September 23, 2023

చిక్కని జ్ఙాపకం – షకీల్ బదాయూని

రచన: అబ్దుల్ వాహెద్                    abdul wahed

 

 

 

 

పాత హిందీ పాటలంటే చెవులు కోసుకోని వారు ఎవరైనా ఉంటారా?

గజల్ శైలిని అనుసరిస్తూ, కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాసినవారు చాలా మంది ఉన్నారు. అందుకే పాత హిందీ పాటల మాధుర్యం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. పదే పదే వినాలనిపిస్తుంది.

shakeel_main

గజల్ ప్రక్రియను సినిమాపాటకు ప్రతిభావంతంగా వాడుకున్న కవుల్లో షకీల్ బదాయూని పేరు ముందుగా చెప్పుకోవాలి. అగష్టు 3, 1916లో పుట్టిన షకీల్ ఉర్దూ సాహిత్యంలోను, హిందీ సినిమారంగంపైన కూడా తనదైన ముద్రవేసిన కవి. షకీల్ విద్యాభ్యాసం ఇంటివద్దనే జరిగింది. అరబిక్, పర్షియన్, ఉర్దూ, హిందీ భాషలు ఇంటివద్దకు వచ్చి టీచర్లు బోధించారు. ఆయన తండ్రి జమాల్ అహమద్ ఖాదర్ సోక్తా ఖాద్రీ తన కుమారుడు కవి కావాలని ఎన్నడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఆ వంశంలో కవులెవ్వరు లేరు. కవిత్వాన్ని సంప్రదాయిక ముస్లిమ్ కుటుంబాల్లో ఎలా ఆదరిస్తారో అంతకు మించి కవిత్వం వారికి సంబంధమూ లేదు. షకీల్ దూరపు బంధువు జియావుల్ ఖాద్రీ బదయూని ధార్మికమైన కవితలు కొన్ని రాశారు. ఆయన ప్రభావం కొంతవరకు షకీల్ పై ఉండవచ్చు. యాభై, అరవై దశకాల్లో షకీల్ రాసిన పాటలు, ఉర్దూలో ఆయన కవిత్వం దేశాన్ని ఒక్క ఊపు ఊపాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు నౌషాద్ తో కలిసి షకీల్ పనిచేసేవారు. 1961 నుంచి 1963 వరకు షకీల్ వరుసగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు. ఆ పాటలు వింటే ఇప్పటికి కూడా మనం చెవికోసుకు వింటాం. బీస్ సాల్ బాద్ సినిమాలో – కహీం దీప్ జలే కహీం దిల్, ఘరానా సినిమాలో – హుస్న్ వాలే తేరా జవాబ్ నహీం, చౌదివీం కా చాంద్ సినిమాలో – చౌదివీం కా చాంద్ హో పాటలు అప్పుడే కాదు ఇప్పుడు, ఎప్పుడూ కూడా హాట్ ఫేవరేట్స్.

 

షకీల్ 1936లో అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అప్పటి నుంచే కవిసమ్మేళనాల్లో (ముషాయిరా) పాల్గొనడం, అవార్డులు గెలుచుకోవడం మొదలయ్యింది. 1940లో సల్మాను పెళ్ళి చేసుకున్నాడు. షకీల్ పుట్టింది ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ గ్రామంలో. అందుకే తన పేరు చివర బదయూని అని పెట్టకున్నాడు. 1942లో అలీగఢ్ నుంచి బి.ఏ పట్టా పొందగానే సప్లయి ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం కోసం ఢిల్లీకి మకాం మారాడు. ఢిల్లీలో కూడా ముషాయిరాల్లో పాల్గొనడం కొనసాగింది. అప్పటికే ఆయన కవితలు ప్రాచుర్యం పొందాయి. నిజానికి అప్పట్లో ప్రేమకవిత్వం రాసినవాళ్ళు తక్కువ. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాయడమే ఎక్కువగా ఉన్న రోజులవి. కాని షకీల్ దారి వేరు. షకీల్ రాసింది ఎక్కువగా ప్రేమకవిత్వమే.. ఆయన కేవలం సినిమా పాటలు మాత్రమే రాయలేదు. ఆయన రాసిన గజళ్ళు ఉర్దూ కవితాభిమానుల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి.

మేం షకీల్ దిల్ కా హూం తర్జుమాన్

కె ముహబ్బత్ కా హూం రాజ్దాన్

ముఝే ఫక్ర్ హై మేరీ షాయరీ

మేరీ జిందగీ సే జుదా నహీం

నా పేరు షకీల్ నేను హృదయానికి ప్రతినిధిని

ప్రేమకు అత్యంత ఆప్తుడిని

నా కవిత్వం నా జీవితం వేర్వేరు కాదు

అందుకు గర్విస్తున్నాను.…

అని ప్రకటించిన షకీల్ రాసిన కవిత … ఒక గజల్…ఈ నెల చూద్దామా…

ఉర్దూలో గజల్ ప్రక్రియ పాడుకోవడానికి అనువుగా ఉండే ఛందోబద్దమైన ప్రక్రియ. తెలుగులో ఆ భావాన్ని మీకందించడానికి ప్రయత్నిస్తాను.

నేడు విధి మలుపులపై మళ్ళీ రోదిస్తున్నాను

మారిన హృదయచిత్రం చూసి రోదిస్తున్నాను

ప్రేమఖైదులో ఇప్పటి వరకు ఆశలపై బతికాను

ఆశ చనిపోయింది, ఇక సంకెళ్ళపై రోదిస్తున్నాను

ప్రేమ ఎంత అందమైన కల చూపించింది నాకు

కళ్ళు తెరిచాక, స్వప్న ఫలితంపై రోదిస్తున్నాను

నీ దూతను చూడగానే మనసు ముడుచుకుపోయింది

ఆపై నీ రుధిర రాతను చూసి మరీ రోదిస్తున్నాను

మనసు పారేసుకున్నా ప్రేమ రుచి చూడనే లేదు

పోగొట్టుకున్న విధిరాతకు రోదిస్తున్నాను

నూరేళ్ల ఆశీర్వాదాలపై ఎంత సంతోషించావు షకీల్

విషాదాన్ని కలిశాక ప్రార్ధనల ప్రభావంపై రోదిస్తున్నాను.

 

ఉర్దూ భాషలో షకీల్ వాడిన పదాలను చూడండి

ఆజ్ ఫిర్ గర్దిషె తక్దీర్ పె రోనా ఆయా

దిల్ కీ బిగఢీ హుయీ తస్వీర్ పె రోనా ఆయా

ఇష్క కీ ఖైద్ మేం అబ్ తక్ తో ఉమ్మీదోం పె జియే

మిట్ గయీ ఆస్ తో జంజీరోం పె రోనా ఆయా

క్యా హసీన్ ఖాబ్ ముహబ్బత్ నే దిఖాయా థా హమేం

ఖుల్ గయీ ఆంఖ్ తో తాబీర్ పె రోనా ఆయా

పహలే ఖాసిద్ కీ నజర్ దేఖ్ కె దిల్ సహమ్ గయా

ఫిర్ తేరీ సుర్ఖీ తహ్రీర్ పె రోనా ఆయా

దిల్ గంవా కర్ భీ ముహబ్బత్ కు మజే మిల్ న సకే

అప్నీ ఖోయీ హుయీ తక్దీర్ పె రోనా ఆయా

కితనే మస్రూర్ థే జీనే కి దుఆవోం పె షకీల్

జబ్ మిలే రంజ్ తో తాసీర్ పె రోనా ఆయా

చిక్కనైన ప్రేమ కవిత్వం. భగ్న ప్రేమను షకీల్ అత్యంత అద్భుతంగా వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చివరి ద్విపద … నూరేళ్ళు బతకాలని దీవించడం మామూలే కదా.. దువా అంటే ప్రార్ధన.. ఆనందంగా బతకాలన్న ప్రార్ధనలు షకీల్ కూడా చాలా విన్నాడు. కాని విషాదాలు ఎదురైన తర్వాత.. అంటే ప్రేమ భగ్నమైన తర్వాత ఈ ఆశీర్వాదాల ప్రభావం చూసి ఏడుస్తున్నానంటున్నాడు. మనసు పారేసుకున్నా ప్రేమ దొరకలేదు, విధిరాతనే పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నాడు. ప్రేమ ఒక గొప్ప కలను చూపించింది. కాని మెలకువ వచ్చిన తర్వాత కలకు అర్ధం తెలిసి ఏడుపు వచ్చిందని చెబుతున్నాడు. భగ్న ప్రేమను షకీల్ వ్యక్తం చేసిన తీరులో ఎంత భావుకత ఉంది.

 

బారహా ఆప్కీ హర్ బాత్ పే రోనా ఆయా… అన్న పాత హిందీ పాట చాలా మంది వినే ఉంటారు. సాహిర్ లూధియాన్వి రాసిన ఈ పాట కూడా భావంలో దీనికి దగ్గరగానే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *