March 4, 2024

రఘువంశము -1

రచన: Rvss శ్రీనివాస్.. rvss

 

 

 

 

 

 

మన దేశంలో అత్యధికంగా వ్రాయబడిన(సుమారు 11000 సార్లకు పైగా వ్రాయబడినది)  చదవబడిన శ్రీమద్రామాయణంలోని నాయకుడైన శ్రీ రామచంద్రుని మూలపురుషుల చరిత్రను చెప్పే కావ్యం ‘రఘువంశము’. మధుమాసంలో ఒక మధురమైన కావ్యాన్నిగురించి చర్చించాలని నిశ్చయించుకొని   ఈ కావ్యాన్ని ఎంచుకోవడం జరిగింది. సంస్కృతంలోని పంచకావ్యాలలో ఒకటైన ఈ రఘువంశం…మహాకవి కాళిదాసుకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

 

‘ఉపమా కాళిదాసస్య”  అంటారు

‘రఘువంశము’ కావ్యంలో అజ మహారాజు, విదర్భ రాజు చెల్లెలయిన ‘ఇందుమతి’ స్వయంవర సభకు వెళ్ళిన ఘట్టం ఇలా వర్ణిస్తారు.

‘సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా,

నరెంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః’

స్వయంవరానికి వివిధదేశాల నుండి వచ్చిన రాజకుమారులంతా ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. ఇందుమతి తమ వద్దకు రానంతవరకూ, ప్రతి ఒక్కడూ ఆమె తననే వరిస్తుందనే ఆశతో, ప్రకాశవంతమయిన ముఖంతో చూస్తూ, ఆమె తమను దాటి వెళ్ళిపోగానే వారి ముఖాలు వివర్ణమవుతున్నాయట. ఇది ఎలా అనిపిస్తుందంటే ఒక వ్యక్తి కాగడా పట్టుకుని  రాజ వీధిలో నడుస్తుంటే, ఆ కాగడాకి ఎదురుగుండా ఉన్న భవనం కాంతివంతంగా ఉంటుంది. కాగడా భవనాన్ని దాటి వెళ్ళిపోగానే, పెద్ద చీకటి ఆ భవనాన్ని ఆక్రమిస్తుంది.  రాజకుమారి దాటిపోగానే రాకుమారుల పరిస్ధితి కూడా అచ్చంగా ఇలాగే ఉందంట..

ఈ ఉపమానమే కాలిదాసుకు ‘దీపశిఖా కాళిదాసు’ అనే బిరుదాన్ని ఇచ్చింది.

వాల్మీకి రామాయణంలో  శ్రీరాముని పితృపితామహప్రపితామహుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

బ్రహ్మ-మరీచి-కశ్యప-సూర్య-వైవస్వత-ఇక్ష్వాకు-కుక్షి-వికుక్షి-బాణ-అనరణ్య-పృథు-త్రిశంకు-ధుంధుమార-యవనాశ్వ-మాంధాత-సుసంధి-ధ్రువసంధి-భరత-అసిత-సగర-అసమంజ-అంశుమంత-దిలీప-భగీరథ-కకుత్స్థ-రఘు-ప్రవృద్ధ (కల్మషపాద)-శంఖణ-సుదర్శన-అగ్నివర్ణ-శీఘ్రగ-మరు-ప్రశుశ్రుక-అంబరీష-నహుష-యయాతి-నభాగ-అజ-దశరథ.  ఇందులో కేవలం జ్యేష్టపుత్రుల వివరాలు మాత్రమే ఉన్నట్లు ఉన్నాయి.

ఉ.దా., హరిశ్చంద్రుడు-త్రిశంకుని కుమారుడు, ధుందుమారుని తమ్ముడు. ఇచ్చట ధుంధుమారుని పేరుమాత్రమే ఇవ్వబడింది. రఘువంశం గుఱించి కాళిదాసు చాలా వివరంగా వర్ణించాడు . అతని ‘రఘువంశం’ ప్రకారం:

దశరథుని తాత రఘువు. రఘువు తండ్రి దిలీపుడు (ఈ దిలీపుడు, భగీరథుని తండ్రి దిలీపుడు వేరు – దాదాపు 15 తరాల అంతరం ఉంది). ఈ దిలీపచక్రవర్తి 100 అశ్వమేధయాగాలను చేయాలని ఉపక్రమిస్తాడు. అందుకు మహేంద్రుడు  అతన్ని ఎన్నో కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆ పరీక్షలను, ఎన్నో ఆటంకాలను రఘువు అధిగమించి, భూమండలాన్నంతటినీ జయించి తన తండ్రి  ప్రారంభించిన 100 అశ్వమేధయాగాలు పరిపూర్ణం గావిస్తాడు. తనపూర్వీకులకు ఉన్న గొప్పగొప్ప గుణాలన్నీ రఘుమహారాజులో శొభిస్తాయి. హరిశ్చంద్రుని వంటి సత్యవాక్పాలన, ధుందుమారుని శౌర్యపరాక్రమాలు, భగీరథుని సంకల్పబలం, అంబరీషుని భక్తిబలం, … ఇలా సకల లక్షణశోభితుడై విరాజిల్లుతాడు. ఇంతటి పరాక్రమవంతుడు, ప్రతిభావంతుడు కావునే, అతని వంశం రఘువంశముగా ఖ్యాతి నొందింది.

ఇలాంటి కావ్యంలోని  విశేషాలు చెప్పుకుందామా? మరి.

రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తనకుగల చింతను తెలియపఱిచాడు. అంతట  వసిష్ఠుల కొద్దిసేపు ధ్యానం చేసి  ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో

వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును

గమనించకుండానే వచ్చేశావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక

పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!

అప్పుడు కామధేనువు  కోపించి “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానమును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని శపించింది.

కానీ రథవేగము వలన వచ్చే  వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళింది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు” అని వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది.

అక్కడ నందినిని ఈ విధంగా వర్ణిస్తాడు కాళిదాసు.

 

“లలాటోదయ మాభుగ్నం పల్లవ స్నిగ్ధ పాటలా……

బిభ్రతీ శ్వేత రోమాంకం సంధ్యేవ శశినం నవమ్”

 

నందిని చిగురాటాకులా నిగనిగలాడుచు  ఎర్రగా ఉంది. కొంచెం వంకర తిరిగి తెల్లటి వెంట్రుకల చిహ్నాన్ని తిలకంగా ధరించింది. ఆ తిలకం సంధ్యాకాలంలో ఆకాశంలో కనబడే చంద్రరేఖలా ఉందట. ఇలాంటి వర్ణన కాళిదాసుకే సాధ్యం.

దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించడం  ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచినప్పుడు వాళ్లు కూడా నిలిచి, కూర్చున్న కూర్చుని, నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దినములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీ ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ

ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమ శివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.

ఈ సన్నివేశంలో ఆ సింహం తన కోరల కాంతులతో చీకటిని ముక్కలు చేసిందట. ఆ చీకటిముక్కలు కాంతి కిరణాలు కలిసి తిలతండులాలుగా (నువ్వులు బియ్యం) కనిపించాయట.

ఈ ఉపమాలంకారం సోయగం చూడండి.అలాగే సింహం గోవును విడువనని చెప్పే మాటలు ప్రతిధ్వనిస్తే ఆ మాటలకు పర్వతాలు వంత పాడుతున్నట్లనిపించాయట.

“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేకపోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్నమాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. “భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమేకదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టిస్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడడం నా ధర్మం. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నీవు నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును విడిచిపెట్టు”.

ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం ఇవన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి ఇంత అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ సామాన్య గోవు కోసం నీ శరీర త్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు” అని దిలీపుని ప్రలోభ పెడదామని అన్నాడు.

అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.

చివరికి ఎట్లాగో సింహం ఒప్పుకున్నది. దిలీప మహారాజు తనను తాను సింహానికి అర్పించుకుందామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని కూర్చున్నాడు. సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది!

నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.

అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు “తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలినదానిలో ఆరోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి”  అని ఆశీర్వదించింది నందినీ. ఈ విధంగా ధేనువ్రత మహిమవలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు. ఆ రఘు మహారాజు తన పరాక్రమంతో వజ్రాయుధాన్ని సైతం ఎదుర్కొని ఇంద్రుని మెప్పించి నూరు అశ్వమేధ యజ్ఞాల ఫలం తన తండ్రి అయిన దిలీపునికి వచ్చేలా ఇద్రునితో వరం పొందుతాడు.

గర్భవతిగా ఉన్నపుడు ఆమె కోరికలు తీరకుంటే ఆ ఆలోచనల ఒత్తిడికి గర్భస్థ శిశువు అంగ వైకల్యంతో పుట్టడం ..లేదా గర్భస్రావం జరుగుతుందని ఆయుర్వేదంలో చెప్పబడినది. అందుకే సుదక్షిణాదేవి గర్భిణిగా ఉన్నపుడు దిలీపుడు ఆవిడ అన్ని మనోరథాలూ తీర్చాడట. ఆమె గర్భవతిగా ఉన్నపుడు ఆమె స్థనములను ఇలా వర్ణించాడు కాళిదాస మహాకవి.

“తుమ్మెదలచే కప్పబడిన తామరమోగ్గల కాంతులను తిరస్కరిస్తున్నాయట ఆమె స్థనాలు. ఇది వ్యతిరేకాలంకారం. ఇలాంటి వర్ణన కాళిదాసుకి మాత్రమే సాధ్యం. చంద్రోదయాన్ని చూసినపుడు పొంగిన సముద్ర కెరటాలను ఒడ్డు దాచలేనపోయిట్లుగా పుత్రోదయం కలిగినపుడు ఆ పుత్రుని చూసిన సంతోషం దిలీపుని ముఖంలో దాగలేక పోయిందంటాడు మహాకవి.. రఘువు యుక్తవయస్కుడైనపుడు పగటి పూట కమలాన్ని ఆశ్రయించిన పద్మశ్రీ (సూర్యుని కాంతి) కలువను చేరినట్లు రాజ్యలక్ష్మి కూడా దిలీపుని నుండి రఘుమహారాజు దగ్గరకు చేరుకుంటోంది అంటాడాయన. ఇక్కడ కలువమీద పడినది కూడా సూర్యుని కాంతే  కదా! (చంద్రునిపై పరావర్తనం చెంది )

అలాగే దిలీపుడు 100వ అశ్వమేధ యజ్ఞం చేసినపుడు యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరిస్తాడు. ఇంద్రుని దగ్గరకు వెళ్లి అశ్వం ఇమ్మని రఘువు అడిగితే పురుషోత్తముడు అంటే విశునువు – త్ర్యంబకేశ్వరుడు అంటే శివుడు ఎలాగో శతక్రతు,శతమన్యుడు అంటే నేనే కావాలి అంటాడు అ శచీపతి. అంతేకాక కపిలమహాముని కోపానికి దగ్ధమైన సాగరపుతుల్లా నశిస్తావని బెదిరిస్తాడు రఘువుని. అప్పట్లో బాణాల మీద వారి పేర్లు వ్రాసుకునేవారట. ఇంద్రుడు ప్రయోగించిన ఇంద్ర బాణం రఘువు గుండెల మీద నాటుకుంటే, అయన ప్రయోగించిన రఘువు అని పేరు వ్రాసిన బాణం ఇంద్రుని భుజంపై నాటుకున్నదట, తన భుజబలాన్ని వెక్కిరించినట్లుగా.ఇంద్ర ధ్వజాన్ని విరగగొడితే స్వర్గ రాజ్య లక్ష్మి సిగ కోసినట్లుగా భావించాడట స్వర్గాధిపతి. ఆ భీషణ సంగ్రామంలో రఘువు వేసిన బాణాలు ఆకాశాన్ని మూసేయగా ఇంద్రుడు వేసిన బాణాలు భూమిపై తీవాచీలా పరుచుకు పోయాయట. హరిచందనం ధరించిన మణికట్టుతో ఉన్న ఇంద్రుని చేతివేళ్ళు అల్లెతాటిని, క్షీర సాగరంలో మందర పర్వతాన్ని చిలుకుతున్నట్లుగా కదుపుతున్నాయట. అలాంటి నారిని అర్ధశశాంకుని రూపంలోని బాణం ప్రయోగించి రఘువు ఖండించినట్లుగా చెప్తాడా కవి. వజ్రాయుధ ప్రహారానికి సైతం చెక్కు చెదరని రఘువు శౌర్యానికి మెచ్చిన ఇంద్రుడు దిలీపుని వరం కోరుకొమ్మనగా శతశ్వమేదాలు చేసిన ఫలాన్ని తన తండ్రికి ఇమ్మని కోరుకుంటాడు రఘువు. ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు ఇంద్రుడు.

మిగిలిన కథలోని అద్భుతమైన వర్ణనలు వచ్చే సంచికలో చెప్పుకుందాము. …@శ్రీ

8 thoughts on “రఘువంశము -1

  1. వనజ , రాజారావు, స్వాతి , శ్వేతా వాసుకి, స్వర్ణ గార్లకు , మెచ్చిన అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు….@శ్రీ

  2. రఘువంశ చరిత్ర చాలా బాగా వివరించారు+
    చక్కటి వర్ణనలను వివరించిన రీతి శైలి చక్కగా ఉందండి. అభినందనలు శ్రీగారూ

  3. అభినందనలు శ్రీగారూ.. తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు @శ్రీస్వర్ణ

  4. అభినందనలు శ్రీ మంచి కావ్యాన్ని చక్కగా చాల ఓపికగా రాసావు , ఇలా రాయదానికి భగవంతుని అనగ్రహం కుడా ఉండాలి , ఇంకా ఇలాంటి మంచి కావ్యాలు మరెన్నో రాయాలని కోరుకుంటూ నీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు

  5. ఈ రోజు, నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను శ్రీ గారు… చాలా బాగా వివరించారు రఘువంశ చరిత్ర

  6. ఈ రోజు, నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను శ్రీ గారు… చాలా బాగా వివరించారు రఘువంశ చరిత్ర

  7. చాల సంతోషంగా ఉందండి.పుస్తకం కొని చదవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.చాల బాగా చెప్తునారు.thanks

  8. RVSS శ్రీనివాస్ గారు కేవలం భావ కవితలే కాకుండా రఘువంశం గురించి మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక అభినందనలు. ఆదిలోనే చక్కటి వర్ణనలను వివరించిన రీతి శైలి చాలా బావున్నాయి. శుభం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *