గుతోందని అత్తను ఈసడించుకుందే ….

డెభై ఏళ్ల వయసులో వున్నా ఎంత చక్కగా చేస్తుందో ..

మనసులో జోహార్లు ..

ఇన్నాళ్ళ తన ప్రవర్తనపై ఏవగింపు .

చావుకు దగ్గరై పోతూ వుందనేనా ఈ మార్పు ?

ముసలి వయసులో తోడూ మనమా ?

లేక …జబ్బు పడ్డ మనకు ముసలి వారి ఆదరణా ?

తేల్చుకోలేక ..

అత్తగారి చేతులు పట్టుకుని కన్నీళ్ళతో అభిషేకం!!!!

వెంటనే ఆవిడ ఆప్యాయత తో ఇచ్చిన కౌగిలి ..

మనిషి లోని మంచికి , మానవత్వానికి గుర్తింపు !!!!

——————————

11 thoughts on “గుర్తింపు

 1. దిస్ యిజ్ యాన్ యవర్ గ్రిన్ స్టోరి . భర్తల మౌన రోదన.

 2. బాగుంది. దీన్ని కథ అనకూడదేమో… స్కెచ్ మాదిరిగా సాగింది.

 3. అత్తగారిలో అమ్మని చూడలేని కోడళ్ళ కి ఆలస్యంగా కనువిప్పు కలుగుతుందేమో!
  కథనం చాలా బావుంది నచ్చింది .

 4. పాత కాలంలో ఇటువంటి వారి నుంచే చాలా సామెతలు ఉద్భవించాయి .

  గేదె ఛస్తేనే గాని పాడి బయటపడదు .
  తలనొప్పి తనకొస్తేనే గాని బాధ తెలియదని
  లేడికి కాళ్ళు లేక చిక్కిందా , కాలానికి చిక్కిందా లాంటివెన్నో .

  కధావస్తువు కొత్తదేమీ కాకున్నా ,కధనం రక్తి కట్టింది .

 5. కథావిషయం కొత్తది కాకపోయినా.. ఆ కథను నడిపిన శైలి అద్భుతంగా ఉంది.
  చదివినవారి మది కదిలిస్తుంది.

 6. మనిషి లేనపుడు మనిషి విలువ తెలుస్తుంది. మనిషి లోని మంచికి , మానవత్వానికి గుర్తింపు !!!! దీనికి ప్రేమ అభిమానం ఆప్యాయత కావాలి. Unconditional love – అవ్యాజమైన ప్రేమ వలన ప్రతి వస్తువుకి – మనిషైనా జంతువైనా ఒక విధమైన గుర్తింపు లభిస్తుంది అని నా అభిప్రాయం. కధ చిన్నదే అయినా చిన్న కన్నీటి వీచికను రప్పించింది. బాగా వ్రాసారు.

  1. మణి వడ్లమాని గారు ,anonymous garu , sharma G.S garu , G.S.lakshmi garu ,రాజారావు పంతుల,గారు నా కథను చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్య వాదాలు . కథా వస్తువు పాతదే అయినా ఈ విధంగా చెబితే ఎలా వుంటుందన్న ఆలోచనే ఇలా రాయడానికి కారణమైంది . చెప్పాలనుకున్నది ఇంకొకటి.. ఒక్కోసారి నిస్సహాయుడైన కొడుకు …భార్యకు ఎదురు పలకలేనివాడు.. మరియు అన్నిటినీ భరించి ప్రేమతో ఆదరించే తల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *